[శ్రీ యన్. వి. శాంతి రెడ్డి గారు రచించిన ‘గుజరాత్ గోవులు’ అనే వేదాంత కథ అందిస్తున్నాము.]
“ఈ సృష్టిలో పరమ పవిత్రమైన జీవి గోవు అంటారు కదా? ప్రారబ్ధం బలంగా ఉంటే ఆవుగా పుట్టే అవకాశం వుందా?”
“మంచి ప్రారబ్ధ నిల్వలున్న జీవి గోవుగా జన్మించాల్సి ఉంటే అది గుజరాత్‌లో పుడుతుంది. అదే ప్రారబ్ధ చెడు నిల్వలు వుంటే అదే జీవి ఆంధ్రాలో ఏదొక ఆశ్రమంలో ఆవుగా పుడుతుంది.”
“ఆ! అంత మాట అనేసారేమిటి గురువుగారూ? వివరించి చెప్పండి.”
“అలాగే!”
***
స్వామీ ప్రణవానంద సేవాశ్రమం, చింతపల్లి అడవులు.
సమయం సాయంత్రం ఆరు గంటలు. సత్సంగానికి సిద్ధం చేస్తున్నారు. నేనూ మా సువర్ణా ఋషికేశ్‌లో వేదాంతం చదువుకొని వచ్చినందు వల్ల సత్సంగం బాధ్యత మా మీద పెట్టారు సద్విద్యానంద సరస్వతీ మాతాజీ. సుమారు వంద మంది ఆశ్రమవాసులూ, భక్తులూ హాజరయ్యారు. మాతాజీ వచ్చి అందరికీ దర్శనం ఇచ్చి వారి ఆసనాన్ని అలంకరించారు.
ప్రార్థనా గీతం పూర్తవగానే..
“మహాత్ములు ఆశ్రమాలు స్థాపించరు” అంటూ చర్చకు నాందీ ప్రస్తావన చేసాను.
చాలా కోపంగా లేచాడు శ్రీమాన్ కాటమరెడ్డి సత్యనారాయణ, రిటైర్డ్ టీచర్.
“వాట్ నాన్సెన్స్ యూ ఆర్ టాకింగ్? అంటే.. అరుణాచల భగవాన్ రమణులు, తోటపల్లి స్వామీ ఓంకారులు మహాత్ములు కాదా?” చాలా కోపంగా అడిగాడు. కొడతాడేమో అనిపించింది.
“ఎవరన్నారు వారు మహాత్ములు కాదని?”
“మరి.. మీరన్న దాంట్లో అంతరార్థం ఏమిటి?”
“జాగ్రత్తగా వినండి! మహాత్ములు ఆశ్రమాలు స్థాపించరు కానీ.. వారు తపస్సు చేసుకున్న తావుల్లో ఆశ్రమాలు వెలుస్తాయి! మీరు పైన పేర్కొన్న రెండు ఆశ్రమాలు కూడా అలా వెలసినవే!” చెప్పాను
“మరి.. అక్కడి శిలాఫలకాలపై ఆశ్రమ స్థాపకులు అని ఆ మహాత్ముల నామాలు ఎందుకు వున్నాయి?” అడిగాడు కాటమరెడ్డి.
“అవి ఆ తర్వాత కాలంలో ఆ మహాత్ముల గౌరవార్థం ఆశ్రమ నిర్వాహకులు ఏర్పాటు చేసినవి మాత్రమే! ఓంకారుల ఆటోబయోగ్రపీ చదివితే మీకు అర్థమౌతుంది. వారేనాడూ, దేనికీ కర్తనని గానీ, భోక్తనని ప్రకటించలేదు. ఆశ్రమం ఆశ్రమానికి వచ్చే సాధకులదందరిదీ అని ప్రకటించారు! వారు ఒక నిజమైన అస్పర్శ యోగి” చెప్పాను.
“మరణిస్తే మోక్షం వస్తుందా?” రొంగల భారతమ్మ ప్రశ్న.
