Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గ్రహాంతర అన్వేషణ-4

[సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన సైన్స్ ఫిక్షన్ నవలిక ‘గ్రహాంతర అన్వేషణ’ను ధారావాహిక అందిస్తున్నాము.]

[శరత్‌చంద్ర, మిగతా ఐదుగురు శాస్త్రవేత్తలు; ఆండ్రాయిడ్ రోబోలు నోవా, బోల్ట్ ఎక్కిన వ్యోమనౌక అంతరిక్షంలోకి దూసుకుపోతుంది. మొదట చంద్రుడిని, వారం తరువాత మార్స్ గ్రహాన్ని, ఆస్టరాయిడ్ బెల్ట్‌ని, జూపిటర్, శాటర్న్ గ్రహాలని దాటేస్తారు. ఆ తర్వాత నెప్ట్యూన్ గ్ర్హాన్ని, కైపర్ బెల్ట్‌ని దాటుతుంది వ్యోమనౌక. మూడు నెలల ప్రయాణం తర్వాత, వూర్ట్ క్లౌడ్‌ని దాటుతుంది. మరో నెల రోజులు ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఓ రాత్రి నిద్రించే సమయం ఆసన్నమైనప్పుడు మాస్టర్ కంట్రోల్ ప్యానెల్ని పర్యవేక్షించే బాధ్యత ఇషిత తీసుకుంటుది. నిద్ర పట్టక,శరత్‌చంద్ర, షియోచెంగ్‌లు తమ గదుల్లోంచి బయటకొస్తారు. మెలకువగా ఉన్న డేనియల్ కూడా బయటకు వస్తాడు. ఈలోపు డిస్‌ప్లే బోర్డ్ మీద ఓ ప్రమాద హెచ్చరిక కనబడుతుంది. ప్రైమరీ అటామిక్ పార్టికిల్ డిఫ్లెక్టర్ షట్‌డౌన్ అయిపోతుంది. ఆటోమేటిక్‌గా ఆన్ అవ్వాల్సిన సెకండరీ డిఫ్లెక్టర్ పనిచేయడం మొదలుపెట్టదు. నోవా వాటి ప్రోగ్రామింగ్ పరిశీలిస్తుంది. సెకండరీ డిఫ్లెక్టర్ పనిచేయకుండా ఎవరో కమాండ్‌ని మార్చినట్టు గుర్తించి, వెంటనే దాన్ని సరిచేస్తుంది. కానీ అప్పటికే నష్టం జరిగిపోతుంది. మగవాళ్ళు నిద్రించే గది అత్యంత తీవ్రమైన కాస్మిక్ రేడియేషన్‌కి, మంటలు చెలరేగుతాయి. మగవాళ్ళు ముగ్గురు బయట ఉన్నందున్న, బ్రతికిపోతారు. శరత్, మిగతావాళ్ళు మంటలని ఆర్పుతారు. ఏం జరిగిందని శరత్ నోవా, బోల్ట్‌లని అడిగితే, డిఫ్లెక్టర్ల కంప్యూటర్ సిస్టంలోకి ఎవరో వైరస్ ప్రవేశపెట్టడం వల్ల అది కరప్ట్ అయిందని చెప్తాడు బోల్ట్. ఇన్ని నెలలు ప్రయాణం సజావుగా సాగిందిగా, ఇప్పుడే ప్రమాదం ఎలా జరిగిందన్న శరత్ ప్రశ్నకు, ఆ కమాండ్‌కి టైమర్ అమర్చారని, సెట్ చేసిన సమయం వచ్చినప్పుడు ఆపరేషన్‌లోకి వచ్చిందని చెప్తాడు బోల్ట్. శరత్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌ని సంప్రదించడానికి ప్రయత్నిస్తాడు. మైక్రోఫోన్లు, స్పీకర్లు ఏవీ పని చేయవు. వాటిని వెంటనే బాగుచేయమని నోవా, బోల్ట్‌లని ఆదేశిస్తాడు. ద్రోహి ఎవరో తమలోనే ఉన్నారేమో అని అనుమానం వ్యక్తం చేస్తుంది నతాలియా. దాన్ని త్రోసిపుచ్చుతాడు శరత్. ఇది ఏలియన్స్ పనై ఉంటుందని భావిస్తారు. – ఇక చదవండి.]

రో నెల వరకు ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందీ తలెత్తలేదు.

