Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హాల శాతవాహనుని గాథాసప్తశతి – పురావలోకనం-1

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘హాల శాతవాహనుని గాథాసప్తశతి – పురావలోకనం’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది మొదటి భాగం.]

దక్షిణాదిలో ద్రావిడ భాషల పరిణామానికి సమాంతరంగా ప్రాకృత–సంస్కృత భాషల పరిణామం కూడా ఒక స్థిరమైన, సహజమైన ప్రక్రియగా ఆరంభమైంది. వేదభాషలోని ప్రాథమిక ప్రాకృత రూపాలు, భాషామాండలికాలు, బ్రాహ్మణాల కాలంలో ‘లౌకిక సంస్కృత భాష’గా రూపొందటానికి పునాదులయ్యాయి. బహుశా ఆ కాలానికి ప్రోటో తెలుగు ఒక రూపాన్ని సంతరించుకుని ఉండవచ్చు కూడా!

వేదభాష, ఆర్యుల ప్రవాసం, ప్రాంతీయ మాండలికాల చేర్పు, భౌగోళిక పరిధుల విభిన్నత, లౌకిక సంస్కృతం-ప్రాకృతాల పరస్పర ప్రభావం ద్వారా పరిపక్వమయ్యాయి.

ఒకే మూలభాష నుండి ఉద్భవించిన సంస్కృత-ప్రాకృత భాషల్లో, ప్రారంభ దశలో వీటి మధ్య భేదం తక్కువగానే ఉండేది. కానీ, కాలక్రమంలో, భౌగోళిక విభజన, స్థానిక సామాజిక, సాంస్కృతిక ప్రభావాలతో ప్రాకృత భాషలు ప్రత్యేక రూపాల్ని, ప్రత్యేక ఆరోపాల్ని సంతరించుకున్నాయి. ఈ భాషలు మాట్లాడిన ప్రజలు తమని ‘ఆర్యులని’, స్థానిక ప్రజలను ‘అనార్యులని’ వేరుగా చూడటాన ఉత్తరాది, దక్షిణాది విభజన ఏర్పడింది. ఈ క్రమంలో ద్రావిడభాషల్లో వేదపదాలు, ఋగ్వేదంలో ద్రావిడపదాలూ అటూ ఇటూ ప్రసారమైనాయి.

ఋగ్వేదంలో ద్రావిడపదాలు

దేశం వెలుపల ఆర్యుల జీవనం గురించి అలా ఉంచితే, దేశీయంగా ఆర్యులు వలస జీవనాన్నే కొనసాగించారు. ఆర్యులు సింధు నుండి బీహార్ గంగాతీరం వరకు వ్యాపించడానికి వెయ్యేళ్ల కాలం పట్టిందని చెప్తారు. ఈ ప్రవాసంలో ముఖ్యంగా నిషాదులు, (ఆస్ట్రిక్ జాతి), కిరాతులు (మంగోలాయిడ్ జాతి), దస్యులు లేదా దాసులతో (ద్రావిడ జాతి) సంలీనాలు జరిగాయి. ఋగ్వేదంలో సంఘర్షణల అనంతరం జరిగిన సంలీనాల కథలు భాషాసాంస్కృతిక పరమైన ఆర్యఅనార్య భాషల సంలీనాలకు ఆధారాలౌతాయి.

ఎఫ్.బి.జె. క్వైపర్ అనే భాషావేత్త ఋగ్వేదంలోనే 400 వరకూ ఇండో యూరోపియన్ భాషా కూటమికి చెందని పదాలను గుర్తించాడు. వాటిలో అక్ష, అగద, అంబు, అశ్వత్థ, ఇందు, ఉదుంబర, ఓదన, కపి, కరంజ, కర్త, కలశ, కుంభ, ఖల, గంగ, జఠర, జరాయు, తస్కర, పిశాచి, పురుష, ఫల, బిల, మండూక, మను, ముష్కర, మూల,యక్షు, లాంగల, వాణి, శార్వరి, శిగ్రు, శిఖ, సింహ, సినీవాలి లాంటి పదాలున్నాయి. ఇవి ముండా లేదా ద్రావిడ భాషల్లోంచి ఋగ్వేదంలోకి చేరి ఉంటాయని ఆయన అభిప్రాయ పడ్డాడు. భాషాశాస్త్ర పరంగా చరిత్రను నిర్మించే క్రమంలో ఈ పరిశోధనలు పరిశీలకులకు ఉపకరిస్తాయి. ఋగ్వేదమూ, ద్రావిడభాషలూ భారతదేశంలో సమాంతరంగానే నడిచాయనేది ఈ పరిశోధన సారాంశం.

