[సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన సైన్స్ ఫిక్షన్ నవలిక ‘గ్రహాంతర అన్వేషణ’ను ధారావాహిక అందిస్తున్నాము.]
[మిషన్ అడోనిస్లో పాల్గొనే శాస్త్రవేత్తలకు నాసా ముఖ్య కేంద్రంలో శిక్షణ మొదలవుతుంది. పాల్గొనేవారికి మాత్రమే సమాచారమివ్వడం వల్ల, తోటివారెవరో వారికి తెలియదు. ముందుగా శరత్చంద్ర. ఆ తర్వాత నతాలియా, షియోచెంగ్, ఇషిత, ఒలీవియా, డేనియల్ అక్కడికి చేరుకుంటారు. ఆరో వ్యక్తి ఎవరయి ఉంటారని ఆ అయిదుగురు రకరకాల ఊహాగానాలు చేస్తారు. ఇంతలో, డాక్టర్ సుముగి అక్కడికి వచ్చి వారిని పరిచయం చేసుకుంటుంది. ఆరో వ్యక్తి వైద్యురాలని గ్రహిస్తారు. వారి శిక్షణ మొదలవుతుంది. మనసుతో పాటు శరీరాన్ని కూడా దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి కాబట్టి బలవర్థకమైన ఆహారంతో పాటు వ్యాయామాలు కూడా శిక్షణలో భాగం చేశారు. ఒకవేళ గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోతో, షిప్ లోపలినుంచే ఎలా రిపేరు చేయాలో నేర్పుతారు. ప్రతి ఒక్కరూ అన్ని సాంకేతిక అంశాలను నేర్చుకుంటారు. స్పేస్షిప్కి ఉడానోస్ అని పేరు పెడతారు. మర్నాడు బయల్దేరుతారనగా, శాస్త్రవేత్తలకి విందు ఏర్పాటు చేస్తారు. వాళ్ళంతా ఆ హడావిడిలో ఉంటే, వాళ్ళకి దూరంగా ఆండ్రాయిడ్లు నోవా, బోల్ట్ మాట్లాడుకుంటుంటారు. ఈ మిషన్ విజయవంతమౌతుందని అనిపించడం లేదని, అడోనిస్ గ్రహాన్ని చేరుకునేలోపలే స్పేస్‌షిప్ కూలిపోయి అందరూ చనిపోతారని అంటాడు బోల్డ్. పైగా జరిగే ఉపద్రవాన్ని ఎవరూ ఆపలేరని అంటాడు. భోజనాలు ముగించి శాస్త్రవేత్తలంతా తమ గదుల్లోకి వెళ్ళి నిద్రకి ఉపక్రమిస్తారు. నోవా, బోల్ట్ చెప్పిన ఉపద్రవం గురించి ఆలోచిస్తుంది. ఈలోపు బోల్ట్ నెమ్మదిగా స్పేస్‌షిప్ లోకి ఎక్కి మదర్ కంట్రోల్ ప్యానెల్‌ని సమీపించి తను అనుకున్న విధంగా సర్కూట్స్‌లో మార్పులు చేస్తాడు. వాటికి టైమర్ అమర్చి ఒక్కో సర్క్యూట్ నిర్ధరిత టైమ్‌కి కాలిపోయేలా చేస్తాడు. ఏమీ ఎరగనట్టు తన గదికి వచ్చేస్తాడు. బోల్ట్ తన గది తలుపు తీయబోతుంటే, నోవా వచ్చి, ఎక్కడికి వెళ్ళావ్, ఏం చేసొచ్చావు అని అడుగుతుంది. ఏదో సమాధానం చెప్పి తప్పించుకుంటాడు. అతను అబద్ధం చెప్తున్నాడని గ్రహిస్తుంది నోవా. అతనే స్పేస్షిప్కి ప్రమాదం తలపెడ్తున్నాడన్న అనుమానం మాత్రం ఆమెలో కలగదు. – ఇక చదవండి.]
