Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవితం ఓ ప్రయాణం-5

[ప్రముఖ కథా, నవలా, సినీగీత రచయిత, శ్రీ భువనచంద్ర తమ సినీ జీవన ప్రస్థానాన్ని ‘జీవితం ఓ ప్రయాణం’ అనే పేరుతో సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు.]

పొద్దున్నే సిద్ధమయ్యాను. సీనియర్ మోస్ట్ అసోసియేట్ శ్రీ శీనయ్యగారు వచ్చి పిలిచారు. కారులో వెనక సీట్లో మధుసూధనరావుగారితో పాటు కూర్చున్నాను.

నేను అత్యుత్సాహంతో, “సార్.. రాత్రి రెండో చరణం మార్చేశానండీ.. బాగా వచ్చింది” అని పేడ్ (pad) చేతికిచ్చా.

“శీనయ్యా, బండి ఆపమను” అని ఆయన ఫైల్‌ని విండోలోంచి బయటకి విసిరేశారు.

నేను గభాల్న బండి దిగి ఫైల్ తీసుకుని మళ్ళీ కార్లో ఎక్కాను.

“అసలు ఎవడూ నిన్ను మార్చమంది. ఒక్కసారి నేను ఓకే అని సంతకం పెట్టాక నన్నడక్కుండా మార్చడానికి నీకెన్ని గుండెలు?” అని కోపంగా అరిచేశారు మధుసూధనరావుగారు.

“సార్.. మొదటి చరణమూ పల్లవీ ప్రతి లైనూ ‘ప్రేమా’ అనే పదంతో end అయి బాగున్నై సార్. రెండో చరణంలో అలా లేదు. అందుకే గంటన్నర కూర్చుని మార్చాను సార్. మీకు నచ్చకపోతే పాతదే వుంచుదాం. కానీ ఒక రైటరుగా నాకు రెండోదే నచ్చింది సార్. దయచేసి వినండి” అని వినయంగా చెప్పి గబగబా పాట పాడేశాను. పాట విన్నాక, “కూర్చోండి” అన్నారు. బండి మళ్ళీ బయలుదేరింది. కాసేపాగాక “శీనయ్యా.. పాట ok అయ్యాక కూడా బెటర్‌మెంట్ కోసం ఆలోచించాడయ్యా ఇతను. పైకొస్తాడు కదూ.. ఇదిగో అబ్బాయ్. నేను డైరెక్టు చేసే ప్రతి సినిమాలోనూ నీకు కనీసం ఒక్క పాటైనా ఇస్తా.. ఇలాగే, సిన్సియర్‌గా పని చేసుకో” అని భుజం తట్టారు. అన్నట్టుగానే, వారి తరువాతి ప్రాజెక్టు ‘ప్రాణస్నేహితులు’లో రెండు పాటలు ఇస్తానని పిలిచి, అన్ని పాటలూ నా చేత వ్రాయించారు. అది వేరే కథ అనుకోండి.

AVM కి వెళ్ళాం. పాట పాడింది SPB ను సుశీలగారు. సినిమా పేరు ‘ఆత్మకథ’. గొప్ప సినిమా. మోహన్, శరత్ బాబు act చేశారు.

ఇంతకీ ఆ పాట ఏమిటో చెప్పాలిగా. మరో విషయం ఏమంటే ఆ సినిమా చూడాల్సిందే. పాటని వినాల్సిందే గానీ ‘కాసెట్’గా విడుదల కాలేదు. చక్రవర్తిగారు కంపోజ్ చేసిన మధురమైన ట్యూన్ అది. చిత్తగించండి.

