Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హాల శాతవాహనుని గాథాసప్తశతి – పురావలోకనం-3

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘హాల శాతవాహనుని గాథాసప్తశతి – పురావలోకనం’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది మూడవ భాగం.]

గాథాసప్తశతి-ప్రేమతత్త్వసారం

సంస్కృతంలో గానీ, ప్రాకృతంలో గానీ, దేశభాషలలో గానీ, గాథాసప్తశతితో సరితూగగల కవితాసంపుటి మరొకటి లేదనేది సాహిత్యలోకంలో ప్రసిద్ధమే! ఈ మహత్తుకు మూలకారణం.. అత్యధికంగా సామాజిక జీవితం ప్రతిబింబించటమే కారణం!

నేల విడిచి సాము చేసిన ఊహాకవులు కాదు గాథకులు; కాలగర్భంలోంచి వెలువడిన మానవ హృదయాల సమాహారమే గాథాసప్తశతి. “అమృతసమానమైన ప్రాకృత కవిత్వాన్ని చదవడమూ, వినడమూ తెలియని వారు ప్రేమతత్త్వాన్ని చర్చించడానికి ఎందుకు సిగ్గుపడరు?” అన్న వ్యాఖ్య, ప్రాకృత ప్రాశస్త్యాన్ని మాత్రమే కాక, ప్రేమను శారీరక కోణానికి పరిమితం చేయకుండా, అనుభూతి–రసాత్మక తత్త్వంగా ప్రతిష్ఠించిన దృష్టిని స్పష్టంగా సూచిస్తుంది.

శాతవాహన ప్రభువైన హాలుడే ఈ సంకలనకర్త అన్న నమ్మకం తరతరాలుగా వ్యాప్తిలో ఉంది. “సప్త శతకాని కోటేర్మధ్యే/కవివత్సలేన హాలేన/ గాథానాం రచితాని హి/ నానాలంకార లలితానామ్” అనే గాథ.. కోట్ల సంఖ్యలో ఉన్న గాథలలో నుండి నానాలంకారలలితమైన ఏడువందల గాథలను కవివత్సలుడైన హాలుడు ఒకచోట చేర్చాడని ప్రకటిస్తుంది.

కొందరు ‘కవివత్సలుడు’ అనే వేరొక కవి హాలుడి పేరుతో రచించాడని వాదించినా, అది ప్రధానంగా సంకలనాధికారాన్ని ప్రశ్నించే ప్రయత్నమే. “రసిక జన హృదయ దయతే / కవివత్సల ముఖ సుకవి సంకలితే” అని సంకలనకర్త తన్ను తాను పరిచయం చేసుకుంటాడు. ఈ కావ్యం రసికుల హృదయాలకు ఆనందాన్ని ప్రసాదించేదిగా, సుకవుల గాథల సమాహారంగా వెలిసిందని చెప్పుకుంటాడు.

హాలుడు కవివాత్సల్యాన్ని తన ఘనతగా చెప్పుకుంటాడు. రాజనే గర్వం లవలేశమూ కనిపించని ఈ వినయం సాధారణం కాదు; అది పరిపక్వమైన కవి హృదయానికి మాత్రమే సాధ్యం.

హాలుణ్ణి కవి కంటే ముందు సాహిత్య సంరక్షకుడిగా గుర్తించాలి. కవివాత్సల్యం అంటే కేవలం కవులను ఆదరించటం కాదు; విభిన్న స్వరాలను ఒక సమగ్ర సాహిత్య రూపంగా మలచగల సంపాదక దృష్టి. గాథల ఎంపికలోని రస సమతుల్యత, విషయ వైవిధ్యం ఈ సంపాదక చైతన్యానికి సాక్ష్యం. అక్షరాల తూకం వేసే శ్లోకం, భారతీయ సాహిత్య విమర్శా చరిత్రలో అక్షరగౌరవం అనే కీలక భావనను సూచిస్తుంది!

ఇక్కడ అక్షరం అంటే కేవలం ధ్వని కాదు; అనుభూతిని మోసుకొచ్చే శక్తి. ఆ శక్తిని గ్రహించగల రసికత్వమే నిజమైన సంపద. ఈ దృష్టిలో గాథాసప్తశతి, సాహిత్యాన్ని విలువలతో తూకం వేసే ప్రమాణగ్రంథంగా నిలుస్తుంది. అందుకే గాథాసప్తశతి ప్రభావం సంస్కృత అలంకారశాస్త్రం, మధ్యయుగ దేశీ కవిత్వం, ఆధునిక సాహిత్య విమర్శ వరకూ వ్యాపించింది. ఇది ఒక కాలానికి చెందిన గ్రంథం కాదు, భారతీయ అనుభూతి సాహిత్యానికి శాశ్వత ఆధారం.