మరునాడుదయం సరిగ్గా నాలుగింటికి నిప్పులు చిమ్ముకుంటూ వ్యోమనౌక ఆకాశంలోకి దూసుకుపోయింది. శిక్షణలో భాగంగా రోజుకు పది గంటలు సిమ్యులేటర్ రూంలో గడపడం వల్ల శరత్ మరియు అతని బృందానికి ఉడానోస్లో ప్రయాణం కొత్తగా అన్పించలేదు. పైపెచ్చు సౌకర్యవంతంగా కూడా అన్పించింది. సిమ్యులేటర్ గది అచ్చం స్పేస్‌షిప్‌లో మదర్ కంట్రోల్ బోర్డ్ ఉన్న గదిలానే ఉంటుంది. అత్యంత వేగంతో కదుల్తున్న అనుభూతితో పాటు స్పేస్‌షిప్‌లో ప్రయాణం చేసేటప్పుడు విన్పించే శబ్దాలు, కుదుపులు కూడా అనుభవంలోకి వచ్చేలా చేస్తారు. దాన్ని షటిల్ మిషన్ సిమ్యులేటర్ అంటారు. అందులో మోషన్ బేస్ సిమ్యులేటర్, ఫిక్సెడ్ బేస్ సిమ్యులేటర్, గైడెన్స్ అండ్ న్యావిగేషన్ సిమ్యులేటర్ అనే మూడు రకాల సిమ్యులేటర్లు కలిసి ఉంటాయి.
శరత్చంద్ర మదర్ కంట్రోల్ బోర్డు దగ్గర కూచుని ఉన్నాడు. డిస్ప్లే బోర్డ్ మీద స్పేస్‌షిప్ ప్రయాణిస్తున్న వేగం, చేరుకుంటున్న ఎత్తు, ఫ్యూయల్, ఆర్టిఫిషియల్ గ్రావిటీ, టెంపరేచర్, ఆక్సిజన్లతో పాటు ప్రైమరీ మరియు సెకండరీ అటామిక్ పార్టికిల్ డిఫ్లెక్టర్స్, లార్జ్ ఆబ్జెక్ట్ డిఫ్లెక్టర్స్ యొక్క ఎఫిషియన్సీ.. ఇత్యాదులు కన్పిస్తున్నాయి.
ప్రయాణం మొదలైన రోజునుంచి వాళ్ళ దినచర్యలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. కండరాల పుష్టి కోసం, ఎముకల సాంద్రతని కాపాడుకోవడం కోసం రోజూ రెండు గంటలు ఎక్సర్సైజ్ చేయడం తప్పనిసరైంది. భోజనంలో చికెన్ సూప్, మష్రూం క్రీం, మెకరోని, చికెన్, పప్పు, రైస్, ఉడకబెట్టిన కోడిగుడ్లు ఉంటున్నాయి. ఆహారం మితంగా తీసుకోవడం, మంచినీటిని అవసరమైనంత మేరకే తాగడం అలవాటు చేసుకున్నారు. పడుకోడానికి వేరే గదులున్నాయి. వాటిలో మెత్తటి పరుపులు వేసిఉన్నాయి. గదిని వీలైనంత చీకటిగా చేసుకునే అవకాశం ఉంది.
చంద్రుడ్ని దాటిపోతున్న సమాచారం డిస్ప్లే బోర్డు మీద కన్పించి మాయమైంది. కొంతకాలం ప్రయాణం తర్వాత మార్స్ గ్రహాన్ని దాటిపోయారు. ఆస్టరాయిడ్ బెల్ట్‌ని దాటుతున్న సమయంలో లార్జ్ ఆబ్జెక్ట్ డిఫ్లెక్టర్ల అవసరమే రాలేదు.
జూపిటర్, శాటర్న్ గ్రహాల్ని కూడా దాటేశారు.
నెప్ట్యూన్ గ్రహం దాటాక ఎదురయ్యే కైపర్ బెల్ట్ లోకి స్పేస్‌షిప్ ప్రవేశించింది. ఆస్టరాయిడ్ బెల్ట్ కన్నా ఇరవై రెట్ల వైశాల్యంతో, దాదాపు వంద రెట్ల ద్రవ్యరాశితో ఉండి, తోకచుక్కల్ని, మరుగుజ్జు గ్రహాల్ని, ఐస్ గడ్డకట్టిన మీథేన్, అమ్మోనియాలాంటి వాయువుల్ని కలిగిఉన్న బెల్ట్ అది.
దాన్ని దాటే సమయంలో శరత్చంద్ర బోల్ట్, నోవాల సహాయం తీసుకున్నాడు. స్పేస్‌షిప్ క్షేమంగా దాన్ని దాటేసింది.
