[సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన సైన్స్ ఫిక్షన్ నవలిక ‘గ్రహాంతర అన్వేషణ’ను ధారావాహిక అందిస్తున్నాము.]
[స్పేస్‍షిప్‌ని ధ్వంసం చేయమని తనకి ఆదేశాలు ఇవ్వబడ్డాయని, అందులో తనకి సాయం చేయమని బోల్ట్ నోవాని అడుగుతాడు. నోవా తిరస్కరిస్తుంది. స్పేస్‌షిప్‌కి కానీ, వ్యోమగాములకి కానీ ఏదైనా ప్రమాదం తలపెడితే ఊరుకోనని హెచ్చరిస్తుంది. బోల్ట్ కూడా సాయం చేయడంతో వ్యోమనౌక మరమత్తులన్నీ త్వరగా పూర్తి చేసి, బయట ఆ గ్రహం మీద తిరుగుతున్న శరత్‌చంద్రకు కబురు చేస్తుంది. డిస్‍ప్లే స్క్రీన్ బాగుపడి, స్పేస్‍షిప్ ఆగిన గ్రహం వివరాలన్నీ తెలుస్తాయి. ఆ గ్రహం పేరు కెప్లర్ అంటూ, ఆ వివరాలని వ్యోమగాములకు తెలియజేస్తుంది. ఇంతలో తన పక్కన ఉండాల్సిన బోల్ట్ కనిపించడు, ఎంతకీ రాకపోయేసరికి స్పేస్‌షిప్ అంతా వెతికి చూస్తుంది. కనబడడు. ఒక స్పేస్‍సూట్, ఒక లేజర్ గన్ తీసుకుని బోల్ట్ కిందకి వెళ్ళాడని గ్రహిస్తుంది. కమాండర్ శరత్‌ని హెచ్చరిస్తుంది. కానీ అప్పటికే బోల్ట్ వాళ్ళని రోవర్ నుంచి క్రిందకి లేజర్ గన్ గురిపెడతాడు. నోవా కిందకి దిగి బోల్ట్‌ని వారిస్తున్న సమయంలో, అదను చూసుకుని అతన్ని చుట్టుముట్టి గన్‌ని లాక్కుంటారు వ్యోమగాములు. చేతులు కాళ్ళూ కట్టేసి స్పేస్‌షిప్‌లోకి ఎక్కిస్తారు. ఎవరు నిన్నిలా చేయమన్నారంటూ ఎన్ని ప్రశ్నలు వేసిన బోల్ట్ సమాధానం చెప్పడు. అతని చిప్‌ని హ్యాక్ చేసి ఇలా ప్రవర్తించేలా చేశారని, అతని తప్పు లేదని అంటుంది నోవా. చివరికి అతని శరీరంలోంచి చిప్ తీయకుండా అతన్ని ఆ గ్రహం మీద వదిలి వెళ్ళాలనే నిర్ణయించుకుంటారు. బోల్ట్ నెమ్మదిగా నడుస్తూ, దిగివెళ్ళిపోయాకా, స్పేస్‌షిప్ బయల్దేఇ రెండు నెలలు ప్రయాణించి అడోనిస్ గ్రహం మీద దిగుతుంది. – ఇక చదవండి.]
విశ్వాంతరాళంలో అడోనిస్ గ్రహానికి దగ్గరగా ఉన్న మరో గ్రహం ఎఫిమియోస్‌లో గ్రహాధినేత ఈరోస్ చాలా అసహనంగా ఉన్నాడు. అతని ఎదురుగా ప్రజాసంక్షేమ మరియు పాలనా వ్యవహారాలశాఖను నిర్వహించే మంత్రితో పాటు రక్షణశాఖ మంత్రి కూడా ఆసీనులై ఉన్నారు.
“భూగ్రహం నుంచి బయల్దేరిన స్పేస్‌షిప్ అడోనిస్ గ్రహాన్ని చేరుకోకముందే దాన్ని ధ్వంసం చేయమని మేము జారీ చేసిన ఆజ్ఞను ఎందుకు అమలుపరచలేదు? భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆ గ్రహం మన ఆధీనంలో ఉండాలని మీకు తెలియదా? దాన్ని భూగ్రహవాసులకు ధారాదత్తం చేయాలనుకుంటున్నారా?” ఈరోస్ ఉద్రేకపడిపోతూ అన్నాడు.
“మా ప్రయత్నలోపం ఏమీ లేదు సుప్రీం. స్పేస్‍షిప్‌తో పాటు వ్యోమగాముల్ని ధ్వంసం చేయమని ఓ ఆండ్రాయడ్‌ని పురమాయించాం. దాని చిప్‌ని హ్యాక్ చేయడం ద్వారా మన ఆధీనంలోకి తెచ్చుకుని, కమాండ్స్ ఇచ్చాం. కానీ అది విఫలమైంది” అన్నాడు రక్షణమంత్రి.
