[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘హాల శాతవాహనుని గాథాసప్తశతి – పురావలోకనం’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది రెండవ భాగం.]
హర్షవర్ధనుడి ఆస్థాన కవి బాణుడు తన హర్షచరిత్ర ఉపోద్ఘాత శ్లోకాల్లో ఒక శాతవాహన రాజు ఉత్తమ కావ్య కోశాన్ని (యాంథాలజీ) రూపొందించాడని పేర్కొన్నాడు:
“అవినాశినమ్ అగ్రామ్యం అకరోత్ శాతవాహనః।
విశుద్ధజాతిభిః కోశం రత్నైః ఇవ సుభాషితైః॥”
ఈ శ్లోకంలో ‘విశుద్ధజాతి’ అనేది తెలుగు కన్నడం మరాఠీ లాంటి భాషాజాతిని కాకుండా, సహజ భావవ్యక్తీకరణ, స్వభావోక్తి వంటి అలంకారార్థాల్ని సూచిస్తుందని పండితులు పేర్కొన్నారు. నేరుగా పేరు చెప్పకపోయినా, “గాథాసప్తశతి కావ్యసౌందర్యంతో కూడిన, నశించని, అక్షయమైన రత్నాలను సమకూర్చిన కోశం” అనటం చాలా విలువైన ప్రశంస.
ప్రజల భాషలోనే ప్రజాసాహిత్యం:
భారతీయ భాషా చరిత్రలో మహారాష్ట్రీ ప్రాకృతం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఇది కేవలం ఒక భాషా రూపం మాత్రమే కాదు, సంస్కృత సాంప్రదాయం మరియు ప్రజల మాటల మధ్య వారధిగా నిలిచిన సాంస్కృతిక శక్తి. ముఖ్యంగా తెలుగు, కన్నడ మహారాష్ట్ర ప్రాంతాలలో ఎక్కువగా పరివ్యాప్తమైన భాష. అందుకు కారకులు ప్రముఖంగా శాతవాహనులే!
శాతవాహనుల కాలంలో మహారాష్ట్రీ ప్రాకృతం అధికార భాషగా వెలుగొందింది. క్రీస్తుపూర్వం 500 నుండి క్రమేణా తన ఉనికిని చాటుకుంటూ, క్రీస్తుశకారంభానికి కొంత పరిణతిని పొంది, క్రీస్తుశకం 875 వరకు భాషాపరిణామ దశలను పొందుతూ పశ్చిమ, దక్షిణ భారతదేశంలో విస్తృతంగా ప్రాచుర్యం పొందిన భాషగా పండితులు భావిస్తారు.
వేమభూపాలుడు, కులబాలదేవుడు, గంగాధరభట్టు వంటి పండితులు గాథాసప్తశతిపై వ్యాఖ్యానాలు రాశారు. 15వ శతాబ్దానికి చెందిన పెదకోమటి వేమారెడ్డి (క్రీ.శ. 1402–1420) గాథాసప్తశతిలోని సారవంతమైన 100 గాథలను ఎంచుకొని ‘సప్తశతీ సారము’ అనే సంస్కృత వ్యాఖ్య వ్రాశాడు.
సంస్కృతం కేవలం పండితుల భాష. అది జనం వాడుక భాషగా లక్ష్యించి ఏర్పడినది కాదు. ఋగ్వేద దేవభాషను స్థిరీకరించే ప్రయత్నంలో సంస్కరించబడిన భాష. కాగా, జన వ్యవహారానికి ప్రాకృతం ఆనాడు ఎంతగానో తోడ్పడింది. సంస్కృతాన్ని పండితులు, ప్రాకృతాన్ని ప్రజలు విస్తరింపచేశారు. ఆ విధంగా ప్రాకృతం ప్రజల భాషగా నిలిచింది.
