[శ్రీ జి.వి. కళ్యాణ శ్రీనివాస్ రచించిన ‘గురివింద గింజలు’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
అమెరికా బే ఏరియాలోని ఒక అపార్ట్‌మెంట్‌లో రాత్రి ఆ ముగ్గురు కలిశారు. పార్టీ కంటే మాటలకే ఎక్కువ మత్తు ఎక్కింది. ముగ్గురు చేరితే సహజంగా జరిగేదే అక్కడ జరుగుతోంది. అక్కడ లేని ఒక మనిషి జీవితం ఆ గదిలో ప్రధాన చర్చగా మారింది.
“అరే, ఇండియాలో వాడు ఏమిట్రా.. సినిమాలు, షికారులు అంటూ తిరుగుతాడు,” అన్నాడు శేఖర్ తన చిన్ననాటి మిత్రుడిని ఉద్దేశించి.
శేఖర్‌కు యాభై పైచిలుకు వయసు.. అమెరికాలో స్థిరపడి సొంత కంపెనీ పెట్టుకుని, ఇండియా-అమెరికా మధ్య తిరుగుతూ ఉంటాడు. బలిష్టమైన శరీరం, ఆరోగ్యంగా కనిపిస్తాడు.
“అదే కదా! చిన్నప్పటి నుంచి వాడికి ఆ సినిమా తీయాలన్న ‘దురద’ ఉండేది రా,” అన్నాడు ప్రభాకర్.
“వాడేదో గొప్ప డైరెక్టర్ లాగా మొన్న ఒక షార్ట్ ఫిల్మ్ తీసి, అదేదో పెద్ద సినిమా అన్నట్టు ఎదవ డ్రామా చేశాడు!” అని వంత కలిపాడు ప్రభాకర్.
శేఖర్, ప్రభాకర్ల స్నేహం నిన్నటిది కాదు. కలిసి చదివారు, కలిసి మందు తాగారు, కలిసి ఉద్యోగాలు చేశారు. చివరికి అమెరికాలో కలిసి వ్యాపారం కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు పక్కపక్కనే ఇళ్లు.
“నీకు తెలుసా, వీడే కాదు. కృష్ణానగర్లో చాలామంది ఇలానే ఉంటారు, వాళ్లలో ‘పెద్దగా పని లేనివాడు’ వీడు ఒకడు,” అన్నాడు శేఖర్.
“అదే సరే! ఇంతకీ వీడు ఇదే చేస్తాడా, ఇంకేమైనా చేస్తాడా?” అడిగాడు అరవై ఏళ్ల సుధాకర్.
సుధాకర్, శేఖర్‌కు స్వయానా బావ (అక్క మొగుడు). ఎంఎస్ చేయడానికి అమెరికా వచ్చి, స్థిరపడి ముప్పై ఏళ్లు అయింది. ఇద్దరు పిల్లలు. భార్య లక్ష్మి ప్రసన్న కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిణి.
“చేస్తున్నాడు. ఏదో చిన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్. వాడి ముఖానికి ఏదో వెలగబెడుతున్నాడు,” అన్నాడు శేఖర్.
“వాడు రాసిన కథలు పంపాడు. చదవమన్నాడు”, అన్నాడు శేఖర్.
“చదివావా?”, అన్నాడు ప్రభాకర్
“ఎక్కడ టైమ్ రా!” అన్నాడు శేఖర్.
“అదే కదా! నాకు వాడు ఎప్పుడో హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఒకసారి కాల్ చేశాడు,” అన్నాడు ప్రభాకర్.
“అప్పుడు చాలా బిజీగా ఉన్నాను” అన్నాడు ప్రభాకర్
“ఐతే, ఇప్పుడు వాడు ఏమి చేస్తున్నట్టు?” అన్నాడు సుధాకర్
“చెప్పాగా బావగారు.. ఏదో సాఫ్ట్‌వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు అని” అన్నాడు శేఖర్.
“అసలు వాడు చిన్నప్పుడు కూడా అంతే రా, వాడి తమ్ముడు ఎక్కడున్నాడు? వాడు ఏమి చేస్తున్నాడు?” అన్నాడు సుధాకర్.
“వాడి తమ్ముడా? ప్రేమించి, లేచిపోయి పెళ్లి చేసుకున్నాడు.”
‘లేచి పోయి’, అన్నప్పుడు శేఖర్ ముఖంలో ఒకరకమైన సంతృప్తి స్పష్టంగా కనిపించింది.
