[శ్రీ ఘట్టమరాజు అశ్వత్థనారాయణ రచించిన ‘గ్రంథాంతరంగం’ అనే పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు డా. కొప్పరపు నారాయణ మూర్తి.]
‘వంగూరివారిలో కొత్త కావ్యసంప్రదాయం నెలకొనేటప్పుడు అంతకు పూర్వం ఉండిన భాషాసాహిత్య వాతావరణం వల్ల అది ప్రభావితమవుతుందని, తర్వాత స్థాపింప బడ్డ నవ్య సంప్రదాయం, అంతకు ముందటి సంప్రదాయంతో ప్రభావితమై కొంతగానో, గొప్పగానో మార్పులు, చేర్పులు, సంతరించుకొని నవ్య సంప్రదాయం వర్ధిల్లుతుంది’ – వంగూరి సుబ్బారావు పంతులు, ‘ఆంధ్ర వాఙ్మయ చరిత్రము’.
వంగూరి వారి ఈ సునిశిత పరిశీలనను, అలాగే నన్నయ్యకు పూర్వమే జైన, బౌద్ధ కావ్య వాఙ్మయం తెలుగులో ప్రబలంగా వ్యాప్తిలో ఉండినదన్న ప్రతిపాదనను, తిక్కన్న కన్నా వేమననే ‘ప్రజాకవి’ అన్న విశ్లేషణను శిలాశాసనంగా శ్లాఘించారు ఘట్టమరాజు అశ్వత్థనారాయణ తన ఇటీవలి వ్యాస సంపుటి ‘గ్రంథాంతరంగం’లో.
‘ఘట్టమరాజు’ అనే సంక్షిప్త నామంతో ‘తెలుగు సాహితీ విమర్శకు’ మరో పేరన్నట్టు సుమారు ఆరు దశాబ్దాలు తెలుగు సాహిత్యలోకంలో సాహితీ విమర్శకుడిగా విలసిల్లారు ఘట్టమరాజు అశ్వత్థనారాయణ. లబ్ధప్రతిష్ఠులైన అనేకమంది తెలుగు పండితులు, ఆచార్యులు ఆయన చేత తమ సాహిత్య గ్రంథాలకు, పరిశోధనా గ్రంథాలకు ముందు మాట రాయించుకొన్న సంగతి సాహితీ లోకానికి తెలియనిదేమీ కాదు. అంతేగాదు, ప్రఖ్యాత సాహిత్య విమర్శకుడు, జానపద సాహిత్య పరిశోధకుడు ఆర్.వి.యస్ సుందరంతో ‘రాళ్ళపల్లి పీఠికలు’ (1978) అనే గ్రంథాన్ని, ఆర్.వి.యస్ సుందరం, తంగిరాల సుబ్బారావు గార్లతో కలిసి ‘ఆలిచిప్పలు – ఆణిముత్యాలు (1972), ఆర్.వి.యస్ సుందరం, శివలెంక శ్రీరామచంద్ర మూర్తి గార్లతో కలిసి ‘అనంతరాగం’ (1977-రాళ్ళపల్లి అభినందన గ్రంథం), ఎమెస్కో డి. చంద్రశేఖర రెడ్డి సంపాదకత్వంలో వెలువడిన ‘రాళ్ళపల్లి సాహిత్య సంగీత వ్యాసాలు’ (2017) గ్రంథానికి, ‘వదరుబోతు’ వ్యాసాలు (2017) సంపుటికి పీఠికాకర్తగా వ్యవహరించారు. ‘వేమన సంపూర్ణ జీవిత చరిత్రము-బోధనలు: వంగూరి సుబ్బారావు’ గ్రంథానికి పీఠిక రాసిన అపూర్వమైన చరిత్ర ఘట్టమరాజుది.