“మరణిస్తే వచ్చే మోక్షం మీ శరీరానికే గానీ మీకు కాదు!” చెప్పారు సువర్ణలక్ష్మి
“మరి నాకెప్పుడు?”
“మీరు ఈ శరీరం కాదని, ఆత్మ చైతన్యాన్నన్ని తెలుసుకున్న క్షణం లోనే!” చెప్పారు సువర్ణలక్ష్మి.
“మరి.. ఈ దేహానికి పెట్టే అన్నపానీయాలు మానెయ్యాలా?” భారతమ్మ
“భోజనం చేసేది దేహ ధారణ కొరకే గానీ, నా కొరకు కాదని, మీ స్వరూపం ఆకలిదప్పులకు అతీతమని తెలుసుకోవాలి!” చెప్పారు సువర్ణలక్ష్మి.
“మరణాన్ని ముక్తిని ఎలా అన్వయించుకోవాలి?” భారతమ్మ ప్రశ్న.
‘‘‘నాది’ అనే భావన రెండక్షరాల మరణమని, ‘న మమ’ (ఏదీ నాది కాదు) అనే మూడక్షరాల భావనయే ‘అమృతమ’ని తెలుసుకోవాలి.” సువర్ణలక్ష్మి జవాబు.
“ఇక ఈ చర్చ ఆపి ‘గుజరాత్ ఆవులు – ఆంధ్ర ఆశ్రమాలు’ అన్న వ్యాఖ్యను వివరించండి రెడ్డిగారూ!” అడిగారు దొంగలి సూర్యనారాయణ.
గొంతు సవరించుకొని చెప్పటం మొదలెట్టాను.
“ఇప్పటి అల్లూరి సీతారామరాజు జిల్లా అప్పుడు తూర్పు గోదావరి జిల్లాగా పిలవబడేది. అందులో డొంకరాయికీ మొతుగూడెంకి మధ్యలో వంద ఎకరాల్లో విస్తరించిన సహజ ప్రకృతి శోభలతో అలారారే ఆశ్రమమే ‘స్వర్ణ’ ఆశ్రమం. పీఠాధిపతి మాతాజీ చిదానందగిరిని సర్వ శాస్త్రాల్లోను నిష్ణాతురాలు. పరమ భాగవతోత్తమురాలు. సంస్కృత, ఆంధ్ర ఆంగ్ల గుజరాతీ భాషలలో ప్రావీణ్యం గలవారు. సంస్కృత ‘విచార సాగరా’న్ని మాతృభాష గుజరాతీ లోకి అనువాదం చేశారు. పర ఇచ్ఛా ప్రారబ్ధం వల్ల ఈ పీఠానికి అధిపతి అయ్యారు కానీ ఏ విధమైన కర్తృత్వ భోక్తృత్వములు లేని నిరాడంబరులు. అహమ్మదాబాద్ ఆధ్యాత్మ విద్యా పీఠం చైర్మన్ అయిన స్వామి విధితాత్మానందగిరి వారి శిష్యురాలు. ఆయన దగ్గరే వేదాంత శాస్త్రం చదివారు. మాతాజీ దురదృష్టం ఏమిటంటే స్వర్ణ ఆశ్రమ ప్రెసిడెంట్ స్వామి హరిహరానంద, సెక్రటరీ తపానంద, కో ఆర్డినేటర్ కేశవానంద, జనరల్ మేనేజర్ నాగన్న దొరలు గుడినీ, గుడిలో లింగాన్నీ మింగేసే రకాలు.
మాతాజీ గుజరాత్, ఋషికేశ్ క్యాంపులు పూర్తి చేసుకొని ముందు రోజే స్వర్ణ ఆశ్రమానికి తిరిగి వచ్చారు. వారు సాధించుకు వచ్చిన వాటి వివరాలు ప్రకటించడానికి, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడానికి ఆశ్రమ నాయకులతో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు.
