Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మంచిని పెంచి, పంచమనే కథల సంపుటి ‘గురుదక్షిణ’

[దినవహి సత్యవతి గారి ‘గురుదక్షిణ’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

ఏ సాహితీ ప్రక్రియకైనా – అభివ్యక్తి తొలి ఉద్దేశమైనా, మలి ఉద్దేశం మాత్రం సమాజ హితమే. కవిత్వమైనా, కథ అయినా, నవల అయినా.. ఉద్వేగంగా వ్రాసినా, ఉల్లాసంగా వ్రాసినా, వేదనని వెల్లడించాలనుకున్నా – వాటి వెనుక ఉన్న ఆలోచన మాత్రం మార్పు తేవాలనే! జీవితాన్ని, ఉన్నంతలో, మరింత ఆనందంగా గడపడానికి చేసే ప్రయత్నాలకి పూరకాలు ఈ సాహితీ ప్రక్రియలు.

సరిగ్గా ఈ కోవకే వస్తుంది దినవహి సత్యవతి గారి కథాసంపుటి ‘గురుదక్షిణ’. వీటిలో 2015 – 2022 మధ్య వివిధ పత్రికలలో ప్రచురితమైన 20 కథలున్నాయి. కొన్ని కథలు బహుమతులు గెల్చుకున్నాయి. చాలా వరకు చిన్న కథలే. నాలుగో ఐదో కాస్త పెద్దవి.

~

కడుపుతో ఉన్న కోడలు ఆడపిల్లని ప్రసవించిందని తెలిసి, మనవడు కావాలనుకున్న దుర్గమ్మ ముఖం మాడ్చుకుంటుంది. బాబో పాపో పుట్టడం తల్లి చేతిలో లేని విషయమని తెలిసినా, మగపిల్లాడైతే బాగుండేదన్న కోరిక ఆమెలో ఉంటుంది. అయితే, కొడుకు, భర్త చెప్పిన మాటలతో తన ఆలోచనల్లోని లోపాన్ని గ్రహించి, మనవరాలిని ఎత్తుకుని ముద్దాడుతుంది ‘అత్తయ్య నవ్వింది’ కథలో.

“అదే జరుగుతుందని ముందే ఊహించిన కమలిని విరక్తిగా నవ్వుకుంది”. కమలిని ఎవరు? ఆమె ఏం ఊహించింది అన్న ప్రశ్నలు పాఠకులలో కుతూహలం కలిగిస్తాయి. ఉన్నతాశయాలు గల గొప్పింటి బిడ్డ భార్గవ్, కమలినిని పెళ్ళి చేసుకుందామనుకుంటాడు. సంపన్నుల వారసుడతను, నిత్యం కష్టాల యేరుని ఈదే పేదింటి కుముదం ఆమె. గొప్పింటి అబ్బాయి, పేదింటి అమ్మాయిల కథలా పొరబడే అవకాశం పాఠకులకు ఇవ్వరు రచయిత్రి. ఓ చక్కని మలుపుతో, ‘కల నిజమాయెగా’ అనిపిస్తారు.

తన ఉన్నతికి కారణమైన గురువుని గౌరవిస్తూ, ఆయన చివరిదశలో ఆసరగా నిలిచిన కారుణ్య కథ ‘గురుదక్షిణ’. నలిగిన ఇతివృత్తమే అయినా, స్వీయానుభవాలతో అల్లిన కథ కావడం వల్ల హాయిగా చదివిస్తుంది. మన ఉన్నతికి దోహదపడిన వారి పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలో ఈ కథ సూచిస్తుంది. ఎందరినో మంచిమార్గంలో నడిపిన గురువుకి సొంత కొడుకులే స్వార్థపరులవడం ఓ పెద్ద అశనిపాతం! నవలగా మలచదగ్గ వస్తువుని రెండున్నర పేజీల కథగా రచయిత్రి చాలా నేర్పుగా మలచారు.

‘జ్ఞాపకాల కడలిలో..’ కథ ఓ టీచర్‍కి నివాళి. ఆసక్తి కలిగేలా పాఠాలు చెప్పే అధ్యాపకులు విద్యార్థులపై ఎంతటి గొప్ప ముద్ర వేస్తారో ఈ కథ చెబుతుంది. తానూ టీచరై, తన టీచర్ తనకి నేర్పిన విధానంలో పిల్లలకు పాఠాలు చెప్పి వాళ్ళ అభిమానాన్ని చూరగొంటుందో అధ్యాపకురాలీ కథలో.