“వాళ్ళ ఫ్యామిలి ఒక విచిత్రం” అన్నాడు ప్రభాకర్.
ముగ్గురి నవ్వుల్లో స్నేహం కంటే వెక్కిరింపే ఎక్కువగా వినిపిస్తోంది. అక్కడ లేని మనిషి జీవితం, వాళ్లకు ఆ రాత్రి వినోదంగా మారింది.
“అది సరే, డ్రింక్స్ లేవా?” అన్నాడు ప్రభాకర్.
“ఏమి తాగుతావు”, అన్నాడు శేఖర్.
“చివాస్ రీగల్, తాగుతావా?” అన్నాడు సుధాకర్
గ్లాసుల్లో మద్యం తగ్గుతున్న కొద్దీ, మాటల్లో విషం పెరుగుతోంది. అక్కడ లేని మనిషి జీవితాన్ని ముగ్గురూ తమకు నచ్చినట్టు తీర్పు చెబుతున్నారు. మధ్య మధ్యలో వినిపించే నవ్వుల్లో ఆనందం కంటే, ఇతరులను చిన్నచూపు చూసిన తృప్తే ఎక్కువగా ఉంది.
గ్లాసులు నిండాయి. గొంతులు తడిశాయి. మొదటి రౌండ్ ముగిసేసరికి, తీర్పులు మరింత ధైర్యంగా వినిపించసాగాయి.
“అన్నట్టు నీ కూతురి పెళ్లి ఎప్పుడు” అడిగాడు అరవై ఏళ్ల సుధాకర్, ప్రభాకర్‌ని.
“అప్పుడే పెళ్లి ఏమిటి? దానికి పన్నెడు ఏళ్ళేగా” అన్నాడు ప్రభాకర్.
“నీ రెండో పెళ్లిలో పుట్టిన చిన్న కూతురు కాదు. మాణిక్యానికి పుట్టిన పెద్ద అమ్మాయి గురించి అడుగుతున్నాను.” అన్నాడు సుధాకర్
‘మాణిక్యం’ పేరు వినగానే, ప్రభాకర్‌కు తాగిన మందు పనిచేసింది.
“చెయ్యాలి” అన్నాడు. “ఐనా అది నా మాట వింటేగా?!” అని చిన్నగా నసిగాడు.
“ఐనా నువ్వు ‘మాణిక్యం’కు డైవర్స్ ఎందుకు ఇచ్చావు?” అన్నాడు సుధాకర్.
“ఆవిడే వీడికి ఇచ్చింది” అన్నాడు పళ్ళు బయటకు పెట్టి నవ్వుతు శేఖర్..
అప్పటికే రెండో రౌండ్ అయ్యింది.
తాగిన మందు మెదడు మీద అట మొదలెట్టింది.
“అరే నువ్వు నోరు మూసుకుంటావా?!, అది ఎవడితోనో ఉండటం, నాకు తెలుసు. ఆ విషయం..” ఏదో చెప్పబోయి ఆపుకున్నాడు ప్రభాకర్.
లోపల నుంచి సుధాకర్ భార్య ‘లక్ష్మి ప్రసన్న’ వేయించిన జీడిపప్పు తీసుకుని వచ్చింది.
“ఎలా ఉన్నావు వదినా?!” అన్నాడు ప్రభాకర్
ఎన్నో ఏళ్ల స్నేహం వల్ల, లక్ష్మి ప్రసన్నను వదినా అనటం ప్రభాకర్‌కు కొన్ని ఏళ్లుగా ఉన్న చనువు.
ఆ కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఒకటే కుటుంబంలా కలిసిమెలిసి ఉండేవి.
“బాగున్నాను, మేడ పైన ఉన్నాను. మీ అన్నయ్య.. మాట్లాడమంటే లాయర్‌తో మాట్లాడి వస్తున్నా. నీకు తెలుసుగా, సుహాస్ డ్రగ్ కేసు.. అదే..” అంది లక్ష్మి ప్రసన్న.
అందరూ మూడో రౌండ్ ముచ్చటగా ముగించారు.
ఇప్పుడు అక్కడ గాలి కూడా మత్తుతో వేడెక్కింది.
“అవును అన్నా, సుహాస్ డ్రగ్ కేసు సంగతి ఏమయ్యింది? మొన్న స్పెషల్ కోర్ట్‌లో అటెండ్ అయ్యరుగా” అన్నాడు జీడిపప్పు తింటూ ప్రభాకర్.
