Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవితం ఓ ప్రయాణం-1

[ప్రముఖ కథా, నవలా, సినీగీత రచయిత, శ్రీ భువనచంద్ర తమ సినీ జీవన ప్రస్థానాన్ని ‘జీవితం ఓ ప్రయాణం’ అనే పేరుతో సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు.]

ప్రారంభం:

ప్రసాద్ స్టూడియోస్.. (old) వడపళని (సాలిగ్రామం) తేదీ 1.1.1987.. సమయం ఉదయం 7.30 నిమిషాలు.

కల నిజమయ్యే క్షణాల్లో.. నా కళ్ళల్లో కన్నీళ్ళు.

“నవ్వినా.. ఏడ్చినా.. కన్నీళ్ళే వస్తాయీ.. ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా?” ఆత్రేయగారి పాటలోని పంక్తులివి. చిత్రం ఏమంటే ఆనాటి ఆ క్షణాల నా కన్నీటిలో ఏముందో నాకు యీనాటికీ తెలీదు. నాలుగవ తరగతిలో నా పేరు వాల్ పోస్టర్ మీద రాసుకున్నాను. శ్రీశ్రీగారి పేరు పక్కన, ఆత్రయగారి పేరు పక్కన.. ఆరుద్రగారి పేరు పక్కన.

ఆ కల ఒక విధంగా నిజమైంది. నా మొట్టమొదటి సినిమా ‘నాకూ పెళ్ళం కావాలి’ సినిమాలోనే నా పేరు ‘ఆత్రేయ’గారితో పాటు వెండితెర మీద వెలిగింది.

‘తొలి పరిచయం’ భువనచంద్ర.. అంటూ..

ఆ నాలుగో తరగతి పిల్లాడికి ఈ 1987 Jan 1st వాడికీ ఎంత తేడా! కానీ దేవుడా.., కల నిజమైంది!

ఆ తరవాత నేను ఆరుద్రగారినీ, అమ్మలగన్నఅమ్మ కె. రామలక్ష్మి గారినీ కూడా కలిశాను. వారి ప్రేమని పొందాను. శ్రీశ్రీ గారి భార్య సరోజినిగారినీ, వారి మరదలు రమోలా గారినీ, వారి పెంపుడు కూతురు మంగళగౌరిని కూడా కలిశాను. అంతెందుకూ.. ఆకాశంలో మాత్రమే నడయాడే మేఘాలని నేల మీద కలుసుకోగలిగాను. ఇప్పటికి నేను సినిమా పరిశ్రమలో అడుగు పెట్టి మూడు దశాబ్దాలు దాటింది.

ఎందరు మహానుభావుల్ని కలిశానో, ఎందరి పరిచయం నా జీవితాన్ని సుసంపన్నం చేసిందో, అన్నీ వ్రాస్తాను. కానీ అందరి కంటే ముందు నేను కృతజ్ఞతాలు అర్పించాల్సింది శ్రీ విజయ బాపినీడు గారికి.. నా గైడ్.. ఫాదర్ అండ్ ఫిలాసఫర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ..

ఆత్మ నమస్కారాలతో

భువనచంద్ర

~

ప్రారంభానికి ముందు:

1982లో నాకు విజయవాడ No.8 Air NCC కి ట్రాన్స్‌ఫర్ అయింది. 82 నుంచి 86 దాకా విజయవాడలో winch operator గా పని చేశాను. అంటే ‘గ్లైడర్’ని 1800 అడుగుల ఎత్తుకి తీసికెళ్ళే గ్రౌండ్ ఎక్విప్‌మెంట్ అన్నమాట. 1800 అడుగుల హైట్ చేరగానే పైలెట్ పేరాచూట్‌ని రిలీజ్ చేస్తాడు.. ఆ తర్వాత గాలిని బట్టి ఆకాశంలో చెక్కర్లు కొట్టొచ్చు. ఒకసారి పైకి వెళ్ళి land అవడాన్ని ‘లాంఛ్’ అంటారు. కొన్ని వేల లాంఛెస్ ఇచ్చాను.. NCC (AIR) స్టూడెంట్స్‌కి.

విజయవాడలో వుండగానే మహామహుల పరిచయాలు అయ్యాయి. అప్పట్లో విపరీతంగా చదవడమే కాక నాకు నేనే ట్యూన్ కట్టుకుని పాటలు వ్రాసేవాడ్ని. సరదాగా ఆ పాటల్ని జనాలకి పాడి వినిపించేవాడ్ని.

