[ప్రముఖ కథా, నవలా, సినీగీత రచయిత, శ్రీ భువనచంద్ర తమ సినీ జీవన ప్రస్థానాన్ని ‘జీవితం ఓ ప్రయాణం’ అనే పేరుతో సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు.]
~
‘వాలు జడ తోలు బెల్టు’ అనేది విజయ బాపినీడు గారు రాసిన డిటెక్టివ్ నవల టైటిల్. దాన్ని సినిమాకి పెట్టారు కానీ, ఆ నవలకీ సినిమాకీ సంబంధం లేదు. ఒక కుర్రాడు, అదీ ఏది పడితే అది బంగారమయ్యే ‘సుడిగాడు’ పోలీసుగా సెలెక్టవుతాడు. పల్లెటూరి తెలివితేటలు చాలా వున్నా, దాంతో పాటు బోలెడు అమాయకత్వమూ వుంది. ఇందులో SP వచ్చి జనార్ధన్ వల్లభనేని. ఆయన బాపినీడు గారి అల్లుడే. దర్శక శాఖలో మంచి పేరు సంపాదించుకున్నారు. ‘హంసమేడ’ అని మేము ఒక సినిమాకి పని చెయ్యాల్సింది. కానీ అది మధ్యలో ఆగింది.
రాజేంద్ర ప్రసాద్ పల్లెటూరి నించి పట్నం వెళ్ళేప్పుడు అతనితో తిరిగిన ఫ్రెండ్స్ అందరూ సెండాఫ్ ఇస్తూ నాలుగు మంచి మాటలు చెబుతారు అవేమిటంటే..
~
పల్లవి:
పెద్ద వీధి చిన్న వీధి ఇరుకు వీధి మెరక వీధి
అన్ని వీధులూ వూరివేరా
పొట్టివాడు పొడుగువాడు ఉన్నవాడు లేనివాడు
అన్ని రూపులూ మనిషివేరా
ఊరి వూరికీ భేదముందిరా.. మనిషి మనిషికో మర్మముందిరా
ఆచితూచి యీ జగాన అడుగు ముందుకేయరా (R) ॥పెద్ద॥
చరణం 1:
కష్టమొచ్చినా.. నష్టమొచ్చినా.. బెదిరిపోనిదీ బంధమేరా..
రెచ్చగొట్టినా.. రచ్చకీడ్చినా..చెదిరిపోనిదీ స్నేహమేరా..
చిన్న నవ్వుతో.. లోకాన్ని గెల్చుకో
వున్నదానితో.. స్వర్గాన్ని మలుచుకో
కలిమిలో పొంగకూ.. లేమిలో కృంగకూ.. భాయీ..
నిన్నుగన్న వూరి ప్రేమ మరిచిపోకు నేస్తమా ॥పెద్ద॥
చరణం 2:
మనసు నమ్మిన.. మార్గమెంచుకో.. ముక్కుసూటిగా సాగిపో
మాయ అద్దమీ.. పాడు లోకమూ.. ముందుచూపుతో మసలుకోరా
పూలబాటలో.. విషనాగులుండవా..
లేళ్ళ చెంతనే.. తోడేళ్ళు వుండవా..
పిడుగులే రాలినా.. అడుగులే సాగనీ.. భాయీ..
లక్ష ముళ్ళకంటే ఒక్క పువ్వు మేలు మిత్రమా (R) ॥పెద్ద॥
~
లిరిక్ విన్న వెంటనే బాపినీడు గారు OK చేసేశారు.
ఈ పాట వారికే కాదు.. నాకూ చాలా ఇష్టమైన పాట. నేను IAFలో సెలక్టై వెళ్ళేప్పుడు, నా స్నేహితుల మాటలు గుర్తొచ్చి రాసినదీ పాట.
***
మిగతా పాటలుః
ఆమె:
అబ్బ ఏం గాలీ..
అతడు:
ఏం కావాలీ..
