[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]
[యుద్ధం మొదలయి నెలలు గడుస్తాయి. పాదుషా అస్వస్థుడవుతాడు. నూర్జహాన్ ఆజ్ఞల మేరకు సైన్యాధ్యక్షులు పోరు కొనసాగిస్తారు. ఆవలి పక్షంలో భీమసింగ్, ఖుర్రం, మహబత్‌ఖాన్ మాత్రమే కాక, జయపురం, ఉదయపురం రాజపుత్ర సైన్యాలు కలుస్తాయి. అసఫ్‌ఖాన్ కూడా నూర్జహాన్‌కి అనుమానం రాకుండ చల్లగా మొగల్ సైన్య బాధ్యతనుండి జారుకుని ఖుర్రం పక్షానికి వెళ్ళిపోతాడు. యుద్ధ వార్తలతో ఆగ్రా ఢిల్లీ నగరాల దైనందిన జనజీవనం అతలాకుతలం అవుతుంది. లాడీబేగం అడిగినప్పుడల్లా వెళ్ళి ఆమెకు తగిన సలహాలు ఇస్తాడు జగన్నాథుడు. అయితే మహారాణి తనకి అప్పజెప్పిన బాధ్యతను సరిగా నిర్వర్తించలేకపోతున్నానేమోనన్న సంశయం జగన్నాథుడిలో కలుగుతుంది. కామేశ్వరి అతన్ని ఓదార్చి ధైర్యం చెబుతుంది. లాడీబేగం మళ్ళీ కబురు పెడుతుంది. జగన్నాథుడు వెళ్ళి కలుస్తాడు. పాదుషా వారికి తీవ్ర అనారోగ్యమని, స్థలం మార్పు కోసం నూర్జహాన్ ఆయనని కాశ్మీరు పంపిందని చెబుతుంది. ఈలోపు ఖాన్‍జాన్‍లోడీ మోసుకొచ్చిన దుర్వార్త లాడీబేగంని క్రుంగదీస్తుంది. షరియార్ మరణాన్ని ధ్రువీకరించినా వార్త అది! జగన్నాథుడూ, కామేశ్వరీ వెళ్ళి లాడీబేగంని ఓదారుస్తారు. యుద్ధరంగంలో గజసింగ్ చేతిలో భీమ్‍సింగ్ మరణిస్తాడు. ఢిల్లీలో ప్రజలకు సుఖశాంతులు లోపిస్తాయి. లాడీబేగం అధికారులు అందరినీ పిలిచి ఆజ్ఞలిస్తుంది. జగన్నాథుడిని పిలిపించి తాను తీసుకున్న చర్యలను చెబుతుంది. అందులో కొన్ని సవరణలు చెప్తాడు జగన్నాథుడు. తనకొక కార్యక్రమ ప్రణాళికని తయారుచేసి ఇవ్వమని జగన్నాథుడిని లాడీబేగం కోరుతుంది. ఆ తర్వాత చాలా సేపు-ఆర్థిక, రాజకీయ విషయాలమీద సంభాషణ జరుగుతుంది. ఆమె దగ్గర సెలవు తీసుకుని బయటకు వస్తాడు జగన్నాథుడు. ఇక చదవండి.]
అధ్యాయం-25
కాశ్మీర్‌లో జహంగీర్ ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగాలేదు. శ్లేష్మంలో పడిన ఈగలా కొట్టుకులాడుతున్నాడు.
రాజవైద్యులు ఆయన ఆరోగ్యాన్ని మెరుగుపరచలేక మెరమెచ్చులతో రోజులు నెట్టుకొస్తున్నారు. స్థలం మార్పు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందనే ఆలోచనతో వచ్చాడిక్కడికి. కానీ, ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు.
నూర్జహాన్ తాను రాకుండా వైద్య బృందాన్నీ, నలుగురైదుగురు షాహీవాలాల్నీ (అంగరక్షకులు) ఆయనతో పంపింది. యుద్ధ ప్రమేయానికి సైన్యాధిపతుల్లో మీర్జా అజీజ్ ఒకడైనా అవసరమని పట్టుపట్టినా – నూర్జహాన్ మాటని పక్కన బెట్టి, మిగిలిన వారితో సాధించుకొమ్మని – వేష్టపడి అజీజ్‌ని తనతో రప్పించుకున్నాడు పాదుషా.
పాదుషా సొంత పదాతిదళం ‘అహ్‌సమ్’లోని ఓ పాతికమంది ఆయనను అనుసరించారు. తీరా, ప్రయాణ సన్నాహంలో ఉండగా ఆయన పట్ల ప్రేమానురాగాలు కలిగిన కుమార్తె – బహర్‌బాను బేగం ఆయనతో బయలుదేరింది. ఆమె పరివారంలోని కొందరూ వచ్చారు.
ఇప్పుడు ఆయన ఆరోగ్యం పట్ల శ్రద్ధా, ఆందోళనా కలిగిన దగ్గరి మనిషి ఆమే!
1627వ సంవత్సరం, అక్టోబర్ నెల జరుగుతోంది.
శీతాకాలం మొదలవుతోంది. కాశ్మీరంలో చలి రోజులంటే ఆరోగ్యవంతులకు స్వర్గంలో ఉన్నట్టుంటుంది. కానీ, అనారోగ్యవంతులకు మాత్రం నరకం చూపిస్తుంది.
జహంగీరు స్వభావంలో వస్తుతః వైరుధ్యాలు ఎక్కువ. ఉర్దూ కాక పర్షియాన్ టర్కీ భాషలు బాగానే వచ్చు. సాహిత్య పిపాసి. ప్రకృతి ఆరాధకుడు. సున్నిత మనస్కుడు. కానీ, క్రూరత్వం అంచులను చూపుతాడు. ఎంతగా న్యాయవిధేయుడో, అంతకంత విచక్షణారహితుడు. అనేక నిర్ణయాలలో వివేకవంతుడుగా ఋజువు చేసుకున్నాడు. పసిపిల్లవాని మనస్తత్వమూ ఉంది. కొడుకు కన్నులు పెరికించేటంత కఠినత్వమూ ఉంది. ఆయన కళాప్రియుడు. స్వయంగా చిత్రకారుడు కావటం వలన ముందటి వారం వైద్యులు వద్దన్నా వినకుండా గుల్మార్గ్, పహల్గామ్, సోన్‌మార్ వెళ్ళి వచ్చాడు. అక్కడ అప్పుడే మంచుపడటం మొదలయింది. ఆ వాతావరణం ఆయన అనారోగ్యాన్ని ఉద్రేకింపజేసింది. ఆ కారణంగా ఎక్కువగా బాధపడుతున్నాడు.
జహంగీర్ కాలేయం సమస్య. తడిబట్టని మెలిపెట్టి పిండుతున్నట్టుగా బాధ. పైపొట్ట చూడబోతే బానకడుపులా ఉబ్బరించింది. రాజవైద్యులు ‘జలోదరం’ అనీ అదీ ఇదీ ఏదో చెబుతున్నారు. ఔషధాలిస్తున్నారు. కొద్దిగా ఉపశమిస్తుంది. కానీ, నాలుగు రోజుల్లో మళ్ళీ యథాప్రకారానికి వస్తుంది. ఈ బాధకు తోడు ఉబ్బసం. చలికి ఉద్రేకించే లక్షణం దానిది. రెండూ కలిసి క్రుంగదీస్తున్నాయి.
బహర్‌బాను బేగం విషణ్ణవదనంతో ఆయన ప్రక్కనే కూర్చుని ఆహారం, అనుపానాలూ మొదలైనవి చూస్తున్నది. ఉండి ఉండి ఉపశమనానికి హుక్కా అందిస్తున్నది.
ఇప్పుడు ప్రధాన ఆయుర్వేద భిషక్కు- రామాచారి మరొకసారి పాదుషా వారిని పరిశీలించాడు. ఆయన ముఖంలో సంతృప్తరేఖలేమీ కనిపించలేదు. ఆందోళన పొడలు మాత్రం స్ఫుటంగానే కనిపించాయి.
