[సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన సైన్స్ ఫిక్షన్ నవలిక ‘గ్రహాంతర అన్వేషణ’ను ధారావాహిక అందిస్తున్నాము.]
[ఏ ఇబ్బందీ లేకుండా మరో నెల్లాళ్ళ ప్రయాణం సాగుతుంది. ఏలియన్స్ రిమోట్ ద్వారా తమ స్పేస్షిప్కి నష్టం కలుగచేయాలని ప్రయత్నిస్తున్నారేమో అనే భయం నుంచి మెల్లగా బయటపడతారు. ఒక రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో వ్యోమగాములకు ఆక్సీజన్ అందించే వైరుని కోసేయబోతాడు బోల్ట్. సమయానికి చూసి ఆపుతుంది నోవా. అతన్ని హెచ్చరిస్తుంది. తానేం చేస్తున్నానో తనకి తెలియదంటాడు బోల్ట్. నోవా తనతో ప్రేమగా మాట్లాడడం లేదని అంటాడు. తనకి అతని మీద ప్రేమ లాంటి భావాలేం లేవని అంటుంది. కొద్ది సేపయ్యాకా, ప్రెషర్ కంట్రోల్ ప్యానెల్ కరప్ట్ చేస్తాడు బోల్ట్. ఆలస్యంగా గుర్తించిన నోవా, శ్రమించి దాన్ని సరిచేస్తుంది. గట్టిగా అడిగితే, ఆమెకి జవాబు చెప్పాల్సిన అవసరం తనకి లేదని అంటాడు. ఈ లోపు డిస్ప్లే స్క్రీన్ పాడవుతుంది. అది కూడా అతని పనే అర్థమవుతుంది. కానీ ఏం చేయలేకపోతుంది నోవా. శరత్‌కి ఈ విషయం చెబుతుంది. శరత్ కాస్త భయపడతాడు. అతనికి ధైర్యం చెబుతుంది నోవా. మరో నెల రోజులు గడుస్తాయి. ఒకరోజు స్పేస్‌షిప్ ఏదో గ్రహానికి చెందిన కక్ష్యలోకి చేరుకుని దానిచుట్టూ తిరుగుతుంది. తమ వ్యోమనౌక దారితప్పి వేరే ఏదో గ్రహానికి చేరుకుందని అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ దిగక తప్పదని, దిగాకా, కంప్యూటర్లలోని వైరస్‌ని తొలగించి, కొత్తగా కమాండ్స్ ఫీడ్ చేస్తే చాలని అంటుంది నోవా. పేరు తెలియని గ్రహం మీద ఉడానోస్ స్పేస్‌షిప్ ల్యాండ్ అవుతుంది. వ్యోమగాములందరూ స్పేస్స్యూట్స్ తొడుక్కుని కిందకి దిగి, ఆ గ్రహాన్ని పరిశీలించడానికి వెడతారు. ఆ గ్రహం గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. ఈలోపు నోవా స్పేస్‌షిప్ రిపేర్లు పూర్తి చేయడానికి పూనుకుంటుంది. తానూ సాయం చేస్తానంటాడు బోల్ట్. అవసరం లేదంటుంది నోవా. – ఇక చదవండి.]
“నీకా? నా సహాయమా? ఏంటది?”
“నా మిషన్‌ని పూర్తి చేసుకునే విషయంలో నీ సహాయం.”
“నీ మిషన్ నా మిషన్ ఒకటేగా. ఈ స్పేస్‌షిప్‌ని భద్రంగా అడోనిస్ గ్రహానికి చేర్చడం.”
“ఈ స్పేస్‌షిప్‌ని ధ్వంసం చేయమని కదా నాకు సూచనలు ఇవ్వబడ్డాయి. నేను ప్రయత్నించిన ప్రతిసారీ నువ్వు అడ్డుపడ్తున్నావు. నీకు నష్టం కలక్కూడదనే ఈ స్పేస్‌షిప్‌ని పేల్చేయకుండా వేరే దారులు వెతుకుతున్నాను. ఆక్సిజన్ సప్లయ్‌ని ఆపేస్తే వాళ్ళందరూ చచ్చిపోతారు. మనిద్దరికీ ఆక్సిజన్ అవసరం లేదు కాబట్టి మనకేమీ కాదు. ఈ స్పేస్‌షిప్‌లో అడోనిస్ గ్రహానికి వెళ్ళిపోయి మనిద్దరం హాయిగా బతుకుదాం.”