ఆమె:
వెచ్చగా నీలో.. దాగిపోవాలీ..
అతడు:
చలిగా వుంటే.. వేడి చెయ్యనా..
రావే.. నా … గుండెలోకి గుట్టుగా
ఆమె:
గోలిసోడా తాగిస్తారా.. పోలిసోడా ఇయ్యాళ
తిరపతి లడ్డూ తినిపిస్తా నా పరపతి చూస్కో యీ వేళ.
ఆమె:
గంగరావి చెట్టు కాడ పంబడో.. నువ్వు..
గంగ వెఱ్ఱులెత్తమాక పంబడో..
అతడు:
చల్లలమ్మటానికొచ్చి పంబడీ.. నువ్వు
చల్లముంత దాయమాకె పంబడీ..
~
“తాననానన నాననానన నానా నానా.. తానననా”
(ప్యార్ హూవా ఇక్‌రార్ హూవా ప్యార్ సే ఫిర్ క్యూం డర్తా హై దిల్)
ప్రసన్నకుమార్ సర్రాజు
కన్నడలో ‘నంజుండ కల్యాణం’ 500+ రోజులు ఆడింది. అదే సినిమాని ‘మహాజనానికి మరదలు పిల్ల’ పేరుతో రీమేక్ చేస్తే ఖర్చు పెట్టిన దానికి డబ్బులు తెచ్చుకుంది కానీ, కన్నడ సినిమాలాగా రికార్డులు బద్దలు గొట్టలేదు. అంతెందుకూ, ‘ప్రేమదేశం’ సినిమా తెలుగులో బిగ్గెస్ట్ హిట్. అదే సినిమా ఒరిజినల్ ‘కాదల్ దేశం’ తమిళనాడులో యావరేజ్‌గా ఆడింది.
ఏది ఎందుకు జనాలకి నచ్చుతుందో నచ్చదో తెలిసినవాడు ఎవరూ? కేవలం పైవాడికే తెలిసుండాలి మరి.
ఏమైనా, ‘వాలు జడ తోలు బెల్టు’ సినిమా ‘పెద్ద వూరు చిన్న పూరు’ అనే మంచి పాటనీ, ప్రసన్నకుమార్ సర్రాజు లాంటి మంచి స్నేహితుడ్ని ఇచ్చింది. ప్రసన్న కుమార్ ఆ తరవాత SVK గారి దగ్గర ఎన్నో సినిమాలకి పని చెయ్యడంతో మేం మరింత స్నేహితులమయ్యాము. ఆయనో మంచి రైటర్ కూడా!
~
ఆలపాటి రంగారావు గారు నా మొట్ట మొదటి చిత్రం ‘నాకూ పెళ్ళం కావాలి’ కి నిర్మాత. ఇన్నాళ్ళ తరవాత వారి సమర్పణలో ‘శ్రీ శరణు చిత్ర’ బ్యానర్‌లో కె.రామమోహనరావు నిర్మాతగా, జి. రామ్ సురేష్ దర్శకత్వంలో, బడి సంగీత దర్శకుడు ‘కృష్ణతేజ’ సంగీత దర్శకత్వంలో చేసిన సినిమా ‘శ్రుక్రవారం మహాలక్ష్మి’.
రికార్డింగ్ జరిగింది ‘సాగర్ మేగ్నటెక్ సౌండ్స్’ అనే మినీ రికార్డింగ్ థియేటర్‌లో.
అప్పటికే మెల్లమెల్లగా రికార్డింగ్ థియేటర్ల రూపురేఖలు మారడం మొదలైంది. ఎలెక్ట్రానిక్స్ దూసుకొస్తున్నాయి. కీబోర్డులు, రిథమ్ బాక్సు వాడకం పెరిగింది. వాద్యకళాకారుల గుండెల్లో గుబులు మొదలైంది.
