[సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన సైన్స్ ఫిక్షన్ నవలిక ‘గ్రహాంతర అన్వేషణ’ను ధారావాహిక అందిస్తున్నాము.]
విశాలమైన సమావేశ మందిరంలో నాసా, ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు అనేక దేశాల నుంచి ప్రత్యేకంగా ఆహ్వానించబడిన శాస్త్రవేత్తలు ఆసీనులై ఉన్నారు. అక్కడి వాతావరణం చాలా గంభీరంగా ఉంది. అందరి మనసుల్లో ఒకటే ఆలోచన.. ‘ఈ భూమిని ఎలాగూ కాపాడుకోలేకపోయాం, ఇక్కడ మిగిలున్న మనుష్యజాతిని రక్షించుకోవడం ఎలా?’ అనే ఆలోచన..
ఇస్రో ఛైర్మన్ భార్గవ తన అభిప్రాయం చెప్పడానికి లేచి నిలబడ్డాడు. “మనకు మిగిలిన సమయం మరో పాతికేళ్ళు. అంతే. అంతకు మించి ఈ భూమ్మీద మానవజాతి మనుగడ సాగించడం అసాధ్యం. ఇప్పటికే భూతాపం ఎనిమిది డిగ్రీల సెల్సియస్ పెరిగింది. సముద్రాలు విషతుల్యమైపోయాయి. గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం ప్రమాదకర స్థాయిని చేరుకుంది. అడవులు నశించాయి. నదులు ఎండిపోయాయి. వాతావరణంలో ఏర్పడిన పెనుమార్పులకు కొన్ని దేశాలే తుడిచిపెట్టుకుపోయాయి. మనం మరో ఆవాసయోగ్యమైన గ్రహాన్ని ఎంత తొందరగా చేరుకుంటే అంత మంచిది. లేకపోతే ఈ భూమ్మీద మనిషనేవాడే మిగలడని భయమేస్తోంది” అన్నాడు.
“మనుషులు నివసించడానికి అనుకూలమైన గ్రహాల కోసం కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న అన్వేషణ ఫలించలేదా?” అని అడిగింది నతాలియా. ఆమె రష్యాకు చెందిన ఆస్ట్రో బయాలజీ సైంటిష్ట్.
“ఆ విషయం చర్చించడానికే మిమ్మల్నందర్నీ ఇక్కడ సమావేశపరిచాం. విశ్వాంతరాళంలో మనకు సమీపంగా ఉన్న మూడు గ్రహాల్లో మనుషులు నివసించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్టు నిర్ధారణకు వచ్చాం. వాటిల్లో ఓ గ్రహం పైకి పైలట్ వ్యోమనౌకను పంపించాం. వారం రోజులు ఆ గ్రహం మీద అవసరమైన పరిశోధనలన్నీ చేశాక వ్యోమనౌక తిరిగి భూమిని చేరుకుంది. అక్కడి పరిస్థితుల్ని నాసా అడ్మినిస్ట్రేటర్ రాబర్ట్ ల్యూసిడ్ వివరిస్తారు” అంటూ అతని వైపు చూశాడు భార్గవ.
రాబర్ట్ ల్యూసిడ్ లేచి నిలబడ్డాడు. “ఆ గ్రహానికి అడోనిస్ అని పేరు పెట్టాం. అడోనిస్ అత్యంత అందమైన గ్రీకు దేవుడు. ఈ గ్రహానికి ఆ పేరు పెట్టడానికి కారణం అది అత్యంత మనోహరమైన ప్రదేశం కావడమే. ప్రకృతి రమణీయతకు మారుపేరులా ఉందా గ్రహం. ఎత్తయిన పర్వతాలు, జలపాతాలు, నదు లు, సరస్సులు, రకరకాల పూలమొక్కలు, ఫల వృక్షాలు.. విశ్వాంతరాళంలో మన కోసమే సృష్టించబడిన స్వర్గం అడోనిస్ గ్రహం. పైలట్ వ్యోమనౌక నాలుగు వారాలు శ్రమపడి అక్కడి ప్రతి అంగుళాన్ని తన డిజిటల్ కెమెరాలలో వీడియోల రూపంలో నిక్షిప్తం చేసింది. అది మానవరహిత వ్యోమనౌక. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే రోబోట్ ‘చిటేకి’ని పంపించాం. దాన్ని జపాన్ శాస్త్రవేత్తలు తయారుచేశారు. ‘చిటేకి’ అంటే జపనీస్ భాషలో ‘తెలివిగలది’ అని అర్థం. ఇప్పుడు మీ ముందున్న తెరమీద అడోనిస్ గ్రహానికి సంబంధించిన వీడియోలు ప్రదర్శించబడ్డాయి. శ్రద్ధగా చూడండి. మరో ఐదారేళ్ళలో మనం నివసించబోయే గ్రహం అదే. అనుమానాలేమైనా ఉంటే అడగండి. చిటేకి సమాధానం చెప్తుంది” అంటూ వీడియోలు చూపించమని చిటేకిని ఆదేశించాడు.