స్పేస్ షిప్ వూర్ట్ క్లౌడ్ని దాటింది. సౌరవ్యవస్థకు సరిహద్దులాంటి వూర్ట్ క్లౌడ్ ట్రిలియన్ల కొద్దీ మంచుతో నిండిన శకలాలు, తోకచుక్కలతో నిండిఉంటుంది. దాన్ని దాటాక వచ్చేదే ఇంటర్స్టెల్లార్ స్పేస్. ఇందులో నక్షత్రాలుకానీ గ్రహాలు కానీ మరే ఇతర ఖగోళపదార్థాలు కానీ ఉండవు. కాస్మిక్ కిరణాలతో, ధూళితో, వాయువుల్తో నిండిఉంటుంది.
శరత్ గ్రౌండ్ కంట్రోల్‌కి వూర్ట్ క్లౌడ్ని దాటినట్టు సమాచారమిచ్చాడు.
ప్రయాణం సాఫీగా సాగుతోంది.
ఆ రోజు పడుకునే సమయం అయినప్పుడు మాస్టర్ కంట్రోల్ ప్యానెల్‌ని పర్యవేక్షించే బాధ్యత ఇషిత తీసుకుంది. వాళ్ళు పడుకోవడం కోసం రెండు గదుల్లో పడకలు ఏర్పాటు చేయబడిఉన్నాయి. ఒక్కో గదిలో నాలుగు మంచాలు, వాటి మీద మెత్తటి పరుపులు, దిండ్లు వేసి ఉన్నాయి. మగవాళ్ళు ఓ గదిలోకి, ఆడవాళ్ళు మరో గదిలోకి వెళ్ళి నిద్రకుపక్రమించారు.
బోల్ట్, నోవాలకు నిద్ర అవసరం లేదు కాబట్టి మాస్టర్ కంట్రోల్ ప్యానెల్ ఉన్న గదిలోనే ఇషితకు వెనకాలున్న కుర్చీల్లో కూచుని కబుర్లు చెప్పుకుంటున్నారు.
“నీవి ఉత్త భయాలని ఇప్పటికైనా అర్థమైందా?” అంది నోవా.
బోల్ట్ ఆమె వైపు అర్థం కానట్టు చూశాడు.
“అదే.. భూగ్రహం మీద మనం గడిపిన చివరి రోజు రాత్రి చెప్పావే.. స్పేస్‌షిప్ పేలిపోతుందని, మనమందరం చచ్చిపోతామని.. ఆ విషయం.. అది నీ భ్రమ అని తేలిపోయిందిగా. అంతరిక్షంలోకి ప్రయాణం మొదలై నాలుగు నెలలు దాటింది. ఎటువంటి అవాంతరమూ లేకుండా మన ఉడానోస్ ఎలా దూసుకుపోతుందో చూశావా?” అంది నవ్వుతూ.
“ఇంకా చాలా ప్రయాణం మిగిలే ఉంది. ఆ లోపల ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు” అన్నాడు బోల్ట్.
“ఎందుకెప్పుడూ నెగటివ్ గానే ఆలోచిస్తావు? నీలో నాకేదో తేడా అన్పిస్తోంది. ఆండ్రాయిడ్లలో అమర్చే చిప్‌లలో కోపం, పగ, ప్రతీకారం, నిరాశ, నిస్పృహ ల్లాంటి నెగటివ్ లక్షణాలు లేకుండా అన్నీ పాజిటివ్ లక్షణాల్నే పొందుపరుస్తారుగా.”
“ఏమో.. నా చిప్‌లో ఏ లక్షణాల్ని పొందుపరిచారో నాకేం తెలుసు. మనుషుల్లో పాజిటివ్, నెగటివ్ లక్షణాలు కలిసి ఉంటాయిగా. ఆ రకంగా ఆలోచిస్తే నేను ఆండ్రాయిడ్ దశనుంచి మనిషి దశలోకి మారు తున్నట్టు లెక్క. మనకు శుభపరిణామమేగా” అంటూ నవ్వాడు బోల్ట్.
మగవాళ్ళు పడుకుంటున్న గదిలో మంచం మీద అస్థిమితంగా దొర్లుతున్నాడు శరత్. ఎంత ప్రయత్నించినా అతనికి నిద్ర రావడం లేదు. కొన్ని గంటల ముందే రేడియో మైక్రోఫోన్స్, స్పీకర్ల సహాయంతో తన భార్యతో, పన్నెండేళ్ళ కూతురితో మాట్లాడాడు. ‘నువ్వెప్పుడు తిరిగొస్తావు నాన్నా? నిన్ను చాలా మిస్ అవుతున్నాను నాన్నా’ అంటూ కూతురు ఏడ్వడంతో అతని మనసు వికలమైపోయింది. భూమ్మీద మిగులున్న మానవాళి శ్రేయస్సు కోసం త్యాగాలు చేయక తప్పదని అతనికి తెలుసు. కానీ అతని తండ్రి హృదయం మాత్రం కూతురి కన్నీళ్ళను తల్చుకుని తల్లడిల్లిపోతోంది.
