Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

53. సంభాషణం – కవి శ్రీ అక్షరం ప్రభాకర్ అంతరంగ ఆవిష్కరణ

[సంచిక కోసం కవి శ్రీ అక్షరం ప్రభాకర్ మానుకోట గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]

* సంచిక అంతర్జాల మాసపత్రిక పక్షాన రచయిత, కవి అక్షరం ప్రభాకర్ మానుకోట గారికి స్వాగతం. నమస్కారం.

అక్షరం ప్రభాకర్ మానుకోట:  తెలుగు అంతర్జాల పత్రిక ‘సంచిక’ సంపాదక మహాశయులకు, అలాగే నాలో ఉన్న తెలుగు భాష పట్ల జిజ్ఞాసను గమనించి పలువురికి పరిచయం చేయాలనే సత్సంకల్పానికి శ్రీకారం చుట్టిన ప్రముఖ రచయిత, విశ్లేషకులు, డాక్టర్. కె. ఎల్. వి. ప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్సులు.

~

ప్రశ్న1. అక్షరం ప్రభాకర్ గారూ మీ విద్యాభ్యాసం గురించి, దానికి అనుబంధమైన మాతృభాష గురించి వివరంగా చెప్పండి.

జ: ముందుగా.. నన్ను కనిపెంచిన నా.. కన్న తల్లిదండ్రులకు శిరస్సు వంచి వారి పాదపద్మములకు ప్రణవిల్లుతున్నాను.

మాది పూర్వం వరంగల్ జిల్లా మానుకోట తాలూకాలోని అమనగల్ గ్రామం. మా అమ్మగారి పేరు నాగెల్లి లక్ష్మమ్మ, నాన్నగారి పేరు నాగెల్లి హనుమంతు, నాకు ముగ్గురు అక్కలు, ముగ్గురు అన్నల తోడ మా ఇంట్లో చిన్నవాడిని నేనే. ఏడో సంతానం.

నా జననం 1976. మా ఊరిలోని ప్రాథమిక పాఠశాలలోనే నా ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్నాను. లోకంలోని అందరి పసిపిల్లల్లాగానే

నా బాల్యం కూడా గంపెడు ఆటలతో, పుట్టెడు పాటలతో, కొనసాగిందనే చెప్పాలి. మధ్య మధ్యలో నాన్నతో వ్యవసాయ పనిలో, అమ్మతో కూలి పనుల్లో సహకారిగా చిరుప్రాయంలో తప్పలేదు, ఆ మాటకొస్తే అమ్మానాన్నలతో పనిలో భాగం పంచుకోవడం తప్పు కానే కాదు.

ఇక ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న తర్వాత, మా నాన్నగారిని పై తరగతులకు మా ఊరు నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మానుకోట పట్టణానికి వెళ్లి చదువుకుంటానని అనుమతి అడిగాను. వారు ఖరాకండిగా కుదరదు అన్నారు, ఎందుకు అలా అన్నారని మా అమ్మ ద్వారా ఆరాతీస్తే, సమాధానం వింటే మీరు నవ్వుకుంటారు, అదేమంటే చదువుకు పెట్టుబడి పెట్టలేమనీ వారు మరో మారు తేల్చి చెప్పారు. చేసేదేమీ లేక వారం పది రోజులు ఇంట్లో బాధతో ఉంటే వారే చూడలేక దయతలిచి, చూడు చిన్నోడా… వెళ్ళు కానీ ఆ.. ఫీజు ఈ ఫీజు, అది కావాలి ఇది కావాలి అని ఒత్తిడి తెస్తే మాత్రం ఇంటికి వచ్చేయ్ అని ఘాటుగా చెప్పారు.. ఎందుకంటే ఆ రోజుల్లో మా ఊరు నుండి పది కిలోమీటర్లు వెళ్లి చదువుకున్న వాళ్ళు లేరనే చెప్పాలి. నేను మా ఊరు విడిచి పై తరగతుల కోసం పట్టణం వైపు అడుగులు వేసిన నాలుగు దశాబ్దాల కిందటి జ్ఞాపకాలు ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడూ ఆ సంగతులు ఏమి మీకు చెప్పకుండా చదువు పూర్తి చేశానని చెప్తే అది అసంబంధంగా ఉంటుంది. అంతేకాదు నా మనసుకు ఇబ్బందిగా కూడా ఉంటుంది అందుకే మనస్ఫూర్తిగా మీ అందరితో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మా ఇంటి క్లిష్ట పరిస్థితులు..మీకు విన్నవించుకున్నాను.

శ్రీ అక్షరం ప్రభాకర్ మరియు శ్రీమతి నాగెల్లి రోజా బాయి , కుమారులు (కుడి ప్రక్కన) చిరంజీవి నాగెల్లి త్రిలోక్, చిరంజీవి నాగెల్లి త్రివర్ణ్

ఎలాగైనా చదువుకోని తీరాలనే పట్టుదలతో ఇంటి నుండి బయలుదేరుతూ నా చదువు మీకు భారం కాదని సవినయంగా తెలియజేసి, మా ఊరుని విడిచి పట్టణం చేరుకున్నాను. పట్టణంలో నాకెవరూ తెలియదు కానీ మహనీయుడు యస్. ఆర్. శంకరన్ అనే కలెక్టర్ గారు సంక్షేమ హాస్టల్ లను పేద ప్రజల కోసం ఏర్పాటు చేయించుతున్నారని, ఎలాంటి ఆసరా లేని వాళ్లయినా చదువుకోవచ్చు అని ఒక మిత్రుడు చెప్పగా విని పట్టణములోని హాస్టల్ కు చేరుకున్నాను. ఆ హాస్టల్ వార్డెన్ గారి అనుమతితో హాస్టల్లో ఒకరోజు ఉన్నాను,

ఆ ఉన్న ఒక్క రోజుకే ఒకరిద్దరు మిత్రులు పరిచయమయ్యారు. ఆ మిత్రుల సహకారంతో హాస్టల్ కు అప్లికేషన్ పెట్టుకున్నాను. వారం, పది రోజుల తర్వాత నా పేరు హాస్టల్ విద్యార్థిగా నమోదయింది. ఇక్కడే నా జీవితానికి ఓ గొప్ప పునాది పడ్డదని చెప్పాలి. హాస్టల్, లేకుంటే నేనింత దూరం వచ్చే వాడిని కాదు, మీతో ఈ నాలుగు విషయాలు పంచుకునే శక్తిని పొందేవాడిని కాదు. అందుకే అమ్మానాన్నల్లాగా నన్ను కాపాడిన ఆ హాస్టల్ తల్లికి, అన్నం పెట్టి పాఠశాలకు సక్రమంగా వెళ్లి చదువుకునేలా ప్రోత్సహించిన హాస్టల్ నిర్వాహకులకు, మా వెన్నంటే ఉండి నన్ను నడిపించిన నా..స్నేహితులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులందరికి, అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పటికీ.. నా జీవితకాలమంతా రుణపడి ఉంటాను.

6వ నుండి 10వ తరగతి పూర్తి అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ లో చేరాను.. అటు చదువుతూనే ఒక మిత్రుని సహాయంతో వివేకవర్ధిని అనే ప్రైవేట్ పాఠశాలలో 150/- రూపాయల వేతనానికి ఉపాధ్యాయుడిగా చేరాను. కొంతకాలం పనిచేసిన తర్వాత కొంతమంది మిత్రులు పాఠశాలను మనమే సొంతంగా ప్రారంభిద్దామని చెప్పడంతో, నేను పుట్టిన గ్రామం అమనగల్లు లోనే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు “పల్లవి పబ్లిక్ స్కూల్” అనే పేరుతో మిత్రుల సహకారంతో ప్రారంభించాను. ఇక్కడ మీకో విషయం చెప్పాలి “పల్లవి” అని ఎందుకు పేరు పెట్టానంటే,

ప్రతి పాట.. పల్లవి తోనే ప్రాణం పోసుకుంటుంది. ఆ పల్లవి ప్రజల జీవనాడి అవుతుంది. ప్రతి పాటకు ప్రాణం పోసే పల్లవి ఎంత గొప్పదో అలాగే ప్రతి మనిషి జీవితానికి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలే ఎంతో ప్రాముఖ్యమైనవిగా భావించి “పల్లవి” అని పేరు నామకరణం చేశాను. అంతేకాదండోయ్… మా ఊరుకు ఆమడ దూరంలో ఉన్న చిన్న గూడూర్ అనే గ్రామంలో జన్మించిన దాశరథి సోదరులు ఒకరు మహాకవి “దాశరథి కృష్ణమాచార్య” మరియు వేదాలను ఉపనిషత్తులను అచ్చ తెలుగులోకి అనువదించిన అభినవ వాల్మీకి, అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్యు లు. ఆ ఇరువురి సోదరుల సాహిత్య ప్రభావం కాస్త మా మీద మెండుగా ఉండేది, దాశరథి కృష్ణమాచార్య గారు రాసిన

“ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణల మెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో
భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో”

ఈ పాట పల్లవి నన్ను అత్యంత ప్రభావితం చేసిన మొట్టమొదటి గేయమని నేను ఒప్పుకుంటాను ఎంతో గర్వంగా చెప్పుకుంటాను. ఈ పాట పల్లవి లోనే ఇంత లోతైన భావం నిండి ఉంటే మరి ఆ పాట సాహిత్యమంతా ఎలా ఉంటుందో ఊహించండి. అందుకే పాటలోని పల్లవికున్న ప్రాధాన్యత తెలిసినవాడిని కాబట్టే ఆ పేరు పెట్టుకున్నాము. ఆ రోజుల్లో దినపత్రికలో వచ్చిన సమాచారం ఆధారంగా విశ్వవిఖ్యాత గాన గంధర్వుడు ఎస్పీ బాలు సుబ్రహ్మణ్యం గారి కూతురు పేరు కూడా పల్లవి అని తెలుసుకొని, బాలు గారి మీద అభిమానంతో కూడా ఈ పేరు అనుకున్నాము.