నిర్మాత, దర్శకుడు: వి. మధుసూదనరావు.
సినిమా పేరు: ఆత్మకథ
సంస్థ: శ్వేత ఫిలిమ్స్
సంగీతం: చక్రవర్తి
Recorded at: AVM ‘G’ theatre
రచన: భువనచంద్ర
గానం: పి. సుశీల, ఎస్.పి.బి.
~
పల్లవి:
అతడు:
ఎన్నెన్నో అందాలు లోకాన వున్నా.. నువ్వంటే నాకెంతో ప్రేమా
మోహాల మబ్బుల్లో తేలించకూ.. సౌధాన దాగుండి కవ్వించకూ
ఆమె:
తియ్యన్ని బాసల్ల ఉయ్యాలలూపీ.. నన్నిట్టా ఊరించనేలా
స్వప్నాల నీడల్లో తేలించకూ.. కళ్ళల్లో దాగుండి కవ్వించకూ
చరణం 1:
ఆమె:
పరువాల ఒడిలో.. పగడాల మదిలో.. పువ్వుల్నే పూయించు ప్రేమా
అతడు:
నీలాల నదిలో.. కెరటాల సడిలో.. పడవల్నే తేలించు ప్రేమా
ఆమె:
ఉర్రూతలూగించు ప్రేమా
అతడు:
సయ్యాటలాడించు ప్రేమా
ఆమె:
కరిగీ కరిగీ కమ్మంగ ఒదిగీ.. కవ్వించులే తొలి ప్రేమా కరిగించులే తొలి ప్రేమా.. ॥ఎన్నెన్నో॥
చరణం 2:
ఆమె:
ఏకాంత వేళా.. మదిలోన దాగీ.. రాగాలు రవళించు ప్రేమా
అతడు:
తుదిశ్వాస దాకా హృదయాన నిలిచీ.. మమతల్ని వెదజల్లు ప్రేమా
ఆమె:
బంధాలు పెనవేయు ప్రేమా..
అతడు:
బాధల్ని మరపించు ప్రేమా..
ఆమె:
నింగి నేలా తానై తోచే
ఆనందమే తొలి ప్రేమా..
అద్వైతమే తొలి ప్రేమా.. ॥ఎన్నెన్నో॥

***

ఈ పాట చదవడం కంటే వింటే బాగుంటుంది. ఈ పాటే కాదు ఏ పాట అయినా వింటేనే బాగుంటుంది. నాకు సంగీతం రాకపోయినా కొద్దొగొప్పో పాడటం వచ్చు. నేను ఎప్పుడు పాట రెడీ చేసినా, ప్రొడ్యూసర్లకి గానీ, డైరెక్టర్లకి గానీ, హీరోలకి గానీ పాడే వినిపించేవాణ్ని. పాడితే వచ్చే ఎక్స్‌ప్రెషన్ చదివితే ఏమి వస్తుందండీ. అందుకే పాడగానే నూటికి కనీసం 80% పాటలు ఓకే అయిపోయేవి. రచయితలు కాదలుచుకున్న వారికి ఇదో మంచి tip అని నిజంగా చెప్పగలను.

‘మా ఇంటి మహరాజు’ పాటలన్నీ రికార్డైపోయాయి. మొత్తం నాలుగు పాటలు. SP బాలసుబ్రహ్మణ్యంగారు ఓ విధంగా భగవంతుడు తెలుగు జాతికి ఇచ్చిన ఓ వరం. నటుడు కెమెరా ముందు act చేస్తే, గాయకుడు మైకు ముందు act చెయ్యాలి. అంటే, నాయకుడు నటించబోయే పాత్రలో గాయకుడు ఒదిగిపోవాలి. తల్లీనమవ్వాలి. అప్పుడే నటుడు సరైన ముఖ కవళికల్ని ప్రదర్శించగలడు. నటుడి నటన ఒక్కోసారి యవరేజ్ అయినా గాయకుడి గళం నటుడ్ని నూరుపాళ్ళూ పైకెత్తగలదు. ఘంటసాలగారి గానంలో దైవత్వం వుంటే, బాలూగారి గానంలో పాత్ర ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే, నటుడి హావభావాలు ఎలా వుంటాయో ముందే వూహించుకుని తదనుగుణంగా SPB పాటని ప్రెజంట్ చేస్తారు గనుక. అద్భుతమైన ‘స్వరశిల్పి’ బాలుగారు.