“కామ్ నయే నిత్ గీత్ బనానా.. గీత్ బనా కె జహాఁ కో సునానా.. కోయీ నా మిలే తో అకేలే హీ గానా” (నా పని ఏమంటే కొత్త కొత్త పాటలు తయారించడం.. తయారించినవి ప్రజలకి వినిపించడం.. వినేవారు ఎవరూ దొరక్కపోతే ఒంటరిగా నాలో నేనే పాడుకోవడం) (‘జిస్ దేశ్ మే గంగా బెహతీ హై’ సినిమా.. పల్లవి.. ‘మేరా నామ్ రాజు ఘరానా అనామ్’..)

ఓనాడు తెన్నేటి హేమలతగారు పరిచయమయ్యారు. సుప్రసిద్ధ రచయిత్రి. సాహిత్యాన్ని ఇంటి పేరు చేసుకుని ‘లత సాహిత్యాన్ని’ సృష్టించిన విదూషీమణి. పరిచయం అయిన మరుక్షణం నించే నన్నో చిన్న తమ్ముడిగా స్వీకరించారు. వారింటి దగ్గరే ఆ తరవాత సినిమా పరిశ్రమలో ప్రసిద్ధులైన కీర్తిశేషులు ఓంకార్ (రచయిత, డైరక్టర్, నటుడు, పాత్రికేయుడు, ఆకాశవాణి రీడర్ etc etc); శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు (ప్రసిద్ధ గీత రచయిత, కథా రచయిత, పేరడీ కింగ్, అద్భుత వక్త, ఉభయభాషా ప్రవీణులు); లల్లాదేవి (ప్రసిద్ధ నవలా కథా రచయిత) పరిచయమయ్యారు. అలాగే శ్రీశ్రీ విశ్వేశ్వరరావు (శ్రీశ్రీ ప్రింటర్స్); ‘మో’ (వేగుంట మోహన్ రావు) లాంటి లబ్ధప్రతిష్ఠులూ పరిచయమయ్యారు.

నా పాటలు విన్న తెన్నేటి హేమలతగారు, “అబ్బాయ్.. నీ పాటలు చిత్రంగా వుంటాయి.. వాడే పదాలు పొందిక చాలా కొత్తగా వుంటుంది. నీ Air Force టెరమ్ అయిపోగానే సినిమాలలో ఎందుకు ప్రయత్నించకూడదూ?” అని ఉత్సాహ పరిచేవారు.

చిన్నప్పటినించీ సినిమాల్లోకి రావాలనే నా కోరికకి, లతగారి మాటలు మరింత ఉత్సాహాన్నిచ్చేవి. Air Force నించి బయటకు రాగానే ONGC లో job వచ్చింది. అయినా సినిమా పిచ్చి అంత తొందరగా వదిలేది కాదు గదా! Job లో చేరడానికి ఇఁకా నెలన్నర సమయం ఉంది గదా, యీలోగా ఓ ట్రయలు వేద్దామనుకున్నా. అదే మాట లతగారితో అంటే “హీరో చంద్రమోహన్ గారి భార్య జలంధర నా మేనకోడలే. వారిటికి వెళ్ళి ఓసారి కలువు” అని పరిచయం పత్రం రాసిచ్చారు.

మా అమ్మగారి ఆశీస్తులూ, మా గురువుగారైన శ్రీశ్రీశ్రీ బోధానందపురి మహారాజ్ వారి ఆశీస్సులూ తీసుకుని మద్రాసులో అడుగు పెట్టాను. డైరెక్టగా ‘తాంబరం’ లోని భువనేశ్వరమ్మగారి ఇంటికి వెళ్ళాను. మా అమ్మగారెలానో వారూ నాకు అంతే.

మద్రాస్ చేరిన రెండో రోజే కోడంబాకంలో వుండే చంద్రమోహన్ గారి ఇంటికి వెళ్ళాను. మధ్యాన్న సమయం. వారి ఇల్లంతా హడావిడిగా వుంది. జలంధరగారు బయటి కొచ్చి “ఎవరు మీరు.. ఏం చేస్తారూ?” అని ఆదరంగా అడిగితే లతగారి ఉత్తరం ఇచ్చాను. వారో క్షణం నన్ను చూసి, “పాండీబజార్‌లో స్టాండర్డ్ ఎలెక్ట్రికల్స్ ముందు, ప్లాట్‌ఫాం మీద వేసి వున్న కుర్చీల్లో డా. గోపాలకృష్ణగారుంటారు. నేను పంపించానని చెప్పి వారిని కలవండి” అని చల్లగా చెప్పారు.