క్షమించాలి విద్యాభ్యాసం అనగానే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నారు. అని మీకు అనుమాన రావచ్చు కానీ, చదువు అంటే చదువుతోపాటు ఇవన్నీ ఉన్నాయి. నేర్చుకుంటూ చదువుకున్నాము, చదువుకుంటూ నేర్చుకున్నాము. “వర్క్ ఈజ్ వర్షిప్” అని స్వామి వివేకానంద వారు అన్నట్టు, తరగతి తర్వాత తరగతి చదువుతూ సాఫీగా వెళ్లినటువంటి అక్షర ప్రయాణం నాది కాదు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కన్నీళ్లు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, పడుతూ లేస్తూ సాగిన ప్రయాణం, అందుకు ప్రధాన కారణము పేదరికమే.. ఆ పేదరికం వల్లనే నా చదువు ఆగిపోకూడదు అనే ఒక గట్టి విశ్వాసంతో ప్రయత్నం చేశాను, చేస్తూ వచ్చాను.

ఇకపోతే ఇంతకుముందు చెప్పుకున్నట్టే పని చేస్తూ నేర్చుకుంటూ నేర్చుకుంటూ పనిచేస్తూ పాఠాలు బోధిస్తూనే పాఠాలు నేర్చుకున్నాను. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దూరవిద్యలో డిగ్రీ, తెలుగు సాహిత్యం, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యలో ఎం.ఏ తెలుగు సాహిత్యం, అలాగే సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర కళాశాలలో తెలుగు పండిత శిక్షణ పూర్తి చేయడమే కాదు పేదరికం అనేది చదువు కోవాలనే ఆసక్తి ఉన్న ఏ విద్యార్థికి ఆటంకం కాదని ఉద్యోగం సంపాదించాను. చివరిగా నా విద్యాభ్యాసం అంతా కూడా తెలుగు మాతృభాషలోనే కొనసాగింది. ఆ రోజుల్లో ఆంగ్ల భాష ప్రభావం అంత లేదనే చెప్పుకోవాలి.

డాక్టర్ గారు ఒక చిన్నమాట. నేను మానుకోట పట్టణంలో ఆరో తరగతి చదవటానికి వచ్చిన కొత్తలో మా ఆరో తరగతి క్లాస్ మేడంగారు పరీక్ష ఫీజు పావలా(25 పైసలు) అడిగారు, మా ఊరు ఇక్కడ కాదు మేడం నేను హాస్టల్లో ఉంటాను అని చెప్పాను. అయితే వార్డెన్ ను అడిగి తీసుకురా, అని అన్నారు. చేసేదేం లేక సుమారు కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్లి మా వార్డెన్ సార్ ని అడిగాను. ఏందిరా.. హనుమంతు (మా నాన్నగారి పేరుతో) బడికి పోలేదా అన్నారు. సర్ పరీక్ష ఫీజు అడిగారు, అడుగుతే నేనేమీ చేయాలి రా ? నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? ఇంటికి పో అన్నారు. అమ్మో ఇంటికా! ఇంటికి పోలేను! బడికి పోకుండా ఉండలేను, అనుకుంటూ భయంతో హాస్టల్ లో ఓ మూలకు బిక్కు బిక్కు మంటూ పడుకున్నాను. జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంది, ఇంతలో మా వార్డెన్ వచ్చి ఏరా బడికి పోకుండా మూలుగుతూ పడుకుంటావా? లే.. బడికి పో.. అని కోపంగా వార్నింగ్ ఇచ్చారు. లేచి వణుకుతూ బడికి పోయాను, మా వ్యాయామ ఉపాధ్యాయులు గేటు దగ్గర ఎదురై ఎందుకు ఆలస్యమైంది అని చెప్పారు. జరిగిందంతా చెప్పాను అంతా విని మేడం దగ్గరికి వెళ్ళు అన్నాడు. నాకు భయమేసి వెళ్లలేదు. బయట నిల్చున్న నన్ను చూసి స్నేహితులు వచ్చి నా భుజం పై చేయి వేసి మాట్లాడుతుండగా నా ఒళ్ళు కాలిపోవడం గమనించి మేడమ్ దగ్గరికి తీసుకెళ్ళి జ్వరం విషయం చెప్పారు. అప్పుడు మేడమ్ చేసేదేముంది రా సర్కారు దవాఖానకు తీసుకపొండి అన్నది. నాతో పాటు ముగ్గురం హాస్టల్ పోయి, బుక్స్ అక్కడ పెట్టి, అక్కడి నుండి సర్కార్ దవాఖానకు సుమారు రెండు కిలోమీటర్ల పైనే కాళ్లకు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళాము. ఆస్పత్రిలో ఒకరు ఓపి చీటీ రాసి, డాక్టర్ గారు అక్కడ ఉన్నారు వెళ్ళి కలవండి. వెళ్లి కలవగానే మమ్మల్ని చాలా ఆప్యాయంగా పలకరించి మా సమస్యలు విని మందులు రాసి, ఇక్కడ తీసుకోండి అని చెప్పారు. మీకు ఎలాంటి ఆపద వచ్చిన నేను ఇక్కడే ఉంటాను నన్ను కలవండి అని ఓదార్పు ఇచ్చారు. ఆ మాట మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది.

ఆ డాక్టర్ ఎవరో కాదు వారే డాక్టర్. కె.ఎల్. వి. ప్రసాద్ గారు అంటే, మీ పరిచయం (నేను ఆరో తరగతి చదువుకునే రోజుల్లో) నాలుగు దశాబ్దాల పై మాటే. మీరు నన్ను గుర్తుపట్టకపోవచ్చు కానీ మిమ్మల్ని నేను గుర్తుపెట్టుకున్నాను.

ప్రశ్న 2. వృత్తిపరంగా మీరు తెలుగు భాషా బోధకులు కదా! ఈ వృత్తిని స్వీకరించడం వెనక నేపథ్యాన్ని వివరంగా చెప్పండి.

జ: మా అమ్మ నోటివెంట అవలీలగా జాలువారిన అచ్చ తెలుగు పాటలు, స్వచ్ఛమైన మాటలు, నేను తెలుగు భాష వైపు అడుగులు వేయడానికి ప్రధానమైన మొదటి కారణం, తల్లి ఒడే బిడ్డకు మొదటి పాఠశాల ఇది జగమెరిగిన సత్యం. ఆ సత్యమే నన్ను నడిపించింది. మా నాన్నగారు ఆ రోజుల్లోనే కాస్తో కూస్తో చదువుకున్న వ్యక్తి కావడం, అంతేకాకుండా వారి నోటి వెంట తెలుగు శతక పద్యాలు, నీతి మాటలు, నీతి వాక్యాలు, పౌరాణిక గాధల్లో ఉండే సందర్భోచితమైన పలుకులు, నన్ను ప్రభావితం చేసినవి. అంతే కాదు ఆయన క్రమశిక్షణ వ్యవహార శైలి, భాష పట్ల అభిరుచి కలిగించడానికి మేలు చేసింది. నాన్నగారి మాట కఠినంగా ఉన్నా, మనసు మాత్రం వెన్న, ఎందుకు అంటున్నాను అంటే, ఆయన ప్రతి మాటకు విలువ ఇచ్చేవారు, మాట ఔషధం అని భావించేవారు, మాట్లాడడం వస్తే పోట్లాడుకోవడం అసలే ఉండదని పదే పదే మా కుటుంబ సభ్యులతో సందర్భానుసారంగా చెప్పేవారు.

ఇక పోతే మూడో విషయం మాకు రెండో తరగతిలో బహుశా 2వ పాఠం అనుకుంటా, కామధేనువు కథ ఉండేది, ఆ కథ పేరు “ఆవు- పులి” కథ. ఆ కథను గురువుగారు బోధించి, వివరించిన తీరు నన్ను విశేషంగా ఆకట్టుకున్నది. మాట కోసం కట్టుబడ్డ ఆవు, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆ క్రూర మృగం వద్దకు వచ్చి, మాట ఇచ్చిన ప్రకారమే నేను నా బిడ్డకు పాలు ఇచ్చి వచ్చాను, ఇప్పుడు నన్ను తిని, నీ ఆకలి తీర్చుకోగలవని వేడుకుంటుంది. ఆ మాటలు విన్న క్రూర మృగము చివరికి కన్నీరు కార్చడం, ఈ కథ నా పసి హృదయం పైన చెరగని ముద్ర వేసింది. అంతేకాదు తెలుగు భాష స్ఫూర్తి నాలో కలిగించిన కవి కోకిల గుర్రం జాషువా గారి “గబ్బిలం” పద్యాలు “శిశువు” పద్యాలు, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి “పుష్పవిలాపం” పద్యాలు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి “ప్రకృతి” గీతాలు, అన్నమయ్య గారి భావాలు,పోతన పద్యాలు, వేమన పద్యాలు, సుమతి పద్యాలు, గురజాడ, గిడుగు, కందుకూరి, చిలకమర్తి,