తెలుగు సాహిత్యంలో గత శతాబ్దంలో ఎన్నో అమూల్యమైన సాహితీ రచనలు వచ్చాయి. వాటిలో చాలా గ్రంథాలు నేటి తరం వారికి పరిచయం ఉండే అవకాశమే లేదు. తెలుగు ప్రత్యేక విషయంగా స్నాతకోత్తర విద్య చదివిన వారికి కూడ గత శతాబ్ద కాలంలో వచ్చిన అన్ని పుస్తకాల పరిజ్ఞానం ఉండే అవకాశం లేదు. ముఖ్యంగా వంగూరు సుబ్బారావు పంతులు (1890-1936) రాసిన ‘ఆంధ్ర వాఙ్మయ చరిత్రము’, బసవరాజు అప్పారావు (1894-1933) ‘ఆంధ్ర కవిత్వ చరిత్రము’, భోగరాజు నారాయణ మూర్తి (1891-1940) ‘ఆంధ్ర కవిత్వ చరిత్రము’, కల్లూరి నారాయణ రావు (1871-1927) ‘కవిత్వవేది’ గ్రంథాలు నేడు చాలా మంది సాహితీమూర్తులకు తెలియదు. ఈ రచయితలందరూ అల్పాయిష్కులే. 19వ శతాబ్దం చివరన జన్మించి, 20వ శతాబ్దం ఆరంభంలోనే అసువులు బాసారు.
అయినా వీరి రచనలు అమూల్యమైన శాస్త్రీయమైన సాహితీ చర్చని తరువాతి తరాలకు అందించిందన్న సంగతి ఘట్టమరాజు ‘గ్రంథాంతరంగం’ ద్వారాలోకానికి వెల్లడైంది. అంతేగాదు, ఈ పుస్తకాల ప్రాథమిక పరిజ్ఞానం కూడ లేకుండా తెలుగు సాహిత్యంలో ఎవ్వరి జ్ఞానం పరిపూర్ణం, సమగ్రం కాదనిపిస్తుంది.
‘కవుల జీవితము మాత్రము పరిశీలించినచో భాషా సమిష్టి చరిత్రము చక్కగా వేద్యము కానేరదు. వ్యష్టి కన్నా మొత్తము మీద సమిష్టి ప్రధానము. వాఙ్మయ సర్వస్వము ఏకసత్తుగా గొని చరిత్ర శోధనము చేసిన వారిలో వంగూరి సుబ్బారావుగారు ప్రప్రథములు. ఈ చరిత్రములోని విషయములు ఇతర గ్రంథములందు గన్పట్టినప్పటికిని, కర్త దృష్టియు, అవి కూర్పబడిన తీరును వేరు’ అని కట్టమంచి రామలింగారెడ్డి వంటి సుప్రసిద్ధ సాహితీ వేత్తలు వంగూరిని కొనియాడారు.
వంగూరి వారి వాఙ్మయ శోధనంతా ‘పరిశీలన’ (ఆబ్సర్వేషన్) పధ్ధతిలో సాగింది. సాహిత్య పరిశోధనలో తొలి శతాబ్దాలలో ‘పరిశీలనాత్మక శోధనా పద్ధతే’ ప్రామాణికంగా భావించారు. ఆ కాలం నాటిదే వంగురివారి పరిశోధన కూడా. ఈ పధ్ధతి పూర్తిగా శాస్త్రీయమైంది కాకపోయినా, నేటికీ దీనిని కొనసాగిస్తున్న పరిశోధకులు ఉండటం ఆశ్చర్యం. నేడు సాహిత్య శోధనలో పాశ్చాత్య సామాజిక పరిశోధనా పద్ధతులు, తులనాత్మక అధ్యయనాలు వినియోగిస్తున్నారు. మార్క్సిజం, పోస్ట్ మోడర్నిజం నేపథ్యంలో తెలుగు సాహిత్య విశ్లేషణను జరుపుతున్నారు. కానీ, ఈ పద్ధతులు ఏమీ లేని రోజుల్లోనే వంగూరి వారు చాలా సునిశిత విశ్లేషణలు, ప్రతిపాదనలు చేశారు. వాటిలో కొన్ని ఫలప్రదమైన పరిశీలనలు, ప్రతిపాదనలు కాగా, కొన్ని వివాదాస్పదమైనవి. నేటి శాస్త్రప్రమాణాలకు నిలవనివి.