“నాకు తెలియదు, మీ వదిన డీల్ చేస్తున్నది”. అన్నాడు సుధాకర్.
“అసలు నా కొడుకు నాశనం అవటానికి కారణం మీ అన్న సుధాకరే.” నిష్ఠూరంగా అన్నది లక్ష్మి ప్రసన్న.
“నా వల్లా? ఏమి మాట్లాడుతున్నావు? అంటే నేను డ్రగ్స్ కొనిచ్చానా?! ఇక్కడ, బే ఏరియాలో వాడి ఫ్రెండ్స్ చాలామందికి ఈ అలవాటు ఉంది. కాదా?!” అన్నాడు సుధాకర్.
“నేను ఆలా అంటే ఒప్పుకోను, చాలామంది భారతీయ సంతతికి అలాంటి అలవాట్లు లేవు. నోటికి వచ్చినట్టు మాట్లాడకు” అంది లక్ష్మి ప్రసన్న.
“నోరు మూస్తావా? అన్నిటికి నా మీదకు వస్తావు తగాదాకి” అన్నాడు సుధాకర్.
వేడెక్కుతున్న వాతావరణం, గోడవెక్కుతున్నది అని గమనించాడు శేఖర్.
“అదేముంది బావగారు, దానికే అంతలా ఇది ఐపోవాలా?!, మారతాడూ లేండి, నేనున్నానుగా” అన్నాడు మేనల్లుడిని వెనకేసుకొస్తున్నట్టు.
అందరి గ్లాసులు మళ్ళీ నిండాయి.
“నువ్వు ఉండి ఏమి లాభం చెప్పు, వాడికి అన్నీ మేనమామ బుద్ధులే, నీ సంగతి నాకు తెలియనిది కాదూ?!”
“మీ అక్కకి కూడా తెలుసుగా?!, బీటెక్‌లో నువ్వు ఒక టీచర్ కూతుర్ని లవ్ చేశానని చెప్పి, ఆ పిల్ల నచ్చక, మరొక అమ్మాయిని మళ్ళి లవ్ లోకి లాగి, పెళ్ళిచేసుకుని, ఇప్పుడు ఆఫీస్ లో ఎవరితోనో.. వెధవ రిలేషన్స్.. మన కమ్యూనిటీలో అందరికీ తెలుసు”.
“నా చెల్లెలు సుధకు, నీకు అదేగా గొడవ, వాడికి అన్నీ నీ బుద్ధులే” అన్నాడు సుధాకర్.
చిర్రెత్తుకొచ్చింది శేఖర్‌కి.
“మీ ఇంట్లో అంతా ఆడ పెత్తనం బావగారు. మా అక్క ఏమి చెపితే అదేగా సుహాస్‌కి, హి డస్ నాట్ హవ్ రెస్పెక్ట్ ఆర్ ఫియర్ ఆన్ హిస్ డాడీ” మేనల్లుడిని ఉద్దేశించి అన్నాడు శేఖర్.
“ఓహ్! ఊరుకో బామ్మర్ది!”
“తండ్రి, గౌరవం వీటి గురించి మీ ఫ్యామిలీయే చెప్పాలి”
“ఏమి చెపుతున్నావు, మీ నాన్న, ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని అప్పట్లో.. మా అత్తగారు నాకు పెళ్ళి అయ్యాక.. మీ నాన్నతో తగాదా ఐన సందర్భంలో.. ఆవేశంలో అప్పట్లోనే చెప్పారు. మీ నాన్న, ఆ పరాయి స్త్రీని, హైదరాబాద్‌లో పక్కింట్లో ఉంచటం, ఊళ్ళో అందరికి తెలుసు” జీడిపప్పు, తాగిన మందు బాగా పనిచేస్తున్నాయి అందరిలో.
“కాస్త నోరు మూసుకో, సుధాకర్, తెలుస్తుందా? ఏమి మాటాట్లాడుతున్నావో?” అన్నది లక్ష్మి ప్రసన్న.
వాతావరణం అదుపు చెయ్యటానికి అన్నట్టు ప్రభాకర్, “పోనీలే అన్నా, ఇప్పుడు అవన్నీ ఎందుకు?” అన్నాడు.
సుధాకర్ లేచి బాత్రూంకు వెళ్ళాడు విసురుగా..
