Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవితం ఓ ప్రయాణం-17

[ప్రముఖ కథా, నవలా, సినీగీత రచయిత, శ్రీ భువనచంద్ర తమ సినీ జీవన ప్రస్థానాన్ని ‘జీవితం ఓ ప్రయాణం’ అనే పేరుతో సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు.]

~

ఘరానా మొగుడు:

‘ఖైదీ నంబర్ 786’.. భువనచంద్ర అనే రచయితని లోకం గుర్తించేలా చేసిన సినిమా.

‘గ్యాంగ్ లీడర్’.. రచయితగా నన్ను నిలబెట్టిన సినిమా.

‘ఘరానా మొగుడు’.. మరో ఇరవై ఏళ్ళ వరకూ ‘ఢోకా’ లేదనీ, రచయితగా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా చేసిన సినిమా.

మూడిటికీ హీరో చిరంజీవిగారే. ‘ఖైదీ నంబర్ 786’కి సంగీతం రాజ్-కోటి అయితే, ‘గ్యాంగ్ లీడర్‌’కి మ్యూజిక్ ఇచ్చింది బప్పీలహరి. ‘ఘరానా మొగుడు’ సినిమాకి సంగీత దర్శకత్వం నెరపింది ఎం.ఎం.కీరవాణి.

మొదటి రెండు సినిమాలకి డైరెక్టర్ శ్రీ విజయబాపినీడుగారైతే, మూడో సినిమా డైరెక్టర్ శ్రీ కె. రాఘవేంద్రరావుగారు.

‘ఘరానా మొగుడు’ నిర్మాత శ్రీ దేవీవరప్రసాద్ గారు. బేనర్ – దేవీ ఫిలిమ్స్. మొత్తం ఆరు పాటలు. అందులో ఐదు పాటలు నేను రాస్తే ఒక పాట కీరవాణిగారు వ్రాశారు.

కీరవాణిగారి తండ్రిగారు శ్రీశివశక్తిదత్తాగారు గొప్ప రచయిత. పండితులు. డైరెక్టర్.

వారి ‘గంగావతరణం’ కావ్యాన్ని కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు విని, పులకించి, స్వయంగా శాలువ కప్పి సత్కరించారు. ఎంత సాంప్రదాయవాదో అంత మౌస్ట్ మోడరన్ శ్రీ శివశక్తిదత్తాగారు. వారి తమ్ముడు విజయయేంద్ర ప్రసాద్ గారి గురించి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో నేడు తెలియనివారు లేరు. ‘బాహుబలి’, ‘జై భజరంగీ భాయీజాన్’ వంటి వెయ్యి కోట్ల క్లబ్బులో చేరిన సూపర్ హిట్ సినిమాలకి కథ అందించింది విజయేంద్రప్రసాద్ గారే. వారి అబ్బాయి రాజమౌళిగారు. భారతదేశంలోని టాప్ డైరెక్టర్స్‌లో‌ ఒకరు. అలాగే కీరవాణి గారి తమ్ముడు కల్యాణి మాలిక్, ఎం.ఎం.శ్రీలేఖ, కాంచీ వీరంతా కూడా లబ్ధప్రతిష్ఠులే. కీరవాణిగారి భార్య శ్రీమతి శ్రీవల్లి, రాజమౌళిగారి భార్య రమ, వాళ్ళిద్దరి పిల్లలూ కూడా చలన చిత్ర పరిశ్రమలో వారి వారి ప్రత్యేకతని చాటుకున్నవారే. ఆకాశపు అంచుల వరకూ ఎదిగే శక్తి సామార్థ్యాలు వున్నవారే.

కె.రాఘవేంద్రరావుగారితో అంతకు ముందు ‘రౌడీ అల్లుడు’, ‘అల్లరి మొగుడు’ సినిమాలు చేసినా, ఆ అనుభవం వేరు. ‘ఘరానా మొగుడు’ చిత్రం అనుభవం వేరు.

సిట్టింగ్స్ జరిగింది హైదరాబాద్‌లో. ఇందాక చెప్పినట్టు క్రింద బాపినీడుగారు ఉంటే, పై అంతస్తులో చిరంజీవిగారు ఉండేవారు. ఇల్లు బాపినీడుగారిదే. మొదట ప్రశాంత్ విహార్‌లో అనుకుంటా మమ్మల్ని దించింది.

