Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవితం ఓ ప్రయాణం-14

[ప్రముఖ కథా, నవలా, సినీగీత రచయిత, శ్రీ భువనచంద్ర తమ సినీ జీవన ప్రస్థానాన్ని ‘జీవితం ఓ ప్రయాణం’ అనే పేరుతో సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు.]

~

అదే అదే మళ్ళీ మళ్ళీ:

‘రాముడు భీముడు’ కథ ఏ క్షణంలో పుట్టిందో గానీ, దాని వెనకే బోలెడు కవలలు తెర మీదకొచ్చారు. వీడి బాటలో వాడు వాడి బాటలో వీడు. రాముడు-భీముడు, రామ్ ఔర్ శ్యామ్, సీతా ఔర్ గీతా, చాల్ బాజ్, గీతా మేరా నామ్, మేరా సాయా, శివ-శక్తి ఇలా. అన్నట్టు గంగ మంగ, అదుర్స్  ఇలా వెండి తెరని కప్పేశాయి.

నేను రాసింది మాత్రం ‘శివ-శక్తి’కి. నరేష్ ప్రధాన పాత్రధారి. ‘లిజీ’ హీరోయిన్. డైరెక్టర్ మా భారద్వాజ గారు. మ్యూజిక్ రాజ్ కోటి.. నిర్మాత భావనారాయణగారు. అన్ని పాటలు రికార్డయిందీ విజయా గార్డెన్స్ లోనే. రాజ్–కోటి గార్ల కంపోజింగ్ రూమ్ అక్కడే వుండేది. వారి కంపోజింగ్ రూమ్‌కి ఇవతలి గదిని వేటూరిగారు ఉపయోగించుకునేవారు. నేను వరండాలో ఉన్న టిఫిన్ టేబుల్‌ని వ్రాత బల్లగా ఉపయోగించుకుని ట్యూన్లతో కుస్తీ పట్టేవాడ్ని. వేటూరి గారు కనపడినప్పుడల్లా లేచి నిలబడి విష్ చేసేవాడ్ని.

ఒక్కోసారి ఒకే చోట కూర్చోవడం విసుగు పుడితే, హాయిగా, ‘గార్డెన్స్’లో తిరుగుతూ బుర్రకి పని పెట్టేవాడ్ని. మరి పింగళి, ఆత్రేయ, ఆరుద్ర, సముద్రాల, సి.నా.రె, కృష్ణశాస్త్రి, మల్లాదివారు, కృష్ణశాస్త్రిగారు, మైలవరపు గోపి ఇలా ఎంత మంది మహానుభావులు అక్కడ తిరుగాడారో. శ్రీశ్రీ గారి సంగతి చెప్పక్కర్లేదు. ఆయన పాదముద్ర పడని స్టూడియో ఏది వుంది? చిత్రం ఏమంటే ఈ సినిమాలో అన్ని పాటలూ నేనే వ్రాసినా, కేసెట్ మాత్రం నా దగ్గర లేదు. ఈ మధ్యనే ‘నెట్’ లోంచి డౌన్ లోడ్ చేసుకున్నాను. నేను వ్రాసిన song పేపర్లు కూడా నా దగ్గర లేవు. గూగులమ్మకి ధన్యవాదాలు.

అయిదు పాటలున్నాయి ఇందులో. 1. లంబోదర లకుమికరా 2. ప్రేమంటే అదో సుఖం. 3. నక్కి నక్కి జారుకోకే 4. చెట్టూ – నదిగట్టూ 5. అయ్యో సారంగుడో.

అప్పటికి విజయ గార్డెన్స్ విజయ గార్డెన్స్ లానే వుంది. విజయా హెల్త్ సెంటర్‌గా మార్పు చెందలేదు. ఓ పక్క రికార్డింగులు, మరో పక్క షూటింగ్ లతో విజయ గార్డెన్స్ సందడిగా, హడావిడిగా వుండేది. ఇప్పుడూ వుంది. కానీ, ఆ ‘మెరుపు’ యీనాడు కనిపించదు.

