[డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు గారు రచించిన ‘జీవన సమీక్ష’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
సికింద్రాబాద్ స్టేషన్‌లో ట్రయిన్ ఎక్కింది సమీక్ష. తన సీట్ నెంబర్ వెతుక్కుంటూ ముందుకు సాగింది. ఒక దగ్గర విండో సీట్ పైన తన టికెట్ మీది సీలు నెంబర్ రాసి వుండటంతో బోగ్ సీటు కిందపెట్టి కూర్చుంది.
కంపార్ట్‌మెంట్‌లో పెద్దగా రష్ లేదు ప్రస్తుతానికి. రావల్సిన వాళ్లు ఎవరయినా ఉన్నారో ఏమో గానీ, ఎదురు సీటులో మాత్రం 3, 4 సంవత్సరాల వయసున్న ఇద్దరు ఆడపిల్లల తల్లి కూర్చొని వుంది.
‘అబ్బ.. చిన్నపిల్లలా.. ఇక ఏళ్ళ గోలను భరించలేక చావాలి’ అనుకుంది సమీక్ష తనలో తాను.
ఆ పిల్లలు మాత్రం తల్లికి అటొకరు, ఇటొకరు బుద్ధిగానే కూర్చోని వున్నారు. ‘ఆ తల్లి బహుశా తన వయసుదే అయివుంటుంది – కొంచం త్వరగా పెళ్లి చేసుకొని వుండటం వల్ల అప్పుడే ఇద్దరు పిల్లలు పుట్టి వుంటారు. ఇప్పుడు తన వయసు ఇరవై ఎనిమిది. ఇరవై నాలుగు, ఇరవై ఐదుకు పెళ్ళయినా ఈ పాటికి తనకూ ఉండేవాళ్లు ఇద్దరు పిల్లలు’ అనుకుంది సమీక్ష, ఆ ఆలోచనే బాగుండనట్లు ముఖం చిట్లిస్తూ. పెద్ద బొట్టుతో చీరకట్టులో ఆమె సాదాసీదా ఇల్లాలిలా వుంది. అందం కూడా అంతంత మాత్రమే అన్నట్టు వుంది. అందుకే తను ట్రయిన్ ఎక్కినప్పటి నుంచీ ‘ఎంత అందం, ఏమి స్టయిలు అన్నట్టు తన వంకే కన్నురెప్ప వేయకుండా చూస్తోంది’ అనుకుంది సమీక్ష గర్వంగా.
‘ఎవరు తన వంక ఒకసారి చూసినా ఇక స్మాషే. చూపు తిప్పుకోలేరు. ఇప్పటి వరకూ ఎంతో మంది తనవంక అలా చూసారు. వెంటబడ్డారు. తను మాత్రం వాళ్ళను ఒక ఆట ఆడించింది గానీ ఎవరి ప్రేమలోనూ పడలేదు! ఒక్క అశోక్‌నే ఎందుకో చూడగానే నచ్చేసాడు. అందుకే అన్నాడేమో ఒక సినిమా పాటల రైటర్ – ‘ప్యార్ కియా నహీ జాతా – ప్యార్ హో జాతా హై’ అని. అశోక్ హ్యాండ్సమ్ పర్సనాలిటీ, ఆ స్టైలిష్ బాడీ లాంగ్వేజ్, ఆ మాటల్లోని ఫన్ తనను విపరీతంగా ఆకర్షించాయి. తనకు సరిగ్గా సరిజోడీ అనిపించింది’ అనుకుంది సమీక్ష.
“అమ్మా! బిస్కట్ కావాలి!” ఎదురుగా ఉన్నపాప వాళ్ళమ్మని అడుగుతోంది. “నాకూ కావాలి.” అంది ఇంకోపాప.
పిల్లలు అలా అడగగానే ఆమె సీటు కిందికి వంగి బ్యాగ్ లాగి అందులో నుంచి బిస్కట్ ప్యాకెట్ తీసి చెరి రెండు బిస్కట్లూ చేతిలో పెట్టింది.
ఆమె ముఖం ఎందుకో దిగులుగా వుంది. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూన్నట్లు ఆమె చూపులు ఎక్కడో ఉన్నాయి.