ప్రశాంతమైన గెస్ట్ హౌస్. ‘ఏంది బే’ పాట కంపోజింగ్ జరిగింది అన్నపూర్ణ స్టూడియోస్‌లో.

‘బంగారు కోడిపెట్ట’ పాటకి ఫస్ట్ సిటింగ్ జరిగింది దేవీ వరప్రసాద్ గారి ఆఫీసులోనే. అది వున్నది ‘వాళ్ళువరు కొట్టం’ దగ్గరే. ఫస్ట్ వెర్షన్ రికార్డింగ్ కూడా అయింది. కానీ చిరంజీవిగారికి నచ్చలేదు.

మరుసటి రోజున మళ్ళీ సిటింగ్ పెట్టారు. ఈసారి సిటింగ్ జరిగింది దేవీవర ప్రసాద్ గారి ఇంట్లోనే.

మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడే చేశాం. కీబోర్డు ప్లేయర్‌గా నేటి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మగారు వచ్చారు. రెస్టు తీసుకుంటూ వుండగా గభాల్న కీరవాణిగారు లేచి “స్మగుల్డు గూడ్స్ బండీ వచ్చెనండీ.. హే పాపా హే పాపా హే పాపా” అని ట్యూన్ ఇచ్చారు. మణిగారు కూడా key board మీద అద్భుతమైన సహకారం ఇచ్చారు. ‘అప్ అప్ హ్యాండ్సప్’ అని కీరవాణిగారంటే, ‘చెక్.. చెక్ నీ లక్.. డిక్.. డిక్ డోలక్కుతో’ అని నా పదాలు పడ్డాయి.

పాట అరగంటలో తయారైతే లిరిక్ కూడా ఓ గంట లోపులోనే తయారైంది. ‘టైమ్’ కుదరడం అని  దీన్ని అంటారు. లక్ బాగుంటే పాట అతి తక్కువ సమయంలోనే లక్షణంగా తయారవుతుంది.

ఇంకేముందీ, దేవిప్రసాద్ గారు వినడం, ఆనందంగా చిరంజీవిగారికి కబురెట్టడం, ఆయనా విని కీరవాణిగారినీ, ఎంటైర్ ‘బ్యాచ్’నీ అభినందించడం చకచకా జరిగిపోయింది.

హాయిగా ఇంటికొచ్చాం. కానీ, రికార్డింగు రోజున నా బుర్రనిండా ఆలోచనలే. చిరంజీవి గారంటే యువతనే పిల్లలకీ ప్రాణం. మరి పిల్లలు ‘స్మగుల్డు’ అనే క్లిష్టమైన పదాన్ని పలకగలరా? అని.

AVM ‘G’ థియేటర్‌లో రికార్డింగ్, అప్పటికి నేను ‘చారీ స్ట్రీట్, టినగర్’కి మారడం జరిగింది. అది నిజంగా నాకు లక్కీ ప్లేస్. మా యింటి ఎదురుగానే AVM ‘G’ థియేటర్ సౌండ్ ఇంజనీర్ ‘రవి’ గారి ఇల్లు. ఆయన చాలా చాలా మంచివాడూ, నెమ్మదస్తుడు అయిన యువకుడు. ఎక్కువ మాట్లాడడు గానీ కనపడగానే చిరునవ్వుతోనే పలకరిస్తాడు.

నేనూ, రాఘవేంద్రరావుగారి అసిస్టెంట్ రఘూ AVM ‘G’ ఎదుట నున్న గుండ్రని జాగింగ్ ట్రాక్‌లో నడుస్తున్నాం. ఓ అరగంట తిరిగిన తరవాత సడన్‌గా ‘స్మగుల్డు గూడ్సు బండి’ స్థానే ‘బంగారు కోడి పెట్టా..’ అన్న పదం తట్టింది. నిజంగా ఆ పాట ఇప్పటికీ బంగారు కోడిపెట్టే.

గబగబా AVM ‘G’ దగ్గరికి పరిగెత్తాను. కీరవాణిగారికి పల్లవి లైను వినిపించాను. “బాగుంది.. డైరెక్టరు గారు వస్తారుగా, వినిపిద్దాం” అన్నారు.

రాఘవేంద్రరావుగారు వచ్చాక వినిపిస్తే, “బాగుంది, మరి రెండో లైను సంగతేమిటీ?” అన్నారు.

వెంటనే రెండో లైన్‌ని “చెంగావి చీర గుట్టు.. చూసుకోండీ” అని మార్చాను.