ఉదాహరణకు ‘వాఙ్మయం’ అనే శబ్దాన్ని రసవంతమైన కావ్యాలకు పరిమితం చేశారు. ‘భాష కానీ, పదాజాలము కానీ ‘వాఙ్మయం’ కానేరదు. కేవలం పదవికారములగు వాక్యములుండు లక్షణ గ్రంథములు, శాస్త్రములను గూడ వాఙ్మయం కాజాలవు’ అని ఢంకా మోగించి తెలిపారు వంగూరివారు. నన్నయ్య మహాభారత రచనకు పూర్వమే తెలుగులో జైన , భౌద్ధ మత వాఙ్మయం (కావ్యాలు) ఉండేదని, కేవలం ఆ మతాల ఉనికిని పూర్తిగా నాశనం చేసే లక్ష్యంతోనే వైదిక మతోద్ధరణ చేయాలనే సంకల్పంతోనే మహాభారత రచన నన్నయ్య చేశాడని వంగూరి వారి ప్రతిపాదన. ఆ విధంగా పూర్వ వాఙ్మయమునకు మహాభారత రచన తీవ్ర అపకారం చేసిందని వారి నిశ్చితాభిప్రాయం. తిక్కన తేనెలూరే తెలుగులో భారతాన్ని ఊరవేయటంతో తిక్కన్న పై వ్యాఖ్యానించక లేక పోతున్నానని, పూర్వ జైన, బౌద్ధ తెలుగు కావ్యాలను నాశనం చేసి, తెలుగు భాషకు అన్యాయం చేశారని నన్నయ్యపై విరుచుకుపడటం వంగూరి వారి పరిశోధనకు పరాకాష్ట. తిక్కన్న కంటే, వేమన భావములు గొప్పవని, అందుకే ‘వేమన’ నిజమైన ‘ప్రజాకవి’ అని నేటికి నూరేళ్ళ కిందటే ఉగ్గడించాడు వంగూరి. అయితే, నన్నయ్యను ‘ఆదికవి’గా పరిగణించటానికి ఇష్టపడక పోవటం,, తిక్కన్నను కాలంతో సంబంధం లేకుండా నాలుగు శతాబ్దాల తరువాత వాడైన వేమనతో పోల్చటం వంటివ వంగూరి వాదనలు వివాదాస్పదమే నేటి పరిశోధనా ప్రమాణాల దృష్ట్యా.
మధ్యభారతంలోని సాంచీ స్థూప నిర్మాతలు ఆంధ్రులని, ప్రాచీన కన్నడ కవులైన పంప, పొన్న, నాగవర్మ మొదలైన ఎంతోమంది కవులు తెలుగువారే అని వంగూరి పేర్కొన్నారు. అంతేగాక తెలుగువారే కన్నడిగుల తొలి ‘విద్యా గురువు’ అని గర్వంగా చాటారు. తెలుగువారు ద్రావిడులు కారని, మరాఠీ లానే తెలుగు, కన్నడ భాషలు ప్రాకృత జన్యాలని అయన అనటం వివాదాస్పదమే. ద్విపద కావ్యాలను ‘పాటల వాఙ్మయం’ అని పేర్కొంటూ, ‘పలనాటి వీరచరిత్ర’ను ‘ప్రధమ వీరగీతం’ అని ప్రకటించారు.