రచనలు, ఇవన్నీ తెలుగు భాష వైపు తలెత్తి చూడడానికి భాషను ఒంటపట్టించుకోడానికి దోహద పడ్డాయి. పంచతంత్ర కథలు, చందమామ కథలు, బేతాళ విక్రమార్క కథలు, పరమానందయ్య కథలు, నా చదువుతోపాటు నేను అవగాహన చేసుకుంటూ పెరుగుతున్న దశలో మానుకోట పట్టణంలోని గ్రంథాలయాలలో లభించే వివిధ దిన, వార, మాస పత్రికలు, సాహిత్య ప్రముఖుల సంభాషణలు, ఇంటర్వ్యూలు, తెలుగు భాషను గాఢంగా ప్రేమించడానికి మూల ధాతువులు అయ్యాయని చెప్పవచ్చు. అంతేకాదు, నా వెన్ను తట్టిన కవి జ్ఞానపీఠ సినారె గారు, నా ఆరాధ్య కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచనలు తెలుసుకుంటూ భాష పట్ల అమితమైన ఆరాధన భావాన్ని పెంచుకున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే “వినే మనసుండాలి కానీ వీచే గాలి కూడా సంగీతమే, సాహిత్యమే ఔతుంది”. ఆ రోజుల్లో వచ్చిన సినిమాలు, సినిమా పాటలు, కళాకారులు పాడుతుంటే ఆనందించడం వల్ల ఆ సాహిత్యపు పరిమళపు సుగంధాలు, ఆ.. చమత్కారాలు, ఆ.. విరుపులు, ఆ.. మెరుపులు తెలుగు భాష పట్ల గౌరవం, భాష కున్న గొప్పతనం భాషలో ఉండిన తీయదనం అమ్మ చనుబాల లాగా హృదయానికి హత్తుకున్నదని మురిసిపోయేవాడిని, ఎప్పటికైనా “తెలుగు భాష సేవకుడి” గా ఉండాలని ఆశపడే వాడిని, భాష పట్ల నా అభిమానాన్ని ఏదో నేర్చుకోవాలనే నా ఆరాటాన్ని, నేను డిగ్రీ తెలుగు సాహిత్యం చదువుతున్న రోజుల్లో మా గురువుగారు గమనించి ప్రభాకర్ తెలుగు సాహిత్యం లో నీవు రాణించగలవు, డిగ్రీలో తెలుగు తో పాటు పీజీలో కూడా తెలుగు సాహిత్యం చదివి, పండిత శిక్షణ పొందితే, నువ్వు తెలుగు భాష సేవకుడిగా మంచి పేరు సంపాదిస్తావనీ, నీవు తప్పక సాధిస్తావనే నమ్మకం నాకు ఉందని వారు ఆశీర్వదించడం, నేను వారి నమ్మకాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేయడం వంటి విషయాలు తెలుగు భాష వైపు రావడానికి ముఖ్య కారణాలయ్యాయి.

నేను తెలుగు భాష గురించి ఇటీవల ఒక గేయం రాశాను. ఆ గేయంలోని పాదాలు “అమ్మ చను బాల రుణమెట్ల తీరునో! నా మాతృభాషను నేనెట్ల మరుతునో!” మరో తెలుగు గేయం “తెలుగు నేల తెలుగు మరువ నేల” ఈ మాటలు నేనే నిత్యం స్మరించుకోవటానికి రాసుకున్నాను..ఇక పోతే ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకోవడానికి ప్రధానమైన ఒక చిన్న సంఘటన నేను రెండో తరగతిలో ఉన్నప్పుడు జరిగింది. అది చెప్పవచ్చో! లేదో! తెలియదు గాని! నాకు.. చెప్పాలనే ఉంది. నాకు ప్రాథమిక విద్య బోధించే ఉపాధ్యాయుని ఇల్లు మా ఇంటికి కూతవేటు దూరంలో ఉండేది. వారు అప్పుడప్పుడు లక్ష్మీ.. అంటూ మా ఇంటి దగ్గరికి వచ్చి మా రాతి కొట్టం మీద పెరిగిన ఏవేవో కూరగాయలు, కోసుకోవడం సీతాఫలాలను తీసుకోవడం నెలలో రెండు మూడు సార్లు జరుగుతూ ఉండేది. ఊరికనే వెళ్లకుండా లక్ష్మీ మీ చిన్నోడిని బడికి పంపు అని పదేపదే చెప్తుండే వారు, మా అమ్మ అలాగే సారు అని బదులిచ్చేది. మా కూరగాయలు పండ్లు ఆయనకి ఇవ్వడం వల్ల మాకు చాలా దగ్గరి కావాల్సిన వ్యక్తి అని నేను భ్రమ పడేవాడిని. రెండో తరగతిలో ఉన్నప్పుడు మాకు రాయమని చెప్పి పక్క తరగతి గదిలోకి వెళ్ళాడు. నేను తమాషాగా, మాకు బాగా తెలిసిన మాస్టారే అని ఆయన అటు వెళ్ళగానే ఆయన కుర్చీలో కూర్చున్నాను. అది చూసిన నా తోటి పిల్లలు వారికి తెలిసిన భాషలో ఒకటి రెండు కల్పించి ఫిర్యాదు చేశారు. అంతే వారు కోపంతో ఊగిపోయి నన్ను చెడమడ తిట్టడమే కాకుండా తీవ్ర స్థాయిలో దండించారు. ఆ రోజు వారు నాతో అన్న మాటలు నన్ను ఆలోచింపజేశాయని నేను గట్టిగా నమ్ముతాను. ఈ కుర్చీలో కూర్చోవాలంటే అర్హత ఉండాలి, ఆ అర్హత కలిగిన ఉపాధ్యాయుడు గా నువ్వు ఎదగాలంటే బాగా చదివి ఉద్యోగం సంపాదించి చూపించు అంతేగాని ఇలా పిచ్చిపిచ్చి వేషాలు వేయవద్దని తీవ్ర స్వరముతో తిట్టారు. ఆ మాటలే నాకు ఉపాధ్యాయుడిగా ఎదగడానికి ఉపకరించాయి.

జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సినారె గారితో ప్రభాకర్

ప్రశ్న 3. తెలుగు ఉపాధ్యాయుడిగా, తెలుగు భాష పట్ల అభిరుచిని విద్యార్థుల్లో ఏ విధంగా పెంచగలుగుతున్నారు? ఈ విషయంలో మీ కృషికి ఫలితం లభిస్తున్నదా? విఫలం అవుతున్నారా? ఎందుచేత? వివరంగా చెప్పండి?

జ: సఫలమో, విఫలమో, తెలియదు కానీ ప్రయత్నమైతే సంపూర్ణంగా చేస్తున్నాను. నేను చదువుకునే రోజుల్లో ఉన్న భాషాభిమానం నేను తెలుగు భాష ఉపాధ్యాయుడిగా వచ్చేనాటికి విద్యార్థులలో లేదని కచ్చితంగా చెప్పాలి. కాలమాన పరిస్థితులకు అనుకూలంగా విద్యా వికాసం జరుగుతుంటుందేమో. ఇక మీరు అడిగిన ప్రశ్నకు చాలా లోతైన విశ్లేషణ అనేక కారణాల వివరణ అవసరం ఉందని విన్నవించుకుంటున్నాను. ఇతిహాసాల్లో కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో, అన్నీ కారణాలు తెలుగు భాష మనుగడకు ముప్పు తెచ్చే అంశాలు ఎన్నో ఉన్నాయని చెప్పవచ్చు.

విద్యార్థులలో తెలుగు భాషాభివృద్ధి అనేది ముందు తల్లి ఒడి నుండే ప్రారంభం కావాలని నమ్ముతున్నాను. మరి ఇప్పటి పరిస్థితులు భాష అభిమానాన్ని ప్రగతితో ముడిపెట్టి చూస్తున్నారు. ఉపాధి సూచిక  కొలమానంగా కొలుస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు మాతృభాషలకు దాపురించింది. ఇక్కడే మనము నన్నయ్య గారు అన్న మాటను గుర్తు చేసుకోవాలి. కొంచెం మార్చి చెప్పుకోవాలి “గత కాలము మేలు, వచ్చు కాలముకంటెన్”, “గత కాలముకంటె వచ్చు కాలము గడ్డుకాలము” అని చెప్పుకోవాలి.

తెలుగు వెలుగు కాస్త మసకబారుతుందేమోనని ఆవేదన చెందుతున్న కోటానుకోట్ల తెలుగు జాతి ప్రజల మనోవేదనే నా ఆవేదన. మాతృభాషలో విద్యను అభ్యసిస్తూ అంతర్జాతీయ జాతీయ స్థాయిలో అభివృద్ధి సాధించడానికి ఇతర భాషలు అభ్యసించాలి అనే విషయము అందరము నిరాఘాటంగా ఒప్పుకున్నప్పటికీ మాతృభాష అంటే రోజు రోజుకి చిన్న చూపే ఉంటుంది. ఇది ఇప్పటినుంచే ఇప్పటికిప్పుడే తయారైన భావన కాదు.  ఇది చాలా కాలం నుండి ఉన్నది. అయితే  మాతృ భాష పట్ల చులకన భావనను రూపుమాపాలంటే మన ఇరుగుపొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మరియు మహారాష్ట్ర పాటిస్తున్న పద్దతులను పాటించాలి అట్లాగే తెలుగు భాషను ఒక ఐచ్చికంగా చదువుకునే విద్యార్ధులకు విద్య, ఉద్యోగాల్లో రాయితీలు కల్పించాలి. అంతేకాదు మార్కులు కూడా ప్రత్యేకంగా ఇవ్వాలి. అప్పుడు భాష బతుకుతుంది. ప్రజల జీవ నాడీ బాగుంటుంది. అవేమీ చేయకుండా భాష, భాష అంటే అరణ్య రోదనే మిగులుతుంది. నిజానికి యునెస్కో చెప్పినట్టుగా అంతరించిపోయే భాషల్లో తెలుగు కూడా ఉన్నదని చెప్పినా, మనకు పట్టనట్లు, కనీసం చీమ కుట్టినట్టు స్పందన లేకుంటే ఎవరిని ఏమనాలో తెలియట్లేదు. కనీసం మనలో మనమైన ఆత్మ విమర్శ చేసుకోవాలి.

