Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గ్రహాంతర అన్వేషణ-8

[సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన సైన్స్ ఫిక్షన్ నవలిక ‘గ్రహాంతర అన్వేషణ’ను ధారావాహిక అందిస్తున్నాము.]

[మర్నాడు ఉదయం స్పేస్‌షిప్ తలుపు తెరిచిన డేనియల్ మొదట ఆ చెట్టు వైపు అక్కడ మొసలి తలలున్న రెండు పక్షులు లేకపోవడం చూసి హాయిగా ఊపిరి పీల్చుకుంటాడు. మూడునెలల పాటు అక్కడే ఉండాలి కాబట్టి తమకి అవసరమైన ఆహార ధాన్యాలని పండించుకోడం కోసం ఇషిత నేతృత్వంలో అందరూ వారం రోజుల పాటు పని చేస్తారు. తర్వాత అందరికీ విసుగనిపించి కొత్త ప్రాంతాలని సర్వే చేద్దామని నిర్ణయించుకుంటారు. మళ్ళీ మొసలితలున్న పక్షులు దాడి చేస్తే అంటూ భయం వ్యక్తం చేస్తాదు డేనియల్. వాటికి క్రాస్ట్రిచ్ అని పేరు పెడుతుంది నోవా. కొంత దూరం వెళ్ళాకా, అయస్కాంత చెట్లు కనబడతాయి. వాటిని పరిశీలిద్దామని అంటుంది ఒలీవియా. అందరూ దూరంగా మరో చెట్టు క్రింద కూర్చుని ఓ అయస్కాంత చెట్టుని గమనిస్తూంటారు. కాసేపయ్యాకా ఓ దుప్పి లాంటి జంతువు ఆ చెట్టుకి దగ్గర వెళ్తుంది. అంతే, ఆ చెట్టు నుండి రెండు పొడవాటి టెంటికిల్స్ లాంటివి అత్యంత వేగంగా కదిలి జంతువుని చుట్టేసి, అంతే వేగంతో దాన్ని కాండం వైపుకి లాగుతాయి. ఆ జంతువు చెట్టు కాండానికి అతుక్కుపోతుంది. ఒక గంటన్నర తర్వాత, ఆ జంతువు శరీరం పూర్తి జెల్లీలా మారిపోతుంది. చెట్టు తన రెండు టెంటికిల్స్‌ని జెల్లీగా మారిన జంతువు శరీరంలోకి చొప్పించి, స్ట్రాతో కూల్‌డ్రింక్‌ని తాగినట్టు కొద్దికొద్దిగా జెల్లీని పీల్చేసుకుంటుంది. ఇదంతా బైనాక్సుల్సర్ ద్వారా గమనించిన ఒలీవియా, అది మాంసాహర వృక్షమనీ, పత్రహరితంతో అవసరం లేకపోబట్టే ఆకులు నీలం రంగులో మందగా ఉన్నాయని వివరిస్తుంది. నోవా సాయంతో దాని ఆకులని, కాండంలోని చిన్న ముక్కని తెంపి, పరిశోధించడానికి తీసుకుంటుంది. స్పేస్‌షిప్ చేరుకున్నాకా, చెట్టు ఆకులని, కాండం ముక్కని పరిశోధించి, కాండంలో స్రవిస్తున్న ఆసిడ్ అత్యంత ప్రమాదకరమని తెలుసుకుని, తోటి వ్యోమగాములని హెచ్చరిస్తుంది. మర్నాడు అందరూ రోవర్ ఎక్కబోతుంటే రెండు క్రాస్ట్రిచ్‌లు వచ్చి ఇషితని, సుముగిని ఎత్తుకెళ్ళే ప్రయత్నం చేస్తాయి. నోవా లేజర్ గన్‌తో వాటిని కాల్చి చంపుతుంది. అందరూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండిపోతారు. – ఇక చదవండి.]

రోవర్ నలభై కిలోమీటర్ల వేగంతో పోతోంది. దాదాపు వంద కిలోమీటర్ల దూరం ప్రయాణించాక ఓ తటాకం కన్పించింది. చాలా విశాలంగా చిన్న సైజు సముద్రంలా ఉందా చెరువు. అక్కడి ప్రకృతి సౌందర్యం అతి రమణీయంగా ఉండటంతో అందరూ దిగిపోయి, చెరువు గట్టున మర్రిచెట్టులాంటి పెద్ద చెట్టు నీడలో కూచున్నారు.

