Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఇక్బాల్ మినార్ సర్కిల్

[శ్రీ ఆసూరి హనుమత్ సూరి రచించిన ‘ఇక్బాల్ మినార్ సర్కిల్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

ఎప్పట్లా కాకుండా ఆ రోజు కాస్త ఆలస్యంగా బయల్దేరాను ఆఫీస్‌కి.

మేం ఉండేది ఖైరతాబాద్‌లో.. ఆఫీస్ సైఫాబాద్‌లో తెలంగాణా సెక్రటేరియట్ ఎదురుగా..

నిజానికి ఇంకాస్త ముందుగా బయల్దేరితే నడిచే వెళ్ళగలిగేంత దగ్గర. కానీ ప్రతి రోజూ ఏదో హడావిడి.. ఓ పావుగంట ఉందనగా బయల్దేరడంతో రోజూ కారు తియ్యడం.. మామూలై పోయింది! ఆ రోజు కూడా అలాగే కారు తీసి ఇంకాస్త టెన్షన్‌గా బయల్దేరాను. అందరికీ ఆఫీసులకు వెళ్లే టైం అవడంతో మా ఇంటిముందు నుండే ట్రాఫిక్ విపరీతంగా ఉంది. ఉసూరుమంటూ డ్రైవ్ చేస్తున్నా.. ముందున్న ఇక్బాల్ మినార్ సర్కిల్ వైపుకు వెళ్తూ అనుకున్నా.. ఈ రోజు ఆఫీస్‌కి టైమ్‌కి చేరలేనేమోనని.

ఆశ్చర్యం.. రెండు నిమిషాల్లో ట్రాఫిక్ క్లియర్ అయిపోవడం.. నేను ఆఫీస్ కి అనుకున్న దానికంటే ముందే చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. హమ్మయ్య అనుకుంటూ వెళ్లి సీట్లో కూర్చుని పనిలో నిమగ్నమయిపోయాను. ఎంతలా అంటే లంచ్ టైమ్ అయింది కూడా గమనించ లేదు.

ఉన్నట్టుండి రకరకాల కూరల వాసనలు వస్తుంటే అటూ ఇటూ చూశాను. అందరూ వాళ్ళ వాళ్ళ లంచ్ బాక్సుల్ని తెరుస్తున్నారు. ఇక నేనూ నా లంచ్ బాక్స్ తీసి ఓ పావుగంటలో భోజనం ముగించి.. ఎప్పట్లానే కొలీగ్స్‌తో కలిసి వాకింగ్‌కి బయలుదేరాను.

అలా బయలుదేరానో లేదో ఇంటి నుండీ ఫోన్. మా మావయ్యకి గుండెల్లో నొప్పిగా ఉందని హాస్పిటల్లో చేర్చారంటూ శ్రీమతి ఫోన్. నాకూ ఫోన్ వచ్చింది కానీ సైలెంట్‌లో ఉండిపోవడంతో చూసుకోలేదు. వెంటనే ఆఫీస్‌కు వెళ్ళిపోయాను. త్వరగా పని ముగించుకుని ఊరికి బయలుదేరాలని.

***

సీతారామయ్య.. మా మావయ్య.. మా అమ్మగారికి ఒకే అన్నయ్య..

జనగాం దగ్గర రఘునాథపల్లెలో ఉంటారు. ఎనభై ఏళ్ళొచ్చినా ఇప్పటికీ వ్యవసాయం చేస్తుంటారు. దాదాపు నా బాల్యమంతా అక్కడే గడిచింది. నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడే నాన్న కాలం చెయ్యడంతో అమ్మతో కలిసి మావయ్య దగ్గరికి వెళ్లిపోయాం. సిటీలో చదువుతున్న నేను హఠాత్తుగా పల్లెకి వెళ్లడంతో నా చదువు ఏమైపోతుందో అని అమ్మ ఆందోళన పడిన మాట ఎంత వాస్తవమో.. నేను అనుకున్న దానికంటే మంచి స్థాయిలో జీవితంలో స్థిరపడిన మాట అంతే వాస్తవం. ఇందుకు నేను కృతఙ్ఞతలు చెప్పుకోవాలంటే మొదటగా చెప్పుకోవాల్సింది ఆ దేవుడికి అంటాననుకున్నారేమో.. కాదు కాదు మా మావయ్య గారికే.. ఆయనే మా దేవుడు.

