Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గ్రహాంతర అన్వేషణ-2

[సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన సైన్స్ ఫిక్షన్ నవలిక ‘గ్రహాంతర అన్వేషణ’ను ధారావాహిక అందిస్తున్నాము.]

[భూమిపై వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల అడవులు నశించాయి. నదులు ఎండిపోతాయి, కొని దేశాలకు దేశాలే తుడిచిపెట్టుకుపోతాయి. మిగిలి ఉన్న కొద్దిమంది మనుషులనైనా కాపాడుకోవాలంటే, అంతరిక్షంలో, మరో ఆవాసయోగ్యమైన గ్రహాన్ని కనుక్కోవాల్సిందేనని అంతర్జాతీయ స్పేస్ సంస్థలు నడుంకడతాయి.  అడోనిస్ అనే గ్రహం ఆవాస యోగ్యంగా ఉన్నట్టు గుర్తించి, ఆ గ్రహం మీదకి పైలట్ స్పేస్‌షిప్‌లో చిటేకి అనే ఓ రోబోని పంపిస్తారు. ఆ రోబో అందించే సమాచారం తెలుసుకోడానికి, తదుపరి చర్యలు చేపట్టడానికి వివిధ దేశాలకు సంబంధించిన శాస్త్రవేత్తలు సమావేశమవుతారు. చిటేకి ఆ గ్రహం గురించిన అన్ని వివరాలు అందిస్తుంది, శాస్త్రవేత్తల సందేహాలు తీరుస్తుంది. ముందుగా ఆరుగురు మానవ శాస్త్రవేత్తలని ఆ గ్రహం మీద మూడు నెలలు గడపడానికి ప్రయోగాత్మకంగా పంపాలని నిర్ణయిస్తారు. – ఇక చదవండి.]

వాషింగ్టన్ డి.సి.. నాసా ముఖ్య కేంద్రం.. మిషన్ అడోనిస్‌లో పాల్గొనే శాస్త్రవేత్తలకు శిక్షణ ఇవ్వడం కోసం నిర్దేశించిన గదిలోకి ఒక్కొక్కరూ రావడం మొదలైంది. వాళ్ళకు వ్యక్తిగతంగా సమాచారం ఇవ్వబడింది తప్ప మిషన్ లోని మిగతా శాస్త్రవేత్తలెవరో తెలియబర్చలేదు. తమ మిషన్‌కి నేతృత్వం వహించేది శరత్‌చంద్ర అనే విషయం మాత్రమే అందరికీ తెలుసు. అందుకే ఒక్కొక్కరు లోపలికి రావడంతోటే అప్పటికే గదిలో ఉన్న సభ్యులు “ఓహ్.. మీరు కూడా ఉన్నారన్మాట. చాలా సంతోషం. అడోనిస్ గ్రహం మీద మీలాంటి శాస్త్రవేత్తల అవసరం ఎంతైనా ఉంది” అంటూ ఆహ్వానం పలుకుతున్నారు.

అందరికంటే ముందొచ్చింది శరత్‌చంద్ర. ఆ తర్వాత నతాలియా, షియోచెంగ్, ఇషిత, ఒలీవియా, డేనియల్ చేరుకున్నారు.

“ఆరుగురు సభ్యుల్లో ఐదుగురం వచ్చేశాం. ఆ ఆరో వ్యక్తి ఎవరో తెల్సుకోవాలని చాలా ఉత్కంఠగా ఉంది తెలుసా?” అంది నతాలియా. ఐదున్నర అడుగుల పొడవుతో, తెల్లని మేనిచాయతో, అయస్కాంతం లా ఆకర్షించే అందమైన నవ్వుతో, కలివిడిగా గలగలా మాట్లాడుతున్న నతాలియా కొన్ని నిమిషాల్లోని మిగతా అందరికీ ఆత్మీయురాలైంది.