దూరంగా జింకల్లా కన్పిస్తున్న జంతువులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి.

“ఈ గ్రహంలో మనుషుల్ని పోలిన బుద్ధిజీవులు ఉద్భవించిన ఆనవాళ్ళేమీ కన్పించలేదుగా” అంది నతాలియా.

“అవును. అటువంటి బుద్ధిజీవులు ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల లేరనుకున్నా, వందల సంవత్సరాల క్రితం వాళ్ళు కట్టుకున్న యిళ్ళు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, ఫ్యాక్టరీల్లాంటి నిర్మాణాలైనా కన్పించాలిగా. ఈ గ్రహం మీద మనలాంటి బుద్ధిజీవులు పరిణామక్రమంలో ఇంకా రూపుదాల్చుకోలేదని అర్థమౌతోంది” అన్నాడు శరత్.

అక్కడి నిశ్శబ్దాన్ని చీలుస్తూ కర్ణకఠోరమైన అరుపు విన్పించింది. అది క్రాస్ట్రిచ్ పక్షి అరుపని వాళ్ళకు అర్థమై తల యెత్తి చూశారు. ఆ చెట్టు మీద నాలుగు పక్షులు కూచుని ఉన్నాయి. వెంటనే అప్రమత్తమైన నోవా తన లేజర్ గన్‌ని వాటి వైపుకు గురిపెట్టి నిలబడింది.

ఓ పక్షి పెద్దగా రెక్కలాడిస్తూ చెరువు పైనుంచి ఎగురుతూ ఆవలి వైపుకి చేరుకుంది. జింకల్లాంటి జంతువులు ప్రాణభయంతో కకావికలుగా పరుగెత్తసాగాయి. ఆ పక్షి ఓ జంతువుని తన బలమైన కాళ్ళ మధ్యన ఇరికించుకుని మళ్ళా ఆకాశంలోకి ఎగిరింది.

నతాలియాతో పాటు మిగతా వాళ్ళు కూడా బైనాక్యులర్స్‌తో ఆ పక్షి ఎటువైపు వెళ్తుందో చూడసాగారు. దూరంగా కన్పిస్తున్న రాళ్ళగుట్టల మీద వాలి, రెండు కాళ్ళతో జంతువుని కదలకుండా పట్టుకుని, తన నోటిలో ఉన్న పదునైన పళ్ళ సాయంతో, చీల్చి తినసాగింది.

“నేను చెప్పాను కదా అది కార్నీవోరస్ పక్షని” అంది నతాలియా.

ఈ లోపల మరో రెండు పక్షులు ఎగురుతూ వెళ్ళి, దాని సమీపంలో వాలాయి. దాని కాళ్ళ కిందున్న జంతువు శరీరాన్ని లాక్కోడానికి అవి ప్రయత్నించడంతో మొదటి పక్షి భీకరంగా అరుస్తూ వాటితో కలబడింది.

“నాకు భయమేస్తోంది. వెళ్ళిపోదాం” అన్నాడు షియోచెంగ్.

ఒలీవియా అతనితో వంత పాడింది.

“అది మాంసాహార పక్షి అని నిర్థారణ అయింది. కానీ అవి మన మీద దాడి చేస్తాయని అనుకోను” అన్నాడు శరత్.

“ఉదయం మనం రోవర్‌ని ఎక్కబోతున్నప్పుడు రెండు పక్షులు దాడి చేశాయిగా” అంది నతాలియా.

