Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గుండెల్ని తాకే ప్రబోధ గీతం

[‘కులదైవం’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను, ‘పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను గూడు’ అనే పాటని విశ్లేషిస్తున్నారు శ్రీ గోనుగుంట మురళీకృష్ణ.]

కప్పుడు అమ్మ, పిల్లలకి కథ చెప్పేటప్పుడు “అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఇద్దరు భార్యలు. పెద్దభార్య గుణవంతురాలు, చిన్నభార్య అసూయాపరురాలు. చిన్నభార్య తమ్ముడు సింహాసనం ఎక్కాలని యుక్తులు పన్నుతూ ఉంటాడు..” ఇలా సాగిపోతుంది కథ. కథ ప్రారంభంలోనే పాత్రల స్వభావాలు, కథా గమన తీరు అరటిపండు ఒలిచినట్లు విప్పి చెప్పేవారు. ఇందులో సస్పెన్స్ ఏమీ ఉండేది కాదు.

నవలలు రంగ ప్రవేశం చేసిన తర్వాత కథ వర్తమానంతో మొదలు అయి, నాయికో, నాయకుడో గుర్తు తెచ్చుకుంటున్నట్లు గతంలోకి వెళ్లి జరిగినది చెప్పి, మళ్ళీ వర్తమానం లోకి వచ్చి కథను కొనసాగించేవారు. పాఠకులలో ఆసక్తి కలిగించేందుకు అలాంటి ప్రక్రియలు అవలంబించేవారు రచయితలు. అదే కథ సినిమాగా తీసినప్పుడు జరిగిన కథను, పాత్రల స్వభావాలను పాట రూపంలో దృశ్యం చూపిస్తూ చెప్పేవారు. అవి నేపథ్య గీతాలుగా ప్రసిద్ధి చెందాయి. అలాంటి వాటిలో ‘కులదైవం’ (1960) చిత్రంలో ఒక పాట అత్యున్నత స్థాయికి చెందిన వాటిలో ఒకటిగా పరిగణించవచ్చు. ఈ పాటను సముద్రాల జూనియర్ రచించగా మాస్టర్ వేణు సంగీత సారథ్యంలో ఘంటసాల గానం చేశారు. బెంగాలీ రచయిత్రి ప్రభావతి సరస్వతి రచించిన నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. సినిమా ప్రారంభంలో టైటిల్స్ పడుతూ ఉండగానే ఈ పాట ప్రారంభం అవుతుంది.

“పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను గూడు”

ఎగిరి పోవటం అనేది నాలుగు చరణాల్లో నాలుగు విధాలుగా, నలుగురిని ఉద్దేశించి, నాలుగుసార్లు వస్తుంది. మొదటి చరణంలో కథానాయకుడి తండ్రిని గురించి ఇలా అంటున్నాడు కవి. మొదటగా చిలుక అంటే మనిషిలోని ప్రాణం అని కవి భావం. పాడై పోయెను గూడు అంటే శిధిలమైన శరీరం. కొంత వయసు గడిచిన తర్వాత శరీరం శిధిలమై పోతుంది. అది నుంచోటానికి, కూర్చోటానికి కూడా పనికిరాదు. ఇక ఏం పనిచేస్తుంది? ఇక్కడ ఇతడి శరీరం కూడా కృశించి పోయింది. ప్రాణం విడిచి వెళ్ళే సమయం దగ్గర పడింది అని అర్థం. అందుకే చిలుకను ఎగిరిపొమ్మని చెబుతున్నాడు. ఇంకా ఇలా అంటున్నాడు.

“తీరెను రోజులు నీకీ కొమ్మకు పొమ్మా ఈ చోటు వదలి
ఎవరికి వారే ఏదో నాటికి ఎరుగము ఎటకో ఈ బదిలీ
మూడు దినాల ముచ్చటయే ఈ లోకములో మన మజిలీ
నిజాయితీగా ధర్మ పథాన చనుమా ధైర్యమె నీ తోడు”