“మనలో ప్రతి ఒక్కరిని చాలా ఆలోచించి ఎన్నుకున్నారనిపిస్తోంది. నతాలియా ఆస్ట్రో బయాలజీ సైంటిష్ట్. కొత్త గ్రహం మీదున్న జీవజాతుల్ని అధ్యయనం చేయడానికి, వాటి ప్రవర్తనను అర్థం చేసుకోడానికి ఆమె విజ్ఞానం పనికొస్తుంది. యిక షియోచెంగ్ ప్రపంచంలో ఉన్న వైరాలజిష్ట్ందరి కన్నా గొప్పవాడు. అడోనిస్ గ్రహం మీద మనకు తెలియని కొత్త వైరస్‌ల ఉనికిని కనుక్కోడానికి అతను అవసరం. డేనియల్, శరత్చద్ర ఆస్ట్రో ఫిజిసిస్టులు. ఈ అంతరిక్ష ప్రయాణం విజయవంతం కావడానికి వాళ్ళెంత ముఖ్యమో మ నందరికీ తెలుసు. ఒలీవియా ప్లాంట్ ఫిజియాలజీలో పేరెన్నికగన్న శాస్త్రజ్ఞురాలు. నేనేమో అగ్రికల్చరల్ సైంటిష్ట్‌ని. అక్కడ పంటలు పండించడంలో నా సలహాలు ఉపయోగపడతాయి. మరి ఆ ఆరో వ్యక్తి ఏ సబ్జెక్ట్ నిష్ణాతుడై ఉంటాడని మీరనుకుంటున్నారు?” అంది ఇషిత.

వాళ్ళందరి వయసులు ముప్పయ్ ఐదు నలభైకి మధ్యలో ఉన్నాయి. వయసులో వాళ్ళకన్నా శరత్‌చంద్ర పెద్దవాడు. అతనికి నలభై నాలుగేళ్ళు. అందరూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారు. ఇషిత అయితే ఉరుకుతున్న నదిలా, కొండమీదనుంచి దుముకుతున్న జలపాతంలా ఉంది.

“మనకు రక్షణగా మిలటరీ ఆఫీసర్ని ఎవర్నయినా పంపుతారేమో?” అన్నాడు డేనియల్.

“మిలటరీ ఆఫీసర్ ఎందుకు? అడోనిస్ గ్రహం అహింసకు మారుపేరని పొగిడారుగా. మనకు రక్షణ అవసరం ఏముంటుంది? ఎవర్నుంచి లేదా దేన్నుంచి రక్షణ అవసరమని మీ అభిప్రాయం?” అని అడిగింది ఇషిత.

“మన కమాండర్ శరత్‌చంద్ర వెలిబుచ్చిన అనుమానాలు నాలో కూడా ఉన్నాయి. ఆ గ్రహం మీద మాంసాహార జంతువులు ఉండే అవకాశం ఉంది. వాటి వల్లనే కాదు, ప్రమాదం ఎటునుంచైనా రావొచ్చు. మనం వూహించని జంతువుల వల్లనో పక్షుల వల్లనో ప్రమాదం కలగొచ్చు. మనం విజ్ఞానశాస్త్రాల్ని ఔపోసన పట్టిన మేధావులం తప్ప బలవంతులం కాదు. పోరాడలేం. అందుకే మనకు రక్షణగా ఆయుధాలు ధరించిన మిలటరీ ఆఫీసర్ అవసరం” అన్నాడు డేనియల్.

“ఆయుధాలు కూడానా?” అంది ఇషిత.

“ఆయుధాలు లేకుండా మిలటరీ ఆఫీసర్ మనల్నెలా కాపాడతాడు? అక్కడ మనుషుల్ని పోలిన మనుషులు ఆవిర్భవించలేదంటే నమ్మకం కలగడం లేదు. కెమెరా కళ్ళకు కన్పించకుండా ఎక్కడైనా దాక్కుని ఉండొచ్చు. నేల మాళిగల్లో ఉన్నారేమో ఎవరికి తెలుసు. ఒకవేళ నిజంగానే అటువంటి మానవాకృతులు ఉండి, మన మీద దాడి చేస్తే మన పరిస్థితి ఏమిటి?” అంది ఒలీవియా.

అప్పటివరకు మౌనంగా ఉండి వాళ్ళ మాటలు వింటున్న శరత్‌చంద్ర నోరు విప్పాడు. “అక్కడ మనుషుల్ని పోలిన జీవులు ఉన్నారని నాకనిపించడంలేదు. వాళ్ళు నేలమాళిగల్లో దాక్కునిఉన్నా వాళ్ళ శరీరాల నుంచి వెలువడే హీట్ రేడియేషన్‌ని రోవర్‌కి ఉన్న సెన్సార్లు గ్రహించి ఉండేవి. కిలోమీటరు దూరంలో ఉన్న ప్రాణుల కదలికల్ని గ్రహించి, రికార్డు చేసే ఎక్విప్‌మెం‍ట్‌ని చిటేకిలో కూడా అమర్చారు. అలాగని అటువంటి జీవులే ఆవిర్భవించలేదని చెప్పడం అహేతుకంగా అన్పిస్తోంది. సైన్స్ సూత్రాలకు విరుద్ధంగా ఏదీ జరగదు. కొన్ని దశాబ్దాల క్రితమో శతాబ్దాల క్రితమో మనలాంటి బుద్ధి జీవులు ఆ గ్రహం మీద తిరుగాడి ఉంటారని నా నమ్మకం” అన్నాడు.