అతను లేచి మంచం మధ్యలో బాసింపట్టు వేసుకుని కూచున్నాడు.
కొద్దిసేపు బైటికెళ్ళి తిరిగొస్తే బావుంటుందనిపించింది.
మంచం దిగుతున్నప్పుడు షియోచెంగ్ గొంతు విన్పించింది. “నిద్ర పట్టడం లేదా కమాండర్?”
“నువ్వు నిద్రపోలేదా?” అన్నాడు శరత్.
“లేదు. నీ తర్వాత నేను కూడా నా భార్యాపిల్లల్తో మాట్లాడానుగా. కుటుంబ సభ్యులతో మాట్లాడి నిద్రపట్టక కొట్టుకోవడం మనకలవాటేగా” అన్నాడు లేచి కూచుంటూ.
“నిజమే. ఆ కారణంవల్లనే నాకూ నిద్ర రావడంలేదు” అంటూ డేనియల్ కూడా లేచికూచున్నాడు.
“ఎలాగూ మేల్కొనే ఉన్నాంగా. అలా తిరిగొద్దాం వస్తారా?” అన్నాడు శరత్.
“కమాండర్ ఆజ్ఞాపించాక కాదని ఎలా అంటాం?” అంటూ షియోచెంగ్ లేచి నిలబడ్డాడు. అతనితో పాటు డేనియల్ కూడా బయల్దేరాడు.
అదే సమయంలో డిస్ప్లే బోర్డ్ మీద కన్పిస్తున్న సిగ్నలింగ్ మెసేజ్‌ని చూసి కంగారుపడ్తూ “నోవా.. బోల్ట్.. ప్లీజ్ తొందరగా రండి. స్పేస్‌షిప్ ఏదో పెద్ద సమస్య వచ్చినట్టుంది. వెంటనే దాన్ని సరిదిద్దకపోతే చాలా ప్రమాదం. ప్లీజ్ బీ క్విక్” అని అరిచింది ఇషిత.
కబుర్లలో మునిగున్న నోవా, బోల్ట్ అప్రమత్తమై, మాస్టర్ కంట్రోల్ ప్యానెల్ వైపు పరుగెత్తారు. ప్రైమరీ అటామిక్ పార్టికిల్ డిఫ్లెక్టర్ షట్‌డౌన్ కాబోతుందన్న మెసేజ్ డిస్ప్లే బోర్డ్ మీద వెలుగుతూ ఆరుతూ కన్పిస్తోంది.
కొన్ని క్షణాల వ్యవధిలోనే డిఫ్లెక్టర్ సమర్థత ఇరవై శాతానికి పడిపోయినట్టు మెసేజ్ కన్పించింది. వెంటనే రెడ్ లైట్ వెలిగింది. దాంతో పాటు ప్రమాదాన్ని సూచించే అలారం మోగసాగింది.
అక్కడే నిలబడిఉన్న బోల్ట్ అలారం మోగకుండా వెంటనే స్విచాఫ్ చేశాడు.
“ఎందుకు స్విచాఫ్ చేశావు? ప్రమాద హెచ్చరిక అందరికీ తెలియాలిగా. ముఖ్యంగా నిద్రలో ఉన్న మిగతా ఆరుగురు సభ్యులకు” కోపంగా అంది నోవా.
“ఏదో టెక్నికల్ స్నాగ్ ఏర్పడింది. స్పేస్‌షిప్ ఏదైనా సమస్య ఉత్పన్నమైతే రిపేర్ చేయడంలో మనిద్దరం సిద్ధహస్తులం కదా. క్షణాల్లో రిపేర్ చేయగలం. అంతదానికి పడుకుంటున్న వాళ్ళకు నిద్రాభంగం కలిగించాల్సిన అవసరమేముంది? అందుకే స్విచాఫ్ చేశాను” అన్నాడు బోల్ట్.
