[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘హాల శాతవాహనుని గాథాసప్తశతి – పురావలోకనం’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది 4వ భాగం.]
సరళ పదాలు – భావగాఢత
‘గాథాసప్తశతి’ బహు శాఖా పరిశోధనలకు ఒక ఆకర గ్రంథం. అది కేవలం ఒక సాహిత్యకృతిగా మాత్రమే కాకుండా చరిత్ర, సమాజశాస్త్రం, భాషాశాస్త్రం, మానవ మనోవిజ్ఞానం వంటి అనేక రంగాలకు మూలగ్రంథంగా నిలిచింది. ఆదిగ్రంథాలకు ఆదిదేవతలతో సమానమైన స్థానం ఇచ్చి గౌరవించాల్సిన గొప్ప రచన ఇది.
గాథాసప్తశతికి సంబంధించి, అనేక పాఠప్రతులను సవివరంగా పరిశీలించి, వాటి మధ్య ఉన్న పాఠాంతరాలను తులనాత్మకంగా విశ్లేషించి, ఒక శుద్ధప్రతిని వేబర్ రూపొందించాడు. ఈ శుద్ధప్రతిని ఆయన క్రీ.శ. 1881లో “Des Saptasatakam des Hāla” అనే పేరుతో జర్మనీలోని లైప్పిగ్ పట్టణం నుంచి ప్రచురించాడు.
ఈ ప్రతిని సిద్ధం చేసే క్రమంలో వేబర్ పూర్వపు వ్యాఖ్యాతల టీకలను ఉదహరించినప్పటికీ, ముఖ్యంగా గంగాధరుని టీకను విస్తృతంగా వినియోగించాడు. పాఠనిర్ణయంలో గంగాధరుని వ్యాఖ్యలు ఆయనకు ప్రధాన ఆధారంగా నిలిచాయి.
వేబర్ ప్రచురించిన ఈ గ్రంథమే తరువాత కాలంలో వెలువడిన గాథాసప్తశతి ప్రతులన్నిటికీ మూలాధారంగా మారింది. ఆధునిక పాఠ సంపాదకులు, అనువాదకులు, వ్యాఖ్యాతలు అందరూ ఎక్కువగా ఈ ప్రతినే ఆధారంగా తీసుకున్నారు.
అందువల్ల, గాథాసప్తశతికి ఒక ప్రామాణిక పాఠరూపాన్ని నిర్దిష్టంగా అందించడంలో వేబర్ చేసిన కృషి అసాధారణమైనది. భారతీయ ప్రాకృత సాహిత్య అధ్యయన చరిత్రలో ఆయన సంపాదకత్వం ఒక మైలురాయిగా పరిగణించబడుతుంది.
అమృతకావ్యం
హాలుడు స్వయంగా గాథాసప్తశతిని ‘అమృతకావ్యం’ అని పేర్కొన్నాడు. ఇందులోని అనేక గాథలను ఆనందవర్ధనుడు వ్యంగ్యార్థ లక్షణానికి ఉదాహరణలుగా స్వీకరించాడు. గాథాసప్తశతిలోని గాథలలో చాలా వరకు రసార్హ ధ్వని సంపదలతో పరిపుష్టమై ఉంటాయి.
చరిత్రకారులు గాథాసప్తశతిని శాతవాహన కాల సామాజిక జీవితంగా భావించారు. భాషావేత్తలు ప్రాకృత భాషల స్వరూపం, వికాసంగా దీన్ని విశ్లేషించారు. మనోవైఙ్ఞానికవేత్తలు సహజ మానవ భావోద్వేగాల వ్యక్తీకరణగా దీన్ని అధ్యయనం చేశారు.