“మరి వాళ్ళిప్పుడు ఎందుకు లేకుండా పోయారు?” డేనియల్ అడిగాడు.

“తెలియదు. మనం అక్కడికెళ్ళాక ఆ విషయం తెల్సుకోవాలి. ఇదంతా నా వూహ మాత్రమే. నిజం కాకపోచ్చు కూడా” అన్నాడు శరత్.

“మీ ఉద్దేశంలో మనకు రక్షణ అవసరం లేదంటారా?” అని అడిగింది ఒలీవియా.

“తప్పకుండా అవసరం. మనం వెళ్తాంది దాని గురించి పూర్తిగా తెలియని ఓ కొత్త గ్రహం మీదికి. అక్కడ ఎన్ని రహస్యాలు దాగున్నాయో, ఎన్ని ప్రమాదాలు పొంచిఉన్నాయో మనకు తెలియదు. చిటేలి మర మనిషి. అతను తిరుగాడిన వారం రోజుల్లో అతని దృష్టిలోకి ఏ ప్రమాదమూ వచ్చిఉండకపోవచ్చు. రక్తమాంసాలున్న మనుషులు కొన్ని నెలలు బస చేస్తే గానీ అర్థం కాదు” అన్నాడు శరత్.

“అంటే నిజంగానే ఒక మిలటరీ యోధుణ్ణి మనకు తోడుగా పంపుతారంటారా?” ఇషిత అడిగింది.

“నాకలా అన్పించడం లేదు” అన్నాడు శరత్.

“మరి?” ఇషిత భృకుటి ముడివేసింది.

“మనతో పాటు ఆయుధాలు తీసుకెళ్ళడం అవసరమనిపిస్తోంది” అన్నాడు శరత్.

“మనతోనా? ఆయుధాలా? మనకు వాటిని ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు కదా. వాటిని ఉపయోగించడం తర్వాత సంగతి” అన్నాడు షియోచెంగ్.

“మారణాయుధాల్ని వాడటంలో కూడా శిక్షణ ఇవ్వమని అడుగుదాం” అన్నాడు శరత్.

“చాలా మంచి ఆలోచన. మన చేతిలో ఏకె 47 లేదా ఎమ్ 16 లాంటి ఆయుధం ఉంటే ఆ ధైర్యమే వేరుగా ఉంటుంది” ఉత్సాహపడిపోతూ అంది నతాలియా.

“ఏ కాలంలో ఉన్నారు మేడం? ఏకె 47 లేదా ఎమ్ 16 చాలా పాతకాలం నాటి ఆయుధాలు. మనం లేజర్ గన్స్ కావాలని అడుగుదాం. వాటితో పాటు ప్లాస్మా ఆయుధాల్ని కూడా తీస్కెళ్ళడం మంచిది” అన్నాడు శరత్.

అదే సమయంలో సుముగి లోపలికొస్తూ ఓ టేబుల్ చుట్టూ కూచుని కబుర్లు చెప్పుకుంటున్న ఆరుగుర్ని ఉద్దేశించి “హాయ్” అంటూ చేయి వూపింది. ఒక్కొక్కరితో కరచాలనం చేస్తూ “నేను డాక్టర్ సుముగి” అంటూ తన్ను తాను పరిచయం చేసుకుంది.

“చూశారా మనం మన టీంలో ఓ డాక్టర్ ఉండాల్సిన అవసరాన్ని ఎంత సులభంగా మర్చిపోయామో. మనలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలొస్తే నయం చేయడానికి ఓ డాక్టర్ ఉండాలి కదా. అడోనిస్ గ్రహం మీద మెడికల్ షాపులేమీ ఉండవుగా.. ఏదో ఓ టాబ్లెట్ కొనుక్కుని మింగడానికి” అంటూ నవ్వింది నతాలియా. సుముగి వైపు తిరిగి, “మీరు మీతోపాటు ఓ సంచినిండా మందు బిళ్ళలు, ఇంజెక్షన్లు మోసుకు రావడం మర్చిపోవద్దు సుమీ” అంటూ మరోసారి నవ్వింది.

