Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవితం ఓ ప్రయాణం-15

[ప్రముఖ కథా, నవలా, సినీగీత రచయిత, శ్రీ భువనచంద్ర తమ సినీ జీవన ప్రస్థానాన్ని ‘జీవితం ఓ ప్రయాణం’ అనే పేరుతో సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు.]

~

కృష్ణార్జునులు.. కొబ్బరి బొండం:

సినిమా మీద గ్లామర్‌తో వచ్చేవాళ్ళు కొందరైతే.. కేవలం మోజుతో వచ్చి ఏవో కొన్ని సినిమాల్లో కనిపించి తృప్తిపడి వెళ్ళిపోయే వారు కొందరు. సినిమాని ప్రాణంలా భావించే వారు మాత్రం అరుదుగా వుంటారు. అంతే కాదు, ఏదో ఓ సినిమా తీసి జనాల మీదకి వదిలి ‘డబ్బు’ చేసుకుందాం అనే వ్యాపార లక్ష్యం కాకుండా, స్పష్టమైన అవగాహనలో, ఇంకా స్పష్టంగా తెలియబడే సంప్రదాయంలో, చివరి చెమట బొట్టునీ పైసానీ కూడా సినిమా కోసమే ఖర్చు పెట్టడానికి సిద్ధపడి వచ్చేవారు ఇంకా అరుదు.

‘కొబ్బరి బొండాం’ సాక్షిగా అలాంటి వారు నాకు పరిచయమయ్యారు. వారెవరో చెప్పక్కర్లేదు. శ్రీ S.V. కృష్ణారెడ్డి, శ్రీ అచ్చిరెడ్డి. కన్నమ్మపేటలో నున్న కృష్ణారెడ్డిగారి ప్లాట్ లోనే ‘కొబ్బరి బోండం’ మ్యూజిక్ సిటింగ్స్ జరిగాయి. నాకు ఇచ్చింది ఓ చిత్రమైన ట్యూన్. ‘ఓ అమ్మాయి ఉత్సాహంగా ఫలానా సన్నివేశంలో పాడుకోవాలి’ అని స్పష్టంగా సన్నివేశాన్ని వివరించారు కృష్ణారెడ్డిగారు. మాట్లాడే సరస్వతి కృష్ణారెడ్డి గారైతే, మౌన సరస్వతి అచ్చిరెడ్డిగారు. ఆయన అన్నీ శ్రద్ధగా వింటూ చిన్నగా నవ్వారంతే.

వెళ్ళగానే చాలా పద్దతిగా వేరుశెనగ వుండలూ, జీడిపప్పు మిఠాయీ, జంతికలూ పెట్టారు. చక్కని టీ. వాటితో బాటు అంతులేని ఆప్యాయత.. ఆదరణ.. “కావాల్సినంత టైం తీసుకోండి” అన్నారు SVK.

ఓ ‘పని’ చేతికొచ్చాక వెంటనే మొదలు పెట్టడం నాకు అలవాటు. మొదలు పెట్టిన దగ్గర్నించీ పూర్తయ్యే దాకా మనసులో అలజడే.. ఆ పని పూర్తయ్యేదాక నిద్ర పట్టదు. పడుకున్నా, కూర్చున్నా ఆ ధ్యాసే. పని తొందరగా పూర్తి చెయ్యాలి అన్నది నాకు బాపినీడు గారి దగ్గరే అలవడింది. తరవాత చేద్దాం అనేది ఆయనకి అస్సలు ఇష్టం వుండదు.

రూమ్‌కి వెళ్ళాను. ట్యూన్‌ని అయిదారు సార్లు జాగ్రత్తగా వింటేగానీ, పదాలకి ఒదగలేదు. జాగ్రత్తగా వింటే, ఒక బిట్ మూడు సార్లు రిపీట్ అయింది. బ్రహ్మాండంగా వుంది. చాలా స్వీట్ మెలోడీ. మొదటి లైను కుదిరితే చాలు. మిగతాదంతా వచ్చేస్తుంది. కానీ ఆ మొదటి లైనే నన్ను పిండుతోంది.