హాయిగా నడుచుకుంటూ వెళ్ళి డా. గోపాలకృష్ణగారిని కలిశాను. ఆయన కూర్చోమని, నా కథంతా విని, “సరే.. తాంబరం నించి డైలీ రావడం కష్టం. ఇక్కడే ఏదన్నా రూమ్ చూసుకోండి. అయినా, నెలా పదిహేనురోజుల్లోపల ‘ఛాన్స్’ ఎలా దక్కుతుందీ?” అన్నారు.

“ప్రయత్నంలో తప్పు లేదుగా సార్” అన్నాను.

“చూద్దాం” అన్నారు. అంటూనే లేచి పక్కనే వున్న టీస్టాల్ లో నించి ఓ కప్పు టీ తీసుకొచ్చి సగం నాకు ఇచ్చారు. టీ కంటే ఆయన ఆప్యాయత అద్భుతం అనిపించింది. ఆయన హోమియో డాక్టరనీ, మందులు ఉచితంగా ఇస్తారనీ కూడా ఆనాడే నాకు అర్థమయింది.

నాలుగు రోజుల్లోనే డాక్టరు గారు అత్యంత ఆప్తులయ్యారు. నా చిన్నప్పటి విశేషాలూ, ఏర్ ఫోర్స్ జీవితం, మా స్వామిజీ బోధనలూ, ‘సన్యాసి’ కావాలనే నా కోరికా అన్ని అడిగి మరీ తెలుసుకున్నారు. అక్కడ బోలెడు పుస్తకాలుండేవి. వాటి మీదే కాక నేను చదివిన వేలాది పుస్తకాల గురించీ, ఆధ్యాత్మికమైన విషయాల గురించీ మంచి చర్చలు జరిగేవి. ఓ సాయంత్రం జలంధరగారొచ్చి “రేపు చంద్రమోహన్ గారు హైద్రాబాద్ నించి వస్తున్నారు.. కలవండి..” అన్నారు.

మరునాటి రోజు పొద్దున్నే వెళ్ళాను. ఆయన చక్కగా పట్టుపంచ, పట్టు ఉత్తరీయంతో దేవుళ్ళకి హారతిస్తూ కనిపించారు. వివరాలన్నీ తెలుసుకుని, వారి డ్రైవర్ని పిలిచి, “వీరిని జంధ్యాలగారి ఇంటికి తీసికెళ్ళు..!” అని చెప్పి, “మీరు జంధ్యాల గారిని కలవండి.. మీరు వెళ్ళేలోగా నేను ఫోన్ చేస్తాను.. ఆపైన మీ అదృష్టం” అన్నారు. ఇంకేం..! చంద్రమోహన్ గారి కార్లోనే జంధ్యాలగారింటికి చేరాను. బోలెడు మంది జనం పడిగాపులు కాస్తున్నారు. వారిని కలిసే ఛాన్స్ నాకు వెంటనే లభించింది. కారణం చంద్రమోహన్ గారి call. “నేను ఆమెరికా వెడుతున్నానండీ.. ‘పడమటి సంధ్యారాగం’ అనే సినిమా కోసం. నేను తిరిగి వచ్చాక కలవండి.. అప్పుడు చూద్దాం” అన్నారు. చంద్రమోహన్ గారితో అదే మాట చెప్పాను. “మంచిది. మరో ప్రయత్నం చేద్దాం.. రేలంగి నరసింహారావుగారి ఘాటింగ్ వుంది రేపు.. ఫలానా.. స్టూడియోకి రండి.. వారిని పరిచయం చేస్తాను..” అన్నారు. కొండెక్కినంత ఆనందం కలిగింది. ఇక్కడ ఓ నిజం చెప్పి తీరాలి. వారిని కలిస్తే ఏదో సినిమాలో ఛాన్స్ వస్తుందన్న ఉత్సాహమే గానీ, స్పష్టంగా నేను ఏం చేయ్యాగలనో నాకే తెలీదు. వారు ఏ పని ఇస్తే అదే చేద్దామని నా ఆలోచన. అంతే. గీత రచయితగా ఎంటరవ్వాలనే స్పష్టమైన నిర్ణయం నా వరకూ నాకయితే అప్పడు లేదు. సినిమాకి 24 క్రాప్టులు వుంటాయనీ, అందులో, లేక వాటిల్లో చేరాలంటే కొద్దో గొప్పో వాటి గురించి అనుభవమో అవగాహనో ఉండాలనీ కూడా నాకు తెలీదు. సినిమాల్లోకి రావాలనే ప్రగాఢమైన కోరికా, వస్తాననే గుడ్డి నమ్మకమూ తప్ప ఏమీ తెలీదు. ఇది ముమ్మాటికీ నిజం.