తల్పానికి కుడిపక్కనే ఉన్నాడు అజీజ్. ఎడమవైపు గోడవారగా బహర్‌బాను – వైద్యునివైపు ఆత్రుతగా చూస్తున్నారు.
రామాచారి గంభీరముద్రతో, “ప్రత్యేకంగా ఏమి చెప్పగలను తల్లీ! అంతా ప్రారబ్దఫలమని భావించాలి. దీనిని పూర్వజన్మ సంచిత పాపమంటాము మేము” ఆగి మళ్ళీ “ఈ వాతావరణంలో ఇంకా ఇక్కడే ఉండటం మంచిది కాదు. లాహోర్ చేరితే బాగుంటుంది” అన్నాడు. తాను చెప్పవలసినది చెప్పేశానన్నట్టు ఊపిరి పీల్చుకుని వెనక్కి జరిగి కూర్చున్నాడు.
అజీజ్ వైపు చూశాడు పాదుషా. ఆయన బహర్‌బాను బేగం వైపు చూశాడు. ఆమె, “మనకున్న వైద్య నిపుణుల్లో రామాచారి వారు ప్రముఖులని మనందరికీ తెలుసు. వారే ఇలా సలహా ఇస్తున్నారంటే, దానిని అనుసరించటమే మేలు” అన్నది. పాదుషా తలపంకిస్తూ, “అయితే సరే.. ప్రయాణపు ఏర్పాట్లు చేయించండి అజీజ్” అంటూ అనుజ్ఞనిచ్చాడు.
రాజయినా, బంటయినా – జీవనలాలస మనుషులందరికీ ఒక్కటే కదా!
***
ఢిల్లీ –
జహంగీర్ పాదుషా పరివారం కాశ్మీరం నుండీ లాహోర్ పయనమైనట్లు అటు యుద్ధరంగంలోని నూర్జహాన్‌కూ, ఇటు ఢిల్లీలోని లాడీబేగంకి వర్తమానం వచ్చింది.
జగన్నాథుని పిలిపించి తాను విన్న ఈ పరిస్థితిని యథాతథంగా వివరించి బాధపడింది లాడీబేగం. కీడు శంకించాడు జగన్నాథుడు. పాదుషావారి జాతకాన్ని చూసివున్నవాడు కావటంతో – మనసులో దుర్దశే రూపుకట్టింది. అనునయ వాక్యాలతో లాడీబేగంని ఊరడించాడు. వింటున్న బేగంకి మాత్రం మనసులో కల్లోలంగానే ఉంది. కళ్ళముందు అన్నీ అవాంఛనీయ దృశ్యాలే కదలాడి కలవర పరుస్తున్నాయి.
అంతకంటే వేగంగానే ఈ వర్తమానాన్ని యుద్ధంరంగం లోని ఖుర్రంకీ, ఆయన పక్షంలో ముఖ్యులైన అసఫ్‌ఖాన్, మహబత్‌ఖాన్‌కీ, రాణాలకూ చేరవేశారు – వారి చారులు!
పాదుషా ఆరోగ్యం క్లిష్టస్థితికి చేరింది. మార్గం మధ్యలో రాజౌరీ చేరారు. రాజౌరీ ప్రక్కనే ఉన్నది చింగస్ గ్రామం. ప్రకృతి సౌందర్యమంతా కుప్పపోసినట్లుండే ప్రాంతం. పాదుషాకి అమిత ఇష్టమయిన సరాయ్ ఉంది. అక్కడే ఆయన విడిది చేశాడు.
ఏరోజు కారోజు పరిస్థితులు అనేక విధాలుగా పరిణామం చెందసాగాయి. ఆవేళ – జహంగీర్ కడుపునొప్పితోనూ, ఉబ్బసంతోనూ అతలాకుతలమై పోతున్నాడు. ఎగశ్వాస, దిగశ్వాసగా ఉన్నది. వచ్చే ప్రాణం పోయే ప్రాణంగా కొట్టుమిట్టాడుతోంది ఆయన దుస్థితి. చివరికి అన్ని ప్రయత్నాలూ విఫలమైనాయి. ఆయన ప్రాణజ్యోతి కొడిగట్టింది.
జహంగీర్ – సామ్రాజ్య విధేయులంతా దుఃఖంలో-
ఖుర్రం – విధేయులంతా సంతోషంలో
జహంగీర్ మరణవార్త – నూర్జహానికి ఆశనిపాతమైంది. ఆమె పక్షానికి సంబంధించి జారుడుమెట్ల మీద ఆటగా సాగుతున్న యుద్ధం కాస్తా పాతాళానికి పడిపోవడం ఖాయమని అర్థమైంది. హుటాహుటిని ఆమె రాజౌరీ చేరుకుంది.
ఢిల్లీలో లాడీబేగం – విలాపానికి – రాజమందిర కుడ్యాలు ప్రతిధ్వనించాయి. ఢిల్లీ, ఆగ్రా, లాహార్, శ్రీనగర్, సిక్రీ వంటి ముఖ్య నగరాల్లో ఎక్కడికక్కడ అంతర్యుద్ధాలు తలెత్తాయి. అందునా లాహోర్ పరిస్థితి దారుణంగా ఉంది.
***
వెనువెంటనే రావల్సిందిగా జగన్నాథుడికి కబురుచేసింది లాడీబేగం. వెళ్ళాడు. ముఖ్యపరిచారికలూ, ఒకరిద్దరు చిన్న సైనికాధికారులూ తప్ప ఎవ్వరూ లేరు. యుద్ధ పరిస్థితీ.. పాదుషా మరణం.. వెంటనే నూర్జహాన్ రాజౌరీ వెళ్ళటం.. పూసగుచ్చినట్టు వివరించింది. కొంత సమయం గడిచిన తర్వాత, నిర్వేదంగా హీనస్వరంతో అన్నది. “ఇక్కడ మన ఖాన్ ఏమైనాడో తెలియటం లేదు. నిన్నటి నుంచీ కనిపించటం లేదు. ముఖ్యుల్ని విచారించినా తెలియదనే సమాధానమే వస్తోంది.”
జగన్నాథుడు ఆలోచనలో ఉన్నాడు. ఇలాంటి విషయాలు ప్రత్యేకంగా ఆశ్చర్యాన్ని కలిగించేవేమీ కావు. పరాజితుని ముఖ్యులు అదను చూసుకుని విజేత వైపు చేరిపోతారు. క్షమాభిక్షని పొందుతారేమో? ఖాన్ కూడా అలా వెళ్ళాడా?
ఈ ప్రశ్నకి జవాబుగా అతని ముందు మరో ప్రశ్న నిలబడింది.
ఖాన్‍జాన్‌లోడీ పూర్వం జయసింహ మహారాజుకి దక్కనులో సైన్యాధికారి. కానీ, మహారాజుపై తిరుగుబాటు చేసి, ఓడిపోయి, ప్రాణాలు దక్కించుకుని వచ్చి నూర్జహాన్ ఆశ్రయం పొందినవాడు. కాలక్రమంలో ఆమెకు సన్నిహితుడైనవాడు. అలాంటివాడు వెళ్ళి ఈరోజు ఆమె ఎదిరిపక్షంలో చేరగలడా? ఇప్పుడు జయసింహ మహారాజు ఖుర్రం సహకారి కదా! ఖాన్ వెళ్ళి కాలికి మొక్కితే – నమ్మి, చేరదీస్తాడా..?
ఈ పూర్వగాథ లాడీబేగంకి తెలుసో తెలియదో.. ఇప్పుడా ప్రస్తావన, వివరణ అనవసరం అని ఆ ప్రసక్తిని మానేశాడు. ఇంతలో ఆమే “ఏమో ఇక్కడున్న ఏ శత్రువు చేతికో చిక్కాడేమో -” అని నిట్టూర్చి, “పండిట్‌జీ.. చూడబోతే మాకూ ఏ క్షణాన ఏ ఆపద ముంచుకొస్తుందోనన్న భయం మనసుని తొలుస్తున్నది. నూర్జహాన్ బేగం మనుషులంతా జాగ్రత్తగా వుండాలి కదా!” అన్నది.
