Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంభాషణం – కవి, కథా, నవలా రచయిత డా. దిలావర్ అంతరంగ ఆవిష్కరణ

[‘సంచిక’ కోసం కవి, కథా, నవలా రచయిత డా. దిలావర్ గారితో సంచిక టీమ్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]

డా. దిలావర్ గారు సుప్రసిద్ధ కవి, కథా, నవలా రచయిత. సాహిత్యంలో పలు పురస్కారాలు అందుకున్నారు. వారి గురించి, వారి రచనల గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం.

~

ప్రశ్న 1. నమస్కారం డా. దిలావర్ గారూ. సంచికతో ముఖాముఖికి స్వాగతం. ఇంకో నాలుగు రోజుల్లో 85వ పుట్టినరోజు జరుపుకోబోతున్నందుకు శుభాకాంక్షలు.

జ: ధన్యవాదాలు.

ప్రశ్న 2. మీ బాల్యం, కుటుంబం, విద్యాభ్యాసం, ఉద్యోగం గురించి చెప్పండి.

జ: నేను అప్పటి వరంగల్ జిల్లా, ఇల్లందు తాలూకా, కమలాపురంలో పుట్టాను. తల్లిదండ్రులు మహబూబ్బి, నిజాముద్దీన్ గారలు. బతికి చెడిన దిగువ తరగతి వ్యవసాయ కుటుంబం. నా బాల్యం పేదరికం లోనే గడిచింది. నేను అ.. ఆ ల నుండి 11వ తరగతి వరకు డోర్నకల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. మా వూరి నుండి డోర్నకల్ వరకు అప్పట్లో ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. రోజూ పోను 7 కి. మీ. రాను 7  కి. మీ. నడిచే పాఠశాలకు వెళ్ళి వచ్చేవాడిని.

11వ తరగతి తర్వాత చదివే స్తోమత లేక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ఉద్యోగంలో 60 రూ. జీతంతో చేరాను.

ప్రశ్న 3. సాహిత్యం పట్ల ఆసక్తి మీకు ఏ వయసులో కలిగింది? పుస్తకాలు చదివేందుకు ప్రేరణ ఎవరు?

జ: స్కూల్‌లో చదివే సమయంలో దాశరథి రంగాచార్యులు గారు మాకు తెలుగు పండిట్‌గా ఉండేవారు. వారు పాఠాల కన్నా సాహిత్య విషయాలు ఎక్కువ చెప్పేవారు. అలాగే అప్పటి మా టీచర్లు శ్రీనివాసాచార్యులు, జార్జి గారు, బెంజిమెన్ గారు, అప్పటి మా హెడ్ మాస్టర్ B.S.N.శాస్త్రి గారు కూడా నా మీద ఎన లేని ప్రభావం చూపారు. అప్పుడే బీజప్రాయంగా నాలో సాహిత్య పఠనాసక్తి కలిగింది.

24-2-2024న తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో శ్రీమతి కొలకలూరి విశ్రాంతమ్మ రాష్ట్రస్థాయి నవలా పురస్కారం, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌ. శ్రీ భట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా అందుకుంటూ

ప్రశ్న 4. పాఠశాల/కళాశాల రోజుల్లో ఎక్కువగా ఏ పుస్తకాలు, ఏ రచయితలని చదివారు?

జ: పాఠశాల రోజుల్లో ప్రత్యేకంగా ఏ రచయితల పుస్తకాలు చదవలేదు. పాఠ్యాంశాల లోని భారత, భాగవత, రామాయణ పాఠాలనే చదివేవాణ్ణి.

ది. 14-7-2016 న తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో గౌ. ఉపకులపతి శ్రీ ఏల్లూరి శివారెడ్డి గారి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం అందుకుంటూ

ప్రశ్న 5. మీ కుటుంబంలో ఎవరైనా సాహితీవేత్తలు/రచయితలు ఉన్నారా?

జ: మా నాన్నగారు మావూరి కరణీకం చేసేవారు. మా తాతగారు కూడా. వారికి భారత భాగవత రామాయణ పద్యాలు  కంఠోపాఠంగా వచ్చు. ఊళ్లో పంచాయతీలు తీర్పు చెప్పే సమయంలో ఆ పద్యాలను ఉటంకించేవారు. అది నా మీద చాలా ప్రభావం చూపింది. ప్రత్యేకించి మా నాన్నగారు నాకు వచ్చిన పద్యాల గురించి చాలా శ్రద్ధ తీసుకునేవారు.