అందరిలో కుతూహలం.. తెరమీద కన్పించబోయే తమ భావి ప్రాణదాత అడోనిస్ గ్రహం ఎలా ఉంటుందో చూడాలన్న ఉత్సుకతతో కళ్ళు విప్పార్చి చూడసాగారు.
తెరమీద మొదట బూడిద రంగులో గోళాకారంలో ఉన్న గ్రహం కన్పించింది.
“అదే అడోనిస్ గ్రహం. దట్టమైన మేఘాల్తో కప్పబడి ఉండటం వల్ల బూడిద రంగులో కన్పిస్తోంది. పరిమాణంలో మన భూమి కన్నా పదిశాతం పెద్దది. అడోనిస్ తన చుట్టూ తాను తిరగడానికి తీసుకునే సమయం ఇరవై ఆరున్నర గంటలు” చిటేకి తన మెటాలిక్ వాయిస్‌లో చెప్తుంటే, మైక్ అవసరం లేకుండానే ఆ గదిలో ఉన్న అందరికీ స్పష్టంగా విన్పించసాగింది.
తెరమీద ఎటుచూసినా పచ్చదనమే కన్పిస్తోంది. రకరకాల చెట్లు.. భూమ్మీద కన్పించే చెట్లలా లేవవి. వాటి ఆకులు వింత వింత ఆకారాల్లో ఉన్నాయి. కొన్ని చెట్లకు ఎర్రటి పళ్ళేవో వేలాడుతున్నాయి. ఆ చెట్ల కింద నాలుగు జంతువులు నిలబడి ఉన్నాయి. వాటి శరీరం నీటిఏనుగు శరీరంలా భారీగా ఉంది. మెడ సన్నగా పొడవుగా సాగి జిరాఫీ మెడలా కన్పిస్తోంది. అవి తమ మెడల్ని సాచి, ఎర్రగా కన్పిస్తున్న పళ్ళని తింటున్నాయి.
రెణ్ణిమిషాల వ్యవధిలో వర్షం మొదలైంది. సన్నటిగాలి వీస్తున్నట్టుంది. చెట్ల కొమ్మలు మెల్లగా వూగుతున్నాయి. ఆకులు చినుకుల తాకిడికి తన్మయత్వంతో పులకిస్తున్నట్టు కన్పిస్తున్నాయి.
“మా వ్యోమనౌక అడోనిస్ గ్రహం మీద దిగిన సమయంలో అక్కడ వర్షాకాలం నడుస్తోంది. ఆ గ్రహం మీద ఆరు నెలలు వర్షాకాలం, ఆరు నెలలు ఎండాకాలం.. చలికాలం ఉండదు” అంది చిటేకి.
“వర్షపు నీటిని పరీక్షించి చూశారా? ఏమైనా హానికరమైన కెమికల్ గానీ, రోగాల్ని కలుగచేసే క్రిములు గానీ ఉండే అవకాశం ఉంది కదా” అని అడిగాడు షియోచెంగ్. అతను ఐదడుగుల రెండంగుళాల ఎత్తుతో సన్నగా తెల్లగా ఉన్న చైనా దేశస్థుడు.. ప్రముఖ వైరాలజిష్ట్..
“చూస్తూ ఉండండి. మరికొన్ని క్షణాల్లో మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది” అంది చిటేకి.
తెర మీద దృశ్యం మారింది. వర్షంలో తడుస్తూ ఓ రోబోట్ నడుస్తూ వెళ్తంది. దారంతా చిత్తడిగా ఉంది. అది చిటేకి అని అందరికీ అర్థమైంది. ఓ చోట రోబోట్ ఆగిపోయింది. దాని పొట్టలోంచి గిన్నెలాంటిదేదో బైటికొచ్చింది. అది వర్షపునీటితో నిండిన వెంటనే మళ్ళా లోపలికి అదృశ్యమైపోయింది. కొన్ని క్షణాల వ్యవధిలోనే దాని వీపుకున్న మానిటర్ మీద ‘ప్యూర్ H2O’ అనే అక్షరాలు వెలుగుతూ కన్పించాయి.
