“శివా, క్యారేజీ రెడీ అయ్యిందా?”
“ఆ, పట్టుకొస్తున్నానండి” అని జవాబిచ్చి, క్యారేజీని బ్యాగులో పెట్టి భర్త కిచ్చింది శివజ్యోతి.
అప్పటికే పిల్లలు ఇద్దరూ స్కూల్‌కి వెళ్ళిపోయారు. మావగారికి, అత్తగారికి భోజనాలు పెట్టి తన క్యారేజీ సర్దుకుంది.
పది నిమిషాలు గడిచేసరికి పెద్ద వాళ్ళిద్దరి భోజనాలు పూర్తయ్యాయి. వాళ్ళ ఎంగిలి కంచాలు తీసి సింక్‌లో వేసి, డైనింగ్ టేబుల్ శుభ్రం చేసి, క్యారేజీ తీసుకుని మావగారికి, అత్త గారికి ‘వెళ్ళొస్తా’నని చెప్పి
బయటకు వచ్చింది శివజ్యోతి. కొద్దిసేపటికి అటుగా వస్తున్న షేర్ ఆటో ఎక్కి మెయిన్ బజారుకి వచ్చింది. భవాని టైలరింగ్ మార్టు దగ్గర ఆటో దిగి లోపలకు వెళ్ళింది.
అప్పటికే ఆమె సహాయకులు ఇద్దరూ మెషిన్ల మీద జాకెట్లు కుడుతున్నారు. వారిద్దరినీ నవ్వుతూ పలకరించి, తన బ్యాగ్ అలమరలో పెట్టి తను కూడా మెషిన్ మీద జాకెట్ కుట్టసాగింది.
శివజ్యోతి ఇంటి దగ్గరే బట్టలు కుట్టేది. స్నేహితురాలు వనజ సలహామీద మెయిన్ బజారులో చిన్న షాపు అద్దెకు తీసుకుని మహిళలకు కావాల్సిన బట్టలు కుట్టడం ప్రారంభించింది. మూడు నెలలకే కష్టమర్లు పెరగడంతో గిరిజ, రమణిలను సహాయకులుగా నియమించుకుంది. లేటెస్ట్ డిజైన్లతో జాకెట్లు కుట్టడమే కాకుండా సకాలంలో కష్టమర్లకు వాటిని అందించడంతో శివజ్యోతికి మార్కెట్లో గుడ్‌విల్ పెరిగింది. కష్టమర్లూ పెరిగారు. గిరిజ, రమణిలను స్వంత చెల్లెళ్ళలా భావించి వారితో అరమరికలు లేకుండా ఉంటుంది. అందుకే వారు ఇంట్లో కూడా చెప్పుకోలేని విషయాలు శివజ్యోతికి చెప్పుకుంటారు.
శివజ్యోతి భర్త శంకర్రావు శివపురంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలలో కామర్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. నెలకు ఎనిమిది వేలు జీతం. అందుకే శివజ్యోతి కూడా కష్టపడుతూ కుటుంబాన్ని ఆదుకుంటోంది. దసరా, సంక్రాంతి పండుగలలో ఆమె సంపాదన భర్త ఆదాయాన్ని మించి ఉంటుంది.
“పి. జి. చేసిన నాకన్నా, డిగ్రీ చదివిన నీ ఆదాయం బాగుంది శివా”అంటూ భర్త ఆమెను అప్పుడప్పుడు వేళాకోళం చేస్తాడు.
“మాది గాలివాటం ఆదాయం స్వామీ, ఒకనెల పదివేలు వస్తే మరుసటి నెల ఏడువేలే వస్తుంది. మీది నికర ఆదాయం.” అంటూ నవ్వుతుంది శివజ్యోతి.
శివజ్యోతికి ఇద్దరు పిల్లలు. అమ్మాయి ఆరవ తరగతి, అబ్బాయి ఐదవ తరగతి చదువుతున్నారు.
శంకర్రావు తండ్రి గురుమూర్తి మార్టేరులోని రైసుమిల్లులో అక్కౌంట్స్ రాసేవాడు. అతనికి శంకర్రావు ఒక్కడే కొడుకు. తన రెక్కల కష్టం మీద అతన్ని పి.జి. చదివించాడు. ఏ విధమైన కట్న కానుకలు ఆశించకుండా పండితవిల్లూరు లోని శివజ్యోతిని కోడలుగా తెచ్చుకున్నాడు.
గురుమూర్తి వృద్ధుడైపోవడంతో ఉద్యోగం చేయలేక ఇంటివద్దే ఉంటున్నాడు. గురుమూర్తి తండ్రి కట్టించి ఇచ్చిన డాబా ఇల్లే వారికున్న ఏకైక ఆస్తి. ప్రస్తుతం అందరూ అందులోనే ఉంటున్నారు.
