రవళి ఏవో జ్ఞాపకాల నుంచి తప్పించుకుందుకు ఎం.కాం అంటూ మొదలుపెట్టింది గాని ఆమెకు చదవాలనిపించేది కాదు. అంకె అంకెలో…. అక్షరం… అక్షరంలో సంహిత కనిపించేది. సంహిత ఎందుకు వచ్చావ్ ఈ వూరికి, ఎందుకు వచ్చావ్ నా జీవితంలోకి అని బాధపడేది. రాసిన బ్యాంక్ ఎగ్జామ్స్ ఫలించి ఆమెకు బ్యాంక్ జాబ్ వచ్చింది.
చాలారోజుల తర్వాత రవళి పెదవుల మీద నిజమైన నవ్వు కనపడింది. ఆమెకు దగ్గరలోనే పల్లెటూరులో చిన్న బ్రాంచ్‍లో పోస్టింగ్ ఇచ్చారు. ఇటు ఆమెకు పెళ్ళి సంబంధం కూడా కుదిరింది.
“అబ్బా వెంకట్, ఆ పేరేంటక్కా బాగాలేదు. మంచిపేరున్న వాడిని చేసుకో” అంది స్నేహ.
“సంహిత… చాలా అందమైన పేరు. అందరినీ మోసం చేసింది” అంది రవళి.
ఆదిలక్ష్మి మనసుకి చాలా సంతృప్తి కలిగింది. కూతురంటే రవళిలాగా ఉండాలి. సంహిత లాంటి మనిషి పక్కనే వున్నా తన పద్ధతిని క్రమశిక్షణను వదులుకోలేదు. చదువు అనే కత్తితో బలహీనతలనే విష వృక్షాలను నరుక్కుంటూ వచ్చింది. ఈ గుణం అందరికీ వుండదు. అంతెందుకు స్నేహకే లేదు. స్నేహ డిగ్రీ ఫస్టియర్ లోకి వచ్చిందిప్పుడు.
ఏడిపించే అన్నగారు, దగ్గరుండి చదివించే అక్కగారు లేరు. ఇన్నాళ్ళు అబ్బా… ఈ పెద్దవాళ్ళు నాకు స్వేచ్ఛనివ్వలేదు అనుకునేది. కాని ఇలాంటి స్వేచ్ఛ వద్దు. అన్న, అక్క వుంటే బాగుండేదనిపిస్తోంది.
“స్నేహా కాలేజికి వెడుతున్నావ్ చాలా జాగ్రత్తగా వుండాలి. నీ పనేమో నువ్వేమో అన్నట్టు వుండాలి.”
“అలాగే” స్నేహ నవ్వుతూ కాలేజికి బయలుదేరింది.
అమ్మ ఎప్పుడు మారుతుందో తెలియదు. తలవంచుకుని కాలేజికి వెళ్ళినంత మాత్రాన తలపులు రావా… మనిషిని కట్టెయ్యగలరు గానీ మనసును కట్టే తాళ్ళు లేవు. కాకపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా ఏదో ఒక మంచి పని చేస్తుండాలి. ఆమె తన ఆలోచనలకు తానే నవ్వుకుంటూ కాలేజిలోకి వెళ్ళింది.
“ఏమిటో నీలో నువ్వే నవ్వుకుంటున్నావ్” అంటూ వచ్చింది చంద్ర.
“ఏం లేదు మా అమ్మ నీతో మాట్లాడవద్దంది” అంది స్నేహ.
“ఎందుకు? నేనేం చేశాను.”
“ఏం చెయ్యలేదు. చంద్రా అని ఆ మగవాడి పేరేమిటి? తార అని పేరు మార్చుకో” అంది స్నేహ నవ్వుతూ.
“అబ్బా ఏం తెలివి? నా పేరు చంద్రకళ అయితే నువ్వేగా చంద్రా అని పిలుస్తావ్.”
“అవును ఇంట్లో చంద్ర అలా… చంద్ర ఇలా అంటే మా అమ్మ నేనో బాయ్‍ఫ్రెండ్‍ని సంపాదించాననుకుంటోంది”
ఇద్దరూ నవ్వుకున్నారు.
“ఏమిటీ ఫ్రెండ్స్ యిద్దరూ నవ్వుకుంటున్నారు” అంటూ వచ్చాడు బాలు.
అతన్ని చూసి స్నేహ కళ్ళు మెరిశాయి. స్నేహ వేసుకున్న డ్రెస్ బాగుందన్న ప్రశంస అతని కళ్ళల్లో కనబడింది.
“ఏం లేదు… నా పేరును చంద్ర నుంచి తారలోకి మారుస్తుందిట స్నేహ”
“ఏం ఎందుకు చంద్ర బాగానే వుందిగా”
“ఉహు అది మగవాళ్ల పేరులా వుందిట. అందుకని”
“ఈ రోజుల్లో ఆ బాధేమి లేదు. ఏ పేరైనా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరూ పెట్టుకుంటున్నారు”
ఇంతలో అతన్ని ఎవరో పిలవడంతో అటు వెళ్ళాడు బాలు.