మిషన్ కంట్రోల్ రూంకి చిటేకి పంపిన ఆడియో మెసేజ్ విన్పించింది. “స్వచ్ఛమైన నీరు.. ఎటువంటి కెమికల్స్ కలిసిపోయి లేవు. బ్యాక్టీరియా వైరస్ల లాంటి రోగకారక క్రిములేవీ లేవు. భూమ్మీద దొరికే నీటికన్నా శుద్ధమైన నీరు.”
“నీళ్ళ రుచి ఎలా ఉంది?” మరో ప్రశ్న వేశాడు షియోచెంగ్.
“రుచిని గ్రహించే సాఫ్ట్వేర్ నా శరీరంలో ఏర్పాటు చేయబడలేదు. అందువల్ల మీ ప్రశ్నకు సమాధానం చెప్పలేను” అంది చిటేకి.
“మన భూమ్మీద మనకు తెలిసిన బ్యాక్టీరియా, వైరస్లు నీటిలో ఉన్నాయో లేవో గ్రహించే సామర్థ్యం రోబోట్కి ఉండిఉంటుంది. మనకు తెలియని కొత్తరకం వైరస్లు, బ్యాక్టీరియాలు ఉండే అవకాశం ఉంది కదా. ఆ విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా?” సుముగి రాబర్ట్ ల్యూసిడ్ వైపు చూస్తూ అడిగింది. ఆమె జపాన్‌లో అత్యంత ప్రతిభాశాలి అయిన డాక్టర్. యం.డి చదివింది. వయసు నలభైకి దగ్గరగా ఉంటుంది.
“వ్యోమనౌక తెచ్చిన నీటి శాంపిల్స్‌ని వివిధ లేబొరేటరీల్లో పరీక్షించాం. అనుమానాస్పదమైంది ఏమీ కన్పించలేదు. ఎటొచ్చీ మీరు చెప్పినటువంటి అవకాశం లేకపోలేదు. అదొక గ్రే ఏరియా” అన్నాడు రాబర్ట్ ల్యూసిడ్.
తెరమీద వీడియో ప్రదర్శనల్ని చిటేకి కొనసాగించింది.
ఎత్తయిన కొండలు.. దట్టమైన అడవులు.. విశాలమైన పచ్చటి మైదానాలు కన్పిస్తున్నాయి. రకరకాల జంతువులు.. కుందేలు సైజులో ఉన్న చిన్నచిన్న జంతువులతో పాటు ఏనుగు పరిమాణంలో భారీకాయాల్తో ఉన్న జంతువులు కూడా తిరుగాడుతూ కన్పించాయి. అన్నీ ఏపుగా పెరిగిన గడ్డినో, మొక్కల్నో తింటున్నాయి తప్ప ఏ జంతువూ మరో జంతువుని చంపి తినడం లేదు.
“అక్కడ అన్నీ శాకాహార జంతువులే కన్పిస్తున్నాయి. పులులూ సింహాల్లాంటి క్రూరమృగాలేవీ కన్పించడం లేదేమిటి?” అని అడిగాడు శరత్చంద్ర. అతను శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో ఖగోళ భౌతికశాస్త్రవేత్త.. ఆస్ట్రో ఫిజిసిష్ట్.
“నాలుగు వారాలు అడోనిస్ గ్రహంమీద రోవర్ సాయంతో చాలా ప్రదేశాలు తిరిగాను. అక్కడి జంతువుల్ని, పక్షుల్ని చాలా నిశితంగా పరిశీలించాను. నాకెక్కడా మాంసాహారం తినే జంతు లేదా పక్షి జాతి కన్పించలేదు. ఆ గ్రహం మానవులకే గాదు జంతువులకు కూడా సురక్షితమైంది” అంది చిటేకి.
“అడోనిస్ అందమైన గ్రహమే కాదు హింసకు తావులేని గ్రహం కూడా” నవ్వుతూ అన్నాడు రాబర్ట్ ల్యూసిడ్.
“మనుషుల్ని అక్కడికి రవాణా చేసేవరకు అది ప్రశాంతమైన గ్రహమే. ఆ తర్వాత ఏమౌతుందనేది మనుషుల ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మనలోనే హింస ప్రజ్వరిల్లవచ్చు. మాంసాహారం తినడానికి అలవాటుపడిన మనుషులు అక్కడి జంతువుల్ని వేటాడి, చంపి తినే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి అది అహింసకు ఆలవాలమైన గ్రహమే” భార్గవ కూడా నవ్వుతూ అన్నాడు.