తన ఇద్దరు కొడుకులతో సమానంగా నన్నూ చదివించారు. నిజానికి వాళ్ళ కంటే ఎక్కువే చదివించారు.

ఇలా ఆలోచిస్తూనే.. అన్యమనస్కం గానే పని ముగించి ఆ రోజుకి ఐదున్నరకే ఆఫీస్ నుండీ బయటపడ్డాను.

***

ఆఫీస్ నుండీ ఇంటికి వెళ్లాలంటే మళ్ళీ అదే సర్కిల్.. ఇక్బాల్ మినార్ సర్కిల్ దగ్గరే కుడి వైపుకు తిరగాలి నేను.. అందరికీ ఆఫీసుల నుండీ ఇళ్లకు బయల్దేరే సమయం కావడంతో ట్రాఫిక్ విపరీతంగా ఉంది. సర్కిల్ దగ్గర పాట్లు తప్పవు అనుకుంటూనే కారు స్టార్ట్ చేశాను.

అటు మెహిదీపట్నం, ఖైరతాబాదు నుండీ ద్వారకా హోటల్, టెలిఫోన్ భవన్ మీదుగా వచ్చేవాళ్ళు, ఇటు అసెంబ్లీ నుండీ రిజర్వు బ్యాంకు మీదుగా సెక్రటేరియట్‌కు వచ్చేవాళ్ళు, హిమాయత్‌నగర్ నుండి మా ఆఫీస్ మీదుగా లక్డీకాపూల్ వెళ్లే వాళ్ళు, అలాగే తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్ మీదుగా అసెంబ్లీ, నాంపల్లి వెళ్లే వాళ్ళు అందరూ తప్పని సరిగా వెళ్ళాల్సింది ఇక్బాల్ మినార్ సర్కిల్ మీద నుండే..!

ఇలా మళ్ళీ టెన్షన్ గానే సర్కిల్ దగ్గరికి వచ్చాను. అక్కడో పోలీసు ఉన్నాడు.. రెండు నిమిషాల్లో ఎటు వాళ్ళు అటు వెళ్లే ఏర్పాటు చేశాడు. అనుకున్న దాని కంటే ముందుగానే ఇల్లు చేరాను.

అదృష్టం..! కాదు కాదు నా దేవుడిని చూసుకోవడానికి ఆ దేవుడు చూపించిన దారి.

***

ఇంటికి వెళ్ళగానే శ్రీమతి బట్టలు సర్ది రెడీగా ఉంది. మేం బయలుదేరాల్సిన బస్సు సాయంత్రం ఏడున్నరకే అవడంతో రాత్రి భోజనం కూడా ప్యాక్ చేసుకుని పిల్లలకు జాగ్రత్త చెప్పి జనగాం బయలుదేరాం. మావయ్యని జనగాం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోనే చేర్చారు. వీలయినంత త్వరగా వెళ్లి ఆయన్ని చూడాలని ఉంది.

బస్సెక్కిన దగ్గర్నుంచీ ఆయన గురించే మాట్లాడుకుంటున్నాం.. ఇద్దరం.

***

ఆ రోజు ఇలాగే నాలుగో తరగతి పరీక్షలు రాస్తున్నా నేను. మధ్యలోనే మా టీచర్ వచ్చి మీ మావయ్య వచ్చాడు, ఇంటికెళ్లాలని చెప్పారు. నాకేం అర్థం కాలేదు. బాగానే చదువుకున్నా పరీక్ష మధ్యలోనే ముగించి మావయ్యతో ఇంటికి బయల్దేరాను. ఇంటికెళ్ళేసరికి తెలిసింది నాన్న ఇక లేడని. దుఃఖం ఆగలేదు. మావయ్య ఏదో పని మీద సిటీకి వచ్చారు కాబట్టి సరిపోయింది. సమయానికి దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. నాన్నకి ఆస్తమా ఉండేది. అందుకు మందులకయ్యే ఖర్చు మావయ్యే భరించేవాడట, అమ్మ చెప్తూ ఉండేది. నువ్వు బాగా చదువుకుని ఇంటి ఖర్చుల్ని, అలాగే బాధ్యతల్ని మొయ్యాలని అమ్మ చిన్నప్పట్నుంచీ చెప్తుండేది.