ఆమెలోని బేలతనం స్పష్టంగానే బయటపడింది. వాస్తవానికి ఆ సందేహం ఇప్పటి పరిస్థితికి అద్దం పడుతోంది. ‘లాడీబేగం వంటి ప్రముఖుల సంగతి సరే, తన వంటివారి ‘గతి’ మాత్రం? రేపటి దినం ఎలా ఉండబోతోందో?’
“చెప్పండి పండిట్‍జీ ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు” బేగం మాటలకు ఆలోచనలనుండీ తేరుకుని, “ఏం ఫరవాలేదు బేగం సాహెబా. రాజోద్యోగుల్నీ, సైనికాధికారుల్నీ పంపించి ముందు రాచనగరు రక్షణకు కట్టుదిట్టం చేయించండి. ఈలోగా మహారాణీవారు ఢిల్లీ రక్షణకు తగిన చర్యల్ని తప్పకుండా చేపట్టి తీరతారు” అంటూ ధైర్యం చెప్పాడు.
“కానీయండి.. మీ నోటి వాక్కు గొప్పది. అలాగే జరగాలి. మాకు ప్రాణభయం లేకుంటే చాలు..” పెదవిమీదకి నవ్వొచ్చింది జగన్నాథుడికి. “మీరు వెళ్ళిరండి.. జాగ్రత్త.”
సెలవు తీసుకుని బయటికి నడిచాడు జగన్నాథుడు.
అధ్యాయం-26
బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కాలకృత్యాలు, అనుష్టానం పూర్తిచేశాడు. జగన్నాథుడు. అప్పటికెప్పుడో తన పనులన్నీ పూర్తి చేసుకునే ఉన్నది కామేశ్వరి.
ఇంటిముందు ఆవరణలో వేపచెట్టు కింది అరుగుమీద కూర్చున్నాడు జగన్నాథుడు. కామేశ్వరి కూడా వచ్చి కూర్చుంది. వాతావరణం ఆహ్లాదంగానే ఉన్నా ఇద్దరూ అన్యమనస్కంగానే వున్నారు. గాలి వింజామరలా వీస్తున్నది. కానీ, ఇద్దరి దేహాలూ చిరుచెమటల్లో ఉన్నాయి. ‘లో’ అలజడి ప్రభావం అది. రాత్రి ఇద్దరికీ కంటి నిండా నిద్రలేదు.
నిశ్శబ్దంలోనే చాలా సమయం గడిచింది.
“నేనొక నిర్ణయానికి వచ్చాను. ఇవ్వాళా రేపటిలోనే మనం ఢిల్లీకి వీడ్కోలు చెబుదాము” కామేశ్వరి చూపులో ఏ విధమైన సంభ్రమమూ లేదు. ఆమె కూడా ఇలాంటి ఆలోచనల్లోనే ఉన్నది.
“ఏదైనా మరో రాజ్యానికి పోయి కాలం గడపడమే శ్రేయస్కరంగా తోస్తున్నది.”
“అవును. వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతున్నదో ఎవరికీ అంతు పట్టటం లేదు” అని క్షణం ఆగి “రాజ్యపరిపాలన, అధికారం నూర్జహాన్ బేగం చేతుల్లోనే ఉంటుందో, చేతులు మారి ఖుర్రం పాదుషా అవుతారో, తెలియని సందిగ్ధస్థితి. సంధికాలం” అన్నాడు.
“మనల్ని మనం హెచ్చరించుకోవలసిందే. క్షేమంగా ఉండడం కోసం ఎటయినా వెళ్ళాల్సిందే. ఐనా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే- అన్నారు. మీకేంటి?” అంటూ నవ్వింది. “సరే.. మంచి ధైర్యాన్నే ఇస్తున్నావు. సామాను సర్దటం మొదలుపెట్టు. నేను అలా రాచనగరు దాకా వెళ్ళి వస్తాను” అంటూ లేచాడు.
ఇంతలోనే ఇంటిబయట నాలుగు గుఱ్ఱాలు, ఒక అశ్వశకటం వచ్చి నిలిచాయి. అశ్వికులు లోపలికి వచ్చారు. జగన్నాథునికి సలామ్ చేశారు.
“మేము ఉదయపురం నుండి వస్తున్నాం – పండిట్‌జీ. నా పేరు మాన్‌సింగ్. రాణా జగత్‍సింగ్ ప్రభువులు తమర్ని వెంటనే ముందు జయపురానికి తీసుకురమ్మన్నారు” వారి నాయకుడు చెప్పాడు.
జగన్నాథుడూ, కామేశ్వరీ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఆడబోయిన తీర్థం ఎదురైనదన్న సామెత గుర్తుకొచ్చింది. అనుకోకుండా లభిస్తున్న ఆలంబనంకి సంతోషం కలిగింది. “సరే.. అలాగే.. మీరు విశ్రాంతి తీసుకోండి” అన్నాడు జగన్నాథుడు – వచ్చినవారితో.
వాళ్ళు “హాఁజీ” అంటూ వెళ్ళారు. వెళ్తూ వెళ్తూ మాన్‌సింగ్ “చీకటి పడగానే బయలుదేరుదాం. తగిన సమయానికి వస్తాము” చెప్పాడు. “అలాగే..”
వచ్చినవారిని చూసి చుట్టుపక్కల వారెవరో వచ్చారు.. చెప్పీ చెప్పకుండా సమర్థించుకున్నారిద్దరూ. వారంతా వెళ్ళిపోయారు. ఎవరి ఊహల్లో, భావనల్లో వారుగా-వారిని పంపించి వెనుతిరిగి వస్తుంటే ప్రాంగణానికి ఆగ్నేయంలో ఉన్న సంపెంగ చెట్టు ఎండుతున్నట్టు కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూశాడు. నీరు చాలటంలేదల్లే వుంది అనిపించింది.
ఇంతలో చల్లటిగాలి వీచింది. సన్నటి చినుకులూ మొదలయినై. జగన్నాథుని మదిలో మెదిలిన శ్లోకాన్ని లోలోపల అనుకున్నాడు. అది సమయానికి వచ్చి హర్షాన్నిచ్చిన మేఘుడి ప్రశంస. తన జీవన ఆశాలతపైనా జగత్సింహ ప్రభువు ఆదర ప్రేమల్ని చిలుకుతున్నాడు. దైవం మానుషరూపంలో ఆర్తుల్ని ఆదుకుంటూనే ఉంటుంది!
“ఏఁవిటీ.. ఇక్కడే నిలబడి ఆలోచిస్తున్నారు. చినుకుల స్పృహ కూడా లేదాయేం?” అంటూ హడావిడిగా వచ్చింది కామేశ్వరి.
నవ్వాడు.. తన శ్లోకాన్ని ఆమెకూ చదివి వినిపించాడు.
“బాగుంది. అన్యాపదేశం రండి..” అంటూ వెనక్కు మరలింది కామేశ్వరి. అప్పటికే వానజల్లు పెద్దదయింది. ‘తెలివిగలది. సాహిత్యంలోని రసజ్ఞతని ఇట్టే పట్టేస్తుంది’ అనుకుంటూ ఆమెని అనుసరించాడు జగన్నాథుడు.
***
కామేశ్వరి వంట పూర్తయింది. అప్పటికి వాన తగ్గింది. ప్రాంగణమంతా తడిసిన మట్టి వాసన గాలితో కలిసి అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తోంది. ముందుగా కొంత వస్తుసామగ్రిని ఒక పక్కకు చేర్చారు. ఇల్లు సర్దడమంటే పెద్ద పని. నిత్యావసర వస్తువులూ, దైనందిన వ్యవహారాలకి కావలసిన సరంజామా బాగానే కనిపిస్తోంది. ఏదీ వదిలేయటానికి కుదురదు. అవసరమవుతుందేమో అనిపిస్తుంది. అలా అని తీసుకు వెళ్ళటానికి వీలుండదు. ఇటు, కామేశ్వరి ఈ విధమైన ఊగులాటతో సతమతమవుతుంటే, అటు జగన్నాథుడు గ్రంథ సంచయంతో కుస్తీ పడుతున్నాడు.