ప్రశ్న 6. ఓ పాఠకుడి నుంచి రచయితగా మారిన క్రమం గురించి చెప్తారా? మీ తొలి సాహితీ ప్రక్రియ ఏది?

జ: పాఠశాల రోజుల్లోనే.. పదవ తరగతి చదివేప్పుడు స్కూలు మేగజైన్ ‘ప్రగతి’లో తాజమహల్ అన్న పద్యాలు రాశాను. 11వ తరగతిలో ‘ఆకలి’ అన్న కథ రాశాను. అది నా ఆకలి గురించే. ఆ కథను ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు బాగా మెచ్చుకున్నారు. అప్పటి నా ఆనందం మాటల్లో చెప్పలేను.

ది. 24-3-2016 న తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో ‘పరిణత వాణి’ లో భాగంగా డా. సి. నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా సన్మానం అందుకుంటూ

తరువాత స్వయంకృషితో PUC, B.A. చదివాను. ఫలితంగా గ్రేడ్ 1 తెలుగు పండిట్‌గా ప్రమోషన్ వచ్చింది. ఇల్లందు దగ్గర ముత్యాలంపాడుకు తెలుగు పండిట్‌గా వెళ్ళాను. B.A.లో తెలుగు ఆప్షన్ తీసుకోవడం వల్ల తెలుగు సాహిత్యంపై మక్కువ పెరిగింది. అక్కడికి వెళ్ళింతరువాత విరివిగా రచనలు చేయడం మొదలు పెట్టాను.

ప్రశ్న 7. బాల్యంలోని పేదరికం మీ సాహిత్యంలో వస్తువు అవడమే కాకుండా, వ్యక్తిగా, సాహితీవేత్తగా మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసింది?

జ: బాల్యం చాలా దుర్భర పేదరికంలో గడిచింది. పెళ్లి అయిన తరువాత కూడా అది నన్ను విడిచిపెట్టలేదు. పస్తులు కూడా ఉండేవాళ్ళం. బతుకు గడవడానికి ఓ రైల్వేస్టేషన్‌లో హమాలీగా చేశాను. రెయిన్ గేజర్‌గా కూడా చేశాను.

అయితే ఆ పేదరికం సాహిత్యానికి బాగానే ఉపకరించింది. పేదల, అన్నార్తుల, అధో జగత్సహోదరుల పక్షపాతిగా నన్ను నేను మలచుకున్నాను. ఆ ఇతివృత్తాలతోనే కథలు, కవితలు రాశాను.

02-07-2018 న కాంచన లత చారిటబుల్ ట్రస్ట్ వారి జాతీయ పురస్కారం స్వీకారం. అప్పటి స్ఫీకర్ గౌ. శ్రీ మధుసూదనాచారిగారు ‘సాహిత్య జ్యోతి రత్న’ బిరుదు ప్రదానం చేసినప్పటి దృశ్యం

ప్రశ్న 8. ప్రతికూలతలనే మెట్లుగా మార్చుకుని జీవితంలో ఎలా ఎదగగలిగారు? మీరు స్ఫూర్తిగా నిల్చిన వ్యక్తులెవరైనా ఉన్నారా? వివరంగా చెప్పండి.

జ: ముత్యాలంపాడులో ఉండగానే కౌముది గారి పరిచయం అయింది. తొలినాళ్లలో వారి మార్గదర్శనంలోనే రచనలు చేసాను. తరువాత ప్రఖ్యాత రచయిత సోమసుందర్ గారి పరిచయం జరిగింది. నన్ను వారు తమ అనుంగుశిష్యునిగా స్వీకరించారు. వారి జీవితాంతం నాకు దారి దీపం గానే ఉన్నారు. వారి ప్రభావం నా మీద చాలానే ఉంది.

ప్రశ్న 9. మీరు కవిత్వం, కథలు, నవలలు, వ్యాసాలు, గజల్స్ వ్రాసారు. వీటిలో ఏ ప్రక్రియపై మక్కువ ఎక్కువ?

