Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవితం ఓ ప్రయాణం-9

[ప్రముఖ కథా, నవలా, సినీగీత రచయిత, శ్రీ భువనచంద్ర తమ సినీ జీవన ప్రస్థానాన్ని ‘జీవితం ఓ ప్రయాణం’ అనే పేరుతో సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు.]

మెరుపులా.. ఆడుతా

క్రవర్తి గారు ‘పల్లవి’ ఎందుకు మార్చమన్నారో నాకు తరువాత్తరువాత గానీ తెలిసి రాలేదు. ఆయన అనుభవజ్ఞుడు. మంచి సలహా ఇచ్చారు. కానీ, నా బ్రెయిన్ వన్ వే  ట్రాఫిక్. అందుకే లోతుగా విషయాన్ని అర్థం చేసుకోలేకపోయాను. చాలా సంవత్సరాలు (సారీ, మూడు సంవత్సరాలు) దాకా వేరే హీరోల (అంటే టాప్ హీరోల) సినిమాలు నాకు రాలేదు. అయితే ఆ విచారం వుండేది కాదు. ఎందరో హీరోలకీ, హీరోయిన్‍లకీ పాటలు వ్రాస్తున్నాను కదా; అని ఆనందంగానే వుండేది.

‘ట్యూన్’ని పట్టి పాట వ్రాయడం అనేది నా పద్ధతి. ట్యూన్‌లో అల్లరి తనం ధ్యనిస్తే అల్లరిగా, మెలడీ ధ్వనిస్తే, మెలడీగా; కేవలం సన్నివేశం కనిపిస్తే సన్నివేశపరంగా వ్రాసేవాడ్ని. ఎందుకంటే ఏ సిచ్యుయేషన్‌లో వస్తుందో దర్శకుడు సంగీత దర్శకుడికి విడమర్చి చెప్పిన తరవాతే గదా సంగీత దర్శకుడు బాణీ కట్టేది!

అలా కాకుండా కొన్ని పాటలు నాకు నేనే వ్రాసుకునేవాడ్ని సరదాగా. అలా వ్రాసి అట్టిపెట్టుకున్నవీ సినిమాల్లో వచ్చాయి. అలాంటి సరదా గీతం ఒకటి ‘జూ.. లకటక’ సినిమాలో వచ్చింది.

బాపినీడుగారి ఇల్లు నాకు పుట్టినిల్లు లాంటిది. ఏ సినిమా మొదలుపెట్టబోయినా, ముందుగా కబురుపెట్టేవారు. సిట్టింగ్స్‌లో నేనూ పాల్గొనేవాణ్ణి. ‘జూ.. లకటక’ కి మాతృక ఓ తమిళ సినిమా.

బ్రహ్మాండంగా స్క్రిప్టు తయారవుతోంది. సంగీతం వాసూరావు గారు. పాటలు నేనూ, వేటూరిగారూ. మాటలు కాశీ విశ్వనాథ్ గారు. రచనా సహకారం ఎం.వి.వి.ఎస్. బాబూరావుగారు.. ఇలా అందరం ఒకరికొకరం తెలిసిన వాళ్ళమే. అర్థం చేసుకున్నవాళ్ళమే.

కాశీ విశ్వనాథ్ గారు బాడీబిల్డర్ కమ్ వెయిట్ లిఫ్టర్. 1980లో చలనచిత్ర పరిశ్రమకి వచ్చి 124 సినిమాలకి పైగా తన కథలని/or/డైలాగ్స్‌నీ అందించారు. మంచి నటులు కూడా. ఆయన సీ పోర్ట్ ఉద్యోగి. పిలువు అందినప్పుడల్లా సెలవు పెట్టి వచ్చేవారు. తరువాత ఓ రూమ్ తీసుకుని వుండేవారు. మరమరాలు, శనగపప్పు, పచ్చిమిర్చి, నిమ్మరసం, ఉప్పు, కారప్పొడి, కొత్తిమీర, ఉల్లిపాయి తరుగు కలగలిపి సూపర్ ‘స్టార్టర్’ని స్వయంగా తయారు చేసేవారు. స్పోర్ట్స్ పర్సన్ కనుక లిమిటెడ్‌గా మందు పుచ్చుకునే వారు. వారితో సంభాషించడం మహా మజాగా వుండేది. నవ్వులే నవ్వులు. మేం ఆ తరవాత కూడా చాలా సినిమాలకి పనిచేశాము. బాపినీడుగారి దగ్గర చాలా సినిమాలకి పనిచేశారు,   నా మొదటి సినిమా ‘నాకూ పెళ్ళాం కావాలి’; ‘దొంగకోళ్ళు’తో సహా. “డైలాగ్స్ ‘ఫన్ పేక్‌డ్’గా వుండాలండీ” అని చెప్పేవారు.