“అడోనిస్ గ్రహాన్ని చేరుకున్న స్పేస్‌షిప్‌లో ఆ ఆండ్రాయిడ్ కూడా ఉందా? మన కమాండ్స్‌ని అది ఎందుకు పట్టించుకోలేదు?”
“ఆ ఆండ్రాయిడ్ అడోనిస్ గ్రహాన్ని చేరుకోలేదు సుప్రీం.”
“ఏమైంది? మధ్యలోనే అంతర్ధానమైపోయిందా?” చిరాగ్గా అన్నాడు.
“మన శాస్త్రవేత్తలు దాని ఉనికిని కనుక్కున్నారు సుప్రీం. అది కెప్లర్ 450 బి అనే గ్రహం మీద ఒంటరిగా ఉందని తెల్సుకున్నారు” అన్నాడు మరో మంత్రి.
“కాబట్టి ఇప్పుడా ఆండ్రాయిడ్ మనకు ఉపయోగపడదు. ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారు? భూగ్రహవాసుల్ని మన గ్రహాన్ని ఆక్రమించకుండా ఎలా నిరోధించాలనుకుంటున్నారు?”
“అడోనిస్ గ్రహాన్ని చేరుకున్న వ్యోమగాముల్లో మరో ఆండ్రాయిడ్ ఉంది సుప్రీం. దాని శరీరంలో ఉన్న చిప్‌ని హ్యాక్ చేసి, దాని ద్వారా మనం అనుకున్న పనిని సాధిద్దాం” అన్నాడు ప్రజాసంక్షేమశాఖ మంత్రి.
అతని అభిప్రాయంతో రక్షణమంత్రి విభేదించాడు. “వాళ్ళెలాగూ గ్రహాన్ని చేరుకున్నారుగా. ఈసారి నేరుగా ఎదుర్కోవడమే మంచిది. మన సైనికుల్ని పదిమందిని పంపే ఏర్పాటు చేస్తాను. పని చక్కబెట్టుకుని వస్తారు” అన్నాడు.
“వాళ్ళు మొత్తం ఏడుగురేగా ఉన్నారు. ఆండ్రాయిడ్‌తో కలిపి ఎనిమిది మంది. వాళ్ళను చంపడానికి పదిమంది సైనికులు అవసరమా?” అన్నాడు సుప్రీం.
“అవసరమే. వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలున్నాయో, అవి ఎంత శక్తివంతమైనవో మనకు తెలియదు. రిస్క్ తీసుకోలేం.”
“మన సైనికులు స్పేస్‌షటిల్‌లో అడోనిస్ గ్రహాన్ని చేరుకోడానికి యాభై రోజుల సమయం పడ్తుంది. అప్పటివరకు ఆ భూగ్రహవాసులు మన స్వంతం అనుకున్న గ్రహం మీద తిరుగాడుతూ ఉండాల్సిందేనా?” అన్నాడు సుప్రీం.
రక్షణమంత్రి మెత్తగా నవ్వాడు. “స్వర్గధామం లాంటి ఆ గ్రహం మీద కొన్ని రోజులు వాళ్ళని హాయిగా, ఆనందంగా బతకనిద్దాం. ఆ తర్వాత ఎలాగూ చంపేస్తాం కదా” అన్నాడు.
“మీరు నిశ్చింతగా ఉండండి. అడోనిస్ గ్రహం మనది. దాన్ని అన్యాక్రాంతం కానివ్వం” మంత్రులిద్దరూ ఏకకంఠంతో అన్నారు.
***
“ఎంత అందంగా ఉందో కదా ఈ ప్రదేశం!” స్పేస్‌షిప్ తలుపు తెర్చుకున్న వెంటనే కళ్ళముందు సాక్షాత్కారమైన ప్రకృతి సోయగాన్ని చూడగానే శరత్ నోటినుంచి వెలువడిందా మాట.
బైట వర్షం పడ్తోంది. సన్నటి చినుకులు ముత్యాల జల్లుల్లా నేలను తాకుతున్నాయి. పసిపిల్లలు నోరు తెరిచి తల్లి పాలు తాగినట్టు, చెట్ల ఆకులు వర్షంలో తడుస్తూ, సంతోషంతో కేరింతలు కొడ్డున్నట్టు కన్పిస్తున్న మనోహర దృశ్యం! తన శరీరాన్ని ఆత్మీయంగా తడుపుతున్న నీటి స్పర్శకు నేల పులకాంకితయై, తన్మయత్వంలో మునిగిపోయినట్టు.. చెట్లకున్న రంగు రంగుల పూవుల్లోని మకరందం నీటిలో కరిగి, నేలకు జారి, తీయటి సువాసనల్ని నలువైపులా వెదజల్లినట్టు..
“దిగి చూద్దామా?” ఉత్సాహపడిపోతూ అంది సుముగి.