“దివ్యాత్మ స్వరూపా! మన ఆశ్రమ అభివృద్ధి కొరకు చేసిన పర్యటన విజయవంతమైంది. వివరాలు మీకు తెలియజేయుటకే మన ఈ సమావేశం! సూరత్‌కు చెందిన శ్రీ రామ్ దళాల్ మరియు లక్ష్మణ దళాల్‌లు మన ఆశ్రమంలో సకల సౌకర్యాలతో గోశాల నిర్మించాడానికి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఇవిగో చెక్కులు తీసుకోండి! అహ్మదాబాద్‌కు చెందిన ముకేశ్ గజ్జర్, అనీల్ గజ్జర్‍లు 100 కుటీరాల సముదాయం నిర్మించడానికి రెండు కోట్లు విరాళం ఇచ్చారు. తారాపూర్ వాసులు హరియన్ జోషి, అజయరాజ్ జోషీలు మొత్తం ఆశ్రమానికి సోలార్ ఫెన్సింగ్ వేయించడానికి ముందుకొచ్చారు. మనం ఎస్టిమేట్ పంపిస్తే వారు అమౌంట్ రెమిట్ చేస్తారు. వసద్‌కు చెందిన బాలీ లఖానీ, ఉధానాకు చెందిన బాపూ పటేల్‌లు ఒక విష్ణాలయం, ఒక శివాలయం నిర్మించడానికి ముందుకొచ్చారు. ఇకపోతే గుజరాత్ గురించి తల్చుకొంటే గుర్తొచ్చేది అక్కడి గో సంపద. మీకో విషయం తెలుసా? అక్కడ గోవుల కోసం హాస్టల్స్ వున్నాయి. రైతులే కాదు వ్యాపారస్థులు – ఉద్యోగస్థులూ కూడా గోవుల్ని పెంచుకుంటారు. ప్రస్తుతం మన గోశాల లోని మంచి ఆవు రోజుకు ఎన్ని పాలిస్తుందో తెలుసా?” ప్రశ్నించారు మాతాజీ.
“తెలుసు మాతాజీ! లీటరున్నర నుండి రెండు లీటర్లు” గొప్పగా చెప్పాడు స్వామి హరిహరానంద.
“అదే గుజరాత్ లోని ‘గిర్’ జాతి ఆవు రోజుకు 50 లీటర్లు పాలు ఇస్తుంది. అందుకే మీ తెలుగులో ఒక సామెత వుంది. ‘పుణ్యకర్మలు చేసుకున్న జీవుడు గుజరాత్‌లో గోవుగా పుడితే, పాపకర్మలు చేసుకున్న జీవుడు ఆంధ్రాలో ఏదొక ఆశ్రమంలో ఆవుగా పుడతా’ని. ఎందుకంటే వాటికి మీరు కడుపు నిండా తిండి పెట్టరు. కంటి నిండా నిద్ర పోవడానికి దోమల నుండి రక్షణ కల్పించరు. గుజరాత్‌లో చాలా చోట్ల ఆవులకు స్విమ్మింగ్ పూల్స్ వున్నాయి” ఆపారు మాతాజీ.
“ఆంధ్రా ఆశ్రమాలనే ఎందుకు విమర్శిస్తారు మాతాజీ? ఇక్కడ రైతుల దగ్గరున్న ఆవుల పరిస్థితి కూడా అదేగా?” అన్నాడు స్వామీ కేశవానంద.
“రైతు కనీసం వాటికి కడుపు నిండా తిండి పెడతాడు. అతనికి పాల దిగుబడి కావాలి కదా?” మాతాజీ.
“అలాంటప్పుడు ఆవులతో పాటు కొన్ని గేదెలను కూడా పెంచితే మనకూ మంచి లాభాలు వస్తాయి కదా” కేశవానంద.
“అయితే మనం గోశాల అన్న పేరు తీసేసి పశువుల శాల అని పెట్టుకోవాలి.” మాతాజీ.
