[ప్రముఖ కథా, నవలా, సినీగీత రచయిత, శ్రీ భువనచంద్ర తమ సినీ జీవన ప్రస్థానాన్ని ‘జీవితం ఓ ప్రయాణం’ అనే పేరుతో సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు.]
~
మలర్కోడి మేన్షన్ 1987, 88, 89, 90 బిగినింగ్ వరకూ నాకు నీడనిచ్చింది. తెర మీద వెలిగే పేరునిచ్చింది. బ్రతకడానికి సరిపోయే డబ్బునీ ఇచ్చింది. ఇక్కడో మాట చెప్పాలి. ఓ ‘హిట్’ రాగానే రెమ్యునరేషన్ పెంచుకోవాలనే అత్యాశకి నేను పోలేదు. పాటలిమ్మనీ ఎవరినీ అడగలేదు. ఎవరికి పాట వ్రాసినా, ముందు పాట రాసి ఇచ్చి వారిచ్చినంత తీసుకునేవాడినే కానీ ఏనాడూ ‘అడ్వాన్స్’ అనే మాట కూడా ఎత్తేవాడ్ని కాదు. ఖాళీ సమయాల్లో డాక్టరు గారి దగ్గర కూర్చోవడమో, పుస్తకాలు చదువుకోడమో చేసేవాడిని. సాయంత్రమైతే చాలు.. అందరం చెట్టు కింద చేరేవాళ్ళం. ప్రతి శుక్రవారం జిజ్జీ (జలంధర) గారు పులిహోర పొట్లాలు తెచ్చి అందరికీ ఇచ్చేవారు. జయగారు, ‘రుతి’ అనబడే రీటా, రబ్బీ, కొందరు అసిస్టెంట్, అసోసియేట్ డైరక్టర్లు, డబ్బింగ్ ఆర్టిస్టులూ అందరూ తమ తమ ఖాళీ సమయాన్ని బట్టి వచ్చేవారు.
తెలుగువారి మరో అడ్డా రాణీ బుక్ సెంటర్. త్రిపురనేని వారమ్మాయి చౌదరాణీ గారు అక్కడుండేవారు. ఏ బుక్కు కావల్సి వచ్చినా వారినడిగితే తెప్పించి మరీ ఇచ్చేవారు. అక్కడా సాహిత్య చర్చలు జరిగేవి. మన హరికృష్ణ (ఎన్.టి.ఆర్.గారి అబ్బాయి కాదు), ఇంకా చాలామంది అక్కడ చేరి సాయంత్రాలు సాహిత్యంతో సద్వినియోగం చేసేవారు.
ఆంధ్రా కిళ్ళీ షాపు, ఆంధ్రా మెస్సూ వుండనే వున్నాయి. జేబులో డబ్బులు తక్కువుంటే, టి.నగర్ పోస్టాఫీసు ముందర తోపుడు బళ్ళ మీద ‘అణా’ ఇడ్లీలు వేడి వేడిగా అమ్మేవారు. ఓ అర్ధరూపాయతో డిన్నర్ అయిపోయేది.
పాండీ బజార్ మాకు హాలీవుడ్ లాంటిది. ప్రతి చెట్టూ లక్ష కథలు చెప్పగలదు.. మాటలే గనుక వస్తే. అడుగడుగునా కోట్లాది కలల పత్రలే.. అవి చెట్ల నుంచి రాలిన ఆకులు కావు. ఆశనిరాశలు, సుఖదుఃఖాలూ, నవ్వులూ, కన్నీళ్ళు సమపాళ్ళలో అక్కడ కలిసిపోయేవి. నాటి మహానటులందరూ పాండీ బజార్లో నడిచినవారే. గీతా కేఫ్, బాలాజీ భవన్, నారాయణ కేఫ్, కైఠారీ, నల్లి సిల్క్, ఉమ్మిడియార్స్, ఉడ్‌ల్యాండ్స్ ఇవన్నీ నా జ్ఞాపకాలలో ఇంకా పదిలంగానే వున్నాయి. కలల్ని పండించుకున్నవారూ ఉన్నారు.. కన్నీటిలో మునిగినవారూ వున్నారు. కాలమే అన్నిటికీ సాక్షి.