తెలుగు భాషలో ఎంత సంస్కృతం ఉన్నదో అంత ప్రాకృతమూ ఉంది. కొంత పాళీ కూడా ఉంది. అంతే స్థాయిలో సంస్కృత, ప్రాకృత, పాళీ భాషల్లో తెలుగు పదాలూ ఉన్నాయి. ఇది ప్రతి తెలుగు వాడూ గర్వించాల్సిన అంశం. గాథాసప్తశతిలో తెలుగు పదాల గురించి విశేష పరిశోధన చేసిన తెలుగువారి ప్రాతఃస్మరణీయుడు ఆచార్య తిరుమల రామచంద్ర తెలుగు వాక్యనిర్మాణాలను పదాలను ఉపయోగించే తీరుని గాథాసప్తశతిలోంచి ఎత్తి చూపటం ద్వారా అందులో కనిపించేది ఆనాటి తెలుగు సమాజంగా నిరూపించే ప్రయత్నం చేశారు.
ఆనాటి తెలుగు సమాజం భౌగౌళికంగా ఈనాటి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల ఉమ్మడి సమాజంగా ఉంది. అందుకని గాథాసప్తశతి ఈ ముగ్గురి ఉమ్మడి ఆస్తి.
“అంతరదశ సమాజం”
ఈ గ్రంథం ప్రతిబింబించే సమాజం పూర్తిగా నియమబద్ధమైనది కాదు, పూర్తి స్వేచ్ఛాత్మకమూ కాదు.
అది ఒక transition society. పురుషాధిక్య వ్యవస్థ ఆవిర్భవిస్తున్న దశ. కానీ స్త్రీస్వరానికి ఇంకా ప్రాధాన్యత నడుస్తోంది. మహిళలు తమ కోరికలు, సందేహాలు, ప్రేమానుభూతుల్ని సఖులతో స్వేచ్ఛగా పంచుకోగలిగిన వ్యవస్థ అది. భారతీయ సాహిత్యంలో స్త్రీ భావ ప్రపంచాన్ని అంత సహజంగా చూపిన అరుదైన దశని మనం గాథాసప్తశతిలో దర్శించవచ్చు. ఇంకా నొక్కి చెప్పాలంటే స్త్రీపురుష భేదం లేకుండా సామాన్యుల ఆంతరంగిక భావోద్వేగాల సంకలనం గాథాసప్తశతి అనవచ్చు.
“అజ్జ మయా న దిట్ఠో, స పియో/తం చ దిఠ్ఠం సఖీఏ/జైఁ తుహ నిమిత్తం/తైఁ మమ హియయం పలయై”
“ఇవ్వాళ కూడా అతన్ని చూళ్లేదు. నువ్వు చూశావని తెలిసి నా హృదయం అతడి వైపే పరుగులుతీసింది”
అనే గాథ ప్రేమ స్పందనని ఒక మహాకావ్యంగా చూపించింది.
అసూయలెని నిష్కల్మషతను ఈ నాయిక ప్రదర్శించింది. ఈ చేతినేనా ఆ కృష్ణుడు ముద్దుపెట్టుకున్నాడని ఒక రాధికని అడిగి ఆ చేతిని తన బుగ్గలకు ఆన్చుకుని అక్కడే తను కూడా ముద్దుపెట్టుకున్న నాయికలోని ఔన్నత్యంతో పోల్చదగిన ప్రవృత్తి ఇది.
సరళత భావగాఢత
గాథలు పైకి చూడగానే చాలా సరళంగా కనిపిస్తాయి. చిన్న కవిత, అలంకారాల ఆర్భాటం లేదు, దైనందిన జీవిత ఘట్టాలే ప్రధాన విషయం, కానీ లోతుగా చూస్తే: భావాత్మక స్థాయి సామాజిక సంకేతాలు, లింగ సంబంధాలు, రాజకీయాలు, దేశ కాల పరిస్థితులు అన్నీ పొరలుగా దాగి ఉంటాయి. సాధారణంగా కనిపించి అసాధారణమైన గాఢతను ప్రతిఫలిస్తుంది ఒక్కో గాథ!
