Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గొంతు విప్పిన గువ్వ – 16

ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది.

ప్రక్షాళన…

Of all acts of man repentance is the most divine…

పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు.

హైవేలో నూట ఇరవై కిలోమీటర్ల స్పీడులో ఏదో ఊహా ప్రపంచంలో జోగుతూ అదాట్టుగా ఎదురుగా దృష్టి సారించి, అమాంతం ప్రస్తుతంలోకి వచ్చి, బలం కొద్దీ బ్రేకును నొక్కాను.

నా ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోవటం ఖాయమన్న నిర్ధారణకు వచ్చి నా ప్రాణాల పైన ఆశ వదులుకుని వెనక సీటులో కూర్చున్న పంచప్రాణాల కోసం షిర్డిసాయిని ప్రార్థించాను.

ఆడీ కారు కీచు శబ్దంతో రోడ్డును కరుచుకుంటూ ఎదర వెళ్తున్న కారుకి అంగుళం దూరంలో పెద్ద ఎత్తున అదురుబాటుతో ఆగింది.

కారు  నడిపేటప్పుడు బుర్ర దగ్గర పెట్టుకొమ్మని ఎప్పుడూ నా కూతురు  హెచ్చరిస్తూనే వుంటుంది.

ఆలోచనలు నా పరిధిలో వుండవు.. మైండు నా మాట వినదు.

నా ముందు వెళ్తున్న కారును గుద్దే ప్రమాదాన్ని తృటిలో తప్పించుకున్నాను అనుకున్న అర క్షణంలోనే వెనుక నుండి పెద్ద కొండ ఢీ కొట్టినట్టు కారు పెద్ద జర్కుతో అకస్మాత్తుగా కాస్త ముందుకు వెళ్ళటం, వెనకున్న పిల్లలిద్దరూ భయంతో కెవ్వున అరవటం ఒకేసారి జరిగిపోయాయి.

అసలేమి జరిగిందో తెలుసుకునే లోపు వెనుక సీట్లో నా వెనుక కూర్చున్నఆరేళ్ళ మనుమరాలు ఆన్య ఏడుపు లంకించుకుంది. గుండె చిక్క బట్టుకుని ఏమి జరిగిందాని వెనుతిరిగి చూసాను. సీటు బెల్టుతో పాటు ముందుకు తూలి ఆపుకునే ప్రయత్నంలో చేతిని నా సీటు బ్యాక్‌కి ఆన్చటంలో ఆన్య చెయ్యి బెణికి మణికట్టు నుండి మోచేతి దాకా వాచిపోయి నొప్పి పుట్టింది.

ఐదేళ్ళ నిక్కి మొహంలో భయం స్పష్టంగా తెలుస్తున్నా ధైర్యాన్ని చిక్కబట్టుకుంది.

నా కారు పక్కకు తీసుకుని ఆపుతుండగా నాజూకైన ఓ టీనేజి తెల్ల పిల్ల కారు వెనుక నుండి పరిగెత్తుకు వచ్చి “ఐ ఆం సో సారీ…” అంది రొప్పుతూ.

ఆ అమ్మాయిని ఆశ్చర్యంగా చూస్తూ దడదడలాడే గుండెలతో కారు దిగాను.

నా కారు వెనుక బంపరు, బూటు మొత్తం సొట్ట పడిపోయి వున్నాయి.

అది ఆస్ట్రేలియాలో నేను చేసిన తొలి కార్ ఆక్సిడెంట్.

ఆ అమ్మాయి కారు ముందు భాగం కూడా తుక్కు తుక్కయి పోయింది. అయితే తనది చాలా చవకబారు చిన్న కారు. డ్రైవింగ్ నేర్చుకున్న కొత్తలో పర్ఫెక్ట్ అయ్యే క్రమంలో కొన్న పాత కారో లేక ఆ అమ్మాయి స్తోమత అంతేనో…

“ఐ ఆం రియల్లీ సో సారీ…ఇట్స్ మై ఫాల్ట్. ఐ హిట్ యువర్ కార్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ థింగ్…” సన్నజాజి మొగ్గలాంటి ఆ అమ్మాయి కంపించిపోతూ కంగారుగా అంది.

నిజానికి నేను పరధ్యానంగా కారు నడుపుతూ ఎదరున్న కారును గుద్దబోయి ఆపుకున్నాను. నేను సడన్ బ్రేకు వేయటంతో ఆ అమ్మాయి సడన్ బ్రేకు వేయలేక వెనుక నుండి నా కారును గుద్దేసింది. ఇందులో ఆ అమ్మాయి ఎంతవరకూ బాధ్యురాలో నాకర్థం కాలేదు.