ఓ నాయనమ్మ ముందుచూపు ఆమె మనవరాలి జీవితానికో ఆలంబన అవుతుంది. తండ్రి వద్దన్నా, నానమ్మ మద్దతుతో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్, నానమ్మకి రక్షించుకునే క్రమంలోనే రమ్యకి ఉపయోగపడతాయి. విపత్కర పరిస్థితిలో రమ్య ప్రదర్శించిన సమయస్ఫూర్తి బాలికలకూ, యువతలకు ఎంతో అవసరం. ‘థాంక్స్ నానమ్మ’ అంటూ బామ్మకి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రమ్య ఈ కథలో.

నిత్యం మన కళ్ళ ముందు ఎన్నో సంఘటనలు జరుగుతాయి, కొన్ని మన మనస్సులో నిలిచిపోతాయి, కొన్ని అసలు రిజిస్టర్ అవవు. కొన్నిసార్లు ఓ సంఘటనో/దృశ్యమో.. అనూహ్యంగా మనకి ఎదురై, అప్రయత్నంగా మన మదిలో నిలిచిపోతుంది. అలా తన మదిలో నిలిచిన ఓ దృశ్యాన్ని – సమాజ హితానికి ఉపయోగపడేలా చేస్తుంది మైథిలి ‘దృశ్యం!’ కథలో.

కళ్ళు కనపడని చిన్నారి కూతురిని వదిలించుకుందామని సముద్రం ఒడ్డున కూచోబెట్టి, ఆడుకోమని చెప్పి, అక్కడ్నించి జారుకున్న ధర్మన్న ఇంటికి వెళ్తుండగా, ఓ దృశ్యం కనబడతుంది. స్వల్పకాలం చూసిన ఆ దృశ్యం అతనిపై శాశ్వత ముద్ర వేస్తుంది. తన తప్పు తెలుసుకుని, వెళ్ళి కూతుర్ని తెచ్చుకుంటాడు, ‘నన్ను మన్నించు తల్లీ!’ అంటాడు.

కరోనా కాలంలో చితికిపోయిన చిన్న కుటుంబాల వ్యథనీ, అంతటి నిరాశామయమైన స్థితిలోనూ, పెద్దగా చదువుకోకపోయినా, కుటుంబానికి అండగా నిలబడుతుందో బాలిక. దూరప్రాంతంలో చిక్కుకుపోయిన తండ్రి ఇంటికి వచ్చేవరకూ అమ్మకీ, తమ్ముళ్ళకీ అండగా నిలుస్తుంది మల్లి. ‘నాన్న’ కథలో కాంతిరేఖ మల్లి.

వృద్ధుడైన తండ్రి కోరిన కోరికని తీర్చాలని ప్రయత్నిస్తాడో కొడుకు. కానీ తండ్రి కోరిక తీర్చేందుకు తండ్రి ఆరోగ్యం, వయసు సహకరించవు. కాస్తో కూస్తో కూడబెట్టిన డబ్బు కూడా ఆయన వైద్యానికే ఖర్చయిపోవడంతో, తండ్రి కోరిక తీర్చేందుకు ప్రత్యామ్నాయం ఆలోచిస్తాడు. భార్య సహకారంతో, మరో రూపంలో తండ్రి కోరిక నెరవేరుస్తాడు. తన కోసం కొడుకూ కోడలు చేసిన త్యాగాన్ని గుర్తించిన తండ్రి కళ్ళు చెమర్చుతాయి. ‘నాన్న కోరిక’ హృద్యమైన కథ.

తనని మోసం చేస్తున్న భర్తని, మోసంతోనే వదిలించుకుంటుంది సరోజ ‘నీకు నేనున్నాను’ కథలో. ఇంకాస్త విస్తరించి వ్రాసి ఉంటే, చక్కని థ్రిల్లర్ కథ అయ్యేది.

“మనుషుల్ని చదివే ఈ అలవాటుని మానుకోవాలి” అని అనుకుంటుందో ప్రొఫెసర్ ‘ప్రతిభ’ కథలో. అలా ఎందుకు అనుకోవాల్సి వచ్చింది? ప్రతిభ ఎవరు? మూర్తి ఎవరు? వాళ్ళిద్దరి మధ్య పోలికలు ఎలా ఉన్నాయి? ‘ప్రతిభ’ ఆసక్తిగా సాగే స్ఫూర్తిదాయక కథ.

మన అనుకునే వారి నుంచి మనకోసం వచ్చే ఒక కమ్మనైన పిలుపు మనసుకి ఎంత ఆనందం కలుగజేస్తుందో ‘పిలుపు’ కథ చెబుతుంది.

మాదకద్రవ్యాలు అలవాటైన వారిలో మార్పు తేవాలంటే, మందులు, కౌన్సిలింగ్, రీహాబ్‌తో పాటుగా కుటుంబ సభ్యల ఆదరణ కూడా చాలా అవసరమనే వాస్తవాన్ని ‘పునర్జన్మ’ కథ చాటుతుంది. అలాగే స్నేహం గొప్పదనాన్ని కూడా ఈ కథ ప్రదర్శిస్తుంది.