అక్షరం ప్రభాకర్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్

నా మట్టుకు నేను తెలుగు భాష ఉపాధ్యాయునిగా “అక్షరాభ్యాసం” అనే తెలుగు వాచకాన్ని రచించి, నా స్వంత ఖర్చులతో ముద్రించి తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్న విద్యార్ధులకు, ప్రజలకు, సాహితీ ప్రియులకు అందుబాటులో తీసుకురావడమే కాదు మంచి ఆదరణ పొందడం జరుగుతుంది. ఈ పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి గారు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ప్రశంసిస్తూ పుస్తకంలోని  అంశాలను పరిశీలించి బాగున్నాయని తన స్వహస్తాలతో అభినందిస్తూ రాసిన రాజముద్ర పత్రం అందించడం నాకు గొప్ప పురస్కారంగా భావిస్తున్నాను. అంతేకాకుండా ఉస్మానియా యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ భాషావేత్తలు, భాషా బోధకులు అందరు కూడా పుస్తకాన్ని మెచ్చుకోవడం, ఒకింత నాకు ఆనందాన్ని సంతృప్తినిచ్చింది. ఈ ప్రయత్నం ఒక ముద్రణతోనో రెండవ ముద్రణతోనో  ఆగలేదు, ఇప్పటికి నాలుగు ముద్రణలు  పూర్తి చేసుకొని ఐదో ముద్రణకు వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఈ పుస్తకం ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ అందాలనే ఆశయంతో అమెజాన్లో కూడా లభ్యమవుతుంది.

ఒక తెలుగు భాషా సేవకుడిగా నేను ఈ ప్రయత్నం చేస్తున్నందుకు గర్వపడుతూ ఈ విషయాన్ని మీ ద్వారా ఈ ప్రపంచానికి తెలియజేస్తూ, సంతోషాన్ని వ్యక్త పరుస్తున్నాను. తెలుగు భాషా సేవకుడిగా సఫలం అవుతున్నాననే చెప్పగలను. నేను తెలుగు భాష కోసం కంకణ బద్ధుడనై సాగుతున్నాను. నేను ఇప్పటివరకు కేవలం తెలుగు భాష అభివృద్ధికోసం, తెలుగు ఉద్యమాలకోసం పాటలు  రాయడమే కాదు, అంతర్జాతీయ తెలుగు భాష సంస్థలచే బహుమానాలను, సత్కారాలను అందుకోవడం నేను చేసిన కృషికి తార్కాణాలుగా నిలుస్తాయని ఒప్పుకుంటాను,  చెప్పుకుంటాను. భాషా సేవకుడిగా నేను నిరంతరం ప్రయత్నం చేస్తానని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను.

తెలుగు ఉద్యమ పాట పాఠక దేవుళ్ల కోసం

నీ కన్న తల్లి పిలుస్తుంది కదులు సోదరా! నువ్వు కదులు సోదరీ
నీ కన్న తల్లి కన్న మిన్న ఏమీ లేదురా! ఏమి లేదు సోదరీ
నీ మాతృభాష మరణ మంచు నున్నది ఓ చెల్లి
గుండె పగిలి తల్లడిల్లే మన తెలుగు తల్లి
వందేమాతరం తెలుగే మనకున్న బలం
వందేమాతరం తెలుగే మన మూలధనం
మన తల్లిపాలు మనము తాగి పెరగలేదా?
మనమిన్ని నాళ్ళు తెలుగు చదివి ఎదగలేదా?
మరి! పాలడబ్బ పాలతో మనకెందుకు ఓనమాలు
పరాయి బాష మోజులో మనకెందుకు మురిపాలు
తల్లి భాష అనాధైతే తనయులుండి ఎందుకనీ
సొంత భాష చేదనే చేవ చచ్చి బ్రతక కనీ
పేగు బంధము మరిచిన జాతి ఏది నిలవదని
అడుగుతుంది నిన్ను నన్ను మన అందరి తెలుగు తల్లి

ప్రశ్న 4. ‘అక్షరం ప్రభాకర్’ అన్నది మీ కలం పేరు అనుకుంటాను. ఇలాంటి కలం పేరు పెట్టుకోవడం వెనుక ప్రత్యేకత ఉందా? వివరంగా చెప్పండి?

జ: నేను పుట్టిన ఊరుకు కూత వేటు దూరంలో ఉన్న చిన్నగూడూరు గ్రామంలో పుట్టిన దాశరథి సోదరులలో చిన్నవారు అభినవ వ్యాసుడు, దాశరథి రంగాచార్య గారు రాసిన రచనలు ఆ రోజుల్లో పత్రికల్లో ప్రచురింపబడేవి. అవి నేను వివిధ పత్రికల్లో చదువుతూ ఉండేవాన్ని. వారు రాసినటువంటి జీవనయానం, చిల్లర దేవుళ్ళు, జలతారు, ఏది నిజం, మోదుగు పూలు, “అమృతం గమయ” ఈ పుస్తకాలు పరిచయాలు పుస్తకాల్లో ఉండబడిన అంశాలు విశ్లేషణతో వివిధ రచయితలు రాసినప్పుడు సాహిత్య పత్రికలలో, దినపత్రికల్లో చదవడం, అప్పుడప్పుడు వారే వివిధ పత్రికలలో వ్యాసాలు రాయడం నన్ను బాగా ఆకట్టుకున్నది. ఎలాగైనా వారితో నేను రాసిన కవిత్వానికి ముందు మాట రాయించుకోవాలని ఒక పుస్తకంగా ప్రచురించాలని ఆలోచన వచ్చి మిత్రుల సహకారంతో పుస్తకాన్ని అచ్చు వేయడానికి పూనుకొని ఆ డిటిపి చేసిన ప్రతులను వారి దగ్గరికి తీసుకుపోయాను. వారంతా చూసి “ఇటువైపుగా ఎందుకొస్తున్నావు మేమే ఆ రోజుల్లో కవిత్వం సాహిత్యము పాటలు పద్యము అంటూ వచ్చి అనేక కష్టనష్టాలు భరించాము. నీవు ఈ మార్గం కాకుండా వేరే మార్గం చూసుకుంటే బాగుంటుందేమో అనుభవంతో చెప్తున్నాన”ని వారు ఖరాఖండిగా నాతో అన్నారు. నేను “అదేమిటి గురువుగారు మీ సాహిత్యం చదువుకొని స్ఫూర్తి పొందిన వాళ్లము. మీ రచనల్లో ఉన్నటువంటి పాత్రలు పాత్రల స్వభావాలను ఇష్టపడ్డ వాళ్ళం. మీరు ఇప్పుడు ఇలా అంటే ఎలా మీరు ముందుమాట రాయకుండా పర్వాలేదు కానీ ఇటువైపుగా రావొద్దు అని మాత్రం అనొద్దు దయచేసి” అని, నేను కూడా వారు చెప్పినంత సూటిగానే వారికి చెప్పి “మీరు ముందుమాట రాయకుంటే పర్వాలేదు మా ఊరు కవి అందులో నేను బాగా అభిమానించే రచయిత మీరు అని వచ్చాను మీరు రాయకున్నా పర్వాలేదు” అని వెళుతుంటే వారి శ్రీమతిని పిలిచి “కమలా.. చూసావా.. వీడు ఎలా అంటున్నాడు?  వీడికి ఏమి అనుభవం ఉంద?. ఎలా వెళ్ళిపోతున్నాడో చూడు. అంత తల బిరుసుతనం ఎందుకు? కనీసం రాయమని కూడా అడగట్లేదు” అని నేను కొంత దూరం ఇంటి మెట్లు దిగి వెళ్ళాక, అమ్మతో మళ్ళీ పిలిపించి, “ఏది నువ్వు రాసిన కవితల్లో ఏదైనా ఒక కవిత చదువు” అన్నారు. నేను “నాకు నచ్చిన కవిత కాదు ఈ మొత్తం సంపుటిలో నుండి మీరు ఏదో ఒక పేజి తీసి చూపించండి. అది మాత్రమే చదువుతాను అది నచ్చకపోతే మీరు ముందుమాట రాయొద్దు” అని చెప్పాను. నేను చదివిన కవితను ఆసాంతం విని “శభాష్” అనడమే కాదు. నన్ను హత్తుకున్నాడు. హత్తుకొని అలవోకగా ఈ మాటలు చెప్పారు.

“అక్షరం ప్రత్యక్షమైతే అంతరిక్షాలు దిగి వస్తాయి, ఆ అక్షరమే మానవునికి మనోనేత్రం, అక్షరాన్ని చూడగలిగిన వాడే కవి, కథకుడు, కళాకారుడు. అక్షరంలో అగ్నిపర్వతాలున్నాయి, సముద్రాలున్నాయి, పెను తుఫానులు ఉన్నాయి. అన్నింటినీ మించిన “మనిషి” ఉన్నాడు. కాబట్టి అక్షరం వర్ధిల్లుతుంది. ఈ రోజు నుండి నాగెల్లి ప్రభాకర్ అక్షరం ప్రభాకర్ గా వర్ధిల్లాలని ఆశీర్వదిస్తున్నాను. సాహిత్య ప్రపంచంలో ఈనాటి నుండి అక్షరం ప్రభాకర్ గా నామకరణం చేస్తున్నాన”ని వారు చెప్పడం. ఆనాటి నుంచి నేను అక్షరం ప్రభాకర్ గా ప్రపంచానికి పరిచయమయ్యాను.