ఒకప్పుడు, అంటే నా చిన్నతనంలో ఈ పరిస్థితిని నేను కళ్ళరా చూశా. మొట్టమొదటి ట్రాక్టర్ మా వూళ్ళో అడుగుపెట్టగానే రైతులందరూ బెంబేలెత్తిపోయారు.
“ఇది మన కడుపులు కొడుతుందిరా రేయ్.. మన్ని కూలీలుగా మారుస్తుంది” అని భయపడిపోయారు.
రాజకీయ నాయకులు మాత్రం “దేశప్రగతికి యంత్రాలు వాడటం ముఖ్యం” అని ఉపన్యాసాలు దంచారు. చివరికి ఏం జరిగిందీ? కొద్దోగొప్పో వ్యవసాయం చేస్తూ ‘రైతు’ అనిపించుకున్న రైతు బిడ్డలందరూ, ఈ సరికొత్త ప్రగతిని భరించలేక ‘రైతు కూలీలు’గా మారిపోయారు. మార్పుని తలదాల్చలేనివారు పొలాల్ని అమ్మేసుకుని బస్తీ బాట పట్టి పొట్టకూటికై నానా పాట్లూ పడ్డారు.
ఆనాడు ట్రాక్టర్లు చేసిన పనే ఈనాడు ఎలక్టానిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ చేశాయి. అద్భుతమైన వాద్య కళాకారుల పొట్టగొట్టి నడి వీధిన నిలబెట్టాయి. ప్రగతిపథం అంటే ప్రజల్ని అధఃపాతాళానికి తొక్కెయ్యడమని రుజువు చేశాయి. ఇవి నేను కడుపుమంటతో అంటున్న మాటలు కాదు. కన్నీళ్ళతో అంటున్న మాటలు. వైణికులూ, వాయిలీన విద్వాంసులు, మృదంగ, తబలా వాద్యకారులూ, ఫ్లూటు వాద్యకారులు ఎందరో నేడు పనులు లేక నిర్లిప్తులయ్యారు. మానవుని మేధస్సు నిండి వ్రేళ్ళ అంచుల్లో నృత్యం చేసిన సంగీత సరస్వతి నేడు కీబోర్డుల్లో నిక్షిప్తమైపోయింది.
కాలమహిమ అంటే ఇదే కావొచ్చు. సరే, ‘శుక్రవారం మహాలక్ష్మి’ సినిమాలో రెండు పాటలు వ్రాశాను.
“ఆ నెలవంకవో..
నా కలహంసవో..
నీ గుండెల్లో
నేదాగిపోనా” అనేది ఒకటైతే – (పాడింది S.P.B, సుశీల)
“ఉంగరాల బంగారయ్యా బొంకమాకూ..
అప్పనంగ దేవుడి మాన్యం మింగమాకూ” (పాడింది – లలితా సాగరి) – అనేది రెండోది.
‘శుక్రవారం మహాలక్ష్మి’ మరో మేధావిని పరిచయం చేసింది. ఆయనే శ్రీ S.V. రామారావుగారు. సినిమా చరిత్రని ఔపోసన పట్టినవారు. పాటలు, గీత రచయితలు, సంగీత దర్శకులు, గాయనీగాయకులు.. ఇలా ఏ వివరాన్నైనా క్షణాల్లో చెప్పగల మేధావి.
‘సినీ విజ్ఞాన విశారద’ అన్న బిరుదును సార్థకం చేసుకున్న శ్రీ S.V.రామారావుగారూ, నా చేత వెంటవెంటనే రెండు పాటలు వ్రాయించారు. “రెండో పాట రేపు చూద్దాం సార్” అని నేను బద్ధకిస్తుంటే, “గంటలో మీరు పాట రాసేస్తారు మాకు తెలీదా?” అని ఉత్సాహపరిచి పాట వ్రాయించుకున్న మంచి మనిషి. ఇప్పుడు కూడా వారూ నేనూ మాట్లాడుకుంటూనే వుంటాం. గతాన్ని తలచుకుంటూ, ఆ స్వర్ణయుగాన్ని గురించిన జ్ఞాపకాలతో మైమరచిపోతూనే వుంటాం.