బిస్కట్లు తిని, మంచినీళ్లు తాగి పిల్లలిద్దరూ తల్లి ఒడిలో అటొకరు, ఇటొకరు నిద్రకు ఒరిగారు.
‘సమీక్షా, ట్రెయిన్ ఎక్కావా? ఏం చేస్తున్నావ్. నన్ను గురించే ఆలోచిస్తున్నావా? నేనయితే నీ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో. నేను స్టేషన్‌కి వస్తాను. హోటల్ రూమ్ కూడా బుక్ అయింది.’ అంటూ మెసేజ్ పెట్టాడు అశోక్. చిరునవ్వు చిందిస్తున్న ఎమోజీని రిప్లయ్ పెట్టింది సమీక్ష.
అనుకోకుండా సమీక్ష దృష్టి ఎదురు సీటులో కూర్చున్నావిడ మీద పడింది. ఆమె కళ్ళనిండా నీళ్లు, సరస్సులో నీటిమీద తేలియాకుడున్న కలుకల్లా ఉన్నాయి ఆమె పెద్ద పెద్ద కళ్ళు.
‘ఎందుకేడుస్తోంది ఈమె’ అనుకుంది సమీక్ష ఆశ్చర్యంగా. మిడిసిపడే యవ్వనం, అందమైన రూపం, ఫ్యాషనబుల్ మోడ్రన్ డ్రస్సింగ్, సాఫ్ట్‌వేర్ జాబు ఇవన్నీ లైఫ్‌లో హ్యాపీనెస్‌ని, థ్రిల్‌ని, హడావిడిని, ఆర్భాటాన్ని తెచ్చాయి గనుక ఎప్పుడూ కిలకిలా నవ్వటం తప్ప బాధ అనేది తెలియకుండా పెరిగింది సమీక్ష. పేరెంట్స్ సైతం పట్టించుకోనితనంతో కొంత, పిల్లలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళతో ఫ్రెండ్స్‌లా మెలగాలన్న హైక్లాస్ సొసైటీ బావజాలంతో కొంత – సమీక్షను ఫ్రీ బర్డ్‌ను చేశారు. గనుక సమీక్షకు జీవితంలో ఎంజాయ్‌మెంట్ తప్ప బాధ కలిగించేది మరింకేదో ఉంటుందన్న అవగాహన లేదు. అందుకే ఆ ఆశ్చర్యం. సమీక్ష తల్లి, తండ్రి ఇద్దరూ డైవర్సీలు. అలాగే ముప్పయి ఐదేళ్లు వచ్చేదాకా సోలో బ్రతుకులు బ్రతికాక ఓ వర్క్ ప్లేస్‌లో వాళ్ళిద్దరి మధ్య అండర్‌స్టాండిగ్ పెరిగి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తల్లి మొదటి భర్త కూతురు సమీక్ష. అతనికీ ఒక కొడుకు ఉన్నాడు గానీ అతను తల్లితో వెళ్ళిపోయాడు.
వైఫ్ అండ్ హజ్బండ్‌కి గొడవలు వచ్చి ఒకరికొకరు నచ్చకపోతే చాలా సింపుల్‌గా బ్రేకప్ చెప్పుకొని విడిపోవచ్చన్నది ఇద్దరి ఒపీనియనూ గనుక మ్యూచువల్‍గా కోర్టులోడైవర్స్ తీసుకున్నారు. అందుకే వాళ్ళ పేరెంటింగ్ సమీక్ష కాళ్ళకు ఎప్పుడూ బంధాలు వేయలేదు. ‘నీ లైఫ్. నీ ఇష్టం.. యూ ఆర్ గ్రోనప్ నౌ’ అని వదిలేసారు. కనుక ఔట్‌డోర్ తిరుగుళ్ళే తప్ప ఇల్లు, కుటుంబం అన్న వాటి పట్ల ఎలాంటి అభిప్రాయాలూ లేవు సమీక్షకు.
అయినా ఆమె లోపలి మనిషి ఎదుటి మనిషి కన్నీళ్ళకు స్పందించి “మే ఐ నో యువర్ నేమ్?” అని అడిగింది.
