

ఉపన్యసిస్తున్న శ్రీ సరసి
పాత తరం పాఠకులకు కార్టూనిస్టు అనగానే ముందు చటుక్కున గుర్తుకువచ్చేది శ్రీ ‘బాపు’. అయితే అలాంటి బాపుగారు మెచ్చిన, ఆయనకు నచ్చిన కార్టూనిస్టు, ప్రస్తుతం అందరికి తెలిసిన కార్టూనిస్టు శ్రీ ‘సరసి’. దీనిని బట్టి సరసి అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. అంతమాత్రమే కాదు, శ్రీ బాపు – రమణలకు ఎంతో ఇష్టమైన రచయిత/కార్టూనిస్టు ఆయన. సరసి వందల సంఖ్యతో కథలు (ముఖ్యంగా హాస్యకథలు) రాసినా, కార్టూనిస్టుగానే ప్రసిద్ధులు (కార్టూనులు వేలసంఖ్యలో ఉంటాయి లెండి). ‘నేటివిటీ’కి నిలువెత్తు సాక్ష్యాలు వీరి కార్టూన్లు. అందుకే అన్ని వర్గాల ప్రజలు వీరి కార్టూన్లని అమితంగా ఇష్టపడతారు.
సరసి గారు మంచి చిత్రకారులు కూడా. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు వెళ్లి చూస్తే ఆయన చిత్రకళా నైపుణ్యం ఎలాంటిదో అర్థమవుతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఆయన మాటల్లోనే సరసి గారి గురించి మరన్ని విషయాలు చదువుదామా…
~ ~
1) సరసి గారూ మీ కార్టూన్లు మాదిరిగానే, కథలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఆలాగే మీ కలం (కుంచె )పేరు కూడా దీనికి అతీతం కాదు.‘సరసి‘ అని పేరు పెట్టుకోవడం వెనుక ఏదైనా కథ వుందా? మీ అసలు పేరు చెప్పండి?
♣ ‘నేములో నేమున్నదీ?’ అన్నారొక పెద్దాయన. నా అసలు పేరు సరస్వతుల రామ నరసింహం. అయితే కార్టూనులో ఓ చివర పేరు రాయడానికి ఇది బాగా పెద్దది అవుతుందని మా డ్రాయింగ్ మేష్టారు తమ్మా సత్యనారాయణ గారు నా పేరులో మూడు అక్షరాలను తీసుకుని ‘సరసి’ అని రెండోసారి బారసాల చేసారు.


సరసిగారి కుటుంబం
2) కథకుడిగా ముందు రంగప్రవేశం చేశారా? కార్టూనిస్టుగానా? ఎప్పుడు? ఎలా?
♣ మా గురువు గారి శిష్యరికంలో ముందు బొమ్మలే నేర్చుకున్నా. ఎనిమిదవ తరగతిలో ఒక కథ రాసాను. అయితే బాపు గారి కార్టూన్లు, బొమ్మలు ఎంతో ప్రభావితం చేసాయి. పదవ తరగతిలో ఒక పేజీ కార్టూన్లు వేసి పత్రికకి పంపితే అవి తిరిగి వచ్చాయి.


ఉగాది పురస్కారం
3) మీరు కార్టూనిస్టుగా ఎదగడం వెనుక నేపథ్యం చెప్పండి?
♣ మా ఇంట్లో ఎప్పుడూ హాస్యభరిత వాతావరణం ఉండేది. మా నాన్నగారు వ్యవసాయదారులు. మా వూరి సర్పంచ్‌గా రెండు పర్యాయాలు చేసారు. అయన ఎప్పుడూ ఇంట్లో పిల్లలతో సరదాగా ఉండేవారు. నవ్వించే విద్య అయన పెట్టిన భిక్షే. దరిమిలా బాపు గారి కార్టూన్లలో ‘నేటివిటీ’కి ఆకర్షితుడయ్యాను. ఆయనే నా కార్టూన్లకి ప్రేరణ. అయితే సంప్రదాయమైన చిత్రకళ, కథలకు కావలసిన కల్పనా చాతుర్యం నా గురువు తమ్మా సత్యనారాయణ గారి చలవే.
4) మీ మొదటి కార్టూను ఎప్పుడు, ఏ పత్రికలో ప్రచురింపబడింది.అప్పటి మీ అనుభూతిని వివరించండి?
♣ అయితే ఇరవై ఏళ్ల వయసులో 1976లో మొదటి కార్టూను ప్రచురణ జరిగింది ‘అపరాధ పరిశోధన’ అనే డిటెక్టివ్ పత్రికలో. అప్పటి నుంచి అటు కార్టూన్లు, ఇటు కథలు రెండూ ప్రయాణం ప్రారంభించాయి. అయితే ఎక్కువగా కార్టూన్లే.