మరో సినిమా మొదలైంది.. సినిమా పేరు ‘నేటి దౌర్జన్యం’. జగపతి మూవీ క్రియేషన్స్ చలసాని వెంకటేశ్వరరావు గారు నిర్మాత. విజయవాడ రైల్వేస్టేషన్ దగ్గరున్న ఆ రోజుల్లో ఫేమస్ హోటల్ జగపతి ఇంటర్నేషనల్ చలసాని వెంకటేశ్వరరావు గారిదే. ఓసారి నేనూ అందులోనే దిగాను. ఆత్రేయ గారు కూడా ఆ రోజున అక్కడే దిగారు.
దర్శకత్వం తమ్మారెడ్డి భరద్వాజ గారు. వారితో ఇది నాకు రెండో సినిమా. ఆ తరువాత ఎన్నో సినిమాలు చేశాను. జయగారు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్. సంగీతం చక్రవర్తి గారు. చక్రవర్తి గారితో ఇది నాకు మూడో సినిమా. మొదటిది ‘ఆత్మకథ’, రెండోది ‘అత్తకు యముడు – అమ్మాయికి మొగుడు’, మూడోది ‘నేటి దౌర్జన్యం’.
ఎవిఎమ్ స్టూడియోలో ఎ.వి. మెయ్యప్పన్ గారి ప్రైవేటు కాటేజీ చక్రవర్తి గారి కంపోజింగ్ రూమ్ అయింది. అసంఖ్యాక శిష్యవర్గం చక్రవర్తి గారిది. వారిలో కృష్ణ-చక్ర, రాజ్-కోటి, కీరవాణి, వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకులుగా ఎంతో ఎత్తుకు ఎదిగి తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేశారు.
‘నేటి దౌర్జన్యం’ పాటలన్నీ కంపోజ్ అయింది ఆ కాటేజ్ లోనే. ఆల్మోస్ట్ అన్ని పాటలు అక్కడ కూర్చునే నేను పూర్తి చేశాను.
వినోద్ కుమార్, భానుచందర్, వాణీ విశ్వనాథ్, నిర్మలమ్మ మెయిన్ ఆర్టిస్టులు. నిర్మలమ్మ మళ్ళీ అద్భుతంగా నటించారు. చక్రవర్తి గారు ఓ విధంగా మెలొడీ కింగ్. మ్యూజిక్ ఆయన నేర్చుకోలేదు. సహజంగా అబ్బిన విద్య. అందుకే ఆయన బాణీలు విశిష్టంగా ఉంటాయి.
ఈ సినిమాలో మూడు పాటలు రాస్తే అందులో రెండు ప్యూర్ మెలొడీలు. నిర్మలమ్మ ఓ అనాథాశ్రమం నడుపుతూ వుంటుంది. స్థలం మీద కన్నేసిన రౌడీ గ్యాంగ్ ఆమెని హత్య చేస్తారు. అనాథ పిల్లలు ఆకలితో అలమటిస్తుండగా అక్కడే ఒకప్పుడు పెరిగిన హీరోయిన్ వాణీ విశ్వనాథ్ పరుగున ఆశ్రమానికి వస్తుంది. అభం శుభం తెలీని పిల్లలు “అక్కా, ఆకలి..” అంటూ ఆమె కాళ్ళని చుట్టుకుపోతారు. హీరోయిన్ చేతిలో పైసా లేదు. ఏమీ చెయ్యలేక భోరున ఏడుస్తుంటే, ఆకలి తీర్చమని ఏడ్చిన ఆ పసికూనలే, “అక్కా, మా ఆకలి ఎగిరిపోయింది, ఏడవకు” అంటూ ఓదారుస్తారు.
ఈ సన్నివేశానికే పాట వ్రాయాలి. సన్నివేశం వివరించగానే కళ్ళు చెమ్మగిల్లాయి. కాటేజ్ ముందున్న మెట్ల మీద సైలెంటుగా కాసేపు కూర్చుని ఆ తరువాత పాట వ్రాశాను. ఎస్. పి. బాలుగారు, ఎస్.పి.శైలజ ఈ పాట పాడారు.
♦
పల్లవి:
వెండి మబ్బు నీడలో.. వెన్నెలమ్మ మేడలో
చల్లంగా దాగిందా జాబిలీ.. మా ఇంటిలో..