ఓ కుర్చీని టేబుల్‌కి దగ్గరగా లాక్కుని అందులో కూచున్నాక సుముగి అంది. “అసలు మీకెవ్వరికీ డాక్టర్ అవసరం రాదు. అయినా ఈ మిషన్‌లో నన్నెందుకు చేర్చారో నాకిప్పటికీ అర్థం కావడం లేదు.”

“అదేంటి? ఆ గ్రహంలో మాకు జబ్బులే రావని ఎలా అనుకుంటారు? కొత్త వాతావరణం కదా. జ్వరాలు రావొచ్చు, శ్వాసకోశ సమస్యలు రావొచ్చు. కొత్త వైరస్‌లో బ్యాక్టీరియాలో మన శరీరంలోకి దూరి, మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు కదా” అంది ఇషిత.

“మనలో ఎవ్వరికీ అటువంటి ఇబ్బంది తలెత్తే అవకాశమే లేదు. ఎందుకంటే మన శిక్షణ పూర్తయ్యాక, స్పేస్ షిప్‌లోకి ప్రవేశించే ముందే మన రక్తంలోకి న్యానోరోబోట్స్‌ని ఎక్కిస్తారు. ఒక్కో న్యానోరోబోట్ ఒక మైక్రాన్ కన్నా తక్కువ వ్యాసం కలిగిన పరిమాణంలో ఉంటుంది. వీటిలో వేర్వేరు భాగాలు కలిసుంటాయి. ఒక్కో విభాగం ఒకటి నుంచి వంద న్యానోమీటర్ల సైజులో ఉంటుంది. న్యానోమీటర్ అంటే ఎంతో తెలుసా? ఒక మీటర్లో బిలియంత్ వంతు. అంటే న్యానోరోబోట్స్ దాదాపు వైరస్ పరిమాణంలో ఉంటాయి” అంది సుముగి.

“వాటి గురించి నేను విన్నాను. కానీ వాటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియదు. చెప్పండి తెల్సుకుంటాను” అంది ఇషిత.

“ఇందాక చెప్పానే న్యానోరోబోట్స్‌లో చిన్నచిన్న భాగాలు చాలా ఉంటాయని. వాటిలో ఓ చిన్న కెమెరా, పేలోడ్, కెపాసిటర్, ఈదడానికి అవసరమయ్యే తోక కూడా ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడబోతున్న జబ్బుల్ని ముందే పసిగడ్తాయి. జబ్బుల్ని నయం చేసే మందుల్ని సరిగ్గా జబ్బుపడిన శరీరభాగంలోకి చేరుస్తాయి. గాయాలు తొందరగా నయం కావడంలో సహాయపడ్డాయి. శరీరం ఇన్ఫెక్షన్‌కి లోనైనప్పుడు న్యానో బోట్స్ రోగకారక క్రిముల్ని సంహరిస్తాయి. జీన్స్‌లో అవసరమైన మరమ్మత్తులు కూడా ఇవి చేయగలవు. ఇప్పుడు చెప్పండి. మీ శరీరాల్లోకి న్యానోబోట్స్‌ని ఎక్కించాక, నాలాంటి డాక్టర్ అవసరం ఏముంటుంది?” అంది సుముగి.

“ప్రతిభతో పాటు అనుభవం గల మీలాంటి డాక్టర్ అవసరం తప్పకుండా ఉంటుంది డాక్టర్ సుముగి” అన్నాడు శరత్. “న్యానోబోట్స్ పంపే సమాచారాన్ని క్రోడీకరించి, రోగ నిర్ధారణ చేయాలన్నా, వాటి పనితనాన్ని పర్యవేక్షించాలన్నా, అవసరమైన మందుల్ని వాటి ద్వారా పంపాలన్నా మీరుండాలి కదా.”

“కొంతవరకు మీరు చెప్పేది నిజమే. సూచెస్ వేయాల్సినంత పెద్ద గాయాలైనపుడు డాక్టర్ అవసరం ఉంటుంది. ఏదైనా ఆపరేషన్ అవసరమైనా డాక్టర్ ఉండాలి. కానీ అటువంటి పరిస్థితులు అడోనిస్ గ్రహం మీద ఎదురౌతాయని నేననుకోను” అంది సుముగి.