జీవిత సాఫల్య పురస్కారం
5) మీకు నచ్చిన కార్టూనిస్టు, కథా రచయిత ఎవరు? ఎందుచేత?
♣ నిస్సందేహంగా నచ్చిన కార్టూనిస్టు బాపు గారే. తర్వాత చాలా మంది. కథా రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారు. ఆయన తరవాత చాలా మంది.


బాపు-రమణ పురస్కారం
6) ‘సరసి‘ అంటే నాకు ముందు గుర్తుకువచ్చేది మీ కార్టూను, తరువాతే కథ. ఈ రెండు ప్రక్రియలలో ప్రజాదరణ పొందిన మీ ప్రక్రియ ఏది? ఎందుచేత?
♣ నేను కార్టూనిస్టుగానే ఎక్కువ మందికి పరిచయం. సుమారు నాలుగు వందల కథలు రాసినా నన్ను కార్టూనిస్టు అనే పిలుస్తున్నారు.


సరసి కార్టూన్ (1)
7) జోక్ – కార్టూనుల మద్య తేడాయేమిటి? కార్టూన్లు వేసేవాళ్ళు, జోకులు రాయలేరా? ఈ రెండు ప్రక్రియలలో, ఏది పాఠకుడిని అమితంగా ఆకర్షిస్తుంది?ఎందుచేత?
♣ వ్యాఖ్య, బొమ్మ రెండూ కలిపి పూర్తి అర్థాన్ని ఇస్తేనే అది కార్టూను అవుతుంది. కేవలం వ్యాఖ్య ద్వారానే పూర్తి ప్రయోజనం సిద్ధించిపోతే అది జోక్ అవుతుంది. కార్టూన్లు వేసేవాళ్ళు జోక్స్ కూడా రాయగలరు. అయితే బొమ్మలు వేసే విద్య వచ్చు కాబట్టి జోక్‌ని కార్టూనుగా మలిచి వెయ్యడానికే మొగ్గు చూపుతారు. కార్టూను అనేది దృశ్య మాధ్యమం. ఎక్కువమంది కళ్ళలో పడేది కార్టూనే.


సరసి కార్టూన్ (2)
8) మీ వృత్తి ఎంతో బాధ్యతాయుతమైనది. ప్రవృత్తితో ప్రజాదరణ పొందడానికి మీరు సమయాన్ని ఎలా సర్దుబాటు చేసుకున్నారు?
♣ తెలుగు రాష్ట్రాలు రెండూ కలిసి ఉన్న రోజుల్లో నేను రాష్ట్ర శాసన సభలో సహాయ కార్యదర్శి (గెజిటెడ్) గా పని చేసి పదవీ విరమణ చేసాను. వృత్తిలో ఎంత ఒత్తిడి ఉన్నా సాయంత్రం ఇంటికి రాగానే నా అసలు జీవితం ప్రారంభం అవుతుంది.
9) ఆఫీసుపరంగా వృత్తితో, ప్రవృత్తి పరంగా ఇంట్లో, ఎప్పుడూ బిజీగావుండే మీరు, కుటుంబానికి సమయం ఎలా కేటాయించ గలిగారు? మీ జీవన శైలిపై, కుటుంబ సభ్యుల స్పందన ఎలా ఉండేది?
♣ నా వృత్తిలో ఉండే ఒత్తిళ్ళు, నా అభిరుచుల్లో ఉండే రుచులు మా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకున్నారు. అందువల్ల నాకెప్పుడూ ఇబ్బంది రాలేదు. నా ఎదుగుదల వాళ్ళకి కూడా ఆనందమే కదా.
10) బాపు గారు అంతటి వారు మీ ‘అబిమాని‘నని చెప్పుకున్నారు. బాపు – రమణలతో మీ అనుబంధం ఎలాంటిది?
♣ నాలుగు మాటల్లో చెప్పేది కాదిది. 1998వ సంవత్సరంలో బాపు గారు ఆంధ్రప్రభ ఉప సంపాదకులు శ్రీ రమణ గారికి లేఖ రాస్తూ ‘మీ పత్రికలో సరసి (అనే అతను/ఆమె) వేస్తున్న కార్టూన్లు ఎంతో బావుంటున్నాయి. తెలుగు కార్టూనిస్టులలో ఆ మాత్రం తెలివైన వారిని నేను చూడలేదు’ అని రాసారు. వారు ఆ లేఖను నాకు పంపేరు. బాపు గారితో నాకు అపుడు పరిచయం లేదు. నేను ఆడో మగో కూడా ఆయనకు తెలియదు.