“మీరో విషయం గమనించారో లేదో. షియోచెంగ్‌ని ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నించిన పక్షిని చంపేశాక, దాని నిర్జీవ శరీరం చుట్టూ మూగి కొన్ని పక్షులు సంతాపం తెలియచేస్తున్నట్టు కన్పించాయి గుర్తుందా? ఈ గ్రహం మీదున్న పక్షులన్నిట్లోకి అవి చాలా తెలివిగల పక్షులని నా ఉద్దేశం. ఆ రోజు అవి ఒకదానితో ఒకటి వాటి భాషలో మాట్లాడుకున్నాయి. అప్పుడే నిర్ణయం జరిగిపోయింది మన మీద ప్రతీకారం తీర్చుకోవాలని. మరుసటి రోజు మన స్పేస్‌షిప్‌కి ఎదురుగా ఉన్న చెట్టు మీద పొంచిఉండి మన కదలికల్ని గమనించాయి. అవకాశం దొరగ్గానే మనమీద దాడి చేశాయి. ఆ పక్షుల్ని కూడా చంపేశాం కదా. మళ్ళా వాటి కళేబరాల చుట్టూ పదిపన్నెండు పక్షులు మూగి, సంభాషించుకుని ఉంటాయి. మన మీద దాడిచేస్తే మృత్యువుని కౌగిలించుకున్నట్టే అని వాటికర్థమై ఉంటుంది. యింక మన జోలికి రాకూడదని నిర్ణయించుకుని ఉంటాయి” అన్నాడు శరత్.

“అదంతా నీ వూహాగానం తప్ప నిజం కాదుగా” అన్నాడు డేనియల్.

“నేను శరత్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. మనం వాటి ముందుకెళ్ళి నిలబడినా అవి ఏమీ చేయవని నా నమ్మకం. లేకపోతే చెట్టుకింద సునాయాసంగా దొరికే మనల్ని వదిలేసి, దూరంగా ఉన్న జింకల గుంపు మీద ఎందుకు దాడిచేస్తాయి?” అంది నతాలియా.

“అవునా? వెళ్ళి దానిముందు నిలబడు చూద్దాం” వెటకారంగా అన్నాడు డేనియల్.

“చెట్టు మీదున్న పక్షిని చూశావా? అది మనవైపే ఎంత కోపంగా చూస్తోందో” అంది సుముగి.

“నేను బయాలజీ శాస్త్రవేత్తని. జంతువుల, పక్షుల కదలికల్ని బట్టి వాటి ప్రవర్తనని అంచనా వేయగలను. ఆ పక్షి కోపంగా చూడటం లేదు. భయంగా చూస్తోంది. తన తోటి పక్షుల్ని కాల్చి చంపినట్టు తనను కూడా కాలుస్తారేమోనన్న భయం” అంది నతాలియా.

“థియరీలు వద్దు. ప్రాక్టికల్‌గా రుజువు చేయి. అప్పుడు ఒప్పుకుంటాం” అన్నాడు షియోచెంగ్.

“సరే” అంటూ లేచి నిలబడింది నతాలియా.

“వద్దు నతాలియా. మన దగ్గరకు రావడానికి అది సంకోచిస్తూ ఉండొచ్చు. కానీ దానికి సమీపంగా వెళ్తే దాడిచేయవచ్చు” ఆమెను వారిస్తూ అన్నాడు శరత్.

“ఏం కాదు. డోంట్ వర్రీ” అంటూ నవ్వి, మెల్లగా నడిచి, సరిగ్గా క్రాస్ట్రిచ్ పక్షి కూచుని ఉన్న కొమ్మ కిందికెళ్ళి నిలబడింది.

పక్షి తన ఎర్రటి కళ్ళతో నతాలియానే చూస్తోంది.

మిగతా అందరూ వూపిరి బిగబట్టి చూస్తున్నారు. నోవా మాత్రం లేజర్ గన్ని గురిపెట్టి, పేల్చడానికి తయారుగా నిలబడి ఉంది.

నతాలియా కళ్ళు పైకెత్తి పక్షి వైపు చూసింది. పక్షి కళ్ళల్లో బెదురు కన్పించింది.

చేతులు పైకెత్తి వూపుతూ “రా.. కిందికి రా” అంది.

“అలా చేస్తే ప్రమాదం నతాలియా. యింక చాలు వచ్చేయి” అంటూ కేకపెట్టాడు శరత్.

క్రాస్ట్రిచ్ పక్షి పెద్దగా అరుస్తూ, తన విశాలమైన రెక్కల్ని విప్పింది.

నోవా చూపుడు వేలు ట్రిగ్గర్ మీద బిగుసుకుంది.