రౌడీ అల్లుడు:

ఇది సాయిరాం ఆర్ట్స్ బేనర్ మీద డా. కె. వెంకటేశ్వరరావు గారు నిర్మించిన చిత్రం. దర్శకత్వం రాఘవేంద్రరావు గారు. వారి గురించి ఎంతో విన్నాను. కానీ చూడడం + పరిచయం చేసుకోవడం + వారి దర్శకత్వంలో పాట వ్రాయడం ఇదే మొదటిసారి.

మ్యూజిక్ సిటింగ్ బాంబే బప్పీలహరి గారి ఇంట్లో జరిగింది. సమన్వయకర్తగా వున్నది ‘ముఖేష్’గారు. ‘రాకేష్’ అనే ప్రొడక్షన్ మేనేజరు నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఈసారి నేను దిగింది ‘సీ ప్రిన్సెస్’ హోటల్ లోనే. వెళ్ళిన రోజు సాయంత్రం బీచ్ అంతా కలయదిరిగాను. రూమ్‍కి వచ్చేసరికి అల్లు అరవింద్ గారూ, ఏదో పని మీద బాంబే వచ్చిన పినిశెట్టి రవిరాజాగారూ వున్నారు.

రాత్రి 11.30 దాటాకే సిటింగ్ ప్రారంభమైంది. బాంబే నైట్ సిటీ. ఉద్యోగస్థులు, విద్యార్ధులు తప్ప మిగతా వారెవ్వరూ పొద్దున్నే లేవరు. అఫ్‌కోర్స్ వ్యాపారస్థుల విషయం వేరనుకోండి.

Fresh ఫుడ్ కావాలంటే రాత్రి 12 దాటాకే ఆర్డర్ చెయ్యడం మంచిది. బప్పీదా అయితే పగలు 1, 1 1/2 దాకా లేవరు. అప్పుడు ‘టీ’ సిప్ చేయ్యడం మొదలెడతారు. అయితే తెల్లార్లూ యమా హుషారుగా పని చేసి, ఏ తెల్లారు ఝాము 3 కో 4 కో డిన్నర్ కి కూర్చుంటారు.

ఒకసారి (వేరే సినిమా కోసం) బాపినీడుగారు కూడా వస్తే మేం అందరం తెల్లారు ఝామున 4 గంటలకు డిన్నర్ చేశాం. అదో ముచ్చట.

కూర్చోగానే, “నేను లండన్‌లో కూర్చుని కంపోజ్ చేసిన ట్యూన్లు 3 వున్నాయి. వినండి” అని వినిపించారు. అందులో “జుంబాయే జుంబాయే జుంబా” అనే ట్యూన్ అరవింద్ గారికీ నాకూ కూడా నచ్చింది. దానికే, ‘అమలాపురం బుల్లోడా’ పాట రాశాను. Lyric ok అయింది. అరవింద్ గారు లిరిక్‌ని రాఘవేంద్రరావుగారికి ఫోన్ లో వినిపించి ok చేయించారు. నా పని ఏమిటంటే, బొంబాయిలోనే వుండి, ఆ song ని రికార్డు చేయించి హైదరాబాద్‌లో షూటింగ్ స్పాట్‌కి అందించడం. సరే అన్నీ రెడీ కావడానికి 1 1/2 రోజులు పట్టింది, ట్యూన్స్ తీసుకుని హైద్రాబాద్ చేరడానికి. హైదరాబాద్‌లో ఫ్లైట్ దిగగానే సంజీవయ్యా పార్క్‌కి తీసికెళ్ళారు.

అక్కడే షూటింగ్ జరుగుతోంది. ఆ పాటకి బొంబాయిలో ట్యూన్ పాడింది మాధవపెద్ది సురేష్ అన్నగారైన మాధవ పెద్ది రమేష్. చాలా మంచి మ్యుజీషియన్ & అతి సున్నిత స్వభావి. “ముందు భోజనం చెయ్యండి” అన్నారు. తినలేకపోయాను సరిగ్గా. కడుపులో ఎలాగో వుంది. వీళ్ళందరికీ పాట వినిపించేసి రూమ్‌కి పారిపోదామన్న అలజడి.