బుర్రలో ఒకదాని తరవాత మరోటిగా పదాలు సాగిపోతూన్నాయే గానీ ట్యూన్ లో ఏదీ కూర్చోవడం లేదు. ఆ మొదటి పదం పాటకి డ్రైవరులాంటిది, సారీ, ఇంజిన్ లాంటిది. మిగతా పదాలన్నీ ఇంజిన్ తగిలించే రైలు డబ్బాలు.

రూమ్‌లో కూర్చుంటే లాభం లేదని రోడ్డు మీదకి వచ్చాను. ఎంత నడిస్తే అంత మంచిది. ఎందుకంటే నడుస్తున్న కొద్దీ ఊహలు రెక్కలు విప్పిన పక్షుల్లాగా మనోకాశంలో ఎగురుతాయి. శివజ్ఞానం స్ట్రీట్ నించి వెంకటనారాయిణ రోడ్డు చివరి దాకా వెళ్ళే సరికి మొదటి పదం దొరకింది.

“అందాల మేఘమాలా” అన్న పదం. ఇంకేం కావాలీ మనసులోనే ట్యూన్ కి అనుగుణంగా పదాలు ఫ్రేం చేసుకుంటూ రూమ్ కి వెళ్ళాను.

అయ్యా, ఇదంతా వ్రాయాల్సిన పని లేదు. పాటకి ఇంత కష్టపడ్డానని చెప్పుకోవలసిన అవసరం అంత కంటే లేదు. కానీ ఎందుకు రాస్తున్నానంటే, ఒకే చోట కూర్చుని వ్రాయడానికి ఏమీ తట్టనప్పుడు, లేచి నడవడం మంచిది. ఎందుకంటే గమ్యాన్ని చేర్చేది ‘గమనమే’. 3 పల్లవుల సమాహారం యీ పాట.

~

పల్లవి:
అందాల మేఘమాలా..
పరుగులు తీసే పరువంతో పోటీ పడతావా
వెచ్చని ఊహల ఊయలలూగీ
నీలాల నింగి అంచులు చూసొద్దాం
కొండలు దాటీ కోనలు దాటీ
ఏవేవో భావాలో.. మదిలో మోహనరాగాలై
కోయిల పాడే గీతాలై.. ఎద మరిపిస్తే..
సాగే కాలంతో.. చివురించే ఆశల్లో
ఉండేదో ఆహో ఓ హాయీ..

చరణం 1:
అందాల మేఘమాలా..
… కోనలు దాటీ
విన్నాలే ఓ పిలుపూ.. వయసులు పిలిచే తొలి పిలుపు
మనసున పొంగే తొలి వలపు రారా రమ్మంటే
తీశా ఓ తలుపు.. నీదే యీ గెలుపు..
రావేలా ఆహా హా హా హా.. ॥అందాల..॥

చరణం-2:
అందాల మేఘమాలా..
… కొనలు దాటీ
ఏదేదో పులకింత.. తపనలు రేగే తరుణంలో
తనువుని తడిమే నీళ్ళల్లో.. ఓ గిలిగింతా..
సంద్యా సమయంలో .. ఈ జలకాలాటల్లో
ఊందేదో ఆహా ఓ హాయీ.. ॥అందాల..॥

~

మరుసటి రోజు మళ్ళీ ‘మనీషా’ ఆఫీసుకి వెళ్ళాను. పాట వినగానే హాయిగా నవ్వారు SVK. ఈ సినిమాకి డైరెక్టర్ కాట్రగడ్డ రవితేజగారు. నిర్మాతలు కె. అచ్చిరెడ్డి, వి.జి. సరోజగార్లు. సంగీతం S.V.K. నటీనటులు రాజేంద్రప్రసాద్, నిరోషా. “మీరు రాసిన పాటని, పాటంత అందంగా పిక్చరైజ్ చెయ్యాలంటే మా బడ్జట్ సరిపోదు. ఉన్నంతలో బాగా తీస్తాం. మంచి లిరిక్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా వుంది. అలాగే మరో సాంగ్ కూడా మీరే వ్రాయాలి” అంటూ ‘కో.. కో..కో.. కో.. కోకోనట్’ అనే టైటిల్ సాంగ్ ఇచ్చారు.