వంగూరి వారు అల్పజీవి. నలభై ఆరేళ్లకే కాలం చేసినా, ‘ఆయన ‘ఆంధ్ర వాఙ్మయ చరిత్రము’ తెలుగు సాహిత్యానికి ఒక సముద్ర దిక్సూచి వంటిది. తెలుగు సాహిత్యంలోని అనేక విభాగాలకు ఆయన ఇచ్చిన, నిర్వచనాలు నేటికీ ఆచరణీయం. అసలా విధంగా తెలుగు సాహిత్యాన్ని, సమకాలీన సామాజిక స్థితిగతులతో తులనాత్మకంగా కిందనుంచి పైకి పరిశోధించి ప్రతిపాదనలు చేయటం ఆయన తరువాత వారికెవ్వరికీ సాధ్యం కాలేదంటే అతిశయోక్తి కాదు.
తెలుగు కావ్యాలలో ‘రసపోషణ’ పై తులనాత్మక అధ్యయనం చేసిన తొలి తెలుగు కవి, సాహిత్య మూర్తి బసవరాజు అప్పారావు. ఆయన 1920ల్లో రాసిన ‘ఆంధ్ర కవిత్వ చరిత్రము ‘రస’ విశ్లేషణ, ‘రస’పోషణ, ‘రస’భావ సిద్ధి వంటివాటిని నిర్దుష్టముగా నిర్వచించి, విడమరచి సాహిత్య లోకమునందుంచింది. బసవరాజుగారు సంప్రదాయ వ్యాకరణ పండితులు ‘రస’భావ పోషణకు కావ్యంపై విధించిన నియమాలను వ్యతిరేకించారు. ఆయన స్వయంగా భావకవి కావటం వలన ‘భావం రసాత్మకం’ అన్న భావం తోనే తన ఆరు ప్రకరణాల ‘ఆంధ్ర కవిత్వ చరిత్రము’ రచించారు. నేటి సంక్షుభిత ప్రపంచంలో ‘సనాతన రస భావం’ తిరిగి నెలకొనాలని బసవరాజు అప్పారావు ఆకాంక్ష.
‘అనంతా వై రసాః’ అన్న వారి ప్రకరణము కేవలం పదకొండు పేజీలే అయినా అందులోని విషయం సర్వకాలీనము. ‘రసాలు ఎన్నయినా ఉండవచ్చన్నారు’– బసవరాజు అప్పారావు. ఈ విషయంలో వారు కట్టమంచి రామలింగా రెడ్డి ‘భావనాశక్తి’ని తలకెత్తుకున్న వైనాన్ని ప్రశంసించారు. ‘ఆంధ్రకవులలో నెల్లయూ భావనాశక్తి ప్రదర్శకమగు మితభాషిత్వం దిక్కన్నయు, వేమనయు ముఖ్యులును, నీడులేని వారును’ అని కీర్తించారు బసవరాజు అప్పారావు. అయన భావనాశక్తి, ఊహాశక్తిల తారతమ్యాన్ని, ఒకదానినొకటి ఎలా ప్రభావితం చేస్తుందో అద్భుతంగ చిత్రించారు. మానవుని స్వభావం తెలిపే వాగ్రూపమే రూపమే ‘శైలి’ అని ‘శైలి’ నిర్వచనం చేశారు.
