Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవితం ఓ ప్రయాణం-10

[ప్రముఖ కథా, నవలా, సినీగీత రచయిత, శ్రీ భువనచంద్ర తమ సినీ జీవన ప్రస్థానాన్ని ‘జీవితం ఓ ప్రయాణం’ అనే పేరుతో సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు.]

వెన్నెల తరగలు

అలజడి:

సినిమాకి ఒక ప్రత్యేకత వుంది. తిరగేస్తే మానిసి అవుతుంది. మళ్ళీ మళ్ళీ మనిషి కథే సినిమాకి మూలం. అది టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్, ఏ సినిమా అయినా ముఖ్య పాత్ర పోషించేవి హ్యూమన్ ఎమోషన్సే.

‘నాకూ పెళ్ళాం కావాలి’ సినిమా డైరక్షన్ డిపార్ట్‌మెంట్‍లో పనిచేసిన జయగారు నాకు కబురు పెట్టింది. “ఏమిటీ?” అంటే.. “కవిగారూ.. అర్జెంటుగా ఓ పాట వ్రాయాలి” అని. కంపెనీ పేరు నియో ఆర్ట్స్. కె. వెంకటేశ్వరరావు, కొడాలి అనితలు నిర్మాతలు. దర్శకత్వం తమ్మారెడ్డి భరద్వాజ.

భరద్వాజగారిని చూడడం నాకు మొదటిసారి. జోవియల్‌గా ఉన్నారు. వారి నాన్నగారు అప్పటికే ఫేమస్. వారి పేరు తమ్మారెడ్డి కృష్ణమూర్తిగారు. వారి సోదరులు.. అంటే భరద్వాజగారి సోదరులు ‘లెనిన్’ కూడా సినిమా పరిశ్రమలోనే ‘ఎడిటర్’. నేను వెళ్ళేసరికల్లా విద్యాసాగర్ సిద్ధంగా వున్నారు. విద్యాసాగర్‌ని కలవడం కూడా మొదటిసారే. మాంఛి ఉత్సాహవంతుడైన యువకుడు. నవ్వే కళ్ళు. పరిచయాలు అయ్యాకా, “సిచ్యుయేషన్ ఏమిటీ?” అనడిగా.

భరద్వాజ గారు ముసిముసిగా నవ్వి “ఓ లవ్ సాంగ్ రాసుకోండి” అన్నారు. నాకు భలే విచిత్రంగా అనిపించింది. సామాన్యంగా సినిమా ఆఫీసుల్లోనూ, సిటింగ్స్ లోనూ ఓ గంభీరత తాండవమాడుతూ వుంటుంది. ఇక్కడ మాత్రం ఎట్మాస్ఫియర్ మహా జోవియల్‍గా వుంది. కారణం అంతా యంగ్ బ్యాచ్.

కంపోజింగ్‌కి కూర్చుని ట్యూన్ రాసుకున్నా. ఆఫీసులోనే కూర్చుని పల్లవి పూర్తి చేశా.

“మనం వంద గ్రాములడిగితే, ఈయన పది కిలోలు ఇచ్చారు” చందమామ నవ్వినట్టు నవ్వుతూ అన్నారు విద్యాసాగర్ భరద్వాజ గారితో.

మనసు ‘వాక్కు’గా బయటపడడం మనం విద్యాసాగర్ లోనూ, భరద్వాజగారిలోను చూడగలం. మనసులో వున్నది యథాతథంగా మాటల్లో వస్తుంది. దాచుకోవడాలూ, లౌక్యాన్ని ఉపయోగించడాలూ లాంటివి ఏవీ ఉండవు.

ఆనాడు ‘అలజడి’ సినిమాతో ప్రారంభమైన మా స్నేహం ఎన్నెన్నో సినీ మజిలీలు దాటి ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. అందుకే, భరద్వాజ, విద్యాసాగర్‍లతో పరిచయం చేసిన ఆ తొలి పాటంటే ఇష్టం.