“ఏమిటీ ప్రోబ్లమ్?” నా ఇబ్బంది గమనించి అడిగారు చిరంజీవి.

“కడుపులో చాలా గడబిడగా, అనీజీగా వుంది సార్” అన్నాను. ఆయన తన అసిస్టెంట్‌తో కొంచెం జెలోసిల్ వాటర్‌లో కలిపి తెమ్మన్నారు. Topcid-40 అనే బుల్లి టాబ్లెట్ చేతికిచ్చి వేసుకోమన్నారు. గడబిడ కొంత సర్దుమణిగింది. ఏదో తిన్నాననిపించి కూర్చున్నాను.

రెండు పేద్ద స్పీకర్లు తెప్పించి song tape recordలో పెట్టి, ఆ స్పీకర్లుకు కనెక్షన్ చేసి ఆన్ చేశారు. Song super. కానీ పల్లవి రిపిటీషన్ లేదు.

“అదేం పర్లేదు. హైద్రబాద్ లోనే ‘కట్ & పేస్ట్’ చేద్దాం” అని టెక్నికల్ డిటైల్స్ మాట్లాడుకున్నారు.

“నేను రూమ్‌కి వెళ్తున్నా సార్.. తరవాత ఏ మార్పులూ చేర్పులూ కావాలన్నా చేస్తా” అని రిక్వస్టు చేశా.

“ok” అని కారిచ్చి పంపారు అరవింద్ గారు. నిజానికి నా కోసం హైదరాబాద్‌లో అప్పుడు రూమేదీ బుక్ చెయ్యలేదు. బాపినీడుగారి ఇంటిపై అంతస్తు లోనే చిరంజీవిగారు వుండేవారు. బాపినీడుగారి ఆఫీసు గది పక్కనున్న చిన్న రూమ్‌లో నేను దిగాను. దిగటం వరకూ ok.

పది నిముషాల తరవాత మోషన్స్ మొదలయ్యాయి. బాపినీడుగారి దగ్గర ‘రమేష్’ అనే అసిస్టెంట్ ఉండేవారు. సినిమాల్లో కూడా అతను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసాడు. కుర్రాడు. మాంచి ఉత్సాహి.

దాదాపు 30 మోషన్స్ వరకూ భరించగలిగా, తరవాత నా వల్ల కాక రమేష్‌ని పిలిచి విషయం చెప్పా. కళ్ళు కూడా తెరవలేకపోయాను.

రమేష్ నన్ను ‘శీతల్’ హాస్పటల్లో ఎడ్మిట్ చెయ్యడం కూడా నాకు తెలీదు. ఆ మరుసటి రోజున గానీ నా ఒళ్ళు నాకు తెలీలేదు. పద్నాలుగో పదహారో సెలైన్లు ఎక్కించారట. విషయం ఏమంటే ‘ఫుడ్ పాయిజనింగ్’.

నేను హాస్పటల్లో వుండగా చిరంజీవి గారు హాస్పటల్‌కి ఫోన్ చేసి మంచీ చెడూ కనుక్కున్నారట. రెండు రోజులు హాస్పటల్లో వుండీ మరో రోజున మళ్ళీ బాబినీడుగారి ఇంట్లో ‘రూమ్’కి వచ్చాను. మరో ఇరవైనాలుగు గంటల్లో చెన్నై చేరాను.

కొద్ది కాలం తరవాత మరో సిటింగ్ హైదరాబాద్ లోనే జరిగింది అదీ సురేష్ గెస్ట్ హౌస్‌లో.

అప్పుడే మిగతా పాటల ట్యూన్లు సిద్ధమయ్యాయి. అక్కడే మొత్తం 6 పాటలకీ (అల్‌రెడీ అనకాపల్లి బుల్లెమ్మా పాట షూటింగ్‌కి వచ్చింది) పల్లవులు వ్రాశాను. అరవింద్ గారు విన్నారు. ఆ తరవాత అందరం చెన్నై వచ్చాక అరవింద్ గారు ఆఫీసులోనే పాటలన్నీ పూర్తి చేశాను.