“వర్ణావళీమస్య జానంతో లోకాలోకైర్గౌరవాభ్యధికాః /సువర్ణకార తులా ఇవ నిరక్షరా లిపిస్కంధై రుధ్యంతే” అనే శ్లోకం ప్రాకృతం నుండి సంస్కృతానికి అనువాదరూపం.. గాథాసప్తశతిలోని అక్షరాల విలువను తూకం వేస్తుంది. ఈ గాథల అక్షరగౌరవాన్ని గ్రహించినవారు లోకప్రశంస – లోకనిందలకన్నా మించిన విలువను పొందుతారు; అక్షరజ్ఞానం లేనివారికి ఈ విలువ అగమ్యం. త్రాసులో ఒక తక్కెడలో బంగారాన్ని, మరో తక్కెడలో అక్షరాలను ఉంచితే – రెండూ సమానంగా తూగుతాయి అన్నదే వ్యాఖ్యాతల భావం.

బంగారం లోహాలన్నీంటిలో అత్యంత విలువైనది. కవితాతత్త్వాన్ని లోనారాయగల రసికత కూడా అంతే విలువైనది. అందుకే త్రాసులో బంగారమూ, గాథాసప్తశతిలోని అక్షరాలూ – ఒకే బరువుతో తూగుతాయి అని కవి తత్త్వనిర్ణయం.

గాథల్లో ప్రతిఫలించిన జీవితం “సాసూయ పహారై, వాహే హియయం వలై” భర్త పొలంలో కష్టపడుతుంటే ఇంటి పని భారంతో భార్య హృదయం అలసిపోతుంది. ఉత్పాదకతలో స్త్రీ, పురుషుల సమాన భాగస్వామ్యం ఈ గాథలో మనకు కనిపిస్తుంది.

రైతు మాత్రమే కాదు, రైతు కుటుంబమే ఉత్పత్తి సాధనం. ఇది ఆధునిక ఆర్థిక సిద్ధాంతాలకు ముందే ఉన్న గ్రామీణ వాస్తవం. గాథాసప్తశతి ప్రాశస్త్యాన్ని అర్థం చేసుకోవాలంటే, దానిని కేవలం ఒక కవితా సంకలనంగా కాక, సామాజిక–సాంస్కృతిక దస్తావేజుగా చూడాలి. ఇందులో ప్రతిఫలించే ప్రేమ అనేది రాజసికమూ కాదు, అలౌకికమూ కాదు, అది గ్రామీణ జీవనానికి, దైనందిన అనుభూతులకు, మానవ సంబంధాల సూక్ష్మతలకు నిబద్ధమైనది. అందుకే గాథలు వ్యక్తిగత భావాలుగా మొదలై, సమూహ అనుభవాలుగా విస్తరిస్తాయి.

ప్రాకృత భాషను గాథాసప్తశతి ఎంచుకోవటం యాదృచ్ఛికం కాదు. సంస్కృతం శాస్త్ర – ఆచార భాషగా ఉన్న కాలంలో, ప్రాకృతం జనభాషగా, అనుభూతి భాషగా వికసించింది. ప్రేమ, వియోగం, ఆశ, అసూయ వంటి సూక్ష్మ భావాలను వ్యక్తపరచటానికి ప్రాకృతం మరింత అనుకూలమైంది. ఈ భాషా ఎంపికే గాథాసప్తశతిని ప్రజల హృదయాలకు చేరువ చేసింది.

గాథాసప్తశతిలో ప్రతిఫలించిన సామాజిక నిర్మాణం – ప్రత్యక్ష గాథా ఉటంకణలతో విశ్లేషణ గాథాసప్తశతిలో ప్రతిఫలించిన సమాజం కేవలం పైస్థాయి ప్రజల జీవితాల చిత్రణకే పరిమితం కాదు. మారుమూల ప్రాంతాలు, ఆటవిక సమూహాలు, అంచున ఉన్న జనజీవితాలు కూడా ఇందులో సహజంగా ప్రతిఫలించాయి.

పుళింద అనే ఆటవిక జాతికి చెందిన ఒక మహిళ, తన భర్త పరాయి స్త్రీతో సల్లాపాలు చేయటంపై ఈర్ష్య పడుతున్న దృశ్యాన్ని ఒక గాథ వర్ణిస్తుంది. ఇది గాథలు సమాజాన్ని సమగ్ర మానవ అనుభూతుల ప్రాతిపదికన చిత్రించాయని స్పష్టం చేస్తుంది.