జీవనయానంలో గత 38 సంవత్సరాలుగా శ్రీ SVK, శ్రీ అచ్చిరెడ్డి గార్లతో స్నేహం కోనసాగుతూనే వుంది. వాళ్ళ Friends of the hour, కాదు.. Friends of All time.

***

దెబ్బ.. దెబ్బ.. దెబ్బ.. మరో మలుపు:

‘అమ్మనీ కమ్మనీ దెబ్బ’ పాట ఏ మూహుర్తంలో పుట్టిందో తెలీదు గానీ, ఆ తరవాత ‘దెబ్బ’ పాటలు వరసకట్టాయి. నేనే చాలా వ్రాశాను. అయితే ‘అప్పుల అప్పారావు’ సినిమాలోని ‘మూడో దెబ్బ కొట్టాక మామా’ పాట నా మొదటి ‘దెబ్బ’ పాట. దానికంటే ముఖ్యమైన విషయం ఏమంటే EVV సత్యనారాయణ గారితో నా తొలి సినిమా ‘అప్పుల అప్పారావే’. అప్పటి వరకూ పేరు వినడమే తప్ప మాకు పరిచయం లేదు.

MVVS బాబూరావు గారే EVV గారికి నన్ను పరిచయం చేసింది. MVVS బాబూరావుగారు. G. విజయబాపినీడు గారికి రచనా సహకారం అందించేవారు. పేరుకే రచనా సహకారం. నిజం చెబితే అన్ని డిపార్టుమెంట్స్‌కి ఆయన సహాకారాన్ని అందించేవారు. తల్లో నాలుక లాగా అందరికీ అందుబాటులో వుండేవారు. ప్రతి డైలాగూ కూడా ఆయన చేతిలో ముత్యమయ్యేది. ‘దీంతస్సారవలా’ అన్నా, ‘రఫ్వాడిస్తా’ అన్నా, ‘అది యాష్ ట్రేకి ఎక్కువ.. డస్ట్‌బిన్‌కి తక్కువ’ అన్నా, ‘రింగులో ఫింగర్’ అన్నా, ‘పిడత మీద ఉడత’ ‘మడతెట్టా నంటే మతి చెడిపోద్ది’ అన్నా.. అవన్నీ MVVS బాబూరావుగారు సినిమాల్లోకి బాణాల్లో వదిలిన పదాలే.

ఆయన నేనుండే శివజ్ఞానం స్ట్రీట్ రూమ్‌కి వచ్చి, “భువన చంద్రగారూ, ఇదిగో ట్యూను.. ఇదిగో సన్నివేశం, హీరోయిన్ చేత 3 దెబ్బలు తింటే గానీ హీరో కథ ముందుకి నడవదు. ఆ దెబ్బతిన్న ఉత్సాహంలో పాట మొదలవ్వాలి. EVV సత్యనారాయణగారు డైరక్టరు. ఈ కామధేను ప్రొడక్షన్స్‌కి వెన్నుదన్నుగా వున్నది రమాప్రభగారు. హాయిగా పాట రాసెయ్యండి.. ఘాటింగ్ ఈ పక్కనే. పాట అయిపోగానే స్పాట్‌కి వచ్చెయ్యండి” అన్నారు.

“మ్యూజిక్ ఎవరూ?” అన్నాను. “ద గ్రేట్ రాజన్ నాగేంద్ర.. మెలోడీ మాస్టర్స్” అన్నారు. పొంగిపోయా. వారి పాటలంటే నాకు చాలా ఇష్టం. వారి కాంబినేషన్‌లో నేను పాట వ్రాయడం కూడా ఇదే మొదటిసారి.