రేలంగి నరసింహారావు గారిని చంద్రమోహన్ గారే స్వయంగా పరిచయం చేశారు. RNR గారు వారి ఇంటి అడ్రస్ ఇచ్చి ఇంటిదగ్గర కలవమన్నారు. కానీ కలవడం కుదరలేదు. నేను వెళ్ళే సరికే వారు ఘాటింగ్‌కి వెళ్ళిపోయేవారు.

“రాజావారూ.. తాంబరంలో వుంటూ పొద్దున్నే డైరక్టర్స్‌ని కలవడం ఎలా వీలవుతుందీ.. టి. నగర్ లోనే రూమ్ చూసుకోమన్నాను కదా?” అన్నారు డాక్టరు గారు.

“సరే సార్.. ఇవ్వాళే వెతుకుతా.” అన్నాను. అప్పటికి నేను మద్రాసొచ్చి పది రోజులు దాటింది. ఇంతలోకీ ఓ కుర్రాడు డాక్టరుగారి దగ్గరికొచ్చాడు.

“రబ్బీ.. వీరి పేరు రాజుగారు. మీరుండే మేన్షన్‌లో ఏదన్నా రూమ్‌లో వీరికి బస ఏర్పాటు చేయ్యడం వీలవుతుందా?” అని అతన్ని అడిగారు డాక్టురుగారు.

“మా రూమ్‌కే రమ్మనండి. ప్రస్తుతానికి మేం ముగ్గురం వున్నాం. ముగ్గురిలో ఒకరు రెండు నెల్లకోసారి వచ్చి ఓ రోజు రెండ్రోజుల్లో వుండి వెళ్ళిపోతాడు. ప్రస్తుతానికి అతని జగాలో వుండమనండి” అన్నాడు రబ్బీ.

“రూమ్ రెంట్ ఎంత?” అడిగారు డాక్టర్.

“నెలకి నాలుగొందలు.. టోటల్” అన్నాడు రబ్బీ.

“ఇదిగో.. ఇతని షేర్ వంద రూపాయలు.” అని వందనోటు తీసిచ్చారు. డాక్టరుగారు. అట్నుంచి అటే టి. నగర్ నడిబొడ్డునున్న ‘మలర్‌కొడి మేన్షన్’కి తీసికెళ్ళాడు రబ్బీ. రూం నంబర్ 34. చిత్రం ఏమంటే ఆ మేన్షన్ ఆరుద్రగారి ఇంటి వెనకాలే వుంది. మొత్తం 48 రూములు. రూము పొడుగు ఎనిమిదిన్నర అడుగులు. వెడల్పు ఆరున్నర అడుగులు. పొరబాటున చెయ్యి పైకెత్తతే ఫేన్ తగులుతుంది. అప్పటికే రబ్బీ, రాజుగారు అనే ఓ టెన్నిస్ కోచ్ అక్కడ వున్నారు. ఫ్లోర్‌కి మూడడుగుల ఎత్తులో L షేపు చెక్కలు గోడలకి తాపడం చేసి వున్నాయి. అంటే ఇద్దరు వాటి మీద పడుకోవచ్చు. మిగతా వాళ్ళు అంటే ఇద్దరూ నేల మీద సర్దుకోవాలి. అటూ ఇటూ కదలికలకి కూడా పెద్దగా వీలుండదు. అంతా చిన్న రూమా? అనే ఉదాసీనాలు కంటే, టి. నగర్‌లో రూమ్ దొరికినందుకు మహదానందం కలిగింది.