దక్షిణాపథమంతటా విస్తరించిన వివిధ ప్రాకృత మాండలికాల సంగమంగా మహరాష్ట్రీ ప్రాకృతం రూపుదిద్దుకుంది. అందుకు కారకులు బహుశా శాతవాహనులే కావచ్చు. వారి పాలనలో వివిధ ప్రాకృత భాషాప్రాంతాలు ఉండటం చేత అన్నీ కలగలసి ఒకే ప్రాకృతం ఏర్పడింది. రాజధాని పైఠాన్ అనే ప్రతిష్ఠానపురం నేటి మహరాష్ట్రలో ఉండటాన ఈ సంలీన ప్రాకృతాన్ని మనం మహరాష్ట్రీ ప్రాకృతంగా పిలుస్తున్నాం ఇప్పుడు!
సంస్కృతంలోని క్లిష్ట ధ్వనుల్ని మహారాష్ట్రీ ప్రాకృతం సరళంగా పలుకుతుంది. ప్రాకృతం అంటే ప్రకృతి అంటే మూలభాష, సంస్కృతం అంటే సంస్కరించబడినది అని! ప్రాకృతం సంస్కరించబడి సంస్కృతం అయ్యిందా, లేక సంస్కృతం సరళీకరించబడి ప్రాకృతం అనే చర్చకన్నా, ప్రాకృత పదాలు సరళంగా పలకటానికి వీలుగా ఉంటాయన్న దానికే ప్రాధాన్యత నివ్వటం మంచిది.
ప్రాకృతం ప్రాధాన్యతకు కారణాలు:
కాలక్రమేణా, మహారాష్ట్రీ ప్రాకృతం అపభ్రంశ రూపాల్లోకి మారి, ఆధునిక మరాఠీ, కొంకణి భాషలకు పునాది వేసింది. ఈ పరిణామం కేవలం భాషాపరమైన మార్పు కాదు, ప్రజల భావజాలం, సంస్కృతి, జీవనశైలిని కొత్త రూపంలో వ్యక్తీకరించే ప్రక్రియ.
ధ్వన్యాత్మక సరళీకరణ, పదసంపదలో మార్పులు, స్థానిక ప్రభావాలు కలిసి మరాఠీని ప్రత్యేక భాషగా తీర్చిదిద్దాయి.
భాషని కేవలం సంభాషణ సాధనంగా మాత్రమే భావించటం వలన మాతృభాషలన్నింటికీ అపకారం జరుగుతుంది. సమాచార మార్పిడే ధ్యేయం అనేట్లయితే మాతృభాష పట్ల నిబద్ధత పలచబడుతుంది. భాషని సంస్కృతికి, భావోద్వేగాలకు, ప్రజల జీవనశైలికి ప్రతిబింబంగా భావించినప్పుడు భాషపట్ల మన దృక్పథం జాతీయతాభావంలోకి మారుతుంది. మన ఉనికి, అస్తిత్వం, జీవన విధానం, సంస్కృతి, ఆచార వ్యవహారాలన్నీ ముడిపడి ఉండగా మాతృభాషని కేవలం సమాచార వాహినిగా చిత్రించటం అన్యాయం.
కేవలం సమాచార మార్పిడే లక్ష్యం అయితే, అందుకు మాతృభాషే కావాల్సిన అవసరం లేదు. మాట్లాడే ఇద్దరు వ్యక్తుల మెదడుకు సంబంధించిన భాషాబంధం సమాచారం. కానీ, సాంస్కృతిక దృష్టితో చూసినప్పుడు మాతృభాష జాతి మొత్తాన్ని కలిపి ఉంచే సాంస్కృతికబంధం అవుతుంది. ఒక నేర్చుకున్న భాష ఎప్పటికి జాతిని కలిపి ఉంచలేదు. భాషాపరిణామానికి, ప్రజల భావజాలం, సాంస్కృతిక వారసత్వం తరతరాలుగా కొనసాగుతూ రావటానికి భాష జాతీయతతో ముడిపడి, సామాజికంగా ఎదగటం కారణం. తెలుగు నేలమీంచి ప్రాకృతం తొలగిపోయేకొద్దీ తెలుగు ఒక సాహిత్య భాషగా ఎదగటం ప్రారంభించటానికి ఈ పరిణామాలే కారణం.