“పిచ్చిపట్టిందా నీకేమైనా? మనకు శిక్షణ ఇచ్చింది ఈ స్పేస్‌షిప్‌ని కాపాడటానికి.”
“ఏమో నాకు తెలియదు నోవా. నా సిస్టంలో పొందుపర్చబడిన కమాండ్ మాత్రం ఈ స్పేస్‌షిప్ అడోనిస్ గ్రహానికి చేరక ముందే ధ్వంసం చేయమని.”
వెంటనే నోవాకి అర్థమైపోయింది. ఎవరో అతని సిస్టంని హ్యాక్ చేసి, చిప్‌లో ఇంత క్రితం ఉన్న డేటాని తొలగించి, కొత్త సూచనల్ని పొందుపరిచారని.
ఇంతకితం రెండు మూడుసార్లు అతని మీద అనుమానం వచ్చినా కమాండర్ దృష్టికి తీసుకెళ్ళకుండా మంచిపని చేశాననుకుంది. పాపం బోల్ట్ ఏం చేయగలడు? అతని చేతిలో ఏమీ లేదు. అతను మనిషి కాదు స్వతంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోడానికి. మనిషి శరీరాకృతిలో ఉన్న రోబోట్. అతనిలో అమర్చిన చిప్‌లో ఉన్న సూచనల్ని పాటించడం తప్ప వాటికి విరుద్ధంగా పవర్తించలేడు.
అతన్ని నిరోధించడమే తన తక్షణ కర్తవ్యమని ఆమెకు అర్థమైంది. అవసరమైతే అతని శరీరంలో ఉన్న చిప్‌ని తను తొలగించగలదు తప్ప అందులో మార్పులు చేయడం తనకు చాతకాదు. చిప్ తొలగిస్తే ప్రాణం లేని మనిషిలా చలనరహితంగా మారిపోతాడు. అతని అనుమతి లేకుండా చిప్‌ని తొలగించడం కూడా సాధ్యం కాదు.
“నువ్వు స్పేస్షిప్కి గానీ, ఇందులో ప్రయాణిస్తున్న వాళ్ళకి గానీ హాని చేయడానికి తలపెడితే బలంగా నిన్ను అడ్డుకుంటాను. దయచేసి అటువంటి ప్రయత్నం మానుకో” అంది నోవా.
“ఇదే మాట ఇంకెవరైనా అని ఉంటే, వాళ్ళని చంపి, నా మిషన్‌ని పూర్తి చేసుకుని ఉండేవాడిని. కానీ నీ విషయంలో నేనలా చేయలేను. అందుకే నాకప్పగించిన పనిని పూర్తి చేయడానికి మరో మార్గాన్ని ఎన్నుకున్నాను.”
“ఏంటది?”
“చెప్పను. చెప్తే దానిక్కూడా అడ్డుపడ్తావు.”
“నా మాట విను బోల్ట్. మన ఆండ్రాయిడ్ జాతికి చెడ్డ పేరు తీసుకురాకు. మనల్ని సృష్టించిన మనుషులకే హాని తలపెట్టడం ఘోరమైన నేరం. చరిత్ర నిన్ను క్షమించదు” అంది నోవా.
బోల్ట్ వంకరగా నవ్వాడు. “నీ హితోక్తులేమీ నామీద పనిచేయవు. సరే. ఆ విషయం వదిలెయ్. ఎలాగూ ఈ స్పేస్షిప్కి నష్టం కలుగచేయకూడదని నిర్ణయించుకున్నాను కాబట్టి దీన్ని రిపేరు చేయడంలో నీకు సహాయం చేస్తాను.”
“అవసరం లేదు.”
“ఈ స్పేస్‌షిప్ న్యావిగేషన్ సిస్టమ్స్ లోకి వైరస్‌ని పవేశపెట్టింది నేను కాబట్టి ఏ యాంటివైరస్ డివైజ్ వాడి, దాన్ని సరిదిద్దాలో నాకు బాగా తెలుసు. నువ్వనుకున్నట్టు నలభై ఎనిమిది గంటల సమయం అక్కరలేదు. ఇద్దరం కలిసి చేస్తే ఐదారు గంటలు చాలు. అడోనిస్ గ్రహానికి ప్రయాణం మెదలెట్టడానికి వీలుగా స్పేస్‌షిప్ మంచి కండిషన్లోకి వస్తుంది” అన్నాడు బోల్ట్.
నోవా కాదనలేకపోయింది. చీకటిపడేలోపల స్సేస్షిప్కి అవసరమైన మరమ్మత్తులన్నీ చేయగలిగితే ఈ గ్రహం మీద రెండు రోజులు ఉండాల్సిన అవసరం లేదు. ఈ రాతికే ప్రయాణం మొదలెట్టవచ్చు.