అతనిచ్చిన సంజాయిషీ ఆమెకు అసంబద్ధంగా అన్పించింది.
ఆమె ఆలస్యం చేయకుండా కంట్రోల్ ప్యానెల్స్‌ని పరీక్షించసాగింది.
ఈలోపల ప్రైమరీ డిప్లెక్టర్ సామర్థ్యం జీరోకు పడిపోయింది.
ప్రైమరీ అటామిక్ పార్టికిల్ డిఫ్లెక్టర్ సామర్థ్యం ఏవో కారణాలవల్ల తగ్గిపోతే, వెంటనే సెకండరీ డిఫ్లెక్టర్ పనిచేయడం ప్రారంభించాలి. కానీ అలా ఎందుకు జరగలేదో నోవాకి అర్థం కాలేదు.
వాటి సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్స్ లోకి వెళ్ళి పరీక్షించింది. ప్రైమరీ డిప్లెక్టర్ సామర్థ్యం యాభైకన్నా తక్కువకు పడిపోతే, వెంటనే సెకండరీ డిప్లెక్టర్ పనిచేయడం మొదలెట్టాలి అనే కమాండ్ కన్పించలేదు. స్పేస్‌షిప్ భూమ్మీదనుంచి బయల్దేరకముందు తనా కమాండ్ని చూసింది. మరి ఇప్పుడేమైంది? ఎవరు దాన్ని మార్చారు? ఎప్పుడు మార్చిఉంటారు?
ఆలోచిస్తూనే ఆమె ఆ కమాండ్ని పునరుద్ధరించింది. వెంటనే సెకండరీ డిప్లెక్టర్ పని చేయసాగింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొన్ని నిమిషాల వరకు స్పేస్‌షిప్ రక్షణ కవచంలా పనిచేసే అటామిక్ పార్టికిల్ డిఫ్లెక్టర్ పనిచేయలేదు. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ డిప్లెక్టర్ షీల్డ్ ఉండటం వల్లనే అతి ప్రమాదకరమైన కాస్మిక్ రేడియేషన్ నుంచి, మిగతా అయోనైజ్డ్ పార్టికిల్స్ నుంచి స్పేస్‌షిప్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న వ్యోమగాములకు రక్షణ లభిస్తుంది.
మగవాళ్ళు నిద్రించే గది అత్యంత తీవ్రమైన కాస్మిక్ రేడియేషన్‌కి లోనైంది. అదృష్టవశాత్తూ అందులో మనుషులెవరూ లేనందువల్ల బతికిపోయారు. లేకపోతే కాలి బూడిదైపోయి ఉండేవారు. ఆ గదిలో మంటలు చెలరేగాయి.
అప్పటికే ఇషిత వద్దకు చేరుకున్న శరత్‌కి, మిగతా ఇద్దరికీ జరిగిన ప్రమాదమేమిటో అర్థమైంది. వెంటనే అప్రమత్తమై, ఆ గదిలో చెలరేగిన మంటలు మిగతా గదులకు వ్యాపించకుండా ఆర్పేశారు. ఆ శబ్దాలకు నిద్రపోతున్న ముగ్గురు ఆడవాళ్ళు కూడా బైటికి పరుగెత్తుకుంటూ వచ్చేశారు.
ఇంజన్ రూంలో ప్రైమరీ డిఫ్లెక్టర్ పనిచేసేలా చేయడం కోసం మరమ్మత్తులు చేస్తున్న నోవా, బోల్ట్ లను సమీపించి, “ఏం జరిగింది?” అని అడిగాడు శరత్.
“డిఫ్లెక్టర్ల కంప్యూటర్ సిస్టంలోకి ఎవరో వైరస్ ప్రవేశపెట్టడం వల్ల అది కరప్ట్ అయింది కమాండర్” అన్నాడు బోల్ట్.
“కంప్యూటర్ సిస్టంలోకి వైరస్ ప్రవేశపెట్టారా? ఎప్పుడు చేసి ఉంటారా పని? ఎవరు చేసిఉంటారు?” వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు శరత్.
“స్పేస్‌షిప్ భూమ్మీద ఉన్నప్పుడే జరిగిఉండాలి.”
“మరి ఇంత ప్రయాణం సజావుగా సాగిందిగా. ఇప్పుడే ప్రమాదం ఎలా జరిగింది?”
