Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జర్నలిస్ట్ కథలు-10: ఇచ్చోట కర్మ ఇచ్చోటనే

[ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ బుద్ధా మురళి గారు సంచిక పాఠకుల కోసం ‘జర్నలిస్ట్ కథలు’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

ప్రెస్ క్లబ్‌లో సంతాప సభ. ఒక వైపు పెద్ద పోస్టర్ కలర్‌ఫుల్‌గా ఉంది. మరణించిన ఎడిటర్ మందారం ఫోటో అధికార దర్పం ప్రదర్శిస్తున్నట్టుగా ఠీవిగా ఉంది. దాని కింద ‘తెలుగు ఇంగ్లీష్ జర్నలిజం ఆణిముత్యం’, ‘భయమెరుగని ధీరుడు’, ‘మానవతావాది’ అని రాసిన అక్షరాలు జర్నలిస్టులను వెక్కిరిస్తున్నట్టుగా ఉన్నాయి. హాలులోకి అడుగుపెడుతూనే జర్నలిస్ట్ రవి ఆ రాతలు చూసి. ‘జర్నలిస్ట్‌లు పత్రికల్లోనే కాకుండా సంతాప సభల పోస్టర్‌లో కూడా అబద్ధాలే రాస్తారన్న మాట’ అని నవ్వుకున్నాడు. అరగంట గడిచి పోయాక పది పన్నెండు మందికి మించి రాలేదు. రవి మాత్రం అందరి కన్నా ముందే వచ్చాడు. బతికుండగానే రవికి నరకం అంటే ఏమిటో చూపించిన మందారంపై అతనికి ఎందుకో ఇంత ప్రేమ అని అప్పుడే వచ్చిన వాళ్ళు అనుకున్నారు.

రవిని చూస్తూ నరేష్ చిన్నగా నవ్వాడు. నరేష్‌ను చూసి రవి కూడా నవ్వాడు. ఆ నవ్వుకు అర్థం వాళ్ళ ఇద్దరికి మాత్రమే తెలుసు. ఇద్దరు కలిసే నెల క్రితం మందారం ఇంటికి వెళ్లి తనివితీరా పలకరించి వచ్చారు.

***

“ఏరా నరేష్ ఎక్కడున్నావ్? మందారం ఇంటికి వెళదాం వస్తావా” రవి నరేష్‌కు ఫోన్ చేసి అడిగాడు. మందారం వాళ్ళ ఇద్దరి మాజీ ఎడిటర్. రిటైర్ అయి ఇంట్లో ఉన్నాడు.

“రవి నువ్వసలు మనిషివేనా? నీకు సిగ్గు శరం అంటూ కొంచం కూడా లేవా? ఆ దుర్మార్గుడిని పరామర్శించేందుకు వాళ్ళ ఇంటికి వెళ్తావా? నువ్వు వెళ్ళేది కాకుండా నన్ను రమ్మంటావా? నీకు సిగ్గు లేకపోయినా నాకుంది. నేను రాను.” అని నరేష్ కోపంగానే బదులిచ్చాడు.

మందారం పేరు వినగానే నరేష్ అలా ఎందుకు మండిపడ్డాడో రవికి తెలుసు. మందారం వికృత చేష్టలకు ఉద్యోగం పోయి రోడ్డున పడి ఇబ్బంది పడ్డ ఎంతో మందిలో రవి, నరేష్ కూడా ఉన్నారు. ఉద్యోగం పోయాక కుటుంబాన్ని పోషించడానికి రెండేళ్ల పాటు నానా తంటాలు పడ్డారు. గుమస్తాగా కూడా పని చేశారు. ‘కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆటో నడుపుతా, కూలి పని చేస్తా నాకేది తప్పు అనిపించడం లేదు’ అని రవి గట్టిగా చెప్పేవాడు. ఆఫీస్‌లో ఒక్కొక్కరిది ఒక్కో కథ. బతికుండగానే ఆఫీస్‌లో అందరికీ నరకం చూపించిన మందారం మంచాన పడ్డాడు అని తెలిసి రవి వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శిద్దాం అనే సరికి నరేష్‌కు కోపం నషాళానికి అంటింది.

“వాడి మీద నీకన్నా నాకు కోపం ఎక్కువగా ఉంది. వాడి వల్ల ఉద్యోగం పోయి రోడ్డున పడ్డప్పుడు ఇంట్లో బియ్యానికి కూడా డబ్బులు లేక ఎవరికీ తెలియకుండా కన్నీళ్లు కార్చిన రోజులు ఉన్నాయి. బాధపెట్టినవాడు మరిచిపోతాడేమో, బాధ అనుభవించిన వాడిని నేనెలా మరిచిపోతాను. ముందు వాడి ఇంటికి వెళదాం. ఎందుకు పిలిచానో నీకే తెలుస్తుంది. ఐదు నిమిషాల్లో అశోక్ నగర్‌కు వచ్చేయ్ వెయిట్ చేస్తా” అని రవి కాల్ కట్ చేశాడు.