పున్నామ నరకం నుండి తప్పించేవాడు కాబట్టి పుత్రుడనే వ్యుత్పత్తి కల్పితం అనీ, ‘పుట్టు’ అనే తెలుగు పదం ‘పుత్ర’కు మూలం కావచ్చనీ కోరాడ రామకృష్ణయ్యగారు, ఆ తరువాత తిరుమల రామచంద్రగారు కూడా అభిప్రాయపడ్డారు. మీన, తాళ శబ్దాలు కూడా తెలుగు లోంచే వెళ్ళాయని కోరాడవారి నిరూపణ.

ప్రాకృత, సంస్కృత భాషల అభివృద్ధి

భాష పరంగా ఉత్తరాదిలోనే వాయవ్య ప్రాంతంలో వేదభాషకు అత్యంత సమీపంగా ఉన్నభాషని, మధ్యదేశంలో వేదభాషకు ప్రాథమిక ప్రాకృతాలకు మధ్యవర్తిగా పనిచేసిన భాషని, తూర్పు తీరంలో ప్రజావ్యవహారానికి దగ్గరగా ఉన్న ప్రాకృతాల్నీ మాట్లాడారు.

బ్రాహ్మణాల కాలానికి వచ్చేసరికి, ప్రాకృతాలు మరింత స్పష్టమైన, స్వతంత్ర రూపం పొందాయి. వేదభాష ఆధారంగా ఒక కొత్త శిష్ట భాష – లౌకిక సంస్కృతం – రూపుదిద్దుకుంది. లౌకిక సంస్కృతం వాయవ్య సంస్కృత లక్షణాలు, మధ్యదేశ భాషా అంశాలతో పాటు ఆంధ్రం లాంటి ద్రావిడ భాషలతో కూడా సంబంధాన్ని పొందింది. ఒక్క మాటలో చెప్పాలంటే, వేదభాష, సంస్కృతం, పాళీ భాషల మధ్య అంతరాన్ని తగ్గించే ప్రక్రియలో భాగంగా లౌకిక సంస్కృతం ప్రజావ్యవహారానికి అనుగుణంగా ప్రాకృతాల నుండి స్వతంత్రం సాధించింది.

లౌకిక సంస్కృతం ఒక పండిత భాషగా, కావ్యాలకు, శాస్త్ర, సాంకేతిక పరమైన అంశాలకు మాత్రమే పరిమితం కాగా, ప్రాకృతాలు లౌకికాలుగా అభివృద్ధి పొందాయి. సాధారణ ప్రజలు మాట్లాడిన ప్రాకృతాలు స్వేచ్ఛగా, సహజ మార్పులకు లోనయ్యాయి.

వేదభాష ప్రజావ్యవహారంలోంచి దూరమై సంస్కృతం మేధావులకు పరిమితమై పోవటంతో శ్రమణ, బౌద్ధ ఉద్యమాల కాలంలో ప్రాకృత పాళీ రూపాలకు వ్యాప్తి పెరిగింది. మహారాష్ట్రి, శౌరసేనీ, మాగధి, పైశాచి లాంటి ప్రాకృత భేదాలు ఏర్పడ్డాయి.

పాణిని వ్యాకరణ సాయంతో బ్రాహ్మణాల కాలంలో ‘లౌకిక సంస్కృతం’ స్థిరమైన, శిష్టమైన భాషగా రూపుదిద్దుకుంది. వివిధ ప్రాకృతాలు ప్రజల మధ్య స్వేచ్ఛగా మార్పులు చెంది, వివిధ దిశలలో విస్తరించాయి. క్రీస్తుపూర్వం 500 నుండీ, ప్రాకృతాల ప్రాచుర్యం గుప్తుల కాలం వరకు వెయ్యేళ్ళ కాలంపాటు, ఇంకా ఆపైన కూడా కొనసాగింది.

జైనులు తమ ధర్మప్రచారానికి అర్ధమాగధినీ, బుద్ధుడు ధర్మోపదేశానికి పాళీ భాషనీ ఉపయోగించటంతో, ప్రాకృతాలు ప్రాంతాల, తెగల మరియు ధార్మిక సంప్రదాయాల భాషలుగా పెరిగాయి!