బాబూరావుగారు ‘లీడ్’ ఇచ్చేశారు గానక సాయంత్రానికల్లా పాట రాసేశా. EVV గారు పాట వినంగానే “వెరీ గుడ్.. బాగుంది. మీ గురించి నాకు చెప్పింది బాబురావుగారే” అన్నారు. అనేసి, ‘టేక్’ కి వెళ్ళిపోయారు. బాబూరావుగారు నవ్వి “ఆయనకి ఏ మాత్రం నచ్చకపోయినా, నచ్చనట్టు మీరు రాసేదాకా వదిలి పెట్టరు. ఫస్ట్ టైమ్ ok అయిపోయింది గనక హాయిగా రెస్టు తీసుకోండి. రేపొద్దున్నే రాజన్ నాగేంద్రలు బెంగుళూరు నించి వస్తారు. రాగానే కారు పంపిస్తా. రికార్డింగ్‌కి వచ్చెయ్యండి” అన్నారు. ఆ తరవాత EVV గారితో 20 సినిమాలకి పైగా చేశాను. ఎన్ని సూపర్ హిట్లో. రైటర్‌ని ఎంతో గౌరవంగా చూడటమే కాదు, తనకి కావల్సింది రైటర్ నించి ఎలా రాబ్టటుకోవాలో తెలిసిన దర్శకుల్లో EVV గారొకరు.

రాజన్-నాగేంద్ర గార్లు అత్యంత సౌమ్యులు. వేన్‌లో వారి మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ వచ్చాయి. చాలా శాంతంగా పాట లిరిక్ విన్నారు. “ట్యూన్‌కి పెర్‌ఫెక్ట్‌గా వుంది” అని మెచ్చుకున్నారు. ‘ఫీడింగ్’ జరుగుతుండగా నేను మరో మ్యూజిక్ సిటింగ్‌కి వెళ్ళాల్సి వచ్చింది. బాబూరావు గారు ఉన్నారు గనక ఫరవాలేదు. ఆయనే అన్నారు “నేనున్నాగా.. హాయిగా వెళ్ళి మరో పాట వ్రాయండి” అని దిలాసా ఇచ్చారు. రాజన్ నాగేంద్ర గారితో గడిపింది మహా అయితే రెండు గంటలు కానీ అవి ఎప్పటికీ మరిచిపోలేని అద్భుత క్షణాలు.

అందులోనే ‘తొలి నైటూ.. అదెంత స్వీటు.. మలి ఫైటు.. మరింత ఘాటు’ అనే పాట కూడా వుంది. అప్పుల అప్పారావు నిర్మించిన నిర్మాతలు G. ఆనందబాబు, S. ఉదయకుమార్, B. సురేష్. రెండు పాటలు పాడింది S.P.B & చిత్ర. నటీనటులు రాజేంద్రప్రసాద్, శోభన.

కె.ఎస్. చిత్ర గాయనిగా అడుగు పెట్టిన తొలి రోజులవి. బాపూగారు తెలుగు భాషని ఎలా పలకాలో అద్భుతంగా నేర్పేవారు. అలాగే రాజాశ్రీ గారూ వేటూరి గారూ కూడా. చాలా శ్రద్ధగా వినేది చిత్ర గారు. ఎప్పుడూ చెరగని చిరునవ్వే. ఆవిడ స్టూడియోకి వస్తే వెన్నెల వచ్చినట్లే.

చిత్రగారికి మన ఎస్.జానకి గారి మీద వున్న అభిమానం కొలవలేనిది. జానకమ్మగారి పేరు చెబితే బాలు చాలా గౌరవంగా చిత్రగారు రెండు చేతులూ ఎత్తి దండం పెడతారు. “ఆవిడ మలయాళీలకు మలయాళీ.. అంత పెర్‌పెక్టు డిక్షన్” అంటారు చిత్ర.

సగౌరవంగా, సభ్యతగా ఎలా మెలగాలో, పెద్దలని ఎలా గౌరవించాలో ఈనాటి గాయనీ గాయకులు చిత్రగారినించి నేర్చుకోవాలి. అలాగే బాలూగారు చిత్రని ‘రాక్షసి’ అని ఆప్యాయంగా అంటారు. ఏ చిన్న తప్పు దొర్లినా, అది సరి చేసేంత వరకూ చిత్రగారు వదలరు. ‘కంప్యూటర్ ద్వారా మేం సరిచేస్తాం’ అని మ్యూజిక్ డైరెక్టరూ, సౌండ్ ఇంజనీరు చెప్పినా ఆమె కరెక్టు చేసే వరకూ ‘పాడూతూనే’ ఉంటారు. ‘ఏదో ఒకటి పాడేసి మరో పాటకి వెళ్ళిపోదాం’ అనే పొరబాటు ఏనాడూ చిత్రగారు చెయ్యలేదు. చెయ్యరు.