మనసు చెదిరి మౌనంగా నిలిచిందీ జాబిలీ
నిదురమ్మా తెరిచింది వాకిలీ.. నిదుర
పోయిందమ్మా మా ఆకలి (R) ॥నిదుర॥
చరణం 1:
ఆకలికి నిదురే లేదూ.. నిదురపోతే ఆకలి కాదూ
పురిటి శిశువు కాకలి.. మూగ పశువు కాకలి
అణువణువున మెలి తిరిగే సుడిగాలి ఆకలీ..
అందుకే
ఆకలికే ఆకలేసి బాధ మరచిపోవగా..
నిదురమ్మా తెరిచిందీ వాలిలీ.. మన
కన్నీట కరిగిందీ ఆకలీ (R) ॥నిదుర॥
చరణం 2:
బాధకు భేదమే లేదూ.. భయపడితే బాధలు పోవూ..
కలత లెదురు వచ్చినా.. కుమిలిపోక నిలబడూ
తల వొంచకు.. తల దించకు. భూ లోక రీతికీ
నేస్తమా..
ఉదయించే సూర్యునిలా ఉత్సాహం నింపుకో
ఆ తూరుపు తెరిచిందీ వాకిలీ.. ఇక
చిరునవ్వులు నవ్వాలి నా చెలీ ॥నిదుర॥
♦
వందకోట్లు సంపాయిస్తే వచ్చే ఆనందం కన్నా ఒక్క మంచి పాట వ్రాయడంలో వచ్చే ఆనందం వెయ్యి రెట్లు గొప్పది. మరో రెండు పాటలు వ్రాయాలి. ట్యూన్లు సిద్ధంగా వున్నాయి. అయినా, “సార్.. ఇవాళ ఈ పాటని నన్ను ఆస్వాదించనివ్వండి. మిగతా పాటలు రేపు రాస్తా” అన్నాను. చక్రవర్తి గారు లిరిక్ చదివి.. “చాలా ఎత్తుకు ఎదుగుతావు అబ్బాయ్” అని మనసారా దీవించారు. భరద్వాజ గారూ భుజం తట్టారు.
(‘వెండి మబ్బు నీడలో..’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=T-QPIY1hCOo)
రెండో మెలొడీ ‘చెలీ.. పలుకవా.. కల తెలుపవా..’ అనే పాట డ్యూయెట్. చల్లగా సాగిపోయే పాట అది. మూడోది ఫక్తు మాస్ సాంగ్. నేటి దౌర్జన్యంలో నిర్మలమ్మ గారి సీన్లన్నీ ఇంకా నా మనసులో పచ్చిగానే ఉన్నాయి. అలజడిలో భానుచందర్ గారితో చేశాను గనుక ఆ పరిచయం మరికొంత ముందుకు సాగింది.
ఇంతకు ముందు చెప్పినట్టుగా, ఎస్.పి.శైలజ గారినీ, వసంత గారినీ కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ వెంపటి సత్యం గారి దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి వచ్చినప్పుదు చూసేవాడ్ని. సాగర సంగమంలో ఎస్.పి. శైలజ అద్భుతంగా యాక్ట్ చేసింది. ఆ సినిమా చాలాసార్లు చూశాను. ఆమె మొదట పాడిన సినిమా ‘మార్పు’ అనుకుంటా, యు. విశ్వేశ్వర రావు గారి సినిమా అది.
ఆమె చేత ‘వెండి మబ్బు నీడలో’ పాట పాడించడం నాకెంతో ఆనందం కలిగించింది. అలాగే ఎస్.పి.శైలజ, శుభలేఖ సుధాకర్ల పెళ్ళికి కూడా వెళ్లాను. డా. గోపాలకృష్ణగారు నా చేత ఓ ‘సాలగ్రామం’ బహుమతిగా పంపారు. చాలా సౌమ్యురాలు. ఏనాడూ మాట తూలని వ్యక్తిత్వం. అంతులేని ఆధ్యాత్మికత ఆమె సొంతం. బిజీగా వుండే సినీ ప్రపంచంలొ ఆమెలా అతి జాగ్రత్తగా సంపూర్ణ ‘ధ్యాస’తో బిడ్డల్ని పెంచిన తల్లులు అతి అరుదు. శైలజ గారు పాడిన ‘నాంపల్లి టేసను కాడా’ పాట అప్పటికీ ఇప్పటికీ హిట్ సాంగే. అసామాన్యమైన పరిశ్రమలో ఉంటూ అతి సామాన్యురాలిగా మెలగడం శైలజగారికే సాధ్యమేమో.. అదీ – ఓ లెజెండ్ మాత్రమే కాక, సంగీత సరస్వతీ వరపుత్రుడిగా వెలుగుతున్న ఎస్.పి.బి.గారి చెల్లెలుగా!