“పెట్టుకుంటే తప్పేమి వుంది? శ్రీ కృష్ణుడు మేపిన మందలో గేదెలు, గొర్రెలు, మేకలు కూడా వున్నాయట కదా? అని విన్నాను.” కేశవానంద.
“నేను వినడమే కాదు చదివాను కూడా! ‘అజా గావో మహిష్యశ్చ నిర్విశం త్యో వనాద్వనం!’ అన్న శ్లోకం వుంది. ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు అందరూ మిమ్మల్ని ‘ఒరిజినల్ మిశ్చిఫ్ మేకర్’ అని ఎందుకంటారో!” మాతాజీ
“అంటే ఏమిటి మాతాజీ?” అడిగారు స్వామీ తపానంద.
“కృత్రిమ సమస్యలు సృష్టించి వాటి కృత్రిమ పరిష్కారాలు చూపే వారిని అలా అంటారు.” మాతాజీ.
“ఇక మీరు ప్రసంగించండి మాతాజీ” నాగన్న దొర.
“ఈ రోజున ఆంధ్రాలో ఆశ్రమాలలో గోశాలాలు ఎలా నడుస్తున్నాయో తల్చుకొంటే గుండె చెరువై పోతుంది. కేవలం గోగ్రాసానికి విరాళాలు వసూలు చేసుకోడానికి పరిమితమై పోయాయి. ఉన్న గోవుల్లో నాలుగుటిని అందంగా అలంకరిస్తారు. ఆ నాల్గింటికే కడుపునిండా తిండి పెడతారు. ఎందుకంటే ‘గోదానాలు’, ‘గోపూజ’ పేరుతో దాతలను ఆకర్శించడానికి. ఎన్ని వందల సార్లెనా గోపూజకు, గోదానానికి ఆ ‘నాలుగు’ గోమాతల్నే ఉపయోగిస్తారు. అది ఎంతటి పాపకార్యమో ఇక్కడి సన్యాసులు.. సారీ.. సన్నాసులు ఆలోచించలేరు. వారు భాగవత పురాణాన్ని కూడా ఒక వెండితెర నవల్లాగే చదివి వుంటారు. ఈ చర్చ ఇంతటితో ఆపేసి అసలు విషయానికొస్తాను.
గుజరాత్‌కు చెందిన అస్మితా బేన్ మన గోశాలకు 10 గిర్ ఆవులు, ఒలివియా బేన్ 5 గంగా తీరి జాతి ఆవులు, గజ్జు బేన్ 6 కంగాయామ్ ఆవులు, సోఫియా 6 వేచూరు జాతి ఆవులు, హిరాలాల్ 6 దేవనీ జాతి ఆవులు, నిఖిత 6 రాఠీ జాతి ఆవులు, ఇదిత్రి బేన్ 6 లాల్ సింధీ జాతి ఆవులు, ఆంధ్రాకు చెందిన సునీతా చౌదరి, ఉపాసానా రెడ్డి కలసి 20 పుంగనూరు జాతి ఆవుల్ని విరాళంగా ప్రకటించారు.
కాబట్టి మీరంతా ఆగోవులకు కావాల్సిన మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టండి, ముఖ్యంగా రోజుకు టన్నున్నర పచ్చగడ్డి గోశాలకు సప్లై అయ్యేటట్టు చూడండి. మనకున్న ఈ వంద ఎకరాల్లో పది ఎకరాలు కేవలం పచ్చగడ్డి పెంచడానికి కేటాయించండి. వెంటనే గోశాల, వసతి గదుల నిర్మాణం చేపట్టండి. వచ్చే సంవత్సరం అంటే సంవత్సరం తర్వాత వేసవిలో స్వామిని పరప్రజ్ఞానంద గిరి మాతాజీ ఆధ్వర్యంలో సుమారు 100 మంది సాధకులు 10 రోజుల క్యాంపుకు ఇక్కడికి వస్తారు. గుజరాతీలు చాలా సున్నిత మనస్కులు, వారికి అన్నిరకాల సదుపాయాలు ఏర్పాటు కావాలి. ఏ విధమైన లోటుపాట్లు జరగరాదు. వెంటనే కార్యాచరణ లోకి దిగి పోండి! ఏమైనా డౌట్స్ వుంటే అడగండి!” ప్రసంగం ముగించారు మాతాజీ.