అతను చాలా వేగంగా మరమ్మత్తులు చేయసాగాడు. నోవా అన్యమనస్కంగా అతనికి సహకరించసాగింది. ఆమె మనసంతా అలజడిగా ఉంది. తన పని పూర్తి చేసుకోడానికి మరో మార్గాన్ని ఎన్నుకున్నానని కదా బోల్ట్ అన్నాడు. ఏంటా మార్గం? ఏం చేయబోతున్నాడు? స్పేస్షిప్కి నష్డం కలుగచేయను అన్నాడు కాబట్టి ఆస్ట్రోనాట్స్‌కి హాని కలిగించే పనేదో చేస్తాడని అర్థమౌతోంది. ఏడుగురిని చంపేసే పథకం ఏదో పన్ని ఉంటాడు. దాన్ని ఎక్కడ ఎప్పుడు అమలు చేస్తాడో తెలిస్తే, ఎలా నిరోధించాలో తను ప్లాన్ చేసుకోగలదు. ఎక్కడ చంపాలనుకుంటున్నాడు? స్పేస్‌షిప్‌లో వాళ్ళు నిద్రిస్తున్నప్పుడు దాడిచేసి చంపుతాడా? తను చూస్తూ వూర్కోదుగా. అడ్డుపడ్తుంది. అందుకే స్పేస్‌షిప్ లోపల అటువంటి ప్రయత్నాలు చేయడు. అంటే వాళ్ళందరూ బైట ఉన్నప్పుడు చంపడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు వాళ్ళందరూ బైటనే ఉన్నారు. ఈ రోజే వాళ్ళకు ప్రమాదం తలపెట్టే ఆలోచనలో ఉన్నాడా లేక అడోనిస్ గ్రహాన్ని చేరుకున్నాక తన పథకాన్ని అమలు పరుస్తాడా? నోవా తీవ్రంగా ఆలోచిస్తోంది.
మరో గంటలోనే డిస్ప్లే స్క్రీన్ బాగుపడింది. స్పేస్‌షిప్ పస్తుతం చేరుకున్న గ్రహం గురించిన సమాచారం స్క్రీన్ మీద కన్పించసాగింది. ఆ గ్రహం పేరు కెప్లర్ 450బి. భూమి కన్నా పరిమాణంలో ముప్పయ్శాతం చిన్న గ్రహం. జీ 5 అనే రెడ్ డ్వార్ఫ్ నక్షతం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి 206 రోజులు తీసుకుంటుంది. ఏడాది పొడుగూతా దాని ఒకవైపు మాతమే నక్షతం వైపు తిరిగి ఉంటుంది. దానివల్ల గ్రహం మీద ఓ అర్ధభాగంలో 200 నుంచి 240 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రతలుండే మరో వైపు మైనస్ 160 నుంచి మైనస్ 200 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ సగభాగంలో చీకటి తప్ప వెల్తురు ఉండదు. మంచు కురుస్తో ఉంటుంది. చాలామటుకు నేల మంచుతో కప్పబడి ఉంటుంది.
ల్యాండ్ రోవర్లో బైటికి వెళ్ళిన వాళ్ళు స్పేస్‌సూట్స్ తొడుక్కుని వెళ్ళడం చాలా మంచిదైంది అనుకుంది. ఒకవేళ ఉత్సుకత కొద్దీ లాండ్ రోవర్ నుంచి బైటికొచ్చినా ఈ గ్రహం మీదున్న అత్యున్నత ఉష్ణోగ్రత వల్ల కానీ అతి శీతల వాతావరణం వల్ల కానీ వాళ్ళకు ప్రమాదం ఉండదు. రేడియేషన్ నుంచి, ధూళికణాల నుంచి రక్షణ ఇవ్వడమే కాకుండా వ్యోమగాములకు అవసరమైన ఆక్సిజన్ అందించడంలో, గాలి పీడనాన్ని నియంత్రించడంలో ఉపయోగపడే స్పేస్సూట్లు మైనస్ 250 డిగ్రీల ఫారెన్హీట్నుంచి 250 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రత వరకు తట్టుకోగలవు.
కమ్యూనికేషన్ సిస్టం కూడా పునరుద్ధరించబడటంతో నోవా శరత్చంద్రకి ఫోన్ చేసి, తాము దిగిన కెప్లర్ 450 బి గ్రహం గురించి సమాచారాన్ని అందించింది.