“డిస్కోశాంతికి చీర కట్టడం ఏమిటండీ?” అన్నారు KRR.

నేను కొంచెం ధైర్యం తెచ్చకుని “ఎట్టాగూ విప్పుతారుగా” అన్నా. ఆయన పకపకా నవ్వి “OK. పల్లవి ఇదే వ్రాయిద్దాం” అన్నారు.

“పండూ పండు పండూ.. ఎర్ర పండు.. ఏపిల్ దాని పేరు”

“హే పిల్లా హల్లో పిల్లా.. కాపీ గీఫీ కంచం మంచం వన్ బై టూ..”

“కిటుకులు తెలిసిన చిటపట చినుకులు..”

ఈ మొదటి లైన్లు కీరవాణి గారు కంపోజ్ చేసినవే. రెండో లైన్స్ నించీ మిగతావి నావి.

ఇది ఎందుకు చెబుతున్నానంటే, ట్యూన్ పుట్టేటప్పుడే అది కొన్ని పదాలు తోడు తెచ్చుకుని పుడుతుంది. వాటిని రిప్లేస్ చెయ్యడం చాలా చాలా కష్టం. హిందీలో ‘రామయ్యా వస్తావయ్యా’ అన్న పదం కూడా ట్యూన్‌లో పుట్టిందే. దానికి ఎన్నో ఆల్టర్నేటివ్‌లు రాసినా అతకక, ఒరిజినల్ తెలుగు పదాల్ని శ్రీ 420 హిందీ సినిమాలో యథాతథంగా వుంచారు. ఇలా ట్యూన్‍తో వచ్చిన పదాలని చాలా పల్లవులలో యథాతథంగా ఉంచడం జరిగింది. కీరవాణిగారికి సాహిత్యంతో అపరిమితమైన అభిరుచీ పరిచయం వున్నాయి. వారి పదప్రయోగాలు విలక్షణంగా వినూత్నంగా వుంటాయి మరి.

ఇందులోని ‘ఏంది బే ఎట్టాగ వుంది ఒళ్ళు’ పాట గురించి చెప్పకపోతే ఎలా? కంపోజింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగిందని చెప్పానుగా. నాకు గుర్తున్నంత వరకూ కంపోజింగ్ మొదలెట్టి “తాననా తన్నాన” అని కీరవాణి గారు అనంగానే, “ఏంది బే” అని పదాన్నిచ్చింది రాఘవేంద్రరావు గారు. వెంటనే “ఏంది బే ఎట్టాగ వుంది ఒళ్ళు” అన్నాక, ‘ఎక్కడో గుచ్చావు చేప ముల్లు’ వచ్చింది. అలా అందరం తలో మాటా వేసిన పల్లవి అది. అందుకే అంత కిర్రెక్కి కిక్కెక్కించింది.

ఈ పాట గురించో ‘డేంజరస్ ముచ్చట’ వుంది. అప్పట్లో ‘చిరంజీవి’ అనే పత్రిక వచ్చేది. పత్రిక సంపాదకులూ, ప్రకాశకులూ కూడా విజయబాపినీడుగారే. ‘చిరంజీవి’ గారి గూర్చిన సమాచారమే గాక చాలా ఉత్సాహభరితమైన విశేషాలు వుండేవి.

ఈ పాట పల్లవి press లో రాగానే ఓ వీరాభిమాని, నాకూ, చిరంజీవి పత్రికకీ భీకరమైన పదాలతో ఉత్తరం రాస్తూ “మా తమ్ముడు, చిరంజీవి ముఖచిత్రం వున్న పత్రికని గుండ్రంగా మడిస్తేనే సహించలేక విరగదన్నినవాడ్ని, ‘ఏంది బే’ అని ఓ అనామకురాలైన హీరోయిన్ మా బాస్‍ని నిందిస్తే ఎలా వూరుకోగలను.. వెంఠనే ఆ పాటని తీసేసి అభిమానులకు క్షమాపణ చెప్పండి. లేకపోతే పరిణామం అతి తీవ్రంగా వుంటుంది” అని పూర్తి చేశాడు రక్తంతో.