“మన కాశ్మీరు లోయలోని అందాలన్నిటినీ తెచ్చి, ఇక్కడ కుప్పగా పోసినట్టుంది కదూ” అంది శరత్‌చంద్రతో ఇషిత.
“ఇక్కడి గాలీ, నీరు అన్నీ సురక్షితమని చిటేకి చెప్పిందిగా. నాకు ఈ వర్షంలో తడవాలని ఉంది. కిందికి దిగాలంటే స్పేస్‌సూట్ కూడా అక్కరలేదుగా” అంది నతాలియా.
“నాకైతే మొదట యిక్కడున్న రకరకాల వృక్షజాతుల్ని ఎప్పుడెప్పుడు పరిశీలిస్తానా అని తొందరగా ఉంది” అంది ఒలీవియా.
“స్పేస్‌సూట్లు అక్కరలేదు గానీ రెయిన్ కోట్స్ తొడుక్కోండి. అందరం కిందికి దిగుదాం” అని శరత్‌చంద్ర అనుమతి ఇచ్చిన వెంటనే అందరూ ఒక్కసారిగా ‘హుర్రా’ అని అరిచారు.
నోవా తప్ప మిగతా అందరూ రెయిన్ కోట్స్ తొడుక్కుని కిందికి దిగారు.
నోవా లేజరన్ చేతిలో పట్టుకుని దిగడం చూసి, “అదెందుకు? దాని అవసరం ఈ గ్రహం మీద రాదని చెప్పారుగా” అంది నతాలియా.
“ఏమో.. వాళ్ళ కళ్ళకు కన్పించని ప్రమాదమేమైనా ఎదురైతేనో? కీడెంచి మేలెంచమని కదా మీ మనుషులు అంటుంటారు. అందుకే” అంటూ నవ్వింది నోవా.
కళ్ళకు యాంటీఫాగ్ గాగుల్స్ తొడుక్కుని ఉండటం వల్ల కొన్ని మీటర్ల దూరం వరకు చూపు స్పష్టంగా కన్పిస్తోంది.
సుముగి “అటు చూశారా? సెలయేరు.. ఎంత బావుందో.. రండి వెళ్లాం” అంటూ అటువైపుకి పరుగెత్తింది
మిగతా వాళ్ళకు ఆమెను అనుసరించక తప్పలేదు.
సెలయేటిలో నీళ్ళు స్పటికంలా ఎంత తేటగా ఉన్నాయో.. అడుగున ఉన్న రాళ్ళు, రప్పలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. గట్టున రకరకాల రంగు రంగుల పూల మొక్కలు.. వాటి మీద వాలుతున్న సీతాకోకచిలుక ల్లాంటి రెక్కల కీటకాలు..
“ఈ నీళ్ళు ఎంత తీయగా ఉంటాయో.. తాగి చూస్తాను” అంటూ సుముగి మోకాళ్ళ మీద గొంతు క్కూచుని దోసిలి నిండా నీళ్ళు తీసుకుంది.
“వద్దు.. తాగొద్దు” అంటూ శరత్ వారించబోయేలోపల ఆమె నాలుగు గుటకలు నీళ్ళు తాగి, మెరిసే కళ్ళతో మిగతా వాళ్ళవైపు చూస్తూ, “లేత కొబ్బరి నీళ్ళకన్నా మధురంగా ఉన్నాయి తెలుసా” అంది.
ఇషిత, నతాలియా కూడా నీళ్ళను తాగడం కోసం దోసిళ్ళలోకి తీసుకున్నారు. “ఆగండి. తొందరెందుకు? మనం ఈ గ్రహం మీద మూడు నెలలపాటు ఉండబోతున్నాం. ఇక్కడ ప్రమాదం కలిగించేవేవీ లేవని చిటేకి చెప్పినమాట నిజమే. అయినా మరోసారి మనం కూడా పరీక్షించి ఇక్కడి నీళ్ళు, మట్టి, గాలి, పూలు, పళ్ళు ప్రమాదరహితమని నిర్థారించుకున్నాకే వాటిని ఆస్వాదిద్దాం” అంటూ వాళ్ళని నిలువరించాడు శరత్.
కమాండర్ మాటలు శిరోధార్యం కాబట్టి వాళ్ళు అయిష్టంగానే దోసిళ్ళలో ఉన్న నీటిని పారబోశారు.
ఆ నీటిని తాగిన సుముగిని రెండు రోజుల వరకు పరిశీలిస్తూ ఉండాలని శరత్ మనసులో అనుకున్నాడు.
వర్షం తగ్గింది. లేత ఎండ కాస్తోంది. ఆకాశంలో మబ్బు తునకలు సముద్రపు ఒడ్డున గవ్వలేరుకుంటున్న పిల్లల్లా ముసిముసిగా నవ్వుకుంటున్నట్టు కన్పిస్తున్నాయి.
