Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జబ్ వుయ్ మెట్

సినిమావాళ్ళ పరిచయం మామూలు వ్యక్తులకి ఎలా కలుగుతుంది? సినిమాల ద్వారానే కదా!

చిన్నప్పుడు అమ్మవాళ్ళు మనల్ని వెంటేసుకుని ఎన్నో భక్తి సినిమాలకి వెళ్ళి ఉంటారు. అవేవి మనకి గుర్తుండకపోవచ్చు. మా నాన్నగారు మమ్మల్ని తీసుకెళ్ళిన ఒకే ఒక సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారి ‘తెనాలి రామకృష్ణ’. తరువాత చాలా ఏళ్ళ పాటు సినిమాలు బంద్. ఆ వయసులో సినిమాల కన్నా ఆటలూ, స్నేహాలే ముఖ్యం కదా.

ఓసారి, పండగ సెలవల్లో నేనొక్కడినే (అక్కా, తమ్ముడు రాకుండా) మా పెద్దమావయ్య వాళ్ళింటికి విజయవాడ వెళ్ళాను. ఓ రోజు మావయ్య ఎందుకో లేట్‌గా వస్తానని చెప్పినట్టుంది బ్యాంకులో; ఉదయం ఆటకి రాధ థియేటర్‍లో టికెట్ తీసి, నన్ను కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. అది అక్కినేని ‘కీలుగుర్రం’ సినిమా. అప్పటికి ఎన్నిసార్లు రీరిలీజయ్యిందో! అది నేను సోలోగా థియేటర్‌లో చూసిన మొదటి సినిమా.

బాల్యం దాటి కౌమారంలోకి వచ్చే సమయంలో, ఇంట్లో పెద్దవాళ్ళు సినిమాకి వెళ్తూ, నన్ను కూడా తీసుకెళ్ళడం మొదలయింది. అలా మా బాబాయితో కలిసి 1981లో వచ్చిన ‘కొండవీటి సింహం’ చూశాను. 1983లో విజయవాడలోనే అనుకుంటా, మావయ్యతో కలిసి నా మొట్టమొదటి ఇంగ్లీష్ సినిమా ‘Never Say Never Again’ చూసాను. అలాగే చిరంజీవి ‘ఖైదీ’ సినిమా కూడా. ఆయనకి అది సూపర్ హిట్ సినిమా. కానీ అప్పట్లో నాకెందుకో పెద్దగా ఎక్కలేదు.

ఎనిమిదో తరగతి నుండి 10వ తరగతి వరకు గుంటూరులో అమ్మమ్మ వాళ్ళింట్లో ఉండి చదువుకున్నాను. అప్పుడు మా కజిన్స్‌తో కలిసి ‘సాయిబాబా మహత్యం’ వంటి భక్తి సినిమాలు చూసినట్టు గుర్తు. టెంత్ క్లాసుకి వచ్చాకా, సినిమాలు బాగా చూశాను. బ్రాడీపేట ఒకటో వీధి ఒకటో అడ్డరోడ్డులో అమ్మమ్మ వాళ్ళిల్లుండేది. రంగమహల్, శేష్‌మహల్, లక్ష్మీ పిక్చర్ ప్యాలస్ మాకు చాలా దగ్గర. మావయ్యలతో కలిసి చాలా సినిమాలకు వెళ్ళేవాడిని. అవన్నీ ఒక ఎత్తు, 1988 ఏప్రిల్‌లో విడుదలైన ‘యముడికి మొగుడు’ మరొక ఎత్తు!

ఆ సినిమా ఒక ఊపుని నాకు కొత్తగా పరిచయం చేసింది. దాని పేరు చిరంజీవి! ఆయన డాన్సులకీ ఫైట్‌లకి అభిమానినైపోయాను. తరువాత అదే ఏడాది జూన్‍లో‌ ‘ఖైదీ నంబర్ 786’ వచ్చింది. ‘గువ్వా గోరింకతో’ పాట ఓ ఊపు ఊపింది. ఆ వయసులో మాకు పాటంటే తెర మీద అభినయించే నటులే తప్ప, సంగీత దర్శకులు, గీత రచయితల గురించి పెద్దగా తెలియదు. సో, ఆయన పాటగా పరిచయం అయ్యారు. నిజానికి నాకు ఆయన పేరు కూడా తెలియదు అప్పట్లో. పాట బావుంది, స్టెప్స్ బావున్నాయి.. అంత వరకే తప్ప.. ఆ పాట ఎవరు రాసుంటారన్న ఆలోచన లేదు.

1988-90 మధ్య ఇంటర్‍లో కాస్త తక్కువే చూసినా, 1990-93 మధ్య డిగ్రీ సమయంలో చాలా సినిమాలు చూశాను.

1988లోనే చూసిన మరో సినిమా ‘ప్రాణస్నేహితులు’. ఆ సినిమాలోని ‘స్నేహానికన్న మిన్న లోకాన లేదురా’ పాట ఫ్రెండ్స్ మధ్య తెగ పాపులర్ అయింది. హుషారు పాటలతో పాటూ, మాధుర్యప్రధానమైన పాటలనూ ఆస్వాదించాం. బాగా విన్నాం, వచ్చీ రాని పద్ధతిలో పాడుకున్నాం.