పాళీ భాషని కొందరు మాగధీ ప్రాకృతం అని భావిస్తే, మరికొందరు అవంతీ, కాశీ ప్రాంతాల ప్రాకృతాలతో సంబంధాన్ని గుర్తిస్తున్నారు. సంస్కృత నాటకాల్లో ద్వితీయ ప్రాధాన్యత కలిగిన పాత్రలు మాట్లాడే ప్రాకృతాలు పాళీ భాషకి అత్యంత సమీపంగా ఉండటంతో లౌకిక సంస్కృతం మరియు ద్వితీయ ప్రాకృతాల మధ్యకాలంలో పాళీ ప్రజావ్యవహార భాషగా అవతరించి ఉండవచ్చు!

అశోకుడి శాసనాల్లోని భాష మొదటి ప్రాకృత యుగానికి చెందినదనుకుంటే, రెండవ యుగంలో, సంస్కృత నాటకాలలో ప్రాకృత భాషల వినియోగాన్ని, మూడవ యుగంలో వ్యావహారిక ప్రాకృతాలు స్థానిక ప్రజాభాషలలో మరింత మార్పు చెందుతూ అపభ్రంశాలుగా పరిణమించటాన్ని బట్టి భాషాపరిణామాన్ని కొంత ఊహ చేయవచ్చు. ఈ అపభ్రంశాల ద్వారానే తరువాతి యుగాలలో ఆధునిక హిందీ, మ‌రాఠీ, బంగ్లా, ఒడియా లాంటి భాషలకు ఆధారం ఏర్పడింది.

తెలుగు నేలకు సంబంధించినంత వరకూ తొలినాళ్లలో పాళీ ప్రాకృతాలు రెండూ రాజాదరణ పొంది, సాహిత్యభాషగా కూడా వికసించాయి. సంస్కృతానిది ద్వితీయ ప్రాధాన్యం కాగా ఆంధ్ర భాష మూడో స్థానంలో కొనసాగింది. తెలుగు నేలమీంచి బౌద్ధ జైనాలు నిష్క్రమించగానే పాళీ ప్రాకృతాలు కూడా మన నేలమీంచి తప్పుకున్నాయి. సంస్కృతం ఆ స్థానాన్ని ఆక్రమించింది. అప్పుడు కూడా ఆంధ్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన ఆనాటి తెలుగువారికి కలగలేదు.

పాళీ ప్రాకృతాలలో సాహిత్యాన్ని వెలయించిన వారిలో తెలుగు కవుల సంఖ్య గణనీయమే! వారు అలవోకగా తెలుగు పదాలను కూడా కలిపి ప్రయోగించటం చేత, ఆ సాహిత్యం ద్వారా ప్రాకృత, పాళీ భాషల్లో తెలుగు పదాలు అనేకం చేరాయి. తెలుగు ‘నాగలి’ (ఋగ్వేదంలో లాంగల) పాళీ భాషలో ‘నాంగల’గా చేరటం ఇందుకొక సాక్ష్యం.

సాహిత్యభాషగా ప్రాకృతం

ప్రాకృత భాషలు, జనవ్యవహారం కారణంగా క్రమానుగుణ మార్పులకు లోనై అపభ్రంశ భాషలుగా రూపాంతరం చెందాయి. కావ్యభాష స్థిరంగా కట్టడితో ఉంటుంది. కానీ, వాడుకభాష చిలవలుపలవలుగా సాగి అపభ్రంశమౌతుంది. ప్రస్తుత తెలుగు భాష పరిస్థితి అదే! ఆ రోజుల్లో ఒక్కో ప్రాకృత మాండలికం నుండి దానికి అనుబంధంగా ఒక్కో అపభ్రంశ భాష ఏర్పడింది. ఈ అపభ్రంశ భాషల ద్వారా ఉత్తర భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న నవీన ఆర్యభాషలు ఏర్పడ్డాయి. వాటిని ఇప్పుడు హిందీ రాష్ట్రాల భాషలుగా పిలుస్తున్నారు.

ప్రజల భాషలో వ్రాయటాన్ని ప్రజాసాహిత్యం అన్నట్టే ఆనాడు జనవ్యవహారంలో.. లేదా ఎక్కువమంది ప్రజలకు తెలిసిన భాషలో సాహిత్యాన్ని వెలువరించాలనే ఉద్యమంలో భాగమే ప్రాకృతభాషలో వెలువడిన ఆనాటి రచనలు.