“మన స్పేస్‌షిప్ ఈ గ్రహం మీదికి దిగే సమయానికి ఇక్కడ ఉదయం ఎనిమిది గంటలు కావడం మన అదృష్టం. చీకటి పడ్డాక దిగిఉంటే ఈ అద్భుతమైన సౌందర్యాలను చూడటం కోసం పన్నెండు గంటలు ఎదురుచూడాల్సి వచ్చేది” అంది ఇషిత.
ఒలీవియా దృష్టంతా అక్కడ కన్పిస్తున్న రకరకాల చెట్లమీద, మొక్కల మీదే ఉంది. అవి భూమ్మీద కన్పించే చెట్ల మాదిరి లేవు. విభిన్నంగా ఉన్న చెట్లు.. వాటి ఆకులు పచ్చగానే ఉన్నాయి. కాని వాటి ఆకారాలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి.
దారిలో వాళ్ళకు రకరకాల జంతువులు కన్పించాయి. వాటిలో జిరాఫీలా పొడవు మెడతో, కింది శరీరం భారీగా ఏనుగు శరీరంలా ఉన్న జంతువులు కూడా కన్పించాయి. కానీ ఏ జంతువూ మరో జంతువుని తింటున్న దృశ్యాలేమీ కన్పించలేదు. అన్నీ ఆకులు, మొక్కలు, పచ్చగడ్డి తింటూనే కన్పించాయి. ఈ గ్రహం మీద జంతువుల్ని తినే మృగాలే లేకపోతే ఈ పాటికి నేలంతా జంతువుల్తో నిండిపోయి కన్పించాలి కదా అనే అనుమానం శరత్‌చంద్రకి మరోసారి కలిగింది.
వాళ్ళు కొండల్ని, సెలయేళ్ళని చూసుకుంటూ ముందుకు సాగారు.
కొద్ది దూరం నడిచాక అందమైన తటాకం కన్పించింది. అందులో నీళ్ళు తాగుతున్న కొన్ని జంతువులు వీళ్ళని గమనించి తలయెత్తి చూసి, మళ్ళా నీళ్ళు తాగడంలో మునిగిపోయాయి.
అప్పటికి మూడు గంటలనుంచి నడుస్తూ ఉండటంతో అందరికీ అలసటగా అన్పించింది.
“ఈ చెరువుగట్టున కొద్దిసేపు కూచుందాం ప్లీజ్. నాకు కాళ్ళు నొప్పులు పుడ్తున్నాయి” అంది ఇషిత.
నేల తడిగా ఉండటంతో గట్టున ఉన్న రాళ్ళను పీటలుగా చేసుకుని అందరూ కూచున్నారు.
నీళ్ళలో రకరకాల జలచరాలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ‘చిన్న చేపల్ని పెద్ద చేపలు తింటాయి కదా. ఇక్కడలా జరగదా? వాటికి హాని చేసే పక్షులో జంతువులో లేకపోతే వాటి సంతతి పెరిగి చెరువంతా జలచరాలతో నిండిపోవాలి కదా’ అని ఆలోచిస్తున్నాడు శరత్.
ఒలీవియా కొద్దిసేపు కూచున్నాక, లేచి గట్టు మీద మొలిచిన మొక్కల నమూనాల్ని సేకరించడంలో మునిగిపోయింది.
చెట్ల మీద వాలి ఉన్న రంగు రంగుల పక్షుల్ని గమనించసాగింది ఇషిత. సీతాకోకచిలుకల రెక్కల మీద రంగు రంగుల డిజైన్లు ఉన్నట్టు పక్షుల రెక్కలు మనోహరంగా ఉన్నాయి. వాటి అరుపులు కూడా శ్రావ్యంగా ఉన్నాయి.
ఎడం వైపున్న ఓ పెద్ద చెట్టు కొమ్మల మధ్యలోంచి తొంగి చూస్తున్న పక్షిలాంటి జంతువో జంతువు లాంటి పక్షో కన్పించగానే ఆమె కళ్ళు భయంతో పెద్దవైనాయి. నిప్పుకోడికన్నా పెద్ద శరీరం, మొసలి నోరులా తెరిచి ఉన్న నోటిలో ఇరువైపులా పదునైన పళ్ళు కన్పిస్తున్నాయి. కళ్ళు ఎర్రగా నిప్పు కణికల్లా మెరుస్తూ ఉన్నాయి. నిప్పుకోడి కాళ్ళలా దాని కాళ్ళు పొడవుగా ఉండటంతో పాటు బలంగా కన్పించాయి. వేళ్ళకు పదునైన కత్తుల్లాంటి గోళ్ళున్నాయి.
తన పక్కనే కూచుని ఉన్న నతాలియాతో “అటు చూడు. అది పక్షే అంటావా? ఎంత భయంకరంగా ఉందో కదా” అంది ఇషిత.
