Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గొంతు విప్పిన గువ్వ – 29

ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది.

చీకటి వెన్నెల

తను ఇప్పటికీ మారలేదు..

అతని పట్ల నా మనోభావాలూ మారలేదు.

నా పదేళ్ళ వయసప్పుడు తన ఊహలతో నన్ను ఎంత మైమరిపించాడో ఇప్పుడూ ఈ వయసులోనూ అంతే మురిపిస్తున్నాడు.

మనసుకు వయసుండదు.

ప్రేమనే భావనకు వృద్ధాప్యముండదు.

నలభై ఐదేళ్ళుగా సహచర్యం చేస్తున్నా అతని మొహం నేనెరగను.

అతని విగ్రహం నా మనోఫలకం మీద ముద్రించుకు పోయింది.

నేను ఆరో తరగతిలో వుండగా మొదటిసారి అతను నన్నుఆరడీ పెట్టి గారడీ చేసాడు.

అతను అరెకరం వెడల్పున్న విశాలమైన వీపుగల ఆరడుగుల ఆజానుబాహుడు.

వెనక చొక్కా కాలరుని అలరిస్తూ ఒత్తయిన అతని నల్లటి క్రాపు నా గుండెల్లో గిలిగింతలు పెట్టేది.

ఒకానొక యద్దనపూడి నవలలో పరిచయమైన నవలా నాయకుడతడు.

ఒక్కోసారి రెండు చేతులూ ప్యాంటు జేబులో పెట్టుకుని దీర్ఘంగా శూన్యంలోకి చూస్తూ…

ఒక్కోసారి రింగులు రింగులుగా సిగరెట్టు పొగ వదులుతూ శూన్యంలో గజిబిజి ముగ్గులల్లుతూ…

అలా వెనుకనుండి అతని రూపం నా మనసులో పాతుకుపోయింది.

కలలోనైనా ఎదురుపడి నేనతని మొహం చూడాలనుకోలేదు.

కాని కలల నిండా అతని ఆ వెనుతిరిగిన రూపమే కలగాపులగంగా కలవరపెట్టేది.

అతనిని అదే ఫ్రేములో ఆరాధిస్తూ పదహారేళ్ళ పడుచుతనాన్ని సంతరించుకున్నాను.

నేనేమంత అందమైనదాన్ని కాదు.

కాని వయసులో వున్న కోతైనా అందంగానే కనిపిస్తుంది కదా.

అలా నేనూ అందంగానే కనిపించే దానిని.

నాది నవలా నాయికల్లా పాల మీగడ, గులాబి రేకలు కలగలిపిన పసిడి వన్నె కాదు.

అలాగని కాకంత కారు నలుపూ కాదు.

చామనఛాయగా వుండేదానిని.

నవలానాయకుడిని ప్రేమించటానికి నవలానాయికలా వుండటమే ప్రమాణము కాదనే నమ్మకంతో ఆ ఆరడుగుల ఆగంతడుడిని మనసా వాచా ప్రేమించాను.

ఇప్పటికీ ఐదు పదులు దాటినా ప్రేమిస్తూనే వున్నాను.

నాకు పదహారు నిండక మునుపే పెళ్ళి సంబంధాలు చూడటం మొదలెట్టారు మా ఇంట్లో.

పెళ్ళి చూపుల్లో చామనఛాయయినా కళయిన మొహం అనుకున్నారు పెళ్ళివాళ్ళు.

ఆడపిల్ల అమ్మ కడుపులో పడే సరికే తనకొక మొగుడు పుట్టే వుంటాడుట.

అలా నా కోసమని స్వర్గంలో ముందుగానే నిర్ణయించబడ్డ మొగుడు పెళ్ళికొడుకుగా వచ్చాడు.

ఆడపిల్ల తలెత్తి చూడకూడదన్న హితవు చిన్నతనం నుండీ నరనరానా జీర్ణించుకు పోయి నా చూపులెప్పుడూ నేలని కొలుస్తూనే వుండేవి.

అతని మొహం నేను చూడనే లేదు.

వెళ్ళిపోతుండగా మాత్రం వెనుక నుండి చూసాను.

ఆరడుగుల పొడవూ లేడు. అరెకరం వీపూ లేదు.

చాలా నిరుత్సాహంగా అనిపించింది.

ధైర్యం చేసి గొంతు పెగుల్చుకుని ‘అతను సిగరెట్లు తాగుతాడా..’ అని మా మామయ్యను అడిగాను.

‘ఛఛా.. అలాంటి దుర్గుణాలు అస్సలు లేవ’ని సర్టిఫికెట్ ఇచ్చాడు మామయ్య.

నిలువునా నీరై పోయాను.

ఆడపిల్లల పెళ్ళంటే వాళ్ళ ఇష్టాయిష్టాల ప్రసక్తి కన్నా కుటుంబ పరువు ప్రతిష్ఠలు, ఇచ్చి పుచ్చుకోవటాల ప్రస్తావనా ప్రాముఖ్యతే ఎక్కువ.