శరత్చంద్ర మనసులో రకరకాల అనుమానాలు.. ఆ గ్రహంలో నిజంగానే మాంసాహార జంతువులు లేకపోతే ఫుడ్ చెయిన్ వ్యవస్థ అక్కడ పనిచేయడం లేదా? గడ్డిని మేకలు, జింకలు లాంటి శాకాహార జంతువులు తింటాయి. వాటిని పులులు, సింహాల్లాంటి క్రూరమృగాలు తింటాయి. అలా ఒకదానిమీద మరొకటి ఆహారం కోసం ఆధారపడటం వల్లనే జీవావరణ సమతుల్యత ఏర్పడుతుంది.
“నా అనుమానం ప్రకారం ఆ గ్రహంలో కూడా మాంసాహారం తినే జంతువులు తప్పకుండా ఉండి ఉంటాయి” అన్నాడు శరత్.
“ఎందుకలా అనుకుంటున్నారు?” అని అడిగాడు భార్గవ.
“అక్కడి జంతువులన్నీ శాకాహారులే అయితే అంత దట్టంగా చెట్లు పెరిగే అవకాశం లేదు. మొక్కలుగా ఉన్నప్పుడే వాటిలో ఎక్కువ శాతం మొక్కల్ని జంతువులు తినేస్తాయి కాబట్టి. అదే నిజమనుకుంటే జంతువుల సంఖ్య కూడా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయి కన్పించాలి. మనం వీడియోల్లో చూసిన దాన్ని బట్టి జంతువులు పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. అంటే అర్థం అక్కడ కూడా ఫుడ్ చెయిన్ వ్యవస్థ ఏదో ఉంది. శాకాహార జంతువుల్ని తినే మాంసాహార జంతువులు తప్పకుండా ఉండి ఉంటాయి” అన్నాడు శరత్.
“ఏడు రోజులు ఆ గ్రహం మీద విస్తృతంగా తిరిగాను. నాకెక్కడా మాంసాహార జంతువులు కన్పించ లేదు” అంది చిటేకి.
“రాత్రి సమయాల్లో అటువంటి జంతువులు బైటికొచ్చి ఉండొచ్చుగా. చీకట్లో ఆ గ్రహం మీద ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది?” అని అడిగాడు శరత్.
“అడోనిస్ గ్రహానికి రెండు చంద్రుళ్ళు ఉండటం వల్ల రాత్రుళ్ళు మరీ చీకటిగా ఉండవు. నేను చాలా రాత్రుళ్ళు రోవర్ మీద తిరుగుతూ వీడియోలు చిత్రీకరించాను. క్రూరజంతువుల ఆనవాళ్ళేమీ కన్పించలేదు. ఒకవేళ మీ అనుమానమే నిజమనుకుంటే అవి తిని వదిలేసిన జంతువుల కళేబరాలు కన్పించాలిగా. కనీసం వాటి రక్తం చిందిన గుర్తులైనా కన్పించాలిగా” అంది చిటేకి.
శరత్‌కి రోబోట్ వాదనలో బలముందనిపించింది. నిజమేగా.. ఎముకలైనా కన్పించాలిగా.. ఎముకల్ని కూడా నమిలి తినేశాయి అనుకున్నా రక్తపుచారలైనా కన్పించాలిగా. చిటేకి చెప్పింది తర్కసమ్మతంగా ఉన్నప్పటికీ శరత్ మనసులో మాత్రం జీవావరణ సమతుల్యత సాధించడం కోసం అక్కడేదో జరుగుతోంది అనే అనుమానం బలంగా నాటుకుపోయింది.
“కొన్ని జంతువులు ఆమ్నివోర్స్ అయి ఉండొచ్చుగా. శాకాహారంతో పాటు మాంసాహారం తినే జంతువులు.. వీడియోలని చిత్రీకరిస్తున్న సమయంలో అవి ఆకులు తింటూ కన్పించి ఉండొచ్చు. ఆ తర్వాత అవి జంతువుల్ని తిని ఉండొచ్చుగా” అన్నాడు శరత్.
“చిటేకి అభిప్రాయపడినట్టు రక్తపు మరకలు కన్పించాలిగా” అన్నాడు భార్గవ.
“చిన్నచిన్న జంతువుల్ని నమిలి తినకుండా కొండచిలువ మింగేసినట్టు ఆసాంతం మింగేసి ఉండొచ్చుగా. దానిలోని జీర్ణరసాలు వాటి ఎముకల్ని కూడా కరిగించుకునేంత సామర్థ్యాన్ని కలిగి ఉండొచ్చుగా.”
