Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గురజాడవారితో అగ్నిహోత్రావధాన్లు

[నవంబర్ 30 గురజాడ వారి వర్థంతి సందర్భంగా సముద్రాల హరికృష్ణ గారి ‘గురజాడవారితో అగ్నిహోత్రావధాన్లు’ అనే రచనను అందిస్తున్నాము.]

అయ్యా అప్పారావుగారూ,

తమరు శాంతసముద్రులే కావచ్చు, నన్నెందుకండీ వోఠ్ఠి కోపిష్టిముండా వాడిగా రాసి కూచున్నారు.

వేదం సుష్టుగా చదివిన వాడిని, జటాంతస్వాధ్యాయిని, సంప్రదాయాన్ని ప్రాణం పోయినా సరే పాటించి చచ్చే వాణ్ణి, ఇద్ధరాడపిల్లల తండ్రినీ, ఒక కొరగాని గుంటవెధవ పితరుణ్ణి, సంసార బరువు లాగవలసిన అగత్యం ఉన్నవాణ్ణీ- ఇట్లాంటి నా నెత్తిన ఆ కోపాల కుంపటెందుకండీ రాజేశారు, నిత్యాగ్నిహోత్రాన్ని నెత్తిన పెట్టుకు ఊరేగినట్టు!

హవ్వ హవ్వ ఎంత అప్రతిష్ఠ మూటకట్టుకోవాల్సి వచ్చింది ఆ ఒక్క అవలక్షణం వల్ల!

అదేమిటోనండీ వెధవది లోపల నుంచి తన్నుకొచ్చేస్తుంది ‘కోపం’- నాకిష్టం లేనిది ఏది జరిగినా, విన్నా- సముద్రంలో బడబానలం లాగా!

ముఖ్యంగా డబ్బు దుబారా నా మనస్సుకు సుతరామూ నచ్చదు సుమండీ! నా దగ్గరే ఉండి ఉంటే నాలుగు పన్నాలు శుభ్రంగా నేర్చుకునేవాడు, ఎందుకీ వెధవ అప్రాచ్యపు ఇంగ్లీష్ చదువు అంటే వినకపోయిరి, భూవుఁలే అమ్మాల్సివచ్చె! అదీ మా వెధవ ఉత్తీర్ణుడైతే ఏదో గుడ్డిలో మెల్ల అనుకుందును! అదీ లేదేఁ!

ఆ రోజు ఆ తురకతో బండి దిగ్గానే పసిగట్టేశాను, ఈ మారూ పరీక్ష గుండం చుట్టిందని!

ఇక్కడే డబ్బు వృథా అని నేనంటే, అందరికీ పొడుచుకొస్తుంది – “ఏమి ఆ మాత్రం ఖర్చు పెట్టలేడూ కొడుక్కోసం, కట్టుకుపోతాడా, ఏం ముదనష్టపు పీనాసితనం”, అంటూ తెగ దెప్పి పొడవటం!

ఇంకెవరూ?!- ఆ కర్కోటకుడు అదే కరటకుడు, వాడి చెల్లెలుతో కలిసి!

ఏమి న్యాయమండీ, పెద్దమనుషులు మీరే చెప్పండి! సరిసరి మిమ్మల్నే అడుగుతున్నాను! ఇంత కావ్యకర్తలే మీరైతేనూ!

అది అట్లా ఉండనీయండి, ధనం ఏ రూపంలో వచ్చినా ఆహ్వానించాల్సిందే  అన్నది నా సిధ్ధాంతం మరి!

దాన్నెట్టా విడిచిపెడతాను, అందునా ఆడ మళయాళం మాటలు వినీ!

నా మాటకు అడ్డు బొత్తిగా సహించలేనండీ! ఎవరన్నా ఒహవేళ అడ్డు వచ్చే సాహసమే చేస్తే, కోపగించి ధాములుధూములు చేస్తే మాత్రం తప్పేవిఁటీ అని నా  ప్రశ్న!

అది కూడా నిలువెత్తు పడగ మీద లేస్తుంది ఆ ప్రశ్న, ఆ సమయంలో! నా మనస్సులో ఎటువంటి మీమాంసలూ లేవండోయ్ ఈ విషయంలో!