ఏలియన్స్ రిమోట్ ద్వారా తమ స్పేస్‌షిప్‌కి నష్టం కలుగచేయాలని ప్రయత్నిస్తున్నారేమో అనే ఆలోచన నుంచి, భయం నుంచి మెల్లమెల్లగా బైటపడసాగారు.

ఆ రోజు మాస్టర్ కంట్రోల్ ప్యానెల్‌ని పర్యవేక్షించాల్సిన బాధ్యత సుముగీది. మిగతా ఆరుగురు అప్పటికే పడకగదుల్లో నిద్రలు పోతున్నారు.

ఎప్పటికి మల్లె వెనకున్న కుర్చీల్లో బోల్ట్, నోవా కూచుని ఉన్నారు. బోల్ట్ ఏదో మాట్లాడుతున్నా నోవా ఆసక్తిగా వినడం లేదు. ప్రైమరీ డిఫ్లెక్టర్ పనిచేయడం లేదని తెల్సుకుని, దాన్ని రిపేర్ చేయడానికి బోల్ట్ పాటు తను కూడా ఇంజన్ రూంలోకి వెళ్ళిన రోజునుంచి నోవా అతనితో ముభావంగా ఉంటోంది. ఆ రోజే మొదటిసారి ఆమెకు బోల్ట్ మీద అనుమానం వచ్చింది. కానీ తనా విషయాన్ని కమాండర్ దృష్టికి తీసుకెళ్ళలేదు. నిర్ధారించుకోకుండా, కేవలం అనుమానంతో అతని మీద ఆరోపణ చేయడం సబబు కాదని ఆగిపోయింది. ఆ క్షణం నుంచి బోల్ట్ కదలికల్ని ఆమె జాగ్రత్తగా గమనిస్తోంది.

ఆ రోజు తను ప్రైమరీ డిఫ్లెక్టర్ పనిచేసేలా చేయడం కోసం ప్రయత్నిస్తూనే మధ్యలో బోల్ట్ ఏం చేస్తున్నాడా అని అటువైపు చూసింది. అతని చేతిలో చిన్న కత్తెర ఉంది. దాంతో ఆక్సిజన్ లెవెల్స్‌ని నియంత్రించే ప్రైమరీ కనెక్షన్‌ని కట్ చేయబోతున్నాడు.

తను భయంతో కళ్ళు విప్పార్చి అతని వైపు చూస్తూ “బోల్ట్! ఏం చేయబోతున్నావు?” అని అరిచింది. వైర్లకు సమీపంగా ఉన్న కత్తెరని గబుక్కున వెనక్కి తీసుకుని, నోవా వైపు బోల్ట్ అయోమయంగా చూశాడు.

“ఆ కనెక్షన్ కట్ చేస్తే ఆక్సిజన్ సప్లయ్ ఆగిపోతుందని తెలుసు కదా. ఎంత ప్రమాదం! కొన్ని నిమిషాల వ్యవధిలోనే అందరూ చచ్చిపోయేవాళ్ళు. ఎందుకలా చేయాలనుకున్నావు? నిజం చెప్పు. లేకపోతే ఈ విషయం కమాండర్ దృష్టికి తీసుకెళ్ళాల్సి వస్తుంది” అంది తర్జనితో బెదిరిస్తూ.

“వద్దోద్దు. దయచేది ఎవ్వరికీ ఏమీ చెప్పకు. ఎందుకలా చేయబోయానో నాకే తెలియడం లేదు. ఏ దో ట్రాన్స్‌లో ఉండి చేస్తున్నాను. నన్ను నమ్ము. కొన్ని రోజులుగా చాలా అలజడికి లోనవుతున్నాను. దానివల్ల సవ్యంగా ఆలోచించలేకపోతున్నాను. అనుకోకుండా నా ద్వారా పొరపాట్లు జరిగిపోతున్నాయి. ఉద్దేశపూర్వకంగా నేనేమీ చేయడం లేదు. నన్ను క్షమించు” అన్నాడు బోల్ట్.

“సరే. నువ్వెళ్ళి విశ్రాంతి తీసుకో. మిగతా సిస్టమ్‌లను పరిశీలించే పని కూడా నేనే చేస్తాను” అంటూ అతన్ని బైటికి పంపించింది. ఏదో ట్రాన్స్‌లో ఉండి చేస్తున్నాను అన్న అతని మాటలు ఆమెకు నమ్మశక్యంగా అన్పించలేదు. అతనేదో రహస్యాన్ని దాస్తున్నాడని ఆమెకనిపించింది. అదేమిటో తెలిసేవరకు స్పేస్‌షిప్‌ని అతన్నుంచి కాపాడాల్సిన బాధ్యత తనదే అని బలంగా నిర్ణయించుకుంది.