వేదభాష, లౌకిక సంస్కృతం, ప్రాకృతం-ఇవి ఒకే భాషా పరిణామంలోని వేర్వేరు దశలని సూచిస్తాయి. వేదభాష మరియు లౌకిక సంస్కృతం ప్రామాణికమైన, శిష్టమైన, పండిత భాషలుగా ఉండగా, ప్రాకృత భాషలు ప్రజల భాషలుగా వికసించాయి. లౌకిక సంస్కృతం ఎప్పుడూ లోక వ్యవహారంలో, జనం వాడుకభాషగా, మాతృభాషగా ఉన్నట్టు కనిపించదు. నేర్చుకున్న భాష అంతే!

శాస్త్ర సాంకేతిక ఆధ్యాత్మిక రచనలకు అనువైన భాషగా సంస్కృతం ప్రత్యేకతను సంతరించుకుని స్థిరభాషగా నిలిచింది.

తెలుగు ప్రాంతంలో సంస్కృతం లాగానే, ప్రాకృతం కూడా మాతృభాష కాదు. నేర్చుకున్న భాషే! ఆంధ్రభృత్య (ఆంధ్ర రాజవంశం) అని తమని చెప్పుకున్నప్పటికీ శాతవాహనులు ఉత్తరాది పోకడలను అనుసరించి ప్రాకృతాన్నే ఆదరించటం చేత ప్రాకృత సాహిత్యానికే గుర్తింపు లభించింది.

సంస్కృతం మరియు ప్రాకృతం మధ్య స్పష్టమైన విభజన ఉండేది! లక్షణాల పరంగా వీటికి పరస్పర స్పర్శ ఉంది. ప్రాకృత కవులు తమ భాషా సౌందర్యాన్ని గర్వంగా ప్రతిపాదించేవారు. సారస్వత సంపదగానూ, అభినవార్థాలకు నిధిగానూ, సన్నివేశ నిర్మాణంలో చాతుర్యానికి, భావబంధానికి సాధనంగానూ కొనియాడేవారు.

“లలితమైన, మధురాక్షరాలతో నిండిన ప్రాకృతం ఉండగా, సంస్కృత కావ్యాలను ఎవరు చదువుతారు?” అని ఒక గాథ ప్రశ్నిస్తుంది. ప్రాకృత కావ్యాలను ఆస్వాదించడానికి ప్రత్యేక చాతుర్యం అవసరం కూడా! బహుశా అది సంస్కృతంపైన విసిరిన వ్యంగ్యం కావచ్చు! సముద్రం నుండి పుట్టి మళ్లీ సముద్రంలోనే నది వెళ్లి కలిసినట్లే, అన్ని భాషలు ప్రాకృతం నుండి పుట్టి చివరికి దానిలోనే లీనమౌతాయనేది ఆనాటి నినాదం! ఉత్తరాది ప్రాకృత కవులకు ప్రాకృతం మాతృభాష కావటం వలన అంతటి భాషానురక్తి ఉండేది.

తెలుగు వారికి ప్రాకృతం నేర్చుకున్న భాషే అయినప్పటికీ ఉత్తరాదివారినే అనుసరించక తప్పని పరిస్థితి ఆనాటిది. ఎందుకంటే మహారాష్ట్రలోని పూనే దాకా ‘దక్కన్’ తెలుగు ప్రాంతమే కాబట్టి!

మహాపండితుల భాషగా సంస్కృతానికీ జనసామాన్య భాషగా ప్రాకృతానికీ సంఘర్షణల మధ్యా ఆంధ్రం లాంటి స్థానిక భాషలకు విలువ లేకుండా పోయింది. వాటికి లిపి చాలినంత అందుబాటులో లేకపోవటం ఒక కారణం కావచ్చు!