నేను మాట్లాడకుండా ఆ వుత్తరాన్ని బాపినీడుగారికి ఇచ్చాను. వారు చిరంజీవిగారితో మాట్లాడి, వారి ద్వారానే చిరంజీవి పత్రికలో సదరు అభిమానికి జవాబు ఇప్పించారు. చిరంజీవిగారు కల్పించుకోవడం వలన ఆ ఎపిసోడ్ ప్రశాంతంగా ముగిసింది. లేకపోతే..! అప్పటి దాకా నాకు తెలీదు.. అభిమానాలు దురభిమానాలుగా కూడా మారతాయని. అయితే అ పర్సంట్ 1% కంటే తక్కువే. అభిమానుల అభిమానమే కదా సినిమాలకీ, హీరో హీరోయిన్లకీ దర్శకులకీ రచయితలకీ కూడా ప్రాణవాయువు. ‘ఘరానా మొగుడు’ సినిమా గురించి గర్వపడే క్షణాలు కూడా ఎన్నో వచ్చాయి. చిరంజీవిగారి కుమారుడు చి. రామ్ చరణ్ ‘మగధీర’లో ‘బంగారు కోడి పెట్ట’ పాటకి మెగాస్టార్‌తో కలిసి డాన్స్ చెయ్యడం,  అదీ కీరవాణిగారి సంగీత దర్శకత్వంలో రీమిక్స్‌గా! ఏ రచయితకి మాత్రం ఇంతకన్నా గర్వకారణం ఏముంటందీ? ‘వానా వానా వెల్లువాయే’ పాటలో రామ్ చరణ్ గారు తండ్రి పాటకి డాన్స్ చెయ్యడం వేరు. ‘మగధీర’లో తండ్రీ తనయులిద్దరూ కలిసి డాన్స్ చెయ్యడం వేరు.

***

‘బంగారు కోడి పెట్టా’ సాంగ్ పిక్చరైజ్ అయ్యాక దేవీవరప్రసాద్ గారు నన్ను ఆఫీసుకి పిలిపించి పాట చూపించారు. అద్భుతంగా పిక్సరైజ్ కాబడ్డ పాట. ప్రతీ మూవ్‌మెంట్ కన్నుల పండగే. పాత్రికేయుడు, నన్నే స్వంత అన్నగారి భావించే మోహన్ గోటేటి (ఈనాడులో, అదే సితారలో ఉండేవారు) ఆ పాటని చూసి నా రూమ్‍కి వచ్చి మరీ కంగ్రాట్స్ చెప్పారు.

సినిమా ప్రివ్యూ చూశా. రూమ్‌కి వచ్చి ‘సైలెంటు’గా కూర్చున్నాను. కొన్ని క్షణాలు మనిషి ఆనందంలో వెర్రెక్కేలా చేస్తే, కొన్ని క్షణాలు ఆనందంతో కలిసిన ఓ స్తబ్ధతతో మనిషిని మౌనంలోకి నెడతాయి. ఎందుకూ అని ఎన్నిసార్లు వెతికినా దానికి జవాబు మాత్రం నాకు దొరకలేదు.

కొన్ని కన్నీటి చుక్కలు
కళ్ళల్లోకే ఆవిరైనట్టు
కొన్ని చిరునవ్వులు
మౌనంలోకి జారిపోతై.
ఆనందం నవ్వుగా మారడం సులువే
కానీ
వేదన రోదనగా మారడం
సులభం కాదు

***

“బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్” అని కవిగారెందుకన్నారో అప్పుడర్థమైంది నాకు.

***

తెలుగు మూవీ మెఘల్ & దర్శకరత్న

‘సురేష్ ప్రొడక్షన్స్’ ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేశారు. హైదరాబాద్ వెళ్ళాల్సి వుంటుందనీ, పాట వ్రాయాలనీ. డైరెక్టర్ దర్శకరత్న దాసరి నారాయణ రావు గారు. దాసరిగారికి పాటలు వ్రాయడం అంత ‘మజా’ ఎందుకంటే, సరదాగా మాట్లాడుతూ mood set చేసి, అప్పుడు సన్నివేశం చెబుతారు. చకచకా పాట పూర్తవుతుంది. ఒకవేళ మార్పులూ చేర్పులూ వున్నా ఆయన చెప్పే విధానం ఎంత సున్నితంగా వుంటుందంటే, ‘అవును కదా.. అరెరే’ అని రైటర్ అనుకుని పాటని సరిదిద్దేంత.

సినిమా పేరు సూరిగాడు. సురేష్ ప్రొడక్షన్స్ అంటే ఓ ప్రెస్టేజియస్ సినిమా నిర్మాణ సంస్థ. డి. రామానాయుడు అప్పటికే భారతదేశంలో పేరు పొందిన నిర్మాత. అంతకు ముందు వారిని కలిశాను.. వేరు వేరు సందర్భాలలో, కానీ, వారి సినిమాకి రచయితగా మాత్రం కలవలేదు.