నతాలియా అటు వైపు చూడటం ఆలస్యం భయంతో బిగుసుకుపోయింది. ఆమె డేనియల్ వైపు తిరిగి “ఆ చెట్టు మీద నల్లగా కన్పిస్తున్న దాన్ని చూశావా? రెక్కలున్నాయి కాబట్టి పక్షి అనుకోవాలి తప్ప లేకపోతే అది జంతువులానే ఉంది. దానివల్ల మనకేమైనా ప్రమాదమా?” అంది.
డేనియల్‌తో పాటు శరత్ కూడా తల తిప్పి దాని వైపు చూశాడు. అది తన ఎర్రటి కళ్ళతో వాళ్ళ వైపే తదేకంగా చూస్తోంది.
“ఈ దీవిలో మాంసాహార జంతువులు, పక్షులు లేవని పైలట్ స్పేస్‌షిప్‌ని పంపి నిర్ధారించుకున్నాంగా. చూడటానికి నిజంగానే భయంకరంగా ఉంది తప్ప దానివల్ల మనకేమీ ప్రమాదం ఉండదు” అన్నాడు డేనియల్.
అందరూ ఆ పక్షి వైపు చూడసాగారు.
ఒక్కసారిగా ఆ పక్షి భయంకరంగా అరుస్తూ గాల్లోకి లేచింది. దాని అరుపు ఉరుములు ఉరిమినట్టు కర్ణకఠోరంగా ఉంది. దాని రెక్కలు విశాలంగా తెర్చుకున్నాయి. వాటిని బలంగా విదిలిస్తూ ఆ పక్షి దూరంగా ఎగిరిపోయింది.
దాని అరుపుకి అందరూ పక్కనేదో బాంబు పేలినట్టు అదిరిపడ్డారు.
“హమ్మయ్య. వెళ్ళిపోయింది. అది ఈ చెట్టు మీద ఉన్నంత సేపు నా గుండె గుబగుబలాడ్తూనే ఉండింది తెలుసా? పక్షులకు బీక్స్ ఐ మీన్ ముక్కులు కదా ఉంటాయి. దీనికేమిటి మొసలి నోరుంది?” అంది ఇషిత.
“మన భూగ్రహంలో కన్పించే పక్షుల్లాంటివే ఇక్కడా ఉండాలంటే ఎలా కుదుర్తుంది? యింకా ఎన్ని వింతైన పక్షి జాతులు ఈ గ్రహం మీద ఉన్నాయో చూద్దాం” అన్నాడు శరత్.
“నేను పక్షులన్నిటినీ నా కెమెరాలో బంధిస్తున్నాను. ఆ మొసలితలున్న పక్షిని కూడా రికార్డ్ చేశాను” అన్నాడు డేనియల్.
“నేననేది అది కాదు. మొసలి తలతో, పదునైన పళ్ళతో అది ఆకుల్ని మొక్కల్ని తింటుందంటే నమ్మశక్యం కావడం లేదు. ఎలాంటి జంతువునైనా దాని పళ్ళతో కసకసా నమిలి తినేసేలా ఉంది. అందుకే భయమేసింది” అంది ఇషిత.
“నా చేతిలో లేజర్ గన్ ఉన్నంత వరకు మీరు దేనికీ భయపడనవసరం లేదు” అంది నోవా.
“హిప్పోపొటామస్లకి, గొరిల్లాలకి కూడా పదునైన దంతాలుంటాయి. కానీ అవి శాకాహార జంతువులే. వాటి పదునైన దంతాలు మిగతా జంతువుల్తో పోట్లాడటానికి పనికొస్తాయి. ఈ పక్షి కూడా అలాంటి కోవకు చెందినదై ఉంటుంది” అన్నాడు షియోచెంగ్.
యల్. “మనం వెనక్కి వెళ్ళడం మంచిది. మరో మూడు గంటల్లో చీకటి పడ్తుంది” అని గుర్తు చేశాడు డేనియల్.
అందరూ మెల్లగా నడుచుకుంటూ స్పేస్‍షిప్‌ని చేరుకున్నారు.
“రేపు మరో వైపు వెళ్ళి చూద్దాం” అన్నాడు శరత్.
“పంటలు పండించే బాధ్యత నామీద ఉంది కదా. గింజలు నాటడానికి ఏ స్థలం అనుకూలంగా ఉంటుందో రేపు నిర్ణయిస్తాను” అంది ఇషిత.
ఏడింటికల్లా భోజనాలు చేసి, ఎనిమిదింటికి బెడ్‌రూమ్ లోకి దూరి నిద్రకుపక్రమించారు.
***
మరునాడు ఉదయం బయల్దేరి, నిన్న వెళ్ళిన దిశకు వ్యతిరేక దిశలో నడవసాగారు.
చిటేకి తీసిన వీడియోల్లో జంతువులు కౌగిలించుకుని కన్పించిన చెట్లలాంటివి చాలా కన్పించాయి. వాటి ఆకులు అరచేయంత మందంలో లేత నీలం రంగులో ఉన్నాయి.