చిలుకకు చెట్టు కొమ్మ ఆధారం. మనిషికి ప్రపంచం ఆధారం. నీకూ ఈ ప్రపంచానికి మధ్య ఋణం తీరిపోయింది. ఇక ఈ చోటు వదలి వెళ్ళే సమయం ఆసన్నమైనది. రోజులు గిర్రున తిరిగి పోతాయి. మొన్న మొన్ననే స్నేహితులతో ఆడుకున్నట్లు ఉంటుంది, అంతలోనే పెళ్లి అవటం, పిల్లలు పుట్టటం, వాళ్ళు పెరిగి పెద్దవటం, తనకి వృద్ధాప్యం కమ్ముకురావటం అన్నీ శరవేగంతో గడిచిపోయాయి. మనం ఇక్కడ జీవించేది మూన్నాళ్ళ ముచ్చటే! అనిపిస్తుంది. ఈ ప్రపంచం వదిలి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళతాం? ఏమవుతాం? ఏమో! చెప్పలేము. బ్రతికినంత కాలం నిజాయితీగా ధర్మ మార్గాన నడిస్తే, చివరలో నిశ్చింతగా వదలి వెళ్ళే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యమే నీకు తోడు నిలుస్తుంది అని ప్రబోధిస్తున్నాడు కవి ఈ పాట ద్వారా. ఈ పాట నేపథ్యంలో వినిపిస్తూ ఉంటుంది. నాయకుడి తండ్రి అంతిమ ఘడియలను చూపిస్తూ ఉంటారు చిత్రంలో.

“పుల్లా పుడక ముక్కున కరచీ గూడును కట్టితి వోయీ!
వానకు తడిచిన నీ బిగి రెక్కలు ఎండకు ఆరినవోయీ!
ఫలించలేదని చేసిన కష్టము మదిలో వేదన వలదోయీ!
రాదో ఈ సిరి నీ వెనువెంట త్యాగమే నీ చేదోడు”

ఆనాడు తండ్రి వెళ్లిపోయేటప్పుడు పెద్ద కొడుకు రత్నం (గుమ్మడి)ని దగ్గరకు పిలిచి “నాయనా! నీ తమ్ముళ్ళు చిన్నవాళ్ళు. వాళ్ళకి అన్నవైనా, తండ్రివైనా నువ్వే! ఏ లోటూ రాకుండా చూసుకో!” అని అప్పగించి వెళ్ళిపోయాడు. తండ్రి ఇచ్చిన ఆస్తి ఏమీ లేకపోయినా, బట్టల మూట నెత్తిన పెట్టుకుని ఇంటింటికీ తిరిగి అమ్మి, కష్టపడి కూడబెట్టుకుని ఒక బట్టల షాపు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక పక్షి ఎక్కడెక్కడికో ఎగిరి వెళ్లి, చిన్న చిన్న పుల్లలు సేకరించి కష్టపడి గూడు కట్టుకున్నట్లు స్వంత ఇల్లు, స్వంత షాపు ఏర్పాటు చేసుకున్నాడు. కుటుంబాన్ని నిలబెట్టుకున్నాడు.

వానలో తడిస్తే పక్షి రెక్కలు బరువెక్కుతాయి. అందుకే రెక్కలు టపటప లాడించి నీటి చినుకులు విదిలించుకుంటుంది. ఎండలో కాసేపు అటూ ఇటూ ఎగిరి ఆరబెట్టుకుంటుంది. అప్పుడు రెక్కల బరువు తగ్గి తేలిక అవుతాయి. అదే విధంగా రత్నం కూడా పొదుపుగా జీవిస్తూ ఉన్నదానిలోనే తమ్ముళ్ళ చదువు సంధ్యలు, అవసరాలు తీర్చుకున్నాడు. పక్షి రెక్కలు ఆరి తేలికైన విధంగా, ఇప్పుడు తమ్ముళ్ళు పెద్దయి చేతికి అందివచ్చారు. బరువు తగ్గించారు.