“అంజలి! నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు. తెలుగులో మాట్లాడండి” అంది. ఆమె మాటలు, ఆమె ముఖంలలోని హావభావాలూ చూస్తుంటే ‘ఈమె అస్సలు కాన్సిడెన్స్ లేని మనిషి. దానికితోడు కొంచెం అమాయకురాలిలా వుంది’ అనుకుంది సమీక్ష.
“ఎందుకు ఏడుస్తున్నారు?” ఈసారి సమీక్ష ప్రశ్నలో ఇన్నోసెన్స్ ధ్వనించినట్టయింది ఆ అడిగిన తీరుకు.
ఆ డైరెక్ట్ ప్రశ్నతో, “అబ్బే ఏం లేదు. ఏడవటం కాదు. కంట్లో ఏదో పడ్డట్టుంది” అంటూ కంగారుపడి “ఎక్కడికి వెళ్ళాలి మీరు?” అని అడిగింది ఆమె, మాట మారుస్తూ.
“హైదరాబాద్.”
“నేనూ అక్కడికే. మా ఆయనకు అక్కడ ఉద్యోగం. పుట్టింటి నుంచి వస్తున్నా” అంది అంజలి.
ఆమె తనతో మాట్లాడుతున్నప్పుడు ఏదో ఇన్ఫీరియర్ కావడం గమనించి మరింత గర్వపడింది సమీక్ష. ‘మోడ్రన్‌గా ఉండి పూయన్సీతో ఇంగ్లీషు మాట్లాడే చాకులాంటి అమ్మాయిలంటే అతిసాధారణ ఇల్లాళకు ఆశ్చర్యంగా ఉండి ఆత్మన్యూనతను కలిగించేలానే వుంటుంది’ అనుకుంది సమీక్ష.
‘నిజానికి తనూ ఆమెతో మాట్లాడకూడదు, నీ లెవల్ వేరు, నా లెవల్ వేరు అన్నట్టే వుండాలి. అయినా ఎందుకో ఆమె ఏడస్తుంటే కారణం తెలుసుకోవాలని అనిపించింది. కానీ ఆమె చాలా గుట్టు మనిషిలా వుంది.’ అనుకుంది.
కాసేపటి తర్వాత ఏమనుకుందో ఏమో, “మా ఆయనకు నేనంటే ఇష్టం లేదండి. ఆయన అందానికి, హోదాకి, చలాకీతనానికి నేను సూట్ కానట. ‘పప్పుసుద్ద’ అని నాకో ముద్దుపేరు పెట్టారు. ఎప్పుడూ అలాగే పిలుస్తూ ఎగతాళి చేస్తూ ఉంటారు. నాకు మాత్రం ఆయనంటే చాలా ఇష్టం. ఆయన లేకుంటే నేను బతకలేనని అనిపిస్తుంది. ఆయన పక్కన ఎప్పుడూ బితుకు బితుకుమని భయపడుతూ బతుకుతున్నా ఏంటో పిచ్చి ప్రేమ! ఆ దేవుడు ఆడదానికి మొగుడి మీద ఇంత ప్రేమ ఎందుకు పెడతాడో? అంతా.. ఇదిగో ఆయన కట్టిన ఈ తాళి మహాత్యం. ఇందులో ఉంది ఆ రహస్యమంతా” అంది ఆమె పేలవంగా నవ్వుతూ.
అలాంటి మాటలు ఇంతకు ముందెప్పుడూ విననవి కావడంతో విచిత్రంగా ఉంది సమీక్షకు.
‘సెంటిమెంటల్ ఫూల్స్ – ఈ మధ్యతరగతి అన్ఎడ్యుకేడెట్ లేడీస్ అంతా ఇంతే!’ అనుకుంది తనలో తను. అయినా, ఏదో ఆసక్తి – మనసులో.
“మీరంటే ఇష్టం లేనప్పుడు మీ ఆయన అసలు మిమ్మల్ని ఎందుకు పెళ్ళి చేసుకున్నట్టు?”