“సఖీ! అతడి తప్పుల్ని ఏకరువుపెడ్తున్నావు గానీ, నాకు మాత్రం అతను సఖుడే” అనే ఓ గాథని చదివినప్పుడు ఈ నాయికే క్షేత్రయ్యగారి నాయికగా మారిందనిపిస్తుంది. స్త్రీ తన ఇష్టాన్ని తానే నిర్ణయించుకునే స్వరం ఈ గాథలో వినిపిస్తుంది.
“ప్రియుఁడు వాదించుకొలఁది, నే వేల మించు
చంచల ప్రణయముస నర్తించుచుందు;
సహజముగ స్తబ్ఢమగుఁగాక, మహిరుహమ్ము
నందు వలయింపదా మేని నలరుదీవ?”
అని గట్టి లక్ష్మీనరసింహశాస్త్రిగారు ఓ గాథని అనువదించారు.
ప్రాకృత సాహిత్యంలో బహుళ నాయకులు, బహుళ నాయికలు కనిపిస్తారు. సంస్కృత సాహిత్యంలో అనేకమంది నాయికలు ఒక్కడే నాయకుడు, ఆ నాయకుడే పరమాత్ముడుగా భావపరిణామం కనిపిస్తుంది. క్షేత్రయ్య కాలానికి “పరమాత్మ ఒక్కడే పురుషుడు, తక్కిన జీవజాలం అంతా నాయికలే” అనే భావనగా పరిణామ వికాసాన్ని మనం గమనించవచ్చు.
మౌలికంగా ప్రేమకవితల సమాహారం గాథాసప్తశతి. ఈ గాథలన్నింటి మధ్య.. దండలో దారంలా మానవసంబంధం అనే మౌలిక సూత్రం ఉంది. గాథల్లో కనిపించే ప్రేమ కేవలం సెక్సు పరమైనది కాదు. అందులోని ప్రేయసీప్రియుల సమాగమం అశ్లీలమూ కాదు. వాత్స్యాయనుడు ప్రబోధించిన కామశాస్త్రంలా శృంగారాన్ని శాస్త్రీయంగా మలచే ప్రయత్నాలు కూడా ఇందులో కనిపించవు. పవిత్రత హద్దులు దాటలేదు కూడా! అలాగని నైతిక ఉపన్యాసాలుగా కూడా మారలేదు. సహజమైన, మానవీయమైన, క్షణికమైన నిజమైన నిజాయితీతో కూడిన అనుభూతుల సమాహారం గాథాసప్తశతి. ఈ నిజాయితీయే గాథాసప్తశతి సౌందర్యానికి మూలం.
డా॥ ముదిగంటి గోపాలరెడ్డి, ‘వేదాలంకార’ డా॥ ముదిగంటి నుజాతా రెడ్డి సంస్కృతసాహిత్య చరిత్ర గ్రంథంలో: “సంస్కృత ముక్తక కావ్యాల మీద గాథాసప్తశతి ప్రభావం ఎంతైనా వున్నది. అమరుక శతకం, ఆర్యాసప్తశతి, శృంగార శతకాది ముక్తక కావ్యాలు గాథాసప్తశతి ప్రేరణ చేతనే వ్రాయబడినవి. ఆర్యాసప్తశతి పేరు గాథాసప్తశతిని అనుసరించియే వుంచబడింది. ‘సప్తశతి’ ని “సత్‌సయి”’ అని ప్రాకృతంలో అంటారు. తర్వాత కాలంలో అపభ్రంశ, హిందీ భాషల్లో అనేక “సత్‌సయి” ముక్తక కావ్యాలు వ్రాయబడినవి. ఇవి శృంగార రసప్రధానమైనవి. అసలు ఆ భాషల్లో శృంగారరస ప్రధానమైన ముక్తకాలకు “సత్‌సయి” అన్నది పేరుగానే స్థిరపడిపోయింది.” అని వ్రాశారు.