‘జూ.. లకటక’ అనే టైటిల్ పెడుతున్నాం కనక, ఆ పదానికి ఓ అర్థాన్ని కల్పిస్తూ ఓ పాట వ్రాయండి” అని విజయబాపినీడు గారు నాతో అన్నారు. అసలీ ‘జూ.. లకటక’ అన్నది రేలంగి గారు ఓ సినిమాలో అనే ఓ ఊతపదం. ‘జూ.. లకటక’, ‘డింగుటక’, ‘లెస్స లెస్స’ ఇలా చాలా పదాలు రేలంగి గారు వాడటం వల్ల జనాల్లో అవి స్థిరపడిపోయాయి.

‘ఏ అర్థమూ లేని పదానికి ఏ అర్థం సృష్టించాలీ?’ అని నేను తీవ్రంగా ఆలోచిస్తుంటే బాబూరావు గారు, “అన్ని హ్యుమన్ ఎమోషన్స్‌కీ ఆ పదాన్ని తగిలించండి.. పల్లవి అదే వస్తుంది” అని ఓ చక్కని సలహా ఇచ్చారు. ఇంకేం..! గంటలో వంట తయారైంది. చిత్తగించండి.

పల్లవి:
లైలాకీ మజ్నూకీ జూలకటకా
రాముడికీ రావణుడికీ జూలకటకా
రాజీవ్‍కీ ఎన్టీఆర్‌కీ జూలకటకా
హిందీలో అమితాబ్‌కీ.. తెలుగులో చిరంజీవికీ జూలకటకా
అలనాటి క్లియోపాట్రా జూలకటకా
ఈనాటి పాకీజా జూలకటకా
దేనికైన మేచింగే ఈ జూలకటకా..
ఉద్దండ పండితుడ్ని.. ఊతపదం కనిపెట్టా..
దేనికైన నప్పుతుంది.. జూలకటకా.. నువ్వు
ఒక్కసారి అని చూస్కూ జూలకటకా..

***

పల్లవి వినిపించగానే అందరూ తెగ నవ్వేసి మెచ్చుకున్నారు. ఆ ఊపులోనే చరణాలు టకటకా రాసేశాను. వాసూరావుగారు అంత స్పీడుగానూ అప్పటి ట్యూన్ కట్టేశారు. అప్పటి సిట్టింగ్స్ మహా మజాగా వుండేవి. అందరం కలిసి టిఫిన్లు చేసి తీరిగ్గా పరుపుల మీద కూర్చుని బాణీలు కడుతుంటే, మేము పదాలు అల్లుకుంటూ వుంటే భలే థ్రిల్లింగ్‌గా వుండేది. ఒక పక్క ట్యూనూ, మరో పక్క లిరిక్ సరిచూసుకుంటూ ఓ మహా యజ్ఞంలా పని సాగేది. మధ్యమధ్యలో బుల్లి మల్లి బ్రేక్సూ, రిఫ్రెష్‌మెంట్సూ మూమూలే.

‘జూ.. లకటక’లో టైటిల్ సాంగ్ కాక మరో రెండు పాటలు వ్రాశాను. అందులో ఒకటి ఇందాక నేనన్న ‘స్వంతంగా నాకు నేను రాసుకున్న పాట’లలో ఒకటి. మా మేన్షన్ నుంచి ఎవరో ఊరెడుతూ, “సర్కారు బండికి ఊరెళ్తున్నా” అని అరుస్తూ, మరో రూమ్‌లో ఉండే వారికి చెప్పడం వినిపించింది. సరదాగా ‘సర్కారు’ బండి మీద పాట రాస్తే ఎలా వుంటుందా అనుకుని అప్పటికప్పుడు ఓ పాట వ్రాశాను. అంతేకాదు, సాయంత్రం బాపినీడు గారింటికి వెళ్ళినప్పుడు చనువుగా ఈ పాట పాడి వినిపించాను. వెంటనే బాబూరావు గారు, “బాపినీడు గారు, ఈ పాట మన కుర్బానీ పంతులికి పెడితే ఎలా వుంటుందీ?” అని అన్నారు. కుర్బానీ పంతులంటే ‘జూ.. లకటక’లో చంద్రమోహన్ పాత్ర పేరు. వెంటనే అందరూ ఓకే అనెయ్యడంతో, ఈ పాట ఆ సినిమాలో చోటు చేసుకున్నది. నిజం చెబితే ఇది అల్లరి హద్దుని దాటి అవతలి గట్టుకెళ్ళిన పాటే. కానీ, చిత్రీకరణలో సరదాగా ‘పాస్ ఆన్’ అయిపోయింది. చిత్తగించడి.

