పిల్లలూ, మీకు బొమ్మలంటే చాలా ఇష్టం కదా. కొందరికి బొమ్మలు చెయ్యటం కూడా సరదా. బొమ్మలు అనేక రకాల పదార్థాలతో తయారు చేస్తారని మీకు తెలుసు కదా? మీ ఇంట్లో ఏ వస్తువైనా పగిలినప్పుడు ఏం చేస్తారు? పనికి రావని తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేస్తారు. అలా పడేసే వాటిని కూడా బొమ్మలు చెయ్యటానికి ఉపయోగించవచ్చని మీకు తెలుసా? అలా చేసి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒకరి గురించి ఇప్పుడు చెప్తాను.
ఆయన పేరు నేక్ చంద్. ఆయన చేసిన పనేమిటో తెలుసా? 12 ఎకరాల స్ధలంలో చక్కని రాతి బొమ్మల పార్కు ఏర్పాటు చెయ్యటం. ఇది చండీఘర్‌లో సుఖ్నా సరస్సు పక్కన వున్నది. నేక్ చంద్ ఈ ఉద్యానవనాన్ని 1957లో మొదలుపెట్టి 18 ఏళ్లపాటు కృషి చేసి దేశంలోనే ప్రత్యేక ఉద్యానవనంగా తీర్చిదిద్దాడు. దీనికి ఆయన ఎంత కష్టపడ్డారో తెలుసా!? ఈ స్ధలం ప్రభుత్వ స్ధలం. ఇళ్ళల్లోని, పరిశ్రమలలోని వ్యర్థ పదార్ధాలని పడేసే ప్రదేశం. ఇది ఎవరూ స్వంత పనులకి ఉపయోగించకూడదు. నేక్ చంద్ ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖలో రోడ్ ఇనస్పెక్టర్‌గా పని చేసేవాడు. ఆయన ఖాళీ సమయాలలో శివాలిక్ పర్వత చరియల్లో తిరుగుతూ పక్షులు, జంతువులు వగైరా అనేక ఆకారాలలో వుండే రాళ్ళని సేకరించేవాడు. అలాగే ఇళ్ళనుంచీ, పరిశ్రమలనుంచీ వచ్చే పనికిరాని గాజు, పింగాణీ, ఎలక్ట్రికల్ వస్తువులను సేకరించాడు. వాటన్నింటినీ ఆయన తన సైకిల్ మీదే తెచ్చేవాడు. ఆ ప్రదేశంలో చెత్త పడేసేవారు కనుక దానినుంచి కూడా సేకరించిన వ్యర్థ పదార్ధాలతోనే ఈ బొమ్మలన్నీ తయారు చేశాడు. మొదట్లో ఆయన ఒక్కడే కష్టపడి పదార్థాలని సేకరించటం, బొమ్మలు చెయ్యటం చేసేవాడు. తర్వాత కొందరి సహాయం తీసుకున్నాడు. మొదట ఏడేళ్ళ ఆయన ఇలాంటి పదార్ధాలన్నీ పోగు చెయ్యటానికే సరిపోయింది. వాటితో 20,000 పైన బొమ్మలు తయారు చేశాడు ఎవరికీ తెలియకుండా. ఆయన రాత్రిళ్ళు పని చేసేవాడు. అది ప్రభుత్వ స్ధలం కనుక వారి అనుమతి లేకుండా అక్కడ ఏమీ చెయ్యకూడదు మరి.
1973లో ప్రభుత్వానికి చెందిన డా. శర్మ అనే యాంటీ మలేరియల్ స్క్వాడ్‌కి సంబంధించిన ఒకాయన పని మీద ఆ అడవికి వచ్చి అక్కడ వున్న ఈ పార్కును చూసి చండీగర్ లేండ్ స్కేప్ ఎడ్వైజరీ కమిటీకి తెలియజేస్తూ, ఈ అసాధరణమైన పార్కును సంరక్షించాలని తెలియజేశారు. ప్రభుత్వం ముందు ఒప్పుకోలేదు. కానీ దీనిని చూసిన ప్రజల పట్టుదల వల్ల ప్రభుత్వం ఒప్పుకోవాల్సి రావటమేగాక, ఈ పార్కును 40 ఎకరాల దాకా విస్తరించటానికి అంగీకరించి, నేక్ చంద్‌ని పూర్తిగా ఆ పార్కు పురోభివృధ్ధికి సంబంధించిన అధికారిగా నియమించి, ఇంకా అనేక విధాల సహకారాన్ని అందించారు.
ఈ పార్కులో సంగీతకారులు, వాయిద్యాలు, స్కూలు పిల్లలు, కృత్రిమ జలపాతాలు, ముందేమున్నదో తెలియని సన్నని దోవలు.. ఎన్నో అందాలు చూపరులను ఆకర్షిస్తుంటాయి. 1983లో ఈ పార్కు పేరిట ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.
సందర్శన సమయాలు ఉదయం 9 గం. నుంచీ సాయంత్రం 7 గం. దాకా, చలికాలంలో సాయంకాలం 6గం. ల దాకా.
శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™