రామానాయుడు స్టూడియోస్ ‘గ్లాస్ హౌస్’లో జరిగింది కంపోజింగ్. చాలా ఆప్యాయంగా ఆదరంగా పలకరించి, స్వాగతించారు రామానాయుడుగారు. “ఏం భువనా.. రా” అంటూ నోరారా పిరిచారు దాసరిగారు. “రండి రండి..” అంటూ అభిమానంగా చోటు చూపారు వాసూరావుగారు.

 

మొదటి పాట

“ఆ..శా.. ఒకే ఒక ఆ..శా
అదే నా..శ్వా.సా”
కమ్మని కౌగిలి కోరితే దురాశా
తీయని పెదవులు కలిపితే ఓ నిషా

అనే డ్యూయెట్.

నల్లేరు మీద బండిలా హాయిగా నడక సాగింది. గ్లాస్ హౌస్ నించి చుట్టూ చూస్తే అద్భుతమైన ‘వ్యూ’ కళ్ళబడుతుంది. స్టూడియో హైట్‌లో వుండటం వలన చల్లని గాలి. కొద్దిగా శీతాకాలపు పొద్దులో అయితే ‘మధురమైన’ చలి. పువ్వులు.. లతలు.. వాటి మీదుగా సువాసనలను వెదజల్లే కొండగాలి. దూరాన తటాకం. పైన హంసల్లా తేలే మబ్బులూ. ఇంకేం కావాలి.. పాట వ్రాయడానికి? మధ్యమధ్యలో తినుబండారాలు, పానీయాలూ (కూల్ డ్రిక్స్ గానీ – టీ కాఫీ ఎక్రట్రాలు గానీ) వాటికి మించిన జోకులు, కబుర్లు. It was lovely.

మధ్య మధ్యలో పలకరించడానికి వి.సి. గురునాథన్ గారు వచ్చేవారు. వి.సి. గురునాథన్ అప్పట్లో మాంఛి పేరున్న డైరెక్టర్లలో ఒకరు. మంచి నిర్మాత కూడా. అన్నిటినీ మించి అందరితోనూ హాయిగా కలిసిపోయే మంచి మనిషి. వారికి రామానాయుడు గారంటే చాలా అభిమానం. తెలుగు నేర్చుకున్నారు కొంత.

వాసూరావుగారూ నేనూ కూడా ‘బస’ చేసింది సురేష్ గెస్ట్ హౌస్ లోనే. ఆ గెస్ట్ హౌస్ నాకు కొత్త కాదు. పైగా అచ్చొచ్చిన గెస్ట్ హౌస్. ఇద్దరం ఒకే రూమ్‌లో ఉన్నాం. అంతకు ముందే ఓ ఊయల పాట ట్యూన్ OK అయింది. పచ్చి మిర్చి బజ్జీలు నములుతూ వాసుభయ్యా “భలే మెలోడీ కదూ!” అన్నారు. నాలుగయిదు సార్లు విన్నాం.. tape record లో. కంపోజింగ్ టైమ్‌లో “ఊపేది ఎవ్వరైనా” అని దాసరిగారో మాట అన్నారు. ‘భలే వుందే’ అనుకుని అదే పల్లవిగా అనుకున్నాం. సరదా సరదాగా పాట పూర్తయింది. కానీ, మరుసటి రోజున మళ్ళీ ఆ పాటని పాడుకున్నాక తెలిసింది. నేను రాసిన పాటల్లో అదో మెమొరబుల్ సాంగ్ అని. ఒక ఊయలని సంబోధిస్తూ భార్యాభర్తలు తమ కష్టాల్ని, పరిస్థితుల్నీ కలబోసుకున్న పాట ఇది. నేపథ్య గానం: ఎస్.పి. బి, పి. సుశీల. చిత్తగించండి.