కులాంతర వివాహాలు ఆనాటి సమాజంలో ముమ్మరంగా జరిగేవని గాథల ద్వారా తెలుస్తుంది. బహుపత్నీత్వం, సతీ వంటి ఆచారాలు కనిపించినప్పటికీ, విధవా పునర్వివాహానికి పెద్దగా స్థానం లేనట్టు గాథలు సూచిస్తున్నాయి. ఇవి సమాజం ఒక సంధికాల దశలో ఉందన్న భావనకు దోహదపడతాయి.

కుటుంబవ్యవస్థ వృత్తి విభజనతో అనుసంధానమై ఉంది. ఇంటి పెద్దకొడుకు నాగలిపట్టి పొలానికి వెళ్తే, చిన్నకొడుకు పశుపాలన చూసేవాడు. బలరాముడి ఆయుధం నాగలి కావటం, కృష్ణుడు గోపాలుడిగా నిలవటం.. ఈ వృత్తి ఆధారిత కుటుంబ వ్యవస్థకు పురాణీయ ప్రతిరూపాలు. పాలు పితికే బాధ్యత కుమార్తెదే కావటం వల్ల ఆమె ‘దుహిత’కావటం భాషా సాంస్కృతిక అనుసంధానాన్ని తెలియజేస్తుంది.

గాథలలో తరచుగా కనిపించే ప్రయాణంలో ఉన్న పురుషుడు, అతని రాక కోసం నాయిక పడే వేదన, రాకపై కలిగే ఆనందం గ్రామ పరిమితులను దాటి పురుషులు వృత్తి, వాణిజ్య అవసరాల కోసం దూరప్రయాణాలు చేసేవారన్న వాస్తవాన్ని సూచిస్తాయి.

ఒక వ్యక్తి ఎద్దును కొనటానికి తన ఖరీదైన గొంగళిని ఇచ్చాడనే ఒక గాథని బట్టి, శాతవాహన కాలంలో నాణేలు ఉన్నప్పటికీ వస్తుమార్పిడి పద్ధతి కూడా కొనసాగిందని తెలుస్తుంది.

గ్రామీణ–పట్టణ జీవన వ్యత్యాసాలు కూడా గాథలలో స్పష్టంగా దర్శనమిస్తాయి. పట్టణ యువకులు సరసం తెలియని, సంబరాల రాంబాబులు. గ్రామీణ జీవితం సంగీతం, నృత్యం, కోడి పందాలు, పొట్టేళ్ల పందాలు, ఎద్దుల పందాలు వంటి వినోదాలతో సజీవంగా ఉంటుంది.

నాగరికులు ధనార్జన, వాణిజ్య ఆలోచనలతో జీవిస్తే, గ్రామజనం జీవనానుభూతులతో జీవిస్తారు. కవిత్వ స్వరూపంపైనా గాథలు స్వయంగా వ్యాఖ్యానిస్తాయి. ఒక గాథలో కవి తన గాథను ఒక అందమైన బాలికతో పోలుస్తాడు – “శునకప్రచురే గ్రామే భ్రామయంతి తవ కృతేన సా బాలా” కుక్కలు తిరిగే ఊళ్లో కూడా గాథ అనే బాల స్వేచ్ఛగా తిరుగుతుందని భావం.

అలాగే – “పాశకశారీవ గృహంగృహేణ భాషిష్యతే కదాపి అంగ” పాచికల కాయలల్లా ఒకనాటికి జనం నాలుకల మీద ఈ గాథలు ఆడతాయన్న కవి ఆశాభావం ఇది. వాస్తవానికి, గాథాసప్తశతి పట్టణ–కాస్మోపాలిటన్ వాతావరణంలో రూపుదిద్దుకున్న కామసూత్రానికి జీవన్మయమైన ప్రత్యామ్నాయం. కామసూత్రం నాగరిక పట్టణ సమాజాన్ని కేంద్రంగా చేసుకుంటే, గాథాసప్తశతి ప్రధానంగా గ్రామీణ పరిసరాల్లో వికసించిన ప్రేమానుభూతులను చిత్రిస్తుంది.

ఈ గ్రామీణ నేపథ్యం ప్రేమను సహజమైన, జీవనసన్నిహితమైన అనుభూతిగా మలిచింది. “పియవియోగే వియణా, సయమే కహేఇ హియయం” ప్రియుడి వియోగంలో స్త్రీ హృదయం తానే తన కథ చెప్పుకుంటుందన్న ఈ గాథ – స్త్రీ అనుభూతి ఎంత అంతర్గతమైనదో, ఎంత వ్యక్తిగతమైనదో సూచిస్తుంది.