భార్గవ కొన్ని క్షణాలు ఆలోచించి, “అటువంటి అవకాశం ఉంది. ఇది మరో గ్రే ఏరియా. మనం తప్పకుండా శోధించి, తెల్సుకోవాల్సిన ముఖ్యమైన విషయం” అన్నాడు.
తెర మీద దృశ్యం మారింది. అడవిలా ఉంది. రకరకాల చెట్లు.. కొన్ని జంతువులు చెట్లకింద విశ్రాంతి తీసుకుంటున్నాయి. చెరువులో నీళ్ళు తాగుతూ మరికొన్ని జంతువులు కన్పించాయి. భూమ్మీద కన్పించే జంతువులకన్నా భిన్నంగా ఉన్న జంతువులు.. నాలుగు కాళ్ళ జంతువులే కాకుండా పురుగులకున్నట్టు ఆరు కాళ్ళతో నడిచే జంతువులు, ఎనిమిది కాళ్ళతో సాలెపురుగు నడిచినట్టు నడిచే జంతువులు..
వర్షం కురుస్తూనే ఉంది. కెమెరా ముందుకు కదుల్తూ ఉంది. ఓ చోట వింత దృశ్యం తెరమీద కన్పించింది. చెట్టు కాండాన్ని గట్టిగా కౌగిలించుకుని ఉందో జంతువు. దానికి ఎనిమిది కాళ్ళున్నాయి. తన ఎనిమిది కాళ్ళని టెంటకిల్స్గా చెట్టు చుట్టూ పెనవేసి నిలబడి ఉందా జంతువు. శరత్ దానివైపు పరిశీలనగా చూశాడు. అది చెట్టుని కౌగిలించుకున్నట్టు లేదు. ఏదో జిగురులాంటి పదార్థంతో చెట్టు కాండానికి అతుక్కుపోయినట్టనిపించింది. మరికొంత దూరం వెళ్ళాక అటువంటి మరో చెట్టుని గట్టిగా పట్టుకుని ఉన్న నాలుగు కాళ్ళ జంతువు కన్పించింది.
“అవెందుకలా ప్రవర్తిస్తున్నాయి?” అని అడిగాడు శరత్.
“ఇన్కాంప్రెహెన్సిబుల్. మనకు తోచినట్టు కారణాన్ని వూహించగలమే తప్ప నిజమేంటో తెలియదు. వృక్షశాస్త్ర జంతుశాస్త్ర మేధావులు నిగ్గు తేల్చాల్సిన విషయం. బహుశా అక్కడి చెట్లకు జంతువులకు మధ్య కెమికల్ బాండింగ్ ఏమైనా ఉండిఉండొచ్చు” అంది చిటేకి.
“మనం తెల్సుకోవాల్సిన ముఖ్యమైన విషయాల్లో ఇదొకటి. కొన్ని చిక్కు ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుని, ఆ గ్రహానికి సంబంధించిన పూర్తి సమాచారం తెల్సుకుంటే తప్ప మనుషుల్ని అక్కడికి పంపే పనిని మొదలెట్టలేము” అన్నాడు భార్గవ.
తెరమీద అటువంటి దృశ్యాలు మరికొన్ని కన్పించాయి. ఒకే రకమైన చెట్లను మాత్రమే జంతువులు పెనవేసుకుంటున్నాయని శరత్ గమనించాడు. ఒకవేళ చిటేకి చెప్పినట్టు చెట్లకి, జంతువులకి మధ్య బయో కెమికల్ ఆకర్షణ లాంటిదేమైనా ఉంటే అది అన్ని చెట్లకు వర్తించాలి కదా. ప్రత్యేకంగా ఆ చెట్ల విషయం లోనే ఆ లక్షణం ఎందుకు కన్పిస్తోంది? దానివల్ల వాటికి ఒనగూడే లాభం ఏమిటి? జంతువులు ఏ ప్రయోజనాన్ని ఆశించి అలా చేస్తున్నాయి? అన్ని జంతువులు అలానే ప్రవర్తిస్తాయా లేక కొన్ని ప్రత్యేకమైన జంతువులే చెట్లతో ఏదో అనుబంధం ఉన్నట్టు ప్రవర్తిస్తాయా? ఎన్ని ప్రశ్నలో.. అన్నీ సమాధానం లేని ప్రశ్నలే..