పల్లవి:
Love is life – love is knife..
Love is god – love is mad..
He: Say it again my darling. Love.. Love.. Love..
She: Name it anything my darling. Love.. Love.. Love..
అతడు: ప్రేమా – రమ్మంటే రాదు ప్రేమా.. పొమ్మంటే పోదు ప్రేమా
ఆమె: ప్రేమా.. ఉప్పొంగే మనసులోనా.. కవ్వించే తలపు ప్రేమా
అతడు: ప్రేమే ఆరిపోని దీపం.. తీరిపోని దాహం.. పారిపోదులే
ఆమె: ప్రేమే వాడిపోని అందం.. వీడిపోని బంధం.. ఓడిపోదులే..
॥ Say It Again ॥

చరణం 1:
అతడు: చల్లగా మెల్లగా మల్లెలాగ మల్లెలాగ
మెత్తగా గుండెపైన వాలుతుందీ
ఆమె: ఆశలో బాసలో నిండిపోయి నిండిపోయి
వెచ్చగా శ్వాసలోన దాగుతుందీ
అతడు: ఏవో కమ్మని ఊహలల్లీ ఎద మరిపించే ప్రేమ సత్యం
ఆమె: ఏదో తెలియని మత్తు జల్లీ మది మురిపించే ప్రేమ నిత్యం
అతడు: ఆది భావమో అనాది కావ్యమో
ఆమె: ఏది పర్వమో.. మరేది సర్వమో
ఇద్దరూ: అంతులేని వింత రాగమో ॥ ప్రేమా – రమ్మంటే ॥

చరణం 2:
ఆమె: నిప్పులో పెట్టినా మండిపోదు మండిపోదు ప్రేమతో అల్లితే పూలమాల
అతడు: నీటిలో ముంచినా ఆరిపోదు ఆరిపోదు రేగితే గుండెలో ప్రేమ జ్వాల
ఆమె: కాలం వేసిన గాలమైనా.. ఛేదించేదే ప్రేమ నేస్తం
అతడు: మరణిస్తున్నా ప్రేమనిచ్చి.. బ్రతికించేదే ప్రేమ నేస్తం
ఆమె: ఏది గానమో.. మరేది మౌనమో
అతడు: ఏది త్యాగమో.. మరేది యోగమో
ఇద్దరూ: ఏది సూక్ష్మమేది మోక్షమో

~

ఇన్నేళ్ళ తరువాత ఈ పాటని చూసుకున్నా హాయిగానూ, గర్వంగానే వుంది. కారణం అలతి అలతి పాదాలతో అల్లిన పాట. ఆస్వాదించే వారికి ఆస్వాదించేంత అర్థమూ వుంది. ప్రేమ పాటలు ఎన్నో వ్రాశాను, కానీ దీని ప్లేస్ ఎప్పటికీ దీనిదే. కారణం ట్యూన్ పర్‍ఫెక్ట్‌గా లిరిక్‌తో చెట్టాపట్టాలు వేసుకుని సాగటం.

‘అలజడి’లో స్టార్ కాస్ట్ ఎక్కువ. భానుచందర్, రఘు, నరేష్, శుభలేఖ సుధాకర్, రాజేష్, చంద్రకాంత్, గిరిబాబు, జయచిత్ర, ఖుష్బూ, తులసి, కోట శ్రీనివాసరావు.. ఇలా ఎందరో.

‘అలజడి’కీ, ‘శివ’కీ బేస్ జార్జిరెడ్డి కథే గనుక సాపత్యాలు చాలా వుంటాయి. కానీ దేనికదే. ఎవరి టేకింగ్ వారిదే. ఎవరి కాన్సెప్ట్ వారిదే.

‘అలజడి’ మరో విధంగా నేనేనాడు మరిచిపోలేనిది. కారణం మొట్టమొదటిసారి ‘అలజడి’కి డైలాగ్స్ రాసే అవకాశం దొరకటం. ఫస్ట్ సాంగ్ రాసేసిన తరువాత షూటింగ్ మొదలైంది. మాటల రచయిత సంజీవి (తరువాత నాకు మంచి స్నేహితులయ్యారు). ఆయన పరుచూరి బ్రదర్స్‌కి అసిస్టెంట్ అనుకుంటాను. షూటింగ్ ప్రారంభించి (మంచిరోజు కదా అని) ద్వితీయంగా రెండో రోజు కూడా షూటింగ్ చేసి ఆపారు.