“అబ్బ మనమేదో చెప్పుకుంటే అతనికెందుకు చెప్పావ్” అంది స్నేహ.
“లేదులే నువ్వు చంద్రకి… తారకి నాపేరు మార్చడం ఎంత బాగుంది అందుకే చెప్పాను”
చంద్రకళ, బాలు… బాలకృష్ణ హైస్కూలు నుండి క్లాస్‍మేట్స్. అందుకని డిగ్రీలోకి వచ్చిన బాల్య స్నేహితులుగానే మాట్లాడుకుంటారు.
***
ఆమె యింటికి వచ్చేసరికి రవళి రాసిన ఉత్తరం వచ్చి వుంది. తన చెల్లెలు అప్పుడే డిగ్రీలోకి రావడం చాలా ఆనందంగా వుందని బాగా చదువుకోమని రాసింది.
స్నేహకి ఉత్తరం చూస్తే సంహిత గుర్తుకు వచ్చింది. ఎక్కడుంది ఆ మనిషి… కలలా కనిపించి… మెరుపులా మెరిసి మాయమైపోయింది. అక్కకే కాదు తనకీ బాగా గుర్తుకు వస్తుంది. ఒకప్పుడు తను ఊహాలోకంలో విహరించి ఆరోగ్యం పాడుచేసుకుంది. అప్పుడే తను సంగీతం నేర్చుకుంటానని చెప్పి సంగీతం మొదలుపెట్టింది. అటు చదువు, ఇటు సంగీతం దానితో తనకి పిచ్చిపిచ్చి ఆలోచనలకి టైమే వుండేది కాదు.
తనిప్పుడు గొప్పగా పాడలేకపోయినా పాటను చెడగొట్టదు. అసలు హైస్కూల్లోని సంగీతం టీచరు సాధారణంగా ఎవరికీ సంగీతం నేర్పరు. అటువంటిది తనని శిష్యురాలిగా తీసుకోవడమే సంతోషం.
సంహిత కూడా ఇలా ఏదైనా ఆర్ట్ నేర్చుకుని వుంటే బాగుండేదా… అక్కడ కూడా ఆమె పాటకు కాకుండా అందానికే ప్రాధాన్యతమిస్తే…. సంగీతం క్లాసులకు వెళ్ళి ఏం లాభం. కొంతమందికి అందమే శాపంగా మారుతుంది.
“స్నేహ… ఓ స్నేహా…” ఆదిలక్ష్మి పిలవడంతో స్నేహ ఆలోచనల్లోనుంచి బయటకు వచ్చింది.
“ఏంటమ్మా… అలా పిలిచావ్”
“ఈ సూదిలో దారం ఎక్కించు, కళ్ళజోడు పెట్టుకున్నా కనిపించడంలేదు”
స్నేహ దారం ఎక్కించి యిచ్చింది.
***
స్టూలు వేసుకుని గుమ్మాలన్నింటికి మామిడి తోరణాలు కడుతోంది స్నేహ.
“ఏమిటే ఇంత హడావిడి చేస్తున్నావ్ నీ మేనకోడలు వస్తోందనే” అడిగారు బామ్మగారు.
“అవును పాప మొదటిసారిగా మనింటికి వస్తోందిగా”
“సింహద్వారం ఒక్కదానికే చాలు అన్ని గుమ్మాలకీ ఎందుకు?”
“సింహద్వారానికి కంపల్సరీ, దేవుడి గదికి తప్పనిసరి, పాప పడుకునే గదికి సిరిసిరి…. మిగతా గదులకు సరిసరి…”
ఈ ప్రాసకు బామ్మగారికి మతిపోయింది. “అంటే ఏమిటే” అన్నారు.
“ఏమో నాకు తెలియదు పదాలు బాగున్నాయి మాట్లాడేశాను” అంది.
రవికి కూతురు పుటింది. స్నేహ తర్వాత దాదాపు పద్దెనిమిదేళ్ళకు ఆ యింట్లో పాపాయి. రవికి గవర్నమెంటు స్కూల్లో జాబ్ వచ్చింది. అందరూ కూతురు పుట్టిన వేళా విశేషం అన్నారు. ఆ మాటలు స్నేహకు నచ్చలేదు.
“అన్నయ్య చాలారోజులుగా గవర్నమెంటు జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. అది యిప్పుడు వచ్చింది. దానికీ పాపకు సంబంధం ఏమిటి” అంది స్నేహ.
“అంతే మనుషులు ఏదో ఒక నమ్మకాన్ని పట్టుకు వేళాడుతుంటారు. మంచి జరిగినప్పుడు ఇలా అనుకున్నా ఫర్వాలేదు. చెడు జరిగితే కూడా ఇలాగే అంటారు” అంది ఆదిలక్ష్మి.