తమ్ముళ్ళకి భార్యలు వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఆస్తిలో వాటా కోసం కోర్టుకి ఎక్కింది పెద్ద తమ్ముడి భార్య. “ఈ ఆస్తి అంతా నా స్వార్జితం. మీకేమీ హక్కు లేదు” అనవచ్చు అన్నగారు. కానీ ఆస్తికన్నా అనుబంధాలకే విలువనిచ్చే స్వభావం అతడిది. సోదరుడి సుఖం కోసం కట్టుబట్టలతో భార్యాబిడ్డలను తీసుకుని ఇల్లు విడిచి వెళ్ళాడు. ఇక్కడ “ఎగిరిపో పాడై పోయెను గూడు” అని కధానాయకుడు రత్నం గురించి చెబుతున్నాడు. గూడు పాడై పోవటం అంటే అంతః కలహాలతో ఉమ్మడి కుటుంబం చీలిపోయింది, నీకిక్కడ చోటు లేదు, ఇల్లు విడిచి వెళ్ళు అని అర్థం. అలాగని చేసిన కష్టం ఫలించలేదు అని మనసులో చింత పడటం అనవసరం. ఈ సిరి సంపదలు ఏవీ చివరకు నీ వెంట రావు, త్యాగ గుణమే నీకు తోడు అని ధైర్యం చెబుతున్నట్లు నేపథ్యంలో చెబుతున్నాడు కవి.

“మరవాలి నీ కులుకుల నడలే మదిలో నయగారాలే
తీరని వేదన తీయని ముసుగే శిరసున సింగారాలే
ఓర్వలేని ఈ జగతికి నీపై లేవే కనికారాలు
కరిగీ కరిగీ కన్నీరై కడతేరుటే నీ తలవ్రాతే!”

మూడవ చరణంలో “ఎగిరిపో పాడై పోయెను గూడు” అని రత్నం భార్య చెల్లెలి గురించి చెబుతున్నాడు కవి. ఆ అమ్మాయి పేరు లత (గిరిజ). ఏడేళ్ళ వయసులోనే వివాహం అయింది. నెల రోజులకే భర్త మరణించాడు. ఆ విషయం ఆమెకు తెలియకుండా పెంచింది అక్కగారు (అంజలీదేవి). కానీ ఇరుగుపొరుగు దెప్పిపొడుపుల వలన లతకి తెలిసిపోయింది. భర్త లేకపోయినా అత్తమామల దగ్గరే ఉంటాను అని చెప్పి, ఇల్లు విడిచి బయలుదేరింది. ఇప్పటి వరకూ కన్నెపిల్ల లాగా నవ్వుతూ, తుళ్ళుతూ తిరిగావు. ఆ కులుకులన్నీ మర్చిపోవాలి. తలమీద తెల్లటి ముసుగు, తీరిపోని వేదనే ఇక నీకు సింగారాలు అని చెబుతున్నాడు నేపథ్యంలో. చిన్నవయసులోనే తెల్లచీర ముసుగు వేసుకుని నడుస్తుంటే ఈ పాపిష్టి ప్రపంచానికి జాలి లేదు, ఆమె మీద సానుభూతి లేదు. ఏడిచీ ఏడిచీ కన్నీళ్ళతో కడతేరి పోవటమే నీ తలరాత! అని చెపుతున్నాడు కవి. అప్పటి కట్టుబాట్లు, నమ్మకాలు అలా ఉండేవి.

“గోడుమనీ విలపించేరే నీ గుణమూ తెలిసిన వారు
జోడుగ నీతో ఆడీ పాడీ కూరుములాడిన వారు
ఏరులయే కన్నీరులతో మనసార దీవించేరే
ఎన్నడో తిరిగి ఇటు నీరాక ఎవడే తెలిసినవాడు?”

ఇక నాలుగవ చరణం రత్నం చిన్నతమ్ముడు గోపి (చలం) గురించి. గోపి అన్నదమ్ములలో ఆఖరివాడు, లత ఆడవాళ్ళలో చిన్నది. ఇద్దరూ టీనేజ్‌లో ఉన్నా, పెద్దలకు వాళ్ళిద్దరూ పిల్లల లానే అనిపిస్తారు. ఏ బరువులూ బాధ్యతలూ లేకుండా గోపి, లత ఇద్దరూ గాలిపటాలు ఎగరేసి ఆడుతూ, పాడుతూ, హాస పరిహాసాలతో రోజులు సరదాగా గడిపేస్తున్నారు. హటాత్తుగా లత విధవరాలు అని తెలిసింది, అత్తవారింటికి వెళ్లిపోతుంటే, తన మనసైన నెచ్చెలి తనని విడిచి వెళ్లిపోతుంటే గోపీ కన్నీరు మున్నీరు అయ్యాడు. ఆమె వెళుతున్న గుర్రపు బండి వెంటే ఏడుస్తూ పరుగుదీశాడు. ఆమె రైలులో వెళుతుంటే గుట్టమీద కెక్కి దూరంగా పరుగెత్తుతున్న రైలు వంకే కన్నీళ్ళతో చూస్తూ నిలబడిపోయాడు.