ఆ తరువాత భరధ్వాజ గారు నన్ను పిలిచి, కథంతా టూకీగా చెప్పి, డైలాగ్స్ వ్రాయమన్నారు. “ఏం సార్?” అంటే, “చిన్న ప్రాబ్లం వుంది.. మీరు నిరభ్యంతరంగా వ్రాయొచ్చు.. అతి త్వరలో షూటింగ్ మొదలెట్టాలి” అన్నారు. మూడే మూడు రోజుల్లో పగలూ రాత్రీ కూర్చుని 80 సీన్లు రాసి మొత్తం స్క్రిప్ట్ తీసుకెళ్ళి భరధ్వాజ గారికి ఇచ్చాను. అది చూసిన నవభారత్ బాబూరావు గారు నాకు OPEL రెస్టారెంట్‍లో భరధ్వాజ గారితో పాటు డిన్నర్ ఇచ్చి, “మూడు రోజుల్లో పూర్తి చేసినందుకు ఆనందంతో, ఆశ్చర్యంతో..” అన్నారు. నిజానికి ‘అలజడి’తో వారికేమీ సంబంధం లేదు. షూటింగ్ జరుగుతూ ఆగుతూ చాలా కాలం నడిచి పూర్తి చేసుకుంది. ఖుష్బూ ఫస్ట్ పిక్చర్ ఇది తెలుగులో. నేను కూడా ఓ పాత్ర వేశాను, నిడివి ఎక్కువ అవటం వల్ల తరువాత ఎడిటింగ్‌లో తొలగించాం.

ఈ ‘అలజడి’ సినిమా ప్రివ్యూ చూసి, శ్రీ నాగుబాబు గారు  నన్ను పిలిచి, “లిరిక్ రైటర్ గదా మీరు.. అందుకే డైలాగ్స్ మ్యూజికల్‍గా వున్నాయి” అని మెచ్చుకున్నారు.

మరో తీయని జ్ఞాపకం ఏమంటే, తులసిని చూసినప్పుడల్లా నాకు మా అన్నయ్య కూతుళ్ళు జ్ఞాపకం వచ్చేవారు. అందుకే ఆ అమ్మాయి షూటింగ్‌కి వచ్చినప్పుడల్లా ఓ రూపాయి కాయిన్ చేతికిచ్చేవాడ్ని. చాలామంచి పిల్ల తులసి.

మరో విశేషం ఏమంటే, ఈ సినిమాలో ఓ పాటని ‘రేణుక’ అనే కొత్త సింగర్‌తో పాడించటం. దాదాపు ఆరు ఏడు గంటలు పట్టింది.. ఆ అమ్మాయి చేత కరెక్టుగా పాడించడానికి. విద్యాసాగర్‌కి పాపం మెడ పట్టేసి, విపరీతంగా నెప్పితో సతమతమయినా, “ఒకసారి అవకాశం ఇచ్చాక మార్చకూడదు భయ్యా” అని ఆమెతోనే పాట పూర్తి చేశాడు.

‘ప్లీజ్’ అనే ఒక్క పదాన్ని ఎన్నో విధాలుగా, ఎన్నో సందర్భాలలో వాడుతూ అభినయాన్ని గుప్పించవచ్చో కోట శ్రీనివాసరావు గారు ‘అలజడి’లో చూపించారు. ఆయనకి ఏదో ఒక ఊతపదం పెడదామని అనుకుంటుంటే, ‘ప్లీజ్’ అనే పదాన్ని ఆయన అభినయించి మరీ చూపారు. దాంతో ఆ పదం ఫిక్సయ్యింది.

అలాగే, గిరిబాబు గారు భార్య జయచిత్రని నిమిషానికీ పేరు మార్చి పిలుస్తుంటారు. ఆ డైలాగ్స్‌కి స్ఫూర్తి మా పెద్దన్నయ్యగారు. “పులుసే పుల్లీ”, “చారే ఆచారీ”, “కూరే కోమలాంగీ” అంటూ మా వదిన్ని నిమిషానికో పేరుతో పిలిచేవారు. దాన్నే మండోదరీ, తండోదరీ అంటూ రకరకాలుగా గిరిబాబు గారి డైలాగ్స్‌కి వాడాను.

ఇందులో మరో ప్రత్యేకత ఏమిటంటే విద్యాసాగర్ చేసిన సరికొత్త ఎక్స్‌పెరిమెంట్. ఒకే పల్లవిని మూడుసార్లు రిపీట్ చేస్తూ పాట పూర్తి చెయ్యడం. అంటే పల్లవే చరణాలుగా రూపాంతరం చెందుతుందన్న మాట. దానికి ఆద్యుడు విద్యాసాగరే అని అనుకుంటున్నాను, అంతకు ముందెప్పుడూ వినలేదు గనుక. ఆ తరువాత ఎన్నోసార్లు పల్లవి length నే చరణాలకి ప్రయోగించటం జరిగింది.

