[ప్రముఖ రచయిత్రి చివుకుల శ్రీలక్ష్మి గారు రచించిన ‘జీవామృతం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[అనకాపల్లి స్టేషన్ వెయిటింగ్ రూమ్‍లో మగతగా పడుకున్న చందనకి – ఏవేవో జ్ఞాపకాలు గుర్తొస్తాయి. విశాఖపట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మడుతూరు తమ సొంతూరని, ఆ గ్రామంలో తమది వ్యవసాయ కుటుంబమనీ, వచ్చిపోయే బంధువులతో ఇల్లెప్పుడూ కళకళలాడేదని జ్ఞాపకం వస్తుంది. నాన్న ఆ ఊరికి కరణమనీ, తన పేరు నీహారిక అని గుర్తొస్తుంది. తన బాల్యం, చిన్నప్పటి ఆటపాటలూ అన్నీ గుర్తొస్తాయి. తన తొమ్మిదో తరగతిలో ఉండగా స్కూలు చదువు మానిపించి, నేరుగా మెట్రిక్ పరీక్షకి కట్టించారని గుర్తు చేసుకుంటుంది. మెట్రిక పాసయ్యాకా చిన్నత్త కొడుకు వేణుతో పెళ్ళి చేసేసారని గుర్తు చేసుకుంటుంది. వేణు ఆమె కోరినట్టే, టీచర్ ట్రెయినింగ్ పూర్తి చేయించి ఆ తరువాతే కాపురానికి పంపమని మామగారికి చెప్తాడు. కూతురికి పెళ్ళి చేసినా, నీహరిక తండ్రి ప్రసాదరావుగారి మనసులోని ఆందోళన తగ్గదు. ఎందుకంటే వేణు జాతకంలో మృత్యుగండం గోచరించిందాయనకు. కానీ ఊరిపెద్దగా, అందరికీ పరిష్కారాలు చెప్పే జ్యోతిష్య పండితుడిగా – ఆ పెళ్ళిని ఆపడానికి లేదా, కనీసం వాయిదా వేయిండానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ కుటుంబ సభ్యులు పడనివ్వలేదు. దాదాపు సంవత్సరం పాటు తాము దూరంగా ఉంటామని స్వయంగా వేణే వచ్చి అడగటంతో కాదనలేకపోయాడు. రహస్యాన్ని తన గుండెల్లోనే దాచుకుని మౌనంగా ఉండిపోతాడాయన. వేణు తన చదువు కొనసాగించడానికి కాకినాడ, నీహారిక టీచర్ ట్రెయినింగ్ చేయడానికి విశాఖపట్టణం వెళ్ళిపోతారు. – ఇక చదవండి.]
అధ్యాయం 5
తెల్లవారుజాము అయింది. స్టేషన్‌లో సందడి పెరిగింది.
టీ అమ్మే వాళ్ళూ, టిఫిన్లు అమ్మేవాళ్ళూ ఏదో ట్రైన్ వస్తున్నట్లుంది. సామాన్లు మోసేందుకు పోర్టర్లు అందరూ హడావిడి పడుతున్నారు. అంతవరకు కొంత స్తబ్దుగా ఉన్న స్టేషన్ ఒక కొత్త చైతన్యాన్ని తెచ్చుకుంది.
లేడీస్ వెయిటింగ్ రూంలో ఒక కుర్చీలో మూలగా కూర్చున్న నీహారికకు తెలివి వచ్చింది. చేతివాచి చూసుకుంది. తెల్లవారుతోంది. నాలుగున్నర కావస్తోంది. నిద్రలో తనకు కనిపించిన తను పుట్టిన ఊరు, అమ్మానాన్న అందరూ గుర్తుకు రాగానే ఆమెకు కొత్తగా అనిపించింది.
వెంటనే లేచి నిల్చుంది. అర్జంటుగా అమ్మానాన్నా దగ్గరకి వెళ్ళాలి. తనలోని ఈ గందరగోళం ఏమిటో తెలుసుకోవాలి, అనుకుంది.
అనకాపల్లికి మడుతూరు దగ్గరే కదా! అమ్మానాన్న దగ్గరకు వెళ్ళిపోవాలి అని అనుకుంది. ఏవేవో ఆలోచనలు మనసులోకి ఈగల్లా ముసురుతూ ఉంటే వాటిని విదిలించుకుంటూ లేచి అక్కడే గబగబా తయారై కాఫీ తాగి బయలుదేరింది.
బస్టాండ్‌కి వెళ్ళి, మడుతూరు వెళ్లే బస్సు ఎక్కింది.