తెలుగు, కన్నడ ప్రాంత ప్రజలకు ప్రాకృతం నేర్చుకున్న భాషే కాని మాతృభాష కాదు. ఈ కథాకాలానికి మహారాష్ట్ర అనే భౌగౌళికభావన, మరాఠీ భాష ఆవిర్భావాలు ఇంకా జరగలేదు. తెలుగు ఆ నాటికి నిస్సందేహంగా ఉంది, కానీ, లిపి లేదు.
సంస్కృతంతో పోల్చినప్పుడు ప్రాకృతంలో మృదుత్వం ఎక్కువగా కనిపిస్తుంది. ‘ధర్మ’ అనటానికన్నా సామాన్యుడు ‘దమ్మ’ అనటం తేలిక. ప్రజల నాలుకలమీద ఆడేందుకు సంగీతాత్మకత ప్రాకృతానికే ఎక్కువగా ఉండటాన, నాటకరంగానికి ప్రాకృతమే ప్రత్యేక మాధుర్యాన్ని అందించింది! ఆనాటి కవులు ప్రాకృతాన్ని ఆదరించటానికి జనాదరణ దానికే ఎక్కువగా ఉండటం కారణం.
ప్రజల భాషలోనే సాహిత్యం అనే భావనకు ప్రాకృత రచనలు ఆనాడే ఉద్యమించాయి. అందుకనే, సంస్కృత నాటకాలలో రాజు పాత్రలు సంస్కృతాన్ని, పరివార పాత్రలు ప్రాకృతాన్ని మాట్లాడటాన్ని సంస్కృత ఆధిపత్య ధోరణిగా భావించటం కన్నా, జనం భాషగా ప్రాకృత భాషను కూడా కలుపుకోవటం తప్పనిసరి అయి ఉంటుందని కూడా భావించవచ్చు.
మహారాష్ట్రలోనే ఈ భాష పుట్టిందా?:
మహారాష్ట్రీ ప్రాకృతం ఈనాడు మహారాష్ట్రలోనే పుట్టిందని గానీ, మహారాష్ట్ర జాతి చేతే సృష్టించబడిందని గానీ చెప్పడానికి ఆధారాల్లేవు. కాలానుగుణంగా, జైనులు వివిధ ప్రాంతాలలో సంచరిస్తూ ధర్మప్రచారం చేయడం, శాతవాహనుల పాలన విస్తృతంగా ఉండటం వల్ల, దక్షిణాపథమంతటా విస్తరించిన వివిధ ప్రాకృత మాండలికాల సంగమంగా రూపుదిద్దుకుంది. అందువలన, ప్రాచీన కాలం నుంచే అన్ని భారతీయ పండితులు మహారాష్ట్ర ప్రాకృతానికి గౌరవాన్ని సూచించారు.
గాథాసప్తశతి మహారాష్ట్ర ప్రాకృతం తొలినాటి రచన. శాతవాహనుల తరువాత ఐదారు శతాబ్దాలకాలం ఈ ప్రాకృత భాష పరిణామ క్రమం కొనసాగింది. అందువలన శాస్త్రరీత్యా మహారాష్ట్ర ప్రాకృత లక్షణాలు పూర్తిగా గాథాసప్తశతిలో ఉండకపోవచ్చు కూడా! గాథాసప్త శతిని దాని సమకాలీనంగా వెలువడిన సంస్కృతకావ్యాలతో మాత్రమే పోల్చి చూడాలి.
ప్రాకృత కావ్యం అయినప్పటికి గాథాసప్తశతిలోని అపారమైన ‘ధ్వని’ సంస్కృత కవుల్ని అమితంగా ఆకట్టుకుంది. కులబాల దేవుడు, గంగాధరభట్టు, వీరణారాయణుడు, సర్వజ్ఞచక్రవర్తి, పెద్ద కొమటి వేమారెడ్డి ఇలా చాలామంది కవులు సంస్కృత వ్యాఖ్యానాల్ని వ్రాశారు. పెదకోమటి వేమారెడ్డి హాలుని 700 గాథలలో సారభూతమైన 100 గాథలను ఎంపిక చేసి ‘సప్తశతి సారము’ అనే వ్యాఖ్యను రచించాడు. తెలుగులో రాళ్ళపల్లివారితో ప్రారంభించి అనేకమంది కవులు తమకు నచ్చిన గాథల్ని పద్యాలలో అనువదించారు. అయితే తెలుగులో సంపూర్ణంగా 700 గాథలూ మనకు ఒకచోట దొరకవు.