“మాతాజీ! గుజరాత్‌లో తప్ప మంచి గోశాలలు దేశంలో ఇంకెక్కడా లేవా?” స్వామీ తపానంద ప్రశ్న.
“ఎందుకు లేవూ? ఋషికేశ్‌లో కైలాస్ ఆశ్రమంలో, అవధూత అఖాడాలో గోవులు చాలా బావుంటాయి. హరిద్వార్‍లో ఈశ్వర్ ఆశ్రమంలో 5000 గోవులున్నాయి. వాటిని దర్శించడానికి రెండు కళ్లు సరిపోవు. కర్ణాటకలో స్వామీ మయానంద ఆశ్రమంలో ఆవులు చాలా బావుంటాయి. కేరళలో పప్పా రామ దాసు ఆశ్రమం ‘ఆనంద ఆశ్రమం’ గోవులు జారి పడిపోకుండా వారి గోశాలలో రబ్బరు మాట్స్ పరిచారు. ఇటీవల మన ఆంధ్రాలో ఒక ప్రముఖ ఆశ్రమంలో ఒక కపిల ఆవు కాళ్ళు జారిపోయి రెండు బాగాలుగా విడిపోయి చనిపోయిన విషయం నాకు తెలుసు. అందుకే చెబుతున్నా, అటువంటి లోపాలు ఇక్కడ జరగరాదు. సమావేశం ఇంతటితో ముగిద్దాము.” అంటూ మూడు సార్లు ఓం కారం చెప్పి మౌనం లోకి వెళ్లిపోయారు మాతాజీ.
మాతాజీ తప్ప మిగిలిన నలుగురి మొహాలు వింత కాంతితో మెరిసాయి! ఎందుకంటే ఇప్పటివరకు ఆశ్రమ సొమ్ము వేలల్లోనే తిన్న వారికి ఇప్పుడు లక్షల్లో తినే అవకాశం వచ్చినందుకు!
***
సంవత్సరం గడిచింది. స్వర్ణ ఆశ్రమంలో అంగరంగ వైభవంగా గోశాల, 100 గదుల దయానంద సత్రం ప్రారంభించబడ్డాయి. మాతాజీ తప్ప చాలా మంది గమనించింది ఒకటుంది. అదే అక్కడి ముగ్గురు స్వాములు, నాగన్న దొరల కుటుంబ ఆస్తులు రెట్టింపు అయ్యాయని!!!
అనుకున్న రోజున స్వామిని పర ప్రజ్ఞానందగిరిని సుమారు నూట పాతిక మంది గుజరాతీలతో ఆశ్రమంలో దిగిపోయారు.
వివిధ దేశవాళి జాతుల గోవులతో ప్రత్యేక వ్యాగన్లతో గూడ్స్ రైలు అహ్మదాబాద్‌లో బయలుదేరిందన్న వార్త కూడా చేరింది. ఒక సరి కొత్త వాతావరణం అక్కడ నెల్కొంది. ఆశ్రమవాసులంతా గోమాతల రాక కోసం ఎదురు చూస్తున్నారు. గుజరాత్ నుండి నల్గురు వంట వారు కూడా వచ్చారు. భోజనశాల వారి అధీనం లోకి వెళ్ళిపోయింది. స్వర్ణ ఆశ్రమవాసులందరికీ గుజరాత్‌లో వున్న ఫీలింగ్ కలిగింది.
క్యాంపు మొదలైంది. ఉదయం ‘ఉపదేశం సహస్తి’, సాయంత్రం ‘దశ శ్లోకి’ చెప్పాలని నిర్ణయించారు. తెల్లవారు జామున గైడెడ్ మెడిటేషన్, రాత్రి సత్సంగం ఎలాను జరుగుతాయి.