“ఆ మాట అడిగే ధైర్యం నాకు లేదుగానీ ఒక్కోసారి అనుకోకుండానే మాటలో బయటపడుతుంటారు. అప్పుడు తెలియలేదట. దీనికంతటికి కారణం పెద్దవాళ్ళట” అంది అంజలి.
కాసేపటికి మళ్లీ తనే మాట్లాడుతూ “నాకు పద్దెనిమిది, ఆయనకు ఇరవై ఐదు వెళ్ళ వయసు వున్నప్పుడు అయింది మా పెళ్ళి. అప్పుడు ఈయన దగ్గర ఇన్ని పోజులు, వేషాలు లేవు. ఇంత పెద్ద ఉద్యోగం, ఇన్ని తిరుగుళ్లు, ఇంత డబ్బు లేవు. సాదాసీదాగా ఉండేవారు. అయినా అప్పుడే బాగుండేవారు. ఇప్పుడు మనిషి, మాట తీరు, ప్రవర్తన అన్ని మారిపోయాయి” అంది అంజలి. ఆమె మాటల్లో ఏదో కసి, కోపం, దెప్పిపొడుపూ తొంగిచూసాయి. వాటి వెంటే మళ్ళీ కన్నీళ్ళు ఉబికి వస్తున్నాయి.
ఇంతలో సమీక్ష పోను టింగ్ మని మెసేజ్ వచ్చిన శబ్దం చేసింది. చూస్తే అశోక్ నుంచి ఓ రొమాంటిక్ మెసేజ్, చిరునవ్వుతో చిలిపి ఎమోజీ ఒకటి రిప్లయ్ ఇచ్చి ‘బిజీ’ అని ఒక మెసేజ్ పెట్టింది మళ్ళీ మళ్ళీ మెసేజ్ ఇవ్వకుండా. అంజలితో మాట్లాడాలని వుంది సమీక్షకు.
కానీ ఇంతలో అంజలి బ్యాగ్‌లో నుంచి సెల్ శబ్దం వినిపించింది. చూసి, విరక్తిగా నవ్వుతూ, “అప్పుడే వచ్చేస్తున్నావా అట. పెళ్ళాం వస్తోందంటే తెగ బాధపడిపోతున్నాడు పాపం. ఎ ట్రెయిన్‌కి ఏ కంపార్ట్‌మెంట్‌లో వస్తోంది మెసేజ్ పెట్టాను. చూడలేదట్టుంది పాపం – ‘ఎలా వస్తున్నావ్? నిన్ను రిసీవ్ చేసుకోవటానికి నేను రాలేను. నువ్వే వచ్చేయ్.’ అంటూ మెసేజ్ పెట్టాడు.” అంది అంజలి ముఖమంతా కనిపించిన నిరాశ, నిస్పృహలతో.
“మనం అంటే ఇష్టంలేని వాళ్ళ మధ్య నిత్యం బతకాల్సి రావటం నరకం అండీ. అయినా తప్పదు – ఈ ఇద్దరు ఆడపోరగాళ్లు లేకుంటే ఎప్పుడో ఉరేసుకొని చచ్చేదాన్ని” అంటున్న ఆమెలో దుఃఖం మరింత ఎక్కువవటాన్ని చూసి సమీక్ష మనసంతా ఎలాగో అయిపోయింది. జీవితంలో మొదటిసారి ఏదో కొత్త లోకంలో ఉన్నట్టు ఉంది ఆమెకు.
‘పెళ్లితో భార్యాభర్తల మధ్య ఇంత బైండింగ్ వస్తుందా? భర్త ఎప్పుడన్నా అడ్డదారి తొక్కినా భార్య మాత్రం జీవితాంతం దానికి బందీ అయివుంటుందా? మా మమ్మీ నోట నేనెప్పుడూ ఇలాంటి మాటలు వినలేదే. ఫస్ట్ హజ్బండ్‌ని అంత ఈజీగా వదిలేసి రెండో పెళ్ళి ఎలా చేసుకోగలిగింది – మోడ్రన్ థింకింగ్ మూలంగానా?’ అనుకుంది సమీక్ష. ఆ తర్వాత, “ఎందుకు అంతగా ఏడుస్తున్నారు?” అని అడిగింది అంజలి వంక చూస్తూ. సందర్భం ఆమె తక్కువ స్థాయిని మరిపించేలా చెయ్యడమే కాదు. ‘ఎవరి స్థాయి ఏంటి?’ అన్న ప్రశ్నను ఆమె ముందు తెచ్చి నిలబెట్టింది.
