Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంభాషణం – రచయిత్రి డా. దిట్టకవి శ్యామలాదేవి అంతరంగ ఆవిష్కరణ

[సంచిక కోసం రచయిత్రి డా. దిట్టకవి శ్యామలాదేవి గారితో సంచిక టీమ్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]

డా. దిట్టకవి శ్యామలాదేవి ప్రముఖ తెలుగు రచయిత్రి, పరిశోధకురాలు, విమర్శకురాలు. ‘విశ్వనాథ సాహిత్యంలో స్త్రీ పాత్రలు’ అనే అంశంపై పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. పలు నవలతో పాటు, ఎన్నో కథానికలు రచించారు. ఆధ్యాత్మిక రచనలు చేశారు. అడివి బాపిరాజు గారి అసంపూర్ణ చారిత్రక నవల ‘మధురవాణి’ని పూర్తి చేశారు. వారి గురించి, వారి రచనల గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం.

~

ప్రశ్న 1. నమస్కారం డా. దిట్టకవి శ్యామలాదేవి గారూ. సంచికతో ముఖాముఖికి స్వాగతం.

జ: నమస్కారం. ధన్యవాదాలు.

ప్రశ్న 2. మీ బాల్యం, కుటుంబం, విద్యాభ్యాసం, ఉద్యోగం గురించి చెప్పండి.

జ: నా బాల్యం, విద్యాభ్యాసం నాకే చాలా విచిత్రంగా అనిపిస్తాయి. నాకు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు మా కుటుంబం మచిలీపట్నం నుండి కైకలూరు దగ్గర ఉన్న తామరకొల్లు అనే పల్లెటూరికి మారిపోయాము. మా నాన్నగారు చిరువోలు వెంకటకృష్ణయ్య గారు జిల్లా కోర్టులో ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. అప్పుడు తామరకొల్లు వచ్చేసాం. ఆ ఊరు స్కూల్లో ఐదవ తరగతి వరకే ఉంది. నేను మచిలీపట్నం లోనే 5వ తరగతి వరకు చదువుకున్నాను. అందుచేత ఇక్కడకు వచ్చాక స్కూల్లో చేరాల్సిన అవసరం రాలేదు. పుస్తకం మూతపడింది. చెట్లు ఎక్కడాలు, చెరువులో ఈత కొట్టడాలు, మా మేనమామల పిల్లలతో ఆటలు ఆగాలు ఇలా జరిగిపోయింది. మళ్ళీ 12 ఏళ్లు వచ్చాక కైకలూరులో ఓరియంటల్ స్కూల్లో చేరాను. అక్కడ సంస్కృతమే మెయిన్ సబ్జెక్టు. లెక్కలు, సైన్స్ ఉండేవి కావు. అందుచేత 10వ తరగతి అవకముందే ఆంధ్ర మెట్రిక్ చదివాను. తరువాత హైదరాబాదు వచ్చి మా సోదరి వద్ద ఉండి వెంకట రామారెడ్డి మహిళా కళాశాలలో పియుసి, బీఏ పూర్తి చేసాను. వివాహం అయ్యాక మరొక పది సంవత్సరాలకు ఎంఏ ప్రైవేట్ గా పాస్ అయ్యాను. మరొక పది సంవత్సరాలకు పీహెచ్‌డి డిగ్రీ అందుకున్నాను. అంటే 1965 లో బిఏ, 1975 లో ఎమ్ ఏ, 1985 లో పీహెచ్‌డి చేశాను.

డా. శ్యామలాదేవి గారి రచనలు

ప్రశ్న 3. సాహిత్యం పట్ల ఆసక్తి మీకు ఏ వయసులో కలిగింది? పుస్తకాలు చదివేందుకు ప్రేరణ ఎవరు? పాఠశాల/కళాశాల రోజుల్లో ఎక్కువగా ఏ పుస్తకాలు, ఏ రచయితలని చదివారు?

