Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జనప్రియ నాయకుడు.. శ్రీరాముడు!

[2026 మార్చ్ 27 న శ్రీరామనవమి సందర్భంగా శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘జనప్రియ నాయకుడు.. శ్రీరాముడు!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

త్రేతాయుగంలో వసంత ఋతువులో
చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు
పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో
అభిజిత్ ముహూర్తంలో
జన్మించిన సాక్షాత్తు
శ్రీ మహావిష్ణువు అవతారం శ్రీరాముడు!

సత్యం, ధర్మం తన జీవన విధానంగా
చేసుకున్న పుణ్య పురుషుడు
తండ్రి మాటను జవదాటని
పితృవాక్య పరిపాలకుడు
గురువులను గౌరవించే
సంస్కారవంతుడు.
జనులను కన్నబిడ్డల్లా కాపాడిన
జనప్రియ నాయకుడు శ్రీరాముడు!

సీతమ్మ మదిలోన కొలువై ఉన్న
కారుణ్య స్వరూపుడు శ్రీరాముడు!

రాయిగా పడి ఉన్న అహల్యకు
మోక్షాన్ని ప్రసాదించిన
దైవ స్వరూపుడు శ్రీరాముడు!

ప్రేమతో ఎంగిలి పండ్లను పెట్టిన
శబరిని అక్కున చేర్చుకున్న
మహనీయుడు శ్రీరాముడు!

రామనామమే సర్వస్వంగా భావిస్తూ
రామ సేవలో తరించిన ఆంజనేయుడిని
హృదయానికి హత్తుకుని
భక్తిని మెచ్చిన సహృదయుడు!

పౌరుష, పరాక్రమాలతో
శత్రువులను తుదముట్టించి
లోక కళ్యాణానికి పాటుపడిన
మహనీయుడు శ్రీరాముడు!

దశకంఠుడైన రాక్షసరాజు రావణుడిని
సంహరించిన ధీరుడు శ్రీరాముడు!

ఆదర్శం అనే పదానికి
అర్థం తానై నిలిచిన
అవతారపురుషుడు శ్రీరాముడు!

Exit mobile version