Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఇదీ ఒక ప్రేమ కథే

[వల్లూరి విజయకుమార్ గారు రాసిన ‘ఇదీ ఒక ప్రేమ కథే’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

శైలజ పేరు లాగే.. నాజూగ్గా.. అపురూపంగా వుంటుంది. ‘శైలజని నువ్వు ప్రేమిస్తున్నావా’ అంటే సమాధానం ‘ఔను’ అనే.

మరి తను? అదే తెలీదు.. తెలుసుకోవాలి.. ఎలా తెలుసుకోడం? అదేమంత కష్టం కాదు.

వాళ్ళింటికి వెళ్ళినప్పుడు అడిగేస్తే సరి. నా ధైర్యానికి నాకే నవ్వొచ్చింది. శైలజ వాళ్ళ మామయ్య రిటైర్డ్ కెమిస్ట్రీ లెక్చరరు. ట్యూషన్లు బాగా చెబుతాడని మంచి పేరుంది. మొదట్లో అయిష్టంగా వెళ్ళేవాడిని. అదో పనిష్మెంట్ నాకు. కాలేజీ అయ్యాక యింటికి రావడం, పుస్తకాలు పట్టుకుని పోలోమని ట్యూషన్‌కి పోవడం, నాలాంటి వాడికి యెంత కష్టం! కానీ డిగ్రీ ఫైనల్ పాసవాలంటే తప్పదు మరి.

***

మూడు గదుల యింట్లో శైలజ, వాళ్ళ అమ్మ, ముగ్గురు చెల్లెళ్ళు.. ట్యూషన్లు చెప్పే మామయ్య. వెళ్ళినప్పటి నుండి ఏదో రూపేణా శైలజ కనపడుతుంది.. మాట వినపడుతుంది. మాస్టారు కూర్చునే కుర్చీ వెనక ఎత్తు బల్లమీద వీణ కూడా వుంటుంది. నాకైతే శైలజ మాటలు వీణ లోంచి వస్తున్నట్టు, భావన. నేను మాస్టారింటికి, వచ్చినప్పుడు.. మళ్ళీ వెళ్ళేప్పుడు శైలజ కనిపిస్తుంది. తన నవ్వు.. వచ్చినప్పుడు, ‘వచ్చారా రండి అన్నట్టు’,.. వెళుతున్నప్పుడు ‘మళ్ళీ వస్తారుకదూ’ అన్నట్టు వుంటుంది.

***

ఒకరోజు ప్రభాకర్‌ని అడిగాను, ‘ఏవిట్రా యిది’ అని. వాడంటాడూ ‘ప్రేమ’ అని. పైపెచ్చు ‘మీ జోడీ బాగుంటుందిరా!’ అంటూ సర్టిఫికెట్టు వొకటీ. క్రమేణా చదువు మీద ధ్యాసపోయింది. ఆకలి వుండదు, నిద్ర పట్టదు. ఆలోచనంతా ఆ మూడక్షరాల చుట్టూ పరిభ్రమిస్తూ! అదొక వెర్రి బాధ. కాలేజీలో వెనక బెంచీలో కూర్చుని పుస్తకం నిండా శైలజ పేర్లు నింపేదాకా వచ్చింది పరిస్థితి.

***

పరీక్షలైపోయాయి. క్వశ్చన్ పేపర్స్ పట్టుకుని ట్యూషన్ మాస్టారింటికి వెళ్ళాను. ఆయన ఆన్సర్లు అడుగుతుంటే మళ్లీ ఈసారి కూడా చదువు కాస్తా గుండు సున్నా కొట్టినట్టు అర్థం అయింది.

‘హమ్మయ్య..’ అనుకున్నా. నన్ను చదివిస్తున్నందుకు అమ్మ నాన్న పడుతున్న కష్టం నాకెదుకు తట్టడం లేదో.

“బాబూ సుధాకర్, యింత డబ్బు పోసి ట్యూషన్ పెట్టించుకున్నావ్. నేనూ బాగానే చెప్పాను మరి. నా దగ్గర చదివి స్టూడెంట్ పాసవ్వకపోతే.. నాపేరు చెడిపోతుందోయ్.” శైలజ మావయ్య గొంతులో ఏదో బాధ.

రిజల్ట్స్ వచ్చాయి. ప్రభాకర్ పాసైపోయాడు. నెట్ డౌన్ అయ్యిందో ఏమో పాడు. నా హాల్ టికెట్ నంబర్ కొడితే మొత్తం స్క్రీనే బ్లాంక్ అయిపోతోంది. నా నంబర్ ఇంక కనబడదని డిసైడ్ అయిపోయా.

