[సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన సైన్స్ ఫిక్షన్ నవలిక ‘గ్రహాంతర అన్వేషణ’ను ధారావాహిక అందిస్తున్నాము.]
[అడోనిస్ గ్రహానికి దగ్గరగా ఉన్న మరో గ్రహం ఎఫిమియోస్‌లో గ్రహాధినేత ఈరోస్ చాలా అసహనంగా ఉంటాడు. భూగ్రహం నుంచి బయల్దేరిన స్పేస్‌షిప్ అడోనిస్ గ్రహాన్ని చేరుకోకముందే దాన్ని ధ్వంసం చేయమన్న తన ఆదేశాలు పాటించబడకపోవడానికి కారణాలు అడుగుతాడు. రక్షణమంత్రి మాట్లాడుతూ, స్పేస్‍షిప్‌తో పాటు వ్యోమగాముల్ని ధ్వంసం చేయమని ఓ ఆండ్రాయిడ్‌ని పురమాయించామనీ, దాని చిప్‌ని హ్యాక్ చేయడం ద్వారా తమ ఆధీనంలోకి తెచ్చుకుని, కమాండ్స్ ఇచ్చామనీ. కానీ అది విఫలమైందని చెప్తాడు. తర్వాత దాన్ని మానవ వ్యోమగాములు కెప్లర్ 450 బి అనే గ్రహం మీద ఒంటరిగా వదిలేశారని చెప్తాడు మరో మంత్రి. వాళ్ళెలాగూ గ్రహాన్ని చేరుకున్నారు కదా, ఈసారి పదిమంది సైనికులను పంపి, వాళ్ళని తుదముట్టిద్దామని అంటాడు రక్షణమంత్రి. తమ ప్రణాళిక విషయంలో అధినేతకి భరోసా ఇస్తారు. ఆడోనిస్ గ్రహంపై దిగిన వ్యోమగాములు అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తారు. లేజర్ గన్ తీసుకుని వాళ్ళని అనుసరిస్తుంది నోవా. వాళ్ళకి అక్కడ రకరకాల జంతువులు కనిపిస్తాయి. చెట్లు చిత్రమైన ఆకారాలలో ఉంటాయి. దాదాపు మూడు గంటల పాటు నడిచిన తర్వాత ఒక చెరువు ఒడ్డున కూర్చుంటారు. ఇంతలో ఒక చెట్టు మీద మొసలి తల, నిప్పుకోడి లాంటి శరీరం ఉన్న పెద్ద పక్షి వాళ్ళనే చూస్తూ కనబడుతుంది. వాళ్ళు కాస్త భయపడతారు. ఉన్నట్టుండి ఆ పక్షి అక్కడ్నించి ఎగిరి వెళ్ళిపోతుంది. దాని గురించి మాట్లాడుకుంటూ, స్పేస్‌షిప్‌ని చేరి విశ్రమిస్తారు. మర్నాడు ఉదయం మరో దిశలో నడుస్తారు. చిటేకి తీసిన వీడియోల్లో జంతువులు కౌగిలించుకుని కన్పించిన చెట్లలాంటివి చాలా కన్పిస్తాయి. వాటిని పరీక్షించాలనుకుంటుంది ఒలివీయా. ఒక చిట్టడివి లాంటి ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ, ఎర్రటి కళ్ళతో, మొసలి నోటితో భయం గొలిపేలా ఉన్న పక్షులు వాళ్ళపై దాడి చేసేందుకు సిద్ధమవుతున్నట్టు అనిపిస్తాయి. ఇంతలో మొసలి నోరున్న ఓ పక్షి తన రెండు కాళ్ళతో షియోచెంగ్ రెండు భుజాల్ని పట్టుకుని పైకి లేపి ఎగరేసుకునిపోడానికి ప్రయత్నిస్తుంది. అప్రమత్తంగా ఉన్న నోవా లేజర్ గన్‌తో దాన్ని కాల్చేస్తుంది. దాని పట్టునుంచి జారి కిందపడతాడు షియోచెంగ్. వాళ్ళంతా వెనక్కి మళ్ళుతారు. స్పేస్‌షిప్‌ని చేరుకుని, అందరూ లోపలికెళ్తారు. మళ్ళా బైటికెళ్ళే ఉద్దేశం ఎవ్వరికీ లేకపోవడంతో డేనియల్ స్పేస్‌షిప్ తలుపుల్ని మూస్తూ యథాలాపంగా చూడగా, కొద్దిదూరంలో ఉన్న చెట్టు మీద మొసలితలలున్న పక్షులు రెండు కూచుని స్పేష్‌షిప్ వైపే చూస్తుంటాయి. భయంతో వణికిపోతాడు డేనియల్. – ఇక చదవండి.]
