Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గురు బ్రహ్మ

[శ్రీ శంకరప్రసాద్ రచించిన ‘గురు బ్రహ్మ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

గురువే బ్రహ్మ గురువే విష్ణువు
గురువే శివుడు ఇది సుభాషితం
అజ్ఞానపు అంధకారంలో అంధుడవై
దారి తెలియని పాంధుడవై నీవు
తిరుగుతుంటే నీ చేతి వేలు పట్టుకొని
వెలుగు వైపు నిను తీసుకుపోయేది
గురువు

చీకటి నుండి వెలుగు లోకి
తమస్సు నుండి ఉషస్సు లోకి
నిను నడిపించే గురువు ఒక్కరేనా
ఎందరో ఉన్నారు మిత్రమా చూడు

శిశువుగా ఉన్నప్పుడు నీ మాతృమూర్తి
బాలుడిగా ఉన్నప్పుడు నీ తండ్రి
బడిలో విద్యను నేర్పే ఒజ్జ
ఇంతేనా, కాదు ఇంకా ఉన్నారు

నీ చుట్టూ ఉన్న ప్రకృతి
నీలో నిక్షిప్తంగా ఉన్న నీ మనస్సాక్షి
నీ ఇంటికి వచ్చే అతిథి
నీ స్నేహం చేసే నీ మిత్రుడు
నిన్ను వేధించే నీ శత్రువు
అందరూ గురువులే
జీవిత పాఠాలు నేర్పుతారు

చెట్టు కొమ్మ మీద గూటిలో పక్షి
దూడకు పాలు ఇచ్చే గోమాత
చినుకులు కురిపించే మబ్బులు
ఊరికే నీకు ఫలాలిచ్చే చెట్లు
అందరూ గురువులే

స్వార్థ బుధ్ధి వదలుకో
ఏమీ ఆశించక సహాయం చేయవోయ్
అంటూ అవి మౌనంగానే నీకు
జ్ఞాన బోధ చేస్తున్నాయ్
కనులు తెరచి చూడు
కనిపిస్తాయి వినిపిస్తాయి..

Exit mobile version