శివజ్యోతికి అత్తా,మామలంటే చాలా గౌరవం. వారు తమకి భారమని ఏనాడూ అనుకోలేదు. అత్తగారికి వెన్నెముక సమస్య ఉంది. నడుముకి పెద్ద బెల్టు వేసుకుని ఉంటుంది. బరువు పనులు ఏమీ చేయలేదు. ఎక్కువ భాగం ఇంటిపని శివజ్యోతే చేసుకుంటుంది. రాత్రి పొద్దుపోయి ఇంటికి వచ్చినా అత్తగారి నడుముకి ఆయుర్వేద తైలం మర్దనా చేసి అప్పుడు నిద్రపోతుంది.
“పని చేసి చేసి ఇంటికి వస్తావు. ఇప్పుడు కూడా నిన్ను నేను కష్టపెడుతున్నాను.” అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకునేది అత్తగారు.
“అలా అనకండి అత్తయ్యా, మా అమ్మ ఉంటే నేను చెయ్యనా? మీరు నాకు అత్తే కాదు, అమ్మకూడా. అంటే అత్తమ్మ” అనేది శివజ్యోతి.
“నిన్ను మాటలలో గెలవడం కష్టం “అంటూ మురిపెంగా కోడలు బుగ్గలు నిమిరేది అత్తగారు.
***
కాలచక్రంలో నాలుగేళ్లు గిర్రున తిరిగాయి.
మహిళల వస్త్రధారణలో మార్పులు వచ్చాయి. చీరలకన్నా జాకెట్లకు చేసే వివిధ రకాల అలంకరణలకు డిమాండ్ పెరిగింది. డిజైన్ చేసిన జాకెట్లకు మూడు వందల నుండి ఆరు వందలవరకూ ఛార్జ్ చేస్తున్నారు. శివజ్యోతి కూడ ‘యు ట్యూబ్’ లోనూ, ‘నెట్’ లోనూ వస్తున్న కొత్త కొత్త డిజైన్లు అనుసరిస్తూ తన కష్టమర్లకు తగిన విధంగా తనను తాను ‘అప్‌డేట్’ చేసుకుంది. దాంతో ఆమె వ్యాపారం బాగా వృద్ధి చెందింది. చాలా ఖర్చు పెట్టి అత్తగారి నడుముకి ఆపరేషన్ చేయించింది శివజ్యోతి.
“ఎందుకమ్మా, మలిసంధ్యలో ఉన్న నాకు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నావు? పిల్లలు ఎదుగుతున్నారు. వాళ్ళ కోసం పొదుపు చెయ్యమ్మా” అంది బాధపడుతూ మహాలక్ష్మి.
“మీరు ఈ ఇంటి దేవత అత్తయ్య. మీరు ఆరోగ్యంగా కళకళ లాడుతూ తిరుగుతూ ఉంటేనే మాకు ఆనందం. మీ ఆశీస్సులతో పిల్లలిద్దరూ బాగా చదువుతున్నారు. వాళ్ళ గురించి నాకు బెంగలేదు.” అంది శివజ్యోతి స్థిరంగా.
“నువ్వు మా ఇంటి కోడలుగా రావడం మేం చేసుకున్న అదృష్టం” అంది నిండుమనసుతో మహాలక్ష్మి. ఆరునెలలు గడిచేసరికి మహాలక్ష్మి నడుముకి బెల్టు లేకుండా తిరుగుతోంది.
కాలగమనంలో మరో ఆరు నెలలు గడిచాయి.
ఒకరోజు గురుమూర్తికి గుండె నొప్పిగా ఉందంటే ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు శంకర్రావు. డాక్టర్ రాజు గురుమూర్తికి టెస్టులు చేసి రెండు రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాలన్నాడు. ఆ రెండు రోజులు అందరూ ఆందోళనగానే ఉన్నారు. మహాలక్ష్మి ఎన్నో దేవుళ్ళకు మొక్కుకుంది తన భర్తకి ఏం జరగకూడదని.
మూడవ రోజున డాక్టర్ రాజు శంకర్రావుని తన గదిలోకి పిలిచాడు.
“చూడండి శంకర్రావు గారూ, మీ నాన్నగారికి మొన్న వచ్చింది హార్ట్ స్ట్రోక్. వీలైనంత త్వరలో ఆయనకు బైపాస్ సర్జరీ చేయించండి.” అన్నాడు డాక్టర్ రాజు.
ఆరోజు సాయంత్రం గురుమూర్తిని ఇంటికి తీసుకు వచ్చారు. రాత్రి భార్యతో డాక్టరు రాజు చెప్పిన విషయం చెప్పాడు శంకర్రావు.