పెంపకం గురించి అందరికీ సలహాలిచ్చే రుక్మిణీదేవి, తమ ఇంట్లో ఓ వాటాలో అద్దెకుండే గౌరి నుంచి ఓ చక్కని పాఠం నేర్చుకుంటారు. కాలం మారుతున్నా విలువలు మారకూడదనుకుంటూ, తాను గౌరి నుంచి నేర్చుకున్న కొత్త విషయాలను అమలు చేయాలనుకుంటారు ‘పెంపకం’ కథలో.

ఒక వ్యక్తిగత సమస్యని పరిష్కరించే క్రమంలో, ఓ అన్న తన చెల్లెలి కోసం తీసుకున్న నిర్ణయం వల్ల, ఎందరో స్త్రీలకి అవమానం తప్పి, నగుబాటుకు లోనవనక్కరలేని సౌలభ్యానికి మార్గం దొరుకుతుంది ‘షరతు’ కథలో. రచయిత్రి 2015లో ఈ కథ వ్రాశారు. ఇంచుమించుగా ఇదే ఇతివృత్తంతో, 2017లో హిందీలో అక్షయ్ కుమార్, భూమి పెద్నేకర్ లతో ఓ సినిమా రావడం విశేషం!

అభిరుచికి, ఆసక్తికి పట్టుదల తోడైతే, అనుకున్నవి ఎలా సాధించుకోవచ్చో ‘సిగ్ధ’ కథ చెబుతుంది.

వ్యక్తిగతంగా నాకు బాగా నచ్చిన కథ ‘క్షమాభిక్ష’. నిత్యం మనం ఎన్నో తప్పులు చేస్తాం. తప్పు అని మన దృష్టికి వచ్చినా పెద్దగా పట్టించుకోం. అవతలివాళ్ళు మనకన్నా తక్కువ స్థాయి వారైతే, ఇక చెప్పనే అక్కర్లేదు. ఓ యాచకురాలిపై మాట తూలిన నందిని, ఆమె తిరిగి తనని తిట్టేసరికి భరించలేకపోతుంది. ఉక్రోషం పట్టలేకపోతుంది. ఐతే ఆమెలో అంతర్మథనం జరిగి, తన తప్పు తెలుసుకున్నాకా, ఆ బిచ్చగత్తె కోసం వెతుకుతుంది. ఆమె ఎప్పుడూ ఉండే గుడి దగ్గర నుండి వెళ్ళిపోయిందని తెలిసి బాధపడుతుంది. యాచకుల పట్ల ఆమె దృక్పథం మారి, వారిని చీదరించుకోకుండా, వీలైనంత గౌరవంగా చూస్తుంది. అనుకోకుండా, చాలా ఏళ్ళ తరువాత, ఆ బిచ్చగత్తె మళ్ళీ గుడి దగ్గర కనబడితే, ఆమెను గుర్తుపట్టిన నందిని వెళ్ళి ఆమె పాదాలు పట్టుకుని తనని క్షమించమని కోరుతుంది. ఈ చర్యకి విస్తుపోయిన బిచ్చగత్తె, ఇదేంపని అమ్మగారూ లేవండి అంటూ క్షమించానని చెప్పి, చల్లగా ఉండమని దీవిస్తుంది. నందిని మనసు తేలిపబడి, ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రిస్తుంది. ఈ కథ చదివాకా, బ్రూస్ లీ చెప్పిన “Mistakes are always forgivable, if one has the courage to admit them.” అనే కొటేషన్ గుర్తొచ్చింది.

ఇంకా, ‘భారతి’, ‘మీరు పెట్టిన భిక్షయే’, ‘సహజీవనం’ (టైటిల్ చూసి ఏదో ఊహించుకోకూడదు, ఇది అది కాదు) వంటి కథలు ఆసక్తిగా సాగుతాయి. అంతర్లీనంగా చక్కని సందేశాలను ఇముడ్చుకున్నాయి ఈ కథలు. భాషా పటాటోపం లేకుండా, సరమైన వాక్యాలతో, చక్కని సంభాషణలతో సాగుతాయి ఈ కథలు.

***

గురుదక్షిణ (కథలు)
రచన: దినవహి సత్యవతి
పేజీలు: 112
వెల: ₹ 125/-
ప్రతులకు:
దినవహి సత్యవతి
26-28-31/B,
గాయత్రిమాత దేవాలయం వీధి,
1వ లైను, ఏ.టి. అగ్రహారం,
గుంటూరు 522004
ఫోన్: 9790752180
~
ఆన్‌లైన్‌లో
https://books.acchamgatelugu.com/products/guru-dakshina-1?

~

శ్రీమతి దినవహి సత్యవతి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mrs-dinavahi-satyavathi/

Exit mobile version