కిటికీ పక్కనే కూర్చుని ఆ తెల్లవారుజామున చల్లని గాలిలో ఆకాశం వైపు చూస్తూ ఉంటే ఇందాక విదిలించుకున్న ఆలోచనలన్నీ మళ్ళీ ఆమెను చుట్టుముట్టాయి.
పదహారు సంవత్సరాల జీవితం కళ్ళముందు కదలాడింది.
వివాహం అయిన వెంటనే అత్తవారి ఊరు ఏనాళ్లకు వెళ్ళింది. అంతే! మళ్ళీ ఈనాటి వరకు ఏ సంబంధం లేదు.
వేణు బావ కాకినాడ వెళ్ళిపోవడం, తాను విశాఖపట్నంలో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంలో చేరడం ఒకేసారి జరిగాయి. అన్నట్టుగానే మొదటి వారం రోజులు తిరిగేసరికి తనకు బావ నుంచి ఉత్తరం వచ్చింది.
గుండ్రని అక్షరాలతో తేదీల వారీగా ఆ రోజు ఏ వారమో కూడా రాసి దొంతుపెట్టి ఏడు ఉత్తరాలు రాశాడు.
అవన్నీ కలిపి చదువుతూ ఉంటే, బావ ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నట్లే ఉంది. అందులో అతని లక్ష్యాలు, తన ఊరు, తన ప్రజలు, అక్కడి వారికి గల నమ్మకాలూ- మూఢనమ్మకాలు అన్నీ విపులంగా ఒక్కొక్క రోజు ఒక్కో విషయం.
“నీహా! జీవితం అనేది ఒక పట్టకం లాంటిది. అందులో సూర్యకిరణం పడగానే విభిన్నమైన రంగులతో మెరుస్తూ కనిపిస్తుంది. అదే మనం పట్టకం డైరెక్షన్ కొంచెం మార్చేము అనుకో! వేరే రంగులు వెదజల్లుతూ మన కంటి ముందు మరొక ప్రపంచాన్ని చూపిస్తుంది. జీవితం కూడా అంతే కదా! మనము వర్తమానంలో ఉంటే అది కష్టమైనా, సుఖమైనా ఆనందించగలిగితే ఎంతో సంతృప్తిగా ఉంటుంది. రాని రేపటి కోసమో, జరిగిపోయిన నిన్నటి కోసమో, ఆలోచిస్తూ కూర్చుంటే నేడు కూడా చేయి జారిపోతుంది.”
తాను జవాబు రాసిందా? ఎంత ఆలోచించినా గుర్తు రావటం లేదు. తలనొప్పిగా ఉంది. ఆలోచించడానికి మనసు అంగీకరించటం లేదు.
పైన నీలాకాశంలో పక్షులు గుంపులు గుంపులుగా ఎగురుతున్నాయి. అవన్నీ ఒకే వరుసలో ఆ శూన్య ప్రదేశంలో ఎలా ఎగర గలుగుతున్నాయి??
ఇంతలో మడుతూరు వచ్చినట్టుగా బస్ కండక్టర్ దిగి కేక వేస్తున్నాడు.
సూర్యోదయంతో పాటే నీహారిక తాను పుట్టిన ఆ గడ్డపై అడుగుపెట్టింది. క్రిందకు వంగి ఆ మట్టి తీసి తన పాపిట సింధూరంలా దిద్దుకుంది.
అటు ఇటు చూసింది. ఎవరొస్తారు? తన కోసం?
అవును ఎవరు వస్తారు?
16 సంవత్సరాలు!!!
కాలచక్రం తిరిగిపోయింది
ఏమైంది? ఇన్ని సంవత్సరాలు తాను ఎక్కడుంది?
రోడ్డు పక్కన పాకలో టీ తాగుతున్న రాము ఆ గ్లాసు అలాగే వదిలేసి గబగబా పరిగెత్తుకొని వచ్చాడు.
“అమ్మాయిగోరూ! అమ్మా! మీరేనా?” వాడి మాటల్లో తొట్రుబాటు, వాడి కళ్ళల్లో సంభ్రమం!!!
నీహారిక కళ్ళల్లో వెలుగు వచ్చింది.
“ఏరా! రామూ! బాగున్నావా?” అని ఆప్యాయంగా పలకరించింది.
మళ్ళీ వెంటనే నాలుక్కరుచుకుని చుట్టూ చూస్తూ
“నయమే ఎవరూ వినలేదు. నాన్నగానీ వింటేనా నాకు అరగంట సుద్దులు చెప్పేవారు. నిన్ను ఏరా! అన్నానని. రామూ! ఇంటిదగ్గర అందరూ బాగున్నారా? నాన్నగారి ఆరోగ్యం బాగుందా? నాయనమ్మ ఎలా ఉంది?”