***

“మాస్టారూ” అయన ముందు తలవంచుకుని నిల్చున్నాను.

“ఇదిగోండీ మీ ఫీజు.” కవర్ చేతిలో పెట్టాను.

ఆయన అయిష్టంగా దానివైపు చూసారు. అలా బల్ల మీద పెట్టు అన్నట్టున్నాయ్ ఆయన చూపులు.

“సుధాకర్, నువ్వెందుకు పాసవలేదని అడగను. నేను పాఠాలు చెప్పడంలో లోపాలుంటే చెప్పు, దిద్దుకుంటాను.”

జీవితంలో ఇటువంటి వ్యకిని చూస్తాననుకోలేదు. మొదటి సారిగా గుండెలు పిండే బాధ యెలా వుంటుందో తెలిసింది.

“మాష్టారూ నేను శైలజని ప్రేమిస్తున్నాను. కళ్లు మూసుకున్నా తనే కనిపిస్తుంది. మనసు చదువు మీద లగ్నం కావట్లేదు సార్.” తప్పో ఒప్పో.. యెలా అన్నానో అనేశాను.

శైలజ మావయ్య, నన్నొక వెర్రివాడిలా చూసారు.

“అలా కూర్చో.” అన్నారు. “నువ్వు నిర్భయంగా మాట్లాడావు.. సంతోషం. కానీ ఒకటి గుర్తుంచుకో. మా యింటికి నువ్వే కాదు, బోలెడు స్టూడెంట్లు వస్తారు జీవితం మీద ధ్యేయంతో. మరి వాళ్ళందరూ కూడా శైలజని ప్రేమిస్తున్నాను అని అంటారేమో! అంటే యెలా?”

మాస్టారు చెడా మడా తిడతారనుకుంటే యిదేమిటి!

“చూడు సుధాకర్.. మరి శైలజకి నువ్వుతనని ప్రేమిస్తున్నసంగతి తెలుసా?”

తెలీదన్నట్టు అడ్డంగా తలూపాను.

“ఏం ఎందుకు చెప్పలేదు?”

“సార్.. తనకి యిష్టం లేకపోతేనో.. ఆ మాట నేను భరించలేను. అందుకే అడగలేదు. మీరు అడిగి చూడండి సార్.. తనకి నేను నచ్చకపోతే నాతో చెప్పకండి.. నేనే అర్థం చేసుకుంటాను.”

“సుధాకర్!” ఆయన పిలుపు గంభీరంగా వుంది. “నీ ధైర్యం నాకు నచ్చిందోయ్. కానీ నువ్వింకా డిగ్రీ కూడా పాసవలేదు మరి.. సరే పెళ్లి చేసుకుని ఏం చేద్దామని? అసలు మీ ఇంట్లో ఒప్పుకుంటారా.. మన కులాలు వేరు తెలుసా. నాకు పట్టింపు లేదనుకో, మీవాళ్ళకి నువ్వొక్కడివే. నీ స్వార్థం కోసం వాళ్లని బాధ పెట్టడం మంచిది కాదేమో. చూడు సుధాకర్.. ముందు చదువుకో.. నీ కాళ్ళ మీద నిలబడు. అప్పుడు మీ వాళ్ళని ఒప్పించగలిగితే కనపడు. ఇది చదువుకునే వయసు. నీ మంచి అభిప్రాయాలని నేను కాదనను. ఇంద.. యీ కవర్ తీసుకెళ్లిపో. నేను ఓడిపోతే ఫీజు తీసుకోను.. నీకే కనక శైలజ మీద అంత ప్రేముంటే ముందు, జీవితంలో స్థిరపడు.. అప్పుడు కనిపించు, తీసుకుంటాను ఫీజు. వెళ్ళిరా నాయనా, శుభం!”

“శైలూ!” మాస్టారు పిలిచారు.

ఎక్కడినుండి వచ్చిందో, శైలజ వచ్చింది.

“తల్లీ.. ఈ కవర్ సుధాకర్‌కి యిచ్చేయమ్మా, బెస్ట్ అఫ్ లక్ చెప్పు.”

వణుకుతున్న చేతులతో కవర్ అందుకున్నాను. అడుగులు వెనక్కి పడుతున్నాయి. మాస్టారి మాటలు మాత్రం గుండెలో వుండి పోయాయి.

“మాస్టారూ, వెళ్ళొస్తా.. తప్పకుండ మళ్ళీ కనిపిస్తా. అప్పుడు మీరు గురుదక్షిణ కాదనరు కదూ.”

Exit mobile version