మరునాడుదయం స్పేస్‌షిప్ తలుపుని తెరిచిన డేనియల్ మొదట ఆ చెట్టు వైపే చూశాడు. నిన్న కన్పించిన మొసలి తలున్న రెండు పక్షులు కన్పించకపోవడంతో హాయిగా వూపిరి పీల్చుకున్నాడు.
బైట తిరిగిరావడానికి ఎవ్వరూ ఆసక్తి చూపలేదు. అందరిలో నిన్నటి దుస్సంఘటన కలిగించిన భయం ఇంకా పోలేదు.
ఆ రోజు ఇషిత పంటలు పండించే పనిని మొదలెట్టాలనుకుంది. అందరూ ఆమెకు సహకరించడానికి ఉద్యుక్తులయ్యారు. మూడు నెలల వరకు ఇక్కడే నివసించాలంటే ఇక్కడ పండించే పంటలపైన ఆధార పడక తప్పదు. ముఖ్యంగా కూరగాయలు.. సెలయేటికి కొద్ది దూరంలో ఉన్న విశాలమైన ప్రాంతంలో ఉన్న రాళ్ళూరప్పల్ని ఏరేసి, నేలని చదునుగా చేశారు.
ఇషిత ఆ నేలను నాలుగు భాగాలుగా విభజించింది. భూమినుంచి తెచ్చుకున్న పారలూ పలుగుల సహాయంతో మట్టిని పెళ్ళగించి గుల్లగా చేశారు. ఇషిత ఒక భాగంలో వరిపైరు, మరో భాగంలో గోధుమపంట వేయాలని నిర్ణయించుకుంది. మిగతా రెండు భాగాల్లో కూరగాయలు, ఆకుకూరలు పండించే పనికి పూనుకుంది.
వారం రోజుల వరకు అందరూ ఇషిత సలహాలను అనుసరించి వ్యవసాయప్పనుల్లో నిమగ్నమైపోయారు.
“పంటలు పండించడంలో ఇంత తృప్తి ఆనందం ఉంటాయని నాకిప్పటివరకు తెలియదు” అన్నాడు డేనియల్.
“అసలు మన భూమ్మీద పంటలు పండించడానికి అనుకూలమైన నేల ఎక్కడ మిగిలిందని? ఆరేడు వందల సంవత్సరాల క్రితమే బంగారం పండే సారవంతమైన పొలాల్ని కూడా బహుళ అంతస్తుల నిర్మాణాల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేశారుగా. మన తరం వాళ్ళకు పంటలు పండించడంలో కలిగే అనుభూతి అనుభవంలోకి వచ్చే అవకాశం ఎక్కడుంది?” అన్నాడు శరత్.
“అంతా మానవజాతి స్వయంకృతాపరాధమే. కొన్ని మిలియన్ల సంవత్సరాల వరకు ప్రాణికోటిని పరిరక్షించగలిగే సమర్థత కలిగిఉన్న భూమిని కొన్ని వందల సంవత్సరాలకే నిర్జీవం చేసిన దుర్మార్గం మనదే. అందుకేగా వలస వెళ్ళడం కోసం అనువైన గ్రహాల్ని వెతుక్కోవాల్సిన దుస్థితి మనకు దాపురించింది” అంది ఒలీవియా.
మరో నాలుగు రోజులు స్పేస్‌షిప్ నిలిపి ఉన్న ప్రాంతం నుంచి దూరం వెళ్ళకుండా గడిపాక వాళ్ళకు విసుగనిపించసాగింది.
“ఈరోజు కొత్త కొత్త ప్రాంతాల్ని సర్వే చేద్దామా? యిక్కడ బోర్ కొడ్తోంది” అంది నతాలియా.
“అవును. నాక్కూడా బైట తిరగాలనే అన్పిస్తోంది” అంది సుముగి.