మీకు చెప్ప నవసరం లేదనుకోండి, ఏదో నా తృప్తి కోసం అనేశాను, మన్నించాలి, అఖండ వ్యవహర్తలైరి తమరూ!

అయినా ఔచితి మీరెరిగినట్టు వేరెవ రెరుగుదురండీ ఈ ఇలాకాలో!?

భరించే వాణ్ణి నేనైనప్పుడు, ఆ మాత్రం కోపం తెచ్చుకునే హక్కు నాకుంటుందనీ, అదే సబబనీ మీరలా రాసి ఉంటారులెండి, మీకు తెలియకనా?! మేధావులు!

నాకూ అప్పుడేమీ కించిత్తూ దోషం కనబడలేదండీ!

ఏదీ, ఈ వయసు మీద పడటంతోనూ, మా ఇంటిది కాలం చేసి ఒంటరినై పోవటంతోనూ, అప్పుడప్పు డీమధ్య మనసు కలుక్కుమంటోంది, ఆ నాటి నా ప్రవర్తనకు!

***

అయినా మీ తీర్పే న్యాయమండీ మహాశయా, ఈ విషయంలో! ఆ మాత్రం మోతాదులో కోపం ఉండాల్సిందే లోకంలో నెగ్గుకురావడానికీ!

ఏం చేశారయ్యా నన్ను, ఇంటి వారందరూ కలిసి! మోసం, పచ్చి మోసం!

చేస్తే కోపం రాక ఏమౌతుందండీ! దీనికంతకూ అసలు బ్రహ్మ ఆ మా బావమరిది కరటకశాస్త్రేనండీ!

నికార్సైన గుంటనక్క బుద్ధీ, వాడూనూ! తాంబూలం ఇచ్చేసి, తన్నుకుచచ్చేట్టు చేశానని వాడి అక్కసు!

బుద్ధికి తోచిన దారిన విషయం ఫైసల్ చేసుకోవటం కాక మగవాడి పని-మహిళలతో మంత్రాంగాలూ, ఛాదస్తులతో  సంప్రదింపులూ అవుతుందిటండీ?!

పైగా ‘మూర్ఖపు గాడిద’ అని చదివింపులా నాకు, వాడి చేత?! ఎంత సేపటికీ ఆ చెల్లెలుకి నామీద నూరిపోయడమే, నా ఇంట్లోనే చేరి! నా అన్నం తిని నా ఇంటి వాసాలు లెక్కిస్తాడా, అపభ్రంశపు బుధ్ధి కాకపోతేనూ?!

ఎకాయెకి కృతఘ్నత కింద జమ కట్టడుటండీ ఆ చిత్రగుప్తుడు వీడు రేప్పొద్దున హరీ అన్నవేళ!

అయ్యా, మీరేమీ అన్నారు కాదు..?!

అయినా పలుకు బంగారం అయిన మీలాంటి వారి మౌనం అర్థాంగీకారంగా కదూ నా బోంట్లం అర్థం చేసుకోవాలీ!

అట్టి కృతఘ్నత కంటే, నా ప్రథమకోపం వేయి రెట్లు మంచిదనే తమరంతటి వారు ఆ క్రోధాభరణం తగిలించి ఉంటారు నాకు! అదే తగును లెండి!

సందర్భాన్ని బట్టి పలుకు ఉండటం చేత కాదు సుమండీ, లోకజ్ఞులనీ,నాటక కర్తలనీ తమబోటివారు వెలిగిపోయేదీ!

ఇక వాడి సంగతికొస్తే, అరికాలి మంట నసాళాని కంటుంతుందండీ అయ్యా!

వాడే.. ఆ గిరీశం! ఎంత పని చేశాడండీ ఆ హనుమాన్లు!

నాకు ఆ ఇంగ్లీషు ముక్కలు రావని కాదూ, వాణ్ణి ఆ మాత్రం ఇంటో చేరనిచ్చింది!

ఇంట్లో తిష్ట వేసి, తేరగా మేసి, అదే ఇంట్లో కన్నం వేసే దగుల్బాజీ కాదుటండీ!

అమాయకప్పక్షి మా అమ్మాయికి ద్రోహబుధ్ధులూ, పెడబుధ్ధులు నూరిపోస్తాడా, ఎంత ఆసురీలక్షణాలు కాకపోతేనూ!

