Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఇలలో వైభవమై వెలుగులు విరజిమ్మే మన భాగ్యనగరం!

[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘ఇలలో వైభవమై వెలుగులు విరజిమ్మే మన భాగ్యనగరం!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

కాసుల గలగలలతో అలరారే
భారతావనిలో వెలసిన దివ్య నగరం..
భాగ్యనగరంగా వర్ధిల్లే మహానగరం హైదరాబాద్!
గోల్కొండ సంస్థానాధీశుడైన
మహమ్మద్ కులీ కుతుబ్ షా
కలల ప్రతిరూపమై 400 సంవత్సరాల క్రితం
రూపుదిద్దుకున్న అందం, ఆనందాల మేలు కలయికల
మహోన్నత సంస్కృతికి నిదర్శనం హైదరాబాద్!
పగలే కాకుండా
రాత్రిపూట సైతం వెలుగులు విరజిమ్మే చార్మినార్
పాలరాతి కట్టడంపై
శ్రీవేంకటేశ్వరుడు కొలువైవున్న బిర్లా మందిర్
సకల కళలకు కాణాచై
కళాకారుల కొంగుబంగారమై
నగర ప్రఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న రవీంద్రభారతి
పురాతన వస్తువులెన్నో సేకరించి భద్రపరిచి ప్రదర్శిస్తూ
నాటి వైభవాన్ని నయన మనోహరంగా
మన ముందుంచుతూ మురిపిస్తున్న సాలార్ జంగ్ మ్యూజియం
నగరానికి నీటి లభ్యత పుష్కలమయ్యేలా నిలిచిన
జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్
హాలీవుడ్‌కు దీటుగా షూటింగ్స్ జరుపుకుంటున్న
రామోజీ ఫిల్మ్ సిటీ
తెలుగు భాషకు, తెలుగు నేలకు విస్తృతమైన సేవ చేసిన
మహోన్నత మానవతామూర్తుల విగ్రహాలు
ట్యాంక్‌బండ్, హుస్సేన్ సాగర్‌ల అందాలని రెట్టింపు జేస్తుంటే
ఈ చోటు సందర్శకులని విశేషంగా ఆకట్టుకునే
ఆహ్లాద సొగసైన సాగరతీరం!
తెలుగు జాతి ఔన్నత్యానికి కీర్తిప్రతీకై
జగతిలో పేరెన్నిక గన్న తెలుగునేల
చేసుకున్న పుణ్యఫలం..
తెలంగాణ ప్రజల సువిశాల హృదయ వేదిక..
ఈ మహానగరం
మహోన్నత హైదరాబాద్ పట్టణం!

Exit mobile version