బోల్ట్ “ఈ మధ్య నీలో చాలా మార్పొచ్చింది. ఒకప్పటిలా నాతో ప్రేమగా మాట్లాడటం లేదు” అన్నాడు

“ప్రేమగానా? నాన్సెన్స్. నాకెవరి మీద ప్రేమ లేదు. నువ్వలా భ్రమపడితే అది నా తప్పు కాదు. అటువంటి వికారాలకు నేను ఆమడ దూరం ఉంటాను. ఈ మిషన్‌లో నన్ను ఏ ఉద్దేశంతో భాగస్వామిని చేశారో దాన్ని నిర్వర్తించడం తప్ప మరో ఆలోచనకు తావులేదు” అంది నోవా.

“ప్రేమగా కాకున్నా స్నేహంగానైనా మాట్లాడేదానివిగా. ఇప్పుడెందుకు ముభావంగా ఉంటున్నావు?”

“ఒత్తిడి.. ఈ ప్రయాణం ఎటువంటి అవాంతరాలు లేకుండా సజావుగా సాగాలని పడ్తున్న ఒత్తిడి.. స్పేస్‌షిప్‌లో సమస్యలేవీ ఉత్పన్నం కాకూడదని పడ్తున్న ఒత్తిడి.”

“నీకెందుకు ఒత్తిడి? నేను కదా ఒత్తిడికి లోనవుతున్నాను” అన్నాడు బోల్ట్.

“నీకేం ఒత్తిడి?” అని అడగబోయేలోపల ఆమెను సుముగి పిల్చింది. “నోవా! ప్లీజ్ కొన్ని గంటలసేపు కంట్రోల్ ప్యానెల్ని చూసుకుంటావా? రెండు మూడు గంటలు చాలు. నిన్నరాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. తల భారంగా ఉంది. కళ్ళు మూతలు పడ్తున్నాయి. కొద్దిసేపు పడుకుంటాను. ప్లీజ్” అంది సుముగి.

“ఓకే మేడం. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. కంట్రోల్ ప్యానెల్ బాధ్యత నేను తీసుకుంటాను” లేచి నిలబడుతూ అంది నోవా.

“థ్యాంక్స్. మూడు గంటల తర్వాత నన్ను లేపు” అంటూ సుముగి పడక గదిలోకి వెళ్ళిపోయింది.

నోవా మాస్టర్ కంట్రోల్ ప్యానెల్ దగ్గర కూచుంది. డిస్‌ప్లే స్క్రీన్ మీద రకరకాల అంకెలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం స్పేస్‌షిప్ వేగం, ప్రయాణించిన దూరం, గమ్యస్థానం యింకెంత దూరంలో ఉంది అనే సమాచారంతోపాటు స్పేస్‌‍షిప్‌లో గాలి నాణ్యత, టెంపరేచర్, పీడనం, గ్రావిటీ కూడా కన్పిస్తున్నాయి.

సుముగి పడుకోడానికి వెళ్ళి గంటసేపు దాటి ఉంటుంది. నోవా డిస్‌ప్లే స్క్రీన్ మీద కన్పిస్తున్న అంకెల్ని జాగ్రత్తగా చూడసాగింది. స్పేస్‌షిప్‌లో పీడనం భూవాతావరణంలో ఉన్నట్టే ఒక చదరపు అంగుళానికి 14.7 పౌండ్లు ఉంది. చూపు పక్కకు తిప్పుకోబోతున్న సమయంలో అది 14.9 గా మారడం గమనించింది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే అది 30 పౌండ్లను దాటిపోసాగింది.

భయంతో నోవా వెనక్కి తిరిగి చూసింది. అక్కడ బోల్ట్ లేడు.

క్యాబిన్‌లో పీడనం వేగంగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. నోవా ఇంజన్ రూంలోకి పరుగెత్తింది. ప్రెషర్ కంట్రోల్ ప్యానెల్ కరప్ట్ అయిన విషయం గమనించింది. వెంటనే దాన్ని రిపేర్ చేయడం ప్రారంభించింది. క్షణక్షణానికి పీడనం పెరుగుతోంది. పీడనం మరింత పెరిగితే స్పేస్‌షిప్ పేలిపోయే ప్రమాదముంది. నోవా తన మేధస్సునంతా ఉపయోగించి ప్రెషర్ కంట్రోల్ ప్యానెల్ని యథాస్థితికి తీసుకురావడానికి ప్ర యత్నించసాగింది. పీడనం తీవ్రస్థాయికి చేరకముందే దాన్ని నియంత్రణలోకి తీసుకొచ్చింది. మళ్ళా స్పేస్ ప్లో పీడనం 14.7 పౌండ్ల దగ్గర స్థిరపడింది. స్పేస్‌షిప్‌ని పెద్ద ప్రమాదం నుంచి కాపాడినందుకు ఆమెకు తృప్తిగా అన్పించింది.