“ఆ కమాండ్‌కి టైమర్ అమర్చారు. అప్పటివరకు అది నిద్రావస్థలో ఉండిపోయింది. వాళ్ళు సెట్ చేసిన సమయం పూర్తికాగానే ఆపరేషన్ లోకి వచ్చింది.”
“ఎవరు చేసి ఉంటారని నీ అనుమానం?” శరత్ అడిగాడు.
“చెప్పలేం కమాండర్. స్పేస్‌షిప్ తన ప్రయాణాన్ని మొదలెట్టకముందు ఎంతోమంది ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, వివిధ శాఖలకు చెందిన నిపుణులు దానిలోపలికి వెళ్ళిరావడం జరిగింది. వాళ్ళలో ఎవరైనా చేసిఉండొచ్చు” అన్నాడు బోల్ట్.
“ప్రైమరీ డిఫ్లెక్టర్ని రిపేర్ చేయడానికి ఎంత సమయం పడ్తుంది?” అని అడిగాడు శరత్.
“మరో ముప్పయ్ నిమిషాలు చాలు కమాండర్” అన్నాడు బోల్ట్.
“సరే. తొందరగా కానివ్వండి. మిగతా సిస్టమ్స్ కూడా కరప్ట్ అయ్యేలా ఏమైనా కమాండ్స్ ఉన్నాయే మో చూడండి” అన్నాడు శరత్.
“అది కనుక్కోవడం కష్టం కమాండర్. టైమర్‌తో అనుసంధానించి ఆ ఆగంతకుడెవడో ఇచ్చిన సీక్రెట్ కమాండ్స్ బైటికి కన్పించవు. టైమర్‌లో సెట్ చేసిన సమయం వచ్చినపుడే అవి కన్పిస్తాయి. అప్పటివరకు డార్మెంట్‌గా ఎక్కడో దాక్కుని ఉంటాయి. వాడెవడో గానీ చాలా తెలివిగలవాడనిపిస్తోంది. స్పేస్‌షిప్ నిర్మాణం గురించి, దానికి సంబంధించిన ఇంజనీరింగ్ విభాగాల గురించి, కంప్యూటర్ బేస్డ్ న్యావిగేషన్ గురించి అ తనికి మంచి అవగాహన ఉండిఉండాలి” అన్నాడు బోల్ట్.
“అతనికన్నా మనం మేధావులమని నిరూపించుకోవాలి కదా. అటువంటి డార్మెంట్ కమాండ్స్ ఏమైనా ఉన్నాయేమో వెతకండి” అనేసి శరత్ బైటికొచ్చేశాడు.
అతని మనసంతా పచ్చిపుండులా ఉంది. నిద్రపట్టక ముగ్గురూ బైటికి రాబట్టి సరిపోయింది గానీ లేకపోతే ఎప్పుడో చనిపోయి ఉండేవారు. సెకండరీ డిఫ్లెక్టర్ని ఆన్ చేయడం మరికొన్ని నిమిషాలు ఆలస్యమై ఉంటే స్పేస్‌షిప్‌లో ఉన్న అందరూ రేడియేషన్‌కి లోనై ప్రాణాలు కోల్పోయి ఉండేవారు. ఇటువంటి ఘాతుకానికి ఎవరు పాల్పడిఉంటారు? ఈ మిషన్‌ని భగ్నం చేయడం వల్ల వాళ్ళకు ఒనగూడే లాభమేంటి? ఎంత ఆలోచించినా ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు.
నోవా ప్రైమరీ డిఫ్లెక్టర్లో ఏర్పడిన సమస్యను సరిదిద్దే ప్రయత్నంలో ఉంటే బోల్ట్ మిగతా సిస్టమ్స్ కరప్ట్ అయ్యే ప్రమాదమేదైనా ఉందేమోనని పరిశీలించసాగాడు.
శరత్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌ని సంప్రదించడానికి ప్రయత్నించాడు. మైక్రోఫోన్లు, స్పీకర్లు ఏవీ పని చేయడం లేదు.
అతను బోల్ట్‌ని సమీపించి, “కమ్యూనికేషన్ సిస్టం పనిచేయడం లేదు. సమస్యేంటో తొందరగా చూడు. జరిగిన ప్రమాదం గురించి గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌కి రిపోర్ట్ చేయాలి” అన్నాడు.
“ఇప్పుడే చూస్తాను కమాండర్” అంటూ బోల్ట్ కమ్యూనికేషన్ సిస్టంని పరిశీలించాడు.