ఇక్కడో విషయం చెప్పాలి. సినీరంగంలో ఎంచుకున్న మార్గాన్ని వదిలి మరో మార్గంలోకి వెళ్ళకూడదు. కృష్ణతేజ sought after ట్రాక్ సింగర్. ఒక్క సినిమా ‘బడి’ చేసేసరికి ట్రాక్ సింగర్‌గా ఆయన్ని దూరంగా పెట్టారు. ఈ ‘శుక్రవారం మహాలక్ష్మి’ తరవాత ఆయనకి సంగీత దర్శకత్వం చేసే అవకాశమే రాలేదు. అలాగే ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్నపాటి ‘నటి’ అయింది. అంతే, చచ్చినా ఆవిడకి తిరిగి డబ్బింగ్ చెప్పే అవకాశం ఇవ్వలేదు.
ఒక విధంగా తమ్ముడు ‘కృష్ణ తేజ’కి అదే వరమైంది. ఇండివిడ్యువల్ డబ్బింగ్ రైటర్‌గా ఎన్నో వందల సినిమాలకి చేశాడు. మ్యూజిక్, రైటింగ్ (డైలాగ్) తనే చూసుకునేవాడు. ఎన్నో పాటలు నా చేత వ్రాయించాడు. ఆ తరవాత ఇప్పుడు ‘తెలుగు సెక్షన్’ని చూసుకోవడానికి పెర్మనెంట్‌గా, హారిస్ జయరాజ్‌కి సహకరిస్తూ, తన పనులు తాను చేసుకుంటున్నాడు. నేర్చుకుంటే ఇది ఓ పాఠమే గదా!
***
మొదటిసారి.. ఇళయరాజాగారిని కలవడం:
అంతకు ముందు రాజా గార్ని కలవకుండా ఆయన ట్యూన్స్‌కి పాటలు వ్రాశా. ఆ సినిమా పేరు ‘ఇదేం పెళ్ళాం బాబోయ్’.
ఆ తర్వాత ఆయన మ్యూజిక్ చేసిన అన్ని పాటలూ, తెలుగులో రాసి కూడా ఒక్క పాటా రికార్డు చేయించుకోలేకపోయా. ఆ సినిమా పేరు ‘చంటి’. నిర్మాత K.S. రామారావుగారే స్వయంగా నన్ను సినిమాకి తీసికెళ్ళి చూపించి వ్రాయమన్నారు. చాలా కష్టపడి అన్ని పాటలూ రాశాక “ఏమోనండీ.. పాటలు అందలేదు – మీరు పంపినవీ” అన్నారు. తీరా చూస్తే అవన్నీ వేరే రచయితల గీతాలతో రికార్డు కూడా అయిపోయాయి. బహుశా అప్పుడు పొందిన బాధ జన్మలో ఏనాడు పొందలేదు.
“పావురానికీ పంజరానికీ పెళ్ళి చేసె యీ లోకం” అనే పాటకి నేను వ్రాసుకున్న లిరిక్ ఇంకా నాకు గుర్తుంది.
~
పల్లవి:
గొంతు నులిమీ కోయిలమ్మనీ
పాడమంటదీ లోకం..
కాళ్ళు విరిచీ నెమలి పిల్లనీ
ఆడమంటదీ లోకం..
ఆ కోయిల పాడేనా.. ఈ నెమలి ఆడేనా.. ఓ.. ఓ..
చరణం:
తలరాత నేముందో తలపోయలేకా
వేశాను ఓ మూడు ముళ్ళు
తెలిశాక గుండెల్లో గునపాలు దిగితే
ఏడ్చాయి నా రెండు కళ్ళు..
ఏ జన్మపాపాలు వెంటాడినాయో
తీర్చేసుకున్నాయి.. కక్ష..
తావులేని చోటా.. తల దూర్చడమే నేరం..