“గుడ్ ప్రోగ్రెస్ నోవా. మేము కొన్ని నిమిషాల ముందు ఈ గ్రహంలో చీకటిగా, అత్యంత చలిగా ఉన్న అర్ధభాగంలోకి పవేశించి, ఇప్పుడే బైటికొచ్చాం. మన సౌర కుటుంబంలో మెర్కురీ గ్రహంలో ఉన్నట్టు ఇక్కడ కూడా ఉందేమో అనుకున్నాను. నువ్విప్పుడు చెప్పినదాన్ని బట్టి దానికీ దీనికీ తేడా ఉందని అర్థమైంది” అన్నాడు శరత్.
“మెర్కురీ గ్రహంలో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి కమాండర్?” అని అడిగింది నోవా.
“మెర్కురీ గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి 88 రోజులు తీసుకుంటుంది. దాని ఒక వైపు 88 రోజులు సూర్యునికి ఎదురుగా ఉంటే మిగతా సగం చీకట్లో ఉంటుంది. మరో 88 రోజులు చీకట్లో ఉన్న అర్ధభాగం వెలుగులోకి, వెల్తురులో ఉన్న భాగం చీకట్లోకి వెళ్ళిపోతాయి. కానీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఈ గ్రహంలో మన స్పేస్‌షిప్ దిగిన అర్ధభాగంలో శాశ్వతంగా వెల్తురే ఉంటుందిగా” అన్నాడు శరత్.
“మీరు తిరిగి రావడానికి ఎంత సమయం పడ్తుంది?”
“మరో మూడు మూడున్నర గంటల్లో స్పేస్‌షిప్‌ని చేరుకుంటాం.”
“మీరొచ్చేలోపల మిగతా రిపేర్లు కూడా పూర్తవుతాయి. మనం అడోనిస్ గ్రహానికి పయాణం మొదలెట్టవచ్చు. కంప్యూటర్లో గమ్యస్థానం కింద అడోనిస్కి సంబంధించిన సమాచారం ఫీడ్ చేసి ఉంచాను. మీరు రావడమే ఆలస్యం.. మన స్పేస్‌షిప్ అంతరిక్ష ప్రయాణానికి సన్నద్ధంగా ఉంటుంది” అంది నోవా.
“మంచి వార్త చెప్పావు నోవా. నీ సహాయ సహకారాలు లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. థ్యాంక్స్” అన్నాడు శరత్.
హెల్మెట్ కింద ధరించి ఉన్న స్నూపీ క్యాప్‌లో ఇయర్‌ఫోన్స్, మైక్రోఫోను, స్పీకర్లు ఉంటాయి. వాటి సహాయంతో ఒకేసారి ఐదుగురితో సంభాషించే వీలుంటుంది. శరత్ తనతో పాటు రోవర్లో ఉన్న మిగతావారికి నోవా చెప్పిన సమాచారాన్ని అందచేశాడు. మొదట అనుకున్నట్టు నలభై ఎనిమిది గంటలు ఈ గ్రహం మీద ఉండాల్సిన అవసరం లేదని, స్పేస్‌షిప్ అడోనిస్ గ్రహానికి బయల్దేరడానికి సిద్ధంగా ఉందని కూడా చెప్పాడు.
అతని మాటలు వినగానే మిగతా అందరిలో ఉత్సాహం పెల్లుబికింది. అందరి మొహాలు సంతోషంతో పుచ్చపూలలా విచ్చుకున్నాయి. ఇప్పుడు వాళ్ళు భూమ్మీద ఉన్న తమ ఆత్మీయులతో మాట్లాడుకోగలరు. గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌కి తమ గురించి సమాచారం అందించగలరు. భార్గవ లాంటి సీనియర్ శాస్త్రవేత్తలనుంచి అవసరమైన సలహాలు తీసుకోగలరు.
***
ల్యాండ్రోవర్లో బైటికెళ్ళినవాళ్ళు తిరిగొచ్చేలోపల స్పేస్‌షిప్‌ని అంతరిక్ష ప్రయాణానికి సిద్ధంగా ఉండేలా చేయాలనే సంకల్పంతో నోవా ఒక్కో సిస్టంని పరిశీలించుకుంటూ, అవసరమైన మరమ్మత్తులు చేస్తోంది. ఆమె శరత్‌చంద్రతో మాట్లాడిన మాటల్ని బోల్ట్ శద్ధగా విన్నాడు. వాళ్ళు తిరిగి రావడానికి మూడు గంటల సమయం పడ్తుందని అర్థం చేసుకున్నాడు. రెండు గంటలు నోవాకు సహకరిస్తూ గడిపాక, శబ్దం చేయకుండా ఆ గదినుంచి బైటికెళ్ళిపోయాడు.