జ: బహుశా నాకు 11 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి అనుకుంటాను, మేము మా మామయ్య గారి కుటుంబం కలిసి ఆంధ్రప్రభ ఒకరు, ఆంధ్ర పత్రిక ఒకరు వీక్లీ తెప్పించుకునే వాళ్లం. ఆ వీక్లీలో వచ్చే సీరియల్స్ కోసం నేను ముందు చదువుతా అంటే నేను ముందర చదువుతాను అని తల పట్టుకునేవాళ్ళం. ఇది చూసి మా మేనమామ అడివి సీతారామయ్య గారు మాకు భాగవతంలోని పద్యాలు ఎవరు ముందు అప్పజెప్పితే వాళ్లు వీక్లీ చదవాలి, వాళ్లే గెలిచినట్టు అని పోటీ పెట్టేవారు. దాంతో పుస్తకం నుంచి పద్యాల మీదకి మనసు మళ్లేది. ముందు అప్పచెప్పిన వారికి తేగలు లేకపోతే ముంజలు బహుమానాలు దక్కేవి. అలా సీరియల్స్‌తో నా పఠనా వ్యాసంగం మొదలైంది. రచయితల పేర్లు చూసి నా పేరు ప్రభలో రావాలి అనుకునేదాన్ని. ఏదైనా గుర్తుండిపోయిన నవల చివుకుల పురుషోత్తం గారి ‘మనం మిగిలాం’ అనే నవల. ప్రభలో సీరియల్‌గా వచ్చేది అని గుర్తు.

కాశీ క్షేత్రంలో పుస్తకావిష్కరణ

ప్రశ్న 4. ఓ పాఠకురాలి నుంచి రచయిత్రిగా మారిన క్రమం గురించి చెప్తారా? మీ తొలి సాహితీ ప్రక్రియ ఏది?

జ: నా తొలి రచన 1976 ఆంధ్రజ్యోతిలో పిపి రావు ఫోటోగ్రాఫర్ అనే హాస్య కథ ప్రచురింపబడడంతో మొదలైంది. అసలు చిన్నతనంలోనే నాకు 12 ఏళ్లు వచ్చినప్పుడు అంటే అయిదవ క్లాసు స్టాండర్డ్ లోనే ఒక కథ రాసి ఆంధ్రప్రభకు పత్రికకు పంపించాను వారు దానిని చక్కగా తిప్పి పంపించారు. ఆ కథను నేను చించి పారేయకుండా పెట్టెలో దాచుకున్నాను. నాకు 40 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ కథను గురించి తురగా జానకిరాణి గారితో చర్చించాను. ఆమె విని చాలా బాగుంది అని చెప్పి, ప్రోత్సహించారు. ఆ కథ ‘పట్టాలు తప్పని రైలు’ అనే పేరుతో తురగా జానకీ రాణి గారి సారధ్యంలో 13 వారాలపాటు సీరియల్ నాటకంగా రేడియోలో ప్రసారం కాబడింది. అలా అనేక పత్రికలలో కథలు, సామాజిక సాంస్కృతిక వ్యాసాలు ప్రకటితమైనాయి. ఎక్కువగా సామాజిక సాహిత్య వ్యాసాలు పత్రికల వారు కోరినవే రాశాను.

ప్రశ్న 5. కథ, నవల – ఈ ప్రక్రియలలో మీకు ఏది ఇష్టం? ఎందుకు?

జ: రెండు ఇష్టమే. కథ ఉదయం లేవగానే చిక్కని పాలు చికోరి తక్కువగా ఉన్న ఫిల్టర్ డికాక్షన్ కలిపి తాగిన కాఫీ వంటిది. నవల షడ్రసోపేతమైనదిగా విస్తరి నిండుగా వడ్డించిన భోజనం చేసిన అనుభూతి.

ప్రశ్న 6. కథ గానీ, నవల రాయాలనుకున్నప్పుడు ఇతివృత్తం ఎలా ఎంచుకుంటారు?

జ: నా ఉద్దేశంలో కథ నవల రాయడం ఏది కష్టం కాదు కానీ ప్లాట్ దొరకడమే కష్టం. నాకు ఎప్పుడూ ఒక స్పందన లభిస్తే గాని నేను రాసేదాన్ని కాదు. ఒక సంఘటనను చూసి మనసు చలించినప్పుడు రాస్తేనే నాకు తృప్తిగా ఉండేది.

ప్రశ్న7. మీరు సాంఘిక నవలలు, చారిత్రిక నవలలు, ఆధ్యాత్మిక నవలలు రాశారు కదా? ఏ తరహా నవల రాయడం కష్టమని మీ అభిప్రాయం?

జ: నవల గాని కథ గాని వ్యాసం గాని ఏది కష్టం అనిపించలేదు కానీ చారిత్రక నవల రాసేటప్పుడు ఆనాటి చరిత్ర గురించి అవగాహన చేసుకోవడం అవసరం కదా. ‘మధురవాణి’ తంజావూర్ రఘునాథ నాయకుల చరిత్ర కాబట్టి ఆనాటి రాజకీయ సాంఘిక సంప్రదాయ పరిస్థితులను తెలుసుకోవడానికి అనేక పుస్తకాలు చదివాను.