ఆశ్రమవాసులు కూడా మొదటి రోజు క్లాసుకు హాజరయ్యారు ఆనందంగా! క్లాస్ గుజరాతీ భాషలో నడిచింది. భాష అర్థం కాని ఆశ్రమవాసులు మధ్యలోనే బయటకు వచ్చేసారు. లంచ్ మాత్రం అందరినీ అలరించింది.
గోవుల్ని తీసుకొస్తున్న గూడ్స్ రైలు తారాపూర్ – పెట్లాద్ జంక్షన్లను దాటి ఆనంద్ జంక్షన్ చేరుకుందని, అక్కడ గోవులకు కావాల్సిన మేత నీరు ఏర్పాటు చేశారని ఆ రోజుకు వాటికి అక్కడే విశ్రాంతి అనే వార్తకు అందరూ సంతోషించారు. సాయంత్రం క్లాస్ అయిన తర్వాత టీ త్రాగి ఆశ్రమంలోని 100 ఎకరాల మామిడి తోటలో ఆనందంగా విహరించి డిన్నర్ కానిచ్చి, సత్సంగంలో పాల్గొని వసతి గదులకు చేరి విశ్రమించారు.
రెండో రోజు తెల్లవారు జామున గైడెడ్ మెడిటేషన్‌కు వచ్చేటప్పటికి వారిలో కొంత మార్పు వచ్చింది. వారిలో కొంతమంది ముఖానికి మాస్కులు ధరించి వచ్చారు. కొందరి కళ్ళ నుండీ, ముక్కునుండి నీళ్లు కారుతున్నాయి. చీదుతున్నారు, దగ్గుతున్నారు. మెడిటేషన్ క్లాస్ గందరగోళంతో ముగిసిందనిపించారు. అల్పాహారానికి ఎవరూ భోజనశాలకు రాలేదు. కుటీరాలకే తెప్పించుకున్నారు. ఈ వాతావరణానికి ‘కారణం’ అన్వేషణలో పడ్డారు కొంతమంది. మొత్తానికి కనిపెట్టేశారు. ఈ ఎలర్జీ లకు కారణం వాతావరణ కాలుష్యం! ఇంత ప్రశాంతమైన వన ప్రదేశంలో కాలుష్యానికి కారణం ‘మామిడి తోట’కు స్ప్రే చేస్తున్న పురుగు మందులు. ఒక్కో పంటకు కనీసం 7 సార్లు పెస్టిసైడ్స్ వాడతాడట కౌలుదారు. పూత రావడానికి, పూత నిలవడానికి, పూత పిందెలుగా రూపాంతరం చెందడానికి, పిందెలు ఎదగాలని, ఎదిగినది రాలిపోకుండా ఆరోసారి కాయ పరువానికి రావడానికి, ఆఖరు సారి కోసిన కాయలు మంచి రంగుతో పక్వానికి రావడానికి. పూత దగ్గరినుండి పండు అయ్యేవరకు చెట్టుకు ఏవిధమైన బాధ్యత లేకుండా చేసే కృత్రిమ పధ్ధతి!
‘అమ్మో’ అనుకుంటూ అందరూ ముక్కు మీద వేలు వేసుకున్నారు. ఇలాంటి విషపూరితమైన పండ్లు తిని కొత్త రోగాలతో సహజీవనం చేస్తూ వంద సంవత్సరాలు బ్రతికేస్తున్నాడు మనిషి!!
రెండో రోజు ఉదయం క్లాస్ రద్దు చేశారు. గోమాతల్ని తీసుకొస్తున్న రైలు వసద్, వాడోదరా జంక్షన్లు దాటి భరూచి స్టేషన్ చేరుకుందని తెలిసింది. సంతోషించాలో బాధపడాలో తెలియడం లేదు వారికి.