వదినగారి మీద కన్ను వేసిన తుంటరి మరిదికి గోడకు తగిలించిన సీతారామలక్ష్మణుల చిత్రాన్ని ఆమె చూపించటం ఆ సమాజంలోని నైతిక పరిణతని చాటుతుంది.
సంభాషణలతో కూడిన ఓ గాథ ఎంత రమ్యంగా ఉంటుందో చూడండి:
“అలుక మాను చెలియ!”
‘అలిగినదెవ్వతె?’
“మెలతనీవె”
‘యెరులమీద నాకు నేటి యలుక’
“యిచ్చట నెవ్వరొరులు”
‘నాథ! నీవె’
“యెట్లు”
‘న యదృష్టమహిమ’
కొత్తగా కాపురానికొచ్చిన కోడలిపిల్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని తన కొడుక్కి హితవు చెప్తూ ఓ తల్లి.. ఆడదంటే మొగుళ్ళ మెడల్ని నులిపెట్టే ఢాకిని లాంటిదని ఇలా హెచ్చరిస్తుంది:
“ఇంటిలో మంచిచెడ్డలు, నంటుకొ నెడు
కష్టసుఖములు గుర్తెఱుంగంగలారె
మహిల లన్నఁ; దక్కిన నారు మగలమెడల
నులిమి యిడు దుర్జరా ఢాకినులు కుమార!” అంటుంది
ప్రాకృతానికి సేవచేసినవారిలో తెలుగు వారున్నారని, తెలుగువారి గురించి ప్రాచీన ప్రాకృత సాహిత్యంలోనే ఎక్కువ సమాచారం దొరుకుతుందనీ, ప్రాకృతం అంటే ప్రజల వాడుకభాష అనీ, ప్రజలభాష, ప్రజాజీవితం, ప్రజాహృదయాలను ప్రతిబింబిస్తుందనీ పంచాగ్నులవారు నిరూపణ చేసిన ఈ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి!
“సఖీ! ప్రియుడు కనిపించడు.. నిద్ర రాదు, ఇలాంటి రాత్రిని ఎవరికి చెప్పుకోకుండా ఎలా ఉండటం?”
“మదిని నొక్కటి, మాటలో మఱియు నొకటి,
యలలోకపుఁబోకడ యిదియ నూవె;
నీవుమాత్ర సెద్దలతోవ నెఱపినావు”
మనసులో ఒకటి, పైకి ఇంకొకటి చెప్పటం లోకం పోకడేలే! నువ్వు మాత్రం ఏం చేస్తావు..? అలాంటి పెద్దలదారిలోనే నడిచావు.. లోపల ఉన్నదున్నట్టు పలికి! అంటుందింకో గాథ.
ఓ పేదింటి నాయికతో అతనికి స్నేహం కుదర్చాలని ఓ దూతిక అతనితో అంటోంది:
“నీలికోకఁ గట్తిన దని నీలచికురఁ
ద్రోసిరా జనఁ జూడకు మో సరసుడ!
పసిఁడి జలతారు చీరయుఁ గుసుమశరుని
కేళిఁ దొలగింపఁబడుఁగదా జాలమెగువ!”
గట్టి లక్ష్మీ నరసింహశాస్త్రిగారు అశ్లీలం కనిపించకుండా ఎంతో గొప్పగా చేసిన అనువాదం ఇది. నీలికోక కట్టుకుందని అనకు పట్టుకోక కట్టుకున్నా ఆ సంగమం జరిగేప్పుడు తీసేసేదే కదా..” అని!