ఈ పేజీ వరకు నా పాటలు ఎన్నో పాడిన ఎస్.పి.బి.గారి గురించి మాత్రం రాసే ధైర్యం నేను చేయలేదు. కారణం, వారో హిమాలయం. ఆ హిమాలయాన్ని అతి దగ్గర నించి చూసే అవకాశం నాకు ఎక్కువ సార్లు కలగలేదు. ఎన్నో వందల పాటలు (నావి) పాడారు. కానీ అవి స్టూడియోల వరకే మిగిలిన అనుభవాలు. నిజం చెబితే ఇప్పటికీ నన్ను నేను వారికి ఆత్మీయుడినని భావించలేను. ఓ భక్తుడినో.. పూజారినో.. అంతే.
***
లైబ్రరీలో పుస్తకాలన్నీ ఓ క్రమ పద్ధతిలో ఉంటాయి. కారణం, లెబ్రేరియన్ వాటిని ఆల్ఫాబెటికల్ పద్థతిలో పేరుస్తాడు. అదీ, రైటర్స్నీ, వారి పుస్తకాలనీ.
కానీ మనో గ్రంథాలయంలో వరుస క్రమం వుండదు. ‘గాఢత’ని బట్టి తప్ప. హీరో కృష్ణ గారి గురించి తలచుకున్నప్పుడల్లా నా మనసు నా చిన్నతనంలోకి వెళ్ళిపోతుంది. నా చిన్ననాటి స్నేహితుడు (ఇప్పటికీ) నల్లమూరి పాండురంగమూర్తి (N.P.R.M)ని గుర్తుకు తెస్తుంది.
మేం థర్డ్ ఫాం చదివి, పరీక్షలు రాసి, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న రోజుల్లో, ‘తేనెమనసులు’ ఏలూరులో రిలీజైంది. రంగా (NPRM) గాడు తిరువూరి నించి కేవలం సైకిల్ మీద చింతలపూడికి వచ్చాడు. మేమిద్దరం చదివేది చింతలపూడి హైస్కూల్లోనే. వాళ్ళ నాన్నగారికి తిరువూరు ట్రాన్స్ఫర్ అయితే, శలవలకి అక్కడికి వెళ్ళాడన్నమాట.
సరే. చింతలపూడి ఆశ్రమం (శ్రీ విశ్వనాథాశ్రమం) మాకు బడీ, గుడీ కూడా. వాడు నా దగ్గరికొచ్చి, “ఒరేయ్, నేను ఏలూరు వెళ్తున్నానురా సైకిల్ మీద. రాగలిగే దమ్ము నీకుందా” అన్నాడు. ‘దమ్ము’ అనే మాట పల్లెటూరోళ్ళ మాట. ఆ మాట అన్నాక వెనక్కి తగ్గటం అంటే ఆజన్మాంతం ఓడిపోవడం లాంటిది. అందుకే, “దమ్మా? దాని పేరే రాజు రా!” అని భీకరంగా నేనన్నాను. “అయితే పద, నీ సైకిల్ నీదే!” అన్నాడు.
ఇంట్లో ఈ విషయం చెబితే చితకదంతారు. అందుకే చెప్పకుండా, ‘బాజీగారి’ సైకిల్ షాపులో సైకిలొకటి అద్దెకి తీసుకుని సాయంత్రం 4 గంటలకి బయలుదేరాము. నాకు 5వ తరగతిలోనే సైకిల్ నేర్పిన ఘనత నిజంగా మా రెండో బావగారైన గోపరాజు కృష్ణంరాజు గారికి దక్కుతుంది.