మనోరమా ఖండనమ్’కి కావలసిన ప్రతిపాదనలు ఉన్న కాగితాలను ఒక చోటికి చేర్చుకున్నాడు. ‘గంగాలహరి’, ‘సుధాలహరి’, ‘లక్ష్మీలహరి’ – మొదలయినవి పూర్తి అయ్యే వున్నాయి. ‘శతక సముచ్చయం’లో చాలా శ్లోకాలు వున్నాయి. ‘ప్రాస్తావిక విలాసం’ పుటలన్నింటినీ ఒకటిగా కట్టి పెట్టుకున్నాడు. అన్నింటినీ ఒక శుభ్రవస్త్రంలో చుట్టి, పైన శాలువా కప్పాడు. ఆపైన ఒక రజాయిలో కట్టి జాగ్రత్త చేశాడు.
భోజన కార్యక్రమాలయ్యాక, ఓ పక్కగా అనుష్ఠానం సామగ్రిని సర్దిపెట్టింది కామేశ్వరి. మిగిలిన వస్తువులలో కావలసిన సంబారాల్ని మూటలు కట్టడములో పడింది.
జగన్నాథుడు అమీన్ దగ్గరికి వెళ్ళి వస్తానని చెప్పి బయలుదేరాడు.
అమీన్ అడిగిన ప్రశ్నలకు – విన్నవారు ఎటూ నిర్ణయించుకోలేని సమాధానాలే చెప్పి, తాను నివాసాన్ని ఖాళీ చేసి వెళ్తున్నట్టు చెప్పాడు. ఆయన మరీ గుచ్చి గుచ్చి అడిగిన వాటికి కాశీకి వెళ్తున్నానని చెప్పాడు. కాశీనుండి వచ్చాడు కనుక, అక్కడ ఈయన ఉద్యోగం ఈయనకే వున్నది కనుక దానిని సబబైన జవాబుగానే తీసుకున్నాడాయన.
అన్నిటినీ కామేశ్వరి సిద్ధం చేసుకునేసరికి – జగన్నాథుడు తిరిగివచ్చాడు. సూర్యాస్తమయ సమయమైంది.
జగన్నాథుడు సంధ్యావందన కార్యక్రమం పూర్తయింది. కామేశ్వరి స్నానాదికాలు కానిచ్చి జ్యోతి ప్రకాశనం చేసింది.
రాత్రి ఫలహారాలు అయినాయి.
అప్పుడు వచ్చారు నలుగురు శిష్యులు. వారు ప్రస్తుతం ఋగ్వేదాన్ని అభ్యసిస్తున్నారు. తాము అక్కడినుండీ వెళ్ళిపోతున్నట్లుగా వాళ్ళకు చెప్పాడు జగన్నాథుడు. అడగవచ్చో, లేదో – తెలియని సందిగ్ధంలో గురువుగారి ప్రయాణం ఎక్కడికనేది కామేశ్వరితో ప్రస్తావించారు శిష్యులు.
నవ్వి ఊరుకున్నది ఆమె.
జగన్నాథుడు చెప్పుకొచ్చాడు, “ఎక్కడైనా పెద్ద ఇబ్బందులేమీ ఉండవు. అవసరం త్వరలోనే ప్రదేశాన్నీ, మనుషుల్నీ, ప్రాంతాల్నీ అలవాటు చేస్తుంది. నోరు మంచిదయితే ఊరూ మంచిదవుతుంది. ఎక్కడయినా ఎవ్వరిలోనైనా మంచీ చెడూ కలగలిసే ఉంటాయి. తారతమ్యం తెలుసుకుని ప్రవర్తిస్తే ఎప్పుడూ మంచిదే.”
“మంచి పాఠమే చెబుతున్నారు కదా గురువుగారు” అన్నది కామేశ్వరి.
“అవునవును. మావంటి అల్పజ్ఞులకు నిజమైన చదువు ఇలా చెప్పే విషయాల ద్వారానే అందుతుంది” అన్నాడు ఒక శిష్యుడు. తరువాత జగన్నాథుడు వారి చదువు సంధ్యలకు వలసిన సలహాలూ, సూచనలూ ఇచ్చాడు. “ ‘జీవించడం’ అనేది అనుభవాల పంక్తి, పరంపర, కూర్పు.. అది ద్రవీభూతమయిన స్థితి. ఇక్కడ, ఇప్పుడు జరిగే పనులన్నింటికీ కారణం మనమే అనుకుంటాం. కానీ, కాదు. అవన్నీ వేరే ఎవరిచేతనో నిర్ణయింపబడి వుంటాయి. ఆ అదృశ్య శక్తులే కొందరు మానవులూ, కొందరు దైవాలూ, మరికొందరు మానవ రూపంలో నడిచే దైవాలూ! గోలగోలగా వుండే ఈ లోకంలో అందినదాన్ని పుచ్చుకోవటంలోనే విజ్ఞత వుంటుంది.”
“లోకజ్ఞానంతో పాటు వ్యక్తిత్వ వికసనానికి వలసిన ప్రశాంత విధానమూ ఉన్నది – గురువుగారి ప్రబోధంలో” కృతజ్ఞతతో చేతులు జోడించాడు ఒక శిష్యుడు.
“సాంప్రదాయిక విలువల పాటింపునుండీ కొంత, వాటిలో అవాంఛనీయమైన వాటిని పరిహరించుకోవటం ద్వారా కొంత నాగరికత పురోగమనం సాగుతూ వుంటుంది. ఉచితానుచితాల్ని అర్థం చేసుకోవాలి మనం. ఉచితమైనదాన్ని పాటించాలి, పాటింపజేయాలి. పౌరులుగా అదే మన కర్తవ్యం.”
“బాగుంది గురువుగారూ.. చిన్న సందేహం” మరొక శిష్యుని మాటని అందుకుంటూ “అడుగు” అన్నాడు జగన్నాథుడు.
“ఇప్పుడు నిత్యావసర వస్తువుల కొరత, ఆకలి తీవ్రత, దారిద్య్రబాధ అన్నీ కనిపిస్తున్న వాస్తవాలు. నిన్నటిదాకా తినా, కుడవా అంతో ఇంతో ఉన్నవారి పరిస్థితి కూడా నేటికి కష్టమవుతోంది. పైకి చెప్పవచ్చునో, లేదో గానీ, రాజ్యాధికారుల్లో చాలామందిలోనూ సుఖలాలసత పెరిగి పోయిందిట. విధేయత ఉపరితలంలో కనిపిస్తున్నా, ఈ ప్రభుతపట్ల విముఖత లోలోపల కుతకుతలాడుతోంది అని అంటున్నారంతా. ఎవరి మనసు ఏ వైపు మొగ్గుతోందో – అనేది ఎవరికీ తెలియటం లేదు.”
ఆ మాటలు జగన్నాథుడిని ఆశ్చర్యచకితుణ్ణి చేశాయి. కామేశ్వరి కూడా అంతే విభ్రమంతో భర్తని చూసింది. ఇద్దరికీ భుజాలు తడుముకున్నట్లయింది.
జగన్నాథుడు “వదంతి, కింవదంతి- అని రెండు వున్నై కదూ! జనసామాన్య పరిభాషలో వదంతిలో ఎంతో కొంత అవాస్తవికత ఉంటుంది కదా! కింవదంతి అంటే జనులు మాట్లాడుకునే మాట సాధారణంగా నానుడిగా ప్రచారమౌతుంది. ప్రస్తుత రాజ్య పరిస్థితులలో ఈ రెండూ గాలిలో పచార్లు చేస్తూ ఉంటాయి. అయితే, నిజం నిలకడ మీద తేలుతుంది.” అన్నాడు.