తెర మీద రోవర్ కన్పించింది. దానికి సమీపంగా నిలబడి ఉంది రోబోట్. వర్షం వెలిసింది. మొదట పల్చటి ఎండ నేలమీద వెండి రజనులా మెరుస్తూ కన్పించింది. మరికొంత సమయం గడిచాక నక్షత్రం ఎర్రటి అగ్నిగోళంలా మారి అస్తమిస్తూ కన్పించింది. ఆ దృశ్యం చాలా మనోహరంగా ఉంది. భూమ్మీద కన్పించే సూర్యాస్తమయం కన్నా అద్భుతమైన దృశ్యం.. ఆకాశమంతా మంటల్లో కాలిపోతున్న అడవిలా.. పసుపూ కుంకుమల్ని నీళ్ళలో కలిపి బిందెల్తో చల్లినట్టు రంగుల హేల..
చిటేకి మెటాలిక్ స్వరం మళ్ళా విన్పించింది. “మీక్కనిపిస్తున్న నక్షత్రం పేరు క్రిసోస్. గ్రీకు భాషలో క్రిసోస్ అంటే బంగారం అని అర్థం. ఈ నక్షత్రం లేత పసుపురంగు కాంతితో బంగారంలా మెరిసిపోతూ కన్పించడం వల్ల దానికా పేరు పెట్టారు. మన సూర్యుడి వయసు 4.6 బిలియన్ సంవత్సరాలని మీకు తెలుసు. ఈ క్రిసోస్ నక్షత్రం వయసు మూడు బిలియన్ సంవత్సరాలే. కానీ ఇది సూర్యుని కన్నా పరిమాణంలో ఒకటిన్నర రెట్లు పెద్దది. సూర్యునితో పోలిస్తే రెండు రెట్లు ప్రకాశవంతమైనది.”
రోబోట్ మాటల్ని మధ్యలోనే అడ్డుకుంటూ అమెరికా శాస్త్రవేత్త డేనియల్ అడిగాడు. “అక్కడి గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత? ఉష్ణోగ్రతలు ఏ రేంజ్లో ఉంటాయి?”
చిటేకి అతని వైపు తిరిగి సమాధానం చెప్పింది. “మన భూవాతావరణంలో ఆక్సిజన్ 21 శాతం, నైట్రోజన్ 78 శాతం ఉంటాయి. అడోనిస్ గ్రహంమీద ఆక్సిజన్ 23 శాతం, నైట్రోజన్ 76 శాతం ఉన్నాయి. క్రిసోస్ నక్షత్రం నుంచి ఈ గ్రహం చాలా దూరంలో ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ రేంజ్లో ఉంటాయి.”
“మనుషులు నివసించడానికి అనుకూలమైన అన్ని పరిస్థితులు అడోనిస్ గ్రహం మీద ఉండబట్టే భూమి మీదున్న జలవాయువులు పూర్తిగా విషతుల్యం అయ్యేలోపల, భూమి నిప్పుల కుంపటిలా మారి మనుషుల్ని శలభాల్లా మాడ్చేసే లోపల, అందర్నీ ఆ గ్రహం మీదికి చేర్చాలి” అన్నాడు భార్గవ.
అమెరికన్ సైంటిష్ట్ ఒలీవియా లేచి నిలబడింది. ఆమె బాటనీలో పీజీ చేసి, ప్లాంట్ ఫిజియాలజీలో రీసెర్చ్ చేసింది. “నాకో విషయం అర్థం కావడం లేదు. అడోనిస్ గ్రహం మీద వృక్ష జాతి ఉంది. జంతు జాతి ఉంది. క్రిమికీటకాలున్నాయి. జలచరాలున్నాయి. పక్షులున్నాయి. ఇన్ని ఉన్నప్పుడు మనుషులు కూడా ఉండాలిగా. కనీసం మనుషుల్ని పోలిన జీవులు ఉండాలిగా. ఆ గ్రహం మీద ఎక్కడ వెదికినా ఎందుకు అటువంటి ప్రాణులు కన్పించలేదు? థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అక్కడ తప్పయిందా? జంతువుల తర్వాత పరిణామ క్రమంలో మరో ఉన్నతస్థాయి జీవి ఎందుకు ఆవిర్భవించలేదు? ఆశ్చర్యంగా లేదూ..” అని భార్గవని ఉద్దేశించి అడిగింది.
“మన భూమితో పోలిస్తే అడోనిస్ గ్రహం ఒకటిన్నర బిలియన్ సంవత్సరాలు చిన్నది. ఆ కారణం వల్ల యింకా మానవుల్ని పోలిన జీవుల ఆవిర్భావం జరిగి ఉండకపోవచ్చు. మనుష్యజాతికి సంబంధించినంత వరకు మనమే దానిమీద మొదటిసారి కాలుబెట్టబోతున్నాం” అన్నాడు భార్గవ.