నా ప్రమేయం ఏమీ లేకుండానే నా పెళ్ళి జరిగిపోయింది.

నిలువుగా గానీ అడ్డంగా గానీ ఏ కొలతలలోనూ నా ఆరడుగుల ప్రేమికుని విగ్రహంలో నా పతి దేవుడు ఇమడలేదు.

పాతివ్రత్యం వంశపారంపర్యంగా వస్తున్న ఇంట్లో పుట్టిన ఆడపిల్లని.

అయిష్టంగా ఆరడుగుల మూర్తిని మరుపు లోకి నెట్టి కట్టుకున్న ఐదడుగుల విగ్రహంలోనే నా ప్రణయ నాయకుడిని కనుగొందామని కంకణం కట్టుకున్నాను.

కలగన్న అర ఎకరానికి బదులుగా దక్కిన ఆ పది సెంట్ల మైదానంలో ఓ ప్రేమ మొలక నాటుదామని, అది పెరిగి పెద్దయి చెట్టయ్యాక ఆ నీడలో సేద తీరదామని తడి కోసం తడిమాను.

అదంతా చమ్మ ఎరుగని బీటలు వారిన ఎడారని తెలిసి నా గుండె చెరువై పోయింది.

గట్లు తెంచుకుని విజ్రుంభించిన ఆ ప్రవాహంలో నా నీతినియమాలు కొట్టుకు పోయాయి.

సరిగ్గా అప్పుడే సీత లక్ష్మణ రేఖ దాటింది.

ఆ రోజు మామయ్య హనీమూన్‌కి ఊటీకి టిక్కెట్లు బుక్ చేసాడు.

ఏసీ కోచ్ బస్సులో నా భర్త కిటికీ పక్కన కూర్చున్నారు. ఆ పక్కనే కూర్చున్న నేను మాగన్నుగా నిద్ర పట్టి అప్రయత్నంగా నా తలను ఆయన భుజం మీద వాల్చాను.

ఆయన తన చేత్తో నా తలను తోసేస్తూ ‘సీటు బ్యాకు పైన తలాన్చుకోవచ్చు కదా’ అని చిరాకు పడ్డారు.

ప్రేమంటూ వుండాలేగాని పూరి గుడిసెలో కటిక నేల పైన కూడా భార్యాభర్తలు ఒకరికి ఒకరు దిండూ పరుపులై పోవచ్చు.. చీరా పంచెలే దుప్పట్లుగా చుట్టుకోవచ్చు.

భుజం మీద తల ఆనిస్తే భరించని అప్పుడే పెళ్ళయిన భర్తను ఆశ్చర్యంగా చూసాను. ఇలా చిరాకు పడుతూ రుసరుసలాడుతూ ఊటీకి వెళ్ళి హనీమూన్‌లో వెలగపెట్టేది ఏముంటుందసలు..

అలాంటి మొగుడితో హనీమూన్ తలుచుకుంటే నవ్వొచ్చింది.

ఏడవ లేక నవ్వే నవ్వది.

తల నా సీటు వెనకకు వాల్చుకుని కళ్ళు మూసుకున్నాను.

సరిగ్గా అదే అదనుగా నా ఊహల్లో నుండి తరిమి కొట్టేసిన ఆరడుగుల నా చెలికాడు మా వంశ మర్యాదలను మంట గలుపుతూ నా ప్రమేయమేమీ లేకుండానే తిరిగి నా ఆలోచనలలోకి వచ్చేసాడు.

నా పెళ్లయ్యాక అతని పునః ప్రవేశం అదే మొదటిసారి.

నేను నిర్భయంగా నిర్లజ్జగా అతని అర ఎకరం ఛాతీ పైన తల పెట్టుకుని లతలా అతనిని వాటేసుకుని పడుకున్నాను.

ఏ అపరాధ భావన లేకుండా మధురమైన ఊహలతో హాయిగా నిద్ర పట్టేసింది.

అది మొదలు అతను తరచూ రావటం మొదలెట్టాడు.

అతని లాలనకు, చేసే గారానికి, చూపే ప్రేమకు పూర్తిగా బానిసనై పోయాను.

అలౌకికమైన మానసికానందానికి అలవాటు పడిపోయాను.

నేనూ నా భర్తా భౌతికంగా కాపురం చేస్తున్న దంపతులం.

ఒకే కప్పు కింద నివసిస్తున్న పరస్పర ప్రేమ లేని భార్యాభర్తలం.

అతను నా మానస ప్రియుడు.

అతనితో నా మానసిక దగ్గరితనం నాకెంతో ఊరటగా వుండేది.

ఒక రోజున బయటకు వెళ్ళిన నేను అనుకోకుండా ఇంటికొచ్చేసరికి చూడకూడని దృశ్యం నా కళ్ళబడింది.

నా భర్త మా పక్కింటావిడతో పకడ్బందీగా దొరికిపోయారు.

నాకేమీ బాధనిపించలేదు.

నా ఊహా ప్రియుడితో నేను స్వాంతన పొందగా లేనిది ఆయన తనకు నచ్చిన చోట తన కోరిక చల్లార్చు కోవటంలో తప్పు లేదనిపించింది.