1989లో ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ రిలీజ్! ‘మెరుపులా ఆడతా’ పాట వెర్రెక్కించింది. అప్పటికీ, గీత రచయిత గురించి తెలుసుకోవాలన్న ఆలోచన లేదు. పాటంటే ఊపు అంతే. ఉత్తేజం అంతే!

1990లో రాజేంద్రప్రసాద్ ‘తేనెటీగ’ విడుదలైంది. అందులో ‘ముద్దుల్ కావలెనా మురిపాల్ కావలెనా’ పాట బాగా పాపులర్ అయింది. అప్పటికి గీత రచయిత గురించి కాస్త అవగాహన వచ్చింది. పేరు గుర్తుండిపోయింది ‘భువనచంద్ర’!

1991 ‘గ్యాంగ్ లీడర్!’ ఏం పాటలు, ఏం డాన్సులు.. ‘భద్రాచలం కొండా’, ‘వానా వానా వెల్లువాయె’, ‘సండే అననురా’, ‘పాపా రీటా..’ ఒకటిని మించి మరొకటి.. అలా భువనచంద్రగారితో ప్రయాణం మొదలైంది.

అదే ఏడాది ‘పెద్దరికం’ సినిమాలో – ‘ఇదేలే తరతరాల చరితం’, ‘నీ నవ్వే చాలు చామంతి..’ గొప్పగా అలరించాయి. అదే సంవత్సరం ‘సీతారత్నం గారి అబ్బాయి’లో ఓ హుషారైన పాట – ‘మేఘమా.. మరువకే’. అద్భుతమైన మ్యూజిక్‌కి చక్కని పాట. కొబ్బరిబోండాం సినిమాలో ‘చల్లా చల్లని గాలుల్లో..’ అందరికీ నచ్చిన పాట.

1992లో మళ్ళీ చిరంజీవి, భువనచంద్ర కాంబినేషన్.. ‘ఘరానా మొగుడు’. ‘బంగారు కోడిపెట్ట’, ‘పండు పండు పండు’, ‘ఏంది బే ఎట్టాగ ఉంది ఒళ్ళు’, ‘కిటుకులు తెలిసిన..’ వాహ్! మోస్ట్ ఎంజాయ్డ్ సాంగ్స్! ఈ సంవత్సరంలోనే బాలకృష్ణ ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ విడుదలైంది. అందులోనూ చక్కని హిట్ పాటలు రాశారు భువనచంద్ర. ‘డిక్కీ డిక్కీ డీడిక్కి’, ‘టక్కుటమారా బండి’ – మాస్‌లో బాగా పేరు పొందాయి. ఇదే ఏడాది మళ్ళీ చిరంజీవి, భువనచంద్రల సినిమా ‘మెకానిక్ అల్లుడు’ విడుదలైంది. ఇందులో ‘ఝుమ్మనే తుమ్మెద వేట’ డ్రమ్ సాంగ్ సూపర్ హిట్. ‘ముఠామేస్త్రీ’ సినిమాలో ‘చిక్ చిక్ చామ్ పిల్లా పందెం కట్టు’ హుషారుగా సాగుతుంది. ఇక రాజశేఖర్ ‘అల్లరి ప్రియుడు’ సినిమాలో ఒక చక్కని మెలొడీ పాట రాశారు భువనచంద్ర. ‘కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లి చూసెను..’ అంటూ సాగే ఆ పాట ప్రేక్షకులను మరో లోకంలో విహరింపజేసింది. ‘సూరిగాడు’ సినిమాలో ‘ఒకే ఒక ఆశ’ పాట కూడా మంచి పాట.

1993లో వచ్చిన ‘ఆ ఒక్కటీ అడక్కు’లో ‘అంకులు దిగిరావే’, ‘పావురమా పావురమా గుర్తుండిపోయాయి. ‘ముగ్గురు మొనగాళ్ళు’ లో ‘చేమంతి పువ్వా’; ‘హలో బ్రదర్’లో ‘కన్నెపెట్టరో కన్ను కొట్టరో’, ‘ప్రియరాగాలే’ పాటలు సంచలనం సృష్టించాయి. ‘ఆమె’ సినిమాలో ‘ఊహల పల్లకిలో ఊరేగుతున్నది’ గొప్ప పాటగా నిలిచిపోయింది.

1994లో భువనచంద్రగారు ఎన్నో సినిమాలకి రాశారు. వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘నీకు 16 నాకు 18’ సినిమాలో ఓ ప్రయోగం లాంటి పాట ఉంది. ఓ హిందీ పాట, అదే బాణీలో ఉండే తెలుగు పాట కలిసి, ఓ పాటలా రాశారు. చూసినా, విన్నా చాలా బాగుంటుంది అది. ‘లేకే పహ్లా ప్యార్‌’ అంటూ సాగే ఆ పాటని యూట్యూబ్‍లో వినవచ్చు.