ఈ ‘మా ఇంటి మహారాజు’ సినిమాలో SPB, రమోలా పాడిన “కసిరి కొట్టి పొమ్మన్నా” పాట బాలూగారి విలక్షణతకీ, విజ్ఞతకీ, పాత్రకి ప్రాణం పోసే విధానానికీ ఓ లైవ్ ఎగ్జాంపుల్. రమోలా గారికి ఒక్క లైను కూడా లేదు.. పాడడానికి. కానీ ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతం. వాయిస్ రూమ్ ఇవతల ఉండి వింటున్న వారంతా థ్రిలైపోయి చప్పట్లు కొట్టారు రికార్డింగ్ అయిపోగానే. అన్ని పాటలూ రికార్డు అయింది విజయా డీలక్స్ లోనే.

ఈ సినిమాలోనే, అప్పటి వరకూ the great Sound Engineer స్వామినాథన్ గారి దగ్గర పని చేసిన శ్రీ కొల్లి రామకృష్ణగారు సౌండ్ ఇంజనీర్‌గా విజయా డీలక్స్‌లో బాధ్యతలు చేపట్టారు. వారి మొదటి పాట, నా మొదటి డ్యూయట్ ఒకటే.. ‘అందాల పొదరిల్లు మా బొమ్మరిల్లు’. ఆ తరవాత ఎన్నో ఎన్నెన్నో పాటలకి కొల్లి రామకృష్ణగారు సౌండ్ ఇంజనీర్‌గా పని చేయడమే గాక మంచి మిత్రులయ్యారు. నాకే గాదు, ప్రతి రచయితకీ, సంగీత దర్శకునికీ కూడా ఆయన మిత్రులే. అంత స్నేహశీలినీ నెమ్మదస్తుడ్నీ (వర్క్‌లో యమ ఫాస్ట్) చాలా అరుదుగా చూస్తాం. వేటూరి గారైతే గంటల తరబడి విజయా డీలక్స్ దగ్గరే వుండేవారు. ఓ పక్క పాటలు ‘డిక్టేట్’ చెయ్యడం, మరో పక్క రామకృష్ణ గారిని పలకరించడం.. ఒక్కసారి భోజనం కూడా ఇంజనీర్ రూంలో చేసేవారు.

‘ఈశ్వరా పరమేశ్వరా’ పాట ‘కంచి’లో షూట్ చేశారు, ఏకామ్రేశ్వర ఆలయంలో. షూటింగ్‌లో పాల్గొనడం అదే ప్రథమం. కాసేపు వుండి మధ్యాహ్నం చెన్నైకి వచ్చేశాను. డాక్టరు గారి దగ్గరికెళ్ళాను.

“బిందువులు బిందువులు కలిసి సింధువైనట్లు కొన్ని వేల ఫిలింముక్కలు అతకబడి సినిమాగా మారతై” అన్నారాయన, నా షూటింగ్ అనుభవం విని.

“అంతేగా.. జీవితం కూడా క్షణాల మూటే! ఏ క్షణపు అనుభవం దానిదే.. ఏ క్షణపు అనుభూతి దానిదే” నిర్లిప్తంగా అన్నాను. నిర్లిప్తత ఎందుకంటే, పరుగులు పెట్టాలని వచ్చా.. నత్తలా జీవితం నడుస్తోంది.. అందుకు.

“మీ నిర్లిప్తత నాకు అర్థమవుతోంది. ఫస్టు మిమ్మల్ని మీరు బిజీగా వుంచుకోండి. లెక్కలేనన్ని పల్లవులు రాసి పెట్టుకోండి.. ఇంకా ఇంకా చదవండి.. వచ్చినదాన్ని దేన్నీ వద్దనకుండా వ్రాయండి” అన్నారు.

“ఆల్రెడీ ఆ పని చేస్తున్నాను. కానీ” సందేహించాను.

“చెప్పండి. సందేహం ఎందుకూ?” అన్నారు.

“ఒక్కోసారి ఇదంతా ఓ కలలా.. నాది కాని జీవితం నేను జీవిస్తున్నాననిపిస్తోంది. చిన్నతనం నించీ కోరుకున్న సినిమాలలోకి వచ్చిన ఆనందం ఓ రాళ్ళగుట్టంత వుంటే, ‘జీవితమంటే ఇది కాదు’ అనే ఆలోచన హిమాలయమంత వుంది. మళ్ళీ నాకు తెలుసు.. ఏదీ తనంత తాను జరగదు.. జరగాల్సిన విధంగానే జరగాల్సిన సమయంలోనే జరుగుతుందని. నన్ను నేను సద్దుకుంటూనే వున్నా.. సద్దుకోగలను కూడా కానీ, అప్పుడప్పుడూ నాలోని సన్యాసి నిద్రలేస్తూ వుంటాడు” వాతావరణాన్ని తేలిక చెయ్యడానికి అని, లేచి నిలబడ్డాను. సెలవు తీసుకుని రూమ్‍కి వచ్చాను.

ఒక్క జలంధర గారికి తప్ప ఎవ్వరికీ నేను సినిమాల్లో ఆల్రెడీ పాట రాశానని చెప్పలేదు. భువనచంద్రగా పేరు మార్చుకున్నానని కూడా చెప్పలేదు. బాలూగారి సిస్టర్స్ SP శైలజా, SP వసంత డాక్టరుగారూ కూర్చునే చోటు పక్కనే వున్న ‘కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ’కి డాన్స్ నేర్చుకోడానికి వచ్చేవారు. వారితో సహా అందరూ నన్ను “రాజుగారూ” అనే పిలిచేవారు. ఇప్పటికీ అలానే పిలుస్తారు. అదే నాకూ ఆనందం. వారికి తెలిసింది సినీ రచయిత ‘భువనచంద్ర’ కాదు. ..సాదా సీదా ‘రాజు’గారు. డాక్టరుగారూ మాత్రం ‘రాజావారు’ అన్న గౌరవ వాచకం వాడేవారు. కూచిపూడి ఆర్ట్స్ అకాడమీకి నాటి ప్రసిద్ధ నాట్య కళాకారులూ ‘ప్రభ’ గారి లాంటి ఫేమస్ నాట్య, నటీమణులూ వచ్చేవరు. శ్రీ అల్లు రామలింగయ్యగారూ, శ్రీ కొంగర జగయ్యగారూ, శారదగారూ, జాలాది గారూ, ప్రొడ్యూసర్ రామమోహన్ రావుగారూ, కెమెరామన్ కన్నప్పగారూ, ధర్మరాజుగారూ ఇలా ఎంతోమంది డాక్టర్ గార్ని కలవడానికి వచ్చేవారు. అక్కడే వారందరి తోటీ నాకు పరిచయం అయింది. ప్లాట్‍ఫామ్ మీద కుర్చీలూ, వేప చెట్టు నీడ పక్కన కాకా హోటల్‍లో టీ, ఆశగా వచ్చే పేద, మధ్యతరగతి పేషంట్లూ, ఎప్పుడేమి జరుగుతుందో ఏమీ తెలియని చిత్రలోకంలో రోజులు భారంగా వెళ్ళదీసే చిన్నా చితకా నటులు, ఎక్‌స్ట్రా వేషాలు వేసేవారూ, సినిమాకీ సినిమాకీ గ్యాప్ ఎక్కువైపోయి ఫుడ్డుకి లాటరీ కొట్టే అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్లూ, వీరందరూ నా డైరీలో పేజీలయ్యారు. ఎవరేం చెప్పినా ఓపిగ్గా వినడం అలవాటు చేసుకున్నాను. సినిమాల్లోకి రాకముందు వేలాది పుస్తకాలు చదివా. ఆ పుస్తకాల కంటే ఈ సజీవ పుస్తకాలే ఎక్కువ జ్ఞానాన్నిస్తాయనిపించేది. అనిపించడం కాదు, అదే నిజం కూడా. భగవంతుడి సృష్టి ఎంత గొప్పదంటే, ఏ ఒక్కొర్నీ మరో వ్యక్తిలా సృష్టించలేదు. ఎవరి ప్రత్యేకత వారిదే. ఎవరి ఆలోచనా పద్దతి వారిదే, ఎవరి వ్యక్తిత్వం వారిదే!

సడన్‍గా ఓ రోజున శివలింగేశ్వరావు గారు (నా మొదటి సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు) కార్లో వెడుతూ నన్ను చూసి డాక్టరు గారి దగ్గర కారు ఆపించారు. నన్ను పికప్ చేసుకుని వారుండే అపార్ట్‌మెంట్‌కి తీసుకెళ్ళారు. అప్పటికి ఆల్రెడీ అక్కడ మరో ప్రొడ్యూసర్ వున్నారు. సమయం సాయంత్రం 6.30 నిముషాలు.

“సారీ భువనచంద్రగారూ, మీరు రాసిన పిక్చరు వంద రోజులు ఆడినా, రెండో పిక్చర్లో అవకాశం ఇవ్వలేకపోయాను. కారణం డైరక్టర్ ఆల్రెడీ ఓ రైటర్‌ని మైండ్‌లో ఫిక్స్ చేసుకుని వుండటమే!” అన్నారు. “ఏమీ పర్లేదు సార్. అయినా ఏముందీ? ఇప్పుడు నేను బాపినీడుగారి డైరెక్షన్ లోనే గోపీకృష్ణ కంబైన్స్ వారి సినిమా చేస్తున్నా” అన్నాను. ఏర్‌ఫోర్స్ వాడ్ని గాన డ్రింక్స్ నాకు కొత్త కాదు. కానీ ఎవరితోటీ తాగేవాడ్ని కాదు. ఒంటరిగా తీసుకునేవాడ్ని.. తీసుకోవాలని అనిపించినప్పుడు అదీ కొంత మోతాదే. అవ్వాళ అందరితో పాటూ తీసుకోవాల్సి వచ్చింది. రాత్రి పదయ్యింది భోజనం అయ్యేసరికి. శివలింగేశ్వరరావుగారు నన్ను మేన్షన్‌లో దింపారు.

మరుసటి రోజున డాక్టరుగారి దగ్గరికి వెళ్ళగానే ఆయన చాలా సీరియస్‌గా కూర్చున్నారు. విషయం ఏమిటో అర్థం కాలేదు. “ఏంటి డాక్టరుగారూ.. సీరియస్‍గా వున్నారూ?” అనడిగా. “మీరు మద్రాసు ఎందుకొచ్చారూ? పాటలు వ్రాయడానికా, ప్రొడ్యూసర్లతో కూర్చుని మందు కొట్టడానికా?” అని సీరియస్‌గా అడిగారు. విషయం అర్థమైంది. ఏం మాట్లాడనూ?

“మీరు మందు కొట్టిన సంగతి నాకెలా తెలిసిందనుకున్నారా? ఇక్కడ ఏదీ దాయబడదు. తుమ్మినా దగ్గినా కూడా క్షణాల్లో ఇండస్ట్రీ మొత్తానికి తెలిసిపోతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సినిమా ప్రొఫెషన్ కత్తి మీద సాము లాంటిది. తాగి వాగినా వాగకపోయినా కూడా, వాగారని పుకార్లు సృష్టిస్తారు. కోపానికీ, ద్వేషానికీ, మదానికీ మిగతా అన్నింటికీ, అంటే ప్రేమకీ, స్నేహానికీ, అభిమానానికీ కూడా ‘రీజన్సు’ ఉంటాయి. ‘అసూయ’కి మాత్రం ‘రీజన్’ వుండదు. ఎవరు ఎవరి మీదైనా అకారణంగా అసూయపడొచ్చు. అగ్నిలా దహించే ఆ అసూయతో నానా పుకార్లూ పుట్టించి మీ కెరీర్‌ని పునాదుల్తో సహా కూల్చేయవచ్చు.. నిజంగా మీరు సినిమాని ప్రేమించి ఇక్కడికొస్తే పొరబాటున కూడా రాత్రి తొమ్మిదికి ముందు మందు ముట్టకండి. ఎవరి తోటీ కలిసి అసలు తాగకండి. మీ మంచి కోరి చెబుతున్నాను. సినిమా వాళ్ళ గురించి మీకేం తెలుసూ? ఇక్కడ లభించే మెచ్చుకోలు మెచ్చుకోలు కాదు. ‘ఆహా ఓహోలు’ పొగడ్తలు కావు. ఏ కత్తి ఎప్పుడు గుండెల్లో దిగుతుందో అస్సలు తెలీదు. ఆ కత్తి మాములు కత్తి అయితే పారిపోయో, పక్కకి జరిగో తప్పించుకోవచ్చు. ఇక్కడి గుచ్చే కత్తులు మనిషి వెనకాతల ఆడే మాటల కత్తులు.. జాగ్రత్త” అన్నారు. మౌనంగా తల వూపాను. తెలుగు ఫిలిం ఫీల్డు వ్యవహారాలు నాకు తెలీక పోవచ్చు. కానీ హిందీ ఫిలిం ఫీల్డు గురించి కొంత నాకు తెలుసు. వివిధ పత్రికలు చదివి తెలుసుకున్నది.. అదంతా.

“బివేర్ ఆఫ్ డాగ్స్ అంటారు పెద్దలు.. కానీ కాదు రాజావారూ.. బివేర్ ఆఫ్ వర్డ్స్ (words)” అన్నారు డా. గోపాలకృష్ణగారు. ఆయన్ని తలుచుకున్నప్పుడల్లా నా కళ్ళు చెమ్మగిల్లుతాయి.. కృతజ్ఞతతో, ప్రేమతో, బాధతో. కారణం ఇవ్వాళ కూడా ఆ నింబవృక్షం వుంది. కానీ, ఆ చెట్టు కింద లక్షలాది మందికి నిస్వార్థంగా సేవ చేసిన ఆయన మాత్రం లేరు.

డా. గోపాలకృష్ణ, జలంధర గార్లతో భువనచంద్రగారు

***

“ప్రియ పాఠకులారా.. ఇది నవల కాదు.. సస్పెన్స్ మెయిన్‌టెయిన్ చెయ్యడానికి. ఇది నా జీవితమూ కాదు.. నా పాటల్నో నన్నో నేను హైలైట్ చేసుకోవడానికి. ఇదో గీత రచయిత సాగించిన ప్రయాణం. ఇందులో నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులు, హీరో హీరోయిన్లు, గాత్రధారులు, పాత్రధారులు, అంతెందుకూ మాకు ‘టీ’లు అందించే ‘అన్నపూర్ణ స్వరూపులు’ కూడా మీకు పరిచయమౌతారు. సినీ జీవితంలోని కష్టాలు నష్టాలు, నవ్వులు, ఏడ్పులు, అంతస్తులు, ఆత్మహత్యలు – అన్నీ మీ కళ్ళకి గోచరమవుతాయి. సస్పెన్స్ లేదని అనుకోకండి. ప్రతి జీవితమూ ఓ సస్పెన్సే.. ప్రతి క్షణమూ ఓ సస్పెన్సే. అయినా నవలలో సస్పెన్సుని సృష్టిస్తారు. కానీ ఈ కథనంలో మాత్రం నేను సస్పెన్సుని సృష్టించే ప్రయత్నం చెయ్యను. నిజాయితీగా వ్రాస్తానని మాత్రం ప్రమాణం చేస్తున్నాను. సరేనా! నమస్సులతో. – మీ భువన చంద్ర.”

నా మొదటి రికార్డింగ్ జరిగింది ప్రసాద్ ఓల్డ్‌లో. చాలా విశాలమైన స్టూడియో అది. లోపలికి అడుగెట్టగానే నాకు గుర్తొచ్చింది L.V. ప్రసాద్ గారు. ప్రసాద్ ఓల్డ్, ప్రసాద్ డీలాక్స్, ప్రసాద్ ల్యాబ్, ఇదంతా ఓ సామ్రాజ్యం. స్టూడియో ఓనర్స్ ఆ రోజుల్లో ఎక్కవ మంది తెలుగువాళ్ళే. విజయ-వాహిని వారిదో సామ్రాజ్యం. మీర్జాపురం రాజాగారి శోభనాచల ఓ సామ్రాజ్యం. సరే భానుమతి గారి భరణి ఉండనే వుంది. నేను ఇండస్ట్రీలో ప్రవేశించే సరికే చాలా స్టూడియోలు గొడౌన్‌ల క్రింద మారిపోయాయి.

కారణం స్టూడియోలో జరగాల్సిన షూటింగ్‍లు బజార్న పడటం. ఒకప్పుడు, నేను ఇండస్ట్రీకి వచ్చాక కూడా, తిరుపతి వచ్చిన వెంకన్న భక్తులు సినీ స్టార్స్‌ని చూడ్డానికి మద్రాసు వచ్చేవారు. సినీ తారల ఇళ్ళ ముందు పడిగాపులు పడి వారి ‘దర్శనం’ గనక లభిస్తే మహా సంతృప్తితో వారి వారి వూళ్ళకి వెళ్ళాక ఆ ‘దర్శనం’ గురించిన విశేషాల్ని చిలవలు పలవలుగా వర్ణించి చెప్పేవారు.

ఇప్పటి కథ వేరు. పి.వి.పి (ప్రజల వద్దకు పాలన) లాగా సినీ తారలే ప్రజల మధ్య షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఘాటింగ్ మొదటి రోజుల్లో వచ్చిన గుంపు రెండో రోజుకి నాలుగో వంతుకి తగ్గి, మూడో నాటికి మృగ్యమైపోతోంది. ఇది మంచికా చెడుకా  అంటే, ఎవరు చెప్పగలరు. కాలం తన మార్పుల్ని చేర్పుల్ని తానే చూసుకుంటుంది. అంతే.

ప్రసాద్ ఓల్డ్ స్టూడియో ఇప్పటికీ అలాగే వుంది. ఇళయరాజాగారి రికార్డింగ్స్ అక్కడే జరుగుతాయి. ఆయన సాంప్రదాయవాది. మ్యూజిక్‌కి మాడరన్ టచ్ ఇచ్చినా హృదయం మాత్రం స్వచ్ఛ భారతీయమే.

నేను అడుగు పెట్టిన రెండో స్టూడియో ‘విజయ డీలక్స్’ కూడా చిన్న చిన్న మార్పులతో చేర్పులతో అలానే వుంది. కానీ, ప్రివ్యూ థియేటర్‌గా కాలక్రమంగా స్థిరపడింది. రికార్డింగ్ థియేటరూ వుంది.. కొంచెం చిన్నగా, నేటి పరిస్థితులకి అనుగుణంగా.

నాగిరెడ్డి గారు వెళ్ళిపోయారు. ఆయన నాటిన చెట్లు ఆయన గుర్తుగా మిగిలున్నాయి. వాటికే గనక మాటలొస్తే ఎందరు లబ్ధప్రతిష్ఠుల జీవితాల్ని వర్ణించి వర్ణించి చెప్పేవో. వాటి నీడనే కదా NTR, ANR, SVR లాంటి మహానుభావులు ఎదిగిందీ!

***

‘మా ఇంటి మహారాజు’ నూరు రోజుల పండగ చేసుకోలేదు. గానీ, మంచి పేరు, తగినన్ని లాభాలూ తెచ్చుకుంది. ఇక్కడో మాట చెప్పాలి. ఆత్రేయగారి విశాల హృదయం గురించి.

ఓనాడు ‘మా ఇంటి మహారాజు’ మ్యూజిక్ సిటింగ్ బాపినీడు గారి ఇంట్లో (ఇల్లూ ఆఫీసూ ఒకటే. క్రింద అంతస్తంతా ఇల్లు. పై అంతస్తూ మొత్తం ఆఫీసు) జరుగుతుంటే ఆత్రేయ గారు వచ్చారు. ఆయన్ని నేను చూడడం అదే మొదటిసారి. సిట్టింగ్స్‌లో నేను మ్యూజిషియన్స్‌తో పాటు కిందనే, పరుపుల మీద కూర్చునేవాణ్ని. వాసూగారికి ఆత్రేయగారు పరిచయమే గనక పలుకరించారు. బాపినీడుగారి ‘సైగ’ అందుకుని మేమందరం బయటికి వెళ్ళాము.

ఓ అరగంట తరవాత ఆత్రేయగారు వెళ్ళిపోయారు. మేం లోపలికి రాగానే బాపినీడుగారు చిన్నగా నవ్వారు. తర్వాత తెలిసింది, అటు గోపీకృష్ణ కంబైన్స్ వారికీ, ఇటు శ్యాంప్రసాద్ ఆర్ట్స్ (విజయబాపినీడు/మాగంటి రవీంద్రనాథ్ చౌదరి) రెంటికీ ఆత్రయగారు రెగ్యులర్ రైటరు. మరి గోపీకృష్ణ వారి సినిమా తీసేటప్పుడు ఆయన పాటలు ఉండి తీరాలిగదా, దానికి బాపినీడుగారు ఆత్రేయగారితో “ఆత్రేయగారూ, భువనచంద్ర అనే అతన్ని పరిచయం చేసింది నేనే. ఈ సినిమాకి సిటింగ్స్ జరిగేటప్పుడే పాటలు వ్రాయించాను. వాటికే ఇప్పుడు మ్యూజిక్ సిటింగ్స్ జరిగేది. ఉన్న నాలుగు పాటల్లో ఒక్క పాట మీరూ వ్రాసినా అద్భుతంగా వుంటుంది.. కానీ, ముందరే సన్నివేశానికి తగ్గట్టు పాటలు వ్రాయించేశాను. గనుక యీ సారికిలా కానివ్వండి” అన్నారుట.

‘మా ఇంటి మహారాజు’ సింగిల్ కార్టు వెనకాల బాపినీడు గారి మంచితనమూ, ఆత్రేయగారి ఉదారతా వున్నాయి. ఆత్రేయగారే, “నేను వ్రాయాలి అంటే” అని వుంటే, నా రెండో సినిమాకే సింగిల్ కార్టు దక్కి వుండేది కాదు. ‘ప్రాణస్నేహితులు’ (గోపీకృష్ణ వారి సినిమా, శ్రీ కృష్ణంరాజు శరత్ బాబు గార్ల great సినిమా) లోనూ నాకు సింగిల్ కార్టు రావడానికి ప్రధాన కారణం ఆత్రేయగారి పెద్ద మనసే. మనని ‘మనిషి’గా నిలబెట్టేవీ, మనం ఎత్తు ఎదగడానికీ తోడ్పడేవీ ముమ్మాటికీ పెద్దల ఆశీస్సులే అని నేను నమ్ముతాను. ఒక రచయితగా నిలబడడం వారి ఆశీఃఫలమే.

(ఇంకా ఉంది)

Exit mobile version