ఆ మరుసటి రోజునే నా సూట్‌కేస్‌తో తాంబరం నించి టి. నగర్ వచ్చేశా. నలుగురికి సరిపోగా బోలెడు మిలిగిలేంత ఉప్మా, పూరీలూ కూరా ఇచ్చారు భువనేశ్వరమ్మగారు, అరిటాకుల్లో పేకు చేసి. ఓ చిన్న చాక్లేట్ బాక్సులో నేను రోజూ పూజించే బుల్లి బుల్లి దేవతా విగ్రహాలున్నాయి. వాటిని ఓ మూలగా ప్రతిష్ఠించి ఓ కొబ్బరికాయ కొట్టి మలర్‌కోడి మేన్షన్ 3వ అంతస్తులో వున్న రూమ్ నం. 34లో ప్రవేశించాను. ఆ రోజే రూమ్‌కి వచ్చిన 3వ మెంబరు బాబు “పక్క రూంలో సద్దుకుంటాలెండి” అని పక్క రూమ్‌కి వెళ్ళాడు. రబ్బీ ఉప్మా తిన్నాక “నెల్లూరు వెళ్ళొస్తానండీ” అంటూ మధ్యాహ్నం నెల్లూరు వెళ్ళారు. మిగిలింది టెన్నిస్ రాజుగారూ నేనూ. 8 ½ పొడుగు వున్న బల్ల మీద నేనూ (రైల్వే బెర్తులా) 6 ½ అడుగుల బెర్తు మీద రాజుగారూ పక్కలు వేసుకున్నాం. ఓ కొబ్బరి చిప్పని పగలగొట్టి పంచుకోవడమే గాక రెండో చిప్పని డాక్టర్ గోపాలకృష్ణగారి దగ్గరికి తీసికెళ్ళి అక్కడ పంచాను.

“శుభం!..” నవ్వి అన్నారు డాక్టరు గారు. ఆ రాత్రి చాలా సేపు నిద్ర పట్టలేదు.. కారణం.. ఒక్కసారి జీవితాన్ని సింహావలోకనం చేసుకోవడం వల్ల. ఎక్కడి గొల్లపూడి.. (నూజివీడు దగ్గరిది) ఎక్కడి చింతలపూడి (WG Dt), ఎక్కడి హైద్రాబాదు.. ఎక్కడి ఊళ్ళూ (బెంగుళూరు, మద్రాస్, ఢిల్లీ, చండీఘర్, ఎడారులు, చలిదేశాలు etc etc etc) and ఫైనల్లీ ఎక్కడి మలర్‌కొడి మేన్షన్!

గతాన్ని నెమరేసుకున్నాను గానీ భవిష్యత్తు మీద ఒక్క ఆలోచన కూడా చెయ్యలేదు. ఎందుకంటే, గడిచిన జీవితాన్ని ఎన్ని సార్లయినా రివైండ్ చేసుకుని చూడొచ్చు. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. అంతెందుకూ, మరుక్షణం ఏమి జరుగుతుందో కూడా ఎవరికీ తెలీదు కదా! అందుకే జీవితమనే సీ.డి.ని ఎన్ని సార్లైనా రివైండ్ చేసుకోవచ్చు. బట్ నో ఫాస్ట్ పార్వర్డ్. చింతలపూడిలో ఒంటరిగా వున్న మా అమ్మ గుర్తుకొచ్చింది. ఆఖరి క్షణంలో ఆడిన మరో బంధమూ గుర్తొచ్చింది. రాత్రి పదిన్నరకి వెనకాల రూమ్‍లో ఎవరో పెట్టిన రేడియోలో తమిళ పాట వస్తోంది.. “పోనాల్ పోగట్టుంపోడా.. ఇంద భూమియిల్ నిలయాయ్ వాళ్దవర్ యారుడా” అంటూ! (‘పొతే పోనీ పోరా.. యీ పాపపు జగతిలో శాశ్వతమెవరురా’ అని తెలుగులో అనువాదంగా యీ పాట వచ్చింది.).

ఎప్పుడో నిద్రపోయా..

కలలు నా ప్రాణస్నేహితులు. పడుకున్న మరుక్షణం అవి నా కనుపాపల్లో వాలిపోతాయి. ఎన్నెన్నో సుందర దృశ్యాలే కాదు భీభత్స, భయానక దృశ్యాలూ చూస్తాను. బట్.. కలల్లో సోలిపోతే వచ్చే సుఖమే వేరు.

“కలగా వస్తా.. కలనై వస్తా.. కంటిపాపలో నిదురిస్తా.. నీ కంటిపాపలో నిదురిస్తా” అంటూ పొద్దున్నే ఓ కాయితం మీద వ్రాసుకోవడం మాత్రం ఇప్పటికీ జ్ఞాపకం వుంది.