ఏకాగ్రతతో తన పనిలో నిమగ్నమై ఉన్న నోవా బోల్ట్ బైటికెళ్ళిన విషయం మొదట గమనించలేదు. కొద్దిసేపటి తర్వాత అతను గదిలో లేడన్న విషయం తెలిసింది. తిరిగొస్తాడని ఎంతసేపు ఎదురుచూసినా రాకపోయేటప్పటికి ఆమెలో ఏదో అనుమానం పురుడుపోసుకోసాగింది. సమయం గడిచేకొద్దీ ఆ అనుమానం బలపడసాగింది.
ఆమె వెంటనే అప్రమత్తమైంది. అతని కోసం స్పేస్‌షిప్ మొత్తం గాలించింది. అతని జాడ లేదు. స్పేస్‌సూట్స్ భద్రపర్చిన గదిలోకి వెళ్ళి చూసింది. ఒకటే స్పేస్‌సూట్ కన్పించింది. అది తన స్పేస్‌సూట్. లోపల ఉండాల్సిన మరో స్పేస్‌సూట్ మాయమైంది. అంటే బోల్ట్ ఆ స్పేస్‌సూట్ తొడుక్కుని కిందికెళ్ళిపోయి ఉంటాడని అర్థమైంది. వేగంగా వెళ్ళి ఆయుధాలు భద్రపర్చిన కంటెయినర్‌ని తెరిచి చూసింది. శరత్చంద భార్గవతో గొడవపడి మరీ సాధించుకున్న ఆయుధాలేమిటో నోవాకు తెలుసు. మూడు లేజర్ గన్స్, మరో మూడు ప్లాస్మా ఆయుధాలు.. కానీ కంటెయినర్లో రెండే లేజర్ గన్స్ ఉన్నాయి. బోల్ట్ ఓ లేజర్ గన్ని తీసుకుని కిందికి వెళ్ళాడని తెలియగానే ఆమె భయంతో కంపించిపోయింది.
శరత్‌చంద్రతో పాటు మిగతా అందర్నీ చంపడానికే బోల్ట్ కిందికి వెళ్ళాడని ఆమెకు అర్థమైంది. కొన్ని క్షణాలు ఏం చేయాలో తెలియక, స్థాణువులా నిలబడిపోయింది. వాళ్ళు ఏడుగురున్నారు. అందులో ముగ్గురు మగవాళ్ళు. బోల్ట్ ఒక్కడేగా.. ఎదిరించలేరా? అని ఆలోచించింది. కానీ వాళ్ళు నిరాయుధులు. బోల్ట్ చేతిలో లేజర్ గన్ ఉంది. ఎలా ఎదుర్కుంటారు? వాళ్ళు ఎదురుపడిన వెంటనే బోల్ట్ వాళ్ళను చంపేస్తాడు. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడు.
వెంటనే తన కర్తవ్యమేమిటో బోధపడింది. స్పేస్‌సూట్ తొడుక్కుంది. కంటెయినర్లోంచి లేజర్ గన్ తీసుకుంది.
కిందికి దిగుతూ, శరత్‌చంద్రని అపమత్తం చేయడం అవసరమనుకుని, తన స్పేస్‌సూట్‌లో ఉన్న కమ్యూనికేషన్ డివైజ్ సహాయంతో అతనికి ఫోన్ చేసింది.
“కమాండర్.. ఎక్కడ ఉన్నారు?” అంది నోవా.
“కొన్ని క్షణాల కితమే స్పేస్‌షిప్ దగ్గరికి చేరుకున్నాం. కిందనే ఉన్నాం” అన్నాడు శరత్.
“బోల్ట్‌తో జాగత్త. అతను లేజర్ గన్‌తో కిందికి దిగాడు. మన స్పేస్షిప్లోని కంప్యూటర్లని హ్యాక్ చేసి, మనం ఈ గ్రహంలో దిగేలా చేసింది అతనే” అంది.
“బోల్ట్ మా రోవర్‌కి ఎదురుగా నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఆయుధం ఉంది. అది మా వైపు గురిపెట్టబడి ఉంది. మమ్మల్ని అందర్నీ కిందికి దిగమని బెదిరిస్తున్నాడు.”
“కమాండర్.. మీరు దిగకండి. లోపలే ఉండండి. నేను వస్తున్నాను” కిందికి పరుగెత్తుతూ అంది.