“మళ్ళీ మొసలితలున్న పక్షులు దాడి చేస్తేనో” భయం భయంగా అన్నాడు షియోచెంగ్.
“మనతో పాటు నోవా ఉన్నంత కాలం మనం దేనికీ భయపడక్కరలేదు” అన్నాడు డేనియల్.
“ఆ పక్షుల్ని ప్రతిసారీ మొసలి తలున్న పక్షులని పిలవడం ఇబ్బందిగా లేదా? వాటికో పేరు పెద్దాం. క్రోకోడైల్‌కి షార్ట్ ఫాం క్రాక్ కదా. శరీరం ఆస్ట్రిచ్‌లా ఉంది కాబట్టి రెండూ కలిపి క్రాస్ట్రిచ్ అని పిలుద్దాం” అంది నోవా.
అందరూ కిందికి దిగి, నిన్న నడిచిన దారికి లంబరేఖ దిశలో నడవసాగారు.
కొంతదూరం వెళ్ళాక గుంపుగా పెరిగిఉన్న అయస్కాంత చెట్లు కన్పించాయి. వాటికి కొద్దిదూరంలో రకరకాల జంతువులు తిరుగాడుతున్నాయి.
వెంటనే ఒలీవియాకి ఓ ఆలోచన వచ్చింది.
“మనం ఆ చెట్లను గమనిస్తూ ఇక్కడే కూచుని కొంత సమయం గడుపుదాం. చెట్లు జంతువుల్ని ఆకర్షిస్తున్నాయో లేక జంతువులే చెట్లను పట్టుకుంటున్నాయో ఈ రోజు ఎట్లాగయినా తెల్సుకోవాలి” అంది.
ఆ రహస్యాన్ని ఛేదించాలన్న ఉద్దేశం అందరిలో ఉండటంతో అయస్కాంత చెట్లకు దూరంగా మర్రి చెట్టులా కన్పిస్తున్న ఓ చెట్టు నీడలో కూచున్నారు.
అరగంట గడిచింది.. గంట గడిచింది. వాళ్ళు వూహిస్తున్న సంఘటన ఏమీ జరగలేదు. జంతువులు ఆ చెట్లవైపుకి వెళ్ళకుండా దూరంగా తిరుగుతూ మేత మేస్తున్నాయి.
ఏ మార్పూ లేకుండా మరో అరగంట గడిచింది.
“నాకు బోర్ కొడ్తోంది” అంది సుముగి.
“మేం శాస్త్రవేత్తలం. మేం అనుకున్న ఫలితాన్ని సాధించడం కోసం గంటలేం ఖర్మ, రోజులూ నెలలూ సంవత్సరాలు సైతం ఎదురుచూడగలం” అంది ఒలీవియా.
అదే సమయంలో దుప్పిలా కన్పిస్తున్న జంతువు మెల్లగా ఆ చెట్ల వైపుకు నడవసాగింది.
అందరూ వూపిరి బిగబట్టి దాని వైపే చూడసాగారు.
దుప్పిలాంటి జంతువు ఓ చెట్టుకి ఇరవై అడుగుల దూరంలో నిలబడి తలతిప్పి చూసింది. కొన్ని క్షణాల తర్వాత మెల్లగా మరో ఐదడుగుల దూరం నడిచింది. ఏమీ జరగలేదు. అది యింకో ఐదడుగుల దూరం నడిచి చెట్టుకి పదడుగుల దూరంలోకి రావడం ఆలస్యం చెట్టు పైనుంచి రెండు పొడవాటి టెంటికిల్స్ లాంటివి అత్యంత వేగంగా కదిలి జంతువుని చుట్టేసి, అంతే వేగంతో దాన్ని కాండం వైపుకి లాగాయి. మరుక్షణం జంతువు కాండానికి అతుక్కుపోయి కన్పించింది.
ఒలీవియా తనతో పాటు తెచ్చుకున్న బైనాక్యులర్స్‌ని చెట్టు మీదకి ఫోకస్ చేసింది. జంతువులో కదలిక లేదు. కానీ అది బతికే ఉంది. దాని నాలుగు కాళ్ళూ పొట్ట భాగం, మెడ, నోరు అన్నీ చెట్టుకి అతుక్కు పోయి ఉండటం వల్ల కదల్లేకపోతోందని అర్థమైంది.
