[శ్రీ మంజరి (గంధం నాగేశ్వరరావు గారు) రచించిన ‘ఐ లవ్ మై ఇండియా’, ‘క్షమించు నేస్తమా!’ అనే నవలల సమాహారాన్ని పరిచయం చేస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
దివంగత శ్రీ మంజరిగారు వ్రాసిన రెండు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ నవలలను ఒకే పుస్తకంగా, ‘ఐ లవ్ మై ఇండియా’ పేరిట వెలువరించారు క్లాసిక్ బుక్స్ వారు.
ఐ లవ్ మై ఇండియా:
సొంత డిపార్టుమెంటులో పై అధికారి చేతిలో దారుణంగా మోసపోయి సస్పెండ్ అయిన సి.ఐ. భరధ్వాజ్; మళ్ళీ డిపార్ట్‌మెంట్ పిలిస్తే తప్ప, ఆఫీసులో అడుగుపెట్టకూడదనుకుంటాడు. అక్కడ్నించి పలు సంఘటనలు జరిగి కథని ముందుకు నడుపుతాయి. ఒక ఘటన నుండి మరో ఘటనకి పాఠకులను నడిపేటప్పుడు రచయిత చూపించిన నేర్పుని కొన్ని వాక్యాలు పట్టిస్తాయి.
“భరధ్వాజ్‌కు తెలియదు..” అంటూ మొదలుపెట్టి, అతనికి తారపడబోయే శ్రీరామ్ పాత్రని ప్రవేశబెడతారు. అలాగే, శ్రీరామ్‌కి ఆటంకాలు కల్పించే పాత్రను కూడా, ఇదే సందర్భంలో ప్రస్తావిస్తారు. “ఊరికి దూరంగా ఉన్న ఓ పాకలో పగతో రగిలిపోతున వ్యక్తి..” అంటూ లీడ్ ఇస్తారు. ఇవి కర్టెన్ రైజర్స్‌లా ఉపకరించి, కథని ముందుకు నడుపుతాయి.
నగరంలోని ఒక పోలీస్ క్యాంప్‍పై దాడి జరుగుతుంది. ఎనిమిది మంది పోలీసులు చనిపోతారు. కొన్ని ఆధునికమైన ఆయుధాలు మిస్ అవుతాయి. ఈ ఘటనపై విచారణ జరిపించడానికి – రాజకీయాలతోనూ, పోలీస్ శాఖతోనూ సంబంధం లేని వ్యక్తిని ఎంపిక చేయాలనుకుంటుంది ప్రభుత్వం. అందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘RAW’ లో పనిచేసే వారికి ఆ బాధ్యతని అప్పగిద్దామని సలహా ఇస్తాడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి. ఆ మంత్రికి రా డైరక్టర్‌కి పరిచయం కలిగిన వైనం, మంత్రి ఆయన మీద వేసిన ముద్ర గురించి గొప్పగా రాసారు రచయిత. ఆంధ్ర ప్రదేశ్‌లో పని కాబట్టి తెలుగు తెల్సిన, రాష్ట్రంతో పరిచయం ఉన్న ఏజంట్ కోసం వెతుకుతాడు రా డైరక్టర్. మిస్టర్ జీరోపై ఆయన కన్ను పడుతుంది. జీరోని పిలిపించి బాధ్యతలప్పగిస్తారు. దేశం పట్ల విశ్వాసం, తమ విధుల పట్ల అత్యంత నిబద్ధత కల్గిన వ్యక్తులు కలిసి – హోదాలకు అతీతంగా ఒక ఆపరేషన్‍లో పాలు పంచుకుంటారు ఈ నవలలో.
సస్పెండ్ అయిన భరధ్వాజ్‌ని తన మిషన్ లోకి తీసుకుంటాడు జీరో. భరధ్వాజ్‌కీ జీరోకి మధ్య జరిగిన కొన్ని సంభాషణలు దేశం పట్ల భాధ్యతని అన్నిటికన్నా ముఖ్యమైనదిగా భావించేవారి ఆలోచనలను ప్రదర్శిస్తాయి. కథలో భాగంగా సందర్భోచితంగా, ఏ.కే. 47 గురించి, దాని సృష్టికర్త కలష్నికోవ్ గురించి వివరిస్తారు రచయిత. జీరో, భరధ్వాజ్, శ్రీరామ్, సీత, రాజామణి, ఎక్స్, పాత్రలు, వాటి చర్యలు కథని చాలా వేగంగా ముందుకు నడుపుతాయి. చక్కని ప్రణాళికలతో, నిబద్ధతతో, సమన్వయంతో ప్రధాన పాత్రలు తమ తమ లక్ష్యాలను నెరవేర్చుకోడంతో, ఉత్కంఠభరితంగా సాగిన నవల ముగుస్తుంది.