ఇంజన్ గదినుంచి బైటికొస్తూ బోల్ట్‌ని చూసింది. అతను యింతక్రితం కూర్చున్న కుర్చీలోనే కూచుని ఉన్నాడు.

“ప్రెషర్ కంట్రోల్ ప్యానెల్ని ఎందుకు కరప్ట్ చేశావు?” కోపంగా అడిగింది నోవా.

“నేనేం చేశాను? నేనసలు ఇంజిన్ గదిలోకే వెళ్ళలేదు” వంకరగా నవ్వుతూ అన్నాడు బోల్ట్.

“మరెందుకు ప్రెషర్ విపరీతంగా పెరిగిపోయింది?”

“ఏమో నాకేం తెలుసు.”

“యిందాక నేను యింజిన్ గదిలోకి వెళ్ళేసమయంలో నువ్వు లేవు. ఎక్కడికెళ్ళావు?”

“అలా నన్ను ప్రశ్నించే అధికారం ఒక్క కమాండర్‌కే ఉంది. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు” మెత్తగా నవ్వుతూనే చెప్పాడు. అతని నవ్వు కత్తిలా పదునుగా గుచ్చుకుని గాయం చేస్తోంది.

“సరే. స్పేస్‌షిప్ ప్రమాదంలో ఉన్నప్పుడు దాన్ని రక్షించే బాధ్యత మనిద్దరికీ అప్పగించబడింది కదా. యిందాక అనూహ్యంగా పీడనం పెరిగిపోయినపుడు నాతోపాటు నువ్వు కూడా దాన్ని సరిదిద్దే పనిలో భాగం పంచుకోవాలిగా. ఎందుకు నాకా పనిలో సహకరించలేదు?”

“నీ తెలివితేటల మీద నాకు అపారమైన నమ్మకం. నేను పక్కన లేకున్నా నువ్వొక్కదానివే సమస్య నుంచి బైటపడేయగలవన్న నమ్మకం. అందుకే లోపలికి రాలేదు” అన్నాడు బోల్ట్.

తనలో ఉప్పెనలా పొంగుకొస్తున్న కోపాన్ని నియంత్రించుకుంటూ “ఛీ.. ఆండ్రాయిడ్ల జాతికే కళంకం నువ్వు. నీతో నాకు మాటలేంటి?” అంది.

ఆమె వెళ్ళి మాస్టర్ కంట్రోల్ ప్యానెల్ దగ్గర కూచుని, తలయెత్తి డిస్‌ప్లే స్క్రీన్ వైపు చూస్తూ చిన్నగా కేక పెట్టింది. స్క్రీన్ మీది అంకెలన్నీ మాయమైపోయాయి. ఇప్పుడు స్క్రీన్ మీద ఏమీ కన్పించడం లేదు.

వెనక్కి తిరిగి బోల్ట్ వైపు చూస్తూ “డిస్‌ప్లే బోర్డు పనిచేయడం లేదేమిటి?” అంది.

“నన్నడుగుతావేంటి? నాకేం తెలుసు? నేనేమీ చేయలేదు” అన్నాడు బోల్ట్.

అతనితో వాదులాడి ప్రయోజనం లేదని అర్థమై, మళ్ళా ఇంజిన్ గదిలోకి వెళ్ళి డిస్‌ప్లే స్క్రీన్‌ని పునరుద్ధరించడానికి ప్రయత్నించింది. ఎంతసేపు పోరాడినా డిస్‌ప్లే స్క్రీన్‌లో ప్రాణం నింపలేకపోయింది. అది శాశ్వతంగా పాడైపోయింది.

నిద్రలేచాక విషయం తెల్సుకున్న శరత్చంద్ర చాలా వ్యాకులపాటుకు లోనయ్యాడు. “డిస్‌ప్లే స్క్రీన్ పనిచేయకపోతే చాలా కష్టం కదా. మనం చేరుకోవాల్సిన అడోనిస్ గ్రహం యింకా ఎన్ని మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉందో, స్పేస్‌షిప్ ఎంత వేగాన్ని అందుకుందో, అక్కడికి చేరుకోడానికి ఎన్ని రోజులు పడ్తుందో వంటి సమాచారమంతా తెల్సుకునేదెలా?” అన్నాడు.