ప్రశ్నల వర్షం కురిపిస్తున్న నీహారికని చూస్తుండిపోయాడు.
“అలా ఉండిపోయావేమిటి?” గద్దించింది.
“అమ్మా! మీరు అచ్చంగా అలాగే ఉన్నారు.” అంటూ ఆమె చుట్టూ చూస్తూ “అమ్మా! మీ లగేజి???” అన్నాడు.
“ఏమీ లేదురా! నిన్న సాయంత్రం అప్పటికప్పుడు అనుకుని బయల్దేరిపోయాను. నా కోసం నాన్నే వస్తాడు అనుకున్నాను.” అంటూ అతనితో అడుగులు కలిపింది, ‘పద! పద!’ అంటూ.
రామూ మనసులో లక్ష ప్రశ్నలు అడగాలని ఉంది. కానీ అయ్యగారి సూచన ప్రకారం మౌనం వహించాడు.
ఊరి చివరగా ఆ మిద్దె ఇల్లు. పెరట్లో చింతచెట్టు, కనుచూపు మేరలో కళ్ళాల దగ్గరలో తాటితోపూ, పెరట్లో ఎత్తు అరుగుమీద తాను, బావా కూర్చుని మాట్లాడుకోవడం. నీహారికలో ఆందోళన పెరిగింది.
మిద్దె ఇల్లు వీధివేపు వరండా, నడవ అన్ని శిధిలావస్థకు వచ్చి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. నందలు పెట్టిన నట్టిల్లు కూడా.
పడమటి వేపు ద్వారంగుండా రాము నడిచాడు. అయోమయ స్థితిలో నీహా అతని వెంట ఇంట్లోకి అడుగు పెట్టింది.
వంటిల్లు భోజనాలు చేసే నట్టిల్లు కొంచెం బాగానే ఉన్నాయి. అమ్మా నాన్నగారి గదిలో మంచం మీద ఎవరు పడుకుని ఉన్నారు?
“రాము ఏంటిది? ఇల్లు ఇలా ఉంది? ఎవరూ లేరా?” అంటూ అడిగింది.
“అదిగోనమ్మ అమ్మ” అంటూ మంచం వైపు చూపించాడు.
తెల్లచీర కట్టుకుని, శూన్యమైన నుదురుతో, కర్రపుల్లలాంటి చేతులు అస్తిపంజరంలా ఉన్న ఆమెను చూస్తూనే నీహారిక కళ్ళు తిరిగి కింద పడిపోయింది.
“రామూ! ఎవరురా? ఏమైంది?” నీరసంగా వినిపించిన గొంతు విని రాము,
“అమ్మా! అమ్మాయిగారు వచ్చారు. బస్సు దగ్గర నుంచి నేనే దగ్గరుండి తీసుకుని వచ్చాను. వస్తూనే ‘అమ్మ ఏది?’ అని అడిగారు. మిమ్మల్ని చూపించగానే మొహం తిరిగి పడిపోయారు. ఉండండి నీళ్లు తీసుకువస్తాను.” అని గబగబా లోపలికి వెళ్లి, నీళ్లు పట్టుకొచ్చి, మొహం మీద జల్లి, తుడిచి లేపి కూర్చోపెట్టి బలవంతంగా నీరు తాగించాడు.
నీహారిక మగతగా ఏదో కలవరిస్తోంది.
“రామూ! మంచం మీద అమ్మాయిగారిని పడుకోపెట్టు. లేచాక కొంచెం సర్దుకుంటుంది. వేడిగా పాలు వేడిచేసి తీసుకురా!” అని చెప్పారు.
భర్త చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే ఓపిక తెచ్చుకుని లేచి లోపలికి వెళ్లి తను కట్టుకున్న తెల్లచీర విప్పి పడేసి, పెట్టెలో నుంచి వేరే చీర తీసి కట్టుకుంది. బొట్టు పెట్టుకుని మెల్లిగా నీహారిక పడుకున్న మంచం దగ్గరకు వచ్చింది.
“అమ్మా! నీహా! అంటూ ఆమె తలరాస్తూ కూర్చుంది.
రాము పాలు తీసుకురాగానే లేపి కూర్చోపెట్టి, “కొంచెం పాలు తాగమ్మా! మా బంగారుతల్లి కదూ!” అంటూ కొంచెం కొంచెం నోట్లో పోసింది. అమ్మ చేతిస్పర్శకో, ఆమె గొంతులోని ఆర్ద్రతకో కొంచంగా కదిలి కళ్ళు విప్పి చూసింది నీహారిక.