ఒలీవియా లేవనెత్తిన అనుమానమే శరత్చంద్ర మనసులో కూడా తొలుస్తోంది. భార్గవ చెప్పిన జవాబు అతనికి సంతృప్తినివ్వలేదు. కోతుల ఆవిర్భావం తర్వాత మనుష్యజాతి రూపు దిద్దుకోడానికి దాదాపు ఆరు మిలియన్ల సంవత్సరాలు మాత్రమే పట్టింది. అడోనిస్ గ్రహం మీదున్న జంతువుల్ని పరిశీలిస్తే వాటిలో మన భూమ్మీద ఉన్న చింపాంజీ, బోనబోలను పోలిన కోతిజాతి జంతువులు కన్పించాయి. అవి తప్పకుండా ఆరేడు మిలియన్ సంవత్సరాలకు పూర్వమే ఆవిర్భవించి ఉండాలి. మరి మానవుల్ని పోలిన జీవుల పరిణామం ఎందుకు చోటుచేసుకోలేదు? ఏదో లింక్ ఎక్కడో తప్పుతున్నట్టనిపించింది.
వీడియో చూపించడం పూర్తయింది. తెర వెనక్కి జరిగిపోయింది.
భార్గవ సభనుద్దేశించి మాట్లాడసాగాడు. “అడోనిస్ గ్రహం మీది నేల చాలా సారవంతమైంది. ఆ గ్రహం మానవ మనుగడకు చాలా అనుకూలంగా ఉంది. ఐనప్పటికీ కొన్ని ప్రశ్నలకు జవాబులు వెతుక్కో వాల్సిన అవసరం ఉంది. అక్కడ మనుషులు పూర్తిగా సురక్షితంగా, సుభిక్షంగా ఉండగలరని నిర్ధారణకు వచ్చేవరకు మనుషుల్ని రవాణా చేయలేం. అందుకే నేనూ రాబర్ట్ ల్యూసిడ్ ఓ నిర్ణయానికొచ్చాం. కనీసం పదిమంది సునాయాసంగా ప్రయాణించగల స్పేస్‌షిప్‌ని తయారుగా ఉంచాం. మీలో కొంతమందిని ఈ ప్రయాణం కోసం ఎన్నుకున్నాం. ఈ మిషన్కి భారతదేశ ప్రముఖ శాస్త్రవేత్త శరత్చంద్ర నేతృత్వం వహిస్తారు. ఇందులో విభిన్న రంగాలకు చెందిన ఆరుగురు శాస్త్రవేత్తలతో పాటు ఇంటర్టెల్లార్ స్పేస్ వాయేజ్ అండ్ ఇంజనీరింగ్‌లో నిష్ణాతులైన ఇద్దరు ఆండ్రాయిడ్లు, టైటాన్ బోల్ట్ మరియు నోవా స్పార్క్ కూడా ఉంటారు. మిగతా వివరాలు నాసా అడ్మినిస్ట్రేటర్ రాబర్ట్ ల్యూసిడ్ చెప్తారు” అన్నాడు భార్గవ.
రాబర్ట్ ల్యూసిడ్ గొంతు సవరించుకున్నాడు. “ఈ మిషన్ కోసం ఎన్నుకోబడిన శాస్త్రవేత్తలందరికీ రెణ్ణెల్లపాటు వాషింగ్టన్లో నాసా ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వబడుతుంది. వీళ్ళు మూడు నెలలపాటు అడోనిస్ గ్రహం మీద నివాసముంటారు. అక్కడ పండించిన పంటల్నే ఆహారంగా స్వీకరిస్తారు. మనం ఈ సమావేశం లో కొన్ని గ్రే ఏరియాలని గుర్తించాం. వాటికి సమాధానాలు కనుక్కోవాల్సిన బాధ్యత కూడా ఈ మిషన్ మీద ఉంది. మూడు నెలల తర్వాత వాళ్ళిచ్చే నివేదిక సానుకూలంగా ఉంటే, ఇక్కడి మనుషుల్ని అడోనిస్ గ్రహం మీదకి చేరవేసే కార్యక్రమాన్ని చేబట్టాలని నిర్ణయించుకున్నాం.”