“స్పేస్‍షిప్ బయల్దేరే ముందే అది చేరుకోవాల్సిన గమ్యస్థానం, దాని దూరం ఇత్యాదులన్నీ కంప్యూటర్‌లో ఫీడ్ చేసి పెట్టారుగా. మనకొచ్చే ఇబ్బందేమీ లేదు. స్పేస్‌షిప్ అడోనిస్ గ్రహానికి చేరుకున్నాకే ఆగుతుంది” అన్నాడు బోల్ట్.

అతను అదోలా నవ్వడాన్ని గమనించింది నోవా. ఒకవేళ స్పేస్‌షిప్ చేరుకోవాల్సిన గమ్యస్థానాన్ని కూడా ఎవరైనా మార్చిఉంటే?? కంప్యూటర్లో ఫీడ్ చేసిన కమాండ్స్‌ని చెరిపేసి, తిరగరాస్తే?? అసలా సమాచారం మొత్తం కరప్ట్ అయిఉంటే??

ఆమెకు చాలా భయమేసింది. ఒకవేళ కమాండ్‌ని చెరిపేసి, తిరగరాస్తే స్పేస్‌షిప్ ఏదో ఓ గ్రహాన్ని చేరుకుంటుంది. అలా కాకుండా మొత్తం సాఫ్ట్‌వేర్‌నే కరప్ట్ చేసుంటే అంతరిక్షంలోనే అందరి చావు తప్పదు.

“స్పేస్‌షిప్ భద్రత కోసం ఏర్పాటుచేసిన కంట్రోల్ ప్యానెల్స్ పని చేస్తున్నాయో లేదో తెల్సుకోవడం ఎలా? అటువంటి అతి ముఖ్యమైన వ్యవస్థల్లో ఏదైనా సమస్య ఏర్పడితే మనకెలా తెలుస్తుంది? హెచ్చరిక విన్పించదు. స్క్రీన్ మీద కన్పించదు. అలారం మోగదు. చాలా ప్రమాదం కదా” అన్నాడు శరత్.

“అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో నేను గమనించుకుంటూ ఉంటాను కమాండర్. మీరు నిశ్చింతగా ఉండండి. మీగ్గానీ స్పేస్‌షిప్ భద్రతకు గానీ ప్రమాదం రానివ్వను” అంది నోవా.

మరో నెల రోజుల పాటు ప్రయాణం జరిగింది. ఆ నెల రోజుల్లో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా నోవా జాగ్రత్తలు తీసుకుంది.

స్పేప్ ఏదో గ్రహానికి చెందిన కక్ష్యలోకి చేరుకుని దానిచుట్టూ తిరగసాగింది.

“మనం ఏ గ్రహాన్ని సమీపించామో అర్థం కావడం లేదు. అడోనిస్ గ్రహాన్ని చేరుకోవాలంటే యింకా చాలా రోజులు ప్రయాణించాలి కదా. ఎందుకు దారి మళ్ళి ఈ గ్రహ కక్ష్యలోకి ప్రవేశించాం?” ఆందోళన పడుతూ అన్నాడు శరత్.

మిగతా సభ్యులతో పాటు నోవాకి కూడా అర్థమైంది తమ స్పేస్షిప్ దారి తప్పి ఏదో గ్రహాన్ని చేరుకుందని.

“ఇప్పుడు మనమేం చేయాలి? గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌ని సంప్రదించడానికి కూడా వీల్లేకుండా సమాచార వ్యవస్థ మొత్తం పాడైందిగా” అందర్నీ ఉద్దేశించి అడిగాడు శరత్.

“మనం ఈ గ్రహం మీదకి దిగక తప్పదు కమాండర్. ఎవరో మన స్పేస్‌షిప్ చేరుకోవాల్సిన గమ్య స్థానాన్ని తిరగరాసి ఉంటారు” అంది నోవా.

“ఎవరు చేసి ఉంటారా పని?”

“ఇది తప్పకుండా ఏలియన్స్ పనే కమాండర్. మన కంప్యూటర్లని రిమోట్ కంట్రోల్ ద్వారా హ్యాక్ చేసి, కమాండ్స్‌ని మార్చి ఫీడ్ చేసి ఉంటారు” అన్నాడు బోల్ట్.