శిష్యులు ఆలోచనలో మునిగారు.
ఇంతలో అశ్విక నాయకుడు మాన్‌సింగ్ వచ్చాడు. ప్రయాణానికి అంతా సిద్ధమేనన్నాడు. శకటానికి ఒక బగ్గీని కూడా కట్టుకుని వచ్చారు. సిద్ధముచేసి ఉంచిన వస్తువుల నన్నింటినీ బగ్గీలోకీ, శకటములోకి ఎక్కించి సర్దిపెట్టారు. శిష్యులు సెలవు తీసుకున్నారు. జగన్నాథుడు ఇంటి తాళం చెవుల్ని అమీన్‍కి అప్పగించి వచ్చాడు.
అశ్వాలూ, శకటమూ బయలుదేరాయి. అప్పటికి ఆకాశంలో చంద్రుడి వాహ్యాళి చకచకా సాగుతోంది. మేఘాలు తెల్లని మేలు కట్టుమీద చుక్కబొట్టుల్లాగా వింత సొబగుల్ని కుమ్మరిస్తున్నాయి.
పగలంతా అలసి వున్నారేమో భార్యాభర్తలు ఇద్దరికీ కునుకు పట్టింది.
తెలతెలవారుతుండగా ఏదో ఊరికి దూరంగా పొలిమేరలో ఆగింది శకటం. ఎదురుగా చెఱువు. పక్కగా తూకుమానుతోపు. చెట్లమీద పక్షుల కలరవాలతో అక్కడి వాతావరణం అంతా శోభాయమానంగా ఉంది.
శకటం దిగి బయటకు వచ్చారిద్దరూ.
“మనం ఎక్కడున్నాం మాన్‌సింగ్?” అడిగాడు.
“‘ధారూపేరా’ అని చిన్న గ్రామం పండిట్. జయపురంకి దగ్గరి దారిలో”
“సరి..” అని తాను కాలకృత్యాలకు పూనుకున్నాడు. అటు కామేశ్వరీ ఆ ప్రయత్నంలోనే ఉన్నది. అప్పటికే అశ్వాలను చెరువుకు పడమటి రేవు వైపు తీసి కెళ్ళారు అశ్వికులు. వాటికి మేతవేసి తమ పనుల్లో నిమగ్నులయినారు.
-మధ్యాహ్నం భోజన సమయం దాటుతుండగా ‘నీమ్‌రాణా’ చేరారు. అక్కడ పురాతన రాజభవనం పక్కగా వసతి. అన్ని సదుపాయాలూ ఉన్నాయి.
సాయంత్రం – ‘కేశరోలి’ వెళ్ళి వచ్చారు. చాలాకాలం అది ఆల్వార్ యదువంశరాజ వంశీకుల ఏలుబడిలో వున్నది. ప్రాచీనకాలంలో మత్స్యరాజుల చరిత్రతో ఈ ప్రదేశ చరిత్ర ముడిపడి వుంది. పాండవులు తమ అజ్ఞాతవాసాన్ని ఈ ప్రాంతంలోనే గడిపారనే ఐతిహ్యమూ వున్నది!
బాగా చీకటి పడిన తర్వాతనే తిరిగి ‘నీమ్‌రాణా’ రాగలిగారు.
వీరి బసను ఆనుకుని యాత్రికుల సత్రం ఒకటి ఉన్నది. అక్కడ జనం కూడి ఏదో కలగా పులగంగా మాట్లాడుకుంటుంటే మాన్‌సింగ్‌ని పిలిచి, వాళ్ళ హడావిడికి కారణం ఏమిటో కనుక్కుని రమ్మన్నాడు. అతను వెళ్ళివచ్చి, “యుద్ధవార్తలే పండిట్‌జీ. షరియార్ ఓడిపోయాడని ఒక వార్త తెలిసిందిట.. ఎంతవరకూ నిజమో తెలీదు” అన్నాడు.
ఇద్దరూ గతుక్కుమన్నారు.. పాతకథ కదా! ఒకర్నొకరు చూసుకున్నారు. “అసలు జయపురంలో బయలుదేరేటప్పుడు మీకేమీ తెలీదా?” ఠక్కున అడిగింది కామేశ్వరి. ఆమె సమయస్ఫూర్తికి కించిత్ ఆశ్చర్యంతో, “అవునూ.. మీరూ కొన్ని వాస్తవాలు విని వుంటారు కదా” అని అడిగాడు జగన్నాథుడు.
“అట్టాంటి విషయాలు తెలిసేంత పెద్దవాళ్ళం కాదు- పండిట్‌జీ మేము” అన్నాడు మాన్‌సింగ్.
తెల్లవారటమే దుర్దినంగా తెల్లవారింది. ఒకటే అరుపులు, కేకలు.. “మారో.. మారో..” “హఠావో.. హఠావో..” “పకడో.. పకడో..” “కొట్టండి. వాళ్ళని చంపేయండి..” “ఇంత దుర్మార్గమా…” “ఇంకానా.. ఇకపై సాగనీయొద్దు..”
అదాటున లేచాడు జగన్నాథుడు. ఉలిక్కి పడుతూ లేచింది కామేశ్వరి. ఠక్కున కిటికీ దగ్గరికి వెళ్ళి వేసివున్న తలుపుని ఓరగా తీసి చూశారు. గుండెలు ఝల్లుమన్నై. వెన్నులో భయం పాకింది. క్షణంసేపు మ్రాన్పడిపోయారు.
అంగరఖాని సరిచేసుకుంటూ “నేను వెళ్ళి చూసి వస్తాను” అంటూ వెళ్ళబోయాడు జగన్నాథుడు. చప్పున భర్త చేయి పట్టుకుని వారిస్తూ, వద్దన్నట్లుగా అతని కళ్ళల్లోకి ప్రాధేయపూర్వకంగా చూసింది. చూశాడామెని. అప్పటికే ఆమె కళ్ళు సజలాలై వున్నై. ఆగాడు.
పక్కనున్న సత్రం దాడికి గురవుతోంది. జనం హాహాకారాలు చేస్తున్నారు. చిత్రంగా తాము ఉన్న భవనం ముందు అలజడి లేదు. ఉదయం మాన్‌సింగ్ చెప్పిన మాట గుర్తుకొచ్చింది జగన్నాథునికి. చాలాకాలంగా ఈ భవనం జనావాసం లేకుండా పాడుబడి వున్నదనేది. బహుశా, ఈ భవనంలో చాలాకాలంగా ఎవ్వరూ నివాసం వుండకపోవడం వలన, ఇప్పుడు వుండి వుంటారనే ఆలోచనే ఎవ్వరికీ కలిగి ఉండదు.
గ్రామాలూ, పట్టణాలూ కదిలి వచ్చేశాయా అన్నట్టుగా వున్నారు జనం. ఏ పక్కనుంచీ ఎవరు ఎవర్ని పొడుస్తున్నారో, తలలు పగిలేలా కొడుతున్నారో తెలియని పరిస్థితి. దూరంగా వున్న పొలాల్లో నుంచీ కత్తులూ, కర్రలూ, బాకులూ పట్టుకుని ఇంకా కొందరు ఉద్రేకంగా పరిగెత్తుకొస్తున్నారు.
“ఏం జరిగి వుంటుంది?” – కామేశ్వరి ప్రశ్న. చప్పున స్ఫురించింది. “రాత్రి తెలిసిందన్న వార్త.. షరియార్ ఓడిపోయాడనేది.. ఊరూ వాడా – రాత్రికి రాత్రే పాకిపోయి వుంటుంది.”
‘అంటే?’ ఆ ఆలోచనతో జగన్నాథునికి చేష్టలు దక్కినట్లయింది. ముస్లిములు దెబ్బతిన్న పులులయినారా? తనలో తానే గొణుక్కుంటున్నట్టుగా – “అంటే.. మత ఘర్షణలా..?” అన్నాడు. భర్త చేతిని పట్టుకునే ఉన్నది కామేశ్వరి. ఆమె పిడికిలి బిగిసింది. భయం నరాల్లోకి ప్రవహించింది.