నేనిప్పుడు పాట వ్రాసినా పల్లవులు పాడి, ఆఫీస్ బాయిస్‌కీ, ప్రొడక్షన్ వారికీ, ఆఫీస్ స్టాఫ్‌కీ అందరికీ వినిపించేవాడ్ని. కారణం ఏమంటే, పాట అనేది అందరికీ నచ్చాలి. ఫరెగ్జంపుల్ నేనున్నాను. నా మెంటాలిటీ లాంటి మెంటాలిటీ వుండే వాళ్ళు ఆంధ్రదేశంలో కనీసం లక్ష మంది వుంటారు. అలాగే మీ మెంటాలిటీ గలవారు లక్ష..! ఇలా పది మందికి వినిపిస్తే, పదిలక్షల మందికి నచ్చుతుంది కదా అని భావించేవాడ్ని. వాళ్ళల్లో ఎవరు బాగోలేదు గురుగారూ అన్నా వెంటనే పల్లవి మార్చేసేవాడిని. ఫైనల్‌గా వాళ్ళు నేనూ కంప్లీట్‌గా తృప్తి చెందాకే ప్రొడ్యూసర్‌కీ డైరెక్టర్‌కీ పాట వినిపించేవాడ్ని. మొదటినించీ నా అలవాటు అదే.

నేను వ్రాసిన పల్లవులు అరవింద్ గారి ఆఫీస్ లో చాలా ఫేమస్సయ్యాయి. ఆ మరుసటి రోజున రాఘవేంద్ర రావుగారిని కలిసి సాంగ్స్ వినిపింద్దామనీ, ఆయన డిసిషన్ ఫైనల్ అనీ అన్నారు అరవింద్ గారు. నేనప్పుడు సరిగ్గా గమనించలేదు గానీ, తరవాత ఆలోచించాను. Song గురించి అరవింద్ గారేమీ మాట్లాడలేదు ఏమిటా?

ఈలోగా మా రెండో అక్క పరమపదించారని తెలిసి ‘అనంతపల్లి’ వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి తెలిసింది ‘అనకాపల్లి బుల్లెమ్మా’ తప్ప మిగతావి వేరే వారి చేత వ్రాయించారనీ, మరో రెండు పాటలు రికార్డు కూడా అయ్యాయనీ. నవ్వొచ్చింది. ఎందుకంటే, అన్ని పాటలూ  రెడీగా వున్నై, మద్రాసు వెళ్ళగానే రికార్డైపోతాయి అని అనుకుంటే, శ్రమంతా శ్రమగానే మిగిలింది ఫలితం లేకుండా అని.

‘నాది నాది అనుకున్నది నీది కాదురా’ అన్న మాట ఎంత సత్యం. ఆ నిరాశ కూడా నన్నేమీ బాధించలేదు. ఎందుకంటే, జరిగిపోయిందాన్ని గురించి విచారించే అలవాటు నాకు లేదు. నిరాశని ఏనాడూ దగ్గరికి రానివ్వకూడదు. రానిస్తే అది మనసుని మింగేస్తుంది. ఇదే మన ప్రాప్తం అనుకుంటే దానికి మించిన ఆనందం మరొకటి లేదు. ‘నీది అయితే నీ దగ్గరికి వచ్చి తీరుతుంది. నీది కానిది ఎంత పాకులాడినా రాదు’ అనేది నా నమ్మకం. హాయిగా రొటీన్‌లో పడ్డాను. ఇక్కడో మాట చెప్పాలి. ‘కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో’ ట్యూన్ నాకు బాగా నచ్చిన ట్యూన్. బప్పీదాని అడిగి మరీ తయారు చేసుకున్న ట్యూన్. నేను ఎక్కువగా ఫాస్ట్ బీట్ సాంగ్స్ వ్రాసినా, నాకు మాత్రం మెలోడీ అంటే ప్రాణం.

ఆ ట్యూన్‌కి రాసిన పల్లవులు ఇంకా నాకు గుర్తున్నాయి. అదే ట్యూన్‌కి రెండు పల్లవులు రాసి పెట్టుకున్నాను అప్పుడు.

1. ఆశ కురులు విప్పుకున్న యీ వేళలో..

తనువేల జలదరించే వింత వింత హాయిలో..