“నా బాధ అనుభవిస్తున్న నాకే అర్థమవుతుందండీ. మీకు నేనింకా పూర్తి విషయాలు చెప్పలేదు. మా ఆయన నన్ను విడాకుల పేపర్ల మీద సంతకం చెయ్యమని రోజూ పోరు పెడుతున్నాడు. తనకు తగిన ఇంకొకామెను వెళ్ళి చేసుకుంటారట. ఆయన కాదంటే నేను ఈ ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఒంటరిగా ఎలా బతకను చెప్పండి. నేనేమన్నా ఈ కాలపు అమ్మాయిల్లా ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తున్న దాన్నా? నా భవిష్యత్తుకు, పిల్లల భవిష్యత్తుకు ఒక అండ, రక్షణా అనేవి లేకుండా పోతాయి కదా. తండ్రి వదిలేసి పోయిన పిల్లలంటే రేపు ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయా? పెళ్ళంటే అర్థం ఇదేనా? కుటుంబం అన్న మాటకు ఈయన చెప్పే వ్యాఖ్యానం ఇదేనా? కొన్ని రోజులు వాడుకొని వదిలేస్తే, ‘ఇంట్లో నుంచి వెళ్ళిపో’ అని శాసిస్తే అన్నెం పున్నెం తెలియని ఆ ఇల్లాలు ఎక్కడికి పోతుంది? ఇలాంటి వాళ్ళ మూలంగా కాదూ మన సంప్రదాయం, మన వివాహ వ్యవస్థ, మన కుటుంబ జీవితాలూ ముక్కలు చెక్కలై పోతోంది? ఇలాంటి వాళ్ళకు ఎవరు చెప్పాలి? ఎవరు చెపితే వింటారు? నాలాంటి వాళ్ళ మాటలు కంఠశోషేగా?” ఆవేదన, ఆక్రోశం కలగలిసి వస్తున్నాయి అంజలి మనసులో నుంచి ఆ మాటలు – అది చూసి అప్రతిభురాలైంది సమీక్ష.
అంజలి ఒళ్లో పడుకున్న పాప లేవటంతో తనను సముదాయించే పనిలో పడింది. అందులోనూ ఒక్క క్షణం మళ్ళీ తల తిప్పి సమక్ష వంక చూసి “క్షమించండి. నా సోదంతా చెప్పి మీ మనసూ పాడు చేసాను. సాధారణంగా నా బాధను నాలోనే ఉంచుకుంటాను. ఎవ్వరికి చెప్పను. మా ఆయన ఈ మధ్య ఎవరితోనో తిరుగుతున్నాడని, ఆక్రమ సంబంధాలు సాగిస్తున్నాడని నా అనుమానం. ఆయన ప్రవర్తన ఈ మధ్య మరే పెచ్చుపెరిగిపోతోంది. అందుకే నా మనసేం బాగుండలేదు. మా అమ్మకు జబ్బు చేసిందని తెలిసి వెళ్లాననే గానీ అక్కడ ఉండ బుద్ధిగాక నాలుగు రోజులకే వెనక్కి తిరిగి వస్తున్నాను. నేను ఇంట్లో లేకపోతే ఈయన ఇంట్లోనే దుకాణం పెట్టేస్తాడేమోననే భయం నన్నిలా లాక్కొస్తోంది. అయినా బుద్ధి బాగుండాలి గానీ ‘అది’ బాగుండని వాళ్ళకు ఎంతని కాపలా కాయగలం లెండి గానీ” అంటూ పాపకు పాలు పట్టే పనిలో మునిగిపోయింది అంజలి. ఆ తర్వాత మరింకేమీ మాటలు పొడిగించలేదు సమీక్ష. అంజలి సైతం అలసిసొలసిన మనసు వల్ల కాబోలు కునుకు లోకి జారుకుంది.