తల్లి చేయి పట్టుకుంటూ ‘అమ్మా! నువ్వేనా? నువ్వేనా?’ అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది.
గతానికి వర్తమానానికి మధ్య తెగిపోయిన బంధాన్ని కలపలేక మనసు ఘర్షణ పడుతోంది.
కూతురి దుఃఖాన్ని చూసి తట్టుకోలేక ఆమె కూడా ఏడవడం మొదలు పెట్టింది.
రాము వెంటనే అక్కడికి వచ్చి
“అమ్మగారూ! మీరు పెద్దవారు. ఇలాగ చేయవచ్చా? అయ్యగారు మనకు ఏం చెప్పారు? ధైర్యంగా ఉండమన్నారుకదా! అమ్మాయిగారిని బెంబేలు పెట్టకండి” అంటూ సాంత్వన పరిచే మాటలు పలికాడు.
నీహారిక వచ్చింది అనగానే ఊరు ఊరంతా వారి ఇంటి ముందు గుమిగూడారు తను ఇన్నాళ్లు ఏమైందని ప్రశ్నించాలని అనుకున్నారు.
ఒకవేళ ఆమె ప్రశ్నిస్తే వాళ్లంతా ముందుగా అనుకున్నది కరణంగారు చెప్పినవి గుర్తుంచుకొని అలాగే చెప్పాలని అనుకున్నారు.
కానీ..
ప్రశ్నించే వారెవరు? ఎవరి ప్రశ్నలు వాళ్ళ మనసులోనే ఉన్నాయి. ప్రశ్నిస్తే కదా జవాబులు వచ్చేవి.
చూస్తుండగానే మధ్యాహ్నం అయింది.
రాము అందర్నీ మెల్లిగా బ్రతిమలాడి మర్నాడు రమ్మని పంపించేసాడు.
ఇంతలో దగ్గర బంధువు ఒకామె వంట చేసి తీసుకొచ్చింది. తల్లి కూతుళ్ళకు తినిపించింది.
అధ్యాయం 6
నీహారిక మెల్లగా లేచి అటూ ఇటూ తిరుగుతోంది.
తల్లికి తన కర్తవ్యం గుర్తుకొచ్చింది.
“నీహా! నీకు గుర్తుందా! నువ్వు చిన్నప్పుడు అలిగితే అటక ఎక్కి కూర్చునే దానివి. ఎవ్వరికీ కనపడకుండా ఆవకాయ జాడీలు వెనకాతల కూర్చునేదానివి. మేమంతా వెతుక్కుని వెతుక్కుని కంగారు పడుతూ ఉంటే దిగేదానివి కాదు. నాన్నగారు మాత్రం నట్టింట్లోకి వచ్చి ‘మా బంగారు తల్లి ఏది? ఏం కావాలంటే అవి ఇస్తాను కదా! నా దగ్గరకు రావాలి కదా! నా బంగారు కనపడదేంటి? ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. అని తనకు తెలుసు కదా!’ అని తనలో తను అనుకుంటూ ఉంటే అటక మీద ముందుకు వచ్చి కిలకిల నవ్వుతూ నీ మువ్వల పట్టీలు చప్పుడు చేస్తూ నాన్న మీదకి ఉరికేదానివి గుర్తుందా? ఇప్పుడు నాన్న కూడా అలాగే అటక మీద దాక్కున్నారు. ఆవకాయ జాడీల వెనకాతల చిన్నపెట్లో కూర్చున్నారు.” అని తల్లి చెబుతూ ఉంటే తెల్లబోతూ చూసింది నీహారిక.
“వెళ్ళు. చూసి తెచ్చుకో.”
తను అటక ఎక్కడమా? ఎలా? ఎక్కగలదా?
అనుకుంటూ ఉండగానే ఇంతలో రాము నిచ్చెన పట్టుకుని వచ్చాడు.
అలవాటయినట్లుగా గబగబా నిచ్చెన మెట్లన్నీ ఎక్కేసి నాన్నగారు ముఖ్యమైన కాయితాలను పెట్టే ఆ చిన్న ట్రంకు పెట్టె దగ్గరకు వెళ్ళింది.
పెట్టె మూత తీస్తూ ఉండగా అనుకోకుండా ఆమె చూపు చేతి వాచీ మీద పడింది సమయం ఆరు గంటలు.