రవళికి పెళ్ళి కావడం, రవి ఇక్కడ ఉండకపోవడంతో ఆదిలక్ష్మికి, స్నేహకు మంచి అనుబంధం ఏర్పడింది. అప్పుడప్పుడు బామ్మగారు కూడా వాళ్ళ మాటల్లో పాలు పంచుకుంటారు.
రవి కూతురు రమణి చాలా నచ్చింది స్నేహకు. తెల్లటి ఒళ్ళు, నల్లటి దుబ్బు లాంటి జుట్టు, ఎర్రని పెదవులు. చూడటానికి వచ్చిన వాళ్ళందరూ రవళి పోలిక, మంచి అందగెత్తె అనడం మొదలుపెట్టారు. ఆ చిన్నదానికి వాళ్ళ అమ్మే సరిగా తెలియదు. ఇంక అందమంటే ఏం తెలుస్తుంది. ఇలా మాటాడితేనే మరో సంహితలు తయారయ్యేది. స్నేహ తల విదిలించింది, ఆ జ్ఞాపకాలు రాలిపోవాలన్నట్టు.
పాపను చూడటానికి హైదరాబాద్ నుండి రవళి వచ్చింది.
“పాపకి రమణి అని పేరుపెట్టారేమిటి వదినా… మరో కొత్త పేరు పెట్టవలసింది” అంది.
రవి, శ్రావణి ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు.
“అది కొత్త పేరే రవళి, నా పేరులో మొదటి అక్షరం ‘ర’, శ్రావణిలో ఆఖరి అక్షరం ‘ణి’ కలిపి వాటికి బ్రిడ్జిలాగ ‘మ’ కలిపి రమణి అని పెట్టారు. ఇప్పుడందరూ ఇలాగే పేర్లు పెడుతున్నారు” అన్నాడు రవి.
బాగానే వుంది. ఒకవేళ రవళికి పిల్లలు పుడితే బావగారి పేరులో మొదటి అక్షరం ‘వెం’, అక్క పేరులో ఆఖరి అక్షరం ‘ళి’ వాటిమధ్య మరో అక్షరం ఏం పెడితే బాగుంటుంది. క…చ…గ… ఆహ బాగా కుదిరింది. ‘వెంగళి’ తన ఆలోచనకి తనే నవ్వుకుంది స్నేహ.
“అక్కా! ఈ మధ్య కృపామణి చెల్లెలు మేరి కనిపించింది. కృపామణి ఇప్పుడు ఇక్కడే వుందిట. తనకి ట్విన్స్ పుట్టారుట. ఎలాగు నువ్వు వచ్చావుగా ఒకసారి వెళ్ళి చూద్దామా.”
సాయంత్రం ఇద్దరూ కృపామణి ఇంటికి వెళ్ళారు. తను కాస్త లావైంది. ట్విన్స్ యిద్దరూ అబ్బాయిలు. అయిదోనెల బాగున్నారు. విక్టర్, పీటర్ వాళ్ల పేర్లు. చెరొక అయిదువందలు గిఫ్ట్ యిచ్చింది రవళి.
“అరె ఫ్రెండ్స్ మధ్యా ఇవన్నీ ఏమిటోయ్” అంది కృపామణి.
“నీకు కాదులే న్యూ లిటిల్ ఫ్రెండ్స్‌కి ఇచ్చాను” అంది రవళి.
రంగు వైర్ల పూసలతో చేసిన చిన్న షాండ్లియన్ ఇచ్చింది స్నేహ.
“నువ్వే చేశావా చాలా బాగుంది” అంది మేరి.
“మా అన్నయ్య పాప ఉయ్యాల కోసం ఒకటి చేశాను. ఇంకొకటి చేస్తే ఎవరికైనా గిఫ్ట్‌గా యివ్వొచ్చు అని తయారు చేశాను” అంది స్నేహ.
“హైదరాబాద్‍లో మనవాళ్ళు ఎవరైనా కనిపించారా” అంది కృపామణి.
“ఆ వూరు ఒక మహాసముద్రం, ఎవరి పనులలో బిజీ వారిది” అంది రవళి.
“బ్యాంక్ ఆఫీసరువయ్యారు సంతోషం రవళి”
“నీకు మన క్లాస్‌మేట్స్ ఎవరైనా కనిపించారా?” అడిగింది రవళి.
“ఆ మధ్య ఫాతిమా కనిపించింది, తనకిప్పుడు నలుగురు పిల్లలు. కామేశ్వరి అమెరికాలో వుందిట. రమణి ఆస్ట్రేలియాలో వుంది. ఆ…. సంహితా వాళ్ళు కూడా అమెరికాలో వుంటున్నారట”
(ఇంకా ఉంది)