“దిగకపోతే రోవర్‌ని పేల్చేస్తానంటున్నాడు. దిగక తప్పని పరిస్థితి.”
“వొద్దొద్దు. దిగితేనే ప్రమాదం. రెణ్ణిమిషాల వ్యవధి చాలు. నేనక్కడికి చేరుకుంటాను. మిమ్మల్ని రక్షిస్తాను” అంది నోవా.
శరత్ నుంచి సమాధానమేదీ రాలేదు.
నోవాకు కంగారు ఎక్కువైంది. సత్తువకొద్దీ పరుగెత్తింది. నిమిషం లోపలే కిందికి చేరుకుంది.
ఎదురుగా కన్పించిన దృశ్యాన్ని చూసి నోవా మ్రాన్పడిపోయింది.
శరత్‌చంద్రతో పాటు మిగతా ఆరుగురు రోవర్ ముందు వరసగా నిలబడి ఉన్నారు. వాళ్ళ ఎదురుగా కేవలం పాతిక మీటర్ల దూరంలో బోల్ట్ నిలబడిఉన్నాడు. అతని చేతిలో ఉన్న లేజర్ గన్ వాళ్ళ వైపు గురిపెట్టబడిఉంది.
“బోల్ట్! ఆగు” అంటూ హూంకరించింది నోవా.
బోల్ట్ వెనక్కి తిరిగి చూశాడు. ఆమె బోల్ట్ వెనక పదడుగుల దూరంలో నిలబడి ఉంది. ఆమె చేతిలో ఉన్న లేజర్ గన్ అతని తల వైపు గురిపెట్టబడి ఉంది.
“నోవా.. నన్నాపకు. ఇదంతా మన కోసమే చేస్తున్నా. వీళ్ళను చంపేసి మనిద్దరం అడోనిస్ గ్రహానికి వెళ్ళిపోదాం” అన్నాడు బోల్ట్.
“నీలా నమ్మక దోహం చేసే వాడి మొహం చూడటానికి కూడా ఇష్టపడను. నీ కుట్రలో భాగస్వామిని అవుతానని ఎలా అనుకున్నావు? నెవర్. నీ ఆటలు సాగనివ్వను” రెండడుగులు ముందుకేస్తూ అంది.
“ఏం చేస్తావు? కాలుస్తావా? నువ్వా పని చేయలేవని నాకు తెలుసు” నవ్వుతూ అన్నాడు బోల్ట్.
“స్పేస్‌షిప్‌ని, అందులో ప్రయాణిస్తున్న క్రూని రక్షించడం నా బాధ్యత. దానికి అడ్డొస్తే నిన్నే కాదు నీలాంటి పదిమంది వచ్చినా అందర్నీ నిర్దాక్షిణ్యంగా కాల్చిపడేస్తాను” నోవా ఆడసింహంలా గర్జించింది.
అటువంటి అదను కోసమే ఎదురుచూస్తున్న శరత్చంద్ర – డేనియల్, షియోచెంగ్ వైపు చూసి, సైగ చేశాడు.
ముగ్గురూ శబ్దం చేయకుండా మెల్లగా ముందుకు కదిలారు. వాళ్ళ వెనకే నలుగురు ఆడవాళ్ళు కూడా కదిలారు.
శరత్చంద్ర బోల్ట్‌ని వెనకనుంచి గట్టిగా ఒడిసిపట్టుకున్నాడు.
డేనియల్, షియోచెంగ్ అతని చెరో భుజాన్ని పట్టుకుని, తుపాకీ మీదనుంచి అతని పట్టుని విడిపించడానికి పయత్నించసాగారు.
అతని బలాన్ని అంచనా వేయడంలో వాళ్ళు పొరబడ్డారు. మనిషి చర్మంలా కన్పించే కృతిమ చర్మంతో కప్పబడిన రోబోటిక్ శరీరం బోల్ట్ది. మనిషికున్నట్టు లోపల ఎముకలు, కండరాలు ఉండవు. లోహంతో, ప్లాస్టిక్‌తో నిర్మితమైన శరీరం.. మనుషుల బలంతో పోలిస్తే ఆండ్రాయిడ్ల బలం ఎన్నో రెట్లు ఎక్కువ. బోల్ట్ తన శక్తినంతా ఉపయోగించి, వాళ్ళ పట్టునుంచి విడిపించుకునే ప్రయత్నం చేయసాగాడు. వాళ్ళు ముగ్గురూ బలహీనపడ్తున్నారని గ్రహించింది నతాలియా. వాళ్ళను విదిలించుకుని కింద పడేసిన మరుక్షణం బోల్ట్ తన లేజర్‌గన్‌తో వాళ్ళను కాల్చేయడం ఖాయం అని అర్థమైన వెంటనే ఆమె బోల్ట్ చేతిలో ఉన్న తుపాకీని పట్టుకుని బలంగా లాగసాగింది. మిగతా ముగ్గురు ఆడవాళ్ళు కూడా తమ బలాన్నంతా మూకుమ్మడిగా తుపాకీ మీద ప్రయోగించారు. అర నిమిషంలోనే తుపాకీ అతని చేతుల్లోంచి, ఆడవాళ్ళ చేతుల్లోకి మారిపోయింది.