కానీ నాన్నగార్ని బాగా చూసుకోవాలనే ఆశ తీరకుండానే ఆయన మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. అది మొదలు మా మావయ్య అమ్మని, నన్ను ఎవ్వరూ చెప్పకుండానే తనతో తీసుకెళ్లారు. ఒక్క నాన్న లేరన్న లోటు తప్ప మాకు ఏ లోటూ రాకుండా చూసుకున్నారు.

దానికి తోడు అమ్మ నాకు చెప్పిన మాటలు గుర్తు పెట్టుకుని నేనూ బుద్ధిగానే చదువుకునేవాడిని.

నిజానికి మావయ్య పెద్దగా చదువుకోలేదు. పొద్దున్నే లేచి చద్ది కట్టుకుని పొలానికి వెళ్లిపోయేవాడు. వెళ్లే ముందు మాత్రం త్వరగా లేచి రెడీ అయ్యి స్కూల్‌కి వెళ్ళమని, బాగా చదువుకోమని చెప్పేవాడు. మార్కులు ఎలా వస్తున్నాయని మాత్రం క్రమం తప్పకుండా తెలుసుకునేవాడు. స్కూల్‌కి వచ్చి మరీ మా టీచర్లతో వాకబు చేసేవాడు. ఏ మాత్రం అశ్రద్ధ చూపినా సున్నితంగా మందలించే వాడు. దాంతో ఆయన మా గురించి ఓ కన్నేసి ఉంటాడు అన్న స్పృహ ఎప్పుడూ ఉండేది మాకు. దీంతో తెలీకుండానే ఆయన భయం మాలో ఉండిపోయి మాకు మేమే క్రమశిక్షణగా ఉండడం అలవాటయి పోయింది.

ఐదో తరగతి దాటి హైస్కూల్‌కి వెళ్లినా మాకు అలవాటయిన క్రమశిక్షణ తప్పలేదు. అదే నన్ను పదో తరగతి స్కూల్ ఫస్ట్ వచ్చేలా చేసిందంటే అతిశయోక్తి కాదు. సెకండ్ క్లాసులో టెన్త్ పాసయిన తన కొడుకుల్ని కాదని నన్ను మాత్రం ఖర్చు పెట్టి హాస్టల్‌లో ఉంచి ఇంటర్ చదివించారు. అందుకే ఆయనంటే నాకు భయం మాత్రమే కాదు భక్తి కూడా.

ఐదు పదులు దాటినా ఇప్పటికీ మా మావయ్య అలవాటు చేసిన క్రమశిక్షణే నాకు గుర్తింపు తెచ్చి పెడుతోందని చెప్పగలను.

***

ఇలా ఆయన జ్ఞాపకాల్ని తలుచుకుంటుండగానే భోన్‌గిర్ వచ్చింది. తెచ్చుకున్న చపాతీలని బలవంతం గానే తిన్నాం ఇద్దరం. మెత్తగానే ఉన్నా మింగుడు పడలేదు చపాతీలు.. నిజానికి మింగుడు పడనిది చపాతీలు కాదు.. మావయ్య ఇలా ఆస్పత్రిలో ఉన్నాడన్న నిజం.. మింగుడు పడనిది.

భోజనం కానిచ్చి మందులు వేసుకున్నా. మళ్ళీ ఆయన జ్ఞాపకాలు..

***

ఆ రోజు పెళ్లి పీటలమీద మావయ్య, అత్తయ్యా కూర్చున్నారు అమ్మా నాన్నల స్థానంలో.

నా కన్నా పెద్ద వాడైనా తన కొడుకుకు కాకుండా నాకు పెళ్లి చేశాడు. విషయం అది కాదు. తన బావ, బావమరిది ఇద్దరూ దగ్గరుండి నా పెళ్లి పనుల్ని చూడడం. ఊళ్ళో అందరూ గుసగుసలాడుకోవడం ప్రత్యక్షంగా చూశాన్నేను.