ఈ పాటలో మరో ప్రత్యేకత ఏమంటే అసలు ఇన్‍స్ట్రుమెంట్స్ (వాద్య పరికరాలు) వాడకపోవడం. కేవలం చిటికెలు.. ఈల.. హ్యుమన్ వాయిస్ లనే BGM (బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్) గా పాటకి ఉపయోగించడం. ఫాలో అప్‌కి మాత్రం ‘క్లిక్ ట్రాక్’ వాడటం జరిగింది. పాట రికార్డయ్యాక, ‘క్లిక్ ట్రాక్’ని కూడా ‘ఇరేజ్’ చేసేశారు.

అటువంటి ప్రయోగాత్మక పాట నేను వ్రాయగలగడం నా అదృష్టం. Don’t Worry Be Happy అని వచ్చిన ఇంగ్లీష్ సాంగ్ లో కేవలం ఆ రెండు పదాల్ని మాత్రం స్ఫూర్తిగా తీసుకోవటం జరిగింది.

అదో స్ఫూర్తినిచ్చే పాట. ఇప్పటికీ ఆ పాట పాడుకుంటూనే వుంటాను. చాలామంది డౌట్ పడ్డారు. అసలు వాద్య పరికరాలు వాడకుండా పాట వస్తుందా, జనానికి నచ్చుతుందా? అని. ఈ పాటకి చాలా మంచి పేరొచ్చింది. చిత్రీకరణ కూడా పాట సక్సెస్‌కి కారణమైంది. ఇదిగో పాట:

పల్లవి:
నేస్తమా.. అనంత యాత్రలో.. ఏకాంత రాత్రిలో నిరాశలో..
శోకమే.. నీ నీడలాగ వెంటనంటి సాగితే.. Don’t Worry Be Happy
కదులుతున్న ఈ క్షణం.. మరలిరాదు ఏ క్షణం
తెలుసుకో క్షణాల మూట జీవితం
ఆశ పొంగినా.. నిరాశ ముంచినా
సాగు ముందుకే నేస్తమా.. Don’t Worry Be Happy

చరణం 1:
నేస్తమా.. ఓ పూలతోటలో.. అద్దాల మేడలో నీవుండగా..
లోకమే.. నిన్ను రెచ్చగొట్టి రచ్చకీడ్చి నవ్వితే.. Don’t Worry Be Happy
లోకందో ఉరవడీ.. మార్చుకోదు నడవడీ
కాటు వేసినా.. కన్నీరు కార్చకూ..
సాగు ముందుకే నేస్తమా.. Don’t Worry Be Happy

చరణం 2:
నేస్తమా.. పదాలు నేర్చుకో.. స్వరాలు కూర్చుకో
పాటందుకో.. పాడుకో..
పథాన్ని మార్చుకో వెలుగు వెంట సాగిపో..
Don’t Worry.. Be Happy.. (R.. R.. R)

~

అప్పటికింకా ‘చిలిపి’ రైటర్ననీ, ‘మాస్’ రైటర్ననీ నాకు ముద్ర పడకపోవడం నా అదృష్టం. అలా ముద్ర పడినందువల్ల నాకేమీ నష్టం జరగలేదు సరికదా, లాభమే కలిగింది. కానీ, మంచి సన్నివేశపరమైన పాటలూ, నీతి, స్ఫూర్తిదాయకమైన పాటలు వ్రాసే అవకాశాలు మాత్రం కొంత తగ్గాయి. పాప్యులర్ సాంగ్స్ కోసమే ఎక్కువగా నాకు ఆఫర్లు వచ్చేవి. అయినా, ఆ రోజుల్లోనే సంగీతం ‘రాగ’ ప్రధానమైన పాటల నుంచి, ‘తాళ’ ప్రధానమైన పాటలకు షిఫ్ట్ కావడం ప్రారంభించింది.

***

‘అలజడి’ పూర్తవడానికి చాలా కాలం పట్టింది. ‘బుక్’ అయిన నటులంతా వేరే సినిమాలలో బిజీ అవటంతో స్క్రిప్టులో ఎప్పటికప్పుడు మార్పులు చేయాల్సొచ్చేది. ఆర్థిక ఇబ్బందులే కారణం. మొత్తానికి సినిమా రిలీజైంది. చాలా బాగా ఆడింది. భానుచందర్, ఖుష్బూ తమిళ్ లోనూ ఫేమస్ గనుక తమిళ్ రైట్సూ బాగా మంచి రేటుకే అమ్ముడయ్యాయని విన్నాను.