ప్రశ్న 5. కవిత/ గేయం ఈ రెంటి మధ్య తేడాను వివరించండి. ఈ రెంటిలో మీరు దేనికి ప్రాధాన్యత నిస్తున్నారు? ఎందుచేత?

జ: “కవిత ఒక నిప్పుల కొలిమి, అయితే పాట ఒక గాయాల వీణ. రెండు భారమైనవే, అయినప్పటికీ ఒక్కొక్కరి పంథా ఒక్కొక్క విధంగా ఉంటుంది. కవిత్వంలో రాణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరిచిపోలేని, మరుపురాని వచన కవితల్ని అందించి తూటాల్లాంటి మాటలు కవితలుగా పేల్చిన ప్రజా కవి కాళోజి, విప్లవ కవి శివ సాగర్, గుంటూరు శేషేంద్ర శర్మ, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది కవిత్వాన్ని ఔషధంగా అందించారు.

కవిత్వము అమ్మ అయితే గేయం నాన్న అని చెప్పొచ్చు. అమ్మ గొప్పతనం అమ్మదే. నాన్న త్యాగం నాన్నదే. అమ్మ గొప్పదా నాన్న గొప్ప అంటే వినడానికి ఎంత విడ్డూరంగా ఉంటదో . వాటి గురించి వాటి వ్యత్యాసాలగురించి వివరించినపుడు, విశ్లేషించినపుడు, విప్పి చెప్పినప్పుడు విచారంగా ఉంటది. నాన్న + అమ్మ = మనిషి జీవితం ఎలాగనో, కవిత్వం,గేయం కూడా అలాగనే.

కవిత్వంలో కొద్దిగా స్వేచ్ఛ ఉంటుందేమో కానీ, పాటలో కొంచెం స్వేచ్ఛ ఉండదనే చెప్పాలి. ఎందుకంటే పల్లవి, పల్లవిలో పాదాలు వాటి యతులు, జతులు, ప్రాసలు వాటి యొక్క లయ, తాళం కవిత్వానికి కొంచెం భిన్నమైనవని. అట్లాగే చరణం చరణం లోని పాదాలు కూడా ఒక పద్ధతి ప్రకారం నడుస్తున్నటువంటి ప్రక్రియ. ఆ మాటకొస్తే మహాకవి శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం అంతా కూడా తాళానికి లయకు అనుకూలంగా ఉంటుంది కాబట్టే అది పాట కంటే వేగంగా ప్రపంచానికి పరిచయమైందని చాలామంది పెద్దలు చెప్పుకోవడం, చెపుతుండడం నేను స్వయాన విన్నాను. అనేక సభలలో కన్నాను.

మీరు అడిగిన కవిత గేయంలో రెండిట్లో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారని అడిగినారు. నేను మొదట్లో కవిత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడిని, కానీ కన్నీళ్ళతో కాగితాలు ఎన్నో తడిసి ముద్దయ్యేవి. ఎంతకు నా కవిత పంక్తుల్ని ఎవరు గుర్తుపెట్టుకుని మీరు ఫలానా కవితలో ఈ పదం వాడారని తమ భావాల్ని బళేగా వ్యక్తపరిచారని చెప్పిన మనుషుల మాటలు నేను ఎక్కువగా నోచుకోలేదు. అలాంటి క్రమంలో నా చుట్టూ ఉన్న స్నేహితులు పాటను ఎంచుకొని ముందుకు వెళుతున్న క్రమంలో నేనెందుకు పాట ను నేనెందుకు రాయకూడదని ఇటు వైపు వచ్చినప్పుడు నా పాట పది మందికి చేరువ కావడం, వాళ్లు పాడుకోవడం. అందులో నేను ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాను నా చుట్టూ పిల్లల ప్రపంచం ఉంటుంది ఆ పిల్లలకు కవిత్వం అంటే ఏమిటో తెలియదు కానీ పాటంటే వాళ్ళు పాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వాళ్లందరూ పాటలు ఇష్టపడతారు. అందుకే నేను పాటను ఎంచుకున్నాను. పాట వైపు పయనిస్తున్నాను. పాటే నా ప్రాణం పాటే నాకు సర్వం. ఆత్రేయగారన్నట్టు ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది అందరం ఒకటే చేయి కలిపితే కొలువేమున్నది పాటలు అంతా అనంతమైన శక్తి ఉన్నది అని నేను నమ్ముతున్నాను. మీకు తెలుసు “శిశుర్వేత్తి, పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః” శిశువైనా, పశువైనా పండు ముసలైన ఎవరైనా పాటకు పరవశించి పోవాల్సిందే. పాట ముందు ప్రణమిల్లాల్సిందే. పాట ప్రజల్లోకి వెళ్లి సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవడం జగమెరిగిన సత్యం. కాబట్టి నేను ఇప్పుడు ప్రస్తుతానికి గేయాన్ని ఎంచుకుంటున్నాను, పాటనే ప్రక్రియని ఎంచుకుంటున్నాను. మళ్ళీ చెబుతున్నాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, కవిత్వము అంటే అమ్మ, పాట అంటే నాన్న, ఈ ఇద్దరిలో ఎవరు లేరనుకున్నా నా మన బతుకు పెద్ద సున్నా.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో శ్రీమతి నన్నపనేని రాజకుమారి గారితో అక్షరం ప్రభాకర్

ప్రశ్న 6. మీ రచనల్లో ఎక్కువగా పాటలు కనిపిస్తుంటాయి. పాటను ఎందుకు మీరు ఒక సాహిత్య ప్రక్రియ గా ఎంచుకుంటున్నారు? దీని వెనుక ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?

జ: తెలుగు జాతి మెచ్చిన, జనులందరికీ నచ్చిన, వాగ్గేయ కారుడు, సంకీర్తనాచార్యుడు అన్నమయ్య దగ్గర నుండి తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన లోకకవి అందె శ్రీ వరకు మీరు గమనించండి, పాట ఎంత శక్తివంతమైనదో ఇట్టే మీకు అవగతమౌతుంది, భారతదేశ స్వతంత్ర ఉద్యమం వందేమాతర గీతం నుండి నిన్న మొన్నటి తెలంగాణ ఉద్యమం వరకు పాట యొక్క ప్రాధాన్యత ఎంత ఉందో ప్రపంచానికి విధితమైన విషయమే, పాట బడిలో, గుడిలో, సామాజిక స్పృహలో ముందుండి నడిపించే ఒక ప్రవాహం, పాట మెదడు నుండి హృదయానికి చేరే వారధిగా, సారధిగా, నిలబడుతుంది, నేడు వివిధసామాజిక మాధ్యమాలలో పాట ఎంత వేగవంతంగా వెళుతుందో , మనం చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం, పాట అలసిన హృదయాలకు స్వాంతన, అలిగిన హృదయాలకు ఒక జవ్వాది పరిమళం, నిరాశ, నిస్పృహల్లో కొ ట్టుమిట్టాడుతున్న కోట్లాది హృదయాలకు చైతన్య లేపనం, మాట పోలేని చోటుకు కూడా పాట పోగలుగుతుంది, చెప్పలేని మాటను కూడా పాట రూపంలోకి మార్చి చెబితే అది మనుషులను, మనసులను మార్చగలుగుతుంది, ఒక్క మాటలో చెప్పాలంటే గాలిదూరని చోటు ఎలా లేదో, పాట దూరనీ చోటు కూడా అలానే ఉంది. పాట మొద్దు బారిన గుండెకు పెద్దదిక్కై కాగడపట్టి దారి చూపుతుంది.

నేనున్నాననే భరోసా ఇచ్చి వెన్ను దన్నుగా నిలుస్తుంది. పౌరుషం నూరి పోసి, పట్టుదలకు ప్రాణం పోస్తుంది, పాట ఎదురు నిలిచి పోరాడే స్థైర్యాన్ని ఎలా కలిగిస్తుందో, అది అనుభవించి, అనుభూతి చెందిన రాష్ట్రాలకు, రాజ్యాలకు, ఆ హృదయాలకే, తెలుస్తుంది.

ప్రజల నాలుకలపై పాట ఎలా నర్తింపబడుతుందో ప్రపంచ చరిత్రలో రుజువైన సంగతి కి ఉదాహరణలు సజీవ సాక్షాలు కోకొల్లలు, మీరు ఈ ప్రశ్నకు ముందు అడిగిన ప్రశ్నలో చాలా మటుకు పాట, గేయం యొక్క ప్రాధాన్యత, నేను పాట వైపు వెళ్లడానికి జరిగిన పరిణామం, అంత కూడా సవివరంగా వివరించాను అనుకుంటున్నాను. అయినా మరో మారు ఈ ప్రశ్నకు సమాధానం తప్పకుండా… నాకు తెలిసినంతలో తెలియజేస్తానని విన్నవించుకుంటున్నాను. సాహిత్యంలో అనేక ప్రక్రియలు ఉన్నాయి అందులో పాట లేదా గేయం కవిత్వం వీటి గురించి ఇప్పుడు సంక్షిప్తంగా.. సాహిత్యంలో కవిత్వం ఒక పక్షి అనుకుంటే, ఆ.. పక్షి ఈకలను కత్తిరిస్తే అది మాట కు ప్రతిరూపమైన కవితై నేల మీదనే తారాడుతుంది, ఇప్పుడు ఆ పక్షే పాట అనుకుంటే, ఆ పక్షికి సహజంగా మొలచిన రెక్కలను కత్తిరించకుండా వదిలేస్తే అది ప్రపంచమంతా విహాంగమై విహరిస్తుంది. అంతెందుకు వందేమాతరం, మా తెలుగు తల్లి, జయ జయహే తెలంగాణ, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, ఇవన్నీ మనిషి సాధించిన ప్రగతికి జగన్నాధ రథచక్రాలుగా నడిచినవి, మనల నడిపినవి, మనకు చేదోడు నిలిచినవి.

ఇక చివరిగా ఒక మాట నేను ఎక్కువగా బాల సాహిత్యం, బాల గేయాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన చైతన్య గీతాలు, విద్యా వికాసవంతమైన సామాజిక స్పృహతో కూడిన పాటలు ఎంచుకొని పయనిస్తున్నాను. నేను ఎంచుకున్న ఈ మార్గానికి సముచితమైనది పాట అని భావించాను. అందుకే పాటను ఒక సాధనంగా భావించి రాస్తున్నాను, నా పాటను ఆదరిస్తున్న ప్రజలకు, సాహిత్య అభిమానులకు, విద్యార్థులకు నా స్నేహితులకు నా శ్రేయోభిలాషులందరికీ నా నమస్సులు మీరు ప్రోత్సహించడం వల్లనే, మీరు ఆదరించడం వల్లనే నేను రాయగలుగుతున్నానని విశ్వసిస్తూ మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇట్లాగే కోరుకుంటూ.

ప్రశ్న 7. విద్యార్థి దశలో రచయితగా మీ అనుభవాలు చెప్పండి. అప్పుడు మిమ్ములను ప్రోత్సహించిన వారు ఎవరైనా ఉన్నారా?

జ: నేను ఇదివరకే విన్నవించుకున్నట్టుగా ఏడో తరగతి లోనే కలం పట్టాను అటువైపుగా అడుగులు వేశాను నవయుగ చక్రవర్తి మహాకవి గుర్రం జాషువా గారు అన్నట్టు “వెన్నెల నా కవిత్వం వడగల్పు నా జీవితం పేదరికం, దరిద్రమే” నన్ను తీర్చిదిద్దిన నా ఆరాధ్యగురువులు, ఈ మాటలు నా జీవితానికి కూడా సరిగ్గా సరిపోతున్నాయనే గుర్తు చేసుకుంటున్నాను. ఏడో తరగతిలోనే కలం పట్టడం అంటే పేదరికంతో నేను పడ్డ ఇబ్బందులే అక్షరాన్ని ఆలింగనం చేసుకునీ, చదువు బాటలో బతుకు సాగేందుకు వేదనా భరితమైన దుఃఖాన్ని భరించటానికి, ఏవేవో వచ్చిరాని భావాలే కవితా అక్షరాలై ఆదుకున్నాయి. నా.. ఈ కవిత చూడండి మీకే అర్థమవుతుంది

“గుండె చెరువైనప్పుడల్లా అక్షరం అమ్మై మరుజన్మ నిచ్చింది
బతుకు బరువైనప్పుడల్లా అక్షరం నాన్నై నడక నేర్పింది
భవిష్యత్తు అంధకారమైనప్పుడల్లా అక్షరం గురువై వెలుగు నింపింది
ఆపదొచ్చినప్పుడల్లా అక్షరం నేస్తమై ఆదుకుంటుంది
మనసు మూగబోయినప్పుడల్లా అక్షరం ప్రేమై నీడనిచ్చింది
కవిత రాసినప్పుడల్లా అక్షరం భవితకు భరోసా ఇచ్చింది
ఆకలైనప్పుడల్లా అక్షరం అన్నమై కడుపు నింపింది”

ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకుందాం. స్నేహానికి విలువ ఇచ్చిన, విలువ తెచ్చిన స్నేహితులు, సాహిత్య చరిత్రలో బాపు- రమణ గారు ఒకరోజు బాపు గారికి రాష్ట్రపతి నుండి పురస్కారం అందిస్తున్నట్టుగా వారికి ఒక సందేశము వచ్చిందట, ఆ వార్త తెలిసిన బాపు గారు వెళ్లి వాళ్ల అమ్మ కాళ్ళ కు నమస్కరించబోయాడట, ఆగాగు విశేషమేమిటో చెప్పు అన్నారట, అమ్మ నేను తీసిన సినిమాకు, రాష్ట్రపతి పురస్కారం వచ్చిందని చెప్తే.. ఒరేయ్.. నీ పిచ్చి గీతల్ని నీ వచ్చిరాని మాటల్ని భరించిన నీ మిత్రుని కాళ్ల మొక్కిన తర్వాత నా కాళ్లు మొక్కరా, వాడికే ఆ అర్హత ముందుగా ఉంది, వాడి తర్వాతే నేను అన్నారట. ఏమి ఆశించని స్వార్థం అయినా ప్రేమ ఏదైనా ఉన్నదంటే అది స్నేహం. అట్లాంటి స్నేహం నా ప్రయాణం అంతటా, ఉంది వారి ప్రోత్సాహము ఉంది. స్నేహితులే నా బలం, నా బలగం, నా ప్రతి అడుగులో వారి చేయూత నిండుగా ఉన్నది, నేను హాస్టల్ లో ఉండి చదువుకునే వాడినని చెప్పాను కదా సెలవు వస్తే చాలు పాటలు సాహిత్యం కవిత్వం ఇవే ముచ్చట్లు వీటి చుట్టూ మా సంభాషణ అంతా కూడా సాగేది. వీటితోపాటు సినిమాలు, సినిమా ముచ్చట్లు, సినిమా పాటలు, అప్పుడప్పుడు నేను రాసిన వేదనాభరితమైన కవిత్వం ఇలా సాగేది. నువ్వు బాగా రాస్తున్నావ్ ఇంకా మంచి ప్రయత్నం చెయ్ ఏదో ఒక రోజు నీకు మంచి గుర్తింపు వస్తుందని వాళ్లు చెప్తుంటే నేను బాగా ఆనందించేవాడిని, నిజమా నేను రాసే దానిలో ఇంత గొప్పతనం ఉందా? అని ఆశ్చర్యపోయేవాన్ని! పెద్దలు ఊరికే అన్నారా? “కాకి పిల్ల కాకికి ముద్దని”, అలాంటిదే నా ఆనందం కూడా, నా ఆశ్చర్యం కూడా, వారు చెప్పినట్టే నేను క్రమం తప్పకుండా సాహితి పత్రికలు, దిన పత్రికలు, రచయితల, మహనీయుల, ఆత్మకథలు, జీవిత చరిత్రలు, చరిత్రపుటల్లో దాగిన అసలు సిసలైన మరుపురాని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అప్పుడప్పుడు ఏదో రాస్తూ వస్తున్నాను. ఆ ప్రయత్నాన్ని తెలుగు సాహితీ ప్రియులు, సంస్థలు, పెద్దలు, నన్ను ఆశీర్వదించడం వివిధ పేర్లతో అవార్డులు ఇవ్వడం సత్కరించడం సన్మానించడం నాకు గొప్ప వరంగా భావిస్తున్నాను.

అంతర్జాతీయ సేవా సంస్థ లతారాజ ఫౌండేషన్ సంస్థకి జాతీయ గీతం ను రచించినందుకు గాను లతా రాజా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ కేకే రాజా గారిచే గౌరవ అభినందన సత్కారాన్ని అందుకుంటున్న అక్షరం ప్రభాకర్

అక్షర యానంలో విజయం ఉంటే అది నా స్నేహితులది, నా తల్లిదండ్రులది, నా తోబొట్టువులది, మా గురువులది, నా శ్రేయోభిలాషులది, నా పాఠక దేవుళ్ళది. అవుతుందని విన్నవించుకుంటూ, ఇందులో లోపాలు ఉంటే అది నా ప్రయత్నం లోపమే నిస్సందేహంగా అవుతుందని గ్రహించాలని వేడుకుంటున్నాను.

ప్రశ్న 8. మీ రచనా వ్యాసంగంపై మీ కుటుంబ సభ్యుల స్పందన ఎలా ఉంటుంది?

జ: చాలా మంచి ప్రశ్న అండి. నిజానికి ఏ రచయితకైనా, ఏ కవికైనా, కుటుంబ ప్రోత్సాహమే మొదటి బహుమానం. ఈ ప్రోత్సాహాము ఎలాంటిదంటే తల్లి ఒడే బిడ్డకు మొదటి బడి లాగా, కుటుంబం ఆ కవి కి, ఆ రచయితకు, అనుకూల వైఖరిని, సానుకూల వాతావరణాన్ని కల్పించ లేకపోయినట్లయితే ముందుకు సాగడం చాలా కష్టం. మధ్యతరగతి అందులోనూ పేదరికంతో సతమతమవుతున్న మా లాంటి కవుల కష్టాలు అంతా ఇంతా కాదు, అలాంటి పరిస్థితులలో ఇంటి ఇల్లాలుని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూనే సమాజం పట్ల సరైన బాధ్యత కలిగి సామాజిక దృక్పథంతో, అభ్యుదయ ఆలోచనతో, ముందుకు సాగడమంటే కత్తి మీద సామనే చెప్పాలి. సాహిత్యం, సంగీతం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమే కానీ, వారు అనుకున్నా రీతిలో అనుకున్న రంగంలో సఫలం కావాలంటే మాత్రం సకుటుంబ, సపరివార సమేతంగా సంపూర్ణ సహకారం అందించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నిత్యం ఏదో ఒక సభ, సాహిత్య సమావేశం అంటూ ఇల్లు విడిచి వెళ్లడం సాధ్యమయ్యే పని కాదు. కుటుంబ సహకారము తో పాటు ఆర్థికమైన భారం కూడా ఎంతో ఉంటుంది. అది మీకు తెలియనిది కాదు. అవన్నీ తట్టుకుంటూ ముందుకు సాగడం రచయితకు పెద్ద సవాలనే చెప్పాలి. ఇక నా కుటుంబం ప్రోత్సాహం గురించి సంక్షిప్తంగా..

ఇందిరా ఆర్ట్స్ అకాడమీ రజతోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు, సినీ ప్రముఖులు దైవజ్ఞ శర్మ గారిచే బంగారు నంది పురస్కారం అందుకుంటున్న అక్షరం ప్రభాకర్

నా శ్రీమతి అప్పుడప్పుడు మీరు కవిత్వము, సాహిత్యము, పుస్తక ఆవిష్కరణలు, సభలు అంటూ వెళితే కుటుంబం ఎలా అని సున్నితంగా మా పెళ్ళైన కొత్తలో చెప్పినప్పటికీ , నా ఇష్టాన్ని కాస్త కష్టమైన వారికి ఓర్పుతో చెప్పి ఒప్పించి తప్పించుకోకుండా మెప్పించే ప్రయత్నం చేయడం జరిగేది. అదే నిర్విరామంగా, నిర్విఘ్నంగా అవిశ్రాంతంగా జరుగుతున్నది. ఈలోపు మా పిల్లలు పెద్ద పెరగడం వారు పై చదువులకు వెళ్లడం వారికి కూడా పాటలు, సాహిత్యం, సంగీతం, పైన మక్కువ కలగడం వల్ల నా ప్రయత్నానికి బలం చేకూరింది.

మా అమ్మానాన్నల వారసత్వంగా వాళ్లు కూడా కళల పట్ల గౌరవం చూపించడం నాకు కొంచెం గర్వకారణం. పిల్లలు అర్థం చేసుకోవడం వాళ్ళ అమ్మకు అర్థం చేయించడం వల్ల కూడా నాకు చదువుకుని రాసుకునే అవకాశం దొరికిందని చెప్పాలి. ఇటు పిల్లల యొక్క ఆదరణ అటు శ్రీమతి యొక్క ప్రోత్సాహము రెండు ఉండడం వల్లనే నేను ఇంత దూరం పయనించడమే కాదు, పుస్తకాలు రాయగలుగుతున్నాను, అందుకే పెద్దల మన్ననలను పొందగలుగుతున్నాను. వాటికి కారణం నా శ్రీమతి, నా కుటుంబ సభ్యులు, అట్లాగే మా అన్నయ్యలు, వదినమ్మలు, వాళ్ల పిల్లలు, మా అక్క బావలు, వాళ్ల పిల్లలు, మా అత్త మామలు అందరూ కూడా నన్ను అర్థం చేసుకొని, ఏదో పదిమందికి అక్కరకొచ్చే పనికోసం ఆరాటపడుతున్నాడు అంటూ నా మీద వాళ్ళు జాలి పడుతుంటారు. అది కూడా నాకు కొంత మేలు చేసిందనే చెప్పాలి. నన్ను స్పూర్తిగా తీసుకొని మా చిన్నన్నయ్య కొడుకు విశ్వకలం పేరుతో రచనలను చేస్తూ ఉండడం, నా ప్రభావం వలనే అని కొంత సంతృప్తినిస్తుంది.

ప్రశ్న 9. మీ మొదటి రచన ఎప్పుడు, ఎక్కడ ప్రచురితమైంది? అప్పుడు మీ స్పందన ఎలాంటిది?

జ: నా మొదటి రచన కు నేను ఏడవ తరగతిలో ఉన్నప్పుడు పునాది పడ్డది. కానీ పూర్తి చేసేది మాత్రం పదో తరగతి అయ్యాకే, నా మనసులోని బాధకే ఈ అక్షరాలు అద్దాను

“తిరుగూ… తిరుగూ… తిరుగూ
కాళ్ల చెప్పులరిగేదాక తిరుగూ
నీ కన్నోల్లు కాలే దాకా తిరుగూ
నీ ఉన్నో ళ్లు ఊడే దాక తిరుగూ”

మొట్ట మొదటిసారిగా నేను రాసింది గేయమే, కాని అది గేయమని నాకు తెలియదు. ఇకపోతే ఈ గేయం నేపథ్యం ఏమిటంటే నేను హాస్టల్ లో చదువుకున్నానని చెప్పాను కదా, మా హాస్టల్ కు మా కంటే ముందు చదువుకున్న సీనియర్స్ వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్లు తరచూ మా హాస్టల్ కు వస్తుండే వాళ్ళు, వాళ్లను చూసినప్పుడల్లా నా మనసులో అయ్యో అంత పెద్ద పెద్ద చదువులు చదివారు ఏదో ఒక పని చేసుకుని తల్లిదండ్రులని చూసుకుంటే ఎంత బాగుండూ..! అని మనసులో బాధపడేవాన్ని, ఒక అమాయకత్వం ఒక అపరిపక్వతతో రాసిన గేయం అది, అలాగే పదవ తరగతిలో ఉన్నప్పుడు అనుకుంటా ఒక పాట రాశాను, ఆ పాట నాతోటి విద్యార్థులకు ప్రేరణగా ఉండాలని, చదువును నిర్లక్ష్యం చేయరాదని రాశాను.

“ప్రతి అక్షరం గోల్డ్ రా..అది ప్రగతి జగతికి నాందిరా
అక్షరమే మన కండరా.. అది దొంగలు దోచని సొత్తుపురా”

ప్రతి అక్షరం గోల్డ్ రా అది ప్రగతి జగతికి నాందిరా..ఈ పాట వటూరి ప్రభాకర శాస్త్రి గారు రాసిన

“అక్షరంబు వలయు కుక్షి జీవనులకు,
నక్షరంబు జిహ్వ కుక్షిరసము,
అక్షరంబు తన్ను రక్షించుగావున
నక్షరంబు లోక రక్షితంబు”

నేను రాసిన “తిరుగూ.. తిరుగూ తిరుగూ” ఈ పాటను ఎట్లాగైనా ఒక చిన్న టేప్ రికార్డులో ఒక మిత్రునితో ఆ పాట పాడించి, క్యాసెట్ రూపంలో విడుదల చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసామో ఇప్పుడు తలుచుకుంటే మా తెలివి తక్కువ తనానికి మాకే ముచ్చటేస్తుంది, నవ్వొస్తుంది. ఎలాగో ఒక టేప్ రికార్డు సంపాదించాం అది ఎలాగో చెబుతా వినండి.

ఒక టేఫ్ రికార్డ్, రేడియో అమ్మే షాపులో పనిచేసే ఒక మెకానిక్ ని పరిచయం చేసుకొని ఆయన ద్వారా కొత్త టేప్ రికార్డు వాళ్ళ యజమాని లేనప్పుడు బయటకు తీసుకువచ్చి ఒక చెట్టు కింద మిత్రునితో క్యాసెట్లో పాడిపించి, మళ్లీ ఆ టేప్ రికార్డు ఆ షాపులో పెట్టాము. దానికి మా ఆడియో బడ్జెట్ అయిదు రూపాయలు, ఆ రికార్డు క్యాసెట్ పట్టుకొని తెలిసిన వాళ్ల ఇండ్లలో టేప్ రికార్డులో వేసి వినుకుంటూ సంగీతం, సాహిత్యం అంతా, సమకూర్చుకున్నం.

ఇక మానుకోటలో అంతట వినపడేలా రిలీజ్ చేయాలని కలలు, కనే వాళ్ళం. చిలిపి రోజులు తలుచుకుంటే ముచ్చటేస్తుంది, నవ్వొస్తుంది. అంత చిన్న వయసులోనే ఏమీ తెలియకున్నా ఏదో ప్రయత్నం చేశాము కదండీ, దీవించండి.

ఇక పత్రికలో ప్రచురించిన మొట్టమొదటి పాట లేదా గేయ రూప కవిత్వం అంటే మాత్రం ప్రముఖ సంగీత దర్శకులు చక్రి గారు ఇంకా, వారి కంటే పెద్దవారు, కొంతమంది ఉపాధ్యాయులు, సాహితీవేత్తలు అందరూ కలిసి స్వచ్ఛందంగా నడిపే ఒక సంస్థ మానుకోటలో ఉండేది దాని పేరు “సారస్వత మేకళ“. ఒకరోజు కవితా సమ్మేళనము మరియు సాహిత్యంలో వస్తున్న అనేక మార్పుల గురించి ఒక కార్యక్రమం పెట్టింది. ఈ విషయము పత్రిక ద్వారా తెలుసుకున్న నేను ఆ సభకు హాజరయ్యాను. అప్పుడు నేను చదివిన కవిత

“గుట్కా తినకురా కొడకా నువ్వు గుటుక్కు మంటవు కొడకా
గుట్కా తినకరా కొడకా నువ్వు గుటుక్కు మంటవు కొడకా
నోటి నిండా పుండ్లే పుచ్చిపోయిన పండ్లే
నీ నోరంతా కాలుష్యం వాసనా
నీ గొంతు కు క్యాన్సర్ ప్యాసనా”

రెండు చరణాలు ఒక పల్లవి తో వినిపించిన ఈ గేయం సభలో ఉన్న పెద్దలనే కాదు, అక్కడ ఉన్న యువకులను అందరిని ఆకట్టుకున్నది. పత్రికా విలేకరులు ఈ గేయాన్ని నా దగ్గర నుంచి అడిగి తీసుకొని పత్రికలో వేశారు. ఆ పత్రిక “వార్తాపత్రిక” ఆ పత్రికలో నా ఫోటోతో పాటు వచ్చిన ఆ గేయాన్ని ఇప్పటికీ నేను భద్రపరచుకున్నాను. అంటే మొట్టమొదటి కవిత అచ్చుకు నోచుకున్నప్పుడు పొందిన అనుభూతి ఎలాంటిదో మాటల్లో చెప్పలేను. ప్రతి తల్లికి తొలిచూరు బిడ్డ ఎంత ఆనందం ఇస్తదో, నా మొట్టమొదటి తొలిచూరు కాన్పు కవిత కూడా అంతే ఆనందం ఇచ్చింది. ఇప్పటికీ ఇస్తూనే ఉంది. అది కూడా ఒక సామాజిక బాధ్యతతో రాశావని పెద్దలు చెప్పినప్పుడు, ఆ సమయాన నా కళ్ళల్లో ఆనంద భాష్పాలు. ఈరోజు కోసమే కదా నేను అమ్మ నాన్న అంత దూరం వెళ్లి చదువుకోవద్దనీ, చెప్పినా ఇంత కష్టపడ్డది అని నెమరు వేసుకున్నాను.

అంతర్జాతీయ సేవా సంస్థ నుండి డాక్టరేట్ స్వీకరిస్తున్న అక్షరం ప్రభాకర్. చిత్రంలో డాక్టర్ బిక్కి కృష్ణ డాక్టర్ విద్యాసాగర్ మరియు డాక్టర్ రాధా కుసుమ

ఇన్నాళ్లకు ఇప్పుడు సంచిక పత్రిక నాకు పరిచయమయ్యాక అంతే సంతోషాన్ని నా గేయాలను అందులో ప్రచురించినప్పుడు పొందుతున్నాను. సంచిక పత్రిక ఆదరణ కవుల పట్ల కళాకారుల పట్ల గౌరవం చూపించే పత్రిక. వార్తా పత్రికలో మొదలైన నా కవిత ప్రయాణం చాలా పత్రికలలో ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, విమల సాహితి పత్రిక, నేటి నిజం, ఆంధ్రభూమి, సాహితీ ప్రస్థానం, నవ మల్లెతీగ, బుద్ధ భూమి, ఇలా చాలా పత్రికలలో నా కవితలు పాటలు, ప్రచురితమవుతూనే ఉన్నాయి.

ప్రశ్న 10. మీరు ప్రచురించిన గ్రంధాల గురించి వివరించండి?

జ: ప్రస్తుతానికి 11 పుస్తకాలు ముద్రించాను. వాటి వివరాలు:
1. ఆ పది జిల్లాలు ఆపద జిల్లాలు (దీర్ఘ కవిత) 2. కన్నీటి రణం (దీర్ఘ కవిత) 3. అక్షరం సాక్షిగా (కవితా సంపుటి) 4. అక్షరాభ్యాసం (తెలుగు వాచకం) 5. అక్షరామృతం (గేయ రూప కవిత్వం) 6. అక్షరామృతం సాంగ్ ఫార్మేట్ పోయెమ్స్ (ఇంగ్లీష్) 7. అక్షరామృత్ బాల్ గీత్ (హిందీ) 8. అక్షరామృత్ బాలల గేయాలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ (త్రిభాష పుస్తకం.) 9. అక్షర స్వరం (కవితా సంపుటి) 10. అక్షర కోకిల (పాటలు & గేయాలు) 11. అక్షర భారతి (వ్యాస సంపుటి).

కవి ప్రభాకర్ పుస్తకాలు

కవి ప్రభాకర్ పుస్తకాలు

ప్రశ్న 11. అనువాద ప్రక్రియపై మీ అభిప్రాయం ఏమిటి? మీ రచనలు ఏమైనా అనువాదానికి నోచుకున్నాయా?

జ: సాహిత్యం ఒక నదీ ప్రవాహం అయితే నదిలో అనేక వాగులు వంకలు, ఏరులు కాలువలు కలిసి నదిగా ఏర్పడినట్టు సాహిత్యం కూడా అనేక భాషల సమ్మేళనం. అలా అనేక భాషలలో ఉండబడినటువంటి ఆలోచన ధోరణి ఒక భాషలో నుండి ఇంకో భాషలోకి అనువదించడం అనేది గొప్ప విషయం అనువాదాన్ని మనము అంతగా పట్టించుకోము కానీ, నిజానికి అనువాదంలో ఉండబడినటువంటి అద్భుతమైనటువంటి శక్తి చాలా గొప్పది సార్. సంస్కృతంలో ఉన్న అద్భుతమైన గ్రంథాలను తెలుగులో అనువదించుకున్న అనువాదమే లేకపోతే కాళిదాసు ఎవరో మనకు తెలిసే వారు కాదు. తులసీదాసు.ఆ మాటకొస్తే అద్భుతమైన నవల రచయిత ప్రేమ్ చంద్ అమ్మ నవల రచయిత మాక్సింగ్ గోర్కీ, టాల్ స్టాయ్, వందేమాతరం గొప్పదనం, జనగణమన గొప్పతనం, సారే జహాసే అచ్చా, అన్న ఇక్బాల్ గొప్పతనం అనువాదం వలనే తెలిసింది. అరిస్టాటిల్, సోక్రటీస్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచ వ్యాప్తంగా ఉండబడినటువంటి అనేక మహనీయులు రచనలు అనువాదం చేసుకోవడం వలనే వికాస వంతమైన సమాజానికి అనువాదం వారధిగా పనిచేస్తుంది. లోతైన భావాల విశ్లేషణకు కొత్త పుంతలు తొక్కుతుందని సాహిత్యం మనిషి లోపట ఉండబడిన లోతైన పార్శ్వాలకు అనువాదం వేదిక అవుతుందని భావిస్తున్నాను.

ఇకపోతే నేను “అక్షరామృతం” పేరుతో రాసిన బాలల గేయాలు హిందీలో, ఇంగ్లీషులో అనువాదం కావడం జరిగింది. వీటితో పాటు కన్నడం, తమిళంలో కూడా అనువాదం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.

గిడుగు రామమూర్తి పంతులు గారి జాతీయ విశిష్ట పురస్కారం అందుకుంటున్న దృశ్యం

ప్రశ్న 12. మానుకోట-సాహితీ క్షేత్రంలో మీ పాత్ర ఎలాంటిది? వివరంగా చెప్పండి?

జ: మ్రానుకోట అంటే దట్టమైన చెట్లతో నిండి ఉన్న కోట లాంటి వనము అని అర్థం. ఇలాంటి మానుకోటలో కవులకు కళాకారులకు ఎలాంటి లోటు లేదు. వద్దిరాజు సోదరులు దగ్గర నుండి దాశరథి సోదరులు, ప్రజా సాహిత్యాన్ని అమితంగా అభిమానించే ప్రజాకళాకారులు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేత మహోన్నతమైన పురస్కారం అందుకున్న ప్రజా కవి జయరాజు గారు మానుకోట మట్టి మనిషి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంటింటికో కవి ఇంటింటికో కళాకారుడు ఇంటికొక రచయిత ఉన్నారని చెప్పాలి. సంగీత ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు కూడా ఈ ప్రాంత వాసే. సినీ రచయిత కందికొండ గారు ఈ పట్టణంలోనే చదువుకున్నవారే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడి ప్రజాకవుల యొక్క కళాకారుల యొక్క సాహిత్యమే నన్ను ఈ వైపు పయనించేలా చేసిందని చెప్పాలి. చిన్ననాటి నుండే యక్షగానాలు, చిందు బాగోతాలు, బుర్రకథలు, ఒగ్గు కథలు, ఇలాంటి విషయాలు కళలవైపు సాహిత్యం వైపు ఆకర్షితున్ని కావడానికి మూలమైనాయి.

ఇలాంటి అద్భుతమైన మానుకోట గడ్డమీద నేను జన్మించడం, ఆ మహానీయుల యొక్క కాలి ధూళి నాకు తాకడం వల్లనేమో, నాకు సాహిత్యం పట్ల అభిమానం మెండుగా పెరిగింది. ఇక మీరు అడిగినట్టు మానుకోట సాహితి క్షేత్రంలో మీ పాత్ర ఏమిటి అన్నారు. చక్రి గారితో కొంత పరిచయం ఉండడం ఇక్కడ కవులు కళాకారులతో పరిచయం ఉండడం, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల నిర్మాణంలో భాగస్వామ్యం కావడం మానుకోట జిల్లా అయిన తర్వాత మానుకోట జిల్లా చరిత్ర అంతకుముందు పూర్వం మానుకోట డివిజన్ చరిత్ర వీటన్నిటిలో భాగస్వామ్యం కావడం ఇక్కడ కవి సమ్మేళనము, దేశభక్తిని కలిగించే పాటల పోటీలు, రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి పోటీలు స్నేహాలయం అనే సంస్థ ద్వారా నిర్వహించడం, గుర్రం జాషువా గారు జయంతి, కాళోజి గారి జయంతి, పివి నరసింహారావు గారి జయంతి, సెమినార్లు నిర్వహించడం, మెడికల్ క్యాంపులు నిర్వహించడం, వ్యాసరచన పోటీలు పెట్టడం జరుగుతూ వస్తుంది.

సినీగీత రచయిత శ్రీ సిరివెన్నెల, గాన గంధర్వుడు ఎస్పీ బాలు గారితో

ప్రశ్న 13. మీరు పొందిన అవార్డులు సన్మానాలు గురించి వివరించండి?
జ: పలు సంస్థలు వివిధ రూపాల్లో అభినందించి పురస్కారాలు అందించాయి.

~

* ‘సంచిక’ వార, మాస పత్రికల తరఫున మీకు కృతజ్ఞతలు.

జ: ధన్యవాదాలు సర్.

Exit mobile version