Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవామృతం-5

[ప్రముఖ రచయిత్రి చివుకుల శ్రీలక్ష్మి గారు రచించిన ‘జీవామృతం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[తన భర్త చనిపోయాడన్న వార్త విని రోడ్డు మీదకు పరుగెత్తుకు వచ్చిన నీహారిక కారుని గుద్దు స్పృహ తప్పిపోతుంది. వసుంధరాదేవి అనే ప్రవేటు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ వార్డెన్ నీహారికని కాపాడి తన సంరక్షణలో ఉంచుతుంది. వైద్యం చేయిస్తుంది. గతం గుర్తుకు వచ్చేలా, డాక్టర్ శశాంక్ సాయంతో ప్రయత్నాలు చేస్తుంది. హస్టల్‍లో చందన పేరుతో పిలుస్తుంటారు అందరూ. చందన ప్రవర్తనని రోజూ గమనించడానికి తన అసిస్టెంట్ ప్రణవ్‌ని పంపిస్తాడాయన. మెల్లిగా ప్రణవ్‍తో చనువు ఏర్పడుతుంది. ఆమెకు దగ్గరై ఆమె వివరాలు తెలుసుకోవాలని ప్రణవ్‌ని ఆదేశిస్తారు డాక్టర్. చందనలో తాను గమనిస్తున్నవన్నీ వసుంధరాదేవికి చెబుతుంటాడు ప్రణవ్. చందనకి సంగీతం నేర్పించమన్న శశాంక్ సలహాపై, ఒక సంగీతం టీచరుని ఏర్పాటు చేస్తుంది వసుంధరాదేవి. తొందరగా పాఠాలు నేర్చుకుని చక్కగా పాడుతుంటుంది చందన. కొన్ని సంవత్సరాలుగా కలిసి తిరిగే వేళలలో సామీప్యం సాన్నిహిత్యాన్ని పెంచిడంతో, అనుకోకుండానే ప్రణవ్, చందన ఒకటవుతారు. దాని గురించి తప్పొప్పులు తెలుసుకునే స్థితిలో చందన లేకపోయినా ప్రణవ్‌కి అర్థమవుతుంది. ఎలాగొలా ఆమెను హాస్టల్ నుంచి బయటకు రప్పించి, తాను తప్పుకోవాలని ప్లాన్ చేస్తాడు. అనుకున్నట్టుగానే పథకం అమలు చేస్తాడు. వైజాగ్‍లో చందన రైలెక్కాలా చేసి, తాను ఎక్కకుండా తప్పించుకుని వెళ్ళిపోతాడు. అనకాపల్లిలో దిగిన చందనకి గతం గుర్తుకురావడం,  తన ఊరికి బయల్దేరి రావడం జరుగుతుంది. ఇంటికొచ్చాకా, తండ్రి ఉత్తరం చదువుకుని బాధపడుతుంది నీహారిక. రెండు జీవితాలను చవిచూసిన, అనుభవించిన ఆమెలో అంతర్మథనం చెలరేగుతుంది. – ఇక చదవండి.]

అధ్యాయం 9

నీహారిక మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది. తండ్రిని, భర్తను కోల్పోయిన తాను ఒంటరి. 16 సంవత్సరాలు ప్రపంచానికీ, తనవారికీ దూరంగా బ్రతికిన నిర్భాగ్యురాలు. 24 గంటల్లో మారిపోయిన తన జీవితం 16 సంవత్సరాల తర్వాత మళ్లీ 24 గంటల్లోనే మారిపోయింది.

కష్టాల కడలిలో ఈదుతూ ప్రాణం ఉందో లేదో అన్నట్లు మంచాన పడిన తల్లి, ఊరందరి దృష్టిలో తాను భర్తను కోల్పోయిన వితంతువు. ఏది గమ్యం? ఎటు నడవాలి? ఆలోచిస్తూనే ఉంది.

రాము సాయంతో నాన్నగారి గదిని శుభ్రంగా తయారు చేసింది. ఆయన డైరీలు, చదువుకున్న పుస్తకాలు అన్నీ అద్దాల బీరువాలలో అమర్చింది. టేబులు, కుర్చీ వేసింది ఒకవైపు నాన్న ఫోటో ఒకవైపు వేణు ఫోటో వీరిద్దరే తనకు మిగిలిన జీవితం.

నాన్నగారు ఎప్పుడూ ఎంతో ఇష్టంగా వార్తలను, పాటలను వినే రేడియోను తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది. తను రాసుకుందికి పెన్ను, కాగితాలు పక్కన పెట్టుకుంది.

రేడియో ఆన్ చేసింది. సినిమా పాటలు వస్తున్నాయి.