బాపు గారి తో…సరసి
2004వ సంవత్సరంలో నేను నా మొదటి కార్టూను పుస్తకానికి వారిని ముఖ చిత్రం వెయ్యమని అభ్యర్ధిస్తే, ఒకటి వేసిచ్చి, అది కాదు మరొకటి, మరొకటి అంటూ మొత్తం 5 బొమ్మలు వేసిచ్చారు. అన్నీ అద్భుతంగా ఉన్నాయి. తరువాత ఆయనతో అనుబంధం పెరిగిపోయింది. నా కార్టూన్ల గురించి గొప్పగా ఎంతో మందికి నా పరోక్షంలో చెప్పి నా స్థాయి పెంచేశారు. ఎంతోమంది పెద్దవాళ్ళు, ఉన్నత స్థానాలలో ఉన్నవాళ్ళు అప్పటి నుంచి నా కార్టూన్లు చూసి, నాకు అభిమానులయ్యారు. ‘మీరు మా అబ్బాయి లాంటివారు’ అనేవారు బాపు గారు. జీవితంలో అంతకన్నా ఇంకేమి కావాలి? అలాగే రమణ గారు కూడా. ఒక మంచి కార్టూను పత్రికలో కనిపిస్తే చాలు వెంటనే బాపు గారి నుంచి ఫోను వస్తుంది. నన్నే కాదు ఏ కార్టూనిస్టు మంచి కార్టూను వేసినా వారి చిరునామాయో, ఫోను నంబరునో సంపాదించి అభినందించే గొప్ప గుణం బాపు గారిది.
బాపు, రమణలతో ఎన్నో మంచి అనుభవాలున్నాయి. అవన్నీ చెప్పడానికి స్థలం చాలదు.
11) మీరు ‘గొప్పచిత్రకారులు‘ అని కూడా చెబుతారు. మీ చిత్రకళ గురించి వివరించండి?
♣ గొప్ప చిత్రకారుడిని కాదు. చాలా నేర్చుకోవలసింది ఉంది. చిన్నపుడు డ్రాయింగ్ మాష్టారు నేర్పిన విద్యే ఇప్పటికీ.
రాష్ట్ర శాసనసభలో నేను వేసిన అంబేద్కర్, పొట్టి శ్రీరాములు, కాసు బ్రహ్మానంద రెడ్డి గార్ల నిలువెత్తు తైలవర్ణ చిత్రాలను అప్పటి ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు ఆవిష్కరించి సన్మానించడం మరిచిపోలేని అనుభవాలు. స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాద రావు గారి చిత్రం కూడా వేసాను.


సరసిగారి కొన్ని పుస్తకాలు
12) మీ అవార్డులు, సన్మానాల గురించి వివరించండి?
♣ చాలా చెప్పాలి. ముఖ్యంగా చెప్పేవి – కార్టూన్లకి 4 అంతర్జాతీయ అవార్డులు, 2 జాతీయ అవార్డులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం, బాపు రమణ అకాడమీ వారి బాపు అవార్డు. అలాగే కార్టూన్లకి, కథలకి చాలా బహుమతులు, పురస్కారాలు లభించాయి.
వీటితో బాటు 8 కార్టూన్ల సంకలనాలని, ఒక మినీ కథల సంపుటినీ విడుదల చేసాను. వీటికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, బాపు గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, రావి కొండల రావు గారు, తనికెళ్ళ భరణి, డా. గురవారెడ్డి గారు ఇంకా మరికొందరు ప్రముఖుల ఆశీస్సులు, ముందు మాటలతో ఈ పుస్తకాలు విడుదల అయ్యాయి (అవి కావలసినవారు నా ఫోన్ నెం. 9440542950లో సంప్రదించండి. పోస్టు ఖర్చులు నేనే భరించి సరసమైన ధరలకు అందిస్తాను).