ఈ మధ్య రీల్స్‌లో బాగా ట్రెండ్ అవుతున్న సాంగ్ బిట్ ‘పైన చూస్తే తళుకుల తార’. ఈ పాట ‘పెదరాయుడు’ సినిమా కోసం భువనచంద్ర రాసినదే. ‘బావవి నువ్వు భామని నేను’ ఆ పాట!

1997లో వచ్చిన ‘ప్రియా ఓ ప్రియా’ లో ఆయన రాసిన ‘కమ్మని కలలకు ఆహ్వానం’ పాట న్యూ యియర్ సెలబ్రేషన్స్‌కి ఐకానిక్ సాంగ్ అయ్యింది. ‘తొలి ప్రేమ’ సినిమాలో ‘ఏమి సోదరా’ పాట గురించి చెప్పేదేముందీ?

1999లో వచ్చిన ‘స్వయంవరం’ సినిమాలో, ‘మరల తెలుపనా ప్రియా’, ‘కీరవాణి రాగంలో’, ‘పికాసో చిత్రమా..’ వంటి పాటలు ఎప్పటికీ పాడుకునేలా ఉంటాయి.

2001లో వచ్చిన వెంకటేశ్ సినిమా ‘నువ్వు నాకు నచ్చావు’లో ‘ఆ నీలి గగనాన’ పాట సూపర్‌గా ఉంటుంది. ‘ఇంద్ర’ సినిమాలో ‘రాధే గోవిందా..’ అభిమానులని డాన్స్ చేయిస్తుంది. ‘మన్మథుడు’ సినిమాలో ‘అందమైన భామలు’ పాట కూడా అంతే.

2003లో ‘మిస్సమ్మ’ (లయ, భూమిక)లో, ‘నే పాడితే లోకమే పాడదా’ అంటూ ఓ చక్కని పాట రాశారు.

ఇటీవల ‘స్వాగ్’ సినిమాలో రెండు పాటలు – ‘గువ్వ గూటిలో’, ‘నీలో నాలో’ అలరించాయి.

ఇక, భువనచంద్ర గారు పాటలు రాసిన డబ్బింగ్ సినిమాలు మిస్ అవకూడదు. ‘ప్రేమ దేశం’లో ‘ముస్తఫా ముస్తఫా’, ‘హలో డాక్టర్’, ‘ప్రేమా ప్రేమా’, ‘కాలేజీ స్టైయిలే’; ‘ముత్తు’ లో ‘థిలానా థిలానా’, ‘ఒకడే ఒక్కడు మొనగాడు’; ‘భారతీయుడు’లో ‘పచ్చని చిలుకలు తోడుంటే’, ‘తెప్పల్లెళ్ళిపోయాక’, ‘టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా’, ‘ప్రేమలేఖ’లో ‘ఎరుపు లోలాకు’, ‘నీ పిలుపే ప్రేమ గీతం’, ‘చెలి’ లో ‘హే వెన్నెల సోనా’, ‘శివాజీ’ లో ‘సహానా శ్వాసే వీచెగా’, ‘చంద్రముఖి’లో ‘రారా సరసకు రారా’, ‘గజిని’లో ‘హృదయం ఎక్కడున్నాదీ’, ‘రోబో’ లో ‘కిలిమంజారో..’ ఎన్నెన్నో చక్కని పాటలు!! ఆయన వేలాది పాటలు రాశారు. కానీ నాకు ఈ ఆర్టికల్ రాస్తున్న సమయానికి గుర్తొచ్చిన పాటలని మాత్రమే ప్రస్తావించగలిగాను.

ఇలా ఒక్కో సంవత్సరం కొన్ని పాటలతో భువనచంద్రగారు మరింత దగ్గరయ్యారు.

~

బహుముఖ ప్రజ్ఞాశాలుల ప్రతిభని మనం కొన్నిసార్లు ఒక పార్శ్వం నుంచే చూస్తాం. ఎప్పటికో వారిలోని మరో కోణం గురించి తెలుస్తుంది.

అలా భువనచంద్ర గారు నాకు కథా, నవలా రచయితగా రెండోసారి పరిచయమయ్యారు. 2018లో మొదటిసారిగా వారి రచనలు చదివే అవకాశం లభించింది. ‘భువన చంద్ర కథలు-2’ చదివాను. ‘వాళ్ళు’ చదివితే ఆయనలోని మరో కోణం, ఆధ్యాత్మిక అన్వేషణ.. అర్థమైంది. ఆ తరువాత సంచికలో చేరాకా, వారి నవల ‘పాదచారి’ టైప్ చేశాను. టైప్ చేస్తూ చేస్తూ – ఆయనలోని భావుకుడిని, ప్రకృతి ప్రేమికుడిని, ఆధ్యాత్మిక సాధకుడిని పరిచయం చేసుకున్నాను. ఆయన వచనంలో ఒక విధమైన కవిత్వపు నడక, లయ కనిపిస్తాయి. పాత్రలు కేవలం మనుషులతోనే కాకుండా చుట్టూ ఉన్న ప్రకృతితో, పక్షులతో (తీతువు పిట్ట, కోయిల వంటివి) అంతర్గతంగానో లేదా బాహ్యంగానో సంభాషిస్తున్నట్లుగా ప్రతీకాత్మక శైలిలో సాగుతుందీ రచన. టైప్ చేస్తున్నప్పుడు తెలియలేదా రచన గొప్పతనం. తరువాత తీరిగ్గా మళ్ళీ చదివినప్పుడు.. ముగ్ధుడనయ్యాను.