గాథాసప్తశతిలోని 700 గాథల్ని వ్రాసిన కవులు మొత్తం 274మంది కాగా, రాళ్లవల్లి అనంత కృష్ణశర్మ గారు వారి పేర్లను గుర్తిచారు. వారిలో అంథుడు, ఇందుడు, కమలుడు, కేసవుడు, గోవిందస్వామి, దుర్గరాజు, దేవరాయడు, నారాయణుడు, భీమస్వామి, మాధవుడు, రాఘవుడు, రాముడు, శేఖరుడు, సుందరుడు, నూరణుడు, సూరుడు ఇలా కొందరు తెలుగువారిని గుర్తించవచ్చు. నన్నయ తిక్కన ఎర్రన లాంటి తెలుగు పేర్లు కావివి. ప్రాకృత ప్రభావం తగ్గిన తరువాతే తెలుగు రెక్కలు విచ్చుకుందని, జవసత్వాలు పుంజుకుందని, తెలుగు భాషాభిమానం జనసామాన్యంలో పెల్లుబికినందువలన అచ్చతెలుగు పేర్లు పెట్టుకోవటం మొదలెట్టారని ఊహించవచ్చు. కంబహంపాటి సత్యనారాయణగారు అణులచ్చి, అసులద్ధి, పహయీ, ఖేజ్జా, మాధవి, రేవా, రోహా, వద్ధావహీ, వోహ, నసిప్పహా.. లాంటి పేర్లున్న స్త్రీలు తెలుగువారని వ్రాశారు.
సూరుడనే తెలుగు కవి వ్రాసిన ప్రాకృతగాథ ఫాల్గుణోత్సవం గురించి వర్ణిస్తుంది. అందరూ సరదాగా ఒకరిమీద ఒకరు వసంతం చల్లుకుంటూ ఉంటే ఓ సరసుడు నాయిక మీద చిమ్మాడు. ఆమె ఇంటికివెళ్లి కడుక్కుంది. కడిగిన నీళ్లు గుమ్మం ఎత్తునపొంగి బైటకు పారాయి. ఇంత కడిక ఇంక ఐల్లు కూడా కడగాలా? అంటుదో గాథ. ఇందులో నీళ్ళు అమె శరీరం మీంచి జారటం, అవి గడపదాటటం, ఇంకా ఆ యింటిని కడగాలా? అనటంలోని సున్నితమైన శృంగార భావాన్ని ఎవరికివారే అర్థం చేసుకోవాలి!
మందస్నేహుడుగా ప్రియుడు మారిపోయాడని, అతనికి కృతఙ్ఞత లేదని తన ఇష్టసఖితో ఇలా చెప్పుకుంటోంది నాయకుడి గురించి నాయిక:
“ఎవనికొఱకయి సిగ్గు త్యజింపఁబడెనో,
కునికెనో శీల, మపయశోఘోషణమ్ము
పొసఁగెనో, యా ప్రియ జనుండు కసి మసంగి
నేఁ డుదాసీనజనుఁడయ్యెనే లతాంగీ!”
క్లిష్ట సమాసాలు లేవు, వ్యాకరణ ఆర్భాటం లేదు, మాటల లయే ఛందస్సు. మనసువిప్పి మాట్లాడటమే ఇతివృత్తం. ప్రజలనోళ్ళలో తిరిగే భావాలే ఇందులో కథాంశం.
“సో మణ్ణై/అహం మణ్ణామి/కస్స మణ్ణణం/సచ్చం హోఇ”
అతడు అనుకుంటాడు/నేనూ అనుకుంటాను/ఎవరి అభిప్రాయం నిజమవుతుందో?
ఖేత్తే ఖలియం/ఘరే రోణం/పియవిరహే/సవ్వం దుక్ఖం
పొలంలో అలసట/ఇంట్లో బాధ/ప్రియుని విరహంలోఅన్నీ దుఃఖమే.
పహియో గావై/పహియో రోయై/పహియో జంపై/పియనామం
దారినపోయేవాళ్లు పాడతారు/ దారినపోయేవాళ్లు ఏడుస్తారు/దారినపోయేవాళ్లు మాట్లాడతారు ప్రియుడి పేరుని!”
ఇలా అత్యంత సరళంగా సాగే గాథల్ని మనం పునరవలోకనం చేసుకుని, ఆ కవితాతత్వాన్ని మరొక్కసారి మనదైన రీతిలో ఆస్వాదించాలసిన అవసరం ఎంతైనా ఉంది!
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.