“మీ బావగారు తాగినప్పుడు అంతే అని నీకు తెలుసుగా? ఎందుకు అతి చేస్తావు?!” అన్నది లక్ష్మి ప్రసన్న. “తాగితే ఏమి మాట్లాడుతున్నావో కూడా నీకే తెలియదు.”
వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్‌కి, ప్రస్తుతం అక్కడ జరుగుతున్న సంభాషణకు ఏమాత్రం పోలిక లేదు.
“అది సరే, ఇంతకు ఇండియాలో వాడు తీసిన షార్ట్ ఫిలిం.. ఏమయ్యింది.. హిట్టా?! ఫట్టా?!” మాట మారుస్తూ అన్నాడు ప్రభాకర్, సుధాకర్ బాత్రూం నుండి ఇంకా రాకపోయే సరికి కాస్త రిలాక్సడ్‌గా!
“ఐనా వాడికెందుకు చెప్పు ఆ సినిమాలు?”
మళ్ళీ గ్లాసులు నిండాయి.
సుధాకర్ బాత్రూం నుండి బయటకు రావటం గమనించి, “తిండి తినరా?” అంది లక్ష్మి ప్రసన్న.
“తిందాం,” అన్నాడు సుధాకర్.
అందరూ నిండిన గ్లాసులు తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర చేరారు.
“ఆ తమ్ముడికి ఒక కొడుకు, ఒక కూతురు.” అన్నాడు శేఖర్
“వాళ్ళు ఏమి చేస్తున్నారు?” అన్నాడు సుధాకర్.
“ఇక్కడే, MS లు చేశారు. ఇద్దరు IT లో చేస్తున్నారుట” అన్నాడు శేఖర్.
“ఏదో, లోకల్ కంపెనీ రా” అన్నాడు ప్రభాకర్.
“తెలుసు. వాడి తమ్ముడు సరే, వాడికి ఒక కూతురు అనుకుంటా? ఆ అమ్మాయి డిగ్రీ లోకల్ కాలేజీలో” అన్నాడు.
“ఎవరినో ఇచ్చి, వదిలించుకుంటాడు, మనోడు, సినిమాలు తీసుకుంటా ఏదో బతికేస్తాడు” అన్నాడు సుధాకర్.
“అంతే, అంతే”
“ఐనా, ఆడికి మొదటి నుండి ఈ ఓవర్ యాక్షన్ ఉందిలే”.
ప్లేట్‌లో వేసుకున్న పదార్ధాలు మాయం అవుతున్నాయి, పోసుకున్న మందు లోపలి పోతున్నది.
“వాడు తీసిన సినిమా, ఏదో రెండు ఫెస్టివల్స్‌లో చూపించారట. వాడు మాత్రం ప్రపంచ సినిమానే తీసినట్టు తిరుగుతున్నాడు.”
ప్రభాకర్ బిగ్గరగా నవ్వాడు.
“అదే కదా! మనకు తెలిసిన వాళ్లలో చాలామంది అలాగే రా. చిన్న పని చేసినా ప్రపంచం గెలిచినట్టు తిరుగుతారు.” అన్నాడు.
“ఆ షార్ట్ ఫిల్మ్ నేను చూశాను.”
అందరూ లక్ష్మి ప్రసన్న వైపు చూశారు.
“చాలా బాగుంది.” లక్ష్మి ప్రసన్న అంది. మళ్లీ నిశ్శబ్దం.
“సినిమాలో భార్యాభర్తల ప్రేమ చూపించాడు, అత్యంత అద్భుతంగా, ..నాకైతే నచ్చింది” అంది లక్ష్మి ప్రసన్న.
“ప్రేమా.. అదెక్కడా?! ఈ ప్రభాకర్ కూడా ప్రేమిచే చేసుకున్నాడు ఏమయ్యింది?” అన్నాడు సుధాకర్.
“వాడి కథ వేరు బావగారు, వాళ్ళిద్దరికీ పడలేదు, అలా ఉండదుగా అన్ని చోట్ల” అన్నాడు శేఖర్.
“ఎందుకుండదు?” అన్నాడు సుధాకర్.
“తనను రోజు టార్చర్ పెడుతున్నాడని వాడి మొదటి భార్య చెప్పింది అప్పట్లో. నిజమైన ప్రేమ ఉంటే ఉంటుందా అలా?” అన్నాడు సుధాకర్.