ధ్వని ప్రాధాన్యం:
ప్రాకృత కవిత్వంలో సహజ సౌందర్యం, మానవ భావాల స్పష్ట వ్యక్తీకరణ ప్రధాన లక్షణాలు. సంస్కృత కవిత్వంలో కనిపించే అలంకార సాంకేతికత కన్నా, ప్రాకృత గాథల్లో జీవన సహజత్వం, అనుభూతుల నిగూఢత స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. ఆనందవర్ధనుడు ధ్వని సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తరువాత, గాథాసప్తశతిలోని గాథలే ప్రధాన ఉదాహరణలుగా తీసుకున్నారంతా! అనంతర అలంకారికులు కూడా ధ్వనిభేదాల వివరణకు గాథలను ఆధారంగా ఉపయోగించారు.
సామాన్యుడికి గాథాసప్తశతి ఇచ్చిన ప్రాధాన్యత మరే సంస్కృత కావ్యమూ ఇవ్వలేదనే చెప్పాలి. మౌలికంగా సంస్కృత సాహిత్యాన్ని ప్రభురంజక సాహిత్యంగా ప్రాకృత సాహిత్యాన్ని జనరంజక సాహిత్యంగా భావించటం సబబే!
హాలుడు ప్రాకృత సాహిత్యంలో ధ్వని సిద్ధాంతం, శృంగార రస ప్రధాన్యం, కావ్య శ్రేష్ఠత కోసం తన స్వీయ పరిజ్ఞానం మరియు జాగ్రత్తపూర్వక ఎంపిక – ఇవన్నీ చూపిస్తూ సుసంపన్నమైన సౌందర్యవాదిగా నిలిచాడు. హాలుడికి మాత్రమే కాదు, ఇందులో సంకలితమైన గాథలు వ్రాసిన కవులందరికీ సౌందర్య, రస, ధ్వని, అలంకార, శైలీ పరిజ్ఞానం ఉందనే ఒప్పుకోవాలి.
“బరువులెత్తే కార్మికుడిలాగా మేఘుడు వానపగ్గాలు వేసి భూమిని పైకి లాగుతూ ఊపిరి బిగబట్టి బిగ్గరగా మూలిగినట్టు ఉరుములు మోగుతున్నాయి” అంటుంది ఓ గాథ. ఇలాంటి ఊహలు ‘జనకవు’లకు వచ్చినట్టు రాజకవులకు రావంటారు ఆచార్య తిరుమల రామచంద్ర.
తల పొడవుగా పెరుగుతుంది కాబట్టి తాల (తాళ) చెట్టు లేదా తాటి చెట్టు అన్నారు తెలుగువాళ్లు. తల అంత ఎత్తున సగం ఆకాశాన్ని ఆక్రమించేంత ఎదగటం వలన ఎవరికి లాభం? ఆకలి తీరుస్తుందా? దప్పిక తీరుస్తుందా? ఎవ్వరో ఆ చెట్టెక్కగలవాడు తప్ప ఇతరులు దాని ఫలాలు అందుకోలేనివి కదా.. అందుకని దారినపోయే వాళ్లెవరూ దాని దగ్గరకు చేరరనేది ఇంకో గాథ.
ప్రాకృత కవిత్వంలో సహజ సౌందర్యం, మానవ భావాల స్పష్ట వ్యక్తీకరణ ప్రధాన లక్షణాలు. సంస్కృత కవిత్వంలో కనిపించే అలంకార సాంకేతికత కన్నా, ప్రాకృత గాథల్లో జీవన సహజత్వం, అనుభూతుల నిగూఢత స్పష్టంగా ప్రతిఫలిస్తాయి. ఆనందవర్ధనుడు ధ్వని సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తరువాత, గాథాసప్తశతిలోని గాథల్నే ప్రధాన ఉదాహరణలుగా తీసుకోవటం ఆలంకారికులకు ఒక ఆచారం అయ్యింది. అనంతర అలంకారికులు కూడా ధ్వని భేదాలను వివరణకు గాథలను ఆధారంగా ఉపయోగించారు.