“మనం ఈ గ్రహంమీద దిగాల్సిన అవసరం ఏముంది?”

“ఇక్కడ దిగక తప్పదు. కంప్యూటర్లన్నిట్లో వైరస్‌లని ప్రవేశపెట్టారెవరో. ఆ వైరస్‌లు ఏమిటో కనుక్కుని, కంప్యూటర్లను వైరస్లు లేకుండా ప్రక్షాళన చేయాలి. తర్వాత కొత్తగా కమాండ్స్‌ని ఫీడ్ చేస్తే చాలు. మనం మళ్ళా ప్రయాణం మొదలెట్టి అడోనిస్ గ్రహాన్ని చేరుకోవచ్చు” అంది నోవా.

“దానికి ఎంత సమయం పడ్తుంది?”

“కనీసం నలభై ఎనిమిది గంటలు.”

“అంటే రెండు రోజులు మనకేమాత్రం పరిచయం లేని గ్రహం మీద గడపాలన్నమాట. అసలిది ఏ గ్రహమో, ఇక్కడి వాతావరణ పరిస్థితులేమిటో, మన స్పేస్‌షిప్ ల్యాండ్ కావడానికి ఈ గ్రహం అనుకూలమో కాదో తెల్సుకోకుండా దిగితే ప్రమాదం కదా” అన్నాడు శరత్.

“మనం అడోనిస్ గ్రహాన్ని చేరుకోవాలంటే ఈ రిస్క్ తీసుకోక తప్పదు కమాండర్” అంది నోవా.

***

పేరు తెలియని గ్రహం మీద ఉడానోస్ స్పేస్‌షిప్ ల్యాండ్ అయింది.

“బైటికి వెళ్ళకుండా యిక్కడే రెండు రోజులు గడిపేయడం మంచిదనిపిస్తోంది. ఈ లోపల నోవా అ వసరమైన రిపేర్లన్నీ చేసేస్తుంది. ఏమంటారు?” అంది ఒలీవియా.

నతాలియా ఆమెతో ఏకీభవించలేదు. “మనం ఓ కొత్త గ్రహాన్ని చేరుకున్నాం. దాని గురించి తెల్సు కోకుండా ఎలా? మనం శాస్త్రవేత్తలం. ఈ గ్రహంమీద ఎటువంటి వాతావరణం ఉందో, మట్టి ఎలాంటిదో, రాళ్ళు ఎలా ఏర్పడ్డాయో, నీటి జాడలున్నాయో లేవో, జీవం ఏమైనా ఉందేమోలాంటి వివరాలన్నిటినీ తెల్సుకోవాలిగా. నేను ఆస్ట్రో బయాలజీ సైంటిస్ట్‌ని. ఈ గ్రహం మీద వృక్ష జంతు సంబంధమైన జీవావరణ వ్యవస్థ ఉందేమో శోధించాలిగా” అంది.

సుముగి “ఈ గ్రహం గురించిన సమాచారం ఏమీ తెలియకుండా కిందికి దిగడం ప్రమాదం కదా” అంది

“నోవా డిస్‌ప్లే స్క్రీన్‌ని కూడా రిపేర్ చేస్తానంటోందిగా. అప్పుడీ గ్రహం పేరేమిటో, మన స్పైరల్ గెలాక్సీలో ఇది ఎక్కడుందో తెలిసిపోతుంది. మనం ల్యాండ్ రోవర్‌లో కదా ప్రయాణిస్తాం. దానిలోపల క్షేమంగా ఉంటాం. అదే ఈ గ్రహ ఉపరితలాన్ని ఫోటోలు తీస్తుంది. బైట ఎంత ఉష్ణోగ్రత ఉందో, గాలి నాణ్యత ఎలా ఉందో తెలియచేస్తుంది. మట్టి, రాళ్ళ శాంపిల్స్ కూడా తీసుకుంటుంది. భవిష్యత్తులో మనకీ సమాచారం ఉపయోగపడొచ్చు” అంది నతాలియా.

“విశ్వాంతరాళంలో ఉన్న ఓ కొత్త గ్రహం గురించి తెల్సుకునే అవకాశం వస్తే నాలాంటి ఖగోళ శాస్త్ర వేత్త ఎవ్వడూ వదులుకోడు. ఈ గ్రహంమీద సంచారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అన్నాడు డేనియల్.