క్షమించు నేస్తమా!:
కార్గిల్ సరిహద్దులో పనిచేసే ప్రవీణ్, ఓ బస్ యాక్సిడెంట్‍లో తల్లిదండ్రులని పోగొట్టుకుంటాడు. తనకంటూ మిగిలిన చెల్లెలు శ్రీలతని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటాడు. ప్రతీ వారం అందేలా ఉత్తరాలు రాసుకుంటూంటారు అన్నాచెల్లెల్లు. ప్రవీణ్‌కి గురువులాంటి అర్జున్ సెలవలకి ఇంటికి వస్తుంటే, తన చెల్లెల్ని కలవమని చెప్తాడు ప్రవీణ్. శ్రీలతని కలిసిన అర్జున్ వాళ్ళింట్లో భోం చేస్తాడు. సాయంత్రం బీచ్‌కి వెళ్ళినప్పుడు శ్రీలతని కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుతుంది. దాన్ని అడ్డుకుంటాడు అర్జున్. ఎవరు చేయించి ఉంటారంటే జగదీష్ అని చెప్తుంది. కొన్ని రోజుల తరువాత జగదీష్‌కి రోడ్డు ప్రమాదం జరుగుతుంది. ఒక కాలు, ఒక చెయ్యి పోతాయి. శ్రీలతని పెళ్ళి చేసుకుంటానని చెప్తాడు అర్జున్.
అక్కడ సరిహద్దులో ఘోరం జరుగుతుంది. పెట్రోలింగ్‌లో ఉన్న భారత సైనికులు మందుపాతరకి బలవుతారు. ప్రాణాలతో ఉన్న కొద్దిమందిని కత్తులతో చంపి ఆయుధాలు, సైనికుల వంటి మీద బంగారం దోచుకెళ్తారు శత్రుదేశం సైనికులు. ప్రవీణ్ కనబడడు, మరణించాడేమో అనుకుంటే శవం దొరకదు. చివరికి అర్జున్ గుర్తిస్తాడు, ప్రవీణ్ పడిపోయిన చోటుని.
పెట్రోలింగ్‌లో ఉండాల్సిన సైనికులు దారిమళ్ళి అడవిలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో విచారణ జరుపుతారు పై అధికారులు. పోస్ట్‌మార్టమ్ చేసిన డాక్టరుకి ప్రవీణ్ శవంలో ఓ బుల్లెట్ దొరుకుతుంది. అది శత్రువులది కాదు, మన సిపాయిలదే. విచారణ వేగవంతమవుతుంది. ఆ బుల్లెట్ పేల్చింది అర్జునేనని తేలుతుంది. ఆప్తమిత్రుడిని కాల్చి చంపాల్సిన అవసరం ఏమిటి? అర్జున్ చేసింది తప్పా ఒప్పా? ఆసక్తికరంగా సాగుతుందీ నవల.
ఈ నవలలో సైనికులు జరుపుకునే ప్రత్యేక విందు ‘బడాఖానా’ గురించి వివరంగా చెప్తారు రచయిత.
~
రెండు నవలల్లోనూ ప్రధాన ఇతివృత్తం ‘treason’. మొదటి నవలలో పోలీసు శాఖలో నమ్మకద్రోహం కాగా, రెండవ నవలలో దేశ రక్షణశాఖలోని బెట్రేయల్‌లా అనిపించినా, పూర్తిగా కాదు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు వృత్తి పట్ల నిబద్ధత ఉన్న అధికారులు విచారణ జరిపితే ఎలా ఉంటుందో ఈ రెండు నవలలు పాఠకులకి తెలియజెప్తాయి.
రచయిత పోలీస్ శాఖలో పనిచేయడం వల్ల రెండు నవలలలోనూ పరిశోధన అంతా పకడ్బందీగా సాగింది. ఎక్కడా అభూతకల్పనలు లేవు. మొదలుపెడితే, ఆపకుండా చదివిస్తాయీ రెండు నవలలు.
***
(రెండు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ నవల సమాహారం)
రచన: మంజరి
ప్రచురణ: క్లాసిక్ బుక్స్
పేజీలు: 248
వెల: ₹ 275/-
ప్రతులకు:
క్లాసిక్ బుక్స్
#32-13/2-3A, అట్లూరి పరమాత్మ వీధి
మొగల్రాజపురం,
విజయవాడ 520 010.
సెల్: 85220 02536
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/Love-India-Suspense-thriller/dp/B0DKKGLNWF
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ అనువదించారు. ప్రముఖ హిందీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవితచరిత్రని తెలుగులోకి అనువదించగా, ఇటీవల పుస్తక రూపంలో వెలువడింది.
ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు (అముద్రితం).
ప్రస్తుతం డా. సాధనా శంకర్ రచించిన Ascendance అనే సైన్స్ ఫిక్షన్ నవలని, డా. సుధాంశు మణి గారి My Train 18 Story ని అనువదిస్తున్నారు.
‘దేవుడికి సాయం’, ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ అనే కథాసంపుటాలు, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.