“ఆపరేషన్‌కి నాలుగైదు లక్షల వరకూ అవుతుందని అన్నారు. అంత డబ్బు ఎలా సమకూర్చు కోవడం? ” ఆందోళన వ్యక్తం చేసాడు శంకర్రావు.
“మీరేం కంగారు పడకండి. డబ్బు అదే సమకూరుతుంది” భర్తకి ధైర్యం చెప్పింది శివజ్యోతి.
మర్నాడు టైలరింగ్ మార్టు కెళ్ళిన శివజ్యోతి దిగులుగా ఉండటం గమనించారు గిరిజ, రమణి.
“ఏంటి మేడం డల్‌గా ఉన్నారు?” అడిగింది గిరిజ.
“మావయ్య గారికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఆపరేషన్ చెయ్యాలంటున్నారు.” విచారంగా అంది శివజ్యోతి. గిరిజ, రమణి నాలుగు ఓదార్పు మాటలు చెప్పారు.
శివజ్యోతి మెషిన్ మీద జాకెట్ కుడుతున్నా ఆమె మనసు మనసులో లేదు. ఉన్న డబ్బు అంతా అత్తగారి ఆపరేషన్‌కి ఖర్చు చేసేసింది. ప్రస్తుతం పదివేల కన్నా ఎక్కువ లేదు. ఇప్పుడు మావగారి ఆపరేషన్‌కి డబ్బులు ఎలా సంపాదించాలి? భర్త కైతే హామీ ఇచ్చింది గానీ, ఆ హామీని నిలబెట్టుకునే మార్గం కనిపించడం లేదు.
మధ్యాహ్నం భోజనం అయ్యాకా ఫోన్‌లో ఫార్వర్డ్ చేసిన మెసేజ్ కనిపించింది. ‘లేడీస్ డ్రెస్ డిజైనింగ్‌లో హైదరాబాద్‌లో ఆరు రోజుల శిక్షణా శిబిరం. కాశ్మీరి, మణిపురీ, రాజస్థానీ డ్రెస్ డిజైనింగ్‌లో ప్రత్యేక విభాగం కూడా కలదు.’
‘నిజమే, ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్లు తెలుసుకుంటేనే తన వ్యాపారం బాగుంటుంది. తప్పకుండా వెళ్ళాల’ని నిశ్చయించుకుంది శివజ్యోతి.
తర్వాత వేరే వాట్సప్ గ్రూపులో వచ్చిన మెసేజ్ కూడా ఆమెని ఆకర్షించింది. రెండు సార్లు చదివింది ఆ మెసేజ్‌ని. మర్నాడు భర్తతో చెప్పింది శివజ్యోతి, హైదరాబాద్ వెళ్ళాలని, డ్రెస్ డిజైనింగ్‌లో శిక్షణ తీసుకోవాలని.
“సరే, తొందరగా వచ్చేయ్. నాన్న ఆపరేషన్ గురించి మన ప్రయత్నాలు మొదలుపెట్టాలిగా” అన్నాడు శంకర్రావు.
శివజ్యోతి హైదరాబాద్ క్యాంప్ పదిరోజులు పట్టింది. పదకొండో రోజున శివపురం వచ్చింది.
“ఏమిటి, ఇన్ని రోజులు ఉండిపోయావు? నేను చాలా బెంగ పెట్టుకున్నాను.” దిగులుగా అన్నాడు శంకర్రావు.
“శిక్షణ అయ్యాకా నాలుగు రోజులుండి కొన్ని రెడీమేడ్ కంపెనీల నుంచి కొత్త డిజైన్‌లతో డ్రెస్సులు సప్లయి చేయడానికి భారీ ఆర్డర్‌లు తీసుకొచ్చానండి. ఇదిగో వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ ఐదు లక్షలు. దీనితో మావయ్య గారికి ఆపరేషన్ చేయించండి” అంది డబ్బు భర్త చేతిలో పెట్టి.
“అదేమిటి నువ్వు రావా ఆపరేషన్‌కి?” అడిగాడు శంకర్రావు.
“మావయ్య గారితో మీరూ, అత్తయ్య గారూ వెళ్ళండి. నేను ఇక్కడ ఉండి ఆ డ్రెస్సులు తయారుచేసే పనిలో ఉండాలిగా” అంది శివజ్యోతి.
“అవునవును. నువ్వా పనిలో ఉండు. వాళ్ళకి సకాలంలో డ్రెస్సులు ఇవ్వాలిగా” అన్నాడు శంకర్రావు.
మర్నాడే శంకర్రావు తండ్రినీ, తల్లినీ తీసుకుని విజయవాడ వచ్చాడు. గురుమూర్తికి బైపాస్ సర్జరీ సజావుగా జరిగింది. పదిహేను రోజులు గడిచాకా శివపురం తిరిగి వచ్చారు ముగ్గురూ.