సామాజిక, సాంస్కృతిక ప్రతిబింబం:
గాథాసప్తశతి బహుముఖ సామాజిక జీవితం, గ్రామీణజీవనం, రైతుల శ్రమ, ఋతుచక్రం, పంటలు, పండుగలు, స్త్రీ,పురుషుల మధ్య సున్నితమైన భావాలు, ప్రేమ విరహాలు, కుటుంబ సంబంధాలను సహజ సౌందర్యంతో చిత్రించింది. అందువలన, ఇది కేవలం గాథలనే కవితల సంకలనంగా కాక, రెండు వేల ఏండ్లనాటి సామాజిక చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.
గాథాసప్తశతి కేవలం శృంగార కావ్యం మాత్రమే కాదు, అది క్రీ.శ. 1వ శతాబ్దం నాటి ‘గ్రామరాజ్య’ వ్యవస్థకు ఒక చారిత్రక సాక్ష్యం. రాజుల కంటే గ్రామ పెద్దలే ప్రజలకు చేరువగా ఉండేవారని ఈ గాథల కవులు నిరూపించారు.
“వక్కం కో పులఇజ్జఉ కస్స కహిఙ్ఞఉ మహంవ దుక్ఖం వా,
శేణసమం వ వాసిజ్జిఉ పామరపఉరే హఅగ్గామే”.
“భర్తతో సుఖంలేదు, నచ్చినవాడితో పొందాలన్నా వీలుకాదు. వక్రస్వభావం అంటారు. అలాంటి దాన్ని ఎవరు ప్రేమిస్తారు? తన బాధను ఎవరితో చెప్పుకోగలదు? గద్దల మధ్య చిక్కిన పావురంలా, కర్కశమైన ఈ గ్రామీణుల గుంపులో పడిన సున్నిత హృదయం అలాగే నలిగిపోతుంది.” అంటుంది ఒక గాథ.
గాథాసప్తశతి కాలం నాటి వ్యాపారస్తులు (సెట్టిలు లేదా శ్రేష్ఠులు) సమాజంలో అత్యంత సంపన్నమైన మరియు ప్రభావవంతమైన వర్గంగా ఉండేవారు. శాతవాహనుల కాలంలో రోమ్, ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్యం జోరుగా సాగేది కాబట్టి, ఈ గాథల్లో వారి జీవనశైలికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. ఎంత అంతర్జాతీయ వ్యాపారి అయినా ఇంట్లో ఇల్లాలికి మొగుడే కదా!
గ్రామాల్లోని సామాన్య రైతుల కంటే పట్టణాల్లో ఉండే శ్రేష్ఠుల జీవనశైలి భిన్నంగా, విలాసవంతంగా ఉండేది. గృహాలు: వీరి ఇళ్లు విశాలంగా, మేడలు (అత్తాలకాలు) కలిగి ఉండేవి. గాథల్లోని నాయికలు మేడల మీద నిలబడి ప్రియుల కోసం ఎదురుచూడటం ఒక అలవాటు.
సన్నని పట్టువస్త్రాలు, విదేశీ దుస్తులు మరియు విలువైన రత్నఖచిత ఆభరణాలను ధరించేవాళ్లు. ‘కొలతలు సరిగా వుండి, వెడల్పూ పొడువూ బాగావుండి, ఉతికితే రంగు వెలిసిపోకుండా, కట్టుకుంటే సుఖంగావుండే గుడ్డను ఇవ్వు. అలాకాని దానిని దూరంగా నర్మదా తీరంలో విసిరేయ’మంటుంది బట్టలకొట్టాయన్ని ఓ నాయిక. ఆ అడిగే తీరు ఇవ్వాళ మనం రెడీమేడ్ బట్టలకొట్టుకు వెళ్లి అడిగినట్టుగా ఉంది.