అదే క్షణంలో భవనం ఎదురుగా ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న దుడ్డుకర్రతో మరొకమనిషి నెత్తిన బలంగా మోది, లిప్తకాలంలో ఎటో అదృశ్యమై పోయాడు. దెబ్బతిన్న వ్యక్తి కుప్పకూలి పడిపోయాడు. తల పగిలి నెత్తురోడుతున్న ఆ మనిషిని – పక్కనుంచీ పరుగెత్తుకొచ్చిన నలుగురు పట్టుకుని పక్కకు తీసుకుపోయారు.
ఈ ఘటనని చూడగానే జగన్నాథుడికీ, కామేశ్వరికీ మనసంతా కలచివేసి, ఊపిరి బిగిసినట్లయింది.
ఆమె వైపు చూస్తూ, “ఉండు, నేను వెళ్ళి కనుక్కుని ఇప్పుడే వస్తాను. అసలు మాన్‌సింగ్, అశ్వికులూ ఎక్కడ ఉన్నారో చూస్తాను” అంటూ కదిలాడు జగన్నాథుడు.
“వద్దు.. వద్దు.. మీరు వెళ్ళొద్దు..” “ఫరవాలేదు” అని నవ్వి “చూడు కామూ. ఎలాంటి ఘర్షణల్లోనైనా, చివరికి యుద్ధంలోనైనా అందరూ వధింపబడరు కదా!” అంటూ ద్వారం వైపు కదిలాడు. ఆమె మాత్రం భర్త చేతిని వదలలేదు. తలుపు తీయబోతుండగా మళ్ళీ ప్రాధేయపడింది. “కామేశ్వరీ!” అనే పిలుపు స్పష్టమైన, దృఢమైన స్వరంతో జగన్నాథుని కంఠం నుండీ వెలువడింది. ఆ పిలుపులోని ఆజ్ఞాపన స్వరం, ధ్వనీ – ఆమెకు ఎరికే! ఆమె చెయ్యి విడివడింది!!
తలుపు తెరిచి, “జాగ్రత్త, తలుపు వేసుకో” అంటూ వెళ్ళిపోయాడు. గడియపెట్టి వెర్రిచూపులు చూస్తూ నిలబడిపోయింది కామేశ్వరి.
జగన్నాథుడు బయటికి వచ్చీరాకముందే, దూరంగా ఎవరో ఒక స్త్రీని కాలితో తన్ని చేతిలోని కత్తితో పొడిచేశాడు. ఆమె ఆక్రందనతో గాలి స్తంభించింది. ఇంతలో ఒక మూక ఆ పొడిచినవాణ్ణి పట్టేసుకుని, కొట్టినచోట కొట్టకుండా నేలమీద పడేసి మట్టగించి వదిలేసి వెళ్ళిపోయారు.
జగన్నాథుడు ముందుకు దూసుకువెళ్ళాడు. ఎదురుగా వేపమాను కింద రాళ్ళగుట్ట వుంది. దానిమీదకి ఎక్కి తన కంచుకంఠంతో “ఆగండి” అని పొలికేక పెట్టాడు. ఆ ప్రదేశంలో ఉన్న వారంతా ఎక్కడివారక్కడ చేష్టలు దక్కి నిలబడిపోయారు.
“రండి.. అంతా దగ్గరికి రండి. నేను మీ వాడినే. సందేహించకండి. నే చెప్పేది వినండి”. ఆ గంభీర స్వనానికి పిల్లికూనల్లా ముందుకొచ్చారు చాలామంది. “నేను జహంగీర్ పాదుషావారి ఆదరణను పొందిన పండితుడిని. ఢిల్లీ నుండి జయపురం వెళ్తున్నాను.”
అతని మాటలు విన్న జనం – ఆయన జహంగీర్ పాదుషా వారికి, బేగం సాహెబా వారికి దగ్గరివాడని అర్థమయ్యేసరికీ నిదానించారు.
“ఎందుకు మీరంతా ఇలా కక్షలూ, కార్పణ్యాలతో ఉద్రేకంతో ఊగిపోతున్నారు? ఏదో వార్త వచ్చింది. అంతేకదా! దానిలో నిజమెంతో ఎవరికీ తెలియదు. అయినా, మీరు ఏవేవో ఊహించుకుని ఒకరినొకరు నరుక్కుంటున్నారు. ముసల్మానులంతా వినండి. ఒక వేళ మీరు విన్న వార్త ప్రకారం షరియార్ ఓడిపోయినా గెలిచింది. ఎవరు? ఖుర్రం కదా! అసలు మీ కోపం, ఆగ్రహం ఎవరిమీదా? హిందువుల మీదనా? అసలు, హిందూ రాణాలు యుద్ధంలో ఏ పక్షానికి సహాయం చేసినా, ఆ సహాయాన్ని పొందినవారు మొగలాయీలే కదా! ఆలోచించండి. ఇక్కడ నీమ్‍రాణా, కేశ్రోలీ ప్రాంతమంతా నూరేళ్ళ క్రిందటే మొగలాయీల ఏలుబడిలోకి వచ్చిందే కదా! ప్రజల్లో ఎక్కువ మంది ముస్లిములయ్యారు కదా. ఆవేశం ఇప్పటికే అనర్థాలకు దారి తీసింది. చిన్న గ్రామంలో రేగిన అశాంతి చుట్టుపక్కల ఊళ్ళకి కూడా విషజ్వరంలా వ్యాపించింది కదా?”
కొంతమందిలో సవ్వడి. లోలోపల ఏదో పరిణామ ప్రక్రియ మొదలయింది. నిముషాలు గడుస్తుంటే – చేతుల్లోని కత్తులూ, కట్టెలూ కింద పడుతున్నై, షుక్రియాలు వినవస్తున్నై. ‘హిందూ ముస్లిం భాయ్ భాయ్’, ‘ఆదాబర్సే’లూ బయటికొస్తున్నై.
జగన్నాథుడు మంచి సమయజ్ఞుడు. “కూర్చోండి” అన్నాడు. తానూ కూర్చున్నాడు. అందరిలో కొందరు పెద్దలూ నేలమీదే కూర్చున్నారు.
‘పాదుషావారు ఎవరైనా పాదుషావారే. వారికీ ప్రజల శ్రేయస్సే ముఖ్యం. మీ అందరిలోనూ రాజకీయ చైతన్యం ఉంది. సంతోషం. ఈ ప్రాంతంలో జనబాహుళ్యానికి ఏం కావాలి. వ్యవసాయం, చేతివృత్తులు కళకళలాడాలి. విద్యావైద్యం కావాలి. మీమీ ఆచార వ్యవహారాలూ, సంప్రదాయాలూ, సంస్కృతీ కాపాడబడాలి. మీ జీవనానికి గ్రామం ఆలంబనం, అది ‘పాదు’. అదే ‘వేరు’. గ్రామ సౌభాగ్యం వృద్ధి పొందాలంటే, మీరంతా కలసికట్టుగా వుండి దాన్ని సాధించుకోవాలి. పాదుషావారు ఇచ్చిన ఫర్మానాల్లో ఎన్నో ప్రజల శాంతి భద్రతలకూ, సుఖజీవనానికీ దోహదం చేసేవి వున్నాయి కదా! ఉదాహరణకి ‘మీర్‌వహి’, ‘టగ్మా’ – పన్నుల్ని తీసేశారు కదా! నేరస్థుల కాళ్లూ చేతులూ నరికేయటాన్ని విరమించారు కదా! చిన్న సన్నకారు వ్యవసాయదారుల భూముల్ని దొరలు దురాక్రమణ చేయటానికి వీలులేకుండా చట్టం చేశారు కదా! గ్రామప్రజల రోజు వారీ జీవనంలో అధికారుల ప్రమేయం లేకుండా చేశారు కదా! కేవలం మీ ముఖద్దమే మీ గ్రామ పెద్ద కదా?”