‘అలజడి’ నేను డైలాగ్స్ వ్రాసిన ఏకైక సినిమాగా (ఇప్పటి వరకూ) నిలిచిపోయింది. ఆ తరువాత ఒకటి రెండు ఆఫర్లు వచ్చినా నేను ఒప్పుకోలేదు. కారణం సమయాభావం. డైలాగ్ రైటర్ సినిమా అయ్యేంతవరకు యూనిట్‌తో spend చెయ్యక తప్పదు. లిరిక్ రైటర్ సంగతి వేరు. పాటలు పూర్తి చేసి ఇస్తే చాలు. అందుకే నా ప్రాధాన్యత పాతలే ఇచ్చాను.

***

ఇళయరాజా గారు నేనొచ్చేసరికే ‘టాప్ 5’లో వున్నారు. వచ్చాకా స్టడీగా టాప్ లోనే వున్నారు. ఆయన సంగీత దర్శకుడిగా సినిమా ఒప్పుకోగానే బ్రహ్మాండమైన కటౌట్లు, బేనర్లు టి. నగర్ నుంచి సాలిగ్రామం దాకా, దినపత్రికల నుంచి వార, పక్ష, మాస పత్రికల దాకా ఎగబాకేవి. అన్నదమ్ములు ‘పావలర్ బ్రదర్స్’గా ప్రసిద్ధులు. సినిమాల్లో బిజీ కాకముందు ఇళయరాజా గారు బాలూ (SPB) గారి ట్రూప్‌లో మ్యుజీషియన్‌గా కూడా పనిచేసేవారు. జి. కె. వెంకటేష్ గారి వద్ద కూడా వారు పనిచేశారు. తరువాత బిజీ అయ్యాకా ప్రతీ రికార్డింగ్‌కీ జి.కె. వెంకటేష్ గారిని పిలిపించి గౌరవించేవారు.. గురు ఋణం తీర్చుకోవడానికి.

వారితో ఎన్నో సినిమాలు నేను చేసినా, నేను వారి సంగీత దర్శకత్వంలో పనిచేసిన మొదటి సినిమా ‘ఇదేం పెళ్ళాం బాబోయ్’. ఈ సినిమాకి దర్శకులు శ్రీ కాట్రగడ్డ రవితేజ. రవితేజ గారు బాపినీడు గారి దగ్గర ఒకప్పుడు పనిచేసినవారు కావడంతో, మేం అతి తక్కువ సమయంలోనే మంచి స్నేహితులమయ్యాం. ‘ఇదేం పెళ్ళాం బాబోయ్’ సినిమా ఓ తమిళ సినిమాకి రీప్రొడక్షన్. ‘కృష్ణన్ పంజూ’ గారిలో పంజు అరుణాచలం గారు ఈ సినిమా నిర్మాత. సినిమాలో పాటలన్నీ ఒరిజినల్ తమిళ బాణీలే. తెలుగులో మాత్రం తమిళ మీనింగ్ కావాలని ఇబ్బంది పెట్టకుండా సర్వస్వతంత్రాన్ని ఇచ్చారు రవితేజ గారు.

ఈ సినిమాకి డబ్బింగ్ టైమ్ లోనే నేను ‘రాధిక’ గారిని మొదటిసారి చూశాను. ఆవిడ పాత్రకి ఆవిడ చేతే రవితేజ గారు దగ్గరుండి మరీ డబ్బింగ్ చెప్పించినట్టు జ్ఞాపకం. ఆ సినిమాకి కూడా డైలాగ్స్ కాశీ విశ్వనాథ్ గారే కావడంతో, బాపినీడు గారి సినిమాకి పనిచేసినట్లే, ఆడుతూ పాడుతూ పనిచేశాను. ఆడియో ‘కొత్త పెళ్ళికూతురా రా! రా!’ పేరుతో విడుదలై, సినిమా ‘ఇదేం పెళ్ళాం బాబోయ్’ గా విడుదల కావడంతో ఆడియో కన్‌ఫ్యూజన్ ఏర్పడి, పాటలు జనాల్లోకి వెళ్ళలేకపోయాయి. కానీ, అద్భుతమైన ట్యూన్‍లిచ్చారు ఇళయారాజా. లిరిక్స్ చూడా చాలా చాలా చక్కగా సన్నివేశాలకి అనుగుణంగా అమిరాయి.