ఆయనను నేను తప్పు పట్టలేదు.

మేమిద్దరం మా మా పద్దతుల్లో మా మా లోకాల్లో బ్రతకటానికి అలవాటు పడ్డాము.

నేను ఇద్దరు పిల్లలకు తల్లినయ్యాను.

ప్రేమకూ పిల్లలు పుట్టటానికి అస్సలు సంబంధం వుండదు.

ప్రేమ రాహిత్యంతో బాధపడే ఆయన పిల్లలకు తండ్రి ప్రేమ కూడా పంచి ఇవ్వ లేకపోయారు.

ఆ వెలితిని పూడ్చటానికి నేనే అమ్మను నాన్నను కావలసి రావటంతో కన్నప్రేమలో తలమునకలై నా ఆరడుగుల ప్రియుడిని మరుగున పడేసాను.

రెక్కలొచ్చిన ఎదిగిన పిల్లలు గూడు వదిలి ఎగిరిపోయారు.

అంతవరకూ పిల్లల భవిష్యత్తుకి ఇటుకలు పేర్చటంలో తలమునకలైన నేను అకస్మాత్తుగా ఒంటరినై పోయాను.

ఒంటరితనంలో నేను మరుగున పడేసిన నా ప్రియుడి ఆలంబన మళ్ళీ అవసరం అయ్యింది.

అస్వస్థతగా వున్నప్పుడు ఆ ఊహల కౌగిలి నాలోకి మరీ మరీ ఊపిరి ఊది ప్రాణం నిలిపేది.

ప్రేమ ఎంత మధురం. అసలా భావనే మధురాతిమధురం.

ప్రేమ మాధుర్యాన్ని నేను ఆసాంతమూ సంతృప్తిగా అనుభూతిస్తూంటాను.

ఓ అర్ధరాత్రి ఇంటికి తిరిగి వస్తూ నా భర్త రోడ్డు ప్రమాదంలో మరణించారు.

భౌతికంగా ఆ ఇంట్లో మసిలే ఒక్క తోడు నాకు దూరమయ్యింది.

నా స్నేహితులు ఒకరిద్దరు మళ్ళీ పెళ్ళి చేసుకోమని సలహా ఇచ్చారు.

నాకు మనోబలాన్ని ఇచ్చే నా ప్రియమైన ఊహాత్మక తోడు నాకుండగా వేరే పెళ్ళి ఎందుకని ఒంటరిగా వుండిపోయాను.

నా ప్రియుని ప్రేమాలాపనలో ఉక్కిరిబిక్కిరయ్యే నేను ఆ తాదాత్మ్యాం తట్టుకోలేనప్పుడు నాకు ఒక ఔట్లెట్ అవసరమయ్యింది. అది నా కలం రూపంలో కరుణించింది.

ఇప్పుడు నా ఊహల్లో నేను గ్రోలే ప్రేమామృతాన్నంతా కలం లోకి ఒంపి కవిత్వంగా మలుస్తున్నాను.

మొగుడూ మొద్దులూ లేని ఐదు పదుల నాకు ప్రేమ పైత్యమేమిటని ఆ పిచ్చి కవిత్వమేమిటని నలుగురూ నాలుగు విధాలుగా చెప్పుకుంటున్నారు.

అవేమీ పట్టని నేను నా ప్రియుని ప్రేమలో మునిగి తేలుతూ ఆ ప్రేమలో సమైఖ్యమౌతుంటాను.

ఎటు చూసినా తనే.. నా ఎదురుగా…నా పక్కనా…నాలోనూ… నా చుట్టూరా..

ఇటు అటు ఎటు చూసినా తనే…

నేను అలౌకికానందాన్ని ఆస్వాదిస్తూ ప్రేమ తత్వాన్ని శ్వాసిస్తూ ప్రేమ కావ్యాలల్లుతున్నాను.

ఇప్పుడీ లోకం నా ప్రేమకు మూలపురుషుడెవరని భౌతిక సంబంధాలను శోధిస్తోంది.

ఎవరితో మాటాడినా వారిలో నా ప్రియుడిని వెతుకుతోంది.

నాకు అక్రమసంబంధాన్ని అంటగడుతోంది.

అనుమానపు చూపుతో నా శీలాన్ని శంకిస్తోంది.

అసలీ సమాజంలో స్త్రీ ప్రేమను అర్థం చేసుకునేదెవరు…

కనీసం నన్ను ఊహల్లో కూడా నాకు నచ్చిన విధంగా బ్రతకనీయని ఈ సమాజాన్ని నేనెందుకు లెక్క చేయాలి..

ఈ సమాజం కోసం ఈ చీకటి జీవితంలో పరుచుకున్న వెన్నెల లాంటి ఊహల ఊతం వదులుకుంటే నేను అసలు బ్రతికేదెలా…

ఈ లౌకిక జనం చేసే నిందారోపణలకు నాలో నేను గుంభనంగా నవ్వుకుంటుంటాను.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version