రాయప్రోలు సుబ్బారావు రాసిన ‘తృణకంకణం’ పుస్తకానికి ప్రకాశకుల విజ్ఞప్తిలో ‘భావకవిత్వం’ అనే పదం మొదటి సారి ప్రయోగించిన మనిషి గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారని ఆచార్య నారాయణ రెడ్డి తన పరిశోధనా గ్రంధం – ‘ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయములు, ప్రయోగములు’– లో పేర్కొన్నారు. అయితే ఈ కాలం వాడైన అక్కిరాజు ఉమాకాంతం నాటి భావకవిత్వాన్ని ఏకి పారేశాడు. భావకవులు, భావకవితాప్రియులు అయిన ఆ కాలం నాటి విద్వద్వరేణ్యులు అక్కిరాజు విమర్శ జోరుకు ఉక్కిరి బిక్కిరై మిన్నకుండి పోయారు. 1928లో అక్కిరాజు ఉమాకాంతం వారి ‘నేటి కాలపు కవిత్వం’ వెలువడింది. ప్రాచీన సంప్రదాయాల్ని విమర్శించడంవల్ల నూతనత్వం వస్తుందన్న నాటి భావకవుల వాదనలో పసలేదని నిరూపించారు అక్కిరాజు. కట్టమంచి నుంచి దేవులపల్లి దాకా వయా రాయప్రోలు, శ్రీ శ్రీ ల పైనుంచి సాగిన అక్కిరాజు విమర్శలు భావకవుల నోటికి తాళాలు వేయకనే వేశాయి. అయితే 21వ శతాబ్దపు ఆచార్యులు, విద్వత్వరేణ్యులు అయిన కోవెల సంపత్కుమారాచార్య, కేతవరపు రామకోటి శాస్త్రి వంటి వారు అక్కిరాజు ‘నేటి కాలపు కవిత్వాన్ని’ గట్టిగా సమర్ధించారని ఘట్టమరాజు అశ్వత్థనారాయణ సంతృప్తి ప్రకటించటం ఆనందకరం.
ఆనాటి తెలుగు వాఙ్మయంపై పరంపరగా వచ్చిన రచనలలో మరో చెప్పుకోదగ్గ రచన భోగరాజు నారాయణ మూర్తి రాసిన ‘ఆంధ్ర కవిత్వ చరిత్రము’. ‘కవి-కవిత్వము’ అనే 47 పుటల వ్యాసంలో నారాయణ మూర్తి కీట్సు, మిల్టన్ లాంటి ఆంగ్ల మహాకవుల జీవితాల్ని, వాళ్ళ కావ్యాల్ని ప్రస్తావిస్తూ, వామన, జగన్నాథ పండితాదుల లక్షణ గ్రంథాల్ని స్పృశిస్తూ పోతన, అల్లసాని పెద్దన, ధూర్జటి లాంటి మహాకవుల జీవిత, కావ్యాల్ని పరామర్శిస్తూ కవిత్వ ఆశయాలని, లక్షణాలని పరిశీలించారు.’అని వివరించారు ఘట్టమరాజు అశ్వత్థనారాయణగారు.
భోగరాజు నారాయణమూర్తి భావనాశక్తి, కల్పనాశక్తి కంటే మహత్తరమైనదని భావించారు. ఈయన కూడ ‘రస’ సిద్ధి సాధించటమే కవిత్వ ప్రధాన లక్ష్యంగా భావించారు. ‘కావ్య రచన యందొకానొక రసము నుత్కర్షించుటకు భావములును, తద్భావములను ప్రకటించుటకు పదగుంఫనమును సాధనములగు లగుచున్నవి. ఈ రసభావములు మూడునూ గాఢమైన పరస్పరానుకూల్యమును బొందినప్పుడే వాస్తవమైన కవితా స్వరూపమేర్పడగలదు’ అని కావ్యాలలో ‘రస సిద్ధి’ ఎలా సాధ్యమో స్పష్టంగా వివరించారు భోగరాజు నారాయణ మూర్తి. అయితే నారాయణ మూర్తి కూడ నన్నయ్యకు పూర్వం తెలుగులో జైన, బౌద్ధ కావ్యాలుండేవని, వాటిని రూపు మాపే ప్రయత్నంలో భాగమే నన్నయ్య మహాభారత రచనని నొక్కి వక్కాణించారు. అందుకు ఆయన తెలుగువాడైననూ జైనమత రాజుల అచ్చాదనలో జీవించి, కర్ణాటకకు వలసపోయిన పంపడు మహాభారతాన్ని ఉంటంకించారు. పంపడు నన్నయ్యకు పూర్వము వాడు. కన్నడంలో ‘ఆదికవి’. మహాభారత రచనలో పంపడిని ఆదర్శంగా నన్నయ్య తీసుకున్నాడని భోగరాజు వాదన.