ఆయన నేర్పిన సంస్కారం, ఇతరుల ఔన్నత్యాన్ని గౌరవించడం, మనకూ మంచి రోజు వస్తుందని ఎదురుచూసే ఓర్పు ఇలా చెప్పుకుంటూ పొతే ఆయనో మూర్తీభవించిన సుగుణాల రాశి. అవే మా బావ, బామ్మర్దులకి అబ్బాయనిపిస్తుంది. వాళ్ళు ఏకోశానా ఈర్ష్యపడకుండా నా పెళ్లి దగ్గరుండి జరిపించడం చూసిన నా శ్రీమతికి మా కుటుంబం మీద ఇచ్చిన ఫస్ట్ ఇంప్రెషన్.. అది.

ఇలా నెమరేసుకుంటుండగానే జనగాం రానే వచ్చింది.

బస్సు దిగి నేరుగా ఆస్పత్రి  వెళ్ళాం. మావయ్య ఐసీయూలో ఉన్నాడు. ఆయన పెద్ద కొడుకు అక్కడే ఉన్నాడు.

“పొద్దున్నించి నలతగా ఉందని పడుకున్నాడు. ఎంత పొద్దయినా లేవలేదేమని చూసేసరికి ఒళ్ళంతా చెమటలు. మనిషి చల్లగా అయిపోయున్నాడు. అంబులెన్సును మాట్లాడి ఆస్పత్రికి తీసుకొచ్చారట. మైల్డ్ హార్ట్ స్ట్రోక్ అన్నారట. ఏదో మందులిఛ్చి ఐసీయూలో ఉంచారని” చెప్పారు బావగారు. బామ్మర్ది పూణేలో బయల్దేరారట. విషయం తెలియగానే నాకు ఫోన్ చేసింది తానే. అన్నయ్యకి పెద్దగా తెలీదు. నన్ను వెళ్లి చూసుకొమ్మని ఫోన్ చేశాడు కానీ నేను ఫోన్ తియ్యకపోయేసరికి మా ఆవిడకి ఫోన్ చెయ్యాల్సి వచ్చిందని చెప్పారు బావగారు.

జరిగిన పొరపాటు కు చాలా ఫీలయ్యాను. వెంటనే డాక్టర్‌ని కలిసి విషయం వాకబు చేశాను. అవసరమైన ఇంజక్షన్స్ ఇచ్చారని.. రెండు రోజులు చూసి డిశ్చార్జ్ చేస్తామని చెప్పాడు డాక్టర్. వెంటనే బామ్మర్దికి ఫోన్ చేసి చెప్పాను. ఏం కంగారు పడక్కర్లేదు.. నేను చూసుకుంటానని చెప్పి రెండు రోజులు ఉండి మావయ్యని ఇంటికి తీసుకెళ్ళాకనే హైద్రాబాదుకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను.

***

ఆ రోజు రాత్రి శ్రీమతిని, అత్తయ్యని ఇంటికి పంపి నేనూ బావగారూ తోడుగా ఆస్పత్రి లోనే ఉన్నాం. అర్ధరాత్రి నర్సులు వచ్చి ఆయనకి మెలకువ వచ్చిందనీ ఎవరైనా వచ్చి పలకరిస్తే బావుంటుందని చెప్పడంతో నేనూ బావా లోనికి వెళ్లాం. ముందు నన్ను చూసి, ఆ తర్వాత బావగారితో చెప్పిన మాట..  “అల్లుడొచ్చాడు.. ఇంకేం పర్వాలేదు.. చిన్నోడిని రావక్కర్లేదని చెప్పు. అంతా బాగయి పోతుంది. వీలుచూసుకుని రమ్మని చెప్పు.. మరేం కంగారు లేదు”  అని. నా మీద ఆయనకున్న నమ్మకానికి నాకే సిగ్గేసింది. వెంటనే బయల్దేరలేదే.. పైగా కారులో వచ్చి ఉండొచ్చు తాను. ఈ కంగారులో డ్రైవింగ్ ఎందుకని రిస్కు తీసుకోలేదు.

అంత ధైర్యంగా ఉన్న ఆయనకి ధైర్యం చెప్పేంతటి వాడినా నేను.? అయినా మొక్కుబడిగా ధైర్యం చెప్పక తప్పలేదు నాకు.