“నా ఉద్దేశంలో ఈ చెట్ల కాండం నుంచి జిగురులాంటి పదార్థమేదో వూరి, ఆ జంతువుని అతుక్కుపోయేలా చేస్తోంది. చాలా దృఢమైన గమ్ లాంటిదేదో దాన్నుంచి స్రవిస్తోంది. అందుకే అంత బరువైన జంతువుని కూడా కిందికి పడిపోకుండా పట్టి ఉంచగలుగుతోంది” అంది ఒలీవియా.
మరో గంటసేపు నిశ్చల చిత్రంలా కన్పించింది తప్ప ఎటువంటి మార్పూ లేదు. యింకో అరగంట గడిచాక మెల్లగా ఆ జంతువు శరీరం రంగు మారసాగింది. మరో అరగంటలో దాని శరీరం పూర్తిగా జెల్లీలా మారిపోయింది.
చెట్టు తన రెండు టెంటికిల్స్ ని జెల్లీగా మారిన జంతువు శరీరంలోకి చొప్పించింది. స్ట్రాతో కూల్‌డ్రింక్‌ని తాగినట్టు కొద్దికొద్దిగా జెల్లీని పీల్చేసుకుంది. చెట్టు కాండం నుంచి బైటికి పొడుచుకొచ్చిన పొడవాటి ముళ్ళలాంటివేవో మళ్ళా లోపలికి వెళ్ళిపోయాయి. టెంటికిల్స్ దాని శరీరంలోకి దూరిన గంట తర్వాత చూస్తే అక్కడేమీ మిగల్లేదు.
“యిప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. ఇవి మాంసాహార చెట్లు. జిగురు లాంటి పదార్థంతో జంతువుని బంధించాక, చెట్టు కాండం నుంచి సూదుల్లాంటివి బైటికొచ్చి, జంతువు శరీరంలోకి యాసిడ్ంటి ద్రవాన్ని ఎక్కిస్తున్నాయి. దాని ప్రభావంతో శరీరమంతా జెల్లీగా మారిపోతోంది. అప్పుడు టెంటికిల్స్‌ని దూర్చి దాన్ని పీల్చేసుకుంటోంది. అదే ఈ చెట్లకి ఆహారం. పత్రహరితంతో అవసరం లేకపోబట్టే ఆకులు నీలం రంగులో అంత మందంగా ఉన్నాయి” అంది ఒలీవియా.
“ఈ గ్రహం మీద పర్యావరణ సమతుల్యత ఇలా సాధ్యపడుతోందన్న మాట. జంతువులన్నీ ఆకుల్ని, మొక్కల్ని తిని బతికితే, విస్తారంగా ఉన్న ఈ చెట్లు జంతువుల్ని తిని బతుకుతున్నాయి” అన్నాడు శరత్.
“యింకా నయం. మనం ఆ చెట్లకు సమీపంగా వెళ్ళాము కాదు. లేకపోతే మన శరీరాన్ని కూడా జెల్లీగా మార్చి పీల్చేసుకుని ఉండేవి” అన్నాడు షియోచెంగ్.
“అది తనకు పదడుగుల దూరంలో ఉన్న జంతువుల్నే గుర్తించగలుగుతుంది. వాటి టెంటికిల్స్‌లో బయోసెన్సార్స్ ఉండిఉంటాయి. టెంటికిల్స్ యాక్టివేట్ అయిన క్షణమే కాండం నుంచి జిగురులాంటి పదార్థం స్రవించడం మొదలౌతుంది. జంతువు కాండానికి అతుక్కోగానే సూదుల్లాంటివి దాని శరీరంలోకి గుచ్చుకుని యాసిడ్ లాంటి దాన్ని లోపలికి పంపించి ఉంటాయి” అన్నాడు డేనియల్.
“మన భూగ్రహం మీద మాంసాహార మొక్కలు ఉన్నట్టు కాలేజీ రోజుల్లో చదువుకున్నాను. వీనస్ ఫ్లై ట్రాప్, నెపంథిస్, యుట్రిక్యులేరియా, కోబ్రాలిల్లీ లాంటి మొక్కలు. కానీ మాంసాహార వృక్షాల గురించి విన్లేదు” అంది సుముగి.