నరేష్ వచ్చాక ఇద్దరు కలిసి ఒకే బైక్ మీద డైనమిక్ డైలీ మాజీ ఎడిటర్ మందారం ఇంటికి వెళ్లారు.

రవి, నరేష్ ఇంట్లోకి అడుగుపెట్టగానే మందారం వారిని కళ్ళతోనే పలకరించాడు.

గదిలో నిశ్శబ్దం. మందారం, అతనికి సహాయకునిగా ఓ పనివాడు తప్ప గదిలో ఎవరూ లేరు.

రెండు చేతులు కూడా లేపలేని పరిస్థితి రెండు మోచేతులతో దోశ తింటున్నాడు మందారం.

కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. కొద్ది సేపు ఎవరూ మాట్లాడలేదు. అలా చూస్తూ ఉండి పోయారు.

“స్వర్గం – నరకం అంటూ ఎక్కడో ఉండదు రా! మనం చేసిన పాపపుణ్యాలకు ఫలితం ఇక్కడే అనుభవించాలి” అని రవి మెల్లగా నరేష్‌కు మాత్రమే వినిపించేట్టు పలికాడు.

ఆ మాటలు మందారంకు వినిపించినా అతను చేసేదేమీ లేదు.

“ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు” అని రవి మందారం వైభోగాన్ని తనలో తాను గుర్తు చేసుకున్నాడు.

మందారం పేరు మోసిన ఎడిటర్. డైనమిక్ డైలీకి సుదీర్ఘ కాలం ఎడిటర్ గా చేశాడు. తమ ఆఫీస్‌లో పని చేసే జర్నలిస్ట్ లను చీమలు, దోమలు అన్నట్టుగా చూసేవాడు. ఇంగ్లీష్, తెలుగులో వెలువడే డైనమిక్ డైలీ ప్రముఖ దినపత్రిక. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా ధైర్యంగా గళమెత్తిన పత్రికగా దేశవ్యాప్తంగా గుర్తింపు. కానీ మందారం మాత్రం ఆఫీసులో స్టాఫ్‌కు అత్యవసర పరిస్థితి కన్నా భయంకరమైన నరకం చూపేవాడు. ఢిల్లీలో ఉండే మేనేజ్మెంట్ హైదరాబాద్‌లో ఉండే ఎడిషన్‌పై పెద్దగా దృష్టి పెట్టేది కాదు. మందారానికి ఆడింది ఆట పాడింది పాట అన్నట్టు సాగింది. పత్రికను పార్టీకి, నాయకుడికి తాకట్టు పెట్టినా, సిబ్బందికి నరకం చూపించినా మేనేజ్‌మెంట్ పట్టించుకునేది కాదు. డైనమిక్ డైలీ పేపర్ ప్రెస్ విశాలమైన భూమిలో ఉండేది.. ‘ప్రభుత్వంతో బాగుంటేనే భూమి మనకు దక్కుతుంది, ఆ పని నేను చేస్తా’ అని చెప్పడంతో యాజమాన్యం వద్ద మందారం మాటకు తిరుగులేదు. దీనిని అవకాశంగా తీసుకోని మందారం ఆఫీస్‌లో అందరికి నరకం చూపించాడు. బాధితులు బయటకు వెళ్లి మరో మీడియాలో ఉన్నత స్థానంలో వేధింపులపై మందారం వద్ద శిక్షణ పొందినట్టుగా వాళ్ళ సంస్థల్లో సిబ్బందితో వ్యవహరించేవారు. మంచితనం మల్లెతీగలా వ్యాపిస్తే మంచిదే.. కానీ ఇక్కడ దుర్మార్గం క్యాన్సర్‌లా వ్యాపించింది.

రిటైర్‌మెంట్ తరువాత మందారం క్యాన్సర్ బారిన పడ్డాడు. రవి, నరేష్‌ను చూడగానే మందారం తన దుస్థితి గుర్తుకు వచ్చి గిల్టీగా ఫీల్ అయ్యాడు. నిజానికి అతనిలో గిల్టీ ఫీలింగ్ చూసేందుకే ఇద్దరు వెళ్లారు. అలా చూస్తే ఇన్నాళ్లు తాము అనుభవించిన క్షోభను మరిచిపోతాం అనుకున్నారు కానీ అక్కడ మందారాన్ని చూశాక ఎక్కువ సేపు ఉండలేక “సరే ఉంటాం” అని బయలుదేరారు.