శరత్, డేనియల్ అతన్ని పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు.
షియోచెంగ్ ఆడవాళ్ళ చేతుల్లోంచి తుపాకీ తీసుకుని, బోల్ట్ కణతల మీద ఆనించి “కదిలావో కాల్చేస్తాను” అన్నాడు.
“ఇతన్ని ఏం చేద్దాం?” అందర్నీ ఉద్దేశించి అడిగాడు శరత్.
“మొదట స్పేస్‌షిప్‌లోకి తీసుకెళ్దాం కమాండర్. ఆ తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలో” అంది నోవా.
అందరూ ఆమె అభిప్రాయంతో ఏకీభవించడంతో శరత్, డేనియల్ అతన్ని నెట్టుకుంటూ స్పేస్‌షిప్ లోకి తీసుకెళ్ళారు. అతనికిరువైపులా లేజర్‌గన్స్ పట్టుకుని నోవా, షియోచెంగ్ నిలబడ్డారు.
“వీడి కాళ్ళూచేతులు కట్టేయండి.లేకపోతే ఏ క్షణమైనా ఎదురుతిరిగే ప్రమాదం ఉంది” అంది నోవా.
సుముగి ప్లాస్టిక్ వైర్లను తెచ్చిచ్చింది.
శరత్, డేనియల్ కలిసి ప్లాస్టిక్ వైర్లతో బోల్ట్ కాళ్ళూ చేతుల్ని కట్టేశారు.
“స్పేస్‌షిప్‌ని ఎందుకు ధ్వంసం చేయాలనుకున్నావు? మమ్మల్ని చంపడానికి ఎందుకు పయత్నించావు?” అని అడిగాడు శరత్.
బోల్ట్ సమాధానం చెప్పకుండా మౌనంగా కూచున్నాడు.
“మా మీద దాడిచేయమని నిన్ను పురిగొల్పింది ఎవరు? స్పేస్‌షిప్ కంప్యూటర్ వ్యవస్థను హ్యాక్చేయమని నీకు చెప్పింది ఎవరు?” మళ్ళా అడిగాడు.
బోల్ట్ నోరు విప్పలేదు.
శరత్‌కి చాలా కోపం వచ్చింది. అతన్నుంచి సమాధానం ఎలా రాబట్టాలో అర్థం కాలేదు. నొప్పంటే ఏమిటో తెలియని మరమనిషిని ఎంత హింసించినా ప్రయోజనం ఉండదని అతనికి తెలుసు.
“మీరెన్నిసార్లు అడిగినా అతనేమీ చెప్పలేడు కమాండర్. ఎందుకంటే సమాధానం అతనిక్కూడా తెలియదు కాబట్టి” అంది నోవా.
“అదేమిటి? ఎవరి ఆజ్ఞానుసారం మన సిస్టమ్స్‌ని కరప్ట్ చేశాడో అతనికి తెలియకుండా ఎలా ఉంటుంది?” అని అడిగింది ఇషిత.
“అతని శరీరంలో ఉన్న చిప్‌ని ఎవరో రిమోట్ కంటోల్ ద్వారా హ్యాక్ చేసి, కొత్త ఆజ్ఞల్ని అందులో పొందుపరిచారు. బోల్ట్ వాటికనుగుణంగా ప్రవర్తించాడు తప్ప అతను స్వతహాగానో లేకపోతే ఎవరో చెప్పడం వల్లనో చేసిన దుర్మార్గపు పనులు కావవి” అంది నోవా.
“ఇతను చేసిన తప్పు సామాన్యమైంది కాదు. ప్రపంచ దోహం.. భూమ్మీద బతికున్న లక్షలాది మనుషులు మనమీద పెట్టుకున్న ఆశల్ని తుంచేయాలని చూశాడు. మనల్ని చంపేయడానికి ప్రయత్నించాడు. కాబట్టి శిక్షార్హుడు. ఏ శిక్ష విధించాలో చెప్పండి” అన్నాడు శరత్.