“కొత్త గ్రహం కదా. కీడెంచి మేలెంచడం మంచిది” నవ్వుతూ అన్నాడు శరత్.

వాళ్ళ ట్రెయినింగ్ మొదలైంది.

రెండొందల ముప్పయ్ రోజులు స్పేస్ షిప్‌లో అందుబాటులో ఉన్న ఆ కొద్ది స్థలంలో గడపాలంటే వ్యోమగాములకు మొదట అవసరమైంది మానసిక స్థిరత్వం. అటువంటి సందర్భాల్లో మనుషులు డిప్రెషన్‌కి లోనయ్యే ప్రమాదముంది.

మనసుతో పాటు శరీరాన్ని కూడా దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకవసరమైన బలవర్థకమైన ఆహారంతో పాటు వ్యాయామాలు కూడా శిక్షణలో భాగం చేశారు. స్పేస్‌షిప్‌లో ఉన్న ముఖ్యమైన భాగాల గురించి అవగాహన కల్పించారు. ఒకవేళ స్పేస్‌షిప్‌లో ఏదైనా సమస్య ఏర్పడితే గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుంచే రిమోట్ ద్వారా దాన్ని సరిదిద్దుతారు. కొన్నిసార్లు గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయే ప్రమాదముంది. అటువంటప్పుడు షిప్ లోపలినుంచే ఎలా రిపేరు చేయాలో నేర్పారు.

వ్యోమనౌకలో ఉన్న మాస్టర్ కంట్రోల్ ప్యానెల్ గురించి, దాన్లో ఉన్న రకరకాల మీటలు నిర్వహించే పనుల గురించి నేర్పించారు.

మిషన్‌కి నేతృత్వం వహిస్తున్నది శరత్ అయినప్పటికీ, అందరికీ స్పేసిపిని ఆపరేట్ చేయడంతో పాటు అన్ని రకాల విధులు ఎలా నిర్వహించాలో నేర్పించారు. ఒకవేళ నేతృత్వం వహిస్తున్న వ్యక్తి కొన్ని కా రణాల వల్ల స్పేసి షిప్ని నడపలేని స్థితికి చేరుకుంటే, మరొకరు ఆ స్థానాన్ని భర్తీ చేయడం కోసం తీసుకున్న జాగ్రత్త అది.

ట్రెయినింగ్ చివరి రోజు రాబర్ట్ ల్యూసిడ్ వాళ్ళందరి కోసం విందు ఏర్పాటు చేశాడు. దానికి భార్గవని కూడా ఆహ్వానించాడు.

మరునాడు ఉదయం నాలుగింటికి స్పేస్‌షిప్‌ బయల్దేరుతుంది. దానికి ‘ఉడానోస్’ అని పేరు పెట్టారు. దానికి అనుసంధానమై ఉన్న ల్యాండర్‌కి ‘స్కాఫోస్’ అని నామకరణం చేశారు.

అందరూ ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ విందు భోజనం చేస్తున్నారు. వివిధ రకాల రుచికరమైన వంటకాలు.. రేపటినుంచి మరో ఏడాదివరకు వాళ్ళకు అటువంటి స్వాదిష్టమైన భోజనం అందుబాటులో ఉండదు. రుచికన్నా పోషకాలకు ప్రాధాన్యమిచ్చే భోజనపదార్థాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

“ఉడానోస్‌లో చేయబోయే రెండొందల ముప్పయ్ రోజుల ప్రయాణం భయపెట్టడం లేదు గానీ అన్ని రోజులు రుచీపచీ లేని భోజనం తిని ఎలా బతకాలో అర్థం కావడం లేదు. అసలే నేను భోజన ప్రియురాల్ని. రోజూ నాన్వెజ్ తినందే ఉండలేను” తన ఎదురుగా కూచుని ఉన్న షియోచెంగ్‌తో నవ్వుతూ అంది నతాలియా.

షియోచెంగ్ తన కుర్చీలో అసహనంగా కదిలాడు. “బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా అన్ని రోజులు ఓ స్పేస్‌షిప్‌లో గడపడం నాలాంటివాడికి చాలా కష్టం తెలుసా? నాకు ధారాళమైన గాలీ వెల్తురు ఉండే గదులిష్టం” అన్నాడు.