~

పల్లవి:
ఊపేదీ ఎవ్వరైనా.. ఊగేది ఎవ్వరైనా
నవ్వుతూ ఊగావే ఊయలా.. నీ
బ్రతుకంతా నవ్వులే ఊయ్యాలా ॥ఊపేదీ॥

చరణం 1:
ఆమె:
కెవ్వుమని ఏడ్చేటి బిడ్డను.. నీ ఒడిలో మురిపిస్తావే ఊయల
అతడు:
ఎదిగాక చోటు చాలదంటూ.. నిను మూలకి విసిరేస్తారే ఊయల
ఆమె:
అయినా నువ్వు నవ్వులే పంచిస్తావే..
అతడు:
నవ్వుల పాలైనా నువ్వు మన్నిస్తావే..
నిన్నటి పాఠాలు మరిచి ఊబిలోకి దిగమాకే ॥ఊపేదీ॥

చరణం 2:
ఆమె:
రాయి విసిరినా దయతో ఊయలా..
చెట్టు కాయలివ్వదా చెప్పవే ఊయలా..
అతడు:
చెట్టు దిగిన మరుక్షణమే ఊయలా
దాన్ని మొదలంటూ నరుకుతారే ఊయలా..
ఆమె:
అంతా మన నుదుటి రాత అనుకుందామే
అతడు:
తలరాత అనుకుంటే తల పగిలేనే
మన కోసమే మన బతుకు సాగించాలే.. ॥ఊపేదీ॥

~

SPB, సుశీలమ్మలకు జేజేలు.

***

“అమ్ములాలో.. అబ్బలాలో.. అబ్బాయి చేశాడు విన్నపాలు..”

“కొట్టిందమ్మో.. కొట్టిందమ్మో.. పైటగాలీ కొట్టిందమ్మో”

ఈ రెండు పాటలు డ్యూయెట్లు. ‘ఊయల’ పాటలో DNR గారి నట విశ్వరూపం చూడొచ్చు. ఇక సుజాతగారు నిజంగా అజాత శత్రువే. ఓ చిన్న చిరునవ్వుతో అందర్నీ గెలుచుకునేది. అత్యంత సాత్వికమైన మనిషీ.. మాటా.. మద్రాసులో అతి ప్రఖ్యాతి గాంచిన ‘అంబికా అప్పళం స్టోర్స్’ వారిదేనని విన్నాను. చాలా బ్రాంచీలు ఉన్నై. చాలా స్వచ్ఛమైన, నిఖార్సైన సరుకులు దొరుకుతాయి. అనేకాకనేక ‘అంబికా వారి’ పొడులతో సహా!

సూరిగాడు నూర్రోజుల పండగ చేసుకుంది. DNR, సుజాత, సురేష్, యమున పోటీపడి నటించారు. చివర్లో కోర్డు సీన్‌లో అయితే DNR నటన న భూతో న భవిష్యతి.

భారతదేశంలో ఆల్మోస్ట్ అన్ని భాషల్లో సినిమాలు తీసి గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించిన రామానాయుడు గారు, రచయితగా, కథా స్క్రీన్  ప్లే డైలాగ్ రైటర్‌గా, పాటల రచయితగా దర్శకుడిగా, అద్భుతమైన దర్శకుడుగా డా. దాసరి నారాయణరావు గారు అందుకున్న శిఖరాల్ని మరొకరు అధిగమించలేరనడం అతిశయోక్తి కాదు. ఓ నిర్మాతగా, దాసరి ఫిలిం యానివర్శిటీ స్థాపకుడిగా లెక్కలేనంత మంది డైరెక్టర్లనీ, ఆర్టిస్టులనీ టెక్నీషియన్స్‌నీ పరిశ్రమకి పరిచయం చేసిన ఘనత D.N.R.దే. ఆయన డైరెక్టు చెయ్యని top ఆర్టిస్టులు భారతదేశంలో అతి తక్కువ మంది వుంటారు. అలాంటి DNR గారూ,

అలాగే, అత్యంత సాత్వికమైన పాత్ర పోషించి, హీరోయిన్‌గా, తల్లిగా కేరక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించుకున్న సుజాతగారూ, రామానాయుడుగారూ ఇవ్వాళ మన మధ్య లేరు. కానీ వారి సినిమాలున్నాయి. వారి జ్ఞాపకాలున్నాయి. ధైర్యంగా వెనుక తరాలు ముందుకు దూసుకుపోవడానికి వారు మిగిల్చిన వారి అడుగుజాడలున్నాయి. ఆ జీవితాలు మనకి స్ఫష్టంగా చెబుతాయి. “మిత్రమా.. జీవితం క్షణభంగురం. మరణించేలోగానే నీ స్పష్టమైన అడుగుజాడల్ని యీ పవిత్రమైన భూమి మీద నిలుపకో” అని. మృత్యోర్మా అమృతంగమయ..

(ఇంకా ఉంది)

Exit mobile version