“నెపంథిస్ మొక్క ఐదడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. వాటిల్లో ఉండే కూజాలా కన్పించే పిచ్చర్ దాదాపు పన్నెండు అంగుళాల వ్యాసంతో ఉండటంవల్ల ఎలుకల్లాంటి చిన్న చిన్న జంతువుల్ని తిని జీర్ణం చేసుకుంటాయి. కానీ యింత పెద్ద మాంసాహార వృక్షాలు మన గ్రహం మీద లేవు” అంది ఒలీవియా.
“ఈ అయస్కాంత చెట్టు గురించి మనకు బోధపడిందిగా. యిక వెళ్లామా” అంటూ లేచింది ఇషిత.
“అప్పుడేనా? నాకు ఆ చెట్టు శాంపుల్స్ కావాలి. దాని కాండం నుంచి కోసిన ముక్కతో పాటు, దాని ఆకులు కావాలి.”
ఒలీవియా మాటల్ని మధ్యలో తుంచేస్తూ అంది సుముగి – “అవి అయస్కాంత వృక్షాలు కాదు తల్లి. రక్తం తాగే రాక్షస వృక్షాలు. జంతువుల శరీరాల్ని ఎముకల్తో సహా జెల్లీగా మార్చి తినేసే భయంకరమైన చె ట్లు. దాని శాంపుల్స్ కోసం ప్రయత్నిస్తే మనం కూడా జెల్లీగా మారిపోయే ప్రమాదముంది.”
“కానీ ఆ శాంపుల్స్ నాకు చాలా అవసరం. మనం ఈ గ్రహం మీద మూడు నెలల పాటు ఉండబోతున్నాం కాబట్టి ఈ చెట్టు స్రవించే జిగురేమిటో, ఎటువంటి యాసిడ్‌ని జంతువు శరీరంలోకి ఎక్కించి జెల్లీగా మారుస్తుందో తెల్సుకోవడం ముఖ్యం” అంది ఒలీవియా.
“నేను ప్రయత్నిస్తాను” అంది నోవా.
తన చేతిలో ఉన్న లేజర్ గన్ సామర్థ్యాన్ని పది కిలోవాట్లకి తగ్గించి, ఓ కొమ్మను గురి చూసి కాల్చిం ది. చిన్న కొమ్మ తెగి కిందపడింది. దానికి ఐదారు ఆకులున్నాయి. మళ్ళా కాండంవైపు గురిపెట్టి కాల్చింది. పదంగుళాల పొడవు, నాలుగంగుళాల మందం ఉన్న ముక్క వూడిపడింది. కానీ ఆ కొమ్మా, కాండంలోంచి వూడిపడిన ముక్కా చెట్టునుంచి ఆరేడు అడుగుల దూరంలోనే పడ్డాయి.
“ఇప్పుడేం చేద్దాం?” ఒలీవియా నోవాని అడిగింది.
“పొడవాటి కర్ర ఏమైనా ఉంటే దాన్తో లాగేయవచ్చు” అంది నోవా.
శరత్, డేనియల్ కలిసి, చెట్టు కొమ్మల్ని తెంపి, వాటిని కర్రలుగా చేసి, మూడు కర్రల్ని కలిపి కట్టి, మెల్లగా వాటిని లాగేశారు.
స్పేస్‍షిప్ ని చేరుకోవడం ఆలస్యం ఒలీవియా వాటిని పరీక్షించడంలో మునిగిపోయింది. దాని ఆకుల్లో ప్రొటీన్స్ పాటు కాల్షియం, మెగ్నీషియం వంటి ఎలిమెంట్స్ కూడా కన్పించాయి. కాండంలో ఉన్న ముళ్ళలాంటి నిర్మాణాలనుంచి స్రవిస్తున్న యాసిడ్ ఏమిటో అర్థం కాలేదు. అది భూమ్మీద దొరికే ఏ యాసిడ్‌ని కూడా పోలిలేదు. అది ఎముకల్నే కాదు ఇనుముని కూడా కరిగించుకునేంత శక్తివంతంగా ఉన్న విషయం ఒలీవియా గ్రహించింది.
“మనం ఈ గ్రహం మీద ఉన్నన్ని రోజులు ఈ కార్నివోరస్ చెట్లతో జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున కూడా వాటికి సమీపంగా వెళ్ళకూడదు” అని ఒలీవియా మిగతా సభ్యుల్ని హెచ్చరించింది.