తర్వాత వారి కవితలు ఎన్నో టైప్ చేశాను. అప్పటికి భువనచంద్రగారితో ఫోన్ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడూ మాట్లాడుకునేవాళ్ళం. ఆయన వ్యక్తిత్వం అవగాహనకొచ్చింది.

ఇక ‘మహతి’.. ఈ సీరియల్‌ సంచికలో 73 వారాలు వచ్చింది. అది ప్రచురితమవుతున్న ప్రతీ వారం మేమిద్దరం తప్పనిసరిగా మాట్లాడుకునేవాళ్ళం. పాత్రలు, సంభాషణలు, కథా గమనం.. ఇలా ఎన్నెన్నో!

మహతి నవల పుస్తక రూపంలో వచ్చినప్పుడు, వారిని ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నలు పంపాను. అయితే, వారు అప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుని ఉన్నారు. జవాబులు రాయలేనని, ఫోన్‌లో చెబుతాను, రికార్డ్ చేసుకోమని అన్నారు. ఆ విధంగా మూడు రోజుల పాటు, రోజుకి సుమారుగా ఓ గంట సేపు, మధ్యలో చిన్న విరామాలు తీసుకుంటూ, నెమ్మదిగా మాట్లాడుతూ, ఆయన చెప్పేవి వింటూ, లోతులని అర్థం చేసుకుంటూ.. రికార్డ్ చేసుకున్నాను. తర్వాత వాటిని టైప్ చేసి, ఇంటర్వ్యూ ప్రచురించాం.

ఒకసారి నా పుస్తకాలు కొరియర్‌లో పంపాను. ఆయన ఒక్కో పుస్తకం చదివి ఫోన్ చేసి అభినందించారు.

ఇటీవల సంచికలో భువనచంద్రగారి ‘జీవితం ఓ ప్రయాణం’ అనే సీరిస్ ప్రారంభమైంది. ఈ ఫీచర్ గురించి దాదాపు వారానికి రెండు సార్లు మాట్లాడుకోసాగాం. ఓ రోజు మాటల్లో, “ఎప్పుడైనా మద్రాసు వస్తే కలవండి” అన్నారాయన. సరేనన్నాను.

~

ఊహ తెలిసాక, చూసిన మొదటి సినిమా వ్యక్తి ఎవరా అని ఆలోచించాను. నా ఆరో తరగతి పరీక్షలు పూర్తయి, అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళటానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి వచ్చాం. మా బండి కొంచెం ఆలస్యం అయింది. అటువైపు ప్లాట్‌ఫామ్ మీద ఆగిన రైల్లోంచి దిగినట్టున్నారు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి, మా ప్లాట్‌ఫామ్ మీదుగా ఎగ్జిట్ వైపు వెళ్తున్నారు పద్మశ్రీ అల్లు రామలింగయ్య. ఎందరో ఆయనకి నమస్కారాలు చేస్తున్నారు. మేము ఉన్న చోట ఆగినవారంతా ఆయన చుట్టూ చేరి నమస్కరించారు. మా నాన్నగారు కూడా నమస్కరించి, ‘దండం పెట్టు’ అని నాతో అన్నారు. నేనేదో చిరాకులో ఉండి నమస్కరించలేదు. మా నాన్నగారు గుడ్లురుమితే, “పర్వాలేదు, చిన్నపిల్లాడు” అంటూ ఆయన వెళ్ళిపోయారు. తెల్ల లాల్చీ, తెల్ల పంచ, మొహంపై చిరునవ్వు.. నేనిప్పటికీ మర్చిపోలేదాయన రూపం. అల్లు రామలింగయ్య గారే నేను చూసిన మొదటి సినిమా వ్యక్తి.

తరువాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదుతున్నప్పుడు కాలేజీ వాళ్ళు మద్రాసు, బెంగుళూరు, మైసూరు ఎక్స్‌కర్షన్‌కి తీసుకువెళ్ళినప్పుడు, మద్రాసులో విజిపి గార్డెన్స్‌లో, ‘సాక్షి’ అనే సినిమా కోసం రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, లిజీ గార్ల మీద ఓ పాట చిత్రీకరిస్తుండగా చూశాను. మేము నిమ్మకూరు కాలేజీ నుంచి వచ్చామని చెబితే, రాజేంద్ర ప్రసాద్ గారు “మా ఊరు నుంచి వచ్చారా? ఊళ్ళో కాలేజీ కూడా వచ్చేసిందా?” అందరితో ఆప్యాయంగా మాట్లాడారు. ఆ రోజుతో ఆ సినిమా షూటింగ్ ఆఖరట. అందుకని రాజేంద్రప్రసాద్ హీరోయిన్‌కి, కొంతమంది డాన్సర్లకీ చాక్‌లెట్లు ఇచ్చారు. అలా అప్పుడు ఆ ముగ్గురిని దగ్గరగా చూశాను.