***
ఇంటికెళ్ళి ట్రావెల్ బ్యాగ్‌ని బట్టలు తీసి అలమారాలో సర్దుతున్న అంజలికి మొదట ఉండే చిన్న అర జిప్ ఓపెన్ చేయగానే ఏదో కాగితం మడత తెల్లగా కనిపించింది.
‘ఏంటీ కాగితం’ అని ఆశ్చర్యపోతూ మడతవిప్పిన అంజలికి బ్లూకలర్ తెలుగు అక్షరాలలో ఓ ఉత్తరం లాంటిదేదో కనిపించింది. ఆత్రంగా ఆమె కళ్ళు పై వరస అక్షరాల మీద పడ్డాయి.
“అంజలి గారూ!
నా పేరు సమీక్ష. మూడు గంటలు ఒక కంపార్ట్‌మెంట్‌లో ఎదురెదురు సీట్లలో కూర్చుని మాట్లాడకున్నా నా పేరు మీకు చెప్పనే లేదు. సికిందరాబాద్ స్టేషన్‌లో మీకు మెలకువ వచ్చాక నా కోసం చూసి వుంటారు కదూ. మీ వారు స్టేషన్‍లో మీ కోసం మీ కంపార్ట్‌మెంట్ దగ్గరికి రానని చెప్పి కూడా మళ్ళీ వచ్చేసారు కదూ. ఆయనకు మీ మీదున్న ప్రేమకు మీ మనసు పొంగిపోయి వుంటుంది కదూ? కానీ.. ఒక విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోయి నిరాశ కూడా పడిపోతారు. అది ఏమిటి అంటే – ఆయన అదే ఆ అశోక్ వచ్చింది మీ కోసం కాదు – నా కోసం. ఎందుకంటే ఇందాక మీరు చెప్పిన మీ వైవాహిక జీవితకథలోని విలన్‌ని, ఆడదాన్ని గనుక వ్యాంప్‌ని అయిన మీ వారి ప్రియురాలిని నేనే, కునుకు తీస్తూ సెల్‌ఫోన్‌ని మీరు కిందకి జారవిడిస్తే దాన్ని కిందికి వంగి తీసి పైన మీ పక్కన పెట్టాలని ప్రయత్నిస్తున్నప్పుడు అన్‌లాక్‌లో వుండటం వల్ల డిపిలో కనిపించిన మీ ఇద్దరి జంట ఫోటోలోని అశోక్‌ని చూసాక నాకు ఆ విషయం తెలిసింది. ఆయన ఇల్లాలిగా మీరు పడుతున్న ఆవేదన, క్షోభ కూడా అప్పుడే నాకు అర్థమయ్యాయి. ప్రేమ అంటే ఏమిటో తెలియకుండానే ఆకర్షణతో ఇద్దరు పిల్లల తండ్రి కూడా అయిన మీ ఆయన ప్రేమలో పడ్డాను. పెళ్ళికి కొన్ని పద్ధతులు, కట్టుబాట్లు, విలువలు ఉంటాయని తెలియకుండానే మీ ఆయన్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవటానికి సిద్ధమయ్యాను. పెళ్ళంటే ఏంటో, వివాహబంధం ఎంత పవిత్రమైనదో అన్నవి ఏవీ తెలియకపోవటం వల్ల పెళ్ళంటే బొమ్మలాట అనీ ఎప్పుడు ఎవర్ని కావాలంటే వాళ్ళను చేసుకొని, వద్దనుకున్నప్పుడు వదిలేసే ఆషామాషీ వ్యవహారమనీ అనుకొని చాలా నిర్లక్ష్యంగా, చాలా బాధ్యతారహితంగా ప్రవర్తించాను. అలా అని మీ కన్నీటి కథ విని మీరు అశోక్ భార్య అని తెలిసాకే నాకూ తెలిసివచ్చింది. తెలిసాక, ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ట్రయిన్ సికిందరాబాద్ స్టేషన్‌కి రావటానికి ఇంకొంత సమయమే ఉండటంతో ఏం చెయ్యాలో తోచలేదు.