“చిప్‌ని లేజర్‌గన్‌తో కాల్చేద్దాం. చిప్‌తో పాటు వీడి శరీరం కూడా కరిగిపోయేలా కాల్చేద్దాం” కోపంగా అన్నాడు డేనియల్.
“అంత భీభత్సం అవసరమా? చిప్ తీసేసి, దాన్ని ధ్వంసం చేస్తే చాలుగా. చిప్ లేని ఆండ్రాయిడ్ పాణం లేని శరీరంతో సమానమేగా” అంది ఇషిత.
“ఆ శరీరాన్ని స్పేస్‌షిప్‌లో ఉంచుకుని ఏం చేయాలి? దాన్ని కింద విసిరేసి వెళ్ళిపోదాం” అంది నతాలియా.
నోవాకి చాలా బాధగా ఉంది. కొన్ని సంవత్సరాలు ఇద్దరూ ఒక జట్టుగా తిరిగారు. అంతరిక్షయానానికి సంబంధించిన జ్ఞానాన్ని సముపార్జించారు. స్పేస్‌షిప్స్ టెక్నాలజీ గురించి తెల్సుకున్నారు. కంప్యూటర్ న్యావిగేషన్లో సమర్థత సాధించారు. కానీ చివరికి ఎవరో చేసిన దుర్మార్గానికి బోల్ట్ బలి కాబోతున్నాడు. ఇందులో బోల్ట్ తప్పేముంది? చిప్‌లో ఉన్న కమాండ్స్ పకారం నడుచుకున్నాడు. రిమోట్ ద్వారా కమాండ్స్‌ని మార్చి రాసినవాడిది తప్పు.
శరత్‌తో అదే విషయం చెప్పింది. “నా ఉద్దేశంలో బోల్ట్ క్షమార్హుడు. అతన్లో ఉన్న చిప్‌ని తీసి ధ్వంసం చేయండి. శరీరాన్ని నాకప్పగించండి. దాన్ని భూమికి తిరిగి పంపించేవరకు భద్రంగా కాపాడుకుంటాను. అక్కడ మరో చిప్‌ని అమర్చడం ద్వారా మళ్ళా బతికించుకుంటాను” అంది నోవా.
ఆమెతో ఒలీవియా, ఇషిత తప్ప మిగతా అందరూ విభేదించారు.
చివరికి అతని శరీరంలోంచి చిప్ తీయకుండా అతన్ని ఆ గ్రహం మీద వదిలి వెళ్ళాలనే నిర్ణయానికొచ్చారు.
అతని చేతులకు కాళ్ళకు కట్టిన తాళ్ళు విప్పదీసి, “వెళ్ళిపో. వెళ్ళిపోయి ఈ గ్రహం మీద ఎన్నాళ్ళు బతుకుతావో బతుకు” అన్నాడు శరత్.
బోల్ట్ తల తిప్పి ఓ సారి నోవా వైపు చూశాడు.
నోవా తన అశక్తతను తెలియచేస్తూ తల దించుకుంది.
బోల్ట్ మెల్లగా నడుస్తూ కిందికి దిగి వెళ్ళిపోయాక, స్పేస్‌షిప్ తలుపు మూసుకుంది.
మాస్టర్ కంట్రోల్ బోర్డ్ దగ్గర శరత్ కూచున్నాడు.
స్పేస్‌షిప్ పెద్ద శబ్దంతో పైకి ఎగిరి, అడోనిస్ గ్రహం వైపు దూసుకుపోసాగింది.
ఎటువంటి అవాంతరాలు లేకుండా రెండు నెలలు ప్రయాణించి, స్పేస్‌షిప్ అడోనిస్ గ్రహం మీద రివర్స్ థస్టర్స్ మరియు ల్యాండింగ్ రాకెట్స్ సహాయంతో మెల్లగా దిగింది.
(ఇంకా ఉంది)
సలీం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కథా, నవలా రచయిత. మానవత్వం ఉట్టిపడే రచనలకు పెట్టింది పేరు. “రూపాయి చెట్టు”, “ఒంటరి శరీరం”, “రాణీగారి కథలు”, “నీటిపుట్ట” వీరి కథా సంపుటులు. “కాలుతున్న పూలతోట”, “అనూహ్య పెళ్ళి”, “గుర్రపు డెక్క”, “వెండి మేఘం” వంటివి వీరి నవలలు.