2. పాలబుగ్గ ప్రేమ కథలు చెప్పమన్నదీ..

పరువాల మొగ్గ సిగ్గు తెరలు విప్పుకున్నదీ..

అలాగే ‘చిలుకా క్షేమమా’ పాటకి కూడా పల్లవులు రాసుకున్నాను ‘చెలియా కుశలమా’ అని. చరణాలూ ఉన్నాయి. వెతికితే దొరుకుతాయి. కానీ అప్పటికీ రికార్డయిన వాటి గురించిన ఆలోచన ఎందుకని కాయితాల కట్టల్లో పడేశా.

ఆ తరవాత మరో సినిమా కోసం బాంబే వెళ్ళాను. వచ్చేసరికి తలుపు మీద పేపర్లు స్టిక్ చేసి వున్నాయి. “దయ చేసి, రాగానే అరవింద్ గారి ఆఫీస్‌ని కాంటాక్టు చెయ్యండి” అని. అప్పట్లో ఫోన్ కూడా వుండేది కాదు. STD బూత్, పబ్లిక్ టెలిఫోన్ బూత్ (కాయిన్ బాక్స్) లే ఆధారం. ఫోన్ చేశాను. “బండి పంపిస్తున్నాం వెంటనే రండి” అని ఆఫీసు వారు చెప్పారు. షూటింగ్ స్పాట్‌కి తీసికెళ్ళారు. కెప్టెన్ రాజు చిరంజీవి గార్ల క్లైమాక్స్ ఫైట్ తీస్తున్నారక్కడ.

అరవింద్ గారూ డైరెక్టర్ గారూ, అందరూ అక్కడే వున్నారు. “మీరు ఊరు వెళ్ళిన సమయంలో కొన్ని పాటలు రికార్డు చెయ్యడం, షూట్ చెయ్యడం కూడా జరిగింది. ఇంకో రెండు పాటలు రికార్డు చెయ్యాలి. ఆ పాటలు మీరు ఆల్‌రెడీ రాసేసినవే. అవి ఓసారి డైరెక్టరుగారి వింటారు” అని అరవింద్ గారన్నారు. నేను సరేనన్నాను. నాకు జ్ఞాపకం వున్నాయవి. మరుసటి రోజున అరవింద్ గారి ఆఫీసులో కలవాలి.

రూమ్‌కి వెళ్ళి పడుకున్నాను. మనసు చెల్లాచెదరైతే సైలంట్‌గా పడుకోవడం నాకు అలవాటు. ఎందుకంటే ఆ సమయంలో మనసు దేని మీదా కేంద్రీకృతం కాదు.

ఇప్పుడు పడుకున్న రూమ్ మలర్‌ కోడి మేన్షన్ రూం నంబర్ 34 కాదు. జయలలితగారి అమ్మగారు సంధ్యగారు కట్టుకున్న ఇంటి పక్కనే వున్న ఇల్లు. అది వున్నది శివజ్ఞానం స్ట్రీట్‍లో. ఇంటి నెంబరు 10. మేడ మీద గది. అటాచ్‌డ్ బాత్ రూం. ఓ చిన్న పూజా రూం అంతే.

శివజ్ఞానం స్ట్రీట్‌కి రాక ముందు ‘గిరిధర్’ గారి రూమ్‌లో (వళ్ళువర్ కొట్టై దగ్గరగా) కొన్ని రోజులు వున్నాను. అక్కడే నేటి ప్రసిద్ద తెలంగాణా దర్శకులు ఎన్.శంకర్ వుండేవాడు. శంకర్, శంకర్ తమ్ముడు మేమంతా కలిసే ఉన్నాం అక్కడ. ఆ రూమ్‌లో నన్ను ప్రవేశ పెట్టింది నేటి great మహిళా దర్శకురాలు బి. జయ. ఆ కథంతా విడిగా చెప్తాను.