“స్పేస్‌షిప్‌లో వెల్తురుకేం తక్కువుండదుగా” అంది నతాలియా.

“వెల్తురంటే ఎలక్ట్రిసిటీతోనో, అణువిద్యుత్తోనో ఏర్పడే అసహజమైన వెల్తురు కాదు. సూర్యరశ్మి వల్ల ఏర్పడే సహజమైన వెల్తురు” అన్నాడు షియోచెంగ్.

“మనం చాలా అదృష్టవంతులం. కొన్ని వందల సంవత్సరాల క్రితం వ్యోమగాములు భారరహిత స్థితిలో స్పేస్‌షిప్‌లో గడపాల్సి వచ్చేది. జీరో గ్రావిటీలో తినడానికి సౌకర్యంగా ఉన్న పదార్థాలే ఆహారంగా ఇచ్చేవాళ్ళు. తిరగాలన్నా, పడుకోవాలన్నా ఇబ్బందిగానే ఉండేది. కానీ ఇప్పుడలా కాదు. స్పేస్‌షిప్‌లో ఆర్టిఫిషియల్ గ్రావిటీని ఏర్పాటుచేసే అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది. భూమ్మీద మన పనుల్ని ఎలా చేసుకుంటామో అంతే సునాయాసంగా స్పేస్‌షిప్‌లో కూడా చేసుకోవచ్చు” అన్నాడు డేనియల్.

శరత్ తన పక్కన కూచునిఉన్న ఇషితతో మెల్లగా మాట్లాడుతూనే భోజనాన్ని ఆస్వాదిస్తున్నాడు. అందరి మొహాల్లో ఉద్విగ్నత.. రేపు మొదలయ్యే సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణం గురించి ఆలోచిస్తూ ఉండటం వల్ల ఏర్పడిన ఉత్కంఠ.. టైటాన్‌బోల్ట్‌ని తప్పించి మిగతా అందరి మొహాలు విరబూసిన పువ్వుల్లా వెలిగిపోతు న్నాయి.

నోవాస్పార్క్ పక్కన కూచుని ఉన్న టైటాన్‍బోల్ట్ మొహంలో ఏదో తెలీని అలజడి, ఒత్తిడికి లోనవుతున్న దానికి గుర్తుగా చిరాగ్గా ఉన్నాడు.

ఆండ్రాయిడ్లు కాబట్టి వాటికి తిండీ నీరూ నిద్రా ఇవేవీ అవసరం లేదు.

నోరూరించే షడ్రసోపేతమైన పదార్థాల్ని తింటూ మెల్లగా మాట్లాడుకుంటున్నవాళ్ళ వైపు చూస్తూ “ఎందుకలా ఉన్నావు బోల్ట్? మనకు రుచులెలా ఉంటాయో తెలియనందుకు బాధగా ఉందా? వాళ్ళలా మనం తిండిని ఆస్వాదించలేకపోతున్నామే అని దిగులు పడ్తున్నావా?” అంది నోవాస్పార్క్.

“లేదు. వాళ్ళతో పోలిస్తే మనం చాలా అదృష్టవంతులం. తిండికోసం నానా అగచాట్లు పడాల్సిన అవసరం లేదు. మనిషి ఆవిర్భవించినప్పటినుంచి తిండి కోసం, నీటి కోసం ఎన్ని యుద్ధాలు జరిగాయో, ఎంత మంది హతమైనారో మనకు తెలుసు కదా. నాకు మనుషులంటే జాలి తప్ప అసూయ లేదు.”

“మరెందుకలా ఏదో కోల్పోయినట్టు మొహమంతా వేలాడేసుకుని ఉన్నావు?”

“ఈ మిషన్ విజయవంతమౌతుందని నాకనిపించడం లేదు. అడోనిస్ గ్రహాన్ని చేరుకునేలోపలే స్పేస్‌షిప్‌ కూలిపోతుంది. అందరూ చనిపోతారు. వాళ్ళతో పాటు నువ్వూ నేను కూడా.. అది తల్చుకుంటేనే దిగులుగా ఉంది.”

గింది. “స్పేస్‌షిప్‌ కూలిపోతుందా? అందరూ చనిపోతారా? నీకెలా తెలుసు?” ఆందోళనకు లోతూ అడిగింది.