ఎంత ‘హై పిచ్’ అయినా వంద సార్లయినా ప్రయత్నించి సాధించడమే ఆమె విజయాలకి కారణం. ఔట్ అండ్ ఔట్ పెర్‌ఫెక్ట్ & కమిటెడ్ సింగర్.

చిత్రగారి ‘బేగ్’ గురించి ఓ జోక్ ఉంది. దాన్ని, “A bag with many bags inside” అని అనేవారు. బోలెడు బుల్లి బుల్లి బ్యాగులుంటాయి. వాటిల్లో రబ్బర్ బెండ్ నించి ‘డ్రైపికిల్’ పీసెస్ దాకా ఎన్నో ఎన్నో వుంటాయి. ఏ బేగులో ఏముందో తెలిసింది చిత్రగారి కొక్కరికే. ఆమె సిస్టర్ పేరు బీనా, బ్రదర్ పేరు దాపాల్. సజీవ గంగా ప్రవాహంలాగా ఆమె గళంలో ‘పాట’ పరవళ్ళు తొక్కుతూనే వుంది. నిండు నూరేళ్ళు వుంటుంది. SPB + చిత్ర పాడినన్ని పాటలు మరే గాయకులు జంటా పాడి ఉండరు. ఎన్ని భాషలూ!! ఎన్ని వేల పాటలూ!!!

నటి శోభననీ ‘అప్పుల అప్పారావు’ షూటింగ్ లోనే చూశాను. ఆమె కేరళ సిస్టర్స్ పద్మిని లలిత రాగిణిల మేనకోడలు అని తెలిసింది. పద్మిని సినిమాలు ఎన్నో చూశాను. కానీ ఎన్నిటికీ మరవలేని సినిమా ‘జిస్ దేశ్ మే గంగా బెహతీ హై’. రాజ్‌కపూర్‌తో పద్మిని నటించిన ఆ సినిమా ఓ అద్భుతం. ఆ సినిమా రిలీజైన పాతికేళ్ళకి చెంబల్ వేలీ డెకాయింట్లు తమకు తాముగా ప్రభుత్వానికి లొంగిపోయారు. రాజ్ కపూర్ నిజంగా ఓ విజనరీనే.

ఇన్ని అద్భుతమైన పాటల సంగమమే, ‘జిస్ దేశ్ మే గంగా బెహతీ హై’ అన్నిటికీ మించిందీ, భారత పౌరుడైన ప్రతి వాడూ పాడుకొని తీరాల్సిందీ అదీ సగర్వంగా పాడాల్సిందీ.

‘హోఠోఁ  పె  సచ్చాయీ రహతీ హై
జహాఁ దిల్ మే సఫాయీ రహతీ హై
హమ్ ఉస్ దేశ్ కె వాసీ హైఁ
జిస్ దేశ్ మే గంగా బెహతీ హై’ అనే పాట.

మరో అద్భుతమైన పద్మనిగారి సినిమా ఏమంటే, రాజ్ కపూర్ మాగ్నమ్ ఓపస్ ‘మేరా నామ్ జోకర్’. అందులో మీనాగా పద్మిని చిరంజీవి అయిపోయింది.

ఇదంతా ఎందుకుంటే షూటింగ్‌లో శోభనని చూసిన మరు క్షణం నా మనసులో మెదిలిన భావాలు ఇవే!

అప్పుల అప్పారావు కీ జై!

ఎందుకంటే ఫస్ట్ షాట్ తీసింది AVM స్టూడియో వినాయకుడి ఎదుట. అది నేను చూశా.

ఆ తర్వాత సౌమ్యులు చాలా గొప్ప సంగీత దర్శకులు అయిన రాజన్ నాగేంద్ర గార్లతో పరిచయం కలిగింది. ‘అప్పుల అప్పారావుగారి’ ద్వారానే. ఓ గొప్ప నటీమణి మేనకోడలు శోభనని చూసి, ఆ నటిని మరీ మరీ తలుచుకునే అవకాశమూ యీ సినిమానే ఇచ్చింది.