అయినప్పటికీ సుప్రసిద్ధ సాహితీ వేత్త, ఆచార్య పింగళి లక్ష్మీకాంతం మటుకు నన్నయ్యకు పూర్వం ‘మహాభారతం’ స్థాయికి పోల్చదగిన తెలుగు జైన, బౌద్ధ గ్రంథాలు లభించేంతవరకూ నన్నయ్యనే తెలుగు ‘ఆదికవి’ అని స్పష్టం చేశారు. ఆ విధంగా మహాభారతమే తెలుగులో ఆదికావ్యం అని నిగ్గు తేల్చారు.
వంగూరి సుబ్బారావు పంతులు, భోగరాజు నారాయణ మూర్తి రాసిన గ్రంధరాజములకన్నా తెలుగు వాఙ్మయ చరిత్రకు మేలు వివరణ గ్రంథరాజము నందించిన మరో మహా విద్వద్ శేఖరులు కల్లూరు వేంకట నారాయణ రావు.’కవిత్వ వేది’ అనే సంక్షిప్త నామంతో వీరు ‘ఆంద్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహం’ రచించారు. ప్రథమ తెలుగు భాషాశాస్త్ర పరిశోధకుడైన చిలుకూరు నారాయణరావు ‘విషయ భాగమునందును, రచనా విధానమునందును, నీ గ్రంథము నూతన పథముననుసరించి నూతన దృక్పథమును వెలయించు చున్నది’ అని కితాబు ఇచ్చారు నారాయణ రావు రాసిన ‘కవిత్వ వేది’ కి.
వీరి రచన అయిదు ఖండాలుగా సాగి, ఆనాటి సామాజిక, సాంఘిక పరిస్థితులు నాటి వాఙ్మయానికి ఎలా ప్రేరణైనవో విశదీకరించటం వలన వీరి రచన వంగూరి, భోగరాజుల వాఙ్మయ చరిత్రల కన్నా భిన్నమునూ, గొప్పదిగా పరిణమించింది’ అని వ్యాఖ్యానించారు ఘట్టమరాజు. 1.సంఘ చరిత్ర 2.వాఙ్మయ చరిత్ర 3. కావ్య విమర్శ 4. యుగాలక్షణ సమన్వయం అనే కోణాలనుంచి వీరు సాహిత్య విమర్శను చేపట్టారు. ‘ప్రతి ఖండం లోని యుగకవిత్వాన్ని పరామర్శించి చివర్లో యుగాలక్షణము సమన్వయము చేశారు. తృతీయఖండంలోని శ్రీ రాయల యుగం (1501-1650) నాటి కావ్యాల యుగాలక్షణాలను సమన్వయం చేస్తూ ఆయన చేసిన పరిశీలనలు, విశ్లేషణలు విశాలమైనవి, లోతైనవి’- అని అభిప్రాయపడ్డారు ఘట్టమరాజు.
‘ఆంధ్ర గద్య వాఙ్మయ చరిత్ర’ పేరుతో తెలుగులో వెలువడిన మరో విలక్షణమైన గ్రంథరాజమును రాసినవారు గొబ్బూరు వేంకటానంద రాఘవరావు. తొలుత ఇది 1923లో ప్రకాశితమైంది. ఈ గ్రంథంలో నన్నయ్య భారతంలోని గద్యాన్ని లక్ష్యంగా స్వీకరించి సంస్కృతం, ఆంగ్ల సాహిత్య లక్షణ పుస్తకాల ఆధారంగా తమ విమర్శన ప్రారంభించారు. గొబ్బూరివారు రాసిన ‘ఆంధ్ర వచన రచనా పరిణామం’ వారి మరణానంతరం 1961లో వెలుగు చూసింది. ‘తెలుగు గద్యంపై తొలి విమర్శనాత్మక గ్రంథం అవటమేగాక, తెలుగు వచన సాహిత్యాన్ని అధ్యయనం చేసిన తరువాతి తరం ప్రముఖులైన నిడుదవోలు వెంకటరావు, శ్రీవాత్సవ, ఆరుద్ర, కులశేఖర రావులకు ఇది దిక్సూచి అయింది’ అని భావించారు ఘట్టమరాజు.
పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి (1890-1951) ‘ప్రాకృత గ్రంథకర్తలూ – ప్రజాసేవానూ’ అనే ఒక అద్భుత రచన గావించారు. దీనిని గిడుగు రామ్మూర్తి పంతులు గారి 70వ పుట్టినరోజున వారికి కానుకగా సమర్పించారు. 1994లో ప్రాచీ పబ్లికేషన్స్ వారు దీనిని ప్రచురించారు. ‘పాత కొత్తల మేలుకలియిక పంచాగ్నుల వారు’ అని డా. అక్కిరాజు రామాపతి రావు గారు ‘ప్రాకృత గ్రంథకర్తలూ – ప్రజాసేవానూ’ గ్రంథంపై ప్రశంసలు కురిపించారు. ఒకప్పుడు ఈ దేశప్రజలు అధికంగా వాడిన భాష ప్రాకృతమేనని ప్రాయకంగా తెలుగు భాషావేత్తలందరి అభిప్రాయం. పంచాగ్నులవారు ఇంకొక అడుగు ముందుకేసి ప్రాకృతానికి, తెలుగుకు దగ్గర సంబంధం ఉందని భావించారు. ఇది వివాదాస్పదమైన అక్కిరాజు ఉమాకాంతం, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, డా. చిలుకూరు నారాయణ రావు వంటివారలు ఇదే అభిప్రాయంలో ఉన్నవారిని తెలుస్తుంది. పంచాగ్నుల వారు ఈ రచన వలన తెలుగువాళ్ళకు పరిచయం లేని ప్రాకృతకావ్యాల్ని తెలియచేయటం ఏంతో ఉపకరించింది. ఈ పుస్తక ప్రచురణకర్త పి.పి.సి జోషి ‘మా మనవి’ లో ‘ప్రజాభాష, ప్రజాసాహిత్యం అనే మాటల వెనుక తత్వాన్ని బోధపరచుకోవటానికి ప్రాకృతభాష సాహిత్య పరిచయం తప్పక తోడ్పడుతుంద’ని పేర్కొనటం ఘట్టమరాజు గారిని ఆకర్షించిన విషయం.
పంచాగ్నులవారు ‘సంస్కృత, ప్రాకృతాలలో ఏది దేనికి మాతృక?’ — అని తేల్చవలసి వస్తే, ‘ప్రాకృతం సంస్కృతానికి మాతృక’ అని తన ఊనికను ప్రాకృతం వైపు చూపారు. ఇందుకు ఇద్దరు ప్రాకృత కవులను ఉటంకించారు పంచాగ్నులవారు. మహేశ్వర సూరి రాసిన ‘శబ్ద ప్రకాశిక’, హరిభద్ర సూరి రాసిన శ్లోకంను ఉటంకించారు. శ్లోకం ఏ గ్రంథం నుంచి తీసుకున్నది స్పష్టత లేదు. ప్రాకృతం లోని ‘లీలావతి కథ’ లో ఆంధ్రదేశానికి సంబంధించిన చరిత్ర ఉందని, అందులో ఆంధ్రదేశానికి చెందిన అనేక ప్రాంతాలున్నాయని అన్నారు. అంతేగాదు, సంస్కృత కవులు ప్రాకృత కవులను హేళన చేయటం, వ్యావహారిక భాషను ఈసడించుకొనటం పైన తన స్పష్టమైన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కారణంగా ఆయన గిడుగు అడుగులలో నడిచారన్నది నిర్ద్వంద్వం. చీమకుర్తి శేషగిరి రావు ‘తెలుగులో పాళీ పదాలు’ ప్రచురించారు 1990లో. ప్రాకృత భాషను ఆరు రకాలు ప్రధాన భాషలుగా విభజించారు పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి. అవి : సంస్కృతం, ప్రాకృతం, మాగధి, సౌరసేని, అపభ్రంశం, పైశాచి. వీటిపై ప్రజ్ఞ కలవారిలో మానవల్లి , తల్లావఝుల శివశంకర శాస్త్రి, వేలూరి శివరామ శాస్త్రి, రాళ్ళపల్లి, పుట్టపర్తి, తిరుమల రామచంద్ర, పుల్లెల శ్రీ రామ చంద్రుడు మొదలైనవారు నేడు లేరు.