తప్పు కాయమంటూ తల వంచడమే న్యాయం..
నా బతుకే ఓ శాపం.. ॥గొంతు నులిమీ॥
(PS: K.S. రామారావుగారు చాలా సార్లు హెచ్చరించారు నన్ను.. తమిళ పాట మీనింగ్‌కి అతి దగ్గరగా నేను రాసే పాట వుండాలని. మూలంలో వున్న అర్థాన్నే తెలుగులో చక్కగా తేవడం జరిగింది. ప్రతీ పాటనీ మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకుంటూ రాశాను. కానీ, అవి నా దగ్గరే వుండిపోయాయి. నో ప్రోబ్లమ్. ఆశనిరాశల ఉయ్యాలేగా జీవితమంటే..)
‘చంటి’ని పక్కన పెడితే నాకు సి.ఎల్.నరసారెడ్డి, బి.గోపాల్ గార్ల రూపంలో ‘చినరాయుడు’ దొరికాడు. నిర్మాణ సంస్థ-శ్రీదత్తసాయి ఫిలిమ్స్.. సంగీతం ఇళయరాజా.
సాకీ:
ఊరి దిష్టి వాడ దిష్టీ ఇరుగు దిష్టీ.. పొరుగు దిష్టీ.. మనిషి దిష్టీ
మాను దిష్టీ.. నరుల దిష్టీ పరుల దిష్టీ.. తల్లి దిష్టీ.. చెల్లి దిష్టీ
అసలు దిష్టీ.. కొసరు దిష్టీ.. కాటుకలా కరగనీ.. హారతిలా వెలగనీ
చీకటులే తొలగనీ.. చిరునవ్వులు విరియనీ..
పల్లవి:
కంటి చూపు చాలునయ్యా చిన్నరాయుడూ –
కష్టమంత తీరేనయ్యా చిన్నరాయుడు
~
ఈ పాట ఉగాది రోజు రాత్రి 7 గంటలకి SPKP ఆడియోలాబ్ (బాలుగారి థియేటర్‌లో) పైన (పై థియేటర్లో) బాలూగారు పాడారు. పాడింతరవాత “ఎంత బాగారాశారండీ, original లిరిక్‌ని ఫాలో అవుతూ కూడా చక్కని తెలుగుతనంతో పాట వ్రాశారు” అని మెచ్చుకోవడం మర్చిపోలేను.
అలాగే “బుల్లిపిట్ట బుజ్జిపిట్ట.. గూటిలోని గువ్వ పిట్ట
వెంట వెంట వచ్చేవారి పేరు చెప్పవే..
ఎవరే ఎవరే పిలిచేదీ. నేనెట్టా ఎట్టా పలికేదీ” పాటా,
“చిట్టీ చిట్టీ నీ పై టకొంచెం ఒడిసిపట్టనా
చుట్టు చుట్టుకు నా బొంగరం పదును పెట్టనా” పాట హైదరాబాదులో వ్రాసి ok చేయించుకున్నవి.
“బుల్లిపిట్ట బుజ్జి పిట్ట గూటిలోని గువ్వపిట్ట
పంజరాన రామ చిలుక ఎట్టావున్నదే
ఎవరే ఎవరే తెలిపేదీ.. ఎన్ని నాళ్ళే ఇట్టా గడిపెదీ”
ఈ పేథోస్ song మద్రాసులోనే వ్రాశాను. సి.ఎల్. నరసారెడ్డిగారు చాలా ఉత్సాహవంతులైన నిర్మాత. మృదువుగా, చిరునవ్వుతో మాట్లాడేవారు. ఇక మా బి.గోపాల్ గారి సంగతి చెప్పనే అక్కర్లా. మోస్ట్ జంటిల్‍మన్ డైరెక్టర్.
“నిండు ఆకాశమంత మనసు వున్న రాజువయ్యా..