ఏలూరు వెళ్ళడానికి (30 మైళ్ళు) నాలుగు గంటలు నాకు పట్టింది. చీకట్లో (సిటీలో లాగా పల్లెటూరి రోడ్లకి దీపస్తంబాలో, ఎలెక్ట్రిక్ లైట్లో వుండవు కదా) సైకిల్ తొక్కడానికి చాలా భయం వేసింది. రంగా గాడు నాకంటే కొంచెం పెద్దాడు. వాడికి హనుమంతుడంటే ప్రాణం. నాకు ‘హనుమాన్ చాలీసా’ నేర్పింది వాడే. సో.. జాలీగా ఏలూరు చేరాము. మా పెద్దమ్మ కూతురి ఇంట్లో అవ్వాళ రాత్రి బస చేశాం. ఆవిడ పేరు దామరాజు శకుంతల. పేద్ద అరుగులూ, మెట్లూ వుండే ఇల్లు. పిన్ని కొడుకును గనుక ప్రేమగా నన్ను ఆదరించిందింది. మా బావా ప్రేమగా మాట్లాడాడు.
మరుసటి రోజు ఉదయం షో ‘రాజమకుటం’, మేట్నీ షో ‘తేనెమనసులు’ చూసి చింతలపూడి బయలుదేరాం. ధర్మాజీగూడేం సమీపంలో, రోడ్డు గతుకులకి ఎగిరిపడ్డాను సైకిల్ మీంచి. ఇంత లావున కాలు వాచింది. ఏడిచా. మొత్తానికి మళ్ళీ ధైర్యం కూడగట్టుకుని నడుస్తూ ధర్మాజీగూడెం చేరాం. రాత్రి చాలా సమయం అంటే తొమ్మిది దాటింది. ఓ హోటల్ వాడ్ని రిక్వెస్టు చేసి పంచలో పడుకున్నాం. చలికి, ఈత చాపలు కప్పుకోవడంలో ముళ్ళు గుచ్చాయి. దేవుడి దయవల్ల మరుసటి రోజు పంక్చర్ వేయించుకుని చింతలపూడి బయలుదేరాం. అఫ్కోర్స్.. మాకు జరగవలసిన సన్మానం జరిగింది. అది వేరే విషయం అనుకోండి..! కృష్ణ గారి పిక్చర్ చూడటం అలా జరిగింది. ఆయనకే పాట వ్రాయడం 88లో ‘మహారాజశ్రీ మాయగాడు’ సినిమాలో జరిగింది. ఎంత అద్భుతం!! ఆ సినిమా హీరోయిన్ శ్రీదేవి. డైరక్టర్ విజయబాపినీడు గారు. సంగీతం రాజ్-కోటి. ఆ షూటింగ్ ‘ఫిషర్మెన్ కోల్’లో జరిగింది. ఆ హోటల్ కోవళం బీచ్‌లో ఉంది. ఆ సినిమాలోనే ‘సత్యభామలా’ అనే పాట నా అభిమాన హీరో కృష్ణగారికి వ్రాయడం నిజంగా ఓ మధురమైన క్షణ సమూహం. నేను సైకిల్ తొక్కుతూ ఏలూరు వెళ్ళిన విషయం (కృష్ణ గారు చదివింది కూడా ఏలూరు కాలేజీలోనే) ఆనాడు, అంటే మహారాజశ్రీ మాయగాడు సమయంలో చెప్పలేకపోయినా, ‘పచ్చని సంసారం’ నూర్రోజుల పండగలో చెప్పాను.
అయ్యా, ‘దానే దానే పే లిఖా హై ఖానేవాలా కా నామ్’ లాగా, ‘గానే గనే పే లిఖా హై లిఖ్నేవాలేకా నామ్’ అనేది ముమ్మాటికి నిజం.