అన్నిటికంటే EVV సత్యనారాయణగారితో పరిచయం కలిగించి ఆ పరిచయాన్ని ఇరవై యేళ్ళపాటు అప్రతిహతంగా కొనసాగడానికి పునాది వేసింది కూడా అప్పుల అప్పారావే.

థాంక్యూ అప్పారావుజీ.. యూ ఆర్ గ్రేట్!

***

ఓ రోజున కాట్రగడ్డ రవితేజగారు కబురెట్టారు.

వెళ్ళేసరికి అక్కడ మాంఛి ‘కథ’ సిటింగ్ సంబంధించిన వాతావరణం వుంది. అప్పటికే రవితేజగారితో ‘ఇదేం పెళ్ళాం బాబోయ్’, ‘కొబ్బరిబొండాం’ సినిమాల్లో పని చేసిన అనుభవం వుంది గనక, చాలా ఫ్రీగా హాయిగా కూర్చున్నా. కాసేపటికి విద్యాసాగర్ వచ్చారు. మహదానందంగా ఫీల్ అయ్యాను. కారణం విద్యా తోటి అప్పటికే ‘అలజడి’, ‘తేనెటీగ’ సినిమాలు చేశాగా మరి.

కథంతా చెప్పారు. బేనర్ పేరు శ్రీ బుద్ధా ఆర్ట్ పిక్చర్స్. నిర్మాతలు కె.అమరేశ్వరి, పి.రమేష్. హీరో వచ్చి సురేష్. సినిమా పేరు ‘యుగాంతం’.

మొదటి పాట ఫక్తు మాస్

“అట్టా నానెయ్యరో.. ఇట్టా ఉతికెయ్యరో
జల్దీ జాడించరో”

అది పాడింది మనో.. చిత్ర

రెండో పాట – “ఛమక్ ఛాంగ్ రే భళా.. శివమెత్తి ఆడరా ఇలా” (మనో, కోరస్)

మూడో పాట – “ఓ గువ్వపిట్టమ్మా వాలింది చెట్టు మీద” (చిత్ర & కోరస్ & మనో)

శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ గారు ‘విలన్’ గాయక్ట్ చేసింది ఈ సినిమాలోనే. అఫ్‌కోర్స్, సిటింగ్స్ జరిగినప్పుడు ఆ విషయం నాకు తెలీదు.

‘మనో’ అసలు పేరు నాగూర్ బాబు అని మీకు తెలిసిందే. పుట్టింది విజయవాడలో. నాగూర్ బాబుని మనోగా మార్చినది ఇసైజ్ఞాని, మేస్ట్రో శ్రీ ఇరయరాజాగారు. పుట్టింది 1965. చిన్నప్పుటి నించీ నాటకాలలో వేషాలు మాత్రమే కాక సినిమాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు. కీ.శే. చక్రవర్తిగారి దగ్గర మ్యూజిక్ అసిస్టెంట్‌గా.. కోసింగర్‌గా పని చేశారు. అంతే కాదు, గ్రేట్ ఎం.ఎస్. విశ్వనాథన్ గారి దగ్గర కూడా మ్యూజిక్ అసిస్టెంట్‌గా పని చేసిన ఘనత మన నాగూర్ బాబుది. ‘షెన్‍బగమే.. షెన్‍బగమే..’ పాటతో టాప్‌కి వెళ్ళారు. అదే పాటని ‘పావురమా.. పావురమా’గా నేను, ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాలో వ్రాయడం జరిగింది. అలాగే ‘ముత్తు’ సినిమాలోని ‘తిల్లానా తిల్లానా’ కూడా నేను వ్రాయగా మనో పాడిదే. కనీసం ఓ 370/380 పాటలు నావి మనో పాడారు. మనో సింగర్, కంపోజర్ మాత్రమే కాదు.. కమల్ హాసన్ వంటి ఉద్దండులతో నటించి శభాష్ అనిపించుకున్న నటుడు. లెక్కలేనన్ని ‘షో’లు విదేశాల్లో ఇచ్చిన ఘనాపాఠి. అంతే కాదు సూపర్ డబ్బింగ్ ఆర్టిస్టు. రజనీకాంత్‌కి డబ్బింగ్ చెప్పాలంటే మనూనే చెప్పాలి అని రజనీకాంత చేతే అనిపించుకున్న గాత్రధారుడు. దాదాపు 22000 కి పైగా, భారతీయ భాషల్లో పాడిన మనోని తమిళ ప్రభుత్వం ‘కలైమామణి’ బిరుదుతో సత్కరించింది. ఆయనకి గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఉంది. ఒకే రోజున 20 పాటలు (సింగర్ గా) రికార్డు. (20 పాటలు ఒకే రోజున పాడగా రికార్డయ్యాయి).