తరువాత హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నప్పుడు పంజాగుట్ట ద్వారకానగర్ కాలనీలో మా ఆఫీసు ఉన్న అపార్టుమెంటులోనే సంగీత దర్శకుడు కోటి గారి ఫ్లాట్ ఉంది. ఆయనని ఒకటి రెండుసార్లు చూసాను. అమీర్‍పేటలో ఓసారి రోడ్డు మీద పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తిగారు ఎదురుపడ్డారు. నమస్కరించగానే, ప్రతి నమస్కారం చేసి, “బాగున్నారా బ్రదర్” అని అడిగారు. అదీ ఆయన సంస్కారం!!

~

అనుకోకుండా భువనచంద్ర గారిని కలిసే అవకాశం వచ్చింది. ఎలాగంటే..

మా తమ్ముడు పోస్టల్ డిపార్ట్‌మెంట్‍లో పనిచేస్తాడు. 24 ఏళ్ళు, వివిధ హోదాల్లో విజయవాడలో పనిచేశాక, ఈ మే నెలలో చెన్నై‌కి ట్రాన్స్‌ఫర్ అయింది. అక్కడ అన్నా నగర్ వెస్ట్ ప్రాంతలో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. మా అమ్మ, తమ్ముడితో ఉంటుంది. కొద్ది రోజుల క్రితం ఓ ఐదు రోజులు వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది మా తమ్ముడికి. దాంతో అమ్మ ఒక్కర్తే ఉండాల్సొచ్చింది. అమ్మకి తోడుగా ఉండడానికి, బయట పనులు చూడ్డానికి నన్ను వచ్చి ఉండమన్నాడు తమ్ముడు. సరేనని వెళ్ళాను.

వెళ్ళేముందు భువనచంద్ర గారికి మెసేజ్ చేశాను, ఇలా వస్తున్నానని, ఇన్ని రోజులు ఉంటాననీ, ఆయనకి వీలైన తేదీ, సమయం చెప్తే వచ్చి కలుస్తాననీ! ఆయన వెంటనే స్పందించి “తప్పకుండా రండి, చెన్నై వచ్చాక ఫోన్ చేయండి” అన్నారు.

అలాగే చేశాను. డేటూ, టైమ్ ఫిక్స్ అయ్యాయి!

And Jab We Met..

~

21 ఆగస్ట్ 2026. శుక్రవారం. సాయంత్రం ఆరు – ఆరున్నర గంటల మధ్యలో భువనచంద్రగారిని కలవాలి. ఉదయం నుంచే కాస్త టెన్షన్‌గా అనిపించింది. ఎన్నో సార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నా, ప్రత్యక్షంగా ఎన్నడూ వారిని చూడలేదు. ఆయన్ని కలిసినప్పుడు ఎలా నడుచుకోవాలో తెలియదు. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు.. ఎన్నోసార్లు అనుకున్నాను. ఆయన పాటల గురించి నా అభిప్రాయాలు చెప్పాలనుకున్నాను. ఆనంద్ బక్షి పుస్తకం ఇస్తే, చదువుతారో లేదో, నచ్చుతుందో లేదో అన్న సంశయాలు. ఒకవేళ ఆ పుస్తకం గురించి నాలుగు మాటలు రాస్తారేమో అని అడుగుదామనుకున్నా. మళ్ళీ అంతలోనే, ఏదో వెరపు.. అలా అడగచ్చో లేదో!

అసలు నాకెంత సమయం ఇస్తారో ఖచ్చితంగా తెలియదు. దొరికిన సమయంలో వీలైనంత మాట్లాడేయాలన్న తొందర!

మా తమ్ముడి ఇంటి నుంచి భువనచంద్ర గారిల్లు సుమారు ఎనిమిది కిలోమీటర్లు. ట్రాఫిక్ లేకపోతే అరగంటలో వెళ్ళిపోవచ్చట.