ఇండియాలో అయితే నేను అలా సడన్ బ్రేకు వేసినందుకు అవతలివారు ఎదురు దెబ్బలాడి నానా రభస చేసేవారు.

ఇక్కడి రోడ్డు రవాణా సంబంధిత రూల్స్ తెలియని నేను వెంటనే మా అమ్మాయికి ఫోను చేసి జరిగిన ఆక్సిడెంట్ గురించి చెప్పాను.

నేను పరధ్యానంగా డ్రైవ్ చేస్తున్నానన్న విషయం మాత్రం చెప్పలేకపోయాను.

నేను, పిల్లలు క్షేమంగా వున్నామని తెలుసుకుని అమ్మాయి తేలిగ్గా ఊపిరి తీసుకుంది.

“నువ్వేమీ కంగారు పడకు మమ్మీ, ఆ అమ్మాయిదే తప్పు. తనే చూసుకుంటుంది అన్నీ. ఆ అమ్మాయి ఫోన్ నంబరు తీసుకో. తన డ్రైవింగ్ లైసెన్స్ ఫోటో, నంబరు ప్లేటుతో కార్ ఫోటో తీసుకుని వచ్చేయి. మన కారు నడిచే కండిషన్లో వుంటే కారులో వచ్చేయి. లేకపోతే క్యాబ్ బుక్ చేస్తా” చాలా క్యాజువల్‌గా చెప్పి నన్ను తేలిక పరిచింది.

ఆ అమ్మాయి అప్పటికే వణుకుతున్న వేళ్ళతో తన మొబైల్లో ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ వెతుక్కుంటోంది. వాలెట్‌లో నుండి  డ్రైవింగ్ లైసెన్స్ తీసి నా చేతికిచ్చింది. ఫోటో తీసుకుని తిరిగి ఇచ్చేసాను.

పేరు బెల్ల.. వయసు పంథొమ్మిది. కాని చూడటానికి పదమూడేళ్ళ పిల్లలా వుంది. ఆమె తెల్ల తోలు భయంతో మరింత తెల్లగా పాలిపోయిoది. ఆ మొహంలో నెత్తుటి చుక్క లేదు.

తన ఫోను నుండి నాకో రింగ్ ఇమ్మని నా నంబరు ఇచ్చాను. కాల్ చేసింది.

బెల్ల అని సేవ్ చేసుకుని ఇంటికి వచ్చేసాను.

సాయంత్రానికల్లా ఒక పెద్ద బండి వచ్చి నా కారును వర్క్‌షాప్‌కి తీసుకుని వెళ్ళిపోయింది. కారు పార్ట్స్ తెప్పించి ఫిక్స్ చేయటానికి ఇరవై రోజులు పడతాయన్నారు. అదృష్టం కొద్దీ పిల్లలకు మూడు వారాల టర్మ్ బ్రేక్. కారు లేని ఇబ్బంది పెద్దగా తెలియ లేదు.

మా అమ్మాయి చెప్పగా విన్నాను… బెల్ల మూడు నెలల క్రితం తన కారు ఇన్సూరెన్సు ఏవో కారణాల వలన రెన్యువల్ చేయించటం జరగలేదుట.

“మరైతే వాళ్ళ ఇన్సూరెన్సు కంపెనీ భరించదా రిపేరు ఖర్చులను…” బెల్లా పసిమొహం తలుచుకుంటూ కలవరంగా అడిగాను మా అమ్మాయిని.

“ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ మమ్మీ… అది వాళ్ళ హెడేక్… మనకు అనవసరం. వాళ్ళు మన కారు రిపేర్ చేయించి ఇవ్వాలి. అంతే..” అంది మా అమ్మాయి ఖచ్చితంగా.

బెల్ల జాలి గొలిపే అమాయకమైన మొహం నా కళ్ళ ముందు మెదిలింది.

“పోనీ మన కారుకి ఇన్సూరెన్స్ వుందిగా… మనమే రిపేరు చేయించుకుంటే పోలా…” నాదే తప్పన్న అపరాధ భావన నన్ను తొలిచేస్తోండగా జంకుతూ అన్నాను.