పల్లవి:
గుడివాడ స్టేషనూ.. ఎప్పుడైన చూశావా
బెజవాడ కృష్ణలో.. ఎప్పుడైన మునిగావా
కాకినాడ బుల్లెమ్మా.. కోక సర్దుకోవమ్మా
సర్కారు బండొచ్చిందీ.. సిగ్నలిచ్చినారమ్మా

ఇలా నడుస్తుంది.

అఫ్‌కోర్స్, తొలిసారి సర్కారు బండెక్కీ, ‘అత్త కూతురి’కి జాగ్రత్తలు చెబుతూ ఓ బావ తనతోబాటు తీసికెళ్ళటం పాట ఇతివృత్తం.

ఇంకో సరదా విషయం ప్రస్తావించాలి. విజయా గార్డెన్స్‌లో ‘ఏక్ దో తీన్ చార్ పాంచ్ బజానా.. సక్కుబాయి సంత లోన డోల్ బజానా’ అనే పాట రికార్డింగ్ జరుగుతోంది. దానికి సరదాగా ఓ మహిళా సెన్సార్ బోర్డ్ మెంబర్ గారు అటెండైంది. పల్లవి వినగానే బాపినీడు గారితో, “సార్.. రేపు మీరు ఈ పాటని మా సెన్సార్ ముందుకు తీసుకొస్తే, మేం ‘కట్’ చెయ్యాల్సి వుంటుంది. ముందే చెప్తున్నా” అన్నది. “అభ్యంతరకరమైన పదం ఏముందమ్మా?” అని విజయబాపినీడు గారు అడిగితే, “సక్కుబాయి సంత అనే పదంలో ‘సంత’ అన్నది అభ్యంతర పదం కాదంటారా?” అన్నది. అప్పుడు వెంటనే, “మేడమ్.. పోనీ సంత అనేది తీసేసి సక్కుబాయి సందు అంటే ఓకేనా?” అన్నాను. “యస్.. దటీజ్ గుడ్!” అని ఆవిడ అంటే, అంతా చూస్తున్న బాబూరావు గారు చిన్నగా నవ్వి, “బాపినీడు గారూ, ఇప్పుడే ఈ పాటకి సెన్సార్ సంతకం తీసేస్కోండి” అన్నారు.

ఇంకో చిత్రం కూడా చెప్పాలి. అదీ సెన్సార్‌దే.

‘ఖైదీ నం 786’ చిత్రంలో, ‘అటు అమలాపురం – ఇటు పెద్దాపురం’ పాటలో “పై జంగిడిలో వెజిటేరియనూ కావాలా మావా, కింద గంపలో నానెజిటేరియన్ కొంటావా బావా” అని రెండు లైన్లు రాశాను. కారణం సిల్కుస్మిత కేరెక్టర్ ఆ సినిమాలో పై జంగిడీలో ఆకుకూరలూ, కింద గంపలో చేపలు కలికి అమ్మడమే.

ఆ రెండు లైన్ల లోని ‘వెజిటేరియన్, నాన్‌వెజిటేరియన్’ పదాలకు సెన్సారు కత్తెర పడింది.

ఆ పదాల్ని తీసేసి వాటి బదులుగా,

“పై జంగిడిలో ఆకుకూరలూ కావాలా మామా..

కింద గంపలో నీచు కూరలు కొంటావా బావా” అని మారిస్తే ఠక్కున OK అయింది.

అదే పాటలో ‘సూపర్ బజారు నేనే అనుకో’ పదానికి కూడా కత్తెర పడితే; ‘సుబ్బులు పిల్లని నేనే అనుకో’ అని లిప్ సింక్‌కి అనుగుణంగా మార్చాల్సొచ్చింది. ఇవో సరదాలు.