జ: అన్ని ప్రక్రియలు నాకు ఇష్టమైనవే. అయితే ప్రత్యేకించి చెప్పాలంటే కవిత్వం వైపే మొగ్గు చూపుతాను.

2016 లో తెలంగాణ సాహితీవారు హైదరాబాద్‍లో సన్మానించినప్పుదు ప్రసంగిస్తున్న దృశ్యం

ప్రశ్న 10. కథ గానీ, కవిత గానీ, వ్యాసం రాయాలనుకున్నప్పుడు ఇతివృత్తం ఎలా ఎంచుకుంటారు?

జ: నా చుట్టూ కనిపించే సంఘటనలే నాకు ఇతివృత్తాలు. అయితే అవి నా అంతరంగంలో చేరి అలజడి రేపినప్పుడే.. రాయకుండా ఉండలేని తనమేదో నన్ను కుదురుగా ఉండనివ్వనప్పుడు రచన రూపుదిద్దుకుంటుంది.

ప్రశ్న 11. కవిత్వానికి లయ/వస్తువు/భావ వ్యక్తీకరణలలో ఏది ముఖ్యం అనుకుంటున్నారు? మీరు దేనికి ప్రాధాన్యతనిస్తారు?

జ: కవిత్వానికి వస్తువే ముఖ్యం. వస్తువు దానంతట అదే భావాన్ని, శిల్పాన్ని, లయను సమకూర్చుకుంటుంది. అయితే ఆ వస్తువు రాణించాలంటే కవి ప్రతిభ లోనే అంతా ఉంటుంది.

సిద్దిపేటలో వట్టికోట అళ్వారుస్వామి అవార్డును అప్పటి సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఏనుగు నరసింహారెడ్డి మొదలగు వారి నుండి అందుకుంటూ

ప్రశ్న 12. కథ వ్రాసేటప్పుడు మీరు వస్తువు/శిల్పం/శైలి – దేనికి ప్రాధాన్యతనిస్తారు?

జ: కథకు వస్తువే ప్రాణం. వస్తువును ప్రదర్శించేటప్పుడు శిల్పం, శైలి దానంతట అదే మారుతుంది. అలా అని శిల్పాన్ని, శైలిని తక్కువ చేసి చెప్పలేము.

ప్రశ్న మీకు 30 ఏళ్ళ వయసున్నప్పుడు 1972లో మొదటి కథ వ్రాశారు. తొలి కథ వ్రాసి సుమారు 54 ఏళ్ళు గడిచాయి. ఈ సుదీర్ఘ సాహితీ ప్రస్థానంలో సమాజం లోనూ, సాహిత్యం లోనూ మీరు గమనించిన మార్పులు ఏమిటి? కొన్ని ఉదాహరణలు చెప్పండి.

జ: ఈమధ్య కాలంలో సాహిత్యంలో ముఖ్యంగా కథా రచనలో చాలా మార్పులు వచ్చాయి. సామాజిక స్పృహ పెరిగింది. వస్తు శిల్పాలలో చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి. రచయితలు దేశ విదేశ సాహిత్యాలను బాగా అధ్యయనం చేస్తున్నారు. తదనుగుణంగా కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఆహ్వానింపదగినవే అని నా అభిప్రాయం.

ప్రశ్న 14. మీ ముందు తరం కవులు/రచయితలలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినదెవరు? పద్యకవిత్వం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో, దానికి భిన్నంగా వచన కవిత్వం (ఫ్రీవర్స్) ఎంచుకోడానికి కారణం ఏమిటి?

జ: నన్ను బాగా ప్రభావితం చేసిన వారిలో శేషేంద్ర గారు మొదటి వరుసలో ఉంటారు. కథకుల్లో అల్లం రాజయ్య గారి కొన్ని కథలు నన్ను అమితంగా ప్రభావితం చేశాయి.

ఫ్రీవర్స్ ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం అంటూ ఏదీ లేదు. ఎందుకో మన భావాలను ఎలాంటి సంకెళ్లు లేకుండా స్వేచ్ఛగా రాయొచ్చు అనిపించింది.