శరత్ వైపు తిరిగి “సారీ కమాండర్. కమ్యూనికేషన్ సిస్టం పనిచేయడంలేదు” అన్నాడు.
“పనిచేయడం లేదని నేనే చెప్పాగా. రిపేర్ చేయండి” విసుగ్గా అన్నాడు శరత్.
“సారీ. రిపేర్ చేయడానికి అవకాశం లేనంతగా సిస్టం కరఫ్ట్ అయింది. ఇది కూడా టైమర్ అమర్చిన కమాండ్స్ వల్ల జరిగిన అనర్థమే. మనమేం చేయలేం” అన్నాడు బోల్ట్.
అప్పటికే నోవా ప్రైమరీ డిఫ్లెక్టర్లో ఏర్పడిన సమస్యను సరిదిద్దింది. అది పని చేయడం ప్రారంభించడంతో కొన్ని క్షణాల తర్వాత సెకండరీ డిఫ్లెక్టర్ ఆఫ్ అయిపోయింది.
బోల్ట్ పాటు నోవా కూడా మిగతా సిస్టమ్స్ పనితీరుని పరిశీలించడంలో నిమగ్నమైపోయింది.
శరత్ కణతలు రుద్దుకుంటూ బైటికి రావడం చూసిన డేనియల్ ముందుకెళ్ళి “ఈ ప్రమాదం ఎలా జరిగింది?” అని అడిగాడు.
అతని సమాధానం వినడం కోసం అందరూ అతని చుట్టూ గుమికూడారు.
“ఎవరో మన కంప్యూటర్లలోకి వైరస్‌ని ఎక్కించి వాటికి టైమర్లని అమర్చారు. డిఫ్లెక్టర్లకి సంబంధించిన కంపూటర్ ప్రోగ్రాం కరప్ట్ కావడంవల్లనే అవి పనిచేయలేదు. ఇప్పుడు కమ్యూనికేషన్ సిస్టం కూడా పనిచేయడం లేదు” విషణ్ణవదనంతో అన్నాడు శరత్.
“ఒకవేళ అన్ని సిస్టంలలోకి టైమర్‌తో పనిచేసే వైరస్లని ఎక్కించిఉంటే మన పరిస్థితి ఏమిటి? ఎప్పుడు ఏ సిస్టం పనిచేయడం మానేస్తుందో మనకు తెలియదు. ఎవరో కావాలనే మనల్ని చంపడానికి, స్పేస్‌షిప్‌ని ధ్వంసం చేయడానికి కుట్ర పన్నారు. వాళ్ళు ఎవరై ఉంటారు?” అన్నాడు డేనియల్.
“అతనెవరో తెల్సుకోవడం ఇప్పుడు ముఖ్యం కాదు. ఈ సమస్యనుంచి ఎలా బయటపడాలో ఆలోచించడం అవసరం. కంప్యూటర్లలోని వైరస్‌ని తొలగిస్తే చాలు కదా. సమస్య పరిష్కారమౌతుంది” అన్నాడు షియోచెంగ్.
“అంతరిక్షనౌకలో వాడే కంప్యూటర్ సిస్టంలకు సంబంధించిన పూర్తి జ్ఞానం ఉన్నవాళ్ళు అనే కదా మనతో పాటు బోల్ట్‌ని, నోవాని పంపించారు. ఆ పని వాళ్ళకే సాధ్యం. ప్రస్తుతం వాళ్ళిద్దరూ మన కంప్యూటర్లని ప్రక్షాళన చేసే పనిలోనే ఉన్నారు” అన్నాడు శరత్. వైరస్ డార్మెంట్‌గా ఉంటుందన్న విషయం, దాన్ని కనుక్కోవడం కష్టమన్న విషయం మాత్రం చెప్పలేదు.
“ఇందాకటినుంచి నాలో ఓ అనుమానం చెదపురుగులా తొలుస్తోంది” అంది నతాలియా.
“ఏంటది?” అని అడిగింది ఇషిత.
“ఒకవేళ ఆ బ్లాక్ షీప్ మన స్పేస్‌షిప్ లోనే ఉంటే? మనం ఇప్పుడు వైరస్లని తొలగించినా వాడు లేక ఆమె మళ్ళా వైరస్లని ఎక్కించి సిస్టంలని కరప్ట్ చేయరని గ్యారంటీ ఏమిటి?” అంది నతాలియా.