పండు వెన్నెల లాంటి చల్లని చూపుల రేడువయ్యా
ముచ్చటగా.. ఒకతాళి కట్టీ
నింగికి నేలకు నిచ్చెన వేసిన దేవుడు నీవే..
చిన్నరాయుడు నీవే” పాటా మద్రాసులో రాసిందే.
ఈ పాట రెండో చరణంలో వ్రాసిన
“నీటిలోని చేప కన్నీరు ఎవరికెరుకా
గూటిలోని చిలుక గుబులేదో ఎవరికెరుక
నుదుటి మీద రాత వేరెవరు మార్చగలరూ
న్యాయమూర్తి నీవే.. తీర్పెవరు తీర్చగలరూ
ఒంటరిదీ.. నీ పయనం.. నిబ్బరమే.. నీకభయం
తప్పుకి ఒప్పుకి గంతలు కట్టిన దేవుడి లీలా?
ఇది కాకుల గోలా”
అనే పదాలన్ని నాటి ప్రముఖ రచయిత, నేటి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తండ్రిగారైన జి.సత్యమూర్తిగారికి చాలా ఇష్టం.
ఎప్పుడు కనిపించినా “ఎంత బాగుందండీ” అనేవారు. ఇందులో అన్నిటికన్నా కష్టపెట్టింది “స్వాతి ముత్యమాల” అనేది. అది చాలా ఫేమస్ song. తమిళంలో “ముత్తు మణిమాలె” అని వస్తుంది. “మణి” అనే పదం రావాలని ఒకరి పంతం. “ముత్యమణిమాల” అంటే తప్పేమిటని కూడా అడిగారు. చివరికి బి.గోపాల్, సి.ఎల్. నరసారెడ్డి గారి కన్విన్సింగ్‌తో ‘స్వాతిముత్యమాల’ పదాన్ని ok చేసాను. ఒక్కోసారి చిన్న విషయాలే చికాకు పెడతాయి. సమయాన్ని లాగుతూ వుంటాయి. ఇంతకీ ఆ పేచీ పెట్టినవారు తెలుగు రాని తమిళుడు. ఇంతకీ పల్లవి సంగతి మీరూ చూడండి.
~
పల్లవి:
స్వాతిముత్యమాల.. ఒళ్ళు తాకి తుళ్ళిపోయిందీ
సిగ్గుపడ్డ చీ.. ర.. కట్టు వీడి జారిపోయిందీ..
కొంగు చాటు అందాలూ.. కన్ను కొట్టి రమ్మంటే
వయసాడమంది సయ్యాటా.. ఇది యవ్వనాల పూదోట..
చరణం:
ఆమె:
పెదవితో పెదవి చేరితే.. మధువులే కురియవా
అతడు:
తనువుతో తనువు తడిమితే.. తపనలే రేగవా
ఆమె:
తొందరెందుకంది కన్నె మనసు.. పూలతీగ లాగ వాటేసీ
అతడు:
ఊయలూగమంది కోడె వయసు.. కోడెగిత్తలాగ మాటేసీ
ఆమె:
కవ్విస్తున్నదీ.. పట్టెమంచమూ.. రావా.. రావా.. నా రాజా ॥స్వాతి॥
చరణం 2:
అతడు:
మేఘమా మెరిసి చూపవే.. గడుసరి తళుకులూ
ఆమె:
మోహమా కొసరి చూపమే.. మగసిరి మెరుపులూ
అతడు:
కొల్లగొట్టమంది.. కన్నెసొగసూ.. కొంటెకళలన్నీ నేర్చేసీ..