“వీటి ఆకులు లేత నీలంరంగులో ఉన్నాయంటే అర్థం వీటిలో పత్రహరితం లేదనేగా. మరి ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది? వీటికవసరమైన శక్తి ఎక్కడినుంచి లభిస్తుంది?” అని అడిగింది ఒలీవియా.
“ఈ చెట్లు జంతువుల్ని ఎలా ఆకర్షించగలుగుతున్నాయో, ఎందుకు ఆకర్షిస్తున్నాయో తెల్సుకుంటే తప్ప నీ ప్రశ్నకు సమాధానం దొరకదేమో” అన్నాడు శరత్.
“చెట్లలో జంతువుల్ని ఆకర్షించే శక్తి ఉంటుందని నేననుకోను. అవి బయో కెమికల్ పదార్థాలతో నిర్మితాలు. వాటిలో అయస్కాంతశక్తి ఎలా ఉంటుంది? జంతువులవి కూడా బయో కెమికల్ శరీరాలేగా. వాటిల్లో లోహాలేమీ ఉండవుగా” అంది ఒలీవియా.
“మన భూగ్రహం మీద ఉన్న అయస్కాంతశక్తి లాంటిది ఇక్కడ కూడా ఉండాలని లేదుగా. జంతువుల ఎముకల్లో కాల్షియం ఉంటుంది. రక్తంలో ఐరన్ ఉంటుంది. వీటిని ఆకర్షించే పదార్థమేదో ఆ చెట్లలో ఉండి ఉండొచ్చుగా” అంది నతాలియా.
“నాకా చెట్టు శాంపిల్స్ కావాలి. దాని కాండాన్ని, ఆకుల్ని పరీక్షిస్తేగానీ ఆ రహస్యమేదో బైటపడదు” అంది ఒలీవియా.
“పొరపాటున కూడా అటువంటి ప్రయత్నం చేయకు. జంతువుల్ని ఆకర్షించినట్టే మనుషుల్ని కూడా ఆకర్షించే ప్రమాదముంది” అన్నాడు డేనియల్.
మరికొంత దూరం నడిచాక వాళ్ళ కళ్ళకో దృశ్యం కన్పించింది. ఓ చెట్టు కాండాన్ని తన నాలుగు కాళ్ళతో పెనవేసుకుని గేదెలా ఉన్న పెద్ద జంతువేదో కన్పించింది.
వాళ్ళు ఆగిపోయి దాన్ని నిశితంగా పరిశీలించసాగారు.
ఆ జంతువు బాధతో అరవడం లేదు. అసలు కదలడమే లేదు.
“బతికుందా చచ్చిందా?” తన మనసులోని అనుమానాన్ని బైటికి వెల్లడించింది నతాలియా.
సమాధానం ఎవ్వరికీ తెలియదు. ఎంత సేపు చూసినా ఆ దృశ్యంలో మార్పు లేకపోవడంతో వాళ్ళు ముందుకు కదిలి వెళ్ళారు.
దారిలో అటువంటి దృశ్యాలు మరో రెండు కన్పించాయి.
“మీరో విషయం గమనించారా? ఇక్కడ అటువంటి చెట్లే చాలా ఎక్కువున్నాయి. ఎటు చూసినా అవే చెట్లు. మాగ్నెటిక్ ట్రీస్ అందామా వాటిని?” అంది సుముగి.
“దానిక్కారణం తెలుస్తూనే ఉందిగా. మిగతా చెట్ల ఆకుల్ని, మొక్కల్ని జంతువులు తినేస్తాయి. కానీ ఈ చెట్టు జోలికి వెళ్ళవు. అందుకే వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయి ఉంటుంది” అన్నాడు షియోచెంగ్.
మరో రెండు గంటలు నడిచారు.
చిన్న అడవిలాంటి ప్రాంతం కన్పించింది. చెట్లు గుబురుగా ఉన్నాయి. రకరకాల జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. నాలుగు కాళ్ళ జంతువులు.. ఆరు కాళ్ళ జంతువులు.. ఎనిమిది కాళ్ళ జంతువులు..
“అడవిలోపలికి వెళ్ళడం ప్రమాదకరమేమో.. వెనక్కి తిరిగి వెళ్ళడం మంచిది” అంది ఇషిత.
“విషకీటకాలు, క్రూరమృగాల్లేని స్వర్గంలాంటి గ్రహమనికదా చిటేకి చెప్పాడు” అంది నతాలియా.
“ఏమో.. పులులు సింహాల్లాంటివి ఉంటాయేమో” భయంగా అంది సుముగి.
“నో ఛాన్స్. పైలట్ స్పేస్ షటిల్ యిక్కడ వారం రోజులుండి ప్రతి అంగుళాన్ని ఫోటోలు, వీడియోలు తీసిందిగా. అటువంటి ప్రమాదకర జంతువుల ఆనవాళ్ళేమీ కన్పించలేదుగా” అంది ఒలీవియా.