సరే, సాయంత్రం 5.15 నుంచి బైక్ లేదా ఆటో కోసం ర్యాపిడో యాప్‍లో చూస్తునాను. నా తొందరకి తగ్గట్టే ర్యాపిడో వాళ్ళవి వెహికల్స్ బుక్ అవడం లేదు. ఈ కంగారుకి తోడు, వాన మొదలైంది. సన్న జల్లుగా స్టార్ట్ అయి, కొన్ని నిమిషాలు దంచికొట్టింది. రమ్మన్న టైమ్‌కి వెళ్ళలేనేమోనన్న ఆందోళన! లేట్ అవ్వచ్చని చెబితే ఏమనుకుంటారో. మనకి టైమ్ ఇచ్చినప్పుడు, వారి టైమ్‌కి విలువివ్వాలి కదా.. అదే సమయానికి కాసేపు మొబైల్ డేటా పని చేయలా! ఒక ఆటో బుక్ అయింది, కొద్ది సేపటికే కాన్సిల్ చేసేసాడు. వాన ఆగింది. బైక్ అయితే, ట్రాపిక్ ఉన్నా, తొందరగా వెళ్ళచ్చని బైక్ బుక్ చేశాను. బుక్ అయింది కానీ, కెప్టెన్ ఒక డ్రాపింగ్‌లో ఉన్నాడు, ఐదు నిమిషాలు అని చూపిస్తోంది, కానీ పావు గంట గడిచిపోయింది. మామూలుగానే చెన్నై వాతావరణానికి చెమటలు ఎక్కువ పడతాయి. నాకే మరీ ఎక్కువగా పట్టేస్తున్నాయి. బైక్ కెప్టెన్ ఫోన్ చేసి తమిళంలో ఏదో చెప్పాడు. అర్థం కాలేదు. ‘తమిళ్ తెరియాదు’ అని చెప్పా. తర్వాత అప్రయత్నంగా హిందీలో మాట్లాడేసా. కొన్ని క్షణాల తర్వాత బుర్ర వెలిగింది.. ఇక్కడ హిందీ ఉపయోగించరని. వస్తున్నాను వెయిట్ చెయ్యమని చెప్పినట్టు అర్థమయింది.

మొత్తానికి వచ్చాడు, ఎక్కించుకుని, సందులు గొందులు తిప్పి, ఎక్కడో మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కాడు. మొత్తానికి లొకేషన్ దగ్గర డ్రాప్ చేసి, పేమెంట్ తీసుకుని వెళ్ళిపోయాడు.

సుమారుగా 20 నిమిషాలు ఆలస్యంగా, సాయంత్రం 6.50కి చేరాను. వలసరవక్కం, కామాక్షినగర్, గుహన్ స్ట్రీట్‌లో వాళ్ళింటి మెయిన్ గేట్ తీస్తున్నాను, భువనచంద్ర గారు స్వయంగా తలుపు తీసుకుని వచ్చి ఆహ్వానించారు. లోపలికి వెళ్ళగానే, ఆప్యాయంగా హత్తుకున్నారు.

ఆ హత్తుకోడంలోనే వారి ఆత్మీయత అర్థమైంది. నాలో ఉదయం నుంచి రేగిన సంశయ మేఘాలు విడిపోయాయి. “సారీ  లేటయ్యింది” అన్నాను. నా కంగారుని గమనించినట్టున్నారు, పర్వాలేదంటూ, రిలాక్స్‌డ్‌గా కూర్చోమన్నారు.  ఔపచారిక ప్రశ్నలయ్యాకా, వారి శ్రీమతిని పరిచయం చేశారు.

ఇంతలో కాఫీలొచ్చాయి. కాఫీ తాగాకా, కాస్త కుదుటపడ్డాను. ఒక దిగ్గజం ముందు కూర్చుంటే, ఆయన స్వయంగా కాఫీ అందించి, మాట్లాడుతుంటే – నాలో కలిగిన అనుభూతి వర్ణనాతీం. మామూలుగా అయితే, ఆయనని కలిసే అవకాశమే రాకపోయేది. సాహిత్యం కలిపింది మమ్మల్ని. నేను సంచికలో లేకపోయినా, ఆయన సంచికకి రాయకపోయినా, మా ఈ సమావేశం జరిగేదే కాదేమో!

నేను అనువదించిన ఆనంద్ బక్షి జీవిత చరిత్ర పుస్తకం ఒక కాపీ వారికి అందజేశాను. ఆ పుస్తకం అందుకుంటూనే, ఆయన గబగబా పేజీలు తిరగేశారు. తనకి ఆనంద్ బక్షితో పరిచయం ఉందనీ, వారి జీవితం, తన జీవితంలో కొన్ని ఘట్టాలు ఒకేలా ఉంటాయని అన్నారు.

ఆనంద్ బక్షి పుస్తకం కవర్ పేజీని చూస్తూ, ఆయన చక్కని గీత రచయిత అని అన్నారు. తాను ఉద్యోగ రీత్యా చాలా కాలం పాటు నార్త్ ఇండియాలో ఉండడం వల్ల హిందీ సినిమాలన్నా, హిందీ పాటలన్నా అమితమైన ఇష్టం ఏర్పడిందని చెప్పారు. హిందీ పాటలు విని, ఆ బాణీలకు నప్పేట్టుగా తెలుగులో పాటలు రాసుకునేవాడినని చెప్పారు. ఈ సందర్భంగా, పలు హిందీ గీత రచయితలు, గాయనీగాయకులు, సంగీతదర్శకులు మా చర్చల్లోకొచ్చారు. ముఖ్యంగా ఇందీవర్ గారి గురించి ఎన్నో విషయాలు చెప్పారు భువనచంద్ర.