శివజ్యోతి కొత్త డిజైన్‌లతో డ్రెస్సులు తయారు చేసే పనిలో బిజీగా ఉంది. శంకర్రావు కాలేజీలో డ్యూటీలో చేరాడు. మహాలక్ష్మి భర్తకి కావాల్సినవి తనే స్వయంగా చూసుకుంటోంది.
మూడు నెలల కాలం గడిచింది.
ఒక ఆదివారం ఉదయం శంకర్రావు ఇంటిముందు ఖరీదైన కారు ఆగింది. అందులోంచి నడి వయసులో ఉన్న భార్యా, భర్త దిగారు. లోపలకు వచ్చి ‘శివజ్యోతి గారున్నారా?’ అని అడిగారు ఆయన.
శంకర్రావు వాళ్ళని కూర్చోమని చెప్పి “శివా, నీ కోసం ఎవరో వచ్చారు. ఇలారా.” అని పిలిచాడు.
వంటగదిలోంచి హాలులోకి వచ్చిన శివజ్యోతిని “బాగున్నావా అమ్మా? ” అని పలకరించారు ఆయన.
బదులుగా చిరునవ్వు నవ్వింది శివజ్యోతి.
గురుమూర్తి కేసి చూశాడు ఆయన. ‘మా మావయ్య గారు’ అని పరిచయం చేసింది ఆమె.
“మీ కోడలు మా ఇంటి దీపం కొడిగట్టకుండా కాపాడిన దేవత. నా భార్యకి తన కిడ్నీ ఇచ్చి ఆమెకు పునర్జన్మ నిచ్చింది. నేను పదిలక్షలు ఇవ్వబోతే, నాకు ఐదు లక్షలు చాలండి. ఒక మంచిపనికి దీన్ని ఉపయోగించాలని చెప్పింది. తర్వాత ఆసుపత్రి సిబ్బంది ద్వారా తెలిసింది, ఆమె కుటుంబంలో ఎవరికో ఆపరేషన్ కోసమని ఆ డబ్బు తీసుకుందని. అమ్మా, జ్యోతి, నువ్వు నిజంగా జ్యోతివే. నీ త్యాగంతో రెండు కుటుంబాలలో ఆనందాన్ని నింపావు. కలకాలం సుఖంగా ఉండు తల్లీ” అని దీవించి, తాను తెచ్చిన పళ్ళబుట్టను శివజ్యోతికి ఇచ్చారు ఆయన.
పెద్దాయన భార్య శివజ్యోతి దగ్గరకొచ్చి ఆమె భుజాలచుట్టూ చేతులు వేసి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర కదలాడింది.
పెద్దాయన, భార్యా ఐదు నిమిషాలుండి కారు ఎక్కి వెళ్ళి పోయారు.
వాళ్ళు వెళ్ళేవరకూ గురుమూర్తి, మహాలక్ష్మి, శంకర్రావు ఒకవిధమైన ట్రాన్స్‌లో ఉండిపోయారు. తాము ఎవ్వరూ ఊహించని విషయం, వాస్తవమై కళ్ళ ముందు సాక్షాత్కరించడంతో వారు ఆశ్చర్యంతో శివజ్యోతి వైపు చూస్తున్నారు.
ముందుగా గురుమూర్తే తేరుకుని “అమ్మా శివా, ఇలా రామ్మా” అని పిలిచాడు. సోఫాలో తన పక్కనే కూర్చోమని సైగ చేసాడు.
శివజ్యోతి వైపు తిరిగి “అస్తమించబోయే నా జీవితానికి సువర్ణ సూర్యోదయాన్ని అనుగ్రహించావు. నీ ఋణం ఎలా తీర్చుకోను తల్లీ?” అన్నాడు ఉద్వగ్నింగా
“అయ్యయ్యో, మీరలా అనకండి మావయ్య గారూ. కోడలిగా అది నా బాధ్యత అనుకున్నాను. అంతే. మీరు ఆందోళన పడకండి.” అంది శివజ్యోతి వినయంగా.
మహాలక్ష్మి శివజ్యోతి రెండు చేతులూ తీసుకుని కళ్ళకద్దుకుంది. “నా మాంగళ్యాన్ని కాపాడిన పుణ్యాత్మురాలివి.” అంది కన్నీళ్ళతో.
వెంటనే శివజ్యోతి అత్తగారి పాదాలకు నమస్కరించి “మీరు నన్ను ఆశీర్వదించాలి. పొగడ కూడదు.” అంది నవ్వుతూ. శంకర్రావు భార్యకేసి తిరిగి “నువ్వు నా అర్ధాంగివే కాదు, మా అందరి జీవితాల్లో వెలుగు నింపిన జీవనజ్యోతివి శివా!” అన్నాడు మెరుస్తున్న కళ్ళతో.