19-08-2019 న రవీంద్ర భారతిలో అప్పటి మంత్రివర్యులు గౌ. శ్రీ. కె. శ్రీనివాస గౌడ్ గారి చేతుల మీదుగా విశాల సాహితి జీవిత సాఫల్య పురస్కారం అందుకుంటూ

ప్రశ్న 15. మీ తరువాతి తరం కవులు/రచయితలు మిమ్మల్ని సలహాల కోసమో, మార్గదర్శనం కోసమో సంప్రదిస్తుంటారా? ఇప్పుడు వస్తున్న కవిత్వంపై మీ అభిప్రాయమేమిటి?

జ: నేను కాలేజీలో పని చేస్తున్నప్పుడు కొందరు స్టూడెంట్స్ నా దగ్గరికి సలహాల కోసం వచ్చేవారు. ఇప్పుడు అలా నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరూ లేరు.

ఇప్పుడు వస్తున్న కవిత్వం.. చాలా మంది కవులకు అధ్యయనం తక్కువ. తాము రాసిందే final అనే ధోరణి పెరిగింది. ఇంకా చెప్పాలంటే తాము, తమ కుటుంబం, పరిసరాల చుట్టూనే కవిత్వం తిరుగుతున్నది. దాని వల్ల జాతీయ, అంతర్జాతీయ సంక్షోభాలను పట్టించుకోనివారు అవుతున్నారు.

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతిలో ప్రసగించినప్పుడు సన్మానం జరిగిన సందర్భంగా

ప్రశ్న 16. పిహెచ్‌డిలో మీ పరిశోధనాంశం ‘దాశరథి కవితా వ్యక్తిత్వ పరిశీలన’ గురించి చెప్తారా? మీ గైడ్ ఎవరు? మీ థీసిస్ ప్రత్యేకత ఏమిటి? పుస్తకంగా ఎందుకు ముద్రించలేదు?

జ: నేను Ph.D. లో దాశరథి కవితా వ్యక్తిత్వం అనే ఆ అంశాన్ని ఎంచుకోవడం నాకు దాశరథి గారి మీద ఉన్న అభిమానం వల్లనే. వారి అగ్నిధార లోని పద్యాలు నన్ను చాలా కదిలించాయి. నా గైడ్ చేకూరి రామారావు గారు. మోస్ట్ ఎమినెంట్ స్కాలర్. పరిశోధనలో వారు నన్ను అమితంగా ప్రభావితం చేశారు. తెలంగాణ ఉద్యమ పోరాట నేపథ్యంలో నా పరిశోధన సాగింది. నా థీసిస్‌లో అనువాదంకు చెందిన అధ్యాయం చాలా ప్రత్యేకమైనది. గజల్స్ గురించి విలువైన సమాచారం అందించాను. మిగతా విషయాల్లో మామూలుగానే ఉన్నది. పుస్తకంగా ముద్రించక పోవడానికి ప్రత్యేక కారణం అంటూ ఏదీ లేదు. కొంత ఆర్థిక సమస్య కూడా కారణం కావచ్చు.

కాకతీయ యూనివర్సిటీలో డా. దిలావర్ దంపతులకు సన్మానం చేసినప్పటి దృశ్యం

ప్రశ్న 17. మీ మరొక సిద్ధాంత గ్రంథం ‘ప్రహ్లాద చరిత్ర – ఎర్రన, పోతన తులనాత్మక పరిశీలన’ గురించి చెప్పండి.

జ: నేను M.A. చదువుతున్నప్పుడు ఎర్రన లక్ష్మీ నరసింహ పురాణం పాఠ్యాంశంగా ఉండేది. అందులోని అద్భుత కవిత్వం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. అదే ఘట్టాన్ని పోతన భాగవతంలో రాశాడు కదా. రెంటికీ తులనాత్మక పరిశీలన చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కలిగింది. ఇంకేం, ఆచరణలో పెట్టాను. దానికి టి.టి.డి. వారు ఆర్థికసాయం చేశారు.

2004 సంవత్సరపు సోమసుందర్ లిటరరీ ట్రస్ట్ పురస్కారాన్ని, వ్యవస్థాపకులు శ్రీ ఆవంత్స సోమసుందర్ గారి నుంచి స్వీకరిస్తూ

ప్రశ్న 18. తెలుగు లెక్చరర్‌గా బోధనారంగంలో ఉండడం వల్ల సాహిత్య అధ్యయనం చేయడం సులువైందా?