బంగరు నావ బ్రతుకు బంగారు నావ
దాన్ని నడిపించు నలుగురికి మేలైన త్రోవ
అనురాగం వెన్నెలలు అంతరించినా
ఆశలన్నీ త్రాచులై కాటు వేసినా
జీవితము జీవించి- ప్రేమించుటకే!
నావ నడిపించు నలుగురికి మేలైన త్రోవ!
కనులున్నది కన్నీటి కొలనులగుటకా?
వలపున్నది విఫలమై విలపించుటకా?
దొరకబోని వరము బ్రతుకు- మరణించుటకా!
నావ నడిపించు నలుగురికి మేలైన త్రోవ!

మనసు లోతుల గురించి ఇంతకన్నా ఎవరు బాగా చెప్పగలరు (ఆత్రేయ)

తండ్రి రాసిన ఉత్తరం మళ్ళీ విప్పింది.

ఆయన చివరి కోరికగా తనను ఎలా చూడాలనుకుంటున్నాడో రాశాడు. అక్షరాల వెంట చూపులు పరిగెత్తాయి.

“బంగారుతల్లీ! నన్ను క్షమించమని మరొకసారి అడుగుతున్నాను. ఎందుకంటే నిన్ను మరొక కోరిక కోరుతున్నాను. నీకు పేరుకే వివాహం అయింది గానీ మిగిలిన ఏ తంతులు జరగలేదు కనుక నీకు వైధవ్యము అనేది అంటదు. అందువలన నీవు ఇదివరకులాగే కళకళలాడుతూ మిగిలిన జీవితం గడపాలని కోరుకుంటున్నాను.

నా బంగారుతల్లి నన్ను క్షమిస్తుంది. నువ్వు నన్ను క్షమించావని గుర్తు ఏమిటో తెలుసా?

పచ్చని మన పంటపొలాల మధ్య ధాన్యలక్ష్మిలా, వరికంకులు భారానికి వంగిన ఆ పంట చేను మధ్యలో నువ్వు తిరుగుతుంటే చూడాలని ఉంది. నువ్వు ‘రైతుబిడ్డ’ అనిపించుకోవాలి. ఎక్కడున్నా నా దీవెనలు నీకే! అమ్మ అమాయకురాలు అమ్మను జాగ్రత్తగా చూసుకో. వేణు అమ్మానాన్నలను కూడా నీ తల్లిదండ్రులు గానే భావించుకో”

ఉత్తరం చదవడం పూర్తిచేసి ఆలోచిస్తూ మడత పెట్టింది.

“అమ్మడూ! కొద్దిగా అన్నం తినమ్మా!” తల్లి మళ్ళీ అన్నం కలిపి తీసుకొచ్చి తినిపించసాగింది.

ఈసారి నీహారికకు దుఃఖం రాలేదు. అందుకే తను కూడా ఒక ముద్ద తీసి “తినమ్మా!” అంటూ తల్లి నోట్లో పెట్టింది.

‘అమ్మా!’ అంటూ కూతురు ఇదివరకటి ఆప్యాయతను చూపించేసరికి తల్లి మనసు కొంత ఊరట చెందింది.

రాత్రి తల్లి పక్కనే పడుకుంది. భయం లేదన్నట్లు తల్లి ఆప్యాయంగా వీపు మీద నిమురుతూ ఉంటే నిద్రపట్టేసింది.

తెలతెల వారుతుంటే మెలకువ వచ్చింది.

చిత్రకారుడు గీసిన చిత్రంలాగా పల్లెలోని ప్రకృతి అందంగా ఉంది. పిట్టల అరుపులు విని ఆకాశం వైపు చూసింది. ఎవరో గీత గీసినట్లుగా ‘వి’ ఆకారంలో ఆకాశంలో బారులుగా ఎగురుతున్న పిట్టలు.

సూర్యోదయానికి ముందే అతడు పంపిన వెలుగులు విస్తరించుకుని ఊరంతా కళకళలాడుతోంది. ‘యద్భావం తద్భవతి’ అంటారు.

ఒకనాడు నాన్న ఏదైనా ఆలోచనకు ఒక రూపం రావడానికి చింత చెట్టు కింద నడిచేవాడు. తను కూడా అంతే! అనుకుంటూ లేచింది. వేపపుల్ల నోట్లో పెట్టుకుని నములుతూ చెట్టు కింద నడవ సాగింది.

తను విశాఖపట్టణంలో గడిపిన జీవితం తెలిసినవారు గానీ, ప్రశ్నించేవారు గానీ ఎవరూ లేరు. అలా మోసం చేసి ప్రణవ్ ఒక విధంగా మంచే చేశాడేమో? లేకపోతే.. తను అక్కడే మరెన్ని సంవత్సరాలు ఉండిపోవలసి వచ్చేదో కదా? అయినా అలాంటి దుర్మార్గులనూ, అవకాశవాదులనూ మరచిపోవడమే మంచిది.