***

మరుసటి రోజున అరవింద్ గారి ఆఫీసు నించి కారొచ్చింది. వెళ్ళాను. రాఘవేంద్ర రావు గారు వున్నారు. ముఖాముఖి వారితో మాట్లాడటం అప్పుడే. నేను వ్రాసిన రెండు పాటలూ, ‘ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టూ’ అనేదీ, ‘లవ్ మీ మై హీరో.. మజాగా ముద్దిస్తా రారో’ అనేదీ విన్నాను. చిన్న చిన్న మార్పులు చెబితే అక్కడికక్కడ చేశాను. ఆ మరుసటి రోజున బాంబే వెళ్ళి రికార్డు చేయించి తెచ్చాను. ఇవి రికార్డయిందీ సన్నీ సౌండ్స్ లోనే. అంటే ధర్మేంద్రగారి స్టూడియో లోనే. ‘ఇస్కాన్’ కూడా అక్కడే, అతి దగ్గరగా వుంది. అక్కడంతా ప్యూర్ కౌ మిల్క్ వాడతారు. ఉల్లిపాయ కూడా నిషిద్ధం. కానీ అన్నీ రుచిగా శుచిగా అద్భుతంగా ఉంటాయి. అక్కడ దొరికే హెర్బల్ టీ కూడా నాకు భలే ఇష్టం. ఇక్కడో మాట చెప్పి తీరాలి.

బాంబేకి నాకూ ఏ జన్మ బంధమో తెలీదు గానీ, ఆ గాలి పీల్చగానే ప్రాణం లేచొస్తుంది. ఆ జూహూ, ఆంధేరీ, పార్లే, వీధుల్లో తిరుగుతుంటే అవన్నీ ఏ జన్మలోనో నాకు అత్యంత పరిచయమైనవే అనిపిస్తాయి. ఏదో తెలీని కంఫర్ట్, సంతృప్తి. ఇప్పటికీ బీచ్‌లో రాత్రిళ్ళు తిరగడమన్నా వేడి వేడి టీలు తాగుతూ, సంద్రపు ఘోషని వినడమన్నా నాకు చాలా ఇష్టం. సన్ ఉడ్‍ల్యాండ్, శివ్ సాగర్ లలో టిఫిన్ చెయ్యడం కూడా ఇష్టమే. లీజర్ గా, నిర్వ్యాపారంగా.

ఓ రోజు ‘రౌడీ అల్లుడు’ రికార్డింగ్ టైం లోనే మరోసారి మళ్ళీ ఇందీవర్ గారిని కలిశాను.

‘హమ్ ఛోడ్ చలే హై మెహఫిల్ కో’, ‘జీవన్ సే భరీ తేరీ ఆంఖేం’, ఇలా ఆయన top hits గురించి మాట్లాడితే ఆయన చాలా ఆనందించి “బేటా.. సౌత్ ఇండియాలో కూడా ఇంతగా హిందీ పాటల్ని రచయితల్ని ప్రేమిస్తారని నేననుకోలేదు. నిజంగా చాలా ఆనందంగా వుంది. నా బాధ ఏమంటే, దక్షిణ భారతీయ భాషలు నాకు రాకపోవడం” అన్నారు.

తెల్ల పాంటు తెల్ల చొక్కా.. బస్.. తెల్ల కాయితం లాంటి మనసు. దటీజ్ ఇందీవర్.

అవునూ.. శంకర్ జైకిషన్, ఇందీవర్, రాజ్ కపూర్, మొహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్, దేవానంద్, మీనాకుమారీ, నూతన్, హస్రత్ జైపురీ, సాహిర్ లుధియాన్వీ ఎక్కడికి వెళ్ళిపోయారూ? శరీరాన్ని ఇక్కడే వదిలారు. మరి సంగీత సాహిత్య భరితమైన వారి మనసులూ ఆత్మలూ ఎక్కడి కెళ్ళిపోయాయీ? ఈ భూమిని దాటి ఏ భూమికి వెళ్ళారు. మరో లోకంలో వీరిక్కడ వదిలి వెళ్ళిపోయిన పనిని ముగించడానికి అవకాశాలు ఉంటాయా? ఉంటే ఆ పని ఎలా ఉండబోతోంది. ఆ సృష్టి ఎంత అద్భుతంగా వుటుందీ? రాత్రిళ్ళు నక్షత్రాల కేసి చూస్తే ఇప్పటికీ నా మనసులో ఇవే ప్రశ్నలు మనోకాశంలో తారల్లా ఉద్భవిస్తుంటాయి.