మరుక్షణం అది రెక్కలు ఆడిస్తూ, పైకెగిరి దూరంగా వెళ్ళిపోయింది.

దాని అరుపుకి భయంతో బిగుసుకుపోయిన నతాలియా అది దూరంగా వెళ్ళిపోవడంతో పెద్దగా నవ్వింది. విజయం నాదే చూశారా అన్నట్టు తెరలు తెరలుగా నవ్వింది.

***

వాళ్ళు అడోనిస్ గ్రహాన్ని చేరుకుని రెండు నెలలు దాటి ఆరు రోజులు..

రాత్రి ఎప్పటికిమల్లె ఏడింటికే భోజనాలు చేసేసి, కొద్దిసేపు కబుర్లలో పడ్డారు. ఎనిమిదింటికి పడగ్గదులకు వెళ్ళబోతున్న సమయంలో డిస్‌ప్లే స్క్రీన్ మీద కన్పించిన మెసేజ్ చూసి అందరూ షాక్‌కి లోనయ్యా రు. ఓ స్పేస్ షటిల్ ఆ గ్రహం వైపుకు వస్తోందని సమాచారం.. అది ప్రయాణిస్తున్న వేగాన్ని బట్టి మరో రెండు రోజుల్లో గ్రహాన్ని చేరుకుంటుందని వెలుగుతూ ఆరుతూ కన్పించింది.

ఇంతకూ ఆ స్పేస్ షటిల్‌ని ఎవరు పంపారో ఎందుకు పంపారో వాళ్ళకు అర్థం కాలేదు. అది తప్పకుండా భూగ్రహం నుంచి వస్తోన్న షటిల్ కాదని వాళ్ళకు తెలుసు.

“మనం వచ్చినట్టే వేరే గ్రహవాసులెవరైనా వస్తున్నారేమో” అన్నాడు డేనియల్.

“ఎందుకొస్తున్నట్టు?” నతాలియా ప్రశ్నను లేవనెత్తింది.

“మనం ఎందుకొచ్చామో వాళ్ళూ అందుకే వస్తున్నారేమో. చెప్పలేం. వాళ్ళు చేరుకున్నాకే ఏ లక్ష్యంతో వస్తున్నారో తెలుస్తుంది” అన్నాడు శరత్.

“వాళ్ళని రాకుండా ఆపలేమా?” అంది ఇషిత.

శరత్ మెత్తగా నవ్వాడు. “ఈ గ్రహం ఎవరి సొంతమూ కాదు. ఎవరైనా రావొచ్చు. కావాలనుకుంటే యిక్కడ నివాసం ఉండొచ్చు” అన్నాడు.

“మనకు పోటీకి వస్తారేమో?” అన్నాడు షియోచెంగ్.

“అలా ఎందుకనుకోవాలి? ఎవరిపాటికి వాళ్ళుండొచ్చుగా. మన భూగ్రహమంత విశాలమైన గ్రహం ఇది. ఎంతమందినైనా అక్కున చేర్చుకుంటుంది” అన్నాడు శరత్.

శరత్ ఎన్ని ధైర్యవచనాలు చెప్పినా మిగతా వాళ్ళ మనసుల్లో అలజడి ఇసుక తుఫానులా చెలరేగుతూనే ఉంది.

రెండు రోజుల తర్వాత డిస్ప్లే స్క్రీన్ మీద ఆ స్పేస్ షటిల్ పన్నెండు కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ అయినట్టు సమాచారం కన్పించింది.

ఎందుకైనా మంచిదని శరత్, అతని బృందం ఆ రోజు కిందికి దిగకుండా లోపలే ఉండిపోయారు.

కొత్తగా వచ్చిన స్పేస్ షటిల్‌లో ఎంతమంది ఉన్నారో, ఏ ఏలియన్ గ్రహం నుంచి వచ్చారో, వాళ్ళు శాంతి కాముకులో, హింసోన్మాదులో, ఏ ఉద్దేశంతో వచ్చారో తెలిసేవరకు వాళ్ళకు ఎదురుపడి ప్రమాదాన్ని కొనితెచ్చుకోదల్చుకోలేదు.