బట్టను కుట్టటం, కత్తిరించటం మన సాంప్రదాయం కాదు. పితృకర్మల్లో మాత్రమే పంచెల చాపుని కత్తిరించి ఒకదాన్ని పంచెగానూ రెండో దాన్ని నడుం కట్టుగానూ కట్టుకుంటారు. కుట్టరులు చెప్పులు కుట్టటం లాంటివి చేసేవారు గానీ బట్టలు కుట్టే దర్జీలు మనకు లేరు. అందుకే ఈ వృత్తికి సంబంధించిన కులం గానీ, సామాజిక వర్గం గానీ మనకు లేరు.
బట్టల వ్యాపారం బాగా సాగేదని, బట్ట సుఖం తెలిసిన విలాస జీవితమే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉండేదని మాత్రం దీన్ని బట్టి అర్థం అవుతుంది.
వ్యాపార నిమిత్తం తరచుగా ‘సార్ధవాహులు’గా (బిడారులతో ప్రయాణించేవారు) సుదూర ప్రాంతాలకు లేదా విదేశాలకు వెళ్లేవారు. ఉత్తరాదిలో వీళ్ళని ‘బనియా’లంటారు. దారిలో ఊళ్లొచ్చినప్పుడు పెద్ద మర్రిచెట్టు కింద తమ సరుకులు దించి వ్యాపారం చేసే వారు. బనియాలకు ఆశ్రయం ఇచ్చేది కాబట్టి వటవృక్షాన్ని ‘బనియన్ ట్రీ’ అన్నారు. సుగంధద్రవ్యాలు, వస్త్రాలు, ముత్యాలు, రత్నాలు ఆ రోజుల్లో ముఖ్య వాణిజ్య వస్తు సముదాయం. మన ప్రాంతాల్లో దొరకని వాటిని ఇతర ప్రాంతాల నుంచి తెచ్చినప్పుడు గిరాకీ ఉండేది.
వ్యాపారస్తులు కేవలం నగరాలకే పరిమితం కాకుండా, గ్రామాల నుండి ముడి సరుకులు (పత్తి, ధాన్యం) సేకరించడానికి తరచుగా గ్రామాలకు వచ్చేవారు. గ్రామీణ యువతులు పట్టణం నుండి వచ్చిన సెట్టిల వేషధారణను, వారి వింత ప్రవర్తనను ఆశ్చర్యంగా చూడటం లాంటి సన్నివేశాలు హాలుడు ఎంతో సహజంగా చిత్రించారు.
భర్తలు వ్యాపారం కోసం పరదేశాలకు వెళ్ళినప్పుడు, వారి భార్యలు (ప్రోషిత భర్తృకలు) పడే విరహవేదన గాథాసప్తశతిలో ఒక ప్రధాన ఇతివృత్తం. “వర్షాకాలం రాకముందే వస్తానని చెప్పి వెళ్లిన నా భర్త ఇంకా రాలేదే?” అని భార్యలు ఆవేదన చెందే గాథలు, ఆనాటి వ్యాపార పర్యటనల కాలాన్ని సూచిస్తాయి.
శ్రేష్ఠుల దానగుణం మరియు సామాజిక హోదాసమాజంలో శ్రేష్ఠులకు విద్యావంతులుగా, దాతలుగా మంచి పేరు ఉండేది.
ధర్మ కార్యాలు, ఆలయాల నిర్మాణం, సత్రాల నిర్వహణ, కరువు కాలంలో ప్రజలను ఆదుకోవడంలో ఈ వాణిజ్యవేత్తలే సామాజిక సేవలో ఎక్కువగా పాల్గొనేవారు. వ్యాపార సంఘాలు (గిల్డ్స్)ని ‘శ్రేణి’ అనేవాళ్లు. ఈ వాణిజ్య సంఘాల పెద్దలే రాజుల వద్ద ప్రతినిధులుగా ఉండేవారు. గాథల్లో వీరిని ‘సెట్టి’ లేదా ‘సాహు’ అని సంబోధించడం కనిపిస్తుంది. ప్రాకృతంతో పాటు వాణిజ్య అవసరాల కోసం ఇతర భాషలు కూడా మాట్లాడేవారు.