***

నో లైట్.. నో వాటర్

మలర్ కోడి మేన్షన్ మేనేజర్ రవి చాలా మంచివాడు. మేన్షన్ ఫోన్ నంబర్ వాడుకోనివ్వమే కాక, ఫ్రీగా వుండేప్పుడు ఫోన్ కూడా చేసుకోనిచ్చేవాడు. ఎవరికి ఫోన్ చేయ్యాలన్నా దూరం వెళ్ళాల్సి వచ్చేది. నియరెస్ట్ ‘కాయిన్ ఫోన్’ పాండీబజార్ పోలీసు స్టేషన్‌లో వుండేది. పోలీసు స్టేషన్‌కి ఎవడు వెడతాడూ! అక్కడ ఎప్పుడూ ఖాళీగానే వుంటుంది. గదా అని నేను డైలీ అక్కడ్నించే బాపినీడు గారికి ఇతర కంపెనీలకి అవసరమున్నప్పుడల్లా ఫోన్ చేసేవాడిని. అది గోడకి తగిలించిన కాయిన్ ఫోన్. బూత్ కాదు.

ఒక్కోసారి పాటలు పాడి వినిపించాల్సివచ్చేది. చాలా పాటలు బాపినీడుగారు ఫోన్ లోనే ok చేసేవారు. ఒక పాటకి 3 సార్లు చేసేవాడ్ని. మొదటిసారి నేను అనుకున్న పల్లవులు, రెండోసారి మొదటి చరణాలు. 3వ సారి ok అయిన పల్లవీ, మొదటి చరణంతో పాటు మరో చరణం వినిపించేవాడ్ని.

ఆ స్టేషన్ C.I బాబు అనే ఆయన ఒకసారి నేను పాడి వినిపించి బయటకి వస్తుంటే వెనక్కి పిలిచి, నా కథా కమామీషూ తెలుసుకుని, నేను సినిమా రైటర్‌ని అని తెలిశాక చాలా ఆనందపడ్డాడు. మంచి వ్యక్తి. నేను మిలటరీలో పని చేయ్యడం, 71 war లో పార్టిసిపేట్ చెయ్యడం ఆయనకి మరీ నచ్చింది. ఇదంతా ఎందుకంటే రవి, ఫోన్ వాడుకోనివ్వడం వల్ల హాయిగా మేన్షన్ నించే పాటలు వినిపించి ok చేయించుకునే వాడ్ని. చాలా పాటలు అలా ఒకే అయినవే.

ఓ రోజున సడన్‌గా రవి “సార్, 15 రోజుల్లో మీరు వేరే అకామిడెషన్ వెదుక్కోండి. బిల్డింగ్ లోని రూమ్స్ మొత్తం రీమోడల్ చేస్తున్నారు. అందర్నీ ఖాళీ చేయించమన్నారు” అన్నాడు. మలర్ కోడి మేన్షన్ నాకు నీడ నివ్వడమే కాదు ‘లక్కీ’ ప్లేస్‌గా కూడా నిలిచింది. ఇప్పుడు దాన్ని వదలాలంటే నా గుండెల్లో రాయి పడింది. కానీ చేయడానికేమీ లేదు. టి.నగర్ అలవాటైన చోటు. అదీ గాక డాక్టరుగారు వుండే చోటు. వదిలి ఎక్కడికీ వెళ్ళడం? చాలా చాలా వెతికా కానీ దొరకలేదు. 15 రోజులు కాస్తా నెల గావచ్చింది. అన్ని రూములూ అందరూ ఖాళీ చేసేశారు. నేను తప్ప. అప్పటికీ రబ్బీ, రాజుగారు, కుమార్ వేరే వేరే రూమ్ లోకి (1 year ముందే) వెళ్ళిపోవడం వల్ల Room No.34కి నేనే ఏకైక టెనెంట్‌ని. సామానంతా ఏం చెయ్యాలీ? ఈ సామాను ఎక్కడిదంటే, సుగంధ రమేష్ రాజా (మారుతి సినిమా డైరెక్టర్ + బాపినీడుగారి దగ్గరా, మధుసుధన్ రావుగారి దగ్గర కో డైరెక్టరుగా పని చేసిన కుర్రాడు) కూడా నా రూమ్ లోనే ఎడ్జస్టు అవుతున్నాడు. కారణం అతనుండే రూమ్‍ని ఖాళీ చెయ్యాల్సి వచ్చింది మహాలింగాపురంలో. అతను మేన్షన్ ఖాళీ చేయిస్తున్నారని తెలిసిన మరుసటి రోజే అతని ఫ్రెండ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు. కొన్ని దేముళ్ళ ఫోటోలూ బట్టలూ ఇక్కడే వుంచి. ఇప్పుడు ఆ సామాను ఎక్కడ పెట్టేదీ?