క్యాంపు కొచ్చిన వారిలో వున్న సివిల్ ఇంజనీర్లు అజమల్ పటేల్, అర్షన్ పటేల్‌లు ఉదయం నుండి అదే పనిలో ఉండి ఒక పిడుగు లాంటి వార్త మోసుకొచ్చారు. ఆ వార్త సారాంశం ‘గోశాల, వసతి గృహ సముదాయం, దేవాలయాలు, సోలార్ పెన్సింగ్’లు పైన పటారం లోన లొటారం అని; గుజరాతీ దాతలు ఇచ్చిన విరాళాలు 25 శాతానికి మించి ఖర్చుపెట్టలేదని, నిధులన్నీ దుర్వినియోగం అయ్యాయని, వారు నిర్మించిన కట్టడాలలో శాశ్వతత్త్వం ఇసుమంతా లేదని, నవరాత్రులకు వేసిన పందిళ్ళతో సమానమని తేల్చి ప్రకటించారు.
నిముషాల్లో అందరూ కూర్చొని చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. క్యాంపు రద్దు చేసుకున్నారు. తిరుగు ప్రయాణానికి రాజమండ్రి నుండి విమానం టికెట్స్ ఆన్‌లైన్‌లో క్షణాల్లో బుక్ చేసుకున్నారు. సెంట్రల్ రైల్వే మినిస్టర్ కార్యాలయాన్ని కాంటాక్ట్ చేసి గోమాతల్ని తీసుకొస్తున్న వ్యాగన్లను ఉధానా జంక్షన్ నుండి వెనక్కు మళ్ళించడానికి ఏర్పాటు చేయడం ద్వారా ఆ గోవుల తలరాతల్ని తిరగ రాశారు. రాజమండ్రి వరకూ వెళ్ళడానికి లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసుకున్నారు. అందరూ సామాన్లు సర్దుకొని వచ్చి వరుసగా బస్సులు ఎక్కారు.
అందరి కంటే ఆఖరున వచ్చి బస్ ఎక్కిన వారు స్వర్ణ ఆశ్రమ పీఠాధిపతి అయిన మాతా చిదానందగిరిని. వారు తమ ప్రారబ్ధాన్ని తిరిగి రాసుకున్నారు. స్వర్ణ ఆశ్రమవాసులంతా కన్నీళ్ల పర్యంతమై మాతృ సమానురాలైన మాతాజీకి వీడ్కోలు పలికారు!” ప్రసంగం ముగించాను.
సత్సంగం ముగిసింది. అందరూ బరువెక్కిన హృదయాలతో కుటీరాల వైపు బయలుదేరారు.
నేనూ సువర్ణా మిగిలాము.
“ఇప్పుడు అది అక్కడే వుందా?” అడిగింది సువర్ణ.
“ఉంది కానీ.. ఆశ్రమంగా కాదు. ఆ వందెకరాలు నాలుగు ముక్కలైంది. ఒక భాగంలో స్వామీ హరిహరానంద తన పూర్వఆశ్రమ కుమార్తె డా. లావణ్య కోసం ‘వన్ వే’ కార్పొరేట్ హాస్పిటల్ నిర్మించాడు. రెండవ భాగంలో స్వామీ తపానంద కుమారుడు కోసం ‘హ్యాపీ ఇన్’ పైవ్ స్టార్ హోటల్ నిర్మించాడు. మూడో భాగంలో స్వామీ కేశవానంద తన వారసుల కోసం ‘గోల్‌మాల్’ పేరుతో షాపింగ్ మాల్ ఏర్పాటు చేయగా, ఇక నాల్గో భాగంలో నాగన్న దొర అల్లుళ్ళు మలేషియా టౌన్ షిప్ తరహాలో రియల్ ఎస్టేట్ డెవలప్ చేస్తున్నారు” చెప్పాను.
“అద్భుతః!” మా వెనుకనుండి వినిపించింది.
ఉలిక్కిపడిన ఇద్దరం వెనక్కు తిరిగాము. మా వెనుక ఎవ్వరూ లేరు. దక్షిణామూర్తి విగ్రహం తప్ప!!!
~స్వస్తి~