ఎక్కువ సమయం ఎదురుచూడకుండానే వాళ్ళెందుకొచ్చారో తెలిసిపోయింది. స్పేస్ షటిల్ ల్యాండ్ అయిన రెండు గంటలకు పది మంది ఏలియన్స్ ల్యాండ్ రోవర్లోంచి దిగారు. వాళ్ళ చేతుల్లో చిన్న మొబైల్ ఫోన్ పరిమాణంలో వింతగా కన్పిస్తున్న మారణాయుధాలేవో ఉన్నాయి. వాళ్ళ శరీరాలు నీలిరంగులో మెరుస్తున్నాయి. ఆరున్నర అడుగుల ఎత్తులో ఉన్న భారీ శరీరాలు.. వాళ్ళ తలల మీద జుట్టు బదులు అడుగు పొడవున్న సన్నటి యాంటెన్నాలున్నాయి. కనుముక్కు తీరు కొద్ది తేడాలతో భూగ్రహవాసులకు మల్లే ఉంది.

“అందరూ నిరాయుధులై కిందికి దిగండి. పది నిమిషాల్లో కిందికి దిగకపోతే మీ స్పేస్‌షిప్‌ని క్షణాల్లో బూడిద చేయగలం” అంటూ వాళ్ళలో ఒకతను హూంకరించాడు.

నోవా ఆయుధాలు దాచిన కంటెయినర్ వైపు పరుగెత్తి, లేజర్ గన్స్, ప్లాస్మా గన్స్ తెచ్చి వాళ్ళ ముందు పెట్టి, “తొందరగా గన్స్ తీసుకోండి. వాళ్ళ వాలకం చూస్తే స్నేహపూర్వకంగా లేరు. మనల్ని మట్టు పె ట్టే ఉద్దేశంతోనే వచ్చినట్టున్నారు” అంది.

“మన చేతుల్లో ఆయుధాలు కన్పిస్తే వాళ్ళు వెంటనే కాల్పులకు తెగబడ్డారు. వాళ్ళ ఆయుధాలు ఎంత శక్తివంతమైనవో తెల్సుకోకుండా తొందరపడటం మంచిది కాదు. మనం నిరాయుధులుగానే దిగిపోదాం. నోవా తన కోటులోపల ఆయుధాల్ని దాచుకుని మనతో పాటు దిగుతుంది. అయినా వాటి అవసరం వస్తుందని నేననుకోను” అన్నాడు శరత్.

అందరూ ఒకరి వెనుక ఒకరు మెల్లగా కిందికి దిగారు. అందరికన్నా వెనగ్గా నోవా దిగింది.

“నా పేరు ఆల్డో. స్పేస్ షటిల్ కమాండర్‌ని. మీరీ గ్రహం మీదికి ఎందుకొచ్చారో చెప్పండి” యిందాక హూంకరించిన వ్యక్తి కొద్దిగా ముందుకొస్తూ అడిగాడు.

“నా పేరు శరత్‌చంద్ర. మా స్పేస్‌షిప్‌కి కమాండర్‌ని. మేము నివసించే భూగ్రహం విషతుల్యమైపోయింది. భూతాపం విపరీతంగా హెచ్చింది. వరదలు, భూకంపాలు, సునామీలు.. రకరకాల ఉపద్రవాలతో యిప్పటికే ఎనభైశాతం మంది చనిపోయారు. మిగిలిన మనుషుల్ని కాపాడుకోడానికి అనుకూలమైన గ్రహాల అన్వేషణ మొదలెట్టాం. ఈ గ్రహానికి మా భూగ్రహానికి చాలా దగ్గరి పోలికలుండటంతో ఈ గ్రహాన్ని మా నివాసంగా చేసుకుందామనే ఉద్దేశంతో వచ్చాం” అన్నాడు శరత్.

“వీల్లేదు. ఇది మా గ్రహం. వేరే గ్రహవాసులకు యిక్కడ చోటు లేదు. వెంటనే వెళ్ళిపొండి. మీకు రెండు రోజుల సమయం ఇస్తున్నాను. వెళ్ళకపోతే మీకు చావు తప్పదు” అన్నాడు ఆల్డో.

“విశ్వాంతరాళంలో ఉన్న గ్రహాలు ఎవరి స్వంతమూ కాదు. వాటి మీద నివసించే హక్కు అందరికీ సమానం. కాదనే అధికారం మీకెక్కడుంది?” అన్నాడు శరత్.