“ఏమో ఎలా చెప్పగలం? వీడియోలు తీసే సమయంలో ఏ గుహలోనో దాక్కుని తర్వాత బైటికొచ్చి ఉండొచ్చుగా” అంది సుముగి.
అడవిలోపలికి మరికొంత దూరం వెళ్ళారు.
భీకరమైన పక్షి అరుపు విన్పించడంతో అందరూ శిలాప్రతిమల్లా నిలబడిపోయారు. అలా అరిచే పక్షి ఏమిటో వాళ్ళకు అనుభవమే. తలలెత్తి చెట్ల వైపు చూశారు. గుంపులు గుంపులుగా ఉన్నాయా పక్షులు.. ఎర్రటి కళ్ళతో, మొసలి నోటితో భయం గొలిపేలా వాళ్ళ వైపే చూస్తున్నాయి. మరో పక్షి అరిచింది. ఆ త ర్వాత యింకో పక్షి.. అవి తమ భాషలో ఏదో సంజ్ఞలు చేసుకుంటున్నట్టు ఒకదాని తర్వాత ఒకటి అరవసాగాయి. దాడికి పాల్పడటానికి ముందు అరిచే అరుపుల్లా భీతి గొలిపేలా ఉన్నాయా అరుపులు.
“మనం వెళ్ళిపోవడం మంచిది” గుసగుసగా అంది సుముగి.
నోవా తన చేతిలో ఉన్న లేజర్ గన్ని ఎక్కుపెట్టి సిద్ధంగా నిలబడింది.
అందరూ వెనక్కి తిరిగి మెల్లగా నడవసాగారు. ముందు శరత్‌చంద్ర, మధ్యలో ఆడవాళ్ళు, వెనక షియోచెంగ్, అతని వెనక డేనియల్.. వాళ్ళ పక్కన అప్రమత్తంగా నడుస్తోంది నోవా.
పదడుగులు కూడా నడిచి ఉండరు. గాల్లో రెక్కల చప్పుడు విన్పించింది. ఆ శబ్దం తన తలకు అతి సమీపంగా విన్పించడంతో డేనియల్ వెంటనే పక్కకు గెంతాడు. మొసలి నోరున్న పక్షి తన రెండు కాళ్ళతో షియోచెంగ్ రెండు భుజాల్ని పట్టుకుని, చిన్న పిల్లాడిని తండ్రి ఎత్తుకున్నంత సునాయాసంగా ఎత్తుకుని ఎగిరిపోసాగింది.
అది కలిగించిన షాక్ నుంచి ముందు కోలుకుంది నోవా.
తుపాకీని పైకెత్తి ఆ పక్షి పొట్టలో గురిచేసి కాల్చింది. 60 కిలోవాట్ల శక్తి గల లేజర్ కిరణాలు ఆ పక్షి శరీరంలోంచి దూసుకుపోవడం, అది పెద్దగా అరుస్తూ కింద పడిపోవడం, దానికి ఎడంగా షియోచెంగ్ పడిపోవడం క్షణాల వ్యవధిలో జరిగిపోయాయి.
శరత్ పరుగెత్తుకుంటూ వెళ్ళి షియోచెంగ్‌ని లేపి “దెబ్బలేమైనా తగిలాయా?” అని అడిగాడు.
“లేదు” అన్నాడు షియోచెంగ్. అతని కళ్ళల్లో మృత్యుభయం స్పష్టంగా కన్పించసాగింది.
ఓ పక్షి కిందపడి చచ్చిపోవడంతో మిగతా పక్షులు నిశ్శబ్దమైపోయాయి. వాటి అరుపులు ఒక్కసారిగా ఆగిపోయాయి.
నోవా పక్షులున్న వైపు తిరిగి, తుపాకీని ఎక్కుపెట్టి వెనక్కెనక్కి నడవసాగింది.
షియోచెంగ్కి చెరోవైపు శరత్, డేనియల్ నడవసాగారు.
కొంత దూరం నడిచాక, చనిపోయిన పక్షి చుట్టూ పది పన్నెండు పక్షులు చేరి, సంతాపాన్ని తెలుపుతున్నట్టు నిలబడి ఉండటాన్ని గమనించారు.
వేగంగా నడుస్తూ అడవి బైటికి వచ్చాక గానీ వాళ్ళలో భయం తగ్గలేదు.
షియోచెంగ్ నోవా వైపుతిరిగి “నా ప్రాణాల్ని కాపాడినందుకు థ్యాంక్స్” అన్నాడు.
నోవా మెల్లగా నవ్వుతూ “అది నాకప్పగించబడిన డ్యూటీలో ఓ భాగం” అంది. డేనియల్‍తో “అవి మాంసాహార పక్షులే అని నాకనిపిస్తోంది” అంది.
“అదే నిజమైతే పైలట్ ప్రాజెక్ట్ ఆ విషయం తెలిసి ఉండేది. అవి ఏ జంతువునో తింటూ కన్పిస్తే తప్ప మనకా విషయం నిర్ధారణ కాదు” అన్నాడు డేనియల్.