అందరిలో ఒక్కసారిగా భయం రాజుకుంది. అదే నిజమైతే తమ పరిస్థితి ఏమిటి? తమలో ఉన్న ఆ బ్లాక్ షీప్ ఎవరు? అనే ఆలోచనల్తో కొన్ని క్షణాలు అందరూ నిశ్శబ్దమైపోయారు.
“నీ అనుమానం లాజిక్‌కి అందదు నతాలియా” నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ అన్నాడు శరత్. “అది అర్థరహితమైన ఆలోచన. మనందరం మన మన రంగాల్లో నిష్ణాతులం. ప్రజల శ్రేయస్సు కోసమే ఈ మిషన్‌లో భాగస్వాములమైనాం. మనల్ని ఎన్నుకునేముందు, తర్వాత కూడా మానసిక శాస్త్రవేత్తల ద్వారా మన స్వభావాల్ని క్షుణ్ణంగా పరిశీలించారు కదా. మన మనసుల్లో ప్రమాదకరమైన లక్షణాలేవీ లేవు. కాబట్టి మనలో ఒకరు ఈ పని చేసి ఉంటారనేది అసంభవం” అన్నాడు శరత్.
“మరో విషయం. ఒకవేళ మనలో ఎవరో ఒకరు ఈ పని చేసిఉంటే మనతో పాటు వాళ్ళు కూడా చచ్చిపోతారుగా. దానివల్ల వాళ్ళకు ఒరిగేదేమిటి? అలా ప్రాణత్యాగం చేసి సాధించేంత గొప్ప విషయమా అది? భూమ్మీద తమ ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న మనుషుల ఆశల్ని దుర్మార్గంగా కాలరాయడమేగా” అంది ఒలీవియా.
“ఇటువంటి దారుణమైన పని మనుషులెవరూ చేయరు. తాము కూచుని ఉన్న కొమ్మనే ఎవరైనా నరుక్కుంటారా?” అంది సుముగి.
“ఏలియన్స్” నతాలియా నోటినుంచి ఆ పదం వెలువడిన వెంటనే అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
“ఏలియన్సా? ఏ గ్రహవాసులని నీ అనుమానం? మన మిషన్‌ని భగ్నం చేయాలని ఎందుకనుకుంటున్నారు?” అని అడిగింది సుముగి.
“బహుశా అడోనిస్ గ్రహవాసులే కావచ్చు. వాళ్ళ గ్రహాన్ని మన భూగ్రహవాసులు ఆక్రమించుకోవడం వాళ్ళకు ఇష్టం లేకపోవచ్చు. మన స్పేస్‌షిప్‌ని రిమోట్ ద్వారా నియంత్రించగలుగుతున్నారంటే వాళ్ళు తప్పకుండా మేధోజీవులై ఉండాలి” అంది నతాలియా.
“అర్థరహితమైన అనుమానం. పైలట్ స్పేస్‌షటిల్ తీసిన ఫోటోల్లోగానీ, వీడియోల్లోగాని మనుషుల్లాంటి జీవులు కన్పించలేదుగా. ఒకవేళ ఆ గ్రహం మీద ఏలియన్స్ ఉండిఉంటే ఏమైపోయినట్టు?” అంది ఇషిత.
“ఏమో చెప్పలేం. వాళ్ళు మన వూహకు అందని రూపాల్లో సంచరిస్తూ ఉండొచ్చుగా. వాళ్ళు కెమెరా కంటికి కన్పిస్తూ ఉన్నా ఏలియన్స్ అని గుర్తించలేకపోయామేమో” అంది నతాలియా.
“అదే నిజమైతే అడోనిస్ గ్రహం మీద మనకోసం ప్రమాదాలు ఎదురుచూస్తున్నట్టే” అన్నాడు షియోచెంగ్.
నతాలియా వెలిబుచ్చిన అభిప్రాయం హేతుబద్ధంగా ఉండటంతో అందరూ ఆలోచనలో పడ్డారు.
(ఇంకా ఉంది)
సలీం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కథా, నవలా రచయిత. మానవత్వం ఉట్టిపడే రచనలకు పెట్టింది పేరు. “రూపాయి చెట్టు”, “ఒంటరి శరీరం”, “రాణీగారి కథలు”, “నీటిపుట్ట” వీరి కథా సంపుటులు. “కాలుతున్న పూలతోట”, “అనూహ్య పెళ్ళి”, “గుర్రపు డెక్క”, “వెండి మేఘం” వంటివి వీరి నవలలు.