అన్ని తలలూ సవ్యంగా ఊగినై. ప్రతి వారి పెదవులూ పక్కవారితో “అవును.. కదూ..” అంటున్నాయి.
చివరికి ఒక పెద్దమనిషి లేచి గంభీరస్వరంతో, “పండిట్‍జీ. సహీబాత్ బోల్దియా. సహీమార్గ్ బతాయా. సమఝే” అన్నాడు.
జగన్నాథుడు “తమరూ?” అని ఆయనెవరో తెలుసుకుందామనుకునేలోగా – ఒకేసారి చాలా గొంతులు అరిచాయి “అచ్ఛా-ముఖద్దం సాబ్.. అచ్ఛా”. జగన్నాథునికి అర్థమైంది. సన్నగా నవ్వుకున్నాడు. ఆయనకి అభినందనలు తెలిపాడు.
ఇక్కడ ఈ సంరంభం సాగుతుండగానే, ఠకఠకా గుఱ్ఱాల మీద వచ్చేశారు. సైనికులు చిన్నపటాలం.
చిన్న ఫౌజ్‌దార్ స్థాయి నాయకులెవరో దాష్టీకంగా “ఏం జరుగుతోందిక్కడ? క్యా హోగయా?” అని ప్రశ్నించాడు. ముఖద్దం లేచి నిలబడి, ఆయన్ని సౌమ్యంగా సాదరంగా ఆహ్వానించాడు. ఆ అధికారి గుఱ్ఱం దిగి వారి దగ్గరకు వచ్చాడు.
జరిగినదంతా చెప్పాడు ముఖద్దం. విని తల పంకించి, “సరే.. ఠీక్ హై. మేము నాలుగు రోజులు ఇక్కడే వుండాలని పై అధికారుల ఆజ్ఞ. కనుక, ఉంటాము. జాగ్రత్తగా మసలుకోండి” అని, “షుక్రియా పండిట్‌జీ. హమ్ ఆప్ కా అచ్ఛీ కామ్‌కా ఖబర్ దియా. వో అల్వార్ కో బేజ్‌దేగా” అంటూ అభినందించాడు.
జగన్నాథుడు లేచి వాళ్లందరికీ నమస్కరించి అక్కడ నుంచీ కదిలాడు. అంతలోనే ఏదో స్ఫురించి, ముఖద్దంకేసి చూస్తూ- “గాయపడిన వారికి వైద్యం సంగతిని మీరుగా చూడాలి” అని విజ్ఞప్తిగా అన్నాడు. ఆయన “అలాగే సాబ్. ఐసా హోగా “ అన్నాడు.
జగన్నాథుడు తమ వసతి భవనం వైపుకి నడక సాగించాడు.
భవనం ముంగిట్లోనే ఎదురయ్యాడు మాన్‍సింగ్. ఎప్పుడు వచ్చాడో ఏమో, సలాంచేసి, “ఆదాబర్సే.. పండిట్‌జీ. మీరు చాలా గొప్పమనిషి. ఒక్క మాట మీద అంతమందిని కట్టి పడేశారు. మీరు వెళ్లక పోయివుంటే పరిస్థితి చాలా ఘోరంగా వుండేది. చాలా తలలు లేచిపోయేవి” అన్నాడు.
జగన్నాథుడు తృప్తిగా చిరునవ్వు చిందించి లోపలికి వెళ్లాడు.
“విన్నాను.. విన్నాను..” అంటూ ఎదురయింది కామేశ్వరి. తల వాకిలి తలుపువేసి వచ్చి, భర్త పక్కగా నిలిచి, “మీకు దిష్టి తీయవలసిందే!” అన్నది పరిహాసంగా.
“సరి.. సరి..” అంటూ తన కార్యక్రమాల్లోకి మరలాడు జగన్నాథుడు. సాయంత్రానికి-ప్రయాణం మొదలయింది. అజ్మీరు వైపుగా సాగాయి-శకటమూ, అశ్వాలూ.
దారికి ఇరువైపులా పెద్ద పెద్ద వృక్షాలు.. ఉండి ఉండీ వీచేగాలితో కొమ్మలు ఊగుతున్నై. బాటకి లోతట్టున మానులూ, మాకులూ, పొదలూ – అంతా అడవిలా వుంది.
ఆమడదూరం పోయేసరికి పెద్దగా అరుస్తూ జనాల గుంపు ఎదురయ్యింది. చేతుల్లో మొగలాయీ జాతీయపతాకాలు. ముదురు ఆకుపచ్చమీద పసుపురంగు సింహం, దానిపై ఉదయిస్తున్న సూర్యుడు! వారు చేస్తున్న నినాదాలు వివరంగా తెలియటం లేదు.
శకటం ఆగింది!
మాన్‌సింగ్ జగన్నాథుని సమీపానికి వచ్చి, “ఇదొక చిన్నగ్రామం పండిట్‌జీ. ఇక్కడా కలకలంగా ఉంది. షహజాద్ ఖుర్రం వారికి అనుకూలంగా వినబడుతున్నై వీళ్ల నినాదాలు. కొద్దిసేపు పక్కకు ఆగుదాం” అన్నాడు.
‘అలాగే’ నన్నాడు జగన్నాథుడు. కామేశ్వరి బెరుకు బెరుకుగా చూస్తూ కూర్చుంది.
ఇంతలో మరో దిక్కు నుండి కొందరు చేతుల్లో పంచరంగుల పతాకాలతో, నినాదాలు చేస్తూ గుంపుగా వస్తున్నారు. ఖుర్రం గెలుపుకి రాజపుత్రుల శౌర్య సాహసాలే కారణమని ‘జయహో’లు కొడుతున్నారు. వారి చేతుల్లోని పతాకాలు రాజపుత్రులవి.
రెండు సమూహాలూ ఒకదానికొకటి తారసపడ్డాయి.
చూస్తున్నాడు జగన్నాథుడు! నిశితంగా చూస్తున్నాడు మాన్‌సింగ్!! గుండె గుబులుతో కళ్లు విచ్చుకుని పరికిస్తోంది కామేశ్వరి. అశ్వికులు గుఱ్ఱాల్ని వల్గితం చేయించి పక్కకు తప్పుకుని చూస్తున్నారు. పరిస్థితి అంతా ఉత్తేజకరంగానూ, ఉద్విగ్నంగా గానూ ఉన్నది.
ఇరు సమూహాలు గీయని నియంత్రణ రేఖకి అటూ ఇటూ వరుసకట్టారు.
ఎవరో పతాకాన్ని పైకెత్తి, “బినా రాజ్‌పుట్ కహాఁ హై మొఘల్?” అని హేళనగా నినాదాన్నిచ్చారు. దానికి సమాధానంగా మరొకరు – “బోలో.. ఏ హై మొఘల్ జమానా, ఔర్ కోయీ బాత్ నహీం చలేగా. ఖబడ్డార్.. బోలో” అని పిడికిలీ పళ్లు బిగించిన భంగిమతో అరిచాడు.
ఠక్కున శకటం నుంచీ కిందికి లంఘించి, నాలుగు అంగల్లో ఆ రెండు సమూహాల మధ్యగా వెళ్లి నిలిచాడు జగన్నాథుడు.
“ఠైరో… భాయియోఁ” అంటూ చెయ్యిత్తి అరుస్తూ చిత్రంగా నవ్వాడు. జగన్నాథుని కేకతో అక్కడ కోలాహలం సద్దుమణిగింది. నిశ్శబ్దం అలముకుంది. “మీ రెండు పక్షాలవారిదీ ఒకటేమాట. ఒకటే లక్ష్యంగా ఉన్నాయి. పలుకుభేదంలాగా అభిప్రాయాలు వికటిస్తున్నాయి. అంతే.. మీ ఇరువర్గాల వారిదీ ఏకాభిప్రాయమే” అన్నాడు.