ఒక్క నిముషం ఆలోచించి వేరే కంపార్టమెంట్ లోకి వెళ్ళిపోయాను. గేటు ముందే నా కంపార్ట్‌మెంట్ ఆగటంతో దిగి చకచకా బయటికి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి క్యాబ్‍లో ఫ్రెండ్ ఇంటికి చేరుకున్నాను. మీవారికి ఒక్క మెసేజ్‌తో పర్మినెంట్ బై చెప్పేసాను.
నన్ను క్షమించండి అంజలీ. దీని కంతటికీ కారణం మన వివాహవ్యవస్థ మీద సరిగా అవగాహన లేని నా అజ్ఞానమే. దానికి తోడు ఈ మోడ్రన్ కల్చర్ పెళ్ళి పట్ల నాకు నేర్పిన విపరీత భావజాలం. పెళ్ళంటే ఒక మ్యాన్, ఉమన్‌ల సెక్సువల్ లైఫ్ అన్నంత వరకే నేను ఆలోచించగలగటం..! దాన్నిమించి నా ఆలోచనలు ముందుకు వెళ్ళలేకపోవడం. ఒక విధంగా నా సైడ్ నుంచి ఇది తెలియక చేసిన తప్పు. మీ వారి సైడ్ నుంచి ఏంటో పూర్తిగా నాకు తెలవదు. అది మీరే కనిపెట్టగలరు భార్యగా.
చివరిగా విలువలు నేర్పిన సాటి స్త్రీ మూర్తీ నీకు వందనం, నేనూ అసలైన పెళ్లి చేసుకొని మీలా చక్కనైన ఇల్లాలినయి, నా పిల్లలకు అసలైన అమ్మ ప్రేమను అందించే మాతృమూర్తిగా ఉండటానికి నా ప్రయత్నాలు నేను ప్రారంభిస్తాను. పెళ్ళికి, పెళ్ళానికి అర్థం తెలిసి, గౌరవించడం వచ్చిన ఆ పురుషుడెవరో అతని అన్వేషణలో ఉంటాను. ఈనాటి మన కలయిక నా జీవితంలో ఓ కొత్త ఉదయం. ఇంక ఉంటాను అంజలి గారూ. మళ్లీ మనం కలుసుకోలేమేమో బహుశా. కలిసిన ఆ కొంత సమయమే నాకెంతో-!
ధన్యవాదాలు.
సమీక్ష.”
ఆ ఉత్తరం చదివి ఆశ్చర్యపోయింది అంజలి. ‘అంతసేపూ ట్రయిన్‌లో నా ఎదురుగా కూర్చొని నాతో మాట్లాడిన ఆ మోడ్రన్ బ్యూటీ మా ఆయన ప్రియురాలా? ఎంత మోడ్రన్ లేడీ అయినా మన సంప్రదాయ బీజాలు మనసు మూలల్లో ఎక్కడో కొన్నయినా ఉండి మనిషిని పతనం కాకుండా కాపాడి జీవితాన్ని ఎలా ఫలవంతం చెయ్యగలవో నిరూపించింది ఈనాటి సమీక్ష ఈ నిర్ణయం. నిజంగా పేరుకు తగ్గట్టు సమీక్షే.
తన జీవితాన్ని తను సమీక్షించుకొని తప్పోప్పులు ఎంచుకొని సవరించుకోవటమేగాక నా జీవితానికి ఓ చక్కటి సమీక్ష రాసిపెట్టింది.’ అనుకుంది అంజలి చేతిలోని ఆ ఉత్తరాన్ని గుండెలకు హత్తుకుంటూ.
మనసంతా దూదిపింజలా గాల్లో తేలిపోతూ హాయిగా, ఆనందంగా అనిపించింది అంజలికి.
డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు డిగ్రీ కాలేజీ లో తెలుగు లెక్చరర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. వారు వ్రాసిన 500 పైన కథలు వివిధ పత్రికలలో వచ్చాయి.
కథా వాణి పేరిట వారికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో తన కథలనే 500 వీడియోల దాకా తన స్వరంతో వినిపించారు ఇప్పటి వరకూ..
ఇంకా రాస్తున్నారు.. వినిపిస్తున్నారు. ఫోన్: 9849212448