కొందరిలో లోభత్వం కూడా ఉండటం సహజం. కొందరు వ్యాపారస్తుల లోభాన్ని కవులు వ్యంగ్యంగా చిత్రించారు కూడా! ధనం సంపాదించాలనే తపనతో కుటుంబానికి దూరం అవ్వడం లేదా పిసినారితనంతో జీవించడం వంటి అంశాలను చమత్కారంగా చెప్పారు. చిత్రించారు. ఒక గాథలో, లాభం కోసం ఆశపడి తన ఆరోగ్యాన్ని, సుఖాన్ని పక్కన పెట్టే వ్యాపారిని చూసి కవి పరిహసిస్తాడు.
నగరాలు, భరుకచ్చం, ప్రతిష్ఠానపురం, మన ఘంటసాల లాంటి రేవుపట్టణాలు ఆ రోజుల్లో ప్రసిద్ధి పొందాయి.
గాథాసప్తశతిలోని సహజ లాలిత్యం, మాధుర్యం సంస్కృతంలో అంత సహజంగా సాధ్యపడదేమో అన్నంత ఉన్నత స్థాయిలో కనిపిస్తుంది. ఈ ప్రయత్నాలను తెలుగు కవులు తెలుగు విషయంలో ఎందుకు చేయలేకపోయారన్నది కూడా ఆలోచించాల్సిన అంశమే. ప్రాకృతము, పాళీ, సంస్కృతమూ మూడు భాషలూ ముప్పిరిగొనటం వలన తెలుగు క్రీస్తుశకం తొలిశతాబ్దాలలో సాహిత్యభాషగా వెలిసింది. అంతవరకూ తెలుగు కేవలం వాడుకభాషగానే ఉంది. గాథాసప్తశతిలోని గాథల రచయితలు తెలుగు కన్నడ మరాఠీ ప్రాంతాలకు చెందిన వారై ఉండాలి.
గాథాసప్తశతిలో సామాన్యుడి మనోభావాల్లోని శృంగార ఛాయలు ప్రముఖంగా కనిపిస్తాయి. “ఇలాంటి ఇంటి ముచ్చట్లు కవిత స్థాయికి ఎలా ఎక్కగలిగాయా.. అని..” అంటూ తిరుమల రామచంద్ర ఆశ్చర్యం వ్యక్తపరిచారు.
“సామాన్య మానవునికి నా నిర్వచనం ప్రతి వృత్తిలోని సామాన్య గృహస్థులు-రాజ సేవకుడు మొదలు నాపితుని వరకు గలవారు. ఈ సామాన్య ప్రజల దైనందిన జీవితం, దారిద్ర్యం, కరువు కాటకాలు, వాగులు, వరదలు, వానకాలపు బురదవీథులు, ఎండాకాలపు మృగతృష్ణలు, దప్పిగొన్న బాటసారులు. చలివెందలి చపలాకులు, చలికాలపు నెగళ్లు, గొంగళ్లు అక్కరలేని నెరజాణల మొగుళ్లు, వసంతోత్సవాలు, మొగిళ్లను చూచి మూడు నిట్టూర్పులు విడిచే ముదితలు, ఫాలుణోత్సవాలు, పెండ్లిండ్లు, పేరంటాలు, సతులు అసతులు, విధవలు వేశ్యలు, జారులు పూజారులు, వంటలు, పంటలు, శిథిల దేవాలయాలు, ప్రశిథెల వలయాలు, నగలూ నాణేలు-ఒక్కటేమిటి గ్రామాలలోని ప్రతిదీ కావ్య వస్తువయింది. ధర్మశాస్త్రం నిషేధించిన బుతుమతీ సంస్పర్శన సంగమాలను కూడ ఈ కవులు వదలి పెట్టలేదు” అని వివరించారాయన.