ఒక్క క్షణం షాక్ కొట్టినట్లు అయింది ఆమెకు. సరిగ్గా 24 గంటలు నిన్న సాయంత్రం ఈ సమయానికి తాను..
ఒక్కసారిగా కళ్ళు తిరిగి అక్కడే పడిపోయింది.
కాలం ఎంత విచిత్రమైనది!
కాలమనే గడియారాన్ని అరచేతిలో పట్టుకుని లెక్కిస్తే
60 సెకన్లు ఒక నిమిషం; 60 నిమిషాలు ఒక గంట;
12 గంటలు ఒక పగలు; 12 గంటలు ఒక రాత్రి;
ఒక రాత్రి, ఒక పగలూ కలిపి ఒక దినము!
ఇదే కాల చక్రము!
ముందుకే దాని పయనం! గడచిన ఏ సెకనూ తిరిగి రాదు.
అందుకే పెద్దలంటారు.
‘వర్తమానంలో జీవించు! ఈ క్షణమే నీది!’
కాలం ఒక సాగరం! అలలు రా రమ్మంటాయి! ఈత నేర్చుకునే వెళ్లాలి మునిగి పోయావో మరి తేలవు. ప్రతి అలా నీకు ఒక పాఠం నేర్పుతుంది. పడి లేవడం సహజమని పడినా తిరిగి లెమ్మని!
కాలం ఒక మహా యజ్ఞం! ప్రతి క్షణము ఒక సమిధ! మంత్ర పూరితంగా దానిని వేయి!
అరిషడ్వర్గాలు చుట్టుముట్టి నిన్ను ఏమరుస్తాయి. అనవరతం జాగరూకుడవై మెలగు!
కాలాన్ని గుప్పెట్లో పెట్టుకోవడం జరగని పని అని పలికారెందరో!
కాలానికి ఎదురీది విజేతగా నిలిచిన వారు కాలాతీత వ్యక్తులు!
కాలం ఒక మహా సర్పం! అనుక్షణం భయపెడుతుంది.
గురువుగా పాఠం నేర్పుతుంది. త్రికాలాల పట్ల అవగాహనతో కాలాన్ని సద్వినియోగం చేసుకోమని, గతించిన కాలాన్ని తేలేమని రేపటి గురించి ఆలోచన వృథా! అని ఈరోజుని సద్వినియోగం చేసుకోమని!
కాలమంటే క్యాలెండర్లో కాగితాలు చింపడం, పంచాంగంలో క్షణాలు లెక్కించడం కాదు.
కాలం చెల్లిన సూత్రాలను వదిలి వేయి!
సానుకూల దృక్పథంతో ముందడుగు వేయాలి!
కాల మహిమ తెలుసుకో!
కింద నుంచి చూస్తున్న తల్లి అటక మీద నుంచి ఏ చప్పుడూ వినబడక,
“నీహా! ఏమైందమ్మా!” అంటూ జవాబు రాకపోవడం చూసి గబగబా రాముని అటకమీదకు పంపించింది. అతడు గ్లాసుతో నీళ్లు అందుకుని ఆమె మొహం మీద చిలకరించాడు.
“అమ్మాయిగారూ! అమ్మాయిగారూ! లేవండి. ఏమైంది?” అంటూ లేపి, పెట్టె మూత తీసి ఒక కవరు తీసి ఆమెకు ఇచ్చాడు.
“జాగ్రత్తగా దిగండి అమ్మాయిగారూ! పడిపోతారు. అమ్మగారూ! కిందనుంచి మీరు పట్టుకోండి.” అంటూ ఇద్దరూ కలిపి జాగ్రత్తగా దించారు.
***
అమ్మానాన్న గదిలోకి వెళ్లి నాన్న కుర్చీలో కూర్చుని, లైట్ వేసుకొని, కవర్ తీసి చదవడం మొదలుపెట్టింది నీహారిక.
“నా బంగారు తల్లీ! నీహారికా!
నీ తండ్రిగా చెప్పుకునే అర్హత నాకు లేదురా! అల్లారుముద్దుగా అలనాటి అవనిజలాగా నిన్ను పెంచి, అంతే అపురూపంగా చూసుకుంటాడని ఆశతో వేణుకి నిన్ను ఇచ్చి పెళ్లి చేశాను.
నీకు నీ తండ్రి మంచి రైతుగా, ఊరందరి బాగుకోరే మంచి కరణంగా, బంధుమిత్రులను ఆదరించే మంచి బాంధవుడిగా తెలుసు.