“ఇదంతా పూర్తవ్వడానికి సుమారుగా ఎంత కాలం పడ్తుంది సర్” అని అడిగింది ఇషిత. ఆమె భారతీయురాలు. అగ్రికల్చరల్ సైంటిస్ట్. ప్లాంట్ జెనిటిక్స్ మరియు బ్రీడింగ్‌లో బాగా పేరున్న శాస్త్రజ్ఞురాలు. చాలా సున్నితమనస్కురాలు. గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రమట్టాలు పెరిగి వూళ్ళకు వూళ్ళు తుడిచిపెట్టుకు పోయిన సంఘటనలు ఆమెను విషాదంలో ముంచెత్తాయి. సునామీలు, భూకంపాలు, వరదలు, భూతాపం. భూమ్మీది జీవరాశుల్ని వివిధ మృత్యురూపాల్లో వచ్చి కబళిస్తున్న విపత్కర వాతావరణ పరిస్థితుల్నుంచి వాటిని రక్షించడం కోసం కంకణం కట్టుకున్న వ్యక్తి..
“రెండు నెలల శిక్షణ తర్వాత శాస్త్రవేత్తలు స్పేస్‌షిప్‌లో అడోనిస్ గ్రహానికి బయల్దేరుతారు. వాళ్ళు గ్రహాన్ని చేరుకోడానికి రెండు వందల ముప్పయ్ రోజులు పడ్తుంది. అక్కడ మూడు నెలలు వాళ్ళు నివాసముంటారు. అంతా సవ్యంగా జరిగితే ఇక్కడినుంచి మనుషుల్ని ఆ గ్రహానికి రవాణా చేసే పని మొదలెట్టడానికి సంవత్సరకాలం పడ్తుంది” అన్నాడు రాబర్ట్ ల్యూసిడ్.
“సర్.. ఇప్పటికే భూమ్మీద ఉన్న ఎనభైశాతం జీవరాశి తుడిచిపెట్టుకుపోయింది. గాల్లో కార్బన్ డయాక్సైడ్తో పాటు మీథేన్ హైడ్రేట్ నిండిపోయింది. చిన్న అగ్గిరవ్వ తగిల్తే చాలు ఆ వాయువు భయంకరమైన విస్ఫోటనంతో అణుబాంబులా పేలి, కొన్ని వేల గ్రామాల్ని బూడిదగా మార్చేస్తోంది. మరో ఏడాది వరకు ఇక్కడే ఉంటే మనుషులు పదిశాతం కన్నా మిగలరు సర్. పైలట్ స్పేస్ షటిల్‌ని పంపించి, అడోనిస్ గ్రహాన్ని క్షుణ్ణంగా పరిశీలించారుగా. అది చాలు. మళ్ళా ఈ మిషన్ అవసరమేంటి? ఈ రోజునుంచే ఆ గ్రహానికి మనుషుల రవాణా మొదలెట్టొచ్చు కదా” అంది ఇషిత. అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళు చెమర్చాయి. గుండె వేదనతో బరువెక్కింది.
“ఈ మిషన్ అవసరం చాలా ఉంది ఇషితా. పైలట్ స్పేస్ షటిల్లో వెళ్ళి వారం రోజులు ఆ గ్రహం మీద గడిపింది మనిషి కాదు, ఓ రోబోట్.. మరమనిషి. మనకందిన సమాచారం ప్రకారం అడోనిస్ గ్రహం మానవ మనుగడకు తొంభైశాతం అనుకూలంగానే ఉంది. మిగతా పదిశాతం కూడా ప్రమాదరహితమని ఖచ్చితంగా తెల్సుకున్నాకే మనుషుల్ని రవాణా చేయడం శ్రేయస్కరం. ఇక్కడ ఏడాదిలో జరిగే అనర్థాల గురించి నాకూ తెలుసు. కానీ రిస్క్ తీసుకోక తప్పదు. అదే రిస్క్ మనం అడోనిస్ గ్రహం విషయంలో తీసుకోలేం. ఎందుకంటే భవిష్యత్తులో అదే మానవాళి నివసించబోయే గ్రహం కాబట్టి. దాని గురించిన సమాచారం తెల్సుకునే విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా మానవజాతి సమస్తం నాశనమయ్యే ప్రమాదముంది” అన్నాడు రాబర్ట్ ల్యూసిడ్.
(ఇంకా ఉంది)
సలీం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కథా, నవలా రచయిత. మానవత్వం ఉట్టిపడే రచనలకు పెట్టింది పేరు. “రూపాయి చెట్టు”, “ఒంటరి శరీరం”, “రాణీగారి కథలు”, “నీటిపుట్ట” వీరి కథా సంపుటులు. “కాలుతున్న పూలతోట”, “అనూహ్య పెళ్ళి”, “గుర్రపు డెక్క”, “వెండి మేఘం” వంటివి వీరి నవలలు.