గాథాసప్తశతి – భాష, కవిత్వం, సంప్రదాయం:
“నిద్దయ కుద్దాలయ మజ్జ బహులచ్చలంత జలసోత్తం,
ఉద్దోలద్ద అంసురిసో భరియం వి న మేళ్ల ఏ వావిం.”
“నిద్రలేని మధ్యరాత్రి, మేఘాల మధ్యనుంచి జలధారలు ప్రవహించే వేళ, మెరుపుల తళుకుల్లో తడిసిపోయిన ఆకాశం ఎంతో అద్భుతమైనదే! కానీ, ఆమె ముఖసౌందర్యంతో పోలిస్తే ఆ దృశ్యం ఏ మాత్రం నాకు మక్కువ కలిగించలేకపోయింది.”
“దట్టూణ తరుణసురఅం వివివ పలోద్ధంత కరణసోహిల్లం,
దీఓ వి తగ్గయ మణో గఅం వి తెల్లం న లణీఇ.”
యవ్వనపు మధురసంతో నిండిన ఆమెను దగ్గరగా చూసిన తర్వాత, విలసిల్లే ఆమె కళ్ళ కాంతి మనసును మత్తెక్కించిన తర్వాత, దైవమే వచ్చి మనసును ఆపమన్నా సరే, అది మళ్లీ శాంతించదు, తెల్లగా, నిర్మలంగా ఉండదు.
గాథాసప్తశతిలోని ప్రసిద్ధ గాథలలో ఒక ఉదాహరణను ఆనందవర్ధనుడు ధ్వని సిద్ధాంత వివరణలో ప్రస్తావించారు:
“భామ ధమ్మియ విసత్తో సో సునఓ అజ్జ మారియో తేణ।
గోలా-అడ-విడ-కుడంగ-వాసిణా దరియ-సిహేణ॥”
గోదావరి నది ఒడ్డున ఎక్కడో కొండగుహల్లో నివసించే సింహాన్ని పొలంగట్ల మీద ఉండే కుక్క అడ్డుకుంటోంది కుక్కకి భయపడి జనం అటు రావటానికే భయపడ్తుంటారు, ఆ అయోధుడు ఇప్పుడా కుక్కని చంపేశాడు. ఒక నాయిక తన ప్రియుడితో కలుసుకునే స్థలాన్ని భద్రంగా నిర్ణయించుకోవాలనుకుంటుంది. అతనా స్థలాన్ని ఎంపిక చేశాడు. సింహాన్ని ఆపిన కుక్క చచ్చిపోయిందంటుందామె! అంటే, సింహం ప్రమాదం పొంచి ఉందనే హెచ్చరిక ఇస్తుంది. ప్రత్యక్షార్థం సరళమైనా, ధ్వని ద్వారా వచ్చిన సంకేత భావాన్ని పూర్తి స్వేచ్ఛగా, జాగ్రత్తగా వ్యక్తం చేసింది.
ఇది హాలుడి కావ్యసౌందర్య బోధను స్పష్టంగా చూపిస్తుంది.
మొత్తం చెప్పాలంటే, హాలుడు ప్రాకృత సాహిత్యంలో ధ్వని సిద్ధాంతం, శృంగార రస ప్రధాన్యం, కావ్య శ్రేష్ఠత కోసం తన స్వీయ పరిజ్ఞానం మరియు జాగ్రత్తపూర్వక ఎంపిక – ఇవన్నీ చూపిస్తూ సుసంపన్నమైన సౌందర్యవాదిగా నిలిచాడు.
గాథాసప్తశతి బహుముఖ సామాజిక జీవితం, గ్రామీణ జీవనం, రైతుల శ్రమ, ఋతుచక్రం, పంటలు, పండుగలు, స్త్రీ-పురుషుల మధ్య సున్నితమైన భావాలు, ప్రేమ-విరహాలు, కుటుంబ సంబంధాలను సహజ సౌందర్యంతో చిత్రించింది. అందువలన, ఇది కేవలం కవితా సంకలనం కాక, రెండు వేల ఏండ్ల నాటి సామాజిక చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.