“నిజమే. ఇది మనకు దొరికిన అరుదైన అవకాశం. వదులుకోకూడదు. నేను కూడా వెళ్తున్నాను. మీలో ఆసక్తి ఉన్నవాళ్ళు రావొచ్చు. లేనివాళ్ళు స్పేస్‌షిప్ లోనే విశ్రాంతి తీసుకోవచ్చు” అన్నాడు శరత్.

ఒలీవియా, నిషిత, షియోచెంగ్ కూడా కిందికి దిగి, కొత్త గ్రహాన్ని చూడటానికి సన్నద్ధమైనారు.

“మీరందరూ వెళ్ళిపోతే నేనొక్కదాన్ని ఇక్కడ ఉండి ఏంచేయాలి? నేనూ వస్తాను” అంది సుముగి.

అందరూ ముందు జాగ్రతగా స్పేస్‌స్యూట్స్ తొడుక్కున్నారు. ల్యాండ్ రోవర్ స్కాఫోస్‌లో సంచారానికి బయల్దేరారు. నేలంతా ఎక్కువగా రాళ్ళతో కప్పబడి, ఎగుడుదిగుడుగా ఉంది. ఎత్తయిన పర్వతాలు, విశాల మైన లోతైన బిలాలు చాలా చోట్ల కన్పించాయి. నీటి ఆనవాళ్ళుగానీ, జీవరాశి గానీ ఏమీ కన్పించలేదు.

రోవర్ గంటకు ముప్పయ్ కిలోమీటర్ల వేగంతో మెల్లగా ముందు కదుల్తోంది. దానికి అమర్చి ఉన్న కెమెరాలు ఫోటోలతో పాటు వీడియోలు కూడా తీస్తున్నాయి.

బైట ఉష్ణోగ్రత 200 డిగ్రీల ఫారెన్హీట్ చూపిస్తోంది. గాలి తొంభై శాతం కార్బన్ డయాక్సైడ్తో నిండి ఉంది. మిగతా పదిశాతం నైట్రోజన్, ఆర్గాన్ లాంటి వాయువుల్తో నిండిఉంది. వాతావరణ పీడనం 506 మిల్లీబార్స్ ఉంది. భూమ్మీద సముద్రమట్టం దగ్గర ఉండే పీడనంతో పోలిస్తే అది సరిగ్గా సగం ఉన్నట్టు లెక్క గురుత్వాకర్షణ శక్తి భూమితో పోలిస్తే 67 శాతం ఉంది.

అప్పటికే రెండు గంటల నుంచి తిరుగుతున్నారు. మార్స్ గ్రహాన్ని గుర్తు చేసేలా ఉన్న ఉపరితలం తప్ప ఆసక్తికరమైంది ఏమీ కన్పించలేదు.

“యిక వెనక్కి వెళ్లామా?” అన్నాడు శరత్‌చంద్ర.

“అప్పుడేనా? యిక్కడ పగలు ఎన్ని గంటలో, రాత్రి ఎన్ని గంటలో తెలియదు. ఎండ చాలా తీక్షణంగా ఉంది. మరో ఏడెనిమిది గంటలు గడిస్తేగానీ చీకటి పడేలా లేదు. యింకొంత ముందుకెళ్లాం” అంది నతాలియా.

స్కాఫోస్ మరో గంట ముందుకు ప్రయాణించింది.

మెల్లగా చీకట్లు కమ్ముకోసాగాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. స్కాఫోస్ స్క్రీన్ మీద బైటి ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల ఫారెన్‌హీట్ చూపిస్తోంది.

“ఇదేమిటి? చీకటి పడడానికి ఏడెనిమిది గంటలు పడ్తుందనిపించేలా తీక్షణమైన ఎండ ఉండింది కదా. అప్పుడే చీకటి పడబోతోందేమిటి? టెంపరేచర్ చూశారా ఎంత వేగంగా పడిపోతుందో. నిమిషం క్రితమేగా ఇరవై డిగ్రీలు ఉండింది. ఇప్పుడు మైనస్ పది డిగ్రీలకు పడిపోయింది. చాలా వింతగా లేదూ” అంది ఒలీవియా.

“వింతగానే కాదు. భయంగా కూడా ఉంది” అంది డాక్టర్ సుముగి.

“విశ్వాంతరాళంలో ఇలాంటి వింతగ్రహాలకు లెక్క లేదు. అబ్సిలాన్ ఆండ్రోమిడా అనే గ్రహంలో ఒక వైపు లావా మరుగుతున్నంత వేడిగా ఉంటే మరో వైపు మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రత ఉంటుంది. వాల్ష్ 76 బి అనే గ్రహంలో కూడా అంతే. వేడిగా ఉన్న వైపు ఇనుము కరిగి ఆవిరిగా మారి, చల్లగా ఉన్న వైపుకు ప్రయాణించి, ఇనుము వర్షంలా కురుస్తుంది. నీలిరంగులో ఉండే ఓ గ్రహంలో ద్రవరూపంలో ఉన్న గాజు వర్షంలా కురుస్తూ ఉంటుంది” అన్నాడు శరత్.