“నాకు తెలుసు.”

“అదే ఎలా తెలుసు?”

“నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది” విషణ్ణ వదనంతో అన్నాడు.

“చాల్లే జోకులు.. సిక్స్త్ సెన్స్ అనేది మనుషులకుంటుంది. మనకింకా అది అందుబాటులోకి రాలేదు. భవిష్యత్తులో వస్తుందేమో. నిజం చెప్పు. నీకెందుకలా అన్పిస్తోంది?”

“అన్పించడం కాదు. అలానే జరుగుతుందని నాకు తెలుసు. అందుకే దిగులు.”

నోవా అతని వైపు పరిశీలనగా చూసింది. అతను జోక్ చేయడం లేదని, నిజమే చెప్తున్నాడని అతని మొహం చూడగానే అర్థమైంది.

“ఇంతకూ నువ్వు దిగులు పడ్తున్నది మిషన్ విజయవంతం కాదనా లేకపోతే స్పేస్‌షిప్‌లోని మనుషు లందరూ చనిపోతారనా?” అని అడిగింది.

“కాదు. వాళ్ళతో పాటు మనం కూడా మిగలం కదా. అందుకు. నేను మన గురించి ఎన్ని కలలు కన్నానో తెలుసా?” అన్నాడు బోల్ట్.

నోవా అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. “కలలా? మన గురించా? ఏమిటవి?”

“జీవితాంతం నీతో కలిసుండాలనే కల.. నా ఆనందానుభూతుల్ని నీతో పంచుకోవాలనే కల..”

“నాకెప్పుడూ చెప్పలేదెందుకు?”

“సరైన సమయం కోసం ఎదురుచూశాను. ఇటువంటి పరిస్థితుల్లో నీతో చెప్పాల్సివస్తుందని ఎప్పుడూ వూహించలేదు. స్పేస్‌షిప్‌తో పాటు మన శరీరాలు తునాతునకలైపోతాయి. నాకు నా గురించి దిగుల్లేదు. దిగులంతా నీ గురించే. నువ్వు ముక్కలు కావడం భరించలేను” అన్నాడు.

నోవా కొన్ని క్షణాలు ఆలోచించాక చెప్పింది. “నీకా విషయం ఖచ్చితంగా తెలిస్తే, ప్రమాదం జరక్కుండా ఆపొచ్చు కదా. అందర్నీ కాపాడవచ్చు కదా.”

“అది నా చేతుల్లో లేదు. నేనేమీ చేయలేను.”

“పోనీ నీకు తెల్సిన విషయాన్ని శరత్‌చంద్రకో భార్గవగారికో చెప్పి ఆపించవచ్చు కదా.”

“అదీ చేయలేను. నేను అశక్తుణ్ణి.”

“కనీసం ఆ విషయమేదో నాకు చెప్పు. ప్రమాదం జరక్కుండా ఆపడానికి నేను ప్రయత్నిస్తాను.”

“చెప్పలేను. జరిగే ఉపద్రవాన్ని ఎవ్వరూ ఆపలేరు” అతను లేచి వేగంగా బైటికెళ్ళిపోయాడు.

అప్పుడు సమయం రాత్రి పది గంటలు దాటింది.

డిన్నర్ పూర్తి కావడంతో అందరూ తమకు కేటాయించిన గదుల్లోకి పడుకోడానికి వెళ్ళిపోయారు.

నోవా కూడా గదిలోకి వెళ్ళి కళ్ళు మూసుకుని పడుకుంది. ఆమెకు రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. బోల్ట్ బైటికెళ్ళి చాలాసేపైంది. ఎక్కడికెళ్ళాడు? ఎందుకెళ్ళాడు? స్పేస్‌షిప్ అడోనిస్ గ్రహాన్ని చేరుకోదని, మధ్యలోనే పేలిపోతుందని అతనికెలా తెలుసు? ఎవరు చెప్పారతనికి? స్పేస్‌షిప్‌ని పేల్చాల్సిన అవసరం ఎవరికుంది? ఈ మిషన్ వల్ల ఎవరికి నష్టం? భూమ్మీద మిగిలున్న కొద్దిమంది మనుషుల్ని క్షేమంగా మరో గ్రహం మీదకి చేర్చడం కోసం చేస్తున్న ప్రయత్నాన్ని భగ్నం చేయాలని అనుకుంటున్నదెవరు? తమ ప్రాణాల్ని కాపాడుకోవాలని తాపత్రయపడ్తున్న మనషుల్లోనే శత్రువులున్నారా? అదెలా సంభవం?