ప్రశ్న8. ప్రఖ్యాత రచయిత అడివి బాపిరాజు గారికి మీకు ఏ విధంగా బంధుత్వం ఉంది? వారి అసంపూర్ణ నవల మధురవాణిని పూర్తి చేసే అవకాశం ఎలా లభించింది?

జ: అడివి బాపిరాజు గారి మేనల్లుడు బుద్ధవరపు కామరాజు గారు మా అక్క భర్త. అంటే నాకు బావగారు అవుతారు. ఆయన బాపిరాజు గారి నవలలు కాపీ చేసేవారు, వారు చెబుతుంటే వీరు రాసేవారు. నేను కూడా వారి ఇంట్లోనే ఉండి చదువుకున్నాను. కాబట్టి నేను మ్యాగజైన్లకి వ్యాసాలు రాస్తూ ఉండేదాన్ని. వారు అవి చూసి నా స్టైల్ వాళ్ళ మేనమామ గారు స్టైల్ ఒకలాగా ఉంది అనేవారు. ఈలోగా బాపిరాజు గారి కుమార్తె తాడికొండ వసంత గారు వారి తండ్రిగారి నవల ‘మధురవాణి’ని ఎవరైనా పూర్తి చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని శ్రీ వాణి అనే పత్రికలో ప్రచురించారు. అప్పుడు మా బావగారు నువ్వు రాయమని నన్ను ప్రోత్సహించారు. అదే సమయంలో ఆంధ్రభూమి పత్రిక ఎడిటర్ కనకాంబర రాజుగారు నన్ను ఒక సీరియల్ రాయమని అడిగారు అప్పుడు నేను మధురవాణి సబ్జెక్టు వారికి చెప్పాను. వారు వెంటనే అంగీకరించారు.

ప్రశ్న 9. అడివి బాపిరాజు గారి రచనా శైలిని ఎలా ఒడిసిపట్టారు? వారి శైలికి భిన్నంగా అనిపించకుండా ఉండేలా మధురవాణినవలని పూర్తి చేయడంలో ఎటువంటి జాగ్రతలు తీసుకున్నారు?

జ: చారిత్రక నవలలు రాసిన ప్రముఖులలో విశ్వనాథ సత్యనారాయణ గారు, అడివి బాపిరాజు గారు, నోరి నరసింహ శాస్త్రి గారు, తరువాత ముదిగొండ శివప్రసాద్ గారు ముఖ్యలు. ప్రొఫెసర్ శివప్రసాద్ గారు అంటారు విశ్వనాథ వారి చారిత్రక నాటకాలలో చరిత్ర 20 పాళ్ళు, నోరి వారి నవలల్లో 30 పాళ్ళు అడివి బాపిరాజు గారి నవలల్లో చరిత్ర 80 పాళ్ళు. నేను చేపట్టింది అడివి బాపిరాజు గారి నవల కాబట్టి ‘మధురవాణి’ నవల లో కూడా చరిత్ర 80 పాళ్లు ఉంటుంది.

ప్రశ్న 10. మధురవాణినవలని పూర్తి చేయడంలో మీకేమయినా ఇబ్బందులు ఎదురయ్యాయా? అప్పటి మీ అనుభవాలు, అనుభూతులను వివరించండి.

జ: ఆంధ్రభూమి ఆదివారం ప్రత్యేక సంచికలో సీరియల్‌గా రావడం మొదలు పెట్టింది. చాలా పెద్ద పెద్ద బొమ్మలు, రాచరికపు ఠీవితో ప్రత్యేక సంచిక ఆకర్షణీయంగా ఉండేది. నాకు గుర్తున్నంతవరకు పత్రికలు ఆదివారం ప్రత్యేకంగా ఉండేలాగా అప్పుడే ప్రారంభమైంది. తర్వాత అన్ని పత్రికలు ఒకే ప్రత్యేక సైజులు వచ్చేవి. నేను సీరియల్‌ని నాలుగు వారాలకు సరిపడా ఒకసారి పంపేదాన్ని.