నీ మనసు తెలిసిన వారు, నీతో ఆడీ పాడిన వారు గోడుమని విలపిస్తున్నారు అని గోపి గురించి చెబుతున్నాడు కవి. మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావో కదా! అనుకున్నాడు. ఆరోజుల్లో ఆడపిల్ల ఒకసారి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులను చూడాలన్నా అత్తమామల, భర్త అనుమతి తోనే చూడాలి. వారు వద్దు అంటే మానివేయాలి. అందుకే పెళ్ళయి వెళ్లిపోయేటప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులు కన్నీళ్ళతో పంపిస్తారు.

ఇక్కడ కూడా లత మళ్ళీ ఎన్నాళ్ళకు కనిపిస్తుందో అని బరువెక్కిన మనసుతో అనుకున్నాడు గోపీ. ఎక్కడ ఉన్నా నువ్వు సుఖంగా ఉండాలి అని మనసులోనే దీవించాడు. ఈ చరణంలో “ఎగిరిపో పాడై పోయెను గూడు” అని గోపి గురించి చెబుతున్నాడు కవి. మనసైన చెలి దూరమైంది. మనసు పాడై పోయింది. కొంతకాలం పాటు ఎటైనా దూరంగా వెళ్ళిపో! మనశ్శాంతి లభిస్తుందేమో! అని ప్రబోధిస్తున్నాడు కవి ఈ గీతం ద్వారా.

ఇదీ ఈ పాట నేపథ్యం! ఈ చిత్రం నాటికి ప్రధాన పాత్ర, కథా నాయకుడు అయిన గుమ్మడి వెంకటేశ్వరరావు వయసు కేవలం 32 ఏళ్ళు. నిండు యవ్వనంతో ఉరకలు వేసే వయసు. ఇప్పటి రోజులలో చెప్పాలంటే పెళ్లి కొడుకులు అవాల్సిన తరుణం. మిగిలిన పాత్రల్లో నటించిన అంజలీదేవి, గిరిజ, జగ్గయ్య, విజయలక్ష్మి (మేనత్త పాత్ర), పేకేటి శివరాం మొదలైన వారందరూ గుమ్మడి కన్నా సీనియర్సే! జూనియర్ అయినా కుటుంబ పెద్దగా బరువైన పాత్ర ఎంతో సమర్ధవంతంగా పోషించారు గుమ్మడి. మాటల్లో సౌజన్యం, చేతల్లో మంచితనం, కళ్ళల్లో ప్రేమ వ్యక్తీకరిస్తూ ఇలాంటి అన్నగారు నాకు కూడా ఉంటే బాగుంటుంది అనిపించేటట్లు చేశారు. ముఖ్యంగా మరణశయ్య మీద ఉన్నప్పుడు ఆయన నటన గుండెను పిండేస్తుంది. సినిమా ముగిసిన తర్వాత ఆ భావోద్వేగంలో నుంచీ వాస్తవ ప్రపంచం లోకి రావటం కష్టం. ఎన్ని ఏళ్ల తర్వాతైనా చూడదగిన మంచి చిత్రం ‘కులదైవం’.

(‘పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను గూడు’ అనే పాటని యూట్యూబ్‍లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=QGMcw5ic-CE )

ఈపాట హిందీలో ‘బాభీ’ సినిమాలో మహమ్మద్ రఫీ స్వరంలో వుంటుంది. ‘చల్ ఉడ్జా రే పంఛీ’ అనే ఆ పాట, పయనించే ఓ చిలుకా పాటల అర్ధం ఒకటే. బాణీ ఒకటే. ఆ హిందీ పాటనూ యూట్యూబ్ లో చూడవచ్చు.

https://www.youtube.com/watch?v=_8nMbVhU6D0

 

Exit mobile version