కానీ నా పేరు మీద ఉన్న ఐదు ఎకరాల పొలం నీకు ఆస్తిని అందించాలని అవసరానికి పైకం అందించి, నా పొలం చుట్టుపక్కల ఉన్న పొలాలు కొద్దికొద్దిగా కలుపుకుంటూ, నీ పెళ్లి నాటికి 50 ఎకరాలు చేసేసాను. బయటి వాళ్లయితే ఆస్తి తగాదాలు వస్తాయేమో అనే స్వార్థం నామీద పనిచేసి, నా మేనల్లుడినే అల్లుడిగా చేసుకునే స్వార్థం పెంచింది.
ఎదురుగుండా కనిపిస్తున్న జాతకాలలో కలబడుతున్న గ్రహాలు నా బంగారు తల్లిని ఏమీ చేయవు అనుకున్నాను. నా మేనల్లుడి మృత్యుగండం ఎదురుగుండా కనిపిస్తుంటే, బంగారు కృష్ణవిగ్రహం దానమిస్తే పరిహారం కావచ్చును. మీ భార్యాభర్తలను కలవకుండా ఉంచితే దోషం పరిహారం అవుతుంది. వేణుకి అరటిచెట్టుతో పెళ్లిచేసి, ఆ చెట్టుని మొదలంటా నరికేస్తే తిరుగేలేదు. అని అందరికీ చెప్పే జాతకంలోని దోషాల పరిహారం నా గృహంలో మాత్రం ఎందుకు పనిచేయదు?? అని మూర్ఖంగా ఆలోచించాను తప్ప ఆ పరిహారాలు ఏవీ పనిచేయకపోతే అని ఒక్క సెకను నా ఆలోచన మారినా నా బంగారు తల్లికి ఈ దురవస్థ తప్పి ఉండేది.
విశాఖపట్నంలో శిక్షణ పొందుతున్న నిన్ను చూడడానికి అమ్మని పంపిస్తూ నీకు కావలసినవన్ని పాలేరు రాము ద్వారా పెద్దపెద్ద మూటలు కట్టి పంపించాను. నీకు గుర్తుండే ఉంటుంది.
అమ్మ వచ్చిందని ఎంతో ఆనందపడ్డావు. ఇవాళ కాలేజీకి వెళ్లను అంటూ అమ్మతోనే గడిపావు. నీకు కావలసిన బట్టలూ అవీ కొనడానికి బజారులన్నీ తిరిగి నీకు కావలసిన వస్తువులన్నీ కొనుకున్నావు.
అలాగే నేను మీ అత్త వాళ్ళింటికి పాలేరు సత్యంని తీసుకుని వెళ్లాను. వేణు కాకినాడ నుంచి ముందు రోజే వచ్చాడు.
“వేణూ! ఈ పదివేలతో నీకు కావలసినవన్నీ కొనుక్కోరా!” అంటూ వాడి చేతిలో పెట్టాను.
“ఎందుకు మామయ్యా! ఇలా నాకు విడిగా ఇవ్వకండి. ఎంతసేపు?? ఆరు నెలలలో మేమిద్దరం ఒకే చోట ఉంటాం. ఇంక ఎన్నటికీ విడిపోము.” అంటూ తిరిగి నా చేతిలోనే పెట్టేసాడు.
నాకెందుకో వాడి మాటల్లో ఏదో అపశ్రుతి ధ్వనించింది.
బంగారం లాంటి కుర్రాడు. ఈ జాతకాల మాయలో పడి ఇద్దరినీ వేరు చేసిన పాపం నాకు తగులుతుందా??
నా ఆలోచనలకు అడ్డుకట్టవేస్తూ
“అన్నయ్యా! వదిన ఎలాగూ నా కోడలు దగ్గరికి వెళ్ళింది కదా! నువ్వూ, మీ మేనల్లుడు ఈ రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోండి.” అంది మీ అత్తయ్య.
‘అలాగే!’ అన్నాను.
సాయంత్రం నాలుగు గంటలకు వేణు నలతగా ఉందని పడుకున్నాడు. కొంచెం జ్వరం తగిలింది. దిష్టి తగిలింది అనుకుని మా చెల్లి ఉప్పు మిరపకాయలు దిష్టి తీసింది. దగ్గరలోనే ఉన్న హోమియో డాక్టర్ని పిలిపించారు. ఏదో అరకుమందు ఇచ్చాడు.