***
నాలుగు రోజులు ప్రశాంతంగా గడిచాయి. ప్రతిరోజూ ఉదయం తలుపు తీసిన వెంటనే ఎదురుగా ఉన్న చెట్ల వైపు చూడటం మాత్రం మానలేదు డేనియల్. క్రాస్ట్రిచ్ పక్షులు కన్పించలేదు. కానీ ఐదోరోజు ఉదయం మళ్ళా రెండు పక్షులు కన్పించాయి. వాటి ఎర్రటి కళ్ళు స్పేస్‍షిప్ వైపే తదేకంగా చూడటం గమనించి అతని వొళ్ళు భయంతో కంపించింది.
“మనం ఈ రోజు స్పేస్‌షిప్ దిగి కిందికి వెళ్ళొద్దు” అన్నాడు శరత్‌తో.
అతని భయానికి కారణం తెల్సుకున్న శరత్ కూడా చెట్టు మీదున్న పక్షుల్ని చూశాడు. “వాటికి భయపడి, బైటికెళ్ళకపోతే మూడు నెలలు ఇక్కడ ఎలా గడుపుతాము? యిక్కడ ఏ ప్రమాదం పొంచిఉన్నా దాన్ని ఎదుర్కోక తప్పదు” అన్నాడు.
అందరూ వాటి వైపే చూస్తూ జాగ్రత్తగా కిందికి దిగారు.
“నాలుగు వైపులా ఎంత దూరం నడవగలమో అంత దూరం నడిచి చూసేశాం, ఈ రోజు ల్యాండ్ రోవర్లో వంద కిలోమీటర్ల దూరం వెళ్దాం. సమయం దొరికితే రెండొందల కిలోమీటర్లు కూడా..” అన్నాడు శరత్.
వాళ్ళు మెల్లగా ల్యాండ్ రోవర్ వైపు నడవసాగారు.
నోవా చేతిలో లేజర్ గన్‌తో అప్రమత్తంగా ఉంది.
రోవర్‌ని సమీపించి ఒకరొకరు ఎక్కసాగారు.
తుఫాను వచ్చినట్టు ఒక్కసారిగా గాలిలో ప్రకంపనాలు ఏర్పడ్డాయి.
రెండు పక్షులూ భీకరంగా అరుస్తూ రోవర్లోకి ఎక్కబోతున్న ఇషితని, సుముగిని ఎత్తుకెళ్ళే ప్రయత్నం చేశాయి.
నోవా చేతిలోని లేజర్ గన్ రెండుసార్లు నిప్పులు కక్కింది. రెండు పెద్ద బండరాళ్ళు దొర్లి కిందపడ్డట్టు క్రాస్ట్రిచ్ పక్షుల శరీరాలు నేలకూలాయి.
“నేను చెప్పానా అవి మాంసాహార పక్షులని” అన్నాడు షియోచెంగ్.
“ఒక పక్షిని కాల్చి చంపినందుకు అవి మన మీద పగబట్టినట్టున్నాయి” అన్నాడు డేనియల్.
“పగ, ప్రతీకారాల్లాంటి అవలక్షణాలు మనుషులకుంటాయి గానీ పక్షులకుంటాయని నేననుకోను” అంది సుముగి.
“కాకుల్లో ఆ లక్షణాలుంటాయి” అంది నతాలియా.
“ఈ క్రాస్ట్రిచ్ పక్షులు కూడా కాకి జాతికి చెందినవై ఉండొచ్చుగా” అన్నాడు డేనియల్.
ఆ తర్వాత ఎవ్వరూ మాట్లాడలేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు.
(ముగింపు వచ్చే వారం)
సలీం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కథా, నవలా రచయిత. మానవత్వం ఉట్టిపడే రచనలకు పెట్టింది పేరు. “రూపాయి చెట్టు”, “ఒంటరి శరీరం”, “రాణీగారి కథలు”, “నీటిపుట్ట” వీరి కథా సంపుటులు. “కాలుతున్న పూలతోట”, “అనూహ్య పెళ్ళి”, “గుర్రపు డెక్క”, “వెండి మేఘం” వంటివి వీరి నవలలు.