“మా గ్రహం ఎఫిమియోస్, ఈ అడోనిస్ గ్రహం రెండూ సిస్టర్ ప్లానెట్స్. ఈ రెండు గ్రహాలు ఒకే నక్షత్రం చుట్టూ తిరుగుతుంటాయి. వైశాల్యం, ద్రవ్యరాశి, భ్రమణవేగం, వాతావరణ పరిస్థితులు అన్నీ ఒకేలా ఉంటాయి. భవిష్యత్తులో ఈ గ్రహంతో అవసరం రావొచ్చనే ఉద్దేశంతో గత కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రహాన్ని మాకనుగుణంగా తీర్చిదిద్దుకుంటున్నాం. అందుకే ఇది మాది. దీనిమీద మాకే అధికారం ఉంది” అన్నాడు ఆల్డో.

“మీ గ్రహం కూడా మా భూగ్రహంలానే నివాసయోగ్యం కాకుండా పోయిందా?”

“లేదు. మీ భూగ్రహం గురించి మేము తెల్సుకున్నాం. మీరు చేసిన తప్పుల వల్లనే భూమి నిస్సారమైపోయింది. మీ దురాశ వల్ల పచ్చదనమే లేకుండా చేసుకున్నారు. ఆక్సిజన్ తగ్గి కార్బన్ డయాక్సైడ్ శాతం పెరిగింది. దానికి తోడు మీ గ్రహవాసులు యుద్ధోన్మాదులు. నిరంతరంగా కొనసాగిన యుద్ధాల్లో ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు వాడి మీ ఉనికినే ప్రశ్నార్థకం చేసుకున్నారు. మా గ్రహవాసులు అలాంటి తప్పులేమీ చేయలేదు. అందుకే మా గ్రహం ఇప్పటికీ సుభిక్షంగా ఉంది. దానివల్లనే జనాభా విపరీతంగా పెరిగిపోయింది. జనాభా సాంద్రత తగ్గించడానికి సగం మందిని ఈ గ్రహం మీదకి పంపాలనే ఆలోచనలో ఉన్నాం” అన్నాడు ఆల్డో.

“జనాభా సాంద్రతను తగ్గించుకోడానికి ఈ గ్రహం మీకవసరం. కానీ మాకిది జీవన్మరణ సమస్య. సహృదయంతో ఆలోచించండి. చాలా విశాలమైన గ్రహం ఇది. యిక్కడ మీతో పాటు మేము కూడా ఉండటం వల్ల మీకెటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ఉత్తర భాగంలో మీ కాలనీలు ఏర్పాటు చేసుకోండి. మే ము దక్షిణ భాగంలో మా నివాసాలు ఏర్పాటు చేసుకుంటాం” అభ్యర్థనగా అన్నాడు శరత్.

“మేం అంగీకరించం. మీ భూగ్రహవాసులు ఇక్కడికి చేరుకుంటే ఈ గ్రహాన్ని కూడా నాశనం చేస్తారు. మీకు అధికారదాహం ఎక్కువ. ఈ గ్రహం యొక్క క్షేమం కన్నా తమ అవసరాలకు, సౌఖ్యాలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చే స్వార్థపరులు. చిన్నచిన్న మనస్పర్థలకే కత్తులు దూసే జాతి. ఈ గ్రహం స్వర్గంలా ఉంటుంది. మీరు దీన్ని నరకంలా మార్చేస్తారు. ఏదో రోజు మొత్తం గ్రహాన్ని ఆక్రమించుకోవాలనే దురాశతో మా మీద యుద్ధం ప్రకటిస్తారు. మేం శాంతి కాముకులం. మీవంటి యుద్ధోన్మాదులకు యిక్కడ చోటులేదు.”