***

అడిగితే చాలు.. అప్పు

ఆ మేన్షన్‌లో 48 గదులున్నాయని (మొత్తం 48) చెప్పాను గదూ. కొన్ని కారుతూ వుండేవి. వర్షం వస్తే ఆ గదుల వాళ్ళు ఇతర్లని రిక్వెస్టు చేసి అడ్జస్టు అయ్యేవాళ్ళు. అ సంగతి పక్కన పెడితే, గదుల్లో వున్న వాళ్ళందరూ కొద్దో గొప్పో సినిమా మీద ఆధారపడ్డవాళ్ళే. ఇద్దరు మాత్రం ‘రిటైరై’ పిల్లల దగ్గర ఇమడలేక అక్కడ అద్దెకుండేవాళ్ళు. వాళ్ళకి సీనియారిటీతో పాటు కాస్త ‘ఇగో’ కూడా వుండేది. తామేదో ‘ఇంటి పెద్దల’మన్నట్టు ప్రవర్తించేవారు. కాస్త అధికారం చెలాయించే ప్రయత్నమూ చేసేవాళ్ళు.

ఇక మిగతా వాళ్ళల్లో నలుగురు స్టూడెంట్లు. వాళ్ళని వొదిలి పెడితే మిగతా అందరూ సినీ జీవులే. ఎక్సట్రా వేషాల కోసం తిరిగేది కొందరైతే, అవ్వాళ వేసొచ్చిన వేషం గురించి కొత్త వాళ్ళ దగ్గర ‘డబ్బా’లు కొట్టేవాళ్ళు మరి కొందరు. రేపో ఎల్లుండో చిత్ర పరిశ్రమని ఏలేస్తాం అనుకునే అత్యూత్సాహులు కొందరైతే, ‘ఈ జీవితం ఇంతే.. ముందుకి పోలేం.. వెనక్కి వెళ్ళలేం.. ఈ రోజుకిలా నడిచిపోతే చాలు’ అనుకునే నిర్లిప్తులూ, నిరుత్సాహులూ మరి కొందరు.

పొద్దున్నే లేవడం.. మూడంతస్తూలూ దిగి, రోడ్డు పక్కనున్న ‘భగవతీ విలాస్’లో ఓ కాఫీ తాగి, ఓ రెండిడ్లీ సాంబారూ చెట్నీలూ పేకు చేయించుకుని రూమ్‌కి వచ్చేవాడిని. ఈ పాలిథిన్ కవర్ల గోల అప్పుడు లేదు గనక ఓ హార్లిక్స్ బాటిల్ సాంబారు కోసం పెట్టుకుపోయేవాడ్ని.

భాగవతీ విలాస్ ఓనరు చాలా మంచోడు. ఎన్నో ప్రొడక్షన్ కంపెనీలకి టిఫెన్లు అక్కడినించే సప్లై అవుతూ వుండటంతో, సినిమా వాళ్ళ కష్టనష్టాలు బాగా తెలిసినవాడు. అందుకే, ఎప్పుడూ హర్లిక్స్ పాటిల్ తీసికెళ్ళినా అది రెండిడ్లీనా నాలుగిడ్లీనా అని చూడకుండా బాటిల్ నిండుగా వేడి వేడి సాంబార్ పోసిచ్చేవాడు.

స్నానమూ పూజా కాంగానే రెండిడ్లీ + పుల్ హార్లిక్స్ బాటిల్ సాంబార్ బిగించి డ్రెస్ చేసుకుని డాక్టరుగారి దగ్గరికి పోయేవాడ్ని. ఉదయం 7 ½ కల్లా డాక్టరు గారు చెట్టు కిందకి వచ్చేసే వారు MGR నగర్ నుంచి. డైలీ పేపర్లు వచ్చేవి. ఆంధ్రజ్యోతి, ఇడియన్ ఎక్స్‌ప్రెస్ & ది హిందూ. డాక్టరుగారు వచ్చే సరికే జనాలు సిద్ధంగా వుండేవాళ్ళు.

ఎంతమంది వున్నా డాక్టరు గారు అందరికీ టీని ఉచితంగా ఇప్పించేవారు. కొంతమంది కేవలం ఆ టీ కోసం వస్తే కొందరు మందుల కోసం వచ్చేవారు. మరి కొందరు పలకరింపులకీ, ఇంకొందరు ధర్మసందేహాలు తీర్చుకోడానికీ కూడా వచ్చేవారు. రూమ్‌లో చేరిన మరుసటి రోజే డాక్టరు గారన్నారు “ఏమండీ.. ఖాళీగా కూర్చోడం ఎందుకూ? ఏమన్నా వ్రాయకూడదా?” అని.

(ఇంకా ఉంది)

Exit mobile version