“నేనా?, కొట్టడమా?”, నా భార్య ఎవరితోనో, రిలేషన్‌షిప్‌లో ఉంది అప్పటికే. అదే అప్పుడు కోర్ట్‌లో చెప్పా!”
“లాయర్ వాదించాడుగా?” అప్పటి వాదన గుర్తు చేసుకుంటూ అన్నాడు ప్రభాకర్.
“విడాకులు ఇచ్చాక, మరోకరిని చేసుకున్నాక, హాయిగా ఉంది” అన్నాడు ప్రభాకర్.
“కోర్టులో నీ భార్య గురించి అలా మాట్లాడింది నువ్వే కదా.” అంది లక్ష్మి ప్రసన్న ప్రశాంతంగా.
“ఆమె నిజంగానే తప్పు చేసి ఉంటే, అది ఆమెకే అవమానం”.
“కానీ చేయకపోయినా అలా చెప్పి ఉంటే.. నీ పరువును నువ్వే తీసుకున్నట్టే. అప్పుడు నువ్వు ఎంత దిగజారగలవో అందరికీ తెలిసిపోయింది.”
నవ్వాడు శేఖర్..
అప్పుడు పగిలింది ప్రభాకర్ చేతిలోని గ్లాస్!
ఉక్రోషంతో అతని ముఖం ఎర్రగా కందినట్టు అయ్యింది.
లక్ష్మి ప్రసన్న అన్నదానికి కాదు, శేఖర్ నవ్వినందుకు వచ్చిన ఉక్రోషం.
లక్ష్మి ప్రసన్నలో పెద్ద మార్పు లేదు. అది ఆమెకి మాములే. ఇలాంటివి చాలా చూసింది. ‘సీఈఓ’ అని, ‘వైస్ ప్రెసిడెంట్’ అని, ‘ఎండి’ అని రకరకాల పదవులు చెప్పుకుంటూ ఉంటారు కానీ, నిజానికి వాళ్ళ పనికి, వాళ్ళ సంస్కారానికి చాల తేడా ఉంటుంది అనే ఆమెకి తెలుసు.
మళ్ళీ తానే అన్నది.
“పదవులు పెద్దవై ఉండొచ్చు. కానీ మనిషి సంస్కారంలో పెద్దవాడవుతాడని గ్యారంటీ లేదు. నేను గొప్పోడిని, నేనే గొప్పోడిని అన్న అహం కొందరికి ఎప్పటికీ తగ్గదు. పుట్టిన ఊరు, పుట్టిన దేశం, అక్కడి మనుషులు అన్నీ ఒకప్పుడు తమవే. కానీ కాలం గడిచేకొద్దీ, జ్ఞాపకాల్లో మిగిలేది నేల కాదు.. తాము ఎంత పైకి వచ్చామనే భావమే. ఇంతసేపు మీరు నవ్వుకున్నది ఇండియాలో ఉన్న మీ ‘వాడు’ అనే ఆ వ్యక్తిని చూసి కాదు, మీ జీవితాల్లోని ఖాళీని, న్యూనత దాచుకోవడానికే నవ్వుకున్నారు.”
లక్మి ప్రసన్న ముఖంలో గంభీరతను గమనిస్తున్నారు మిగిలిన ముగ్గురు.
ఆ రాత్రి అక్కడ ముగ్గురు మాత్రమే కూర్చోలేదు. అహంకారం, అసూయ, ఆత్మన్యూనత కూడా వారితోపాటే కూర్చున్నాయి. ఇతరుల మచ్చలను మాత్రమే చూసి, తమ లోపాలను మరచిపోయిన అలాంటి వారినే ‘గురివింద గింజలు’ అంటాం.
సాఫ్ట్‌వేర్ రంగంలో గత పాతికేళ్ళుగా వుంటూ, రచనా రంగంలో మొదటి నుండి ఆసక్తి కలిగి, ప్రస్తుతం కథలూ, సినిమాలకు స్క్రిప్ట్ వ్రాయాలన్న అభిలాషతో ముందుకు వెళుతున్నారు జి.వి. కళ్యాణ శ్రీనివాస్, యూట్యూబ్ చానెల్ ‘Kalyana’s I my voice’ లో కథలు చదువుతూ. చాలా మంది శ్రోతలకు ఆయన గొంతుక ద్వారా పరిచయమే.
తెలుగు డబ్బింగ్ మరియు ‘పొడ్ కాస్టింగ్’ ఇష్టమైన కళలు.