***

వాసూరావు గారి కాంబినేషన్‌లో వచ్చిన మరో సినిమా ‘సుమంగళి’. ఈ సినిమాలో ఒక్క పాట వల్లే సంగీత సరస్వతి శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారి దర్శనమూ, పరిచయమూ లభించాయి.

‘సుమంగళి’ సినిమాకి దర్శకులు విజయబాపినీడు గారు. ప్రొడ్యూసర్ ‘సారధి’ గారు. కృష్ణంరాజుగారు హీరో. హీరోయిన్ జయప్రద. కల్పన, జయప్రద గారి తమ్ముడు శ్రీరామ్ మరో పెయిర్. మురళీమోహన్ గారిదో డిగ్నిఫైడ్ పాత్ర. నిర్మలమ్మ నట విశ్వరూపం ఈ సినిమాలో చూడొచ్చు. ఈ సినిమా అనే ఏమిటి, ‘మా ఇంటి మహారాజు’లో కూడా ఆమె అద్భుతంగా నటించారు. మళ్ళీ అటువంటి నటి పుట్టదు,  మన సూర్యకాంతం గారి లాగా. దీనికీ మాటలు కాశీ విశ్వనాథ్ గారే. రచనా సహకారం మా MVVS బాబూరావు గారే. “మీరు గోడ కట్టండి, నేను వెల్ల వేస్తా” అనేవారు బాబూరావు గారు. చాలా షార్ప్ బ్రెయిన్. మాటలు ఎవరు రాసినా వాటికి క్షణాల్లో అత్యంత పదును పెట్టే నేర్పు బాబూరావుగారి స్వంతం. వారిదీ పాలకొల్లే. పాలకొల్లు వారికీ తెలుగు సినిమాకీ అవినాభావ సంబంధం. సినిమాల్లోకి రాక ముందు నుంచీ అల్లు వారికీ బాబూరావుగారికీ బాగా పరిచయాలుండేవి. చిరంజీవి గారి ‘ఆరాధన’ సినిమాకి మాటలందించింది బాబూరావు గారే.

షూటింగ్‌లో మొట్టమొదటిసారి జయప్రద గార్ని చూశా. ‘సత్యజిత్ రే’ వంటి దిగ్దర్శకుడే ఆవిడ సౌందర్యాన్ని పొడిడితే, నేనెంత? ఆమె నిగర్వి. ఆ షూటింగ్ లోనే ఆవిడ ఇద్దరు తమ్ముళ్ళు – రాజబాబు, శ్రీరామ్ లను చూశా. తమ్ముళ్ళంటే ఆవిడకి ప్రాణం అనిపించింది.

కృష్ణంరాజుగారితో ఇది నా మూడో సినిమా. ఎంతో ఆప్యాయంగా పలుకరించి యోగక్షేమాలు కనుక్కునేవారు. కొత్త పాటలు ఏమి వ్రాశానా అని అడిగి తెలుసుకునేవారు. నిర్మలమ్మ గారి ఆప్యాయత సరేసరి. ‘సుమంగళి’లో 3 పాటలు వ్రాశాను.

‘హాటు ముద్దు స్వీటు ముద్దు నాటు ముద్దు’ అనే పాట; ‘ముందరికొచ్చి బందరులడ్డూ తినిపిస్తావా అమ్మాయి ఆజా ఆజా’ అనే పాట నల్లేరు మీద బండిలా చకచకా సాగిపోయాయి, మూడో పాటే నన్ను మహా తిప్పలు పెట్టింది. విచిత్రం ఏమంటే ఆ పాట సిచ్యుయేషన్ నాకు చెప్పింది ఎం.ఎం. ప్రివ్య్రూ థియేటర్‌లో. అక్కడే ఎడిటర్ శ్రీ మోహన్ గారి గారి ఆఫీసు.

ఎడిటర్ మోహన్ గారితో భువనచంద్ర గారు

ఎడిటర్ మోహన్ గారి ఆఫీస్ టేబుల్ మీద, గ్లాస్ శ్లాబ్ క్రింద ఎన్నో ఫోటోలు వున్నా ‘థామస్ అల్వా ఎడిసన్’ గారి ఫోటో ఫ్రేము నన్ను ఆకర్షించింది. చాలా మంచి వ్యక్తి మోహన్ గారు. వారి సినిమాల్లో కూడా తరువాత నేను పాటలు వ్రాయడం జరిగింది.

బాపినీడు గారిచ్చిన సిచ్యుయేషన్ వినగానే అవాక్కయ్యాను. ఒకే పాట మూడు సందర్భాలలో రావాలి. ఒకే పాట హేపీ మూడ్ లోనూ, పేథాస్ (విచారకరమైన) మూడో లోనూ రావడం ఓకే. కానీ ఇక్కడి కథ వేరు.

  1. హీరో హీరోయిన్లు (కృష్ణంరాజు, జయప్రదల మధ్య) – (a) లవ్ తో పాడుకున్న పాటలా వినిపించాలి. కృష్ణంరాజు గారికి తెలిసిన ఓ సీక్రెట్ జయప్రదకి తెలియకూడదన్నట్టుగా ఆయన లిరిక్ ఉండాలి. (b) జయప్రదకు తెలిసిన అదే సీక్రెట్ కృష్ణంరాజుగారికి తెలియనట్టుగా ఆమె లిరిక్ ఉండాలి. కానీ వింటే ప్రేమ వ్యక్తపరిచే పాటే అయి ఉండాలి. (c) వీరిద్దరి సీక్రెట్ నిర్మలమ్మకి తెలిసినా తెలియనట్టుగానే వుండాలి
  2. ఇదే పాట పూర్తిగా కల్పన స్టేజ్ మీద ‘సోలో’గా పాడాలి. అదీ కాలేజీ యానివర్సరీ ఫంక్షన్‍లో.
  3. జయప్రద కేరక్టర్ సినిమాలో చనిపోయినప్పుడు అదే పాట పల్లవి ఆ డెత్ సీన్‌కి అనుసంధానంగా, సరిపోయేలా ఉండాలి. పల్లవి పదాలు మార్చకూడదు.

నా బుర్ర తిరిగిపోయింది. అసలు ఇంత క్లిష్టమైన పాట వ్రాయడం నాకు సాధ్యమవుతుందా? ఇదే ప్రశ్న మొదట మొలకెత్తింది. మళ్ళీ హెమ్మింగ్వే గారిని తలచుకుని ధైర్యం తెచ్చుకున్నాననుకోండి. డ్యూయెట్ వ్రాయడం తేలికే. కానీ ఓ పురుషుడూ + స్త్రీ పాడుకున్న యుగళగీతాన్ని కాలేజీ అమ్మాయి పాడే సోలో పాటగా మలచడం తేలిక కాదు; అన్నిటి కన్నా కష్టం అదే పల్లవిని డెడ్ బాడీ మీద పోస్ట్ చేసేలా ఆ పల్లవిని నిర్మించడం.

***

రెండు రోజుల పాటు నా బుర్ర వాచిపోయింది. పరధ్యానంగా నా పాత డైరీలు తిరగేస్తుంటే వివేకానందుల వారి బోధనలు కొన్ని కనిపించాయి. If life is a song – sing it; If life is a game – play it; If life is a puzzle – solve it.. ఇలా అన్నమాట. సడెన్‌గా అనుకున్నా.. If life is a journey? అని. పల్లవి ఫస్ట్ లైన్ వచ్చేసింది. ఇంకేం!!

“జీవితం ఓ ప్రయాణం.. తోడుగా సాగనీ..
గుండెలో ప్రేమగీతం.. నిండుగా మ్రోగనీ..
దారిలో మమతలే.. పూవులై కురియనీ..
ఇలానే.. ఇలానే.. ఇలానే..”

కృష్ణంరాజూ జయప్రదా (డ్యూయెట్‌లో) నడిచేటప్పుడు దారికి ఇరువైపులా వున్న చెట్లు పూలని రాలుస్తాయి.

కాలేజీలో కల్పన పాడేటప్పుడు జీవితాన్ని హాయిగా గడపమనే అర్థం ధ్వనిస్తుంది.

చివరికి ‘శవయాత్ర’ జరిపేటప్పుడు శవం మీద పూలు విసురుతూ వుంటారు. ఈ జీవిత ప్రయాణంలో చివరి వరకూ నీ తోడుగా వుండనీ – నీ తోడు రానీ – అనే భావమూ ధ్వనిస్తుంది. చరణాలు రెండు గంటల్లో రెడీ అయిపోయాయి.

బాపినీడు గారింటికి వెళ్ళి ఈ పాట వినిపించి, నేను అనుకున్న విధానం చెప్పగానే, “బ్రహ్మాండంగా వుంది. వెంటనే ట్యున్ కడడాం” అన్నారు. ‘నాకూ పెళ్ళాం కావాలి’ సినిమాలో మరల మరల వచ్చే BGM (Background Music) బిట్ నాకు పిచ్చిగా నచ్చి ఆ ట్యూన్‌కే ఈ పాట వ్రాశానని చెప్పాను. వాసూరావు గారు వెన్నెల కురిసినట్టు నవ్వారు, “నాకు తెలుసు.. మీరేదో ఇలాంటి పనే చేసుంటారని” అంటూ.

నా జీవితంలో నేను అత్యంత సమయం తీసుకుని వ్రాసిన పాట ఇదే. ‘ఎర్నెస్ట్ హెమింగ్వే’ జిందాబాద్. శ్రమ లోంచే ‘జీవితం’ పుడుతుందని మరో మారు స్పష్టంగా నాకు అర్థమైంది.

***

‘సుమంగళి’ సినిమాని తలచుకున్నప్పుడల్లా ‘సారధి’ గారు గుర్తొస్తారు. సరదా మనిషి. “అయ్యా, రాత్రి ఏడున్నర గంటలు దాటాకా టైమ్‌ని గడియారంతో కొలవకూడదండీ” అనేవారు. నేను సరదాగా, “సార్.. టైమెంతయ్యిందీ?” అని ఓ రోజు రికార్డింగ్ ఓ పక్క జరుగుతుండగా ఎనిమిదిన్నరకి, అడిగా.

“ఆ.. ఎంత.. ఒకటిన్నర పెగ్గు” అన్నారు నవ్వుతూ. అఫ్‌కోర్స్ ఆయన డ్రింక్ చెయ్యడం నేనేనాడూ చూడలేదు.

ఆ తరువాత సీరియస్‌గా ఉన్నారని తెలిసి ‘గంగా’ హాస్పటల్‌కి వెళ్ళాను. సినిమా రిలీజైన చాలా చాలా రోజుల తరువాత వారు అందరినీ ‘విడిచి’పోవడం ఇప్పటికీ బాధే.

***

కాలం ఆగదు.. కాలం నిలవదు. కాలం కాలంలో కలిసిపోయి కాలంగా క్షణక్షణానికీ పుడుతూనే వుంటుంది.

రోజుకి రెండు లేక మూడు పాటలు ఆ రోజుల్లో రికార్డయ్యేవి.

విశాలమైన రికార్దింగ్ థియేటర్లూ, స్టూడియోలు. స్టూడియో లోకి వెళ్ళినా, రికార్డింగ్ థియేటర్‌లోకి వెళ్ళినా, ఓ దేవాలయం లోకి వెళ్ళిన ఫీలింగ్ కలిగేది. 40 నుంచి 70, 80 మంది దాకా మ్యూజిషియన్స్ వాద్య పరికరాలను వాయిస్తూ వుంటే సంగీత సరస్వతి నాట్యమాడుతున్నట్లుండేది. మార్నింగ్ 7 to 2; 2 to 9 కాల్షీట్లు. ఉదయం కాల్షీట్‌లో మ్యుజీషియన్స్ తమకిచ్చిన నోట్స్‌ని పర్‌ఫెక్ట్‌గా ప్రాక్టీసు చేసి, 12 – 12½ కల్లా ‘టేక్’‌కి సిద్ధమైపోయేవారు. సింగర్స్ రాగానే టేక్ అయిపోయేది. రీటేక్స్ వున్నా మహా అయితే రెండో మూడో వుండేవి.

ఆ గోల్డెన్ ఎరాని చూడగలగడం నా పూర్వజన్మ సుకృతం. మనిషికీ మనిషికీ మధ్య ఎంత అనుబంధమో! సంగీతం దైవికమైనది. సాహిత్యమూ అంతే. సంగీత సాహిత్యాలు సరస్వతీ మాతకు రెండు కళ్ళు. పాట వ్రాసే వరకూ టెన్షన్. అది రికార్డయ్యేటప్పుడు కలిగే ఆనందం చెప్పనలవి కాదు. ఎంత అద్భుతమైన రోజులో అవి. అవన్నీ ‘సాక్షి’గా మీ ముందుకు తేవాలనే ఈ ‘జీవితం ఓ ప్రయాణం’ మొదలెట్టింది.

(ఇంకా ఉంది)

Exit mobile version