అలాగని అందరినీ మాయ చేసి బ్రతుకుతావా? మనసు ప్రశ్నించింది.

ఇది మాయ కాదు. తనకు మానసిక, శారీరక ఆరోగ్యం బాగులేని పరిస్థితిలో జరిగిన వేటికీ తాను కర్త కాదు. ఇప్పుడు అవన్నీ అందరితో పంచుకోవడం వలన ఎవరికి ఆనందం?? తండ్రి కుటుంబానికి, వంశానికి మచ్చ! కానీ.. తనను అంతర్గతంగా వేధిస్తున్న ఈ తప్పులకు పరిహారం చెల్లించుకోవాలి. అందుకు ఏమి చేయాలి?

ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉంది నీహారిక.

తండ్రి చిన్నప్పుడు చదివిన భగవద్గీత శ్లోకం గుర్తుకొచ్చింది.

“సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణంవ్రజ
అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః” (18-66)

“సర్వధర్మములను విడిచిపెట్టి నన్నొక్కడిని శరణు వేడితే సమస్త పాపముల నుండి నిన్ను విముక్తుని చేస్తాను.” అన్న గీతావాక్యము అందరూ అనుసరించదగినది.

తను ఏం చేయాలా? అని ఆలోచిస్తూ నడుస్తూ ఉండగా ఆలోచనలు ఒకదానికొకటి పేర్చుకుంటూ ఒక కొలిక్కి వచ్చాయి. తుది ఫలితం మెరుపులాగా మెరియగానే నీహారిక మొహంలోకి కొత్త కాంతి వచ్చింది.

ఒక నిశ్చయానికి వచ్చిన తరువాత ఆమె మానసిక సంక్షోభం తొలగిపోయింది.

తను ఇప్పుడు బేల కాదు. తండ్రి కోరిక తీర్చాలి. అప్పుడే వేణూకి, నాన్నకి తాను నిజమైన వారసురాలు. అవును. అలాగే చేయాలి అనుకుంది.

మనసులో ఆలోచనలు స్థిరపడగానే మొహం తేటపడింది.

తొలి సూర్యకిరణాలు ఆమె మొహంపై పడి వింత కాంతులీనుతుంటే ఇంట్లోకి అడుగు పెట్టింది.

“నీహా! రామ్మా! కాఫీ తాగుదువు గాని” అంటూ తల్లి వంటింట్లోంచి పిలిచింది.

వంటింట్లో తల్లిదగ్గరగా పీట వేసుకుని కూర్చుని, కాఫీ గ్లాస్ అందుకొని, కాఫీ తాగుతూ తన మనసులోని మాటలన్నీ తల్లితో పంచుకుంది.

వింటున్న ఆమె మొహంలో విస్మయం.

ఎవరు? తన కూతురేనా? ఇంత పెద్దదైందా? ఎక్కడ నేర్చుకుంది ఈ విషయాలు. అనుకుంటూ, “అలాగేనమ్మా! తప్పకుండా అలాగే చేయి.” అంది చిరునవ్వుతో.

నీహారిక మరొకసారి తనలో తను ఆలోచించుకుంది.

నిజంగా తను ఇదంతా అనుసరించగలదా? ‘చెప్పడం సులభం ఆచరణ కష్టం’ అని పెద్దలు అంటారు కదా! మరొకసారి ఆమె మనస్సు తర్జనభర్జన పడింది.

ఆమె జీవితానికి ముందుదారి చూపడానికి భగవద్గీతలోని ఈ శ్లోకం ఉపయోగపడిందామెకు.

“వీతరాగభయక్రోధా మన్మయా మా ముపాశ్రితాః
బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః” (4-10)

రాగము, భయము, క్రోధము లేకుండా హృదయనైర్మల్యము కలిగి ఉంటే, భగవంతునిలో తన్మయత్వమును పొందగలిగితే, ఆ భగవంతుని సర్వకాల సర్వావస్థల యందు ఆశ్రయించి ఉండగలిగి, చేసే జ్ఞానతపస్సు అన్నిటికంటే శ్రేష్ఠమైనది. దీనికి మించినదేముంది తనకు?

నీహారిక మనసు ఇప్పుడు స్వచ్ఛమైన మంచు బిందువు లాగా ఉన్నది.

మధ్యాహ్నం రాము, సత్యం పాలేరులను పిలిచింది కుటుంబాలతో రమ్మని.

“రామూ! మన పొలం సరిహద్దులు నీకు తెలుసా? నాకు చూపించగలవా?” అడిగింది.