అడివి బాపిరాజు గారు పూర్తిగా నవలని రాశారో లేదో తెలీదుగానీ నాకు మాత్రం వారి కుమార్తె మొదలు లేని చివరలేని మధ్యభాగం మాత్రం ఇచ్చారు. వారం వారం ఎడిటర్ గారు బాపిరాజు గారు ఎక్కడ వరకు రచించారు, శ్యామలాదేవి ఎక్కడ నుంచి నుంచి రచించారు చెప్పుకోండి చూద్దాం అని ప్రకటిస్తూ ఉండేవారు. పాఠకుల నుండి సరైన సమాధానం వచ్చినట్టుగా లేదు.

నవలలో గోవింద దీక్షితులు అనే మంత్రి పాత్ర ఉన్నది. అది చాలా గంభీరమైన కీలకమైన పాత్ర. ఇది రచించేటప్పుడు నాకు శంకరాభరణం సోమయాజులు గారు గుర్తుకు వచ్చేవారు. అలాగే పూర్తి అయిపోయింది నవల. ఒక అయిదు ఆరు సంవత్సరాల తర్వాత ఆకాశవాణి వారు దీనిని నాటకంగా సంభాషణలు రచించమని నాకు చెప్పారు. రాసి ఇచ్చాను. రికార్డింగ్ టైమ్‌కి నన్ను పిలిచారు, వెళ్ళగానే స్టూడియో గుమ్మం దగ్గరే శంకరాభరణం శంకర శాస్త్రి గారు ప్రత్యక్షం. విపరీతంగా ఆశ్చర్యపోయాను. దీనినే మానిఫెస్టేషన్ అంటారట. గోవింద దీక్షితులు దిగివచ్చినట్టుగా ఎంతో అద్భుతంగా మధురవాణి నాటకం రేడియోలో తీర్చి దిద్దుకుంది.

అటు బాపిరాజు గారి ‘మధురవాణి’, ఇటు విశ్వనాథ సత్యనారాయణ గారి ‘వేయి పడగలు’ రెండిటికి సంభాషణలు రాయడం అనే అదృష్టం నాకు దక్కింది. ఈ రెండు నాటకాలు ఆకాశవాణి వారు archives లో పెట్టారు.

ప్రశ్న 11. విశ్వనాథ సాహిత్యంలో స్త్రీ పాత్రలుఅనే పరిశోధనాంశంతో పిహెచ్‌డి చేశారు కదా! మీ గైడ్ ఎవరు? మీ థీసిస్ ప్రత్యేకత ఏమిటి?

జ: ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ప్రొఫెసర్ డాక్టర్ చిలుకూరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నా పరిశోధన వ్యాసంగానికి మార్గదర్శకత్వం వహించారు. విశ్వనాథ సత్యనారాయణ గారి 60 నవలల్లో ముఖ్య స్త్రీ పాత్ర చిత్రణ పై పరిశోధించవలసిందిగా వారు సూచించారు. అప్పుడు జడ్జిగా పనిచేస్తున్న మా వారికి వైజాగ్ నుండి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపూర్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వడం వల్ల భీమవరం కాలేజీలో తెలుగు డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కలిదిండి వెంకటరామరాజు గారు నా పరిశోధన కొనసాగించేందుకు మార్గదర్శకత్వం వహించారు.

ప్రశ్న 12. విశ్వనాథ సాహిత్యంలో మీకు బాగా నచ్చిన స్త్రీ పాత్ర ఏది? ఎందుకని?

జ: విశ్వనాథ వారి నవలలో నాకు నచ్చిన స్త్రీ పాత్ర స్త్రీ పాత్రే. స్త్రీ ని వారు అద్భుతంగా గౌరవనీయంగా మలచారు. తీర్చిదిద్దినట్లు కథలో ఆమె స్థాయికి తగ్గట్టు నిర్దుష్టంగా ప్రవర్తిస్తుంది. వ్యర్థమైన పోకడలు పోదు. అలాగా స్త్రీని చాలా చక్కగా ఆయన రూపు దిద్దారు.

ప్రశ్న 13. మీ నవల రాజహంసని గురించి చెప్తూ, “మనం మరిచిపోయిన మరో మొహంజోదారో ఇది” అని వ్యాఖ్యానించారు ప్రొ. ముదిగొండ శివప్రసాద్‌ గారు. దీనిపై మీ అభిప్రాయం?

జ: రాజహంస నవలను రచించేందుకు కాలం ఎక్కువ పట్టింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ నవల నా లోపలి ప్రపంచం. నా అంతరంగ రంగధామం. నా అనుభవాల మాలిక. నా భావాంబర డోలిక. అదొక శాంతిసముద్రం. హింసలు, రక్తపాతాలు, కుట్రలు, కుళ్ళు, మోసాలు, ద్రోహాలు, అన్యాయాలు సహించని హిమసరోవరం.