బోల్ట్‌కి తన పక్క గదే కేటాయించారు కాబట్టి అతను తిరిగొచ్చినపుడు విన్పించే శబ్దం కోసం నోవా చెవులు రిక్కించి వినసాగింది.

బోల్ట్ మెల్లగా నడుచుకుంటూ స్పేస్‌షిప్‌ లాంచింగ్ స్టేషన్‌ని చేరుకున్నాడు. అక్కడ దేదీప్యమానంగా వెలుగుతున్న విద్యుద్దీపాల కాంతిలో రాజసంగా నిలబడి ఉంది స్పేస్‌షిప్‌ ఉడానోస్. అది రెండువేల ఐదొందల అడుగుల పొడవు, మధ్యభాగంలో మూడు వందల అడుగుల వెడల్పుతో ఉంది. రెండువైపులకి వెళ్ళేకొద్దీ కొద్దికొద్దిగా వెడల్పు తగ్గుతూ చివర్లలో యాభై అడుగుల వెడల్పు మాత్రమే ఉంది.

బోల్ట్ దాని లోపలికి ప్రవేశించాడు. అతనికి ఉడానోస్ స్పేస్‌షిప్‌ లోని ప్రతి అంగుళం పరిచయమే. దాని నిర్మాణ సమయంలో స్పేస్‌క్రాఫ్ట్ ఇంజనీర్లతో పాటు అతని నైపుణ్యం కూడా ఉపయోగపడింది. అందులో వాడిన యంత్రాలు, వాటి పనితనం, స్పేస్‌షిప్‌ని ఎలా నడపాలి, ఏ మీట తిప్పితే ఏమౌతుంది, ఏదైనా టెక్నికల్ సమస్య ఏర్పడితే దాన్ని ఎలా సరిదిద్దాలి.. ఇత్యాదులన్నీ అతనికి కరతలామలకాలు.

అతను స్పేస్‍షిప్ యొక్క మదర్ కంట్రోల్ ప్యానెల్ని సమీపించాడు. గంటసేపు శ్రమించి అందులో తను అనుకున్న విధంగా సర్కూట్స్‌లో మార్పులు చేశాడు. వాటికి టైమర్ అమర్చాడు. అతను సెట్ చేసిన టైంకి సర్క్యూట్‌లు ఒకటొకటిగా కాలిపోతాయి. స్పేస్‌షిప్‌లోని భాగాలు మాల్‌ఫంక్షన్‌కి లోనౌతాయి. ఒక్కో రక్షణ వ్యవస్థ పనిచేయడం మానేస్తుంది. మొదట ఓ గదిలో మంటలు మొదలై ఉడానోస్ మొత్తాన్ని ఆక్రమిస్తాయి. అతను సంతృప్తిగా తలపంకించి, తమ కోసం కేటాయించిన విశ్రాంతి గదుల వైపుకి నడిచాడు.

అతని రాక కోసమే ఎదురుచూస్తున్న నోవా అడుగుల చప్పుడు విన్పించడంతో వెంటనే తలుపు తీసుకుని బైటికొచ్చింది.

అప్పుడే బోల్ట్ తన గది తలుపు తీయబోతున్నాడు.

“ఇంతసేపూ ఎక్కడికెళ్ళావు?” అని అడిగింది.

“విసుగ్గా ఉందని చెప్పాను కదా. అలా ఆరుబయట చల్లగాలిలో కొద్దిసేపు తిరిగొస్తే బావుంటుందేమో అని వెళ్ళాను” అన్నాడు.

“నిజం చెప్పు. ఎక్కడికెళ్ళావు? ఏం చేయడానికెళ్ళావు?” నోవా గొంతులో అసహనం..

“నిజమే చెప్తున్నా.. వాకింగ్‌కి వెళ్ళొచ్చాను.”

అతను అబద్ధం చెప్తున్నాడని నోవాకి తెలుస్తోంది. అతన్నుంచి నిజం రాబట్టడానికి ఏం చేయాలో అర్థం కాలేదు.

అతనే స్పేస్‌షిప్‌కి ప్రమాదం తలపెడ్తున్నాడన్న అనుమానం మాత్రం రాలేదు.

(ఇంకా ఉంది)

Exit mobile version