హిందీ లిరిసిస్ట్‌లలో ఎవరి ప్రత్యేకత వారిదే అయినా తనకి ఇందీవర్ గారంటే ఇష్టమని చెప్పారు భువనచంద్ర. ఆయన మొదటిసారి కలిసినప్పుడు.. దక్షిణభారతానికి చెందిన అభిమానని తెలిసి, ఇందీవర్ ఆశ్చర్యపోయారనీ, రెండోసారి కలిసినప్పుడు ‘బేటా’ అంటూ ఆప్యాయంగా పలకరించారని గుర్తు చేసుకున్నారు. ‘కళాకార్’ సినిమాలోని ‘నీలే నీలే అంబర్ పర్’ పాట రెండు లైన్లు పాడారు. తర్వాత సరస్వతిచంద్ర సినిమాలోని ‘చందన్ సా బదన్’ హమ్ చేశారు.

మరో గీత రచయిత సాహిర్ గురించి చెప్తూ, ‘హమ్ దోనోం’ సినిమాలోని ‘మై జిందగీ కా సాథ్ నిభాతా చలా గయా’ పాట గురించి చెప్తే, నాకు అదే సినిమా లోని ‘అభీ నా జావో ఛోడ్ కర్’ పాట గుర్తొచ్చింది, చెప్పాను. నవ్వారు. ‘తాజ్ మహల్’ సినిమాలో ‘జో వాదా కియా వో నిభానా పడేగా’ పల్లవి పాడారు. ‘కభీ కభీ’ సినిమాలో ముకేశ్, లత పాడిన ‘కభీ కభీ మేరే దిల్ మే’ బాగా పాపులర్ కదండీ అన్నాను. తలూపారు.

తర్వాత ఓపి నయ్యర్ సంగీత దర్శకత్వం వహించిన ‘కశ్మీర్ కీ కలీ’, ‘నయా దౌర్’, ‘తుమ్‍ సా నహీ దేఖా’ ప్రస్తావించారు. నాకు కాలేజీ రోజుల్లో మా మిత్రుడు పాడే ఓ పాట గుర్తొచ్చింది ‘ఆధా హై చంద్‌మా రాత్ ఆధీ’. దాని గురించి అడిగితే, అది సి. రామచంద్ర సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘నవరంగ్’ అనే సినిమాలోనిదని చెప్పారు. సినిమా పాట కాకపోయినా, ‘అయే మేరే వతన్ కే లోగోఁ’ పాటకి సి. రామచంద్ర చక్కని సంగీతం అందించారని, అదెంతో ఉత్తేజాన్నిచ్చే పాట అని అన్నారు. తర్వాత సైగల్ పాడిన ‘జబ్ దిల్ హీ టూట్ గయా’, ‘మై క్యా జానూఁ క్యా జాదూ హై’, ‘ఏక్ బంగ్లా బనే న్యారా’ గురించి చెప్పారు. సైగల్ పాడిన ‘మేరే సపనోం కీ రాణీ’ అనే పాటలో, రఫీ కోరస్‌లో ఉండి ‘రూహీ రూహీ రూహీ’ అని గొంతు కలపడం విశేషమని అన్నారు. తర్వాత ‘తేరే బినా జిందగీ సే’, ‘జై జై శివ్ శంకర్’, ‘కోరా కాగజ్ థా యే మన్ మేరా’, ‘అచ్ఛా తో హమ్ చల్తే హైఁ’ వంటి కిషోర్ కుమార్, లతల డ్యూయెట్ల గురించి చెప్పుకున్నాం. నాకు ‘సిల్‌సిలా’ సినిమాలోని ‘దేఖా ఏక్ ఖ్వాబ్’ నచ్చుతుందని అన్నాను. ‘బందినీ’, ‘ఆంధీ’, ‘మౌసమ్’ వంటి గుల్జార్ చిత్రాల గురించి మాట్లాడుకున్నాం.

తర్వాత ఆయన ఎయిర్‌ఫోర్స్ జీవితం గురించి, 1971 యుద్ధం గురించి, యుద్ధాల రెండో పార్శ్వం గురించి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కొన్ని సంవేదనాత్మక ఉదాహరణలు చెప్పారు. తర్వాత ఇల్లంతా చూపించారు. వారి పర్సనల్ లైబ్రరీ, పూజ గది, సినిమా షీల్డులు ఉంచిన అలమారలు, కొన్ని ప్రత్యేక మెమెంటోలు చూపించారు. తర్వాత ఆయన రైటింగ్ రూమ్‍లో కూర్చున్నాం.