జ: తెలుగు లెక్చరర్‌గా చేయడం వల్ల నాకు సాహిత్యంలో కొంత వెసులుబాటు కలిగిన మాట వాస్తవం. సాహిత్య వాతావరణం కలిగించడంలో నా ఉద్యోగం ఎంతైనా తోడ్పడింది. ఎలాగూ కృషి కూడా అవసరమే అనుకోండి.

ప్రశ్న 19. మీ ‘అడవి బతుకులు’ నవల గురించి చెప్పండి.

జ: ‘అడవి బతుకులు’ గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. అంతకుముందే కొండా కోనల్లో అన్న ఆదివాసీ కథలు రాసాను. అందులోని కొన్ని కథలు ఉస్మానియా యూనివర్సిటీలో M.A. రెండవ సంవత్సరంలో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. కొన్ని B.A.కు పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఆ ఉత్సాహంతో ఏదైనా ఆదివాసుల నవల రాయాలని అనిపించింది. చెంచుల జీవితాలను విస్తృతంగా అధ్యయనం చేసాను. ఎక్కడెక్కడి నుంచో సమాచారం సేకరించాను. చివరికి నవలకు రూపం కల్పించాను. ఆ నవలకు రాష్ట్ర స్థాయిలో కొలకలూరు విశ్రాంతమ్మ అవార్డు కూడా వచ్చింది. నా కృషి వమ్ము కాలేదని సంతోషించాను.

2023-24 కు గాను పాల్వంచ కళా పరిషత్ వారి ఉగాది పురస్కారం, మంత్రివర్యులు గౌ. శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా అందుకుంటూ

ప్రశ్న 20. ‘మా నాయిన మహాకవి’ కవిత గురించి చెప్పండి. ఈ కవితలో మీ తండ్రి గారి పట్ల మీకున్న ప్రేమాభిమానాలే అక్షరాలూ, పదాలూ అయ్యాయని మా భావన.

జ: నా చిన్నతనంతో మా నాన్నగారు చాలా కష్టపడ్డారు. వ్యవసాయం పనులన్నీ స్వయంగా చేసేవారు. భారత భాగవత రామాయణ కావ్యాలు నిరంతరం మననం చేసుకునేవారు. అందుకే ఆ మహానుభావునికి ఆ అక్షర నీరాజనం సమర్పించాను.

2010 కి గాను సి.పి. బ్రౌన్ అకాడమీ, బెంగుళూర్ వారి పురస్కారం, గౌ. మండలి బుద్ధప్రసాద్ గారు, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్స్‌లర్ గౌ. కొలకలూరి ఇనాక్ గారి చేతుల మీదుగా అందుకుంటూ

ప్రశ్న 21. సాహితీపరంగా పొందిన గౌరవాల గురించి, మీకు లభించిన అవార్డులు, బహుమతుల గురించి చెప్పండి.

జ: సన్మానాలు చాలానే జరిగాయి. పురస్కారాలు కూడా చాలా లభించాయి. కొన్ని ముఖ్యమైనవాటిని పేర్కొంటాను:

22-4-2024న స్వగ్రామం పాత కమలాపురం (ఖమ్మం జిల్లా)లో గ్రామస్థుల తరఫున రచయిత ఊరి పెద్దకాపు కోటి అప్పారావు గారు సన్మానిస్తున్న దృశ్యం

ప్రశ్న 22. ఓ సాహితీవేత్తగా మీ లక్ష్యం ఏమిటి? మీ సుదీర్ఘ సాహితీయానంలో ఆ లక్ష్యం నెరవేరిందని భావిస్తున్నారా?

జ: నేనింకా నేర్చుకునే దశ లోనే ఉన్నాను. నాకంటూ ప్రత్యేక లక్ష్యం ఏమి లేదు. మనిషిని మనిషిగా చూసే ఉత్తమ సంస్కారం సాహిత్యం వల్ల కలుగుతుందనీ నా నమ్మకం. అది నెరవేరాలన్నది నా ఆకాంక్ష. అలా జరగాలని ఆశించుదాం. శుభం భూయాత్.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు డా. దిలావర్ గారూ.

డా. దిలావర్: ధన్యవాదాలు.

Exit mobile version