రాత్రికి జ్వరం ఎక్కువైంది. 103.. 104.. దాటుతోంది. మెత్తని తువ్వాలు నీళ్లలో పిడిచి కాళ్ళూ, చేతులూ రాస్తూనే ఉన్నారు. పెనం మీద వడ్లగింజలు ఎలా పేలాల్లాగ పేలుతాయో అలాగా ఒళ్ళు మరిగిపోతోంది. వాడి నుదిటి మీద చేయి వేసి కూర్చున్నాను పక్కనే. జ్వరతీవ్రతలో ఏదో మాట్లాడుతున్నాడు ఏమీ అర్థం కావడం లేదు.
వాడికి మృత్యుగండం ఉందని జాతకంలో ఉన్నది నిజమైపోతుందా! ఎంత పని చేసాను? అసలు ఇప్పుడు నేనెందుకు వచ్చాను?
భగవంతుడా! నువ్వున్నావా? ఉంటే నన్ను తీసుకెళిపో! ఆ బంగారు తండ్రిని రక్షించు. మనసులోనే ఎన్నెన్నో మొక్కులు ఆ కనబడని దేవుడికి.
మా చెల్లి బావ పరిస్థితి అయితే చెప్పనేలేము.
తెల్లవారుజామున వేణు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ ఇంట సూర్యోదయం మరి చూడలేదు. కమ్ముకున్న చీకట్లు తొలగనేలేదు.
నా బంగారుతల్లి జీవితాన్ని నిప్పుల్లో తోసిన నా పాపానికి నిష్కృతి లేదు. ఒంటిమీద తెలివిలేని స్థితిలో నా చెల్లి, బావ ఉండగా పట్టుకెళ్ళిన పదివేలు వేణు అంతిమయాత్రకు ఖర్చు పెట్టాను.
తల్లీ! నువ్వు నన్ను క్షమించలేవు. ఇది వింటే నువ్వెలా తట్టుకోగలవో తెలియడం లేదు. పాలేరు సత్యంని విశాఖపట్నంలో ఉన్న మీకు కబురు చెప్పమని పంపించాను. వాడు ఏమి చెప్పాడో తెలీదు.
వింటూనే నువ్వు కొయ్యలా బిగుసుకుని పడిపోయావట. ఎంత నీళ్ళు చల్లినా ఏమి చేసినా తెలివి రాలేదట. వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రిలో చేర్చారట. వాళ్ళు సెలైన్లు ఎక్కించి, ఇంజక్షన్లు చేసి, గంట గంటకు చూస్తూ ‘ఆమె షాక్ లో ఉంది. తెలివి వస్తే గాని ఏమీ చెప్పలేము’ అన్నారట. రాత్రంతా అమ్మ బల్ల మీదే కునికిపాట్లు పడుతూ కూర్చుందట.
విధి లీలలు ఎంత విచిత్రమో చూడు!
తెల్లవారుజామున అమ్మకి మగత నిద్ర పట్టేసిందట.
తెల్లవారి లేచి చూస్తే నువ్వు పక్క మీద లేవు.
నర్సుని అడిగితే ‘రాత్రి పన్నెండు గంటలకు సెలైన్ అయిపోగానే ఆపేసి, చేతికి నీడిల్ ఉంచి బ్యాండేజ్ వేసిందట. అంతకంటే తనకేమీ తెలియదు.’ అందిట.
అమ్మ శోకానికి అంతే లేదు. హాస్పిటల్లో, పోలీస్ స్టేషన్లో అన్నిచోట్ల రాము సాయంతో వెళ్లి, కంప్లైంట్ ఇచ్చి, చీకటి పడే వేళకు ఇల్లు చేరుకుంది.
నేను కూడా నా అల్లుడి అంతిమ కార్యక్రమాలు పూర్తిచేసి రాత్రికి ఇల్లు చేరాను.
ఆ చీకటిలోనే ఇద్దరము ఏడ్చుకుంటూ, ఒకరినొకరు ఓదార్చుకుంటూ. ఊరి జనం అంతా మన ఇంటి ముందు తెల్లవార్లూ కాపలాకాసేరట. ఇంక నాకు ఎప్పటికీ తెల్లవారదు.
ఈ చీకటే నా జీవితం. చీకటితోనే నా సహవాసం.
వీధి మొహం చూడడం మానేశాను. పొలంలో అడుగు పెట్టనేలేదు. పెరట్లో చింతచెట్టు దగ్గర నులక మంచం వేసుకొని పడుకుండేవాడిని.
పెళ్లయిన కొత్తలో గట్టుమీద మీరిద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్న దృశ్యమే నాకు కళ్ళల్లో నిత్యము.
అక్కడే కాలం ఆగిపోతే ఎంత బాగుంటుంది.