మహతి నవల ప్రస్తావన రాగానే, అప్రయత్నంగా అందులోని పాత్రలు మా మాటల్లో దూరాయి. మహతి, అల, గౌతమ్, అహల్య, సురేన్, నరేన్, కళ్యాణి, ఫాలాక్ష, డా. శ్రీధర్, డా. శ్యామల, తాతయ్య, అమ్మమ్మ, ఇందిర, తిమ్మూ, త్రిపుర, అభిమన్యు, కమల్‍జీత్ ఆ గదిలో ప్రత్యక్షమై, నేరుగా నాతో మాట్లాడిన అనుభూతి కలిగింది.

ఆయన వ్రాసుకున్న పాటల స్పైరల్ బైండింగ్ పుస్తకాలు చూపించి, ఇంకా సినిమాలలో రాని కొన్ని పాటలని ఎంచుకుని, సందర్బాన్ని వివరిస్తూ, పల్లవులు పాడి వినిపించారు. మధ్యమధ్యలో కొన్ని జ్ఞాపకాలు. డా గోపాలకృష్ణ గారి ప్రస్తావన. ఎందరో మంచి వ్యక్తులను ప్రస్తావించారు.

ఓ పాట గురించి చెబ్తూ, ఆనంద్ బక్షిని ప్రస్తావించారు. సంచికలో నేను అనువదించిన ఆయన జీవిత చరిత్ర కొన్ని ఎపిసోడ్స్ చదివాననీ, తనకీ, ఆనంద్ బక్షికి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పారు. “ఆయనా తాను కవిని కాదనే చెప్పుకున్నారు, నేనూ అంతే” అని అన్నారు. “ఆయన ఎక్కడ కూర్చున్నా, పాట రాసి ఇచ్చేసేవారు, నాదీ అదే పద్ధతి” అని చెప్పారు.

దాదాపు రెండు గంటలు గడిచిపోయాయి. ఇంక వెళ్తానంటూ బయల్దేరాను. తీరా నాకు మళ్ళీ ర్యాపిడో దొరకలేదు. ఆయన, నన్ను డ్రాప్ చెయ్యడానికి తనకు తెలిసిన మనిషిని పిలవడానికి ప్రయత్నించారు. అతను అందుబాటులో లేకపోయేసరికి ‘అయ్యో’ అన్నారు. మేడమ్ గారు కూడా మరెవరికో ఫోన్ చేశారు. ‘పర్వాలేదు, నేను కొంత దూరం ముందుకు వెళ్ళి అక్కడ ప్రయత్నిస్తాన’ని చెప్పి, వారికి, వారి శ్రీమతికి గారికి నమస్కరించి వీడ్కోలు పలికాను.

నేను కొంత దూరం నడిచేసరికి ఫోన్ చేశారు, ర్యాపిడో దొరికిందా అని అడిగారు. అప్పుడే కన్‌ఫర్మ్ అయిందని చెప్పాను. ఇంటికి చేరేలోపు మరోసారి ఫోన్ చేసారు. ట్రాఫిక్‌లో నాకు వినబడలేదు. ఇంటికి వెళ్ళాక చూసుకుని కాల్ చేసి, బానే వచ్చేశానని చెప్పాను.

“ఏం లేదండీ, తొమ్మిందింటి దాకా ఉంచేశాను, డిన్నర్‌కి ఉండమనలేదు, సారీ” అన్నారు.

“అదేంటి సర్, పర్వాలేదు. ఇప్పటికే చాలా టైమ్ స్పెండ్ చేశారు. మరోసారి కల్సినప్పుడు లంచో, డిన్నరో ప్లాన్ చేద్దాం” అన్నాను.

“యస్, తప్పకుండా కలుద్దాం, కలిసి భోం చేద్దాం” అని గుడ్ నైట్ చెప్పి ఫోన్ పెట్టేశారు.

ఆ ఆత్మీయత, మంచితనం, సహృదయత.. ఎదుటి వ్యక్తిని గౌరవించే పద్ధతి.. ఎవరిపైనైనా చెరగని ముద్ర వేస్తాయి.

సో, వాళ్ళింటికి వెళ్ళి వచ్చిన తర్వాత నా ఫీలింగ్స్ ఏమిటి అంటే..

లిరిసిస్ట్‌గా, రచయితగా ఆయన నిస్సందేహంగా గొప్పవారు. కానీ ఓ మనిషిగా.. నిలువెల్లా సౌహార్ద్రత మూర్తీభవించిన వ్యక్తి. నాకన్నా ఎన్నో రెట్లు పై స్థాయిలో ఉన్న వ్యక్తి.. దాదాపు రెండు గంటల సేపు నాతో మాట్లాడడం, తన జీవితం గురించి, రచనల గురించి, తనని ప్రభావితం చేసిన వ్యక్తుల గురించి చెప్పడం, తాను రాసిన పాటలను (ఇంకా సినిమాల్లో వాడనివి) షేర్ చేసుకోడం.. అంతా ఓ కలలాగా జరిగిపోయింది. చాలా రోజులు గుర్తుండిపోతుందీ అనుభవం!!

పాటగా పరిచయం.. మనీషిగా దర్శనం!!

థాంక్యూ భువనచంద్ర గారూ!!

Exit mobile version