***

మందారం ఈ లోకం లోనే శిక్షను అనుభవించి తనువు చాలించాడు.

ప్రెస్ క్లబ్‌లో సంతాప సభ. అధికారంలో ఉన్నపుడు చుట్టూ పాతిక మంది ఉండేవారు.

“అయన సంపాదకీయం రాశాడు అంటే ప్రభుత్వాలు వణికిపోయేవి. ఆయనతో మాట్లాడాలి అంటే రాజకీయ నాయకులకు చమటలు పట్టేవి. మూర్తీభవించిన జ్ఞాని. మానవత్వం పరిమళించిన మంచి మనిషి” సీనియర్ జర్నలిస్ట్ చింతామణి ఉపన్యాసంతో చెలరేగి పోతున్నాడు.

ఇంతలో సభలో కలకలం. ఓ పాతిక మంది సభలో ప్రవేశించి సభ నిర్వాహకులను నిలదీశారు.

“మందారం ఎందరి జీవితాలనో బుగ్గిపాలు చేశాడు. చేతిలో కలం ఉంది కదా? అని అన్ని అబద్దాలతో మీ పత్రికలో నివాళి వ్యాసం రాశారు. రేపటి సమాజం అదే నిజం అనుకుంటుంది. ఇక్కడ కూర్చున్న అందరికీ మందారం సంగతి తెలుసు. అయినా ఇన్ని అబద్దాలు ఎలా మాట్లాడగలుగుతున్నారు” ఆ పాతిక మంది తరపున విశ్వం ప్రశ్నించాడు.

సభాధ్యక్షుడు మూర్తి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. “మీరు చెప్పినవి అన్నీ నిజమే. ఆ సంగతి నాకూ తెలుసు. పోయిన వ్యక్తి గురించి నాలుగు మంచి మాటలు చెప్పుకొని వెళదాం అడ్డుకోకండి” అని మూర్తి కోరాడు.

“మందారం వేధింపులతో గోపాల్ గుండెపోటుతో పోయాడు. తెలుగు పత్రికకు ఏకంగా చండీఘడ్‌కు బదిలీ చేస్తే విక్రమ్ రాజీనామా చేసి బతుకు పోరాటం చేయలేక మానసిక జబ్బుతో కోలుకోలేక పోయాడు. ఇవన్నీ మీకు తెలియవా? ఇంద్రుడు చంద్రుడు అని మీరు పొగిడిన పొగడ్తలు రికార్డ్ అవుతాయి. తరువాత తరం వాళ్ళు అవే నిజం అనుకుంటారు. మందారంకు నివాళి అర్పిస్తున్నారు. మరి అతని వేధింపులకు పోయిన వారికి ఎవరు నివాళి అర్పిస్తారు?” అని నాగరాజు ఆవేశంగా ప్రశ్నించాడు .

పరిస్థితి చేయిదాటి పోయేట్టుగా ఉందని మూర్తి “సభ ముగిసింది” అని ప్రకటించి వేదిక దిగిపోయాడు.

“ఇలాంటి జంబూకాల వేధింపులు చూసి కొత్త తరం జర్నలిజం వృత్తిలోకి రావడమే మానేశారు. ఒక జంబూకం నుంచి మరో జంబూకం మనుషులను ఎలా వేధించాలో నేర్చుకొంది. మంచి పని చేశారు” అంటూ సతీష్ అటు నుంచి తన బైక్ వైపు వెళ్ళిపోయాడు.

“అనుకుంటాం కానీ మనం చేసిన పాపం అయినా, పుణ్యం అయినా మనం పోయాక కూడా మనకు తోడుంటుంది అని నమ్మకం కలుగుతోంది. చేతనైతే ఒకరికి మేలు చేద్దాం. బలహీనుడు అని వేధిస్తే బలవంతుడైన దేవుడు శిక్ష విధిస్తాడు.. పద వెళదాం” అని రవి నరేష్ భుజంపై చేయి వేసి బయటకు నడిచాడు.

“ఔను నువ్వు దేవుడిని ఎప్పటి నుంచి నమ్మడం మొదలు పెట్టావ్?” అని నరేష్ అడిగితే

“ఇప్పటి నుంచే.. నీకైనా, నాకైనా, ఎవరికైనా ఇచ్చోట కర్మ ఇచ్చోటనే” అని రవి బదులిచ్చాడు.

Exit mobile version