“మరి ఎందుకా పక్షి షియోచెంగ్‌ని ఎత్తుకెళ్ళింది?” అంది ఇషిత.
“ఇక్కడ మనుష్య సంచారం లేదు. కనీసం మనుషుల్ని పోలిన జీవుల ఆనవాళ్ళు కూడా లేవు. మన మే ఈ గ్రహం మీద తిరుగాడుతున్న మొదటి మానవులం. ఆ పక్షి కళ్ళకు మనం వింతగా, కొత్తగా కన్పించి ఉంటాం. దాన్ని చూసి మనం భయపడినట్లే, అది మనల్ని చూసి భయపడి ఉంటుంది. అందుకే దాడి చేసింది. ఫైట్ ఆర్ ఫ్లయిట్ మోడ్లో అది ఫైట్‌ని ఎన్నుకుని ఉంటుంది” అన్నాడు డేనియల్.
“మీ అభిప్రాయం తప్పు. అది మనల్ని చంపి తినాలనే ఉద్దేశంతోనే మన మీద ఎటాక్ చేసింది” అంది ఇషిత.
“మనం ఈ గ్రహం మీద కన్పించే పండ్లని ఎందుకు తినడం లేదూ? మనకలవాటులేని పండ్లు కాబట్టి. పక్షులు కూడా అంతే. వాటికి అలవాటైన ఆహారాన్నే తీసుకుంటాయి తప్ప కొత్తవాటి జోలికి పోవు” అన్నాడు డేనియల్.
“ఇక్కడ కార్నీవోరస్ జంతువులు తప్పకుండా ఉంటాయని నా గట్ ఫీలింగ్. లేకపోతే ఇంత సమతుల్యత ఎలా సాధ్యం? ఎటొచ్చీ అటువంటి కార్నీవోర్స్ ఏవో మనం గుర్తించడం అవసరం. ఈ పక్షి కూడా ఆ కోవకే చెంది ఉంటుంది” అన్నాడు శరత్.
ఆ తర్వాత అందరూ మౌనంగా నడవసాగారు. మొసలి తలున్న పక్షి తమ సభ్యుల్లోంచి ఒకతన్ని ఎత్తుకెళ్ళిన సంఘటన వాళ్ళలో చాలా అలజడిని కలుగచేసింది. లోపల చెలరేగుతున్న భయాల్ని సముదాయించుకుంటూ నడుస్తున్నారు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు.
ఆ దారెంట నడుస్తున్నప్పుడు చెట్లని కౌగిలించుకుని కన్పించిన జంతువుల కోసం ఒలీవియా కళ్ళు వెతుక్కున్నాయి. వాటి జాడ కన్పించలేదు. అవే చెట్లు.. తనకు బాగా గుర్తు. వాటి కాండాన్ని చుట్టకుని ఉన్న జంతువులు ఏమయ్యాయో అర్థం కాలేదు. కొంతసేపటి తర్వాత చెట్ల పట్టునుంచి విడివడి లేదా విడిపించుకుని జంతువులు తమదారిన వెళ్ళి ఉంటాయా? ఎంతసేపటి తర్వాత అలా జరిగి ఉంటుంది? ఇదేదో తెల్సుకోవాలి అనుకుంది.
తమకేమీ సంబంధం లేనట్టు, తామేమీ ఎరగనట్టు, ఆ చెట్లు అమాయకంగా నిలబడి ఉన్నాయి.
స్పేస్‌షిప్‌ని చేరుకుని, అందరూ లోపలికెళ్ళారు.
మళ్ళా బైటికెళ్ళే ఉద్దేశం ఎవ్వరికీ లేకపోవడంతో డేనియల్ స్పేస్ షిప్ తలుపుల్ని మూస్తూ యథాలాపంగా బైటికి చూశాడు.
కొద్దిదూరంలో ఉన్న చెట్టు మీద మొసలితలలున్న పక్షులు రెండు కూచుని ఉన్నాయి. వాటి ఎర్రటి కళ్ళు స్పేస్‌షిప్ వైపు తదేకంగా చూస్తున్నాయి.
డేనియల్ ఒళ్ళు భయంతో జలదరించింది. కానీ ఆ విషయం అతను ఎవ్వరికీ చెప్పలేదు.
(ఇంకా ఉంది)
సలీం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కథా, నవలా రచయిత. మానవత్వం ఉట్టిపడే రచనలకు పెట్టింది పేరు. “రూపాయి చెట్టు”, “ఒంటరి శరీరం”, “రాణీగారి కథలు”, “నీటిపుట్ట” వీరి కథా సంపుటులు. “కాలుతున్న పూలతోట”, “అనూహ్య పెళ్ళి”, “గుర్రపు డెక్క”, “వెండి మేఘం” వంటివి వీరి నవలలు.