“పిచ్చిదానిలా మాటాడకు. మనం క్లెయిమ్ చేసుకుని మన కారు ప్రీమియం రేటు పెంచుకోవటం ఎంత అవివేకం…”

నిజానికి ఆ వివరాలేమీ నాకు తెలియవు. ఇండియాలో నా కారు ఎడా పెడా దెబ్బలు తింటూనే వుంటుంది. గుద్దిన ఏ ఒక్కరు ఆగి వెనుకకు కూడా తిరిగి చూడరు. కారుకి బొబ్బలెక్కువయినప్పుడో తొక్కలు లేచిపోయినప్పుడో నేను వర్క్‌షాప్‌లో ట్రీట్మెంట్ కోసం పడేయటం రివాజు.

కలతబారిన మనసును తమాయించుకోలేక పొరపాటు నాదేనని అమ్మాయికి చెబుదామకునేంతలో అల్లుడు “పదహారున్నర వేల డాలర్ల బిల్లయ్యిందట. రేపటికల్లా కారు పిక్‌అప్‌కి సిద్ధమవుతుందని కాల్ వచ్చింది” అన్నాడు.

పదహారున్నర వేల డాలర్లా… అక్షరాలా తొమ్మిది లక్షల రూపాయలు…

కారు ఖరీదు తొంభై వేల డాలర్లు. దాని రిపేరు కూడా అదే స్థాయిలో వుంటుంది మరి.

ఇంకేమీ చెప్పటానికి నాకు నోరు పెగలలేదు.

“బెల్ల కారు ఇన్సూరెన్సు రెన్యువల్ చేయలేదన్నావు. మరి ఈ బిల్ బెల్లా పాకెట్ నుండి కడుతుందా…” మనసు మథన పడుతోంటే వుండబట్టలేక మా అమ్మాయిని అడిగాను.

“మనకెందుకు మమ్మీ. రెక్లెస్ డ్రైవింగ్‌కి పరిహారం చెల్లించాలి. తను పాత డేటులో ఇన్సూరెన్సు కట్టటానికి ప్రయత్నం చేయొచ్చు. అలా కుదరనప్పుడు చేతి నుండి డబ్బు కట్టక తప్పదు మరి. మనది ఆడి కారు అవ్వటం వలన రిపేరు ఎక్స్‌పెన్సివ్ అయ్యింది పాపం”

నాకు మనస్తాపంతో చాలా ఆందోళనగా వుంది.

“బెల్ల పేరెంట్స్ కడతారేమోలే…” గొణిగాను నన్ను నేను కన్విన్స్ చేసుకునే ప్రయత్నంలో.

వెంటనే మా అమ్మాయి “లేదు మమ్మీ. ఇక్కడ పదహారేళ్ళు దాటాక పిల్లలు వాళ్ళే పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ వాళ్ళ ఖర్చులకు సంపాదించుకుంటారు. తల్లితండ్రులు బాధ్యత తీసుకోరు. మహా అయితే తనకు అప్పుగా ఇస్తారు…”

మా అమ్మాయి మాటలు విన్నాక మరింత కుంగిపోయాను.

నేను కారు పక్కకు తీసుకున్నప్పుడు అసలు బెల్లా కారు ఆపకుండా వెళ్ళిపోయి వుంటే నేనేమి చేయగలిగేదానిని.

కనీసం కారు నంబరు కూడా నోట్ చేసుకుని వుండేదాన్ని కాదు.

బెల్లా ఎందుకు కారాపి తన తప్పును అంగీకరించాలి…

అది తనలో నిజాయితీ..  తనకున్న సంస్కారమే కదా.

మరి నాలో నిజాయితీ ఏది…

తప్పు నాదని తెలిసీ నేను మిన్నకుండటమంటే నా మనస్సాక్షిని చంపుకోవటమేగా..

ధర్మసందేశాలు ఇచ్చినంత సుళువు కాదు వ్యక్తిత్వ వికాసం..

మంచితనాన్ని ప్రచారం చేసినంత సులభమూ కాదు ఆచరణ…

అన్యాయం జరుగుతుంటే ఆపక పోవటం కూడా న్యాయం గొంతు నులిమేయటమే… 

అప్పుడు నులిమేసిన నా మనసు గొంతును ఇప్పుడు అక్షర రూపంలో విప్పుతున్నాను.

ఇప్పటికీ పదే పదే కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యే బెల్లా పసిమొహం నన్ను చిత్రవధ చేస్తూ నాకు మనశ్శాంతిని కరువు చేస్తోంది.

I don’t know how repentance is divine but it’s definitely cleansing my mind…

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version