ఆమె:
లెక్కపెట్టమంది.. సన్నరవిక.. ముద్దులెన్నొ మోజు తీర్చేసీ
అతడు:
పరుపే నలగనీ. పరువం చిలకనీ.. మళ్ళీ.. మళ్ళీ.. యీ వేళా.. ॥స్వాతి॥
~
‘చినరాయుడు’ ఎంత మంచి పని చేసిందంటే, ‘చినరాయుడు’ పాటలన్నీ ఇళయరాజాగారి అసిస్టెంట్ సుందరేశన్ గారు తమిళంలో రాసుకుని length లు check చేసేవారు. పాటలన్నీ చూశాక సుందరేశన్ గారితో ఇళయరాజాగారు “ఇతను పెర్‌ఫెక్ట్ లెంగ్త్‌ని రాస్తున్నాడు. చెక్ చెయల్సిన పని లేదు” అన్నారు. ఆ మాట నాకెంత సంతోషాన్ని ఇచ్చిందో చెప్పలేను.
తమిళ నాట ఇళయరాజాగారి ‘వెలుగు’ని మరే సంగీత దర్శకుడూ చూడలేదు. ఆయన సంగీత దర్శకత్వం వహించే సినిమా మ్యూజిక్ సిటింగ్ రోజునే, బ్రహ్మాండమైన బేనర్లు, పెద్ద పెద్ద కటౌట్స్ రోడ్డు రోడ్డంతా వెలిసేవి. హీరో హీరోయిన్లకీ దర్శక నిర్మాతలకీ లేని ‘క్రేజ్’ ఇళయరాజాగారి మ్యూజిక్‌కి వుండేది. ఇక రికార్డింగ్ దగ్గరయితే వందల కొద్దీ కార్లు.
అందరు మ్యూజిక్ డైరెక్టర్లు “అడిగినన్ని ట్యూన్స్” ఇస్తే ఇళయరాజాగారి దగ్గర మాత్రం, ఆయన ఇచ్చినవి తీసుకోవాలి. అయినా “ఇస్తే చాలు.. అదే మహా ప్రసాదం” అన్నట్టు నిర్మాతలూ దర్శకులూ క్యూలు కట్టేవారు.
“ఫలానా కుర్రాడి దగ్గర మంచి కథ వుంది. సినిమా తియ్యొచ్చు. తీస్తే నేను మ్యూజికు చేస్తా” అంటే చాలు నిర్మాతలు ముందు కొచ్చేవారు. ఇళయరాజాగారు అలా ఇచ్చిన ఆశీస్సులతో డైరెక్టర్లయిన వారు కూడా చాలామందే వున్నారు. ఆయనతో పరిచయం ‘చినరాయుడి’ మహిమే. మరొకటేమంటే, బి.గోపాల్ & సి.ఎన్. నరసారెడ్డిగార్లతో బాంధవ్యం. బి.గోపాల్ గారితో ఆ తరవాత ఎన్నో ఎన్నో సక్సెస్‌ఫుల్ & టాప్ హిట్స్ చేశాను. తిరుగు లేని కాంబినేషన్ మాది.
చిన్నరాయుడనే చందమామకి వున్న ఒకే ఒక్క మచ్చ ఏమంటే, ‘చదివింపుల విందు’. తమిళనాడుకి అలాంటివి బాగా ఎక్కుతాయి. ఎంగిలి విస్తళ్ళ క్రింద డబ్బులు చదివింపుగా పెట్టడం అనేది జనానికి ఎక్కలేదు. దాని బదులుగా ‘సత్యనారాయణ వ్రతం’తో చదివింపుల ప్రహసనాన్ని చూపిస్తే సినిమా అద్భుతంగా వుండేది. నిర్మలమ్మ ఎత్తు పళ్ళు కూడా చిన్న ‘విమర్శ’కి గురైనా ఆవిడ నటన మాత్రం అద్భుతం. అన్నట్టు వెంకటేష్ గారితో నా మొట్టమొదటి సినిమా ‘చినరాయుడు’.
(ఇంకా ఉంది)
భువన చంద్ర సుప్రసిద్ధ సినీ గేయ రచయిత. కథకులు. పలు హిట్ పాటలు రచించారు. “భువనచంద్ర కథలు”, “వాళ్ళు”, “మహతి”, “పాండిబజార్ కథలు” అనే పుస్తకాలు వెలువరించారు.