ఈ గాథలలో స్త్రీల మానసిక స్థితులు, ఆకాంక్ష, సంకోచం, తిరస్కారం, ధైర్యం, స్వాతంత్ర్య భావన – అనేక కోణాల్లో దర్శనమిస్తాయి. ప్రేమ ఇక్కడ కేవలం వ్యక్తిగత అనుభూతి కాదు; సామాజిక నియమాలతో నిరంతరం సంభాషించే చైతన్య స్థితి. గాథాసప్తశతిలో ఎక్కువగా స్త్రీస్వరమే వినిపిస్తుంది. ఒక అర్థంలో ఇది మహిళాకావ్యం.

వాత్స్యాయనుడి కామసూత్రం పట్టణ సంస్కృత స్త్రీల సంకేతాలను సిద్ధాంతంగా వివరిస్తే, గాథలు గ్రామీణ స్త్రీల మౌనాలు, పలుకులు, అంతర్గత స్పందనలను అనుభూతిగా మలుస్తాయి. అందుకే గాథాసప్తశతి పల్లె సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచిన, నాయికానుభూతి కేంద్రితమైన మహత్తర కావ్యసంపుటి.

“బిసిసీ పత్రి నిశ్చల నిస్సందా పశ్య రాజతి బలాకా/నిర్మల మరకతభాజన పరిస్థితాశంఖుక్తిరివ”

కలువ పూల ఆకులతో కప్పబడి నిశ్చలంగా ప్రశాంతంగా ఉన్న సరస్సులో తెల్లకొంగ మరకతంతో చేసిన పళ్లెంలో శంఖంలా తెల్లగా మెరిసే ముత్యంలా ఉన్నదంటుందీ గాథ. బలాక అంటే కొంగ, బలాకకా అంటే అందమైన ఆడపిల్ల, ఎంత చక్కని శ్లేషని ప్రయోగించాడో రెండువేల యేళ్లనాటి ఈ కవి..! అక్షరజ్ఞానం ఉన్నవాడికి గాథ బంగారంతో తులతూగుతుందన్నాడందుకే!

“వరిచేను ఏపుగా ఎదిగి నాయకుడితో సరససల్లాపాలకు చాలినంత మదుగు నిచ్చింది ఇన్నాళ్లు. ఇంక పంట కోతకొచ్చింది.. ఇంకనుండీ తమకు మదుగు లేకుండా పోతుందని చేనుకు కాపలా కాసే నాయిక ఎండిన వరిగడ్డిలా అయిపోయింది!” అనేది ఒక గాథలో వ్యక్తమైన భావం.

“పశ్చాత్తాపంతో భర్త ఆమె పాదాల మీద పడితే, చిన్నబాబు పాకుతూ వచ్చి అతని వీపెక్కాడు. అప్పటిదాకా మౌనంగా ఉన్న భార్య అది చూసి ఒక్కసారి ఫక్కున నవ్వింది” ఆనంద దాయకమైన రసాలూరే కవిత ఇంతకన్నా ఉంటుందా అనిపించే గాథలు కొల్లలుగా ఈ గాథల్లో ఉన్నాయి .

“ఖేత్తం సుహయే పియయమా, నీవ్వావణం వియ సుహావం” ప్రియుడి సన్నిధిలో ఉన్నప్పుడు పంటపొలం కూడా మనకు ఇల్లులానే సుఖంగా అనిపిస్తుంది.. అనేది అంకితభావాన్ని నిబద్ధతను సూచుస్తుంది. పంటపొలం కేవలం ఆర్థిక కార్యకలాపాల స్థలం కాదు. అదొక భావోద్వేగాల వేదిక కూడా! గ్రామజీవులకు పనీ, ప్రేమా వేర్వేరు అంశాలు కావనేదే ఇందులో సారం!

“హాలో ఘోరై కణ్ణై, సువ్వం కరేఇ సుయమణ్ణం” నాగలి దున్నేటప్పుడు ఎద్దుల కన్నులలో కనిపించే శ్రమ మనసును కదిలిస్తుంది. ఇందులో జీవకారుణ్యం జాలువారుతోంది. ఇది పశుపోషణ, పశువులను కన్నబిడ్డల్లా చూసుకోవటం, వారి జీవనలక్షణాలు. ఎద్దులు యాంత్రిక సాధనాలు కావు; జీవన సహచరాలు. శాతవాహన సమాజంలో వ్యవసాయం ఒక సజీవ సంబంధాల వ్యవస్థ.

(ఇంకా ఉంది)

Exit mobile version