నా బాధనంతా డాక్టరు గారు జయకి చెప్పారు. జయ మరుసటి రోజునే ఏ విషయమూ చెబుతానని తన లూనా మీద వెళ్ళిపోయింది.

మరో రెండో రోజులు గడిచేసరికి వాటర్ కనెక్షనూ, కరెంటు కనెక్షనూ తీసేశారు. మొత్తం గదులన్నీ ఖాళీ అయిపోవడమూ, కరెంటు లేకపోవడంతో భూత్ బంగ్లా లాగా ఉండేది మేన్షన్. అందులో ఉన్నది నేనొక్కడ్నే, కేండిల్స్ వెలుగులో. పాపం నీరు మాత్రం ఆంధ్రా టీస్టాల్ శ్రీను ఓ రెండు బకెట్లు కుర్రాడి కిచ్చి పైకి పంపేవాడు. అలా అయిదు రోజులున్నాను. ఆరో రోజున జయ నన్ను నా సామాన్ని వళ్ళువారు కొట్టై దగ్గర జర్నలిస్టు గిరిధర్ (ఇప్పుడు చాలామంది నటీనటులకు అతను మేనేజర్) రూమ్‌కి షిఫ్టు చేసింది. అందుకే ఇప్పటికీ ఎప్పటికీ జయ అంటే నాకు గౌరవం. నిజంగా షీ ఈజ్ ఎ ప్రెండ్ ఇన్ డీడ్.

ఓ నెల అక్కడున్నాక డాక్టర్ గారి దగ్గరికి వచ్చే ఒకమ్మాయి శివజ్ఞానం స్ట్రీట్‌లో వున్న ఇంటి గురించి చెప్పింది. వెంటనే వెళ్ళి అడ్వాన్సిచ్చాను. మొదట్లో ఉన్న రూమ్‌కి టాయిలెట్ లేదు. నేను టాయిలెట్‌కి వెళ్ళి ఇబ్బంది పడాల్సి వచ్చేది. అది చూసిన ఆ బిల్టింగ్ ఓనరిణి నాకు వేరే రూమ్ ఎలాట్ చేసింది. ఓ గది, ఓ చిన్న పూజ గది + ఎటాచ్‌డ్ స్మాల్ బాత్రూం. అక్కడ ఎన్నెన్నో పాటలు, ఎన్నో హిట్స్ ఊపిరి పోసుకున్నాయి. రౌడీ అల్లుడు పాటలు కూడా ఆ రూమ్‌లో కూర్చుని వ్రాసుకున్నవే.

శివజ్ఞానం స్ట్రీట్ నా సినీపయనంలో ఓ అద్భుత మజిలీ. అమ్మ పోయిందన్న వార్త విన్నదీ అక్కడే. సూపర్ హిట్ సాంగ్స్ రాసిందీ అక్కడే. జీవితంలో ఆ గది నాకు చాలా ఇచ్చింది. చాలా తీసుకుంది. కొన్ని నవ్వులు.. కొన్ని నిట్టూర్పులు.. కొన్ని ఆశలు.. కొన్ని నిరాశలూ అన్నీ అక్కడ చవి చూశాను. ఇప్పుడా గది గోడలకి అవన్నీ గుర్తుంటాయా? ఏమో!

(ఇంకా ఉంది)

Exit mobile version