సద్బ్రాహ్మణున్ని మోసం చేశాడు, వాడేం బాగుపడతాడు?! ఎక్కడో తగుల్తుందిలెండి మాడు పగిలే గాఠ్ఠి దెబ్బ!

దైవం లేడుటండీ, పైన అంతా కనిపెట్తూ! సహస్రాక్షః సహస్రపాత్ అన్నారు కారూ! వేయి కళ్ళతో కనిపెట్టి వెధవకి శిక్ష వేసే తీరుతాడు!

***

ధనాశాపరుడని నిందొకటి నా మీద!

“ధనమూలమిదం జగత్” అన్నారు. ఆ తైలం లేందే పూచిక పుల్ల కదలదు ఈ లోకంలో.

అందుకని ఆ మహాలక్ష్మి వచ్చే దారిని దేన్నీ, మనిషన్న వాడూ, బుధ్ధున్నవాడూ వదలకూడదు.

నేను చేసిందీ అదే, తప్పేముందండీ ఇందులో!

అసలు ఇది ఒక రకమైన ఆరాధన కాదుటండీ స్వామీ! సాక్షాత్తూ ఆ మహాలక్ష్మి నర్చించటం కాదుటండీ!

చంచల అయిన ఆ తల్లి తన పట్ల శ్రధ్ధ, అక్కర, సద్భావం చూపించిన వాడి యింట ఉండటం ఇచ్చగిస్తుందే కానీ అన్యుల దరి చేరుతుందండీ!?

ససేమిరా చేరదు! చేరదే గాక, ఆ ఇల్లు విడిచి చక్కా పోదు మరీ?!

డబ్బు దస్కం, పొలం పుట్రా ఉన్నవాడైతే సుఖిస్తుందని కాదు మహానుభావా, ఏదో కాస్త వయసు మీరిన వాడైనా ఆ లుబ్ధుడి కిచ్చి మా సుబ్బిని కట్టబెట్టే సద్యత్నం చేసిందీ!

అదీ తప్పే?!

ప్రతివాడూ చెప్పేవాడే ప్రవచనం – ఆచరణకు ఒక్కడు రాడు! శుష్కప్రియాలూ, శూన్యహస్తాలూ, చిల్లుకానీకి కొరగావు!

***

అయ్యా ఇంకొక మాట, నా ప్రకృతిలో కోపం ఉన్నదేమో కానీ, మోసమనేది ఉన్నదిటండీ ఒక్క కోశానా?!

అందరూ నన్ను దగా చేసిన దౌర్భాగ్యులే కాదూ!

మీకు తెలియంది కాదనుకోండి, ఒకరా ఇద్దరా ఏవఁని చెప్పను?!

నా ఇంట తిండి తిని, నా పిల్ల బుధ్ధి చెడగొట్టి నా కోర్టుకాయితాలూ, నగలపెట్టెతో సహా ఉడాయించాడు, బ్రాహ్మణ్యానికి మచ్చ, ఆ గిరీశం!

ఇక మా యింటి గుంటనక్క కర్కోటకుడు చేసిన ద్రోహం ఇంతా అంతని  ఏమని చెప్పను, అయినా చెప్పనే చెప్పాను ఈ పాటికే!

వాడా పని చేసినందుకు కాదూ, ఆ లభ్ధావధాన్లను కొట్టిన కేసులో నేను ఇరుక్కున్నది!?

రామప్పంతులు లాంటి నికృష్టుడి గూర్చి ఓ మాట మాట్లాడటం కూడా పాపమేనండీ!

ఇక చెప్పేదేముందయ్యా, కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది.

ఎంత కోర్టు కేసనీ, డ్యామేజీ అనీ, కన్యాశుల్కం బాపతు డబ్బనీ ఆశపడ్డానో, ఆశ ఆశగా మిగిలిపోయిందే గానీ నేను దండుకున్న సంపద ఏముందీ, సుఖించిన రోజెక్కడుంది, చెప్పండి!

అయ్యా అదీ, నా మనసులోని మాట, మీకు అంతా తెలిసిందే – అయినా ఏదో నా గోడు వెళ్ళబోసుకున్నాను, అంతే!

***

గురజాడ:

అవధాన్లూ, కోపిష్టివి అన్నదొక్కటే కాదయ్యా, నీ మీద ఆక్షేపణ!