మనోకి శాస్త్రీయ సంగీతం నేర్పిన గురువు నేదునూరి కృష్ణమూర్తి గారు. ఇదంతా ఎందుకంటే, ఇవ్వాళ బోల్ బోబీ బోల్, స్వరాభిషేకం, ఇలా ఎన్నో రియాలిటీ షోస్‌లో మనూని చూస్తాం.

ఏనాడూ గర్వాన్ని దగ్గరికి రానీని మనిషి మనో. ఎవరికే పని బడినా అవసరమైనా అర్జంటుగా అటెండై తాను చేయగలిగింది వెంటనే చేసే అద్భుతమైన మనిషి అతను. అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం. ఇన్నేళ్ళుగా ఇండస్ట్రీలో వున్నా, ఏనాడూ ఏ వివాదానికీ తావివ్వని మంచి మనిషి మన మనో. ఓ విధంగా చెప్పాలంటే సర్వజనబంధు.

***

ఈ సమయంలో వీరందరూ లేకపోతే నాది పయనం అయివుండేది కాదు. నటీనటులు, గాయనీ గాయకులు, నిర్మాతలు, దర్శకులు, సౌండు ఇంజనీర్లు, మ్యూజిషియన్స్, సాంకేతిక నిపుణులు, స్టూడియోలు ఆఖరికి మాకు టీ కాఫీలు అందించే ప్రొడక్షన్ బాయ్స్ కూడా ఈ – నా – పయనంలో సహాచరులే. అంతెందుకూ, స్టూడియోల్లోని సెట్లూ, చెట్లూ కూడా నా జీవితంలో భాగాలే. వాటి గురించి కూడా చెప్పకపోతే జీవితం అసంపూర్ణమవుతుందని నాకు తెలుసు.

ఒకప్పుడు ఓ పాట రికార్డింగ్ జరిగితే కనీసం 20, 30 మంది సంగీత వాద్య కళాకారులకి పని దొరికేది. కీ-బోర్డులు, రిధిమ్ బాక్సులు వున్నా, లైవ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో కలిసి వుండేవి. ఇవ్వాళ అంతా కీబోర్డు సంగీతమే.

నేను వచ్చిన కొత్తల్లో, అంటే 30 ఏళ్ళ క్రితం తిరుగులేని వాద్య నిపుణులుగా వెలిగిన చాలామంది కళాకారులు నేడు పని లేక, మరో పని రాక, నిరాశలో కూరుకుపోవడమూ, బాధతో అలమటించడమూ నేనూ చూస్తున్నాను. నాడు పొలాన్ని నమ్ముకున్న రైతు పరిస్థితి నేడెలా వుందో, నాటి కళాకారుని దుస్థితి నేడు అలా వుంది. టెక్నాలజీ మనిషి బ్రతికే మార్గాలని మూసేస్తోందా? ట్రాక్టర్లు వచ్చి రైతు కూలీల కడుపు కొట్టాయి. మిల్లు వస్త్రాలొచ్చి చేనేత కార్మీకుల చేతిలోని కూడు లాక్కున్నాయి.. ఇలా చూస్తే నేడు కంప్యూటర్లొచ్చి వందలాది ఊద్యోగుల్ని బజారుపాలు చేశాయి. కీబోర్డులొచ్చి సంగీతాన్నీ, సృజనాత్మకతనీ, మనిషికీ వాద్య పరికారానికీ వున్న అవినాభావ సంబంధాన్నీ పీల్చేస్తాయని మాత్రం నేను ఊహించలేదు. ఆ రోజు చూశా గనకే ఈనాడు బాధ. ఏదీ చూడనివాడికి బాధెందుకూ?

(ఇంకా ఉంది)

Exit mobile version