సరసి గారితో రచయిత
♣ ఈ ఇంటర్వ్యూ కారణభూతులైన మీకు (డాక్టర్ కె ఎల్వీ ప్రసాద్ గారికి) ప్రత్యేక ధన్యవాదాలు.

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
24 Comments
Sagar
నిర్మొహమాటంగా ఒకమాట చెప్పాలంటే బాపు గారు చెప్పినట్లు నేను కూడ సరసి గారు మహిళా, పురుషుడా అని డో లాయమానంలో పడ్డాను. తరువాత నవ్య పుస్తకంలో వారి కార్టూన్లతో వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. అయితే ఒకానొక సందర్భంలో గురువు గారు డా!! కెఎల్వీ సర్ చెప్పేవరకు సరసి గారు రచనలు కూడ చేస్తారని నాకు తెలియదు. ఆనంద మైన విషయం నేను బాపు రమణగార్లకు వీరాభిమానిని. అలాంటి వారి గురించి సరసి గారి ద్వారా వినడం మరింత సంతోషమయం. కొసమెరుపు ఏమిటంటే వారు ముఖపుస్తకంలో వేసే కార్టూన్లకు స్పందించే నాకు ఈ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు సరసి గారు పంపినప్పుడు ఆ ఆనందం వర్ణనాతీతం. అసలు నాకు రైలు ప్రయాణంలో గుర్తుకొచ్చేది సరసిగారే. అంతలా ఎదిగిపోయిన సరసిగారు మాటలలో మాత్రం ఎప్పుడూ ఒదిగే ఉంటారు అని చెప్పడంలో సందేహమే లేదు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. మరియు మంచి విషయములు తెలియచేసేలే ఇంటర్వూ అందించిన మా గురువు ప్రసాద్ సర్ కు నమస్సులు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
sarasi
‘నా ఇంటర్వ్యూ ఎందుకండీ’ అంటున్నా వినకుండా పట్టుబట్టి ఇలా నా విషయాలన్నీ నాచేత చెప్పించిన పట్టు వదలని మిత్ర విక్రమార్కులు ప్రసాద్ గారికి ధన్యవాదాలు. నా మాటలను చక్కగా వరసలో పేర్చి అందంగా కూర్చి వడ్డించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. నా కార్టూన్లలో సమకాలీన సమస్యలను, మధ్య తరగతి జీవితాలలోని ఇబ్బందులు, చమత్కారాలను ఎత్తి చూపుతూ అటు, ఇటూ బేలన్సు చేస్తూ వచ్చాను. ఇప్పటికి 45 సంవత్సరాలు అయింది కార్టూన్ల దారి పట్టి. రాసి కన్నా వాసికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. నా అభిరుచులను ప్రోత్సహించిన గురువులు, పాఠకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. డా. కె ఎల్ వి ప్రసాద్ గారి వంటి ఎందఱో ఉన్నత స్థాయి వ్యక్తులు నా ఈ చిన్న హాబీల వల్ల మంచి మిత్రులయ్యారు. జీవితం చాలా చిన్నది. సమస్యల కెరటాలను పక్కకి నెట్టి ఉన్నంతలో నవ్వుతూ, నవ్విస్తూ ఆనందిస్తూ, ఆనందపరుస్తూ బతుకు బండిని లాగేయ్యాలి. జీవితం పరమార్ధం ఆనందం, సేవ. సంచిక సంపాదక వర్గానికి ధన్యవాదాలు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
సరసి గారూ
మీ అమూల్యమైన సమయం కేటాయించడం
నా అదృష్టం. మీ సహృదయ స్పందనకు
ధన్యవాదాలండీ.
Bhujanga rao
శ్రీ బాపు గారు మెచ్చిన కార్టూనిస్ట్ శ్రీ ‘సరసి’గారిని డాక్టర్ ప్రసాద్ గారు ఇంటర్వూ చేసి,ఎన్నో తెలియని విషయాలు మాకు అందించారు. వారి పేరు సరస్వతుల రామనరసింహం గారని తెలిసింది సంతోషం సర్.కార్టూన్స్, ఏన్నొ కథలు మరియు హాస్యకథలు వ్రాసిన వారై,అంతర్జాతీయ,జాతీయ అవార్డులు పొందిన శ్రీ ‘సరసి’గారిని పరిచయం చేసిన డాక్టర్ ప్రసాద్ గారికి హృదయపూర్వక నమస్కారములు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
భుజంగరావు గారూ
మీస్పందనకు ధన్యవాదాలండీ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
చాలా మంచి ఇంటర్వ్యూ !!! ఒక వ్యక్తి లోని సమగ్రత్వాన్నీ , బహుముఖీన ప్రతిభనూ బహిర్గతం చేసిన చక్కని సంభాషణ …
‘ సరసి ‘ లోని అన్ని సృజన కోణాలను చూపిన తీరు మీరు వేసిన ప్రశ్నల వల్ల తెలిసింది , నిజంగానే ‘ సరసి ‘ పేరు చెప్పగానే కార్టూనిస్టు గానే ప్రసిద్ధి … వారు వందలాది కథలు రాసిన రచయితగా , గొప్ప చిత్రకారుడిగా తెలుసుకునే మంచి అవకాశం ఈ ఇంటర్వూ వల్ల తెలిసింది .. ఇది అందరికీ అందిన అదనపు సమాచారం …
మరో గొప్ప విశేషమేమిటంటే వీరు బాపు మెచ్చిన కార్టూనిస్టు గా తెలియటం … అదొక గొప్ప సర్టిఫికెట్టే … ఇంతకుమించి మరోకరి ప్రశంస అవసరమేలేదు … కార్టూన్లలో వ్యంగ్యం తో బాటు వేసిన రేఖల్లో ఆ భావ ప్రకటనను చూసిన వాడు గుర్తించి అనుభూతి చెందితేనే అది చక్కని కార్టూన్ అనాలి … ఆ శక్తి సరసి గారి కార్టూన్లలో కనిపిస్తుంది …
మన దేశం లోని ప్రసిద్ధ కార్టూనిస్టుల సరసన నిలబడగల చక్కని కార్టూనిస్ట్ అనేది నిస్సందేహంగా నిలిచే మాట …
ముళ్ళపూడి , బాపు ఇష్టపడటం అంటే తెలుగువాళ్ళందరూ మెచ్చినట్టే …
మంచి వివరాలు అందించారు … అభినందనలు సర్ !!!
—–గిరిజా మనోహర్ బాబు
హనంకొండ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
గురువు గారూ
మీ స్పందన బహు గొప్పగా వుంది.
మీకు ధన్యవాదాలండీ.
Jhansi koppisetty
సరసిగారు ఇంతవరకూ నాకు కార్టూనిస్ట్ గానే తెలుసు. వారి బహుముఖ ప్రావీణ్యతను వెల్లడి చేసిన మీ ఇంటర్వ్యూ వారిని గురించిన చాలా సమాచారాన్ని తెలిపింది. Good interview and you gave key information about him doctor garu… ఇరువురికీ నా హృదయపూర్వక అభినందనలు


డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
సరసి గారిని మీరు ఇంటర్వ్యూ చేసిన విధానం బాగుంది. నేను కూడా సరసి గారి అభిమానిని. మీకు అభినందనలు.
—–జి.శ్రీనివాసాచారి
కాజీపేట
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
Varigonda Kantha Rao
Arya
Interview chaala baagundi.
SARASI gaari bahumukheenatha telisivachhindi.
SARASI gaariki Haardika Abhinandanalu. KLV gariki Shubhakankshalu
Varigonda Kantha Rao
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మీస్పందనకు ధన్యవాదాలండీ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
నరసి గారిని నాకు పరిచయం చేసి నందుకు ధన్యవాదాలు సర్ .
—డా.డీ.సత్యనారాయణ
హైదరాబాద్.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
కాంతారావు గారూ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
డా క్టర్ గారూ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
జీవితంలో ఎదుటి వ్యక్తి పెదవులపై చిరునవ్వులు పూయించిన వారు చిరంజీవులు.చిత్రాలతో నవ్వులు పూయించి పరుగులు పెడుతున్న జీవనాన్ని సేదదీర్చె గొప్ప కళాకారులు శ్రీ సరసి గారిని గూర్చి ,వారి బహుముఖ ప్రజ్ఞను గూర్చి సవివరంగా మీ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకోవడం ఎంతో సంబరంగా ఉంది.వారి కార్టూన్ లు అంటే ఇష్టపడనివారు ఎవరూ ఉండరు వారిలో నేనూ ఉన్నాను.కార్టూన్ పితామహులు శ్రీ బాపూ గారి చేత వారి అబ్బాయి అనిపించుకొనేంత ప్రతిభ వారి సొంతం.ఇంత కన్నా ప్రతిభకు మరో గొప్ప గుర్తింపు లేదు. వారు సాధించిన అవార్డుల గూర్చి తెలుసుకున్నటుంటే ఎంతో గొప్ప విజయాలు గొప్ప స్ఫూర్తి దాయకంగా ఉన్నాయి.వారి గురువు గారి పట్ల వారి వినయం ,ఇంకా నేర్చుకోవాల్సి ఉంది అన్న వారి వ్యక్తిత్వం కు నమస్కారాలు.ఎంత ఎదిగిన ఒదిగి ఉండడం అంటే ఇదేనేమో.చాలా చక్కటి విషయాలను మంచి ప్రశ్నల ద్వారా రాబట్టి వారి అభిమానులం అయిన మా అందరినీ ఆనంద పరిచిన మీకు,వారి విజయ పధాన్ని మా అందరికీ నిర్మలంగా చూపినందుకు శ్రీ సరసి గారికి శుభాభివాదాలు.