“వింత గ్రహాల గురించి చెప్పుకోవాలంటే విశ్వాంతరాళంలోకి వెళ్ళక్కరలేదు. మన సౌర కుటుంబంలో ఉన్న ఎనిమిది గ్రహాల్లో కూడా వింతలకు కొదువ లేదు” అన్నాడు డేనియల్.

అప్పటివరకు పల్చటి రజనులా కురిసిన మంచు, ఇప్పుడు చిన్న చిన్న రాళ్ళలా మారి కురవసాగింది. కొన్ని మీటర్లు ముందుకెళ్ళగానే మంచు పెద్దసైజు రాళ్ళ మాదిరి పడసాగింది. ఉష్ణోగ్రత మైనస్ 150 ఫారన్‌హీట్ చూపిస్తోంది. నేలంతా మంచుదిబ్బలుగా మారటం వల్ల ముందుకు కదలడం కష్టంగా ఉంది. వాళ్ళు అరగంటలో అతి కష్టం మీద అర కిలోమీటర్ దూరం మాత్రమే ప్రయాణించగలిగారు.

“మనం వెనక్కి తిరిగి వెళ్ళడం మంచిది. స్పేస్‌షిప్ ఆగిఉన్న ప్రాంతంలో కూడా ఇలాంటి మంచు గడ్డలు పడుతూఉంటే అక్కడికి చేరుకోవడం చాలా కష్టమౌతుంది. దానికి తోడు ఉష్ణోగ్రత మరింత పడిపోయే ప్రమాదం కూడా ఉంది” అన్నాడు శరత్.

ల్యాండ్ రోవర్‌ని వెనక్కి తిప్పారు.

అరగంట ప్రయాణించాక చీకటి స్థానంలో మసక వెల్తురు కన్పించింది. మంచు రజనులా కురవసాగింది. బైటి ఉష్ణోగ్రత మైనస్ పది డిగ్రీలు చూపిస్తోంది.

మరికొన్ని మీటర్లు ప్రయాణించాక ఎండ కన్పించసాగింది.. అది పోను పోను తీవ్రం కాసాగింది.

“ఇదేమిటి? ఏదో మాయలా ఉందే” అంది సుముగి.

“మాయాలేదు. మంత్రం లేదు. ఈ గ్రహం మీద అర్ధభాగం నక్షత్రం వైపు తిరిగుంది. మిగతా అర్ధ భాగం చీకట్లో ఉంది. అదృష్టం కొద్దీ మన స్పేస్‌షిప్ ఈ రెండు అర్ధభాగాలను విభజించే రేఖకి దగ్గరగా ల్యాండ్ అయింది. అందువల్లనే ఇటువంటి అద్భుతాన్ని చూడటం మనకు సాధ్యపడింది” అన్నాడు శరత్.

అప్పటికి కొన్ని గంటలనుంచి నోవా స్పేస్‌షిప్ లోని వ్యవస్థల్ని మరమ్మత్తు చేసే పనిలో ఉంది. ఆమె కావాలనే బోల్ట్‌ని లోపలికి పిలవలేదు.

బోల్ట్‌కి ఒక విషయం అర్థమైంది. తనకు అప్పగించిన పని పూర్తికావాలంటే నోవా సహకారం అవసరం. స్పేస్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్‍లో ఆమె తనతో సమానమైన ప్రతిభావంతురాలు.

బోల్ట్ ఓ నిర్ణయానికొచ్చి నోవాని సమీపించాడు.

“ఎందుకొచ్చావు? నీ అవసరం లేదు. నేను చేసుకోగలను” నోవా ఓ క్షణం అతని వైపు చూసి, మళ్ళా తల తిప్పి తన ఎదురుగా ఉన్న ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ల వైపు దృష్టి సారిస్తూ అంది.

“నాకు తెలుసు నా సహాయం లేకుండానే నువ్వు ఏమైనా చేయగలవని. ఇప్పుడొచ్చింది అందుకు కాదు. నాకు నీ సహాయం కావాలి” అన్నాడు బోల్ట్.

(ఇంకా ఉంది)

Exit mobile version