రాత్రి అయితే మీ అమ్మ బలవంతం మీద లోపలకు వచ్చి నట్టింట్లో నా నులక మంచం వేసుకునేవాడిని. నువ్వు నాతో దోబూచులాడుతూ అటక మీద దాక్కోవడం, నేను వెతుక్కుంటూ ఉంటే నీ పాంజేబులు చప్పుడు చేసుకుంటూ ముందుకు వచ్చి కిలకిలా నవ్వుతూ నిచ్చెన అక్కర్లేకుండా నా మూపుపై నుండి దిగడం ఇవే ఈ జ్ఞాపకాలే నాకు శాశ్వతం.
ఇంక నాకు కూడా బ్రతకాలని లేదురా! అందుకే జరిగినవన్నీ నీకు తెలియవు.
నువ్వు ఎక్కడ ఉన్నా ఎప్పటికైనా ఇంటికి తిరిగి వస్తావని నాకు తెలుసు ఇవన్నీ చెప్పి నా తప్పు ఒప్పుకోవాలి. నువ్వు నన్ను క్షమించలేవని తెలుసు.”
నీహారిక ఉత్తరం చదువుతూ చదువుతూ పక్కన పెట్టింది.
ఇదేమి జీవితం? తనది అసలు ఇలా ఎవరికైనా జరుగుతుందా?
***
ఆరోజు అమ్మ తనకోసం అన్ని పట్టుకుని వచ్చింది.
“కొత్త పెళ్లికూతురువి కావలసినవి కొనుక్కో. ఈ ఆరునెలలే! తర్వాత నువ్వు అత్తవారింటికి వెళ్తే అవదు” అంటే కావలసినవన్నీ కొన్నది.
బంగారం షాప్ పేరు చూపించిన తనను చూసి,
“మొన్ననే పెళ్లికి అన్నీ కొన్నాం కదా! మళ్లీ ఏంటి కావాలి?” అడుగుతుంటే తాను మూతి ముద్దుగా ముడిచింది.
“సరే! సరే! అలాగే! అంటూ తీసుకెళ్ళింది అమ్మ. రెండు ఉంగరాలు ఒకేలాంటివి తీసుకున్నది తను. ఒకటి ‘వి’ అనే అక్షరం వేణు కోసం ఒకటి ‘ఎన్’ అని తన పేరులోని మొదటి అక్షరంతో ఇంకోటి. రెండు ఉంగరాలు ఎంత అందంగా ఉన్నాయో. తన ముచ్చటను కాదనలేక అమ్మ రెండు ఉంగరాలు కొన్నది. ఇంటికి వచ్చారు.
అమ్మ పక్కన నిశ్చింతగా కబుర్లు చెబుతూ నిద్రపోయింది. ఎంత సుఖమైన నిద్ర! అది అమ్మ ఒడి మహత్యం. అనుకుంటూ బాగా తెల్లవారే వరకు తను లేవనే లేదు.
“అమ్మగారూ! అమ్మగారూ! అంటూ పాలేరు సత్యం పిలుపు వినిపించింది. ఏమైంది? అనుకుంటూ నిల్చుండబోతుండగా,
“ఏమిట్రా సత్యం! అంత గాబరా?” అంటోంది తల్లి.
“అమ్మగారూ! వేణు బాబుగారింక నేరండి” అంటూ ఉండగానే అడుగు ముందుకు వేయబోయింది.
కాలు మెలిక పడి నిలువునా పడిపోయింది. తన తల గుమ్మానికి కొట్టుకున్నది. తర్వాత ఏం జరిగిందో గుర్తు లేదు. తను కళ్ళు తెరిచింది. చీకటిగా ఉన్న ఆ ప్రదేశం తనకు పరిచయం లేదు. పక్కనే ఉన్న అమ్మని కూడా పోల్చుకోలేక అలా నడుచుకుంటూ వెళ్లిపోయింది.
దూరాన సముద్ర కెరటాలు ఘోష! వేణు అక్కడి నుండే పిలుస్తున్నాడు. “బావా! ఉండు వస్తున్నా..” అంటూ పరిగెత్తబోయి బోర్లా పడింది. కీచుమని ఏదో శబ్దం.
(సశేషం)
శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి కథ రచయిత్రి. చక్కని కవయిత్రి. విజయనగరం గురించి పరిశోధించి ‘విజయనగర వైభవానికి దిక్సూచిట అనే 1100 పేజీల పుస్తకం వ్రాశారు. దేశవ్యాప్తంగా గల 116 మంది కవులతో ‘ఆది నుండి అనంతం దాకా…’ అనే వచన కవితల సంకలనం వెలువరించారు.