మరుసటి రోజు డాక్టర్ వచ్చేసరికి, బామ్మర్ది కూడా రావడంతో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి అని అడిగాం డాక్టర్ని.

“కొద్ది రోజులు ఆయనని అబ్సర్వేషన్ లో ఉంచితే మంచిది. వీలయితే రెండు రోజులుండి సిటీకి తీసుకెళ్లి కొంచెం పెద్ద ఆసుపత్రిలో చూపిస్తే బెటర్.” అన్నాడు డాక్టర్.

ఇక ఆలస్యం చెయ్యకుండా చెప్పేశాను “ఇంకో రెండు రోజులు సెలవు పెట్టి ఇక్కడే ఉండి నాతో పాటు సిటీకి తీసుకెళ్లి అవసరమైన టెస్టులు చేయించి కొద్ది రోజులు నాతో ఉంచుకుని తీసుకొస్తాను” అని.

“మేం చూసుకుంటాంలే బావా మీ కెందుకు శ్రమ” అంటున్న మా మావయ్య కొడుకులని చూసి నాకే సిగ్గనిపించింది.

ఏమైతేనేం నా శ్రీమతి కూడా నాకు తోడవ్వడంతో రెండు రోజులు అక్కడే ఉండి అత్తయ్యని, మావయ్యనీ కూడా తీసుకుని కారు మాట్లాడుకుని హైద్రాబాదు బయల్దేరాం.

***

ఆ రోజు మళ్ళీ సిటీలోకి వచ్చేసరికి రాత్రి ఎనిమిది. ఎప్పట్లానే ట్రాఫిక్ జామ్. మెల్లి మెల్లిగా డ్రైవ్ చేసుకుంటూ మా ఆఫీస్ ముందునుండే వచ్చాం.. మావయ్య గారికి మా ఆఫీస్‌ను చూపిస్తూ. యథా ప్రకారం ఇంటికి వెళ్లాలంటే ఇక్బాల్ మినార్ సర్కిల్ నుండే వెళ్ళాలి.

సర్కిల్ దగ్గరకి వచ్చేసరికి నాలుగు వైపుల నుండీ క్రిక్కిరిసి వాహనాలు. పైగా అక్కడ పోలీసు కూడా లేడు. హైద్రాబాదులో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని అతి రద్దీగా ఉండే సర్కిల్ ఏదైనా ఉందీ అంటే అది ఈ సర్కిలే.

కానీ ఎవ్వరూ అక్కడ హారన్ మోగించరు. ఎంతో బాధ్యతాయుతంగా తలో కొద్దిసేపు దారి ఇస్తారు. అవతలి వాళ్ళు వెళ్లే దాకా ఎంతో సంయమనం పాటిస్తారు. తమకీ అవకాశం వస్తుంది అని ఓపిగ్గా వేచి చూస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్న కూడళ్లలో కూడా మనకు ఇంత సంయమనం కనిపించదు. పైగా ఇక్కడ పోలీసు ఉన్నా లేకపోయినా ఎవరో అదుపు చేస్తున్నట్టు గా కాక తమంత తామే అదుపులో ఉంటారు.

ఇవన్నీ మా మావయ్య నేర్పిన జీవిత సూత్రాల్లా అనిపించాయి నాకు.

ఇంతలోనే అడిగారు మావయ్య “ఈ సర్కిల్ ని ఏమని పిలుస్తారు మాధవ్?” అని.

“ఇక్బాల్ మినార్ సర్కిల్.. అంటారు మావయ్యా..!” అన్నాను. ఆ క్రిందే ఎల్.ఇ.డీ బల్బులతో రాసి ఉన్న ‘సారె జహాఁ సే అచ్ఛా.. హిందుస్తాన్ హమారా..!’ అన్న ఇక్బాల్ రాసిన పాటని గమనించాను.

మహమ్మద్ ఇక్బాల్ తన సూక్తుల్లో చెప్పిన నీతి, క్రమశిక్షణ, విశ్వాసం అక్కడ గాల్లో తిరుగాడుతున్నాయా అనిపించింది నాకు.

Exit mobile version