“అలాగేనమ్మా! తప్పకుండా!” అన్నాడు మనసులోని ఆశ్చర్యాన్ని బయటకు వ్యక్తం చేయకుండా.

“సత్యం! మన ఊరిలో సెంటుభూమి కూడా లేని రైతులు ఎంతమంది ఉన్నారో చెప్పగలవా?” అడిగింది.

తమ కంటి ముందు తిరుగాడిన అమ్మాయిగారు ప్రశ్నలు అడుగుతూ ఉంటే సమాధానాలు తెలిసినా జవాబు చెప్పడానికి ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నారు.

“ఉంటారండి. సుమారుగా ఇరవై, ముప్పై మంది వరకు” అన్నాడు.

“వాళ్లందరూ నీకు బాగా తెలుసా?” అడిగింది.

“మన ఊరి వాళ్లే కదమ్మా తెలుసు” అన్నాడు.

“సరే! వాళ్ళందర్నీ రేపు ఉదయం ఒకసారి తీసుకు రాగలవా?”

సత్యం, రాముల కుటుంబాల వైపు, వారి పిల్లల వైపు చూస్తూ “ఈరోజు నుండి ఈ నిమిషం నుండి మనమంతా ఒక కుటుంబం. నా దగ్గర ఉన్న పొలం అంతా మన అందరిదీ. రేపటినుండి మనందరం కలిసి వ్యవసాయం చేస్తాం. పొలం లేని వారు కూడా ఉన్నారు కదా! వారిని కూడా మనలో కలుపుకుందాం. మనందరం కలిపి నూతన వ్యవసాయాన్ని చేసి ఫలసాయాన్ని అందరం సమానంగా అనుభవిద్దాం.

నాన్న ఈ ఊరికి, మీ అందరికీ నన్ను, మా అమ్మని అప్పచెప్పారు. కాబట్టి మా బాగోగులు మీవి. మీ బాగోగులు మావి. సరేనా! ఇందులో జాతి, కులం ప్రసక్తులు ఉండవు.”

రాము ధైర్యంగా ఒకటి అడగాలి అనుకున్నాడు. అయినా సంకోచించాడు.

అది చూసి నీహారిక “అడుగు రాము! ఫరవాలేదు.” అంది.

“అమ్మా! పొలం పనులు చేయడం మాలాంటి మోటువారికే కష్టంగా ఉంటుంది. మీరు ఇంత సున్నితంగా ఉంటూ చేయగలరా? మాకు చెప్పండి చాలు. మేము చేస్తాము. మీరు కష్టపడకుండా మిమ్మల్ని చూసుకోవాలి కదా మేము.” అన్నాడు నిజాయితీగా.

ఆ మాటలకు నీహారిక తల్లి కూడా “నిజమే!” అన్నది.

వింటున్న నీహారికకు నవ్వు వచ్చింది. పకపక నవ్వుతూ “మనందరం అన్నప్పుడు మీరు, నేను వేరు వేరు కాదు కదా! సంతోషంగా సామూహిక వ్యవసాయం చేద్దాము. రేపు మిగిలిన వారిని కూడా తీసుకు రండి. వెళ్ళి రండి.” అంది.

రాము, సత్యం విస్మయం నుండి తేరుకోకుండానే వారి కుటుంబాల వారు ఒక్కొక్కరు వచ్చి నీహారికకు, వాళ్ళ అమ్మకు పాద నమస్కారాలు చేసి వెళుతూ ఉంటే “ఒక్క నిమిషం ఆగండి” అంటూ లోపలకు వెళ్లి దేవుడి గదిలో నుండి కుంకుమ బొట్టు తెచ్చి అందరికీ చిరునవ్వుతో పెట్టింది.

మన అనుకుంటే తప్పులు ఏమి తోచవేమో! ఎంతో ఆనందంగా అందరూ తిరిగి ఆమెకు బొట్టుపెట్టి బయలుదేరారు.

తన భర్త నిత్యం చదివే భగవద్గీతలోని శ్లోకం

“అనన్యాశ్చిన్తయన్తో మాం యేజనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం” (9-22)

“ఇతర భావములు లేక ఎవరు నన్నే ధ్యానించుదురో వారి యోగక్షేమములను నేను వహిస్తాను.” అని చెప్పిన భగవానుని మాటల నమ్మిక వలన కదా! ఈ రోజు నా పెన్నిధి నాకు దొరకడమే కాదు. నా చీకటి జీవితానికి వెలుతురు చుక్కానిలాగా నా కూతురు తిరిగివచ్చింది.” అని అనుకున్నది ఆ తల్లి.

(ముగింపు వచ్చే వారం)

Exit mobile version