శ్రీదేవినే కాదు, నేను ఎయిర్‌ఫోర్స్‌లో వుండగా పరిచయమైన మంజుల గార్నీ, వారి కుమార్తె శ్రీదేవినీ కూడా నేను చూశాను.. ఫిషర్మెన్ కోల్ ఇంటర్నేషనల్ హోటల్లో. బాడీ టోనింగ్‌కి బోలెడుమంది ఫారినర్స్ అక్కడ వున్నారు.. షూటింగ్ జరిగేటప్పుడు. అక్కడ షూట్ అయిన పాట నేను రాసినది కాదు. అయినా, బాపినీడు గారు నన్ను తీసుకువెళ్ళడం ఆయన ఆప్యాయతకి నిదర్శనం. బాపినీడుగారిది కూడా ఏలూరు దగ్గరున్న చాటపర్రు గ్రామమే. ఏలూరికి 30 మైళ్ళ దూరంలో వున్నది చింతలపూడి. ఎల్.వి. ప్రసాద్ గారూ, బాపినీడు గారూ, మురళీమోహన్ గారూ ఇలా ఎందరో సినిమాల్లోకి వచ్చింది వెస్ట్ గోదావరి నుంచే. మాకు గోదావరి లేదు, కానీ తమ్మిలేరు వుంది. ఒకటి మాత్రం నిజం. మా బతుకులన్నీ ‘మెహమాన్ జో హమారా హోతా హైఁ, ఓ జాన్ సే ప్యారా హోతా హై’ లాంటివే. ఎదుటివారిని ఆదరిస్తాం.. గౌరవిస్తాం. అదే ప్రిన్సిపుల్.
***
ముఖ్యమైన విషయం ఏంటంటే, ‘ఫిషర్మెన్ కోల్’లోనే బ్రహ్మానందం గారితో కొద్ది నిమిషాలు గడిపాను. బ్రహ్మానందం గారు బాపినీడుగారి ఆఫీసులోనే ‘నటించి’ చూపినప్పుడు అక్కడే నేనున్నాను. తరువాత షూటింగ్లో ఆయన ‘టాలెంట్’ చూశాను. ఒక్కటి మాత్రం నిజం.. నవ్వించాలంటే పూర్వజన్మ సుకృతం వుండాలి. అది నిండుగా బ్రహ్మానందం గారికి వుంది. నేను పాటలు వ్రాసిన ఎన్నో సినిమాల్లో ఆయన యాక్ట్ చేశారు. వారింట్లోనే (హైదరాబాద్‌లో) ఒకటో రెండో రోజులు (గెస్ట్ హౌస్‌లో) వున్నాను. ఆయన ఎంత ఎత్తుకి ఎదిగారంటే, మరొకరు తేరిపార చూడలేనంతగా. కళ అనేది భగవంతుడిచ్చే వరం. ఆ వరానికి ‘స్వయంకృషి’ తోడయితే, ‘ఋషు’లవుతారు. బ్రహ్మానందం గారు కూడా ఓ ఋషితుల్యుడే.. కృషిలో.
ఆనాటి (మహారాజశ్రీ మాయగాడు) షూటింగ్‌కి వచ్చిన చిన్నపిల్ల శ్రీదేవికి, ఆమె తొలి సినిమాకే నేను పాట వ్రాస్తానని నేను ఊహించను కూడా లేదు. కానీ జరిగింది అదే. చాలా ఏళ్ళ తరువాత ‘ప్రేమదేశం’ కదిర్ గారి డైరక్షన్లో వచ్చిన ‘లవ్ వైరస్’లో అన్ని పాటలు నేనే రాశాను. ఆ సినిమా హీరోయిన్ మంజులా విజయ్‌కుమార్ గారి చిన్న కూతురు శ్రీదేవే.
రెండో విషయం ఏమంటే, రెండున్నర దశాబ్దాల ముందు ‘తేనెమనసులు’లో కృష్ణగారెలా వున్నారో, మహారాజశ్రీ మాయగాడులో కూడా అలానే ఉన్నారు. No Change. బహుశా కొందరి మీద కాలం తన ప్రభావం చూపించదేమో. కృష్ణగారు వారిలో ఒకరు. అదే సింప్లిసిటీ.. అదే ఆప్యాయత.. అదే ఉత్సాహం.. అదే నిర్మలత్వం.. అదే నిర్మొహమాటం.
(ఇంకా ఉంది)
భువన చంద్ర సుప్రసిద్ధ సినీ గేయ రచయిత. కథకులు. పలు హిట్ పాటలు రచించారు. “భువనచంద్ర కథలు”, “వాళ్ళు”, “మహతి”, “పాండిబజార్ కథలు” అనే పుస్తకాలు వెలువరించారు.