చిత్రం ఏమిటంటే ఈ చిత్రానికి పాటలన్నీ నేనే వ్రాసినా, ఒక్కసారి కూడా ఇళయరాజా గార్ని చూసే/కలిసే అవకాశం దొరకలేదు. ట్రాక్స్ తెచ్చి పాడించారు. మొత్తం నాలుగు పాటల్లో చిత్ర రెండు సోలో పాటలు, ఒక డ్యూయెట్టు పాడితే, మనో (నాగూర్‌బాబు) ఓ సోలో, చిత్రతో ఓ డ్యూయెట్టూ పాడారు.

చిత్రగారు నా పాటలు పాడటం ఈ చిత్రం తోనే మొదలై.. కొన్ని వందల పాటలకు ఆ తరువాత తన గాత్రమిచ్చారు. రాజా ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్ మీద నిర్మితమైన ఈ చిత్రంలో నాకు చాలా చాలా ఇష్టమైన పాట ఒకటుంది. అదేంటంటే –

(చిత్రగారి సోలో సాంగ్)

~

పల్లవి:
చేమంతి పూవులు తట్టీ
సంపెగల వాసన పట్టీ
ఆకాశపు అంచులు చుట్టీ
పక్షులతో నేస్తం కట్టీ
వీచేటి చల్లని ఓ చిరుగాలీ.. నాలో
రేపొద్దే ఏదో తెలియని హాయీ..
వీచేటి చల్లని ఓ చిరుగాలీ.. నాలో
రేపొద్దే ఏదో తెలియని హా.. యీ..

చరణం 1:
నెరవెన్నెల కురిసే వేళా ఎవరో వస్తారూ
నా రాణివి నీవేనంటూ మనసే ఇస్తారూ
పాలరాయి వంటి నన్ను శిల్పంగా మలిచేరూ
అమరశిల్పి జక్కన లాగా.. అందాలే పొదిగేరూ
సిరిమల్లెల పందిరికింద..
చిరుసిగ్గుల మొగ్గను నేనై..
మెలమెల్లగ దాపున చేరీ.. తనదాన్నై హత్తుకుపోతా..
అందాకా చిలిపీ.. చిరుగాలీ.. నను తాకొద్దే..
నా ఒడిలో చేరీ.. పరిహాసం.. ఇక ఆడొద్దే.. ॥చామంతి॥

చరణం 2:
కనురెప్పల చాటున దాగీ కలలే పండిస్తా
తడియారని నా పెదవులతో సుధలే అందిస్తా
నులి వెచ్చని శ్వాసలలోనా
బాసలు కదలాడేనే..
పురివిప్పిన నా హృదయం..
నవ గీతం పాడేనే..
పరువాల హారతులిచ్చీ.. నా రాజును పూజిస్తానే
నా వలపుల ఊయలలోనా.. అనుక్షణమూ ఊగిస్తానే
ఆ సమయం చూసీ.. చిరుగాలీ.. నన్ను తాకొద్దే
నీ రెక్కలు దూసీ.. పరిహాసం.. మరి ఆడొద్దే.. ॥చామంతి॥

~

నాకు చాలా చాలా ఇష్టమైన పాట ఇది. చిత్ర గారి గొంతులోని లేతదనం, చిలిపిదనం, ఈ పాటకి ప్రాణం పోశాయి. పాట పాడటం అయ్యాకా, పదిసార్లు విని ఆనందించాం. MVVS బాబూరావు గారికి ఈ పాట వినిపిస్తే – “అబ్బే.. ఇలా రాస్తే మీకు జంటిల్‌మేన్ రైటరని పేరొస్తుంది తప్ప కాసులు రాలవు. మాంఛి మసాలా దట్టించడం నేర్చుకోకపోతే ఎలా?” అని కేకలేసి, ఆ తరువాత గట్టిగా కౌగిలించుకుని, “ఎంత బాగుందీ పాట.. వినగానే మనసులో ఓ భావచిత్రం కదలాడింది” అని భుజం తట్టారు. ఆయన కూడా మా బాపినీడుగారిలా చాలా ఎమోషనల్.

(ఇంకా ఉంది)

Exit mobile version