కురుగంటి సీతారామయ్య రాసిన ‘అలంకార తత్వవిచారము’ (1915) అప్పుడప్పుడే తలెత్తుతున్న తెలుగు సాహిత్య విమర్శకు ఒక చక్కని ఉదాహరణ. కట్టమంచి వారికి, అక్కిరాజు ఉమాకాంతం గారికి, కురుగంటి సీతారామయ్య గారికి అలంకారాలపై జరిగిన వివాదాలు ఈ వ్యాసంలో చక్కగా వివరించారు ఘట్టమరాజు అశ్వత్థనారాయణ.
ఇలా ఈ ‘గ్రంథాంతరంగం’ లోని పలు వ్యాసాలు తెలుగు సాహిత్యంలోని తొలినాటి జాడలను వెతికి మళ్ళీ మనకు దర్శింపజేస్తాయి. ఒక్కోసారి ఈ పుస్తకంలోని ప్రముఖ రచయితల గ్రంథాలు విశ్వవిద్యాలయాలలో ఆచార్యులు తమ విద్యార్థులకు బోధించినట్టు కనపడదని ఘట్టంరాజుగారు శోకం వ్యక్తం చేయటం కొంతవరకూ నిజమే కావచ్చు. అయితే మొత్తం మీద అసలెవ్వరూ వంగూరి వారినుంచి తీసుకొని కురుగంటి వారి వరకు ఎవ్వరి రచనలు చూడలేదనుకోవటం కూడా సరి కాదనిపిస్తుంది. ఘట్టమరాజు గారి వ్యాసాలలో విషయాలను లోతుగా పరిశీలిస్తే పింగళి వారు, రాళ్ళపల్లి వారు, అక్కిరాజు రమాపతి రావు లాంటివారు, కట్టమంచి వారు, చిలుకూరి నారాయణ రావు వంటి వారు ఈ వ్యాసాలలో అనేక పుస్తకాలను క్షుణ్ణంగా నాడే పరిశీలించిన సంగతి విదితమవుతుంది. కాబట్టి ఘట్టంరాజువారి సదాశయం వ్యర్థం కాలేదు. తెలుగు భాషాప్రియులంతా తప్పనిసరిగా చదువవలసిన పుస్తకం ‘గ్రంథాంతరంగం’. స్నాతకస్థాయి, స్నాతకోత్తర స్థాయి, నేటి సాహిత్య రంగం పత్రికారచయితలు గూడ చదివి తెలుసుకోవలసిన అనేక విషయరత్నాలున్న గ్రంథం ఇది.
***
రచయిత: ఘట్టమరాజు అశ్వత్థనారాయణ
ప్రచురణ: ఎమెస్కో బుక్స్
పేజీలు: 256
వెల: ₹ 200/-
ప్రతులకు:
సాహితీ ప్రచురణలు,
33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్. రోడ్,
చుట్టుగుంట, విజయవాడ 520 004
ఫోన్: 0866-2436642/43
ఆన్లైన్లో:
https://www.amazon.in/Granthaantarangam-Collection-Critical-Ghattamaraju-Aswathanarayana/dp/B0DXVQXY6X