—–నాగజ్యోతి శేఖర్
కాకినాడ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
Shyam
సరస్వతుల రామ నరసింహం గారికి మా యొక్క అభినందనలు. మీరు ఎంచుకున్న నవల రచనలు మరియు వ్యంగ్య చిత్రాల కళ అభివృద్ధి అన్నది చాలా కష్టమైన పని. ఒక కథ కాని నవలను కానీ ఆస్వాదించాలంటే పూర్తిగా చదవడానికి కొంత సమయం పడుతుంది. అదే కార్టూన్ విషయానికి వచ్చేటప్పటికీ కొద్ది సెకన్ల సమయం లో విషయం అర్థం అయిపోయి ఆనందించ వచ్చు . రచయిత చెప్పదలుచుకున్న విషయం ఎంత పెద్దదైనా సరే సరళమైన రేఖలు మరియు చిన్న పాటి కామెంట్ తో పూర్తి చేయవచ్చు. ఇక్కడే కార్టూనిస్ట్ లేదా రచయిత యొక్క గొప్పతనం తెలిసిపోతుంది. సరసి గారి కార్టూన్స్ చూసినప్పుడు ఒక విషయం అర్థమవుతుంది అదేమిటంటే చెప్పదలుచుకున్న విషయం దాని మర్మం అంతేకాకుండా దాన్ని చూసినప్పుడు వచ్చే హాస్యం కూడా మిళితమై ఉండటం మూలాన ఆయనకు పాఠకాదరణ పెరిగింది. ఇందులో సరసి గారు చేరుకున్న ఉన్నతమైన శిఖరాలు ఒక్కరోజుతో వచ్చినవి కావు.,. ఒక జీవిత కాలపు సాఫల్యము. ఈ విషయము మా లాంటి వారు తెలుసుకోవడానికి సహకరించిన మరియు ఇంటర్వ్యూ చేసిన డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారికి మా యొక్క అభినందనలు కృతజ్ఞతలు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
నవలలు కాదుమిత్రమా
కథలు.నీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు.
శీలా సుభద్రా దేవి
అశ్లీలత కి తావు ఇవ్వకుండా స్వచ్ఛమైన కార్టూన్లు సరసిగారివి.మనమీదేనర్రోయ్ అని నిద్రలో వేసిన కార్టూన్లు ప్రతీది మనింట్లో నో, పక్కింట్లోనో,రైల్లోనో ఎక్కడో ఒకచోట ఎదురైనట్లు చాలా వరకూ మనల్ని మనం తడుము కునేలా ఉంటాయ్.వారి కథలు కూడా సున్నితమైన హాస్యం తో పెదాలమీద చిరునవ్వు పూయిస్తాయి.సరసిగారి అంతరంగాన్ని ఆవిష్కరించిన మీకూ,సరసిగారికీ మనఃపూర్వక అభినందనలు ప్రసాద్ గారూ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మేడం
మీ సహృదయ స్పందన కు ధన్యవాదాలు