“మీ అభిప్రాయం నిజమే. కానీ అది గతానికి మాత్రమే పరిమితమైన నిజం. ఇప్పుడు మా గ్రహం మీద బతికున్న ఇరవై శాతం మందిలో అటువంటి లక్షణాలేవీ లేవు. ప్రాణాల్ని ఎలా కాపాడుకోవాలో తెలియక అవస్థ పడ్తున్న భూగ్రహవాసుల్లో ప్రశాంతంగా బతకాలన్న కోరిక తప్ప యుద్ధాలు చేసే ఉద్దేశం ఏ కోశానా లేదు. మా పరిస్థితిని అర్థం చేసుకోండి. మనం ఇదే గ్రహం మీద సామరస్యపూర్వకంగా కలిసి ఉందాం. కాదనకండి. భూమ్మీద చావుబతుకుల్లో ఉన్న మానవజాతికి ప్రాణదానం చేయండి” అన్నాడు శరత్.

తను ఎంత కోపంగా మాట్లాడినా ప్రశాంతంగా సమాధానమిస్తున్న శరత్‌ని ఆల్డో మనసులోనే మెచ్చుకున్నాడు. అతను ప్రాధేయపడ్తున్నాడు తప్ప కయ్యానికి కాలు దువ్వడం లేదు.

ఆల్డో మెత్తబడ్డాడు. “కొన్ని కోట్లమంది ప్రాణాల్ని కాపాడాలన్న కోరిక తప్ప దురాక్రమణ చేయాలన్న ఉద్దేశం మీలో కన్పించడం లేదు. మీ అభ్యర్థనని అంగీకరించే అధికారం నాకు లేదు. ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సింది మా సుప్రీమ్. మీరు ఆయన్ని ఒప్పించగలిగితే మీ కోరిక నెరవేరుతుంది” అన్నాడు.

“మీ సుప్రీమ్‌తో మాట్లాడే అవకాశం కల్పించండి” అన్నాడు శరత్.

“దానికోసం మీరు మా స్పేస్ షటిల్ లోకి రావాల్సి ఉంటుంది” అన్నాడు ఆల్డో.

మిగతావాళ్ళు వద్దని వారిస్తున్నా వినకుండా శరత్ వాళ్ళ రోవర్‌లో బయల్దేరాడు..

చాలాసేపు నచ్చచెప్పాక సుప్రీమ్ ఓ కండిషన్‌తో ఒప్పుకున్నాడు. “మీరు భూగ్రహంలో చేసిన తప్పులు, దుర్మార్గాలు, హింసాకాండ అడోనిస్ గ్రహం మీద చేయకూడదు. అలా చేస్తున్నారని తెల్సిన మరుక్షణం మిమ్మల్ని మళ్ళా మీ గ్రహం మీదికి రవాణా చేస్తాం. అందుకు సమ్మతిస్తే మీరు మా సోదరుల్లా అడోనిస్ గ్రహ మీద నివాసం ఉండొచ్చు” అన్నాడు.

భూగ్రహవాసులందరి తరఫున శరత్ అతనికి హామీ ఇస్తూ, ధన్యవాదాలు తెలిపాడు.

ఆలస్యమయ్యేకొద్దీ శరత్ ఏమైపోయాడోనని ఆందోళన పడ్తున్న మిగతా సిబ్బందికి అతను నవ్వుతూ రావడం చూడగానే అర్థమైపోయింది అంతా సవ్యంగానే జరిగిందని.

అడోనిస్ గ్రహం మీద పూర్తిగా మూడు నెలలు గడిపాక శరత్ గ్రౌండ్ కంట్రోల్తో పాటు భార్గవతో మాట్లాడాడు. “అడోనిస్ గ్రహం భూగ్రహవాసుల కోసం ఎదురుచూస్తోంది. మనషుల మనుగడకు అత్యంత అనుకూలమైన గ్రహం ఇదని ఈ మూడునెలల కాలంలో అనుభవపూర్వకంగా తెల్సుకున్నాం. మీరు ప్రజల్ని యిక్కడికి రవాణాచేసే పనిని మొదలెట్టవచ్చు. యిక్కడకు వచ్చే సాటి మానవులకు స్వాగతం పలకడానికి మేమందరం తయారుగా ఉన్నాం” అన్నాడు.

“గ్రేట్ అఛీవ్‌మెంట్ శరత్. మీరు మానవాళికి మహోపకారం చేశారు. చరిత్రలో మీ అందరి పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి” సంతోషంతో పొంగిపోతూ అన్నాడు భార్గవ.

(సమాప్తం)

Exit mobile version