నవలలో నేను పట్టు పట్టి పాత్రలను తీర్చిదిద్దలేదు. అలవోకగా పటాటోపం లేకుండా చటుక్కన వచ్చి చక్కగా నవలలో కొలువైనాయి. అక్షరాల బొమ్మలు మనుషులుగా వచ్చాయి. మనుషులు అన్నవారు ఇలాగే ప్రవర్తించాలి అనే నా తపన ఈ నా రచనలో అడుగడుగునా కనిపిస్తుంది. పల్లెటూర్లలో వారి అమాయకత్వం నా పల్లెటూరి అనుభవమే.

నవలకి ముందుమాట రాసిన డాక్టర్ ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారు ఈ నవల మరో మొహంజోదారో అన్నారు. ఈ నవలకి మొహంజోదారోకి ఎందుకు ముడిపెట్టారో గాని నాకు మాత్రం అనిపిస్తుంది – మరిచిపోతున్న మానవత్వం గ్రామవాసులలో ఇంకా నిలిచి ఉండడాన్ని ప్రేమను ఆప్యాయతలను పంచుకుంటూ ఉండడానికి విశ్వ కౌటుంబిక మమతలను సహానుభూతుల్ని మరల మనం గుర్తు తెచ్చుకోవాల్సిందని వారు హెచ్చరిస్తున్నారేమో.

అవి శిధిల జ్ఞాపకాలు. కట్టడాలు నూతులు చెరువులు వంట పాత్రలు మొదలైన జ్ఞాపకాలతో నిశ్చల సంస్కృతిని వెల్లడిస్తుంటే రాజహంస కదిలే వ్యక్తులు స్పందించే హృదయాలు సజీవ సంబంధ బాంధవ్యాల మధురిమలు ఉదాహరణలుగా ఉండడం వల్ల ఇలా రాశారేమోనని అనిపిస్తుంది.

వారు ఇంకొక మాట కూడా రాశారు “ఇది సంపూర్ణ నవలా పరిచయం కాదు యోగ్యతా పత్రం వంటి నా ఆనందానుభూతి” మాత్రమే అని.

ప్రశ్న 14. జాగృతి వారపత్రికతో మీ అనుబంధం గురించి వివరిస్తారా?

జ: మావారు దిట్టకవి దత్తాత్రేయులు గారు ఏడు సంవత్సరాలు గుడివాడలో అడ్వకేట్‌గా పనిచేశారు. అప్పుడు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ తోను, విశ్వహిందూ పరిషత్తు, భారత వికాస్ పరిషత్తు, రోటరీ క్లబ్, వంటి కొన్ని సంస్థలతో అనుబంధం ఉండేది. జాగృతి కూడా ఇందులో భాగమే కనుక పెద్దలతో పరిచయం ఉండేది. మా వారి జీవితమే నా జీవితం. వారి పరిచయాలు వారి స్నేహితులు వారి అనుబంధాలే నావి కూడా. కృష్ణా పత్రిక జాగృతి వంటి పత్రికలలో వ్యాసాలు రాస్తూ ఉండేదాన్ని. మహిళా జాగృతిలో ఒక ఐదు సంవత్సరాలపాటు సామాజిక వ్యాసాలు రాశాను.

మనవరాలు అద్వైత మహిమ, కోడలు సంధ్యలతో రచయిత్రి

ప్రశ్న 15. సాహితీపరంగా మీకు లభించిన పురస్కారాలు, బహుమతుల వివరంగా చెప్పండి.

జ: నాకు ఏమి బహుమతులు, ఎవార్డులు వచ్చాయి అని అడిగారు. పాఠకుల అభిమానాలు, ఆశీస్సులే నాకు బహుమతులు.

మనవరాలు అపరాజిత మెడికల్ గ్రాడ్యుయేషన్ సందర్భంలో

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు డా. దిట్టకవి శ్యామలాదేవి గారూ.

డా. దిట్టకవి శ్యామలాదేవి: సంచిక పత్రికకు సంపాదకులకు, పాఠకులకు, ప్రశ్నించిన మీకు నా ధన్యవాదాలు. నాకు మీతో ప్రసంగించడం అనే గొప్ప అనుభూతిని మిగిల్చారు. పునః ధన్యవాదాలు.

Exit mobile version