ఇంత ధనం మీద మోహం కూడదు, ఎవ్వరికైనా!

వాడితో తగువూ, వీడితో కయ్యం- దావాలు. పైగా అందరితోనూ మొహం మీద కొట్టినట్టు ఆ మాట ధోరణీ!

ఇదే తంతయితే జీవితాంతమూ, నీ మేలు కోరి చేసుకున్న పనులేనా ఇవి?!

ఆలోచించుకోవాలి కాదూ!

నీ ఛాందసమూ, నీ మంకు మూర్ఖపు పట్టు తప్ప, ఆడవారి మనస్సు, బయటి వారెవరో కూడా కాదు, నీ భార్యా, కూతుళ్ళదే – ఎంత నొప్పించావో ఒక్క క్షణం ఆలోచించావటయ్యా, ఎప్పుడైనా?!

నీ వాదం నీదే, అదెంత పిడివాదమూ, లుకలుకలైందైనా – ఎదిరి మాట వినే నైజమే లేదేఁ?!

బాధతో అంటున్న‌ మాటలే సుమా, చదువుకున్న వేదానికి, సార్థకత అంటూ ఉండాలి కదూ, అని!

***

అగ్ని:

నిజవేఁనండి అయ్యా, వేడి తగ్గిన మీదట యథార్థం రవంత బోధపడుతోంది!

ఏది ఏవైఁనా,నా ఇంటిది దాటిపోనే పోయింది ఎటూ!

మా అమ్మాయి సుబ్బికి, నే తలపెట్టిన ఉతుకుష్టపు పెళ్ళి ఏ భాగ్యవశానో, తప్పిపోయింది ఆ పీనాసి అవధాన్లతోటి!

పెద్దపిల్ల బుచ్చెమ్మ, మాయగాడు గిరీశం వలలో పడక, గౌరవంగా బతుకు సాగించే శరణాలయం చేరింది.

మొదటిది ఆ పై వాడి దయ, రెండోది వకీలు సౌజన్యారావు గారి చలవానూ – ఇద్దరికీ చేతులెత్తి మొక్కాల్సిందే, మొక్కుతున్నాను కూడా!

ఏదో నా తొందరపాటుతనం, నోటిదురుసుతో ఆనాడు, “నా గృహకృత్యాల ఊసు మీకెందుకు”, అన్నానే కానీ, సౌజన్యం మూర్తీభవించిన వారు, రావుగారు నన్ను క్షమించే ఉంటారు లెండి మనసులోనైనా!

ఇక ఈ నాలుగు మాటలూ, ఏదో తమకు చెప్పుకుంటే కాస్త దుగ్ధ తీరుతుందని ఆడినవే కానీ, మీ పట్ల కూడా అఖండ గౌరవం సుమీ నాకు!

పెద్దలు తమరు గుర్తించాలని వినతి.

ఇక నాకు సెలవిప్పించండి, ఆ రామవరం పొలం తాలూకు వ్యాజ్యం ఏమయిందో వెళ్ళి చూసుకోవాలి.

మరి వస్తాను,

అసలే ఆ వకీలు మట్టి బుర్ర!

అంతా నేనందిచాల్సిందే, లా పాయింట్ తో సహా! నమస్కారాలు స్వామీ!

***

గురజాడ: (చిరునవ్వుతో) సరే కానీయండి, వెళ్ళి రండి, శుభం!

***

అగ్నిహోత్రావధాన్లు గురజాడ వారి వద్ద సెలవు తీసుకుని, ఇట్లా వీథి వైపు వెళ్ళాడో లేదో ఓ నల్ల పిల్లి ఎదురు రావటం, “ఛీ మాయదారి శకునం, అడ్డు లే మార్జాల పక్షీ”,  అని ఆయన తిట్లందుకోవడం క్షణంలో జరిగిపోయినై!

ఆ  దృశ్యం కంటబడి, ఆ మాటలు చెవులబడ్డ గురజాడ వారు, చిరునవ్వుతో లోపలికి వెళ్ళారు, ‘బుధ్ధులంత తేలికగా మారేవైతే, లోకం ఇట్లా ఎందుకుంటుందీ’ అని అనుకుంటూ!

Exit mobile version