Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఇలా చెప్పుకుందాం

[రఘు శేషభట్టర్ గారి ‘ఇలా చెప్పుకుందాం’ అనే రచనని అందిస్తున్నాము.]

కుంకుమ లేదో మృగమద
పంకము లేదో పటీర పాంశువు లేదో
సంకు మదము లేదో యశు
భంకరమగు భస్మ మేల బాలా నీకున్

కుంకుమ లేదా కస్తూరికి బదులు భస్మమేదో పెట్టుకున్న భామనుద్దేశించి శ్రీనాథుడు చెప్పిన చాటువిది. కనీసం చందనమో పరిమళ ద్రవ్యమో పెట్టుకొని ఉండాల్సిందని వాపోతాడు. బొట్టుకు బదులు స్టిక్కర్లు పెట్టుకునే అతివల మీద ఎవరూ పద్యాలల్లలేదు కానీ ఆహార్యంలో ఉండే పట్టింపులు మనిషినెంత మెలి తిప్పుతాయో చెబుతుందీ పద్యం. శ్రీనాథుడు దీనిని సరదాగా రాసుకున్నా ఒక తీరైన చమత్కృతి అందులో ముప్పిరిగొంటుంది.

అతివల ఆహార్యం, అలంకారం కవితా వస్తువులుగా ఉన్న కాలంలో జయదేవుడు చెప్పిన శ్లోకం ఒకటి కవిత్వ ప్రేమికుల నాలుకల మీద స్థిరంగా ఉండిపోయింది.’ రామో విగ్రహవాన్ ధర్మః ‘ అనే మాట నుండి స్ఫూర్తి పొందాడేమో, కవిత్వం అనే మాటకొక ఆకర్షణీయ స్త్రీ రూపం ఇచ్చి చెబుతాడిలా –

యస్యాశ్చోర శ్చికురనికరః కర్ణపూరో మయూరో
భాసో హాసః కవికులగురుః కాళిదాసో విలాసః
హర్షో హర్షో హృదయవసతిః పంచబాణస్తు బాణః
కేషాం నైషా కథయ కవితాకామినీ కౌతుకాయ

(కవితాకామినికి చోరకవి జడలాంటి వాడు-మయూరుడు కుండలాల వంటి వాడు. భాసుడు తన చిర్నవ్వు – కవికుల గురువువైన కాళిదాసే ఆమె విలాసం. హర్షుడేమో ఆమె సంతోషం- బాణుడు ఆమె హృదయంలోని మన్మథుడు. ఇలాంటి రూపం ఉత్సాహం ఎందుకివ్వదో చెప్పండి)

ఇక్కడ చెప్పుకోవలసింది ఒక్కొక్క కవి ఒక్కొక్క గుణం చేత అలరిస్తాడని. శ్లోకంలో చెప్పబడ్డ పోలికల్ని స్వేచ్ఛా వచనంలోకి మార్చుకుంటే ఇలా ఉంటుంది –

జడ లేని తల బోడిగా ఉన్నట్టు

చోరుడు దూరని కవిత్వం బోసిపోక ఏమౌతుంది?

వేలాడే చెవి పోగులు

మయూరుడి వాక్యాలంత లలితంగా ఉన్నాయని

మెరిసే నవ్వేమో భాసుడి మాటలా తళతళలాడుతుందని అంటాను

కాళిదాసు కవిత్వానికి ఇల్లని

సంతోషాల రెమ్మల్లో హర్షుడి ముద్రలుంటాయని అంటాను

హృదయంలోని మన్మథ బాణం బాణుడి వల్లే మరి

ఒక ముఖంలో ఇంత మంది కవులున్నప్పుడు

ఉల్లాసం ఎందుకుండదో చెప్పండి

ఆత్మను వదిలి కవిత్వాన్ని అర్థతాత్పర్యాలతో నలిపితే కృతకంగా ఉంటుంది. మూల భాషలోని మాధుర్యం కత్తిరించి ఇచ్చేందుకు సహానుభూతిలాంటి కసరత్తు కావాలి. కవిత్వ పాఠాలు చెప్పటం అంటే అర్థ తాత్పర్యాలు చింపి పోయటం కాదని శ్రీపాద అందుకే కదా అన్నారు!

Exit mobile version