Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హృదయాంజలి!

[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘హృదయాంజలి!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ఇష్టమైన నీతో జీవితపు ప్రతిక్షణాన్ని
ఆనందోత్సవంగా గడపాలని కోరుకుంటాను
ప్రియమైన నిన్ను ప్రేమతో
పలకరించాలని మనసారా ఆశిస్తాను

కలల లోకంలో విహరిస్తూ
కమ్మని కథల తో ఓ
కొత్త ప్రపంచాన్ని అల్లుకుంటూ
మనం కలుసుకునే
మధుర క్షణాన అవన్నీ
నీకు వినిపించాలని
మనసు మురిసిపోతుంటుంది

మౌనంగా నేను నిలిచిన వేళ..

పక్కనే విరిసిన మల్లెపూలు
సుగంధాల సందేశాన్ని
నాకందిస్తుంటాయి
సన్నని చిరుగాలికి
ఊయలలూగే గులాబి కొమ్మలు
ప్రేమకు స్వాగత గీతాలు
పాడుతున్నట్లుంటాయి

మావిచిగురులను ఆస్వాదిస్తూ
పరవశించే కోయిలమ్మలు
మధుర రాగాలతో
ప్రకృతిని పరవశింపజేస్తుంటాయి

నీలాల నింగిలో విరిసిన హరివిల్లు
ప్రకృతికి నవవధువు శోభను అద్దుతుంటే
నేలపై పరచుకున్న పసిడి పంట చేలు
పసుపు–హరిత వర్ణాలతో
ఆనందాల హారతులు ఇస్తున్నట్లుంటాయి

అందాలన్నీ కలిసి నా హృదయం లోని ప్రేమను
రంగుల చిత్రపటంలా ఆవిష్కరిస్తుంటాయి!

కనరాని నీ కోసం
అస్పష్టమైన నీ రూపాన్ని ఊహించుకుంటూ
ప్రతి క్షణాన్నీ ఆశగా లెక్కిస్తుంటాను!
మన కలయిక
ఓ ఘనమైన వసంతోత్సవం లా విరబూయాలని
ప్రేమ పరిమళాలతో నిండిన జీవన గీతంగా మారాలని
నీ రాక కోసం ఎదురుచూస్తుంటాను!

ప్రియమైన నువ్వు..
నా ప్రాణమైన నువ్వు..
ప్రేమకు నవ్య భాష్యమై మనం
ఒకరి హృదయంలో ఒకరమై
పరిణయ వేడుకల సాక్షిగా..
జగతికి ప్రేమకు
ఆదర్శంగా నిలవాలి మనం!
ప్రేమ శాశ్వతమైతే..
మన కలయిక ప్రేమకి
చిరస్మరణీయమైన హృదయాంజలి కావాలి!

Exit mobile version