తెలుగు లిపి మౌర్యుల కాలంలో బ్రాహ్మీలిపి తరువాతే రూపు దిద్దుకుంది. అంతకు మునుపు వ్రాత లేని భాష. కాబట్టి, మౌఖిక తెలుగు సాహిత్యానికి ఆధారాలు లేకుండా పోయాయి. మౌర్యుల బ్రాహ్మీలిపి కారణంగా ప్రాకృత కావ్యాలు నిలిచాయి, మౌఖికాలు నశించాయి. అంతేగాని, ఆనాటికి తెలుగు లేదనటానికి వీల్లేదు. ఆంధ్ర ప్రభువైన హాలచక్రవర్తి ప్రాకృతాన్ని ఆశ్రయించటానికి లిపి ఆ భాషకు అందుబాటులో ఉండటం ముఖ్య కారణం. అందుకే, శాతవాహనుల కాలంలో ప్రాకృతం ప్రజలభాష అనీ, అది వారి మాతృభాష అనీ అనటం తొందరపాటే అవుతుంది. తెలుగులో రచనలు జరగలేదనటానికి వీల్లేదు. లిపి లేదు అంతే!

అశోకుడి ప్రాబల్యం ప్రాకృతం

ప్రాకృత భాషల విస్తృతి, వైభవం మనకు శాసనాల ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. అశోకుని కాలం నుండి క్రీస్తు శకం ఆరంభం వరకు సుమారు 1500కు పైగా ప్రాకృత శాసనాలు లభించాయి. అదే సమయంలో సంస్కృత శాసనాలు కూడా కనిపించాయి. క్రమేణా ఆధ్యాత్మిక గ్రంథాలూ, కావ్యాలు కూడా వెలువడసాగాయి. గాథాసప్తశతి రూపొందటానికి ఇదంతా పూర్వరంగం.

ఇంగ్లీషువాళ్లు దేశాన్ని వదిలిపోయినా మనం ఇంగ్లీషుని రాజభాషగా కొనసాగిస్తున్నట్టే మౌర్య సామ్రాజ్యం అంతరించినా, శాతవాహనులు ప్రాకృతాన్ని కొనసాగించారు. ఉత్తరాదిలో కూడా శాతవాహన సామ్రాజ్యం విస్తరించి ఉండటం కూడా ఓ కారణమే!

గాథాసప్తశతి, ఇతర ప్రాకృత కావ్యాలు బౌద్ధం నిలిచివున్న ఉత్తరాది ప్రాంతాల్లో సజీవంగా ఉన్నాయి. తెలుగు నేలపైన బౌద్ధ జైనాలపైన శైవ, వైష్ణవాలు కత్తి కట్టి దాడులు చేయటాన ఇక్కడ ప్రాకృతం, పాళీలు వారి పాళీ, ప్రాకృత గ్రంథాలతో సహా అంతరించాయి.

‘శ్రీఉత్పత్తి పిడుగు’ పేరుతో ఒక శైవ తీవ్రవాద సంస్థ గదను తమ లోగోగా చేసుకుని బౌద్ధుల్ని అంతంచేయటమే ధ్యేయంగా తెలుగు నేలపైన పనిచేసింది. ఉత్పత్తి అంటే ఉత్త+పత్తి= శూన్యవాదం (?) ప్రబోధించే వారి పాలిట పిడుగు అని దీని భావం. తెలుగు నేలపైన ప్రాకృత సాహిత్యం అంతా ధ్వంసమైపోవటానికి ఇలాంటి కారణాలు, దాడులూ చాలా ఉన్నాయి.

శాతవాహనుల అనంతరం విష్ణుకుండినులు, శాలంకాయనులు, పల్లవులు వీళ్ళంతా సంస్కృతాన్ని ఆదరించటం వలన కూడా తెలుగు నేలపైన ప్రాకృతం కనుమరుగయ్యింది. సంస్కృతాన్ని ‘ఆర్యభాష’ లేదా ‘దేవభాష’గా భావనాత్మకంగా ఆరాధించారు.

గాథాసప్తశతి నేపథ్యం

హాలుడు క్రీ.శ. 1వ శతాబ్దానికి చెందిన మహారాజు. కవి, ప్రాకృత సాహిత్యంలో ఒక మైలురాయిని నిలిపినవాడు. అతని గాథాసప్తశతి ప్రాకృత సాహిత్యంలో ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టాడు. తన కాలంలో జానపదుల నోటిపైని వేలాది గాథల నుండి ఉత్తమమైన 700 గాథలను సేకరించి, వాటిని ఒక సంపూర్ణ గ్రంథంగా సంకలనం చేశాడు. ఈ సేకరణ ద్వారా హాలుడికి ముందే ఒక బలమైన, విస్తృత సాహిత్య సంప్రదాయం ఉన్నదని స్పష్టమవుతోంది.

అశోకుని శాసనాలు, క్రీ.పూ. 3వ శతాబ్దానికి చెందినవే, భాషా పరంగా ఆ నాటి చరిత్రకు ఒక గొప్ప ఆధారంగా నిలిచాయి. ఈ శాసనాలు ప్రజల భాషలో సరళంగా రాసినవే. ఈ భాషా సంప్రదాయం క్రమేణా మహారాష్ట్రీ ప్రాకృతం అవతరించేందుకు కారణమైంది.

హాలుడు ఒక శూన్యం నుండి గాథాసప్తశతిని సృష్టించలేదు. ఆయనకు ముందు ఉన్న జానపద గీతాలు, గుణాఢ్యుని కథా సంప్రదాయం, మౌఖికంగా ప్రసారంలో ఉన్న వేలాది శృంగార, హాస్య గాథలను ఏరి, శ్రేష్ఠమైన 700 గాథలుగా ఒక అద్భుతమైన కవిత్వ సంపదగా రూపకల్పన చేశారు. అందుకే గాథాసప్తశతిని “ప్రజా కవిత్వ సంకలనం” అని పిలుస్తారు.

గ్రామీణ ప్రజల మౌఖిక సాహిత్య సంప్రదాయం (Oral Tradition) గాథాసప్తశతికి పూర్వాధారం. పల్లెటూరి ప్రజలు పనీపాటలు చేసుకుంనేప్పుడూ, సంబరాలు చేసుకునేప్పుడు పాడుకునే పాటలు మౌఖికంగా తరతరాలుగా ప్రసారమౌతూ వచ్చాయి. హాలుడు వీటికి సాహిత్య గౌరవం కల్పించి, గ్రంథస్థం చేసి, ఒక శాసనాత్మక రీతిని సమకూర్చాడు. గాథాసప్తశతిని ఈ కోణంలోంచి చూడాలి.

ప్రాకృత సాహిత్యానికి ప్రేరణగా సంస్కృతంలో ‘ముక్తక’ కవిత్వ సంప్రదాయం కూడా ఉంది. ముక్తక, అంటే ఒక్క శ్లోకంలో సంపూర్ణ భావాన్ని వ్యక్తం చేసే ప్రక్రియ, రామాయణ, మహాభారత కాలంలోనుండి కొనసాగింది. ప్రాకృత కవులు ఈ ముక్తక పద్ధతిని స్వీకరించి, సాధారణ ప్రజల భాషలో మరింత సున్నితంగా, చమత్కారంగా మార్చారు.

ఇంకా, హాలుడికి సమకాలీనుడైన కవి గుణాఢ్యుడు ‘బృహత్కథ’ అనే మహాకావ్యాన్ని పైశాచి ప్రాకృతంలో రచించాడు. ఈ మూలగ్రంథం ‘కథాసరిత్సాగరం’ వంటి గొప్ప కథా సంప్రదాయాలకు ప్రేరణ అయ్యింది. గాథాసప్తశతిలోని శృంగార, హాస్య ధోరణులు గుణాఢ్యుని కథా సంప్రదాయంలోనూ ప్రతిధ్వనించాయి. అది ఆ కాలపు సాహిత్య పోకడ! వేదకాలం నుండి ఉషస్సు, ప్రకృతి వర్ణనలు, బౌద్ధ ‘థేరీ గాథలు’లోని స్త్రీల భావాలు, గుణాఢ్యుని బృహత్కథలోని కథాంశాలు, జానపద గీతల్లోని శృంగారం, చమత్కారం, పల్లెటూరి నుడికారం అన్నింటి సమాహారంగా గాథాసప్తశతి వెలిసిందని చెప్పాలి.

ధ్వని శాస్త్రానికి మచ్చుతునక గాథాసప్తశతి

హాలరాజు (క్రీ.శ. 220–224) రచించిన గాథాసప్తశతి ప్రాకృత సాహిత్యంలో ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది. ఇది మహారాష్ట్రి ప్రాకృత భాషలో రాసిన 700 పద్యాల సంకలనం. కనీసం 300 మంది కవుల రచనల తొలి శృంగార రసవత్తర కవితా సంకలనం. కావ్య సౌందర్యానికి ఒక ప్రతీక. ఈ కావ్యసౌందర్యాన్ననుసరించే భారతీయ కావ్యశాస్త్రసిద్ధాంతాలు రూపొందాయి.

హాల శబ్దమే నాగలికి సంబంధమైనది. వ్యావసాయిక సంస్కృతిని ఆ ప్రభువు పేరే సూచిస్తోంది. 700 గాథల్లోనూ మనం ఈ వ్యాసాయిక భావజాలాన్ని గమనించవచ్చు. వాణిజ్య సంస్కృతి, ఫ్యూడల్ సంస్కృతి, నియంతృత్వ సంస్కృతి, మతసంస్కృతి, కుల సంస్కృతి, వర్గసంస్కృతి, ప్రాంతీయ సంస్కృతి ఇలాంటి నేటి కాలపు అవలక్షణాలు లేని స్వచ్చమైన భారతీయ వ్యావసాయిక సంస్కృతికి ప్రతిరూపాలు.

అలంకారశాస్త్రం, క్రీస్తుపూర్వం 2వ శతాబ్ది మధ్యకాలం తరువాత, పతంజలి కాలాన ఆవిర్భవించింది! భరతుడి నాట్యశాస్త్రంలో అలంకారశాస్త్రానికి సంబంధించిన 4 అలంకారాలు, 10 గుణాలు, 10 దోషాలు, 36 కావ్యలక్షణాల వివరణ కనిపిస్తుంది.

ఆనందవర్ధనుడు సాహిత్య శాస్త్రంలో ధ్వని సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తరువాత, ధ్వనిలక్ష్యాలకు గాథాసప్తశతి లోని గాథలను ఉదాహరణలుగా ఉపయోగించాడు. ఆయనతో పాటు ఇతర సంస్కృత అలంకారికులు కూడా ధ్వని భేదాలను వివరిస్తూ గాథాసప్తశతిలోని ముక్తక పద్యాలను ఉదాహరణలుగా తీసుకున్నారు. గోదావరి–నర్మదల మధ్య ప్రాంతాలు సాహిత్య సారవంతమైన భూములై, గాథాసప్తశతి కవిత్వానికి కేంద్రబిందువుగా నిలిచాయి.

అలంకారం, రీతి(శైలి), రసం, ధ్వని సిద్ధాంతాలతో పాటు, వక్రోక్తి, అనుమాన-ఔచిత్య సిద్ధాంతాలకు సంబంధించిన అంశాలు మౌలికంగా గాథాసప్తశతిలోని గాథలలో ప్రతిధ్వనిస్తాయి.

“కావ్యస్య ఆత్మా ధ్వనిః” అనే సూత్రం ప్రకారం, సూచనాత్మక భావం కావ్యాత్మ. ఒక పద్యం లేదా కావ్యంలో పైకి కనిపించే అర్థం కన్నా సూచితార్థం (ధ్వని) సుందరంగా ఉంటే ఆ రచన ఉత్తమ కావ్యంగా మారుతుంది.

రసవాదులు శృంగార రసానికి ప్రథమ స్థానం కల్పించటంలో కూడా గాథాసప్తశతి ప్రముఖ పాత్ర వహించింది. ఈ గాథల్లో శృంగార భావం విస్తారంగా ఉంటుంది. వీటి శైలి సరళమైనది, భావవ్యక్తీకరణ సహజమైనదిగా కనిపిస్తుంది.

“ప్రాకృత కావ్యమనే అమృతాన్ని చదవడం గాని, వినడం గాని తెలియకుండానే ప్రేమ తత్వాన్ని విశ్లేషించాలనుకునే వారు సిగ్గుపడాలి. ఈ కావ్యసంకలనాన్ని ఆస్వాదించకుండా ప్రేమ సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు” అని ఒక గాథలో హాలుడే స్వయంగా అంటాడు.

గాథలు సంకలనమైన వైనం

ఈ గాథాసప్తశతిని సంకలనం చేయటంలో హాలుడు చేసిన కృషిని ఓ గాథ ఇలా చెప్తుంది:

“సత్తసయిం కవి-వచ్చలేణ కోడి మజ్జ్ఝారమ్మి |హాలేణ విరయాఇం సాలంకారాణిం గహణం ||” అలంకారాలతో అలంకరించిన కోటి గాథల్లోంచి, హాలుడు 700 గాథలను మాత్రమే సంకలనం చేశాడు. ఇది హాలుడి సౌందర్య, రసజ్ఞానం, సాహిత్య అవగాహనను స్పష్టంగా చూపుతుంది. ఎంపిక చేయటానికి తనకంటూ కొన్ని ప్రమాణాలు నిర్దేశించుకున్నాడని కూడా అర్థం అవుతుంది. కోటి గాథల్లోంచి అనటం వలన, ఆ నాటికే ప్రాకృత సాహిత్యం వెల్లువలా ఉన్నదని కూడా అర్థం అవుతోంది.

గాథాసప్తశతిలోని ప్రతి పద్యం ప్రాకృత కావ్యసౌందర్యానికి, శృంగార రసానికి, ధ్వని సిద్ధాంతానికి, శాస్త్రీయ సౌందర్యానుభూతికి ఒక ప్రామాణిక ఉదాహరణగా నిలిచింది. హాలుడి ఎంపిక, పరిశీలన, సంకలనం విధానం, భారతీయ కావ్యశాస్త్ర సిద్ధాంతాల ప్రక్రియపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపించింది. గాహే అంటే పాడటం, పాడుకునేందుకు అనువైన ఒక ఇతివృత్తాన్ని గాథ అంటారు

గాథాసప్తశతిలోని ప్రాకృతాన్ని ఇప్పటి మన పండితులు మహారాష్ట్రీ ప్రాకృతం అంటున్నారు. దండి మహాకవి “సుగమా, సూక్ష్మా, రమణీయా” అని ఈ ప్రాకృతాన్ని ప్రశంసించడం దీని ప్రాముఖ్యతను సూచిస్తుంది. శాతవాహనులు, శ్వేతాంబర జైనులు కూడా తమ ధర్మప్రచారానికి ఈ ప్రాకృతాన్నే స్వీకరించారు.

భరతుడి కాలానికే నాట్య నాటక ప్రదర్శనలలో తక్కువ స్థాయి పాత్రలకు, ఆర్యేతర పాత్రలకు ప్రాకృతాన్ని ఆంధ్రం లాంటి ఆర్యేతర భాషల్ని ఉపయోగించాలంటూ, భరతుడు నిర్దేశించటాన్ని బట్టి, సంస్కృత కవులకు ఇతర భాషల పట్ల చిన్నచూపు గాఢంగా ఉండేదని అర్థం అవుతోంది. క్రీ.శ. 8వ శతాబ్దికి చెందిన ఉద్యోతన సూరి అనే ప్రాకృతకవి రాష్ట్రకూటుల పాలనా కాలంలోని వాడు. ఆ కాలంలో ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటకలలో ‘మహారాష్ట్ర ప్రాకృతం’ ఎక్కువగా వ్యాప్తిలో ఉండేది. ఉద్యోతనుడు ఈ ప్రాకృతభాషలో కువలయమాల కావ్యాన్ని వ్రాశాడు. దీన్నిబట్టి 8వ శతాబ్ది దాకా తెలుగు నేలపైన ఈ ప్రాకృతం ఉందనే భావించాలి.

‘కువలయమాల’ కథలో తన కాలంలో ప్రచారంలో ఉన్న పద్దెనిమిది దేశాల వారినీ, వాళ్ళ భాషలనూ పేర్కొంటూ, ఆంధ్రుల గురించి రెండు పాదాల్లో నాలుగు ముక్కల్లో ఇలా రాశాడు:

“పియ మహిళా సంగామే సుందరగత్తేయ భోయణే రోద్డే

అటుపుటు రటుం భణంతే ఆంధ్రేకుమారో సలోయేతి”

ఆంధ్రులు సహజంగా సుందరంగా వుంటారని, సౌందర్య పిపాస ఎక్కువనీ, వాళ్లకి అందగత్తెలంటే మహామోజనీ, యుద్ధ జీవులని, కదనరంగాన ముందుంటారనీ, సహజంగా భోజన ప్రియులనీ, కమ్మని రుచులు, కొత్త రుచులను ఆస్వాదించే తత్త్వం ఉన్నవాళ్లనీ, అటుపుటు రటు అంటూ మిలిటరీ భాష మాట్లాడుతూ తిరుగుతుంటారట! గాథాసప్తశతిలోనూ ఆంద్రుల లక్షణాలు ఇలానే కనిపిస్తాయి. 500 యేళ్ళ తరువాత కూడా ఆంధ్రులు అలానే ఉన్నతిని కొనసాగించారన్నమాట!

(ఇంకా ఉంది)

Exit mobile version