అందరూ ఆశ్చర్యంగా చూశారు. “ఏ కైసా హోగా?” అని ఎవరో గద్దించారు. నవ్వాడు జగన్నాథుడు, “ఐసా” అని “ఆప్ దోనోంకీ ఏకా రాస్తా భాయ్” అంటూ “సునో.. ఆప్ కా లక్ష్య్ క్యా హై?” అని ఒక వర్గం వారిని అడిగాడు.
“ఖుర్రం షహజాద్ జీత్ హోనా”
“ఔర్ ఆప్‍కా?” రెండో వైపు వారిని అడిగాడు.
“యహీ హై.. రాణా సాబ్ జీత్ హోనా” చెప్పారు.
“ఏ దోనోంకా లక్ష్య్ క్యా హై దోస్తోవ్?”
“షహజాదా ఖుర్రం పాదుషా సాబ్ బనాయీ హోనా!”
“యహీ హై సహీ బాత్, ఠీక్ హై.. మగర్ ఆప్ దోనోం క్యోం దుష్మనీ బన్ చాహ్‌తే?”
ఎవ్వరూ మాట్లాడలేదు. “చలో.. బోలో మొఘల్ ఔర్ రాజ్‌పుత్ర్ దోనోం భాయీ భాయీ.”
కొద్దిసేపు నిశ్శబ్దం. తర్వాత “పండిట్‌జీ జయహో” నినాదాలు మ్రోగినై. నవ్వుకున్నాడు జగన్నాథుడు. ఆ తర్వాత చాలాసేపు అందరూ కూర్చుని జగన్నాథుని పూర్వాపరాలూ, ప్రస్తుత ప్రయాణం గురించిన వివరాలూ మాట్లాడుకున్నారు. గ్రామస్థులు వీరిని ఆ రాత్రికి అక్కడే వుండాలని పట్టుపట్టారు.
అశ్వాలూ, శకటం ముందుకు సాగలేదు.
-నిద్రకి ఉపక్రమించేముందు, “చూడబోతే తమ ఉద్యోగ బాధ్యతలు పండిత పదవి నుండీ, సమన్వయ కర్త పదవికీ, మధ్యవర్తి పదవికీ చేరినట్లు తోస్తోంది” నవ్వుతూ అన్నది కామేశ్వరి.
ఆమె వైపు ఆదరంగా చూస్తూ హిందీ సూక్తి నొకదాన్ని చెప్పాడు జగన్నాథుడు.
“మర్‌నా భలా హై ఉస్కో, జో అప్నే లియే జియే!
జీతా హై వహ్, జో ఔరోం కేలియే జియే”
ఆ రాత్రి ఇద్దరికీ హాయిగానే నిద్రపట్టింది.
-ఉదయాన్నే జగన్నాథుడు అనుష్టానం పూర్తికాగానే ప్రయాణం మళ్లీ మొదలయింది. గ్రామస్తులే దారిలో అవసరమయ్యే ఆహారపదార్థాల్నీ, వస్తు సంభారాన్నీ అందించారు. రెండు రోజులకి ‘రాంపూర్’ చేరారు. చిన్న గ్రామం కానీ, ప్రజలంతా దైవభీతి కలిగినవారు. ఎక్కువమంది షియా తెగకు చెందిన ముస్లింలు, హిందూ ముస్లిం సఖ్యతకు పేరైన గ్రామం.
గ్రామస్థులలో పెద్దలు కొందరు వచ్చి పలకరించారు. “మాకు అందుతున్న వార్తల్ని బట్టి షహజాదా షరియార్ యుద్ధంలో చనిపోయారట పండిట్‌జీ” ఊళ్లోని విశేషాలు చెప్పుకొచ్చాడొక వృద్ధుడు.
విన్నాడు జగన్నాథుడు. తెలిసిన వాస్తవం! సమాధానం చెప్పలేదు. తరువాత, ధైర్య వచనాలతో వారి సందేహాలను తీర్చాడు. వారందరూ కొంత స్తిమితులయినారు.
-ప్రయాణం సాగింది.
(సశేషం)
విహారిగా సుప్రసిద్ధులైన శ్రీ జే.యస్.మూర్తి గారు 1941 అక్టోబర్ 15 న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. విద్యార్హతలు: ఎం.ఏ., ఇన్సూరెన్స్ లో ఫెలోషిప్; హ్యూమన్ రిసోర్సెన్ మేనేజ్మెంట్, జర్నలిజంలలో డిప్లొమాలు, సర్టిఫికెట్స్, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో ప్రసంగాలు, వ్యాస పత్ర ప్రదానం.
తెలగులోని అన్ని ప్రసిద్ధ పత్రికల్లోను 350 పైగా కథలు రాశారు. టీవీల్లో, ఆకాశవాణిలో అనేక సాహిత్య చర్చల్లో పాల్గొన్నారు.
15 కథా సంపుటాలు, 5 నవలలు, 14 విమర్శనాత్మక వ్యాససంపుటాలు, ఒక సాహిత్య కదంబం, 5 కవితా సంపుటాలు, రెండు పద్య కవితా సంపుటాలు, ఒక దీర్ఘ కథా కావ్యం, ఒక దీర్ఘకవిత, ఒక నాటక పద్యాల వ్యాఖ్యాన గ్రంథం, ‘చేతన’ (మనోవికాస భావనలు) వ్యాస సంపుటి- పుస్తక రూపంలో వచ్చాయి. 400 ఈనాటి కథానికల గుణవిశేషాలను విశ్లేషిస్తూ వివిధ శీర్షికల ద్వారా వాటిని పరిచయం చేశారు. తెలుగు కథాసాహిత్యంలో ఇది ఒక అపూర్వమైన ప్రయోజనాత్మక ప్రయోగంగా విమర్శకుల మన్ననల్ని పొందింది.
ఆనాటి ‘భారతి’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి పత్రికల నుండి ఈనాటి ‘ఆంధ్రభూమి’ వరకు గల అనేక పత్రికలలో సుమారు 300 గ్రంథ సమీక్షలు చేశారు.
విభిన సంస్థల నుండి పలు పురస్కారాలు, బహుమతులు పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (1977) గ్రహీత. కేంద్ర సాహిత్య అకాడెమివారి Encyclopedia of Indian Writers గ్రంథంలో సుమారు 45 మంది తెలుగు సాహితీవేత్తల జీవనరేఖల్ని ఆంగ్లంలో సమర్పించారు. మహాకవి కొండేపూడి సుబ్బారావుగారి స్మారక పద్య కవితా సంపుటి పోటీలోనూ, సాహిత్య విమర్శ సంపుటి పోటీలోనూ ఒకే సంవత్సరం అపూర్వ విజయం సాధించి ఒకేసారి 2 అవార్డులు పొందారు.
అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి (లక్ష రూపాయల) జీవిత సాధన ప్రతిభామూర్తి పురస్కార గ్రహీత. రావూరి భరద్వాజ గారి ‘పాకుడురాళ్లు’ – డా. ప్రభాకర్ జైనీ గారి ‘హీరో’ నవలలపై జైనీ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన తులనాత్మక పరిశీలన గ్రంథ రచన పోటీలో ప్రథమ బహుమతి (రూ.50,000/-) పొందారు. (అది ‘నవలాకృతి’ గ్రంథంగా వెలువడింది).
కవిసమ్రాట్ నోరి నరసింహ శాస్త్రి సాహిత్య పురస్కార గ్రహీత.
6,500పైగా పద్యాలతో-శ్రీ పదచిత్ర రామాయణం ఛందస్సుందర మహాకావ్యంగా ఆరు కాండములూ వ్రాసి, ప్రచురించారు. అది అనేక ప్రముఖ కవి, పండిత విమర్శకుల ప్రశంసల్ని పొందినది. ‘యోగవాసిష్ఠ సారము’ను పద్యకృతిగా వెలువరించారు.